చందమామ మాదే… మీది కాదు…

February 9th, 2010

ఈ పత్రిక మాది.. మీది కాదు… అనే మహా ఔద్దత్యం… సంపాదకులను, యాజమాన్య హక్కులను పూచికపుల్లలాగా పక్కనబెట్టి మరీ స్వంతం చేసుకునే మమకారం చరిత్రలో ఏ పత్రికకు ఉంటాయో ఒకసారి ఊహించండి. వేరే చెప్పాలా.. ఇక దేనికి ఉంటుంది?  చందమామకే కదా! భారత దేశం మొత్తంలో ఆ ఘనతర కీర్తి చందమామకే దక్కింది.

కొన్ని తరాల పాఠకులచేత ఇంతగా ఆరాధింపబడుతున్న పత్రిక, గుప్తనిధుల కోసం వేటలాగా తన పాత సంచికలకోసం తెలుగుదేశం నలుమూలలా పాత పుస్తకాల షాపుల్లో, వేటాడబడుతున్న పత్రిక, పాఠకుల ఆకాంక్షలకు తలొగ్గకపోతే మనుగడ లేదని నిరూపించిన పత్రిక చందమామ. పదే పదే ఎదురవుతున్న ఈ అనుభవం మళ్లీ ఈరోజు ఆఫీసులో కలిగింది.

చందమామ  పనిలో భాగంగా కొత్త సంచికలకు రచనలను పరిశీలిస్తుంటే చందమామ సీనియర్ రచయిత శ్రీ ఎమ్.వి.వి సత్యనారాయణ గారు గత సెప్టెంబర్‍లో పంపిన బేతాళ కథ ‘కళాభిమానం’ కనిపించింది. దాదాపు 50 ఏళ్లుగా చందమామకు కథలు పంపుతున్న సీనియర్ రచయిత ఈయన. విశాఖపట్నం వాస్తవ్యులు.

ఈ మధ్య కాలంలో ఎందుకనో కథలు పంపటం తగ్గించారు కాని, కుటుంబరావు గారు, దాసరి సుబ్రహ్మణ్యం గారు చందమామ పనిలో ఉన్న కాలంలో క్రమం తప్పకుండా పంపేవారు. విగ్రహాలను చెక్కే శిల్పి గురించి రాసిన ‘కళాభిమానం’ బేతాళకథ బాగా నచ్చేసి, ఇప్పటికే లేటయింది కాబట్టి రచయితకు కథ ఎంపికయ్యిందని తెలుపడానికి తను ఇచ్చిన మొబైల్‌కి ఫోన్ చేస్తే చందమామ దిగ్గజాలతో ఈయన అనుబంధం గురించిన అపురూప విషయాలు తెలిశాయి.

కథ ఎంపిక అయిందని తెలుపగానే మహదానందపడుతూ అవతలనుంచి సత్యనారాయణ గారు మాట్లాడారు. పెద్దరికం అనే మరో చిన్న కథ కూడా పంపానని చెప్పారు. అది ఇంకా కథల గుచ్ఛంలోంచి తీయలేదని, తీసిన తర్వాత చెబుతామని మాట్లాడుతున్న సందర్భంగా ఆయన కొకు, దాసరి గార్లతో తన పరిచయం విశేషాలను చెబుతూ పోయారు.

కొకుగారి హయాంలో చందమామక కథల ఎంపిక ప్రక్రియ మెరుపు వేగంతో ఉండేదని సత్యనారాయణ రావుగారు అంటున్నారు. సెంట్రల్  రైల్వే స్టేషన్‌కు బండిలో చందమామ ఉత్తరాలు, కథలు వస్తే వాటిని అక్కడికక్కడే విప్పి చూసి, ఏది తీసుకోవచ్చు, తీసుకోకూడదు అనే విషయాన్ని వెంటనే తేల్చిపడేసేలా కొకు గారి పని శైలి ఉండేదని, కథ పనికొస్తుంది, పనికిరాదు అనే అంశంపై ఏ విషయమూ రచయితకు వారంరోజుల్లో సమాచారం పంపేవారని రావుగారు చెప్పారు.

చందమామ రచయితలతో కొకుగారు వ్యవహరించే తీరు అత్యంత నమ్రతాపూర్వకంగా ఉండేదట. మీ కథ వారి -అంచే ప్రధాన సంచాలకుల- బల్లపై ఉంచామని, వారు ఆమోదించి టిక్ చేస్తే వెంటనే మీ కథ బతికిందీ, పోయిందీ తెలుపుతామని కొకు ఉత్తరం పంపేవారట, నిజంగా వారి కాలం చందమామకు స్వర్ణయుగమేనని రావుగారి అభిప్రాయం.

ఈయన 1980కి ముందు ఓసారి కుటుంబరావుగారిని కలిసి చూసి పోదామని చెన్నయ్ లోని చందమామ ఆఫీసుకు వచ్చారట. ఆ సయమానికి కొకు ఆఫీసులో లేరు. దీంతో ఈయన కార్యాలయంలోని కుటుంబరావు గారి కుర్చీవద్దకు వచ్చి దండం పెట్టి వెళ్లారట. కొకు లేని సమయంలో దాసరిగారు ఈయనను రిసీవ్ చేసుకుని భోజనం కోసం హోటల్‌కు తీసుకెళ్లారట.  ఆరోజు ఆయన అన్నమాటలు ఈరోజుకీ ఈయన మర్చిపోలేదు.

‘కొకును ఎలాగూ కలవలేకపోయావు గాని, కొంచెం నా పేరు ఆ గిన్నెస్‌లోకి ఎక్కేటట్టు చూడు’ అని దాసరి గారు ఈయనతో ముక్తాయించారట. ఈయనకు ముందు అర్థం కాలేదట. ’35 ఏళ్లుగా హోటల్ తిండి తింటున్నాను. ఇంటిభోజనం తినే యోగం వస్తుందో లేదో తెలీదు. ఈలోగా సాధిస్తున్న రికార్డును ఎందుకు పోగొట్టుకోవాలి. హోటల్ వదలని వీరుడిగా నా పేరన్నా గిన్నెస్‌ బుక్‌లో ఎక్కించు బాబ్బాబు’ అని దాసరి గారు జోకులేస్తుంటే ఈయనకు నవ్వాగింది కాదట.

కొకు గారిని అప్పట్లో కలవలేకపోయినా 1981 మే నెల యువలో కుటుంబరావుగారిదీ, తనదీ కథలు పక్కపక్కనే అచ్చవటం జీవితాంతం మర్చిపోని క్షణాలుగా ఈయన నిలుపుకుని ఉన్నారు. ‘చందమామ సంపాదకులు కుటుంబరావు గారేమిటి, నా కథ ఆయన కథ పక్కనే అచ్చవటం ఏమిటీ?’ ఇదీ రావుగారి జీవితానందం.

ఈసందర్భంగా తనకు చందమామతో పరిచయం ఎలా అయిందో చెప్పారు. చిన్నప్పుడు వాళ్ల క్లాస్‌లో అంతా పేదవారేనట. తనతో సహా. ఆనాటి తమ పేదరికాన్ని మాటల్లో వర్ణించలేమని అంటారీయన. క్లాసు మొత్తానికి ఒకే ఒక సంపన్నుల పాప చందమామ పత్రికను తీసుకోచ్చేదట. ఆ ఒక్క చందమామనే క్లాసులోని పిల్లలందరూ చదివేవారు. ఆణిముత్యాల్లాంటి కథలు, ఆ బొమ్మలు, మా పిల్లల ప్రపంచాన్ని, ఊహలను వెలిగించిన క్షణాలవి అంటూ చెప్పారు. చందమామను క్లాసురూముకు తీసుకొచ్చిన ఆ సంపన్నుల పాపపట్ల ఎంత కృతజ్ఞతాభావమో ఈయనకు.

(ఇన్పోసిస్ నారాయణ మూర్తిగారి సహచరి సుధామూర్తి కర్నాటకలో 5 వేల  గ్రామీణ ప్రాంత పాఠశాలలకు చందమామ కాపీలను బహుకరించే బృహత్తర పథకాన్ని మోస్తున్నారనే విషయం చందమామ పాఠకులకు తెలుసు. సంపదకు నిజమైన సార్థకత ఉంది ఈ రూపంలో కూడా. 5 వేల పాఠశాలలు, లక్షలాది పిల్లల చేతికి చందమామ. ఆ పిల్లల జీవితమూ, సుధామూర్తి గారి జీవితమూ కూడా ధన్యమయినట్లే. )

ధారావాహికగా చెప్పుకుపోతున్న తన జ్ఞాపకాలు వదలవద్దని, ప్రత్యేకించి కుటుంబరావు, దాసరి గార్లతో తన అనుబంధాన్ని, రచయితగా వారితో సంబంధానికి సంబంధించిన విశేషాలను తప్పకుండా జ్ఞాపకాలుగా రాయవలసిందని కోరాను. చందమామ బ్లాగు గురించి చెబితే తప్పక రాసి పంపుతానని ఆయన అన్నారు. మీరు ఆరోగ్యం కాపాడుకుంటూ చందమామకు కథలు రాస్తూ ఉండాలని, చందమామను మర్చిపోవద్దని, నిత్య సంబంధంలో ఉండాలని వినమ్రంగా ఈ చందమామ సీనియర్ రచయితకు ఫోన్‌లో అభ్యర్థించాను.

దానికాయన ఒక్కటే మాట అన్నారు. ‘చందమామ మీది కాదండీ, మాది. అది మా చందమామ. మాతో పుట్టిపెరిగిన చందమామ. దాన్ని ఎలా వదలతాము. కథలు ప్రచురించినా, ఎంపిక చేయకపోయినా చందమామ మాప్రాణం.. దాన్ని మర్చే ప్రశ్నే లేదు.’ ఇవతలనుంచి వింటున్న నాకు కళ్లలో సుడులు తిరుగుతున్న నీళ్లు. ఆనందమో, దుఃఖమో, దుఃఖానందమో, తెలీదు.

నా కళ్లలో, సుడి తిరుగుతున్న కన్నీళ్లలో చందమామ ప్రతిరూపం. పెద్దలు మెచ్చిన పిల్లల పత్రిక చందమామ ప్రతిరూపం. ఈ భావోద్వేగంతోనే ముగిస్తున్నాను.

చందమామ యజమానులు నాగిరెడ్డి కాదు, చక్రపాణి కాదు. మరొకరో కాదు. ప్రజలే, పాఠకులే చందమామ యజమానులు, 60 ఏళ్లు దాన్ని నెత్తిన బెట్టుకుని పూజిస్తున్న, ఆరాధిస్తున్న, ప్రాణప్రతిష్ట పోస్తున్న తరతరాల పాఠకులు, కథకులు, రచయితలు, అభిమానులు, పిల్లలు, పెద్దలు వీళ్ల ఆశీర్వాదమే ప్రాణంగా చందమామ బతికింది, బతుకుతోంది.

సత్యనారాయణ రావు గారూ, మీరు చల్లగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. నిజంగా చందమామ మీదే. ఈ ప్రగాఢ  విశ్వాసంతోటే చందమామతో అనుబంధాన్ని వదలకండి. మీకు చందమామ తరపున నమస్సుమాంజలి.

NB: చందమామ పాత జ్ఞాపకాలకు సంబంధించిన వివరాలు కావాలంటే శ్రీ ఎమ్.వి.వి సత్యనారాయణ గారికి కాల్ చేసి తెలుసుకోవచ్చు.

99665 23470 (విశాఖపట్నం)

RTS Perm Link


2 Responses to “చందమామ మాదే… మీది కాదు…”

  1. రవి on February 9, 2010 2:58 AM

    నింగిని అందరాని చందమామ, నేలను అందవచ్చే చందమామ మీవి, మావి, మనందరివీనూ. సీనియర్ రచయిత పరిచయం బావుంది. ఈ వరసనే మాచిరాజు కామేశ్వర్రావు గారినీ పరిచయం చేయవచ్చు మీరు.

  2. chandamama on February 9, 2010 3:40 AM

    రవిగారూ,
    ప్రింట్ చందమామ రచయితలతో ఇటీవలే పరిచయాలు పెరుగుతున్న సందర్భంలో వారి మాటలను యధాతథంగా తీసుకుని బ్లాగులో పెట్టాను. ఇంకా వివరంగా చందమామతో వారి అనుబంధం గురించి, వారు రాసిన కథల వివిరాల గురించి కూడా వారినే రాసి పంపమని చెబుతున్నాను. మరింత సమగ్ర సమాచారానికి ఇది తప్పదు. మాచిరాజు కామేశ్వరరావు, వసుంధర, శివనాగేశ్వరరావు గార్లు… ఇంకా చాలమందే ఉన్నట్లున్నారు ఈ జాబితాలో. పరిచయం పెరిగే క్రమంలో వారి అమూల్య జ్ఞాపకాలను అక్షరాల్లో పెట్టవచ్చని భావిస్తున్నాను. రచనా సంబంధం ఎలాగూ ఉంటుంది. చందమామ సీనియర్ కథకులు చందమామ గురించి ఏమనుకుంటున్నారు అనేది మన తరానికి అమూల్య విషయమే కదా. మన ఆకాంక్ష తీరుతుందనే ఆశిస్తున్నా. ధన్యవాదాలు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind