క్షమియించు తల్లీ ఓ వైష్ణవీ!

February 3rd, 2010
మన 'దేవత' వైష్ణవి

మన 'దేవత' వైష్ణవి

క్షమియించు తల్లీ ఓ వైష్ణవీ!
క్షమియించు తల్లీ కన్నీటి క్షణాలివి
క్షమియించు తల్లీ ఈ మానవ జాతిని
క్షమియించు తల్లీ ఈ రాక్షస నీతిని

భరియించలేదు ఏ తల్లీ
భరియించలేదు ఏ తండ్రీ
భరియించలేదు ధరిత్రి.. ధరిత్రీ

గజల్ రాగాల స్వరాన్ని విశ్వవిషాదగానంగా మార్చి శ్రీనివాస్ పాడిన సిరాశ్రీ గీతమిది. విచక్షణ అనే పదానికి అర్థం తెలియని మానవాధములు గొంతు కోస్తున్నప్పుడు, పొట్ట చీల్చుతున్నప్పుడు తనను ఏం చేస్తున్నారో, ఎందుకు పొడుస్తున్నారో తెలియని పసి మనసు వైష్ణవి తన ప్రాణంకోసం, అమ్మానాన్న వెచ్చటి ఒడి రక్షణ కోసం కొట్టుకులాడిన ఆ చివరి క్షణాలను గుండెపొరలు జలదరించేలా, నరాలు తెగిపడేలా గజల్ శ్రీనివాస్ నిన్న పాడిన పాట.

నిన్న సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికొచ్చాక, టీవీ9లో ఈ పాట వస్తుంటే విన్నాను, విని ఊరకుండటం చేతకాకుండా నాలాగే లక్షలమంది వీక్షకులు అల్లాడిపోయి ఉంటారు. ఆ ఉద్వేగం అలాగే కొనసాగితే ఎక్కడ గుండె పోటు వస్తుందో అనే భీతితో, కలవరంతో ఇంట్లోనుంచి బయటకు పరుగెత్తాను. ఒక్కసారి రక్తపోటు పెరిగిపోయింది.

మానవహక్కుల దృక్పధానికి ఎంత భిన్నమైందే అయినా ‘వైష్ణవి హంతకులకు ఉరిశిక్ష, చిత్రహింసానంతర వధ, నిలువునా ఎన్‌కౌంటర్…’ జనం, రాజకీయనేతలు, మాజీ మంత్రులు, ఎంఎల్‌ఏలు.. ఒకరేమిటి..  తెలుగు జాతి ముక్తకంఠంతో పాడిన పాట ‘వైష్ణవి హంతకులకు ఎన్‌కౌంటర్.’

మనిషి ఎరుకలో ఎన్‌కౌంటర్ పదం పుట్టిన 43 ఏళ్ల తర్వాత, పోలీసుల ఏకపక్ష కాల్పులకు సమాజం మొత్తంగా ఇంత ఏకగ్రీవంగా సమర్ధన తెలిపిన ఘటన తెలుగునేలలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

పోలీస్ వ్యవస్థ సృష్టించిన ఎన్‌కౌంటర్ల పాలసీకి లభించిన ఈ అనూహ్య సమర్థన ఎంత ప్రమాదకరమో, ఎంత అభ్యంతరకరమో, సమాజ ప్రయోజనాలకు ఎంత చేటు కలిగించే సమర్ధనో పక్కనబెడితే పదేళ్ల పసిపాపను ఇనుపకొలిమిలో కాల్చి బూడిద చేసిన నీచ, నికృష్ట ముష్కరులకు అర్హమైన శిక్ష భూమ్మీద ఏ శిక్షాశాస్త్రంలోనూ బహుశా రాసి ఉండరన్నదే జనాభిప్రాయం.

మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉడికిపోతున్నారు. మానవ హక్కుల భాషను వల్లిస్తే వినడానికి సిద్ధమయ్యే వాతావరణం ఇప్పుడు తెలుగు నేలపై లేదు.

ఈ మనుషులూ, ఈ కుటుంబాలూ, పోలీసులూ, ప్రభుత్వాలూ, నికృష్ట రాజకీయాలూ, క్రూరవ్యవస్థలూ అన్నీ కలిసి ఒక పసిదాన్ని నిలువునా కొలిమికి వేశేసాయి. తన ఒంటిమీద మెరుస్తున్న హారాలు మరొక ఇంట్లో మంటలు రేపుతున్నాయని, కసితో రగులుతున్న ఉన్మాదాన్ని కొలిమిలో సానబెడుతున్నాయని తెలియని, అన్నెం పున్నెం ఎరుగని వైష్ణవి లేత గుండె ప్రాణం విడిచే సమయంలో ఎంత కొట్టుకులాడిందో.. ఎంత ఆరాటపడిందో.

ఒక్కసారయినా తన వాళ్లను చూడాలని, కావులించుకోవాలని, చివరిసారిగా ఏడ్వాలని ఆ పసి గుండె ఎంతగా అల్లాడిపోయిందో..

నిజంగా చందమామ కథల వంటి బాల్యం తనది. వెన్నెల చల్లదనాన్ని ఆస్వాదించటం తప్ప తను చందమామను చదివి ఉండకపోవచ్చు. చూసి ఉండకపోవచ్చు. కాని చందమామ కథల్లోని ఏ మాంత్రికుడో, ఏ మాయావో, ఏ మహిమాన్విత దైవస్వరూపుడో, ఏ దేవతో ఆమెకు మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేయగలిగితే భూమ్మీద అంతకు మించిన మహత్తర క్షణం మరొకటి ఉండదు. కానీ కథ కథే, నిజం నిజమే…

వైష్ణవి.. మన వైష్ణవి ఇక లేదు. ఇక రాదు. ఇక కనిపించదు. ఇక మాట్లాడదు. స్వర్గం అంటూ ఒకటి ఉంటుందని మనందరం నమ్మితే.. ఆమె హత్యావార్త విన్నంతనే ప్రాణాలు విడిచిపెట్టేసిన తండ్రి మాత్రమే ఇప్పుడు ఆమెకు తోడు నీడగా ఉంటాడు. అందుకే ఆమె తండ్రిని తనవెంట పిలుచుకుపోయిందేమో. మన నమ్మకాలకేం బోలెడు. మన స్వర్గనరక భ్రాంతులకేం.. బొ చ్చెడు..

వైష్ణవి లేని పాడులోకంలో, వైష్ణవిని నిలువునా చంపిన ధూర్తలోకంలో మనం ఇక పాట మాత్రమే పాడుకుందాం, శ్రీనివాస్ పాడిన ‘క్షమియించు తల్లీ’ పాట మాత్రమే వింటూ బతికేద్దాం. కన్నీళ్లు మాత్రమే కార్చి ఊరుకుందాం. మనకు నీతి, న్యాయం, ధర్మం, విలువలు, మంచి, చెడు గురించి చెప్పే ఏ అర్హతలూ ఇక లేవు. పోగుపడుతున్న ఆస్థి వికృతరూపాన్ని మన కళ్లతో చూస్తూ, మనలను మనమే తిట్టుకుంటూ, శపించుకుంటూ వైష్ణవి బుగ్గిపాలయిన ఆ కన్నీటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఇక తెలుగు జాతి ఏకైక మంత్రంగా ఈ పాటను మాత్రమే పాడుకుందాం. విందాం.

మనం మనుషులం, మానవమాత్రులం. జీవితంలో ఏ గొప్ప పనీ చేయలేని వాళ్లం. ఏ చెడునూ ఆపలేని వాళ్లం. కనీసం ఈ పాట పాడుకుంటూ అయినా మనలో పేరుకుపోయిన మహా మానవ మకిలిని కాస్త కరిగించుకుందాం.

వైష్ణవీ… చిట్టితల్లీ… గుండె పగులుతోందిరా.. మేమింకా బతికే ఉన్నందుకు మమ్మల్ని క్షమించరా..

క్షమియించు తల్లీ ఓ వైష్ణవీ!
క్షమియించు తల్లీ కన్నీటి క్షణాలివి
క్షమియించు తల్లీ ఈ మానవ జాతిని
క్షమియించు తల్లీ ఈ రాక్షస నీతిని

కాపాడుకోలేని కసాయిలమయ్యాము
ఈ పాడులోకాల్ని ఈసడించుతున్నాము
ఆస్తి కొరకు పీక నరుకు జాతి మాది తల్లీ
ఒంటినిండ ధనకాంక్ష విషమేలే తల్లీ

అయినవాడు ఎవ్వడో, ఆత్మీయుడు ఎవ్వడో,
అగ్గిరాసేదెవ్వరో, బుగ్గిచేసేదెవ్వరో
తెలియకుండ పోతోందమ్మా ఇక్కడా

ఎంత అలమటించి వుంటావో
ఎంత పరితపించినావో
అమ్మా! నాన్నా‍‍! అమ్మా నాన్నా
అంటూ గోడు తెలుపుకున్నా
వద్దు వదలదంటూ ఎంత ఏడ్చినా

దయలేని దానవులై నిన్ను నులిమివేసి
కాల్చి బుగ్గి చేశారా.. ఎందుకమ్మ అంత కసి
కాదు కాదు కారాదు ఇది పునరావృతం
చూడరాదు ఏ కన్ను ఇంత వికృతం

నీవేగిన లోకంలో ఏ దేవుడు ఉన్నాడో
వాడికైన చెప్పి మాకు శాస్తి చేయి తల్లీ
తగిన శాస్తి చేయి తల్లీ

భరియించలేదు ఏ తల్లీ
భరియించలేదు ఏ తండ్రీ
భరియించలేదు ధరిత్రి.. ధరిత్రీ

క్షమియించు తల్లీ ఓ వైష్ణవీ!
క్షమియించు తల్లీ కన్నీటి క్షణాలివి

రచన : సిరాశ్రీ
స్వరకల్పన, గానం ‍‌: గజల్ శ్రీనివాస్

పూర్తి పాటకోసం ఇక్కడ చూడండి. ఈ పాట రికార్డు రూపంలో తయారయితే జాతి మొత్తానికి పంచిపెడదాం. అప్పుడయినా మనం కాస్త బాగుపడగలమేమో..

http://telugu.greatandhra.com/cinema/22-12-2009/40_12_sir.php

(ఈ పాటను నెట్‌లో పెట్టారని గుర్తు చేసిన “శ్రీచరితం” మాధవుడికి ( http://blaagu.com/sree/) కృతజ్ఞతలు)

RTS Perm Link


2 Responses to “క్షమియించు తల్లీ ఓ వైష్ణవీ!”

  1. సుజాత on February 3, 2010 7:42 PM

    రాజుగారూ,
    అవును, మీ ఆవేదన ఇప్పుడు ప్రతి తెలుగింటా ఎగసిపడుతున్నదే! ఇటువంటి నీచానికి దిగజారే నర రూప రాక్షసులు మానవులు కాదు, అందువల్ల వారికి మానవ హక్కులు వర్తించవు.అందుకే వారికి ఉరిశిక్షే ఖరారయినా మానవ హక్కుల సంఘం నోరు మెదిపే ధైర్యం చేయకపోవచ్చు. చేస్తే పెద్ద ఎత్తున నిరసన లేస్తుందేమో! అసలు వారికి న్యాయ సహాయమే అందకూడదు.

    మీరన్నట్లు వారికి వేయాల్సిన శిక్ష ఇంతవరకూ ఏ శిక్షా స్మృతిలోనూ లేదు.కొత్తగా ఏదైనా ఆలోచించాల్సిందే!

  2. chandamama on February 4, 2010 1:15 AM

    సుజాతగారూ,
    గత రెండు రోజులుగా వైష్ణవి దారుణ ఉదంతంపై వస్తున్న స్పందనలకు ప్రతిస్పందనలు కూడా పంపలేనంత నిర్వేదంలో మునిగిపోయాను. హంతకుల ప్రకటనలు వింటూంటే ఒక నిండుప్రాణాన్ని బలిగొనడానికి ఎంత పకడ్బందీ పథకం అల్లారో తెలుసుకుంటుంటే ఆస్తి భావన పట్లే భయం పుడుతోంది.

    డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది, ఎన్ని ఘోరాలనైనా చేయిస్తుంది అని చదువుకోడవమే కాని ఇలా ఎప్పుడూ చూడలేదు. సమాజం ఎంతగా పతనమై ఉంటే తప్ప ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందా. వాళ్లు ఇప్పడు కూడా చంపిది తాను కాదంటే తాను కాదని కస్టడీలో ఉంటూనే వాదులాడుతున్నారట.

    శ్రీశ్రీ గతంలో ఓ కవితలో బతకడానికి అర్హతలేని పందుల గురించి రాసినట్లు గుర్తు. (నిజమైన పందులు మన్నించాలి) కోట్లమంది గుండెలు రగిలించిన ఈ కిరాతక చర్యకు పాల్పడిన వీళ్లు నైతికంగా మాత్రం బతికే అర్హతను కోల్పోయారు. వీళ్లు ఇక బతికి ఉన్నా చచ్చినవారికిందే లెక్క. ఇంతకు మించి వీరిపట్ల ఇంకే తీర్పూ అవసరం లేదు.

    చంపడానికి, చావడానికి లోకంలో చాలా పోరాటాలే జరుగుతున్నాయి. చంపడం, చావడం అలాంటి సందర్భాల్లో గర్హనీయం కాకపోవచ్చు కూడా. కానీ ఇదేమిటి. ఇంత హద్దులు మీరిన ప్రతీకారమేమిటి. అదీ ఆస్తి కోసం పసిపిల్ల ప్ర్రాణం తీయడం.

    పాపం ప్రభాకర్… ఆస్తిని నమ్మాడు. మనుషులను నమ్మాడు. బంధువులను నమ్మాడు. ఎంత అమాయకంగా నమ్మాడు. ఈ మూడు నమ్మకాలూ ప్రస్తుతం సమాజంలో అభాసగా మారాయనే విషయం తెలుసుకోలేనంతగా నమ్మాడు.

    పాపం వైష్ణవి. దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో తెలియని పసిమొగ్గ. తన ఒంటిపై హారాలు కూడా తండ్రి ప్రేమకు ప్రతిఫలాలుగానే భావించింది కానీ, అవే మృత్యుశీతల రహదారిని పరుస్తున్నాయని గ్రహించలేకపోయింది.

    మనుషులను నమ్మాలి. నిజంగా మనుషులను మనందరం నమ్మాలి. కానీ..

Trackback URI | Comments RSS

Leave a Reply

Name (required)

Email (required)

Website

Speak your mind