చందమామ కథల మాంత్రికుడు ఇక లేరు

January 28th, 2010

Dasari Subrahmanyam_450

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు కన్నుమూశారు. 1952లో చందమామ చేయి పట్టుకుంది మొదలుగా 54 ఏళ్లపాటు చందమామలో అవిశ్రాంతంగా పనిచేసి తెలుగు జాతికి, భారతీయ కథల ప్రేమికులకు కథామృతాన్ని మంచిపెట్టడమే కాక,  ఆణిముత్యాల వంటి 12 జగమెరిగిన ధారావాహికలను సృష్టించిన చందమామ కథల మాంత్రికుడు ఇక లేరు. ఆయన వయస్సు 85 ఏళ్లు. ఆయన కనుమూసిన వార్తను చందమామ అభిమానులకు, పాఠకులకు చెప్పడానికి తీవ్రంగా విచారిస్తున్నాం.

ఎనిమిది పదుల పైబడి వయసులో కూడా జీవించి ఉండటంపై తనకు తానే సెటైర్ వేసుకుంటూ ‘I am overstay here’ అని ఓ ఇంటర్వూలో చెప్పుకున్న సుబ్రహ్మణ్యం గారు జీవితం చివరివరకూ ఆరోగ్యంగానే ఉంటూ ఆస్పత్రుల జోలికి వెళ్లకుండా విజయవాడలో తన అన్న కుమార్తె గోళ్ల ఝాన్షీ ఇంటిలోనే చివరి శ్వాస విడిచారు. ఆయన మరణవార్తను కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారికి మెయిల్ చేస్తూ ప్రజాసాహితి సంపాదకులు దివికుమార్ గారు వ్యాఖ్యానించినట్లుగా తనను ఆసుపత్రిలో చేర్పించడానికి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దాసరి గారు సునాయాస మరణం పొందారు.

“Daasari Subrahmanyam garu passed away.Very easy death, not given any chance to hospitalise -DVK”

చందమామ కథల మాంత్రికుడు : దాసరి సుబ్రహ్మణ్యం

భల్లూక మాంత్రికుడు

భల్లూక మాంత్రికుడు

దాసరి సుబ్రహ్మణ్యం గారు 29వ ఏట చందమామ పత్రికలో అడుగుపెట్టారు. కథా కల్పనలో, ధారావాహికల రచనా ప్రక్రియలో అసాధారణ ప్రతిభ కలిగిన ఈయన అయిదు దశాబ్దాలపాటు చందమామలో పనిచేశారు. బాల సాహిత్య రచనలో ఆయన ప్రతిభాపాటవాలను స్వంతం చేసుకోవాలని అప్పటి పత్రికలు తీవ్రంగా ప్రయత్నించినా ఆయన చందమామకే చివరివరకూ అంకితమయ్యారు.

చక్రపాణి గారి దార్శనికత, కుటుంబరావు గారి ఒరవడికి చందమామ చిత్రకారుల మంత్రజాలం తోడవటం, మొదట్లో రాజారావు, ముద్దా విశ్వనాధం గార్లు తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారు తదితర శక్తివంతమైన రచయితల మేళవింపుతో కూడిన చందమామ సంపాదక బృందం దన్ను చందమామకు స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టాయి.

బాల్యం
తెనాలి సమీపంలో చుండూరు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పెద గాజులూరులో దాసరి సుబ్రహ్మణ్యం జన్మించారు. పెద్దగా చదువుకోనందున జన్మదినం గురించిన రికార్జులు నమోదు కాకపోవడంతో తన అక్కగారి వయసు ననుసరించి ఆయన లెక్కగట్టిన ప్రకారం 1922లో ఆయన పుట్టారు. కుటుంబ పెద్దలు 1929లో గాజులూరులో ఉన్న కొద్ది పొలాన్ని అమ్మి రేపల్లె సమీపంలోని కైతేపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ కూడా పొలాలు సరిగా పండకపోవటంతే 1932 ప్రాంతాల్లో రేపల్లె చేరారు. తర్వాత అక్కడే ఆయనకు వివాహమై ఓ కూతురు పుట్టింది.

అయితే తన జీవిత కాలంలో అధికభాగం ఆయన మద్రాసులో ఒంటరిగానే గడిపారు. చందమామలో చేరింది మొదలుకుని ఆయన మద్రాసులో ఒకే అద్దె ఇంటిలో యాభైఏళ్లకు పైగా గడపడం విశేషం. ఓ ప్రత్యేక కారణం వల్ల మద్రాసులో అయిదు దశాబ్దాలకు పైగా తానున్న అద్దె ఇంటిలో తన వాటాను ఇప్పటికీ చెల్లిస్తూ చెన్నయ్‌తో తన సంబంధాన్ని ఈనాటికీ పరోక్షంగా కొనసాగిస్తున్నారు.

చందమామ ధారావాహికల వైభవం

తోకచుక్క

తోకచుక్క

1954 నుంచి ఈ నాటిదాకా చందమామ పాఠకులు ఎప్పటికీ మరవలేకపోతున్న అద్భుత ధారావాహికల అపరూప సృష్టికర్త దాసరి సుబ్రహణ్యం గారు. చందమామ తొలి సంపాదక వర్గ బాధ్యుడిగా పనిచేసిన రాజారావు -చక్రపాణి గారి బంధువు- గారు రాసిన విచిత్ర కవలలు చందమామలో తొలి సీరియల్‌గా చరిత్రకెక్కింది. ఈ సీరియల్ ముగిసిన కొన్నాళ్లకే రాజారావు గారు ఆకస్మికంగా మరణించడంతో చందమామలో తదుపరి సీరియల్ రాసే అరుదైన అవకాశం దాసరిగారి ముందు నిలిచింది.

దాసరిగారు రాయనున్న తోకచుక్క సీరియల్‌ కోసం చిత్రాగారు గీసిన చిత్రాలతో ముందు నెలలోనే చందమామలో ప్రకటన చేయడంతో ఆ సీరియల్‌కు ఎనలేని ప్రాచుర్యం లభించింది. సుబ్రహ్మణ్యం గారి ధారావాహికల వైభవోజ్వల శకం 1954లో అలా మొదలైంది. తన తొలి సీరియల్ రచన తోకచుక్క మొదలుకుని 1978లో భల్లూక మాంత్రికుడు వరకు పాతికేళ్ల పాటు చందమామలో దాసరి గారి ధారావాహికలు నిరవధికంగా ప్రచురించబడుతూ వచ్చాయి. ఓ కథారచయితకు, బాల సాహిత్య ధారావాహికల రచయితకు ఇంతకు మించిన గుర్తింపు మరొకటి లేదు.

ప్రత్యేకించి.. 1950, 60, 70ల కాలంలో చందమామ పాఠకులు దాసరి వారి సీరియళ్ల మంత్ర జగత్తులో విహరించారు. నాటి తరం వారే కాకుండా 80ల తర్వాత పుట్టిన తరం పిల్లలు కూడా నేటికీ దాసరి వారి ధారావాహికలను మళ్లీ ప్రచురించవలసిందిగా ఒత్తిడి చేసిన కారణంగా చందమామ పత్రికలో ఇటీవల కాలంలో వరుసగా రాకాసిలోయ, పాతాళదుర్గం సీరియళ్లను  ప్రచురించడం జరిగింది. పాతాళదుర్గం సీరియల్ త్వరలో ముగియనుండటంతో తదుపరి సీరియల్‌గా దాసరి వారి తొలి ధారావాహిక అయిన తోకచుక్కను త్వరలో ప్రచురించబోతున్నాము.

దాసరి వారి 12 ధారావాహికల జాబితా

తోకచుక్క- 1954
మకర దేవత -1955
ముగ్గురు మాంత్రికులు -1957
కంచుకోట – 1958
జ్వాలాద్వీపం- 1960
రాకాసిలోయ- 1961
పాతాళదుర్గం – 1966
శిథిలాలయం- 1968
రాతిరథం- 1970
యక్ష పర్వతం- 1972
మాయా సరోవరం- 1976
భల్లూక మాంత్రికుడు- 1978

రాకాసిలోయ

రాకాసిలోయ

సీరియల్‌కు ఆయన చేసే పరిచయం చివరి పేజీ అయిపోయేంతవరకూ పాఠకుడిని చూపు మళ్లించకుండా చేస్తుంది. మొదటినుంచి చివరి దాకా సీరియల్ బిగి సడలకుండా చేయడంలో ఆయన చూపించిన నైపుణ్యం అనితరసాధ్యం. వ్యక్తిగత కారణాలతో 1978 తర్వాత ఆయన సీరియల్ రచనలు తనకు తానుగా మానుకున్నారు. అప్పటినుంచే చందమామలో సీరియల్స్ ప్రాభవం కనుమరుగవడం ప్రారంభమయిందంటే అతిశయోక్తి కాదు.

చందమామలో రంగుల బొమ్మల సీరియల్ అంటే తెలియనివారు ఉండరు. ఈ సీరియల్స్‌ను కూడా దాసరి సుబ్రహ్మణ్యం గారే రాశారు. 1952 నుంచి 2006 వరకు 54 సంవత్సరాల పాటు చందమామ సంపాదకవర్గ సభ్యుడిగా ఉండి, అనారోగ్య కారణంగా పదవీ విరమణ చేసిన దాసరి సుబ్రహ్మణ్యం గారు అప్పటినుంచి విజయవాడలో తన అన్న కుమార్తె ఝాన్సీ గారి ఇంట్లో ఉంటున్నారు.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం చిరునామా:

దాసరి సుబ్రహ్మణ్యం
c/o శ్రీమతి ఝాన్సీ
G-7
వైశ్యా బ్యాంక్ ఎంప్లాయీస్ అపార్ట్ మెంట్స్
దాసరి లింగయ్య వీధి
మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్- 0866 6536677

చివరిరోజుల్లో వినికిడి సమస్య కారణంగా ఫోన్‌లో తనతో మాట్లాడటం కూడా కష్టమైపోయింది. ప్రత్యక్షంగా కలిసి మాట్లాడినప్పుడు కూడా స్వరంలో అస్పష్టంగా ఉండేదని తెలుస్తోంది.దాదాపు 85 ఏళ్లు దాటిన ప్రస్తుత సమయంలో కూడా చందమామ తాజా సంచికలోని కథలు, బేతాళ కథలుపై తన అభిప్రాయం చెబుతూ, మార్పులు సూచిస్తూ ఆయన ఇప్పటికీ చందమామతో పరోక్ష సంబంధంలో ఉంటున్నారు. ఇటీవలి వరకు ప్రింట్ చందమామ అసోసియేట్ ఎడిటర్‌గా ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారితో పాతికేళ్ల పరిచయం, ఉద్యోగ సంబంధిత సహవాసం ఆయనకు మిగిలిన సుదీర్ఘ జ్ఞాపకాల్లో ఒకటి.

పాతాళదుర్గం

పాతాళదుర్గం

వైవిధ్య భరితమైన పాత్రలు, అడుగడుగునా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు కూడా అందని మలుపులు దాసరి గారి ధారావాహికల సహజ లక్షణంగా ఉంటాయి. వసుంధర గారు కౌముది.నెట్ వెబ్‌సైట్‌లో దాసరి గారి గురించి రాసిన పరిచయ వ్యాసంలో పేర్కొన్నట్లుగా  ఆయన ధారావాహికలలో “రాక్షసులూ, భూతాలూ, యక్షులూ, నాగకన్యలూ, రెక్కల మనుషులూ, మొసలి మనుషులూ, మరుగుజ్జు దేశస్థులూ, వృశ్చిక జాతివాళ్లూ, ఉష్ట్ర్ర యోధులూ, నరభక్షకులూ, మాంత్రికులూ, తాంత్రికులూ, ఆటవికులూ, అఘోరీలూ మాత్రమే కాకుండా గండభేరుండాలూ, పొలాలు దున్నే సింహాలూ, రథం నడిపే ఏనుగులూ” కూడా మనకు కనిపిస్తాయి.

ఆధునిక చదువులు పెద్దగా చదువుకోకపోయినప్పటికీ చిన్నతనంలో సోదరుడు వేంకటేశ్వర్లు -ఈశ్వర ప్రభు- ప్రభావంతో చదివిన ప్రాచీన కావ్యాలు, హేతువాద సాహిత్యం దాసరి గారి చందమామ కథలకు హేతువాదాన్ని జోడించాయి. చందమామ తొలినుంచి కూడా మతాలను నిరసించలేదు, ఇజాలకు తావివ్వలేదు కానీ  బాల సాహిత్యానికి అత్యవసరమైన హేతువాదానికి ప్రాధాన్యమివ్వడంలో కుటుంబరావు, సుబ్రహ్మణ్యం గార్ల పాత్రకు సాటిలేదు.

అన్నిటికంటే మించి ధారావాహికలలో పాత్రలకు ఆయన పెట్టిన పేర్లు చందమామ పాఠకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి. కాలశంబరుడు, ధూమకసోమకులు, కాంతిసేన, మహాకలి వంటి చిత్ర విచిత్ర పేర్లతో సాగే ఆయన సీరియల్ పాత్రలు పాఠకుల నోళ్లలో ఇప్పటికీ నానుతుంటాయి.

చందమామ సీరియళ్లలోని పాత్రల పేర్లకు పేర్లు పెట్టడం వెనుక నేపథ్య గమ్మత్తు కలిగిస్తుంది. ప్రాచీన సాహిత్యం బాగా చదివిన దాసరిగారు అమరకోశం, ఆంధ్రనామచంద్రిక వంటి పుస్తకాలలోని పేర్లను ఎన్నుకుని, మార్చి తన సీరియల్ పాత్రలకు పెట్టేవారట. చందమామ సంపాదక వర్గంతో చర్చించి పాత్రలకు తగిన పదాలను ఎన్నుకోవడంలో ఆయన చేసిన కసరత్తు చందమామ పాత్రలకు శాశ్వతత్వం కలిగించింది.

చందమామ పత్రిక విజయాలను, ఒడిదుడుకులను తనవిగా భావించి తీవ్రంగా స్పందించే దాసరిగారు చందమామలోని ఇతర ఉద్యోగులవలే ఆర్థిక ప్రతిఫలం విషయంలో అల్పసంతోషి. చక్రపాణి గారి తర్వాత ఎక్కువ సంవత్సరాలు చందమామ సంపాదకుడిగా వ్యవహరించిన విశ్వనాథరెడ్డి గారు చూపిన సానుకూల వైఖరి కారణంగా ఈయన చివరి వరకు చందమామలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేశారు.

1982 తర్వాత పాతికేళ్లపాటు చందమామ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారు దాసరి గారిపట్ల చూపించిన సౌజన్యం, ఔదార్యం కూడా ఇక్కడ తప్పక ప్రస్తావించాలి. చందమామలో అధిక పనిభారాన్ని మోస్తూ కూడా దాసరి గారి స్థానం చెక్కుచెదరకుండా చూడడంలో బాలసుబ్రహ్మణ్యం గారి సహాయం ఇంతా అంతా కాదని చెప్పాలి.

కథల పట్ల ఆయన అంకితభావం, సంపాదకవర్గ సభ్యుడిగా ఆయన పాటించే క్రమశిక్షణ, సహోద్యోగులతో నెరపిన స్నేహం, నిష్కల్మషమైన అభిమానం మాత్రమే కాదు. చందమామ చరిత్రలోనే పాఠకులతో అత్యంత సజీవ, సహజ సంబంధాలను కొనసాగించిన ఏకైక వ్యక్తి దాసరిగారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

కథ అందిన వెంటనే రచయితలకు కార్డు రాసి అందినట్లు తెలుపడం, ప్రచురణకు వీలుకాని రచనలను తిరుగు స్టాంపులు జతపర్చనివారికి కూడా తిప్పి పంపడం, కాంప్లిమెంటరీ కాపీ, పారితోషికం వగైరాల విషయంలో తనవి కాని బాధ్యతలు కూడా స్వీకరించడంలో దాసరి గారు అసాధారణమైన శ్రధ్దాసక్తులు ప్రదర్శించారు. -చివరకు ఆయన నాలుగేళ్లముందే చందమామనుంచి వైదొలిగినా ఈనాటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారు, ఇన్‌ఛార్జ్ ఎడిటర్ పేరుతో పాఠకుల ఉత్తరాలు వస్తుంటాయంటే తరాల పాఠకులు, రచయితలు, అభిమానులపై ఆయన వేసిన సహృదయ ముద్ర మనకు బోధపడుతుంది.

ఈ కారణం వల్లే ఎందరో రచయితలు తమ కథలను ముందుగా చందమామకే పంపేవారంటే అతిశయోక్తి కాదు. తనకు రచన నచ్చినప్పటికీ, సాహిత్యేతర కారణాలతో యాజమాన్యం దానిపట్ల అభ్యంతరం చెప్పినప్పుడు దాన్ని సానుకూల దృక్ఫథంతో వ్యవహరించిన దాసరిగారు సంబంధిత రచయితలు నిరుత్సాహానికి గురి కాకుండా చూసేవారట. రచన బాగున్నప్పటికీ ఇతర కారణాల వల్ల ప్రచురణకు నోచుకోలేదని ప్రత్యేకంగా ఉత్తరం రాసి రచయితలకు సర్దిచెప్పేవారట.

స్కూలు చదువు కూడా పూర్తి చేయలేదనే మాటే గాని ప్రాచీన సాహిత్యాన్ని ఔపోశన పట్టిన దాసరి గారు హేతువాదిగా, కమ్యూనిస్టుగా మారిన క్రమంలో ఆంగ్లసాహిత్యాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చందమామలో పనిచేసినంత కాలం ‘ది హిందూ’ పత్రికను క్రమం తప్పకుండా తెప్పించుకుని చదివేవారట. 1950 తదనంతర ప్రపంచ రాజకీయ, సామాజిక పరిణామాలపై తన పరిశీలనను వ్యక్తపరుస్తూ ఈయన మిత్రులకు, సమకాలీనులకు రాసిన అమూల్యమైన ఉత్తరాలను ఎవరయినా సేకరించగలిగి ముద్రించగలిగితే ఆయన సామాజిక దృక్పధం ప్రపంచానికి సుబోధకం కావచ్చు.

చందమామలో పేరులేని ఎడిటర్‌గా పాతికేళ్లపాటు కుటుంబరావుగారి ప్రాభవం వెలిగిపోతున్న రోజుల్లోనూ ధారావాహికల రూపంలో చందమామ విజయపతాకను ఎత్తిపెట్టిన అరుదైన రచయిత దాసరి.

అరవైఏళ్లకు పైగా కథాసాహిత్య ప్రచురణలో కొనసాగుతున్న చందమామలో ఓ శకం ముగిసింది. చందమామ స్వర్ణయుగానికి కారణభూతులైన సంపాదకవర్గంలో చివరి సభ్యుడు కన్నుమూశారు. చందమామ శంకర్ గారు మాత్రమే పాతతరంలో మిగిలి ఉన్న ఏకైక మాన్యులు.

చిరస్మరణీయమైన ఆయన స్మృతికి చందమామ అంజలి ఘటిస్తోంది. పత్రికా ప్రచురణలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, చక్రపాణి, కొకు, దాసరి తదితర మాన్యులు ప్రతిష్టించిపోయిన అత్యున్నత కథా సాహిత్య విలువలను శక్తి ఉన్నంతవరకు కొనసాగిస్తామని చందమామ వాగ్దానం చేస్తోంది.

ఆయన అస్తమయ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి గోళ్ల ఝాన్షీ గారికి చందమామ తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం.

దాసరి సుబ్రహ్మణ్యం గారి విశేషాలు తెలుసుకోవాలంటే వేణుగారి బ్లాగ్ చూడండి.

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు
http://venuvu.blogspot.com/2009/07/blog-post_18.html

“చందమామ రచయితను కలిసిన వేళ….”
http://venuvu.blogspot.com/2009/04/blog-post_16.html

చందమామకి వెన్నెముక- సుబ్రహ్మణ్య సృష్టి’ –వసుంధర
http://koumudi.net/Monthly/2009/april/index.html

చందమామ జ్ఞాపకాలు -కొడవటిగింటి రోహిణీ ప్రసాద్
http://www.eemaata.com/issue41/chandamama.html

 వికీపీడియాలో చందమామ వ్యాసాలు

http://చందమామ
http://చందమామ ధారావాహికలు

చందమామ సీరియల్స్ :

పాతాళదుర్గం పరిచయ వ్యాసం

చందమామ సీరియల్స్ ప్రారంభం 

http://చందమామలో పాతాళదుర్గం ధారావాహిక

http://ఆన్‌లైన్ చందమామ ధారావాహికలు

RTS Perm Link


10 Responses to “చందమామ కథల మాంత్రికుడు ఇక లేరు”

 1. రవి on January 28, 2010 1:02 AM

  ధన్యజీవి! సుబ్రహ్మణ్యం గారు అమరులు! ఆ సహస్ర మాస జీవి మన మధ్య భౌతికంగా మాత్రమే లేరు.

  గొప్ప రచనలు కష్టపడి ఎవరైనా చేయగలరేమో కానీ, అన్ని యేళ్ళు ఆ ధారావాహికల రచయిత ఆయనేనన్న విషయం దాచి ఉంచగలగటం ఆ మహానుభావుడికే చెల్లింది.

  చందమామలో ఈయన రచనలు చదువుతూ తెలుగు నేర్చుకున్న (మన లాంటి) వారందరికీ ఈయన తాతయ్యే. మా తాతయ్యకిదే మా అశ్రునివాళి!

 2. M.V.AppaRao on January 28, 2010 1:43 AM

  మన చందమామ కధల శ్రీ దాసరి సుబ్ర్హహ్మణ్యం గారిక లేరన్న చేదు వార్త
  నన్ను కదలించింది.ఆయన చందమామలో దాదాపు జీవితకాలం పని చేసి
  తన కిష్టమైన చందమామ దగ్గరకే వెళ్ళారు.పాత చందమామల్లో ఆయన
  అద్భుత కధలు మళ్ళీ మళ్ళీ చదివినప్పుడళ్ళా ఆయన మన ప్రక్కనే ఉంటారు.

 3. వేణు on January 28, 2010 2:12 AM

  ఎంత చేదు వార్త! వినగానే మనసు వికలమైంది. ఆయన్ను చరమదశలో రెండుసార్లు కలిసి, ఇంటర్వ్యూ చేయగలిగానని తృప్తి పడాల్సివస్తోంది!

 4. chandamama on January 28, 2010 2:12 AM

  రవిగారూ, అప్పారావుగారూ,

  ‘అన్ని యేళ్ళు ఆ ధారావాహికల రచయిత ఆయనేనన్న విషయం దాచి ఉంచగలగటం ఆ మహానుభావుడికే చెల్లింది.’

  ‘ఆయన చందమామలో దాదాపు జీవితకాలం పని చేసి తన కిష్టమైన చందమామ దగ్గరకే వెళ్ళారు.’

  మీ వాక్యాలు చదువుతుంటే ఏడుపొస్తోందండీ, భూమ్మీద ఎక్కువ కాలమే బతికినట్లున్నాను అని తనమీద తనే జోకు వేసుకున్న మాన్యుడు. ఆసుపత్రి జోలికి పోకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పోయారు. జీవితంలో ఒకసారైనా చూడాలనుకున్నాను. వేణుగారికి మల్లే ఆయనతో రాతపూర్వక ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా ఆయన స్వరాన్ని భద్రపర్చేవారుంటే చాలా మంచిదని అనుకున్నాను.

  ప్రజాసాహితివారు ఆయన జీవిత విశేషాలను వివరంగా రికార్డు చేయదలిచినట్లు వచ్చిన వార్త విన్నాను. కాని ఇప్పుడు ఇవేమీ జరిగినట్లు లేదు. ఒక్కటంటే ఒక్క టీవీ అయినా ఆయన వద్దకు పోయి ఇంటర్వూ చేసి భవిష్యత్తరాలకు ఆయన వాణిని, రూపాన్ని భద్రపర్చి ఉంటే ఎంత బాగుండేది.

  సాక్షి కార్టూనిస్టు అన్వర్ గారు స్వంత ఆసక్తితో ఇటీవలే చెన్నయ్‌లో చందమామ చిత్రకారులు శంకర్ గారిని కలిసి గంటపైగా వీడియో తీశారు. కనీసం దాసరి గారిని ఒక్కరయినా వీడియో తీసి ఉంటే ఎంత బాగుండేది.

  హంగూ బొంగులు లేనివారికి ఎలాగూ సాధ్యం కాదు. కనీసం అవి ఉన్న వారయినా ఒక్కరంటే ఒక్కరు చందమామ కథల మాంత్రికుడిని కాస్త కనికరించి ఉంటే ఏం పోయేంది. అయ్యో..

 5. chandamama on January 28, 2010 2:22 AM

  దాసరి సుబ్రహ్మణ్యం గారు పోయారని గత రాత్రి మిత్రుడు విశ్వనాథ్ చెప్పగానే నిర్థారించుకోవడానికి శివరాం ప్రసాద్, వేణుగార్లకు మెయిల్ పంపాను. శివరాం ప్రసాద్ గారు ఈ వార్త చూసి ఇలా స్పందించారు

  DEAR RAJU GARU,

  Its really a shocking news to hear about the passing away of our favourite writer Shri Dasari garu. Immediately after you informed about it, I switched on the TV and scanned all the channels. HM TV was showing their worn out DASA DISA and in the scroll there was no mention about this.

  Could you by now get any confirmation about the news? When I went to Vijayawada I could not meet this great writer, which I very much regret now.

  Regards,
  SIVARAMAPRASAD KAPPAGANTU
  FROM BANGALORE, INDIA

 6. chandamama on January 28, 2010 6:35 AM

  ఈ రోజు దాసరి గారి కన్నుమూత గురించి దినపత్రికలలో వచ్చిన వార్తలో ఓ పొరపాటు దొర్లింది. బేతాళ కథల సృష్టికర్తగా దాసరి గారి పేరును ఈ వార్తల్లో ప్రస్తావించారు. కాని అది నిజం కాదు. చక్రపాణి, కుటుంబరావుగార్ల ఆలోచనల ఫలితంగానే చందమామ బేతాళ కథలను మార్చి ప్రచురించడానికి వీలయింది. మొదట్లో బేతాళ కథలు చాలా వరకు కుటుంబరావు గారు సాపు చేసినవే. తర్వాత్తర్వాత దాసరి గారు కూడా వాటి రూపకల్పనలో పాత్ర వహించి ఉండవచ్చు. వ్యక్తిగత మెయిల్‌లో సందేహం లేవనెత్తిన వేణుగారికి ధన్యవాదాలు. అయితే చివరి వరకూ అంచే ఇటీవలి వరకూ చందమామలో తాజా బేతాళ కథలను దాసరి గారు నిశిత దృష్టితో చదివి తన లోతైన పరిశీలనను చందమామ బాధ్యులతో పంచుకున్నారన్నమాట వాస్తవం. ఈ విషయంలో తనది ఎంత అనుభవశీలత అంటే మన ఊహకు కూడా అందని చోట దొర్లిన లోపాన్ని ఆయన అట్టే పట్టేసుకుని మార్పును సూచిస్తారని బాలసుబ్రహ్మణ్యం గారు గతంలో చెప్పారు. అని చూడ్డానికి చాలా చిన్ని మార్పులు. వాటినే ఆయన ఎత్తిచూపేసరికి బాలుగారికి మహాశ్చర్యం వేసేది.

 7. చందమామ on January 28, 2010 11:43 AM

  Raju garu,

  Your write up is good.

  Pl add the following. For a few years Chandamama carried a 1 page story with 4 pictures called Chitrakatha. Illustrations were of course by Chitra. With 2 boys named Dasu and Vasu, they were all written by DS garu.

  Along with my father, DS garu was also commissioned by Chakrapani to re write Bengali novel translations for Yuva.

  krp

 8. చందమామ on January 28, 2010 12:14 PM

  దాసరి గారి అస్తమయం సందర్బంగా తెలుగు దినపత్రికలు, కొన్ని బ్లాగులలో కూడా బేతాళ కథల సృష్టికర్త ఇకలేరు అని ఆగిన చందమామ బేతాళ కథ అని వార్తలు ప్రచురించాయి. ఇక్కడ చందమామ చరిత్రకు సంబంధించి కాసింత వివరణ ఇవ్వాలి. చక్రపాణి గారి సలహా సంప్రదింపులతో కుటుంబరావుగారు ఒరిజనల్ బేతాళ కథల స్థానంలో కల్పిత బేతాళ కథలను రూపొందించే బాధ్యతలను చాలా కాలం నిర్వర్తించారని ఇప్పటివరకు మా అవగాహన. బ్లాగులో, సైట్లో కూడా ఈ అవగాహన ప్రకారమే రాస్తూ వచ్చాము. కుటుంబరావు గారి అనంతరం బేతాళ కథలను సాపు చేయడంలో మామూలు కతలను ట్విస్ట్ చేసి పజిల్ రూపంలో వాటిని ముగించడంలో దాసరి గారి దోహదం కూడా ఉండవచ్చు. కానీ బేతాళ కతల ఆలోచన, సృష్టి మొత్తంగా దాసరిగారిదే అనడంలో ఆయన పోయిన సందర్భంగా ఇది హైలెట్ కావడం వాస్తవానికి భిన్నంగా పోతోందేమో అనిపిస్తోంది.

  ఇదే విషయమై కుటుంబరావుగారి అబ్బాయి రోహిణీ ప్రసాద్‌గారిని వివరణ కోరితే ఆయన కింది మెయిల్ పంపారు

  rohiniprasadk@gmail.com
  date Jan 28, 2010 9:14 PM

  మానాన్నగారు బతికున్న రోజుల్లో బేతాళకథల బాధ్యత ఆయనదే. దా.సు.గారు వాటి జోలికి పోలేదు. ఆ తరవాత సీనియర్‌గా వాటి సంగతి ఆయన చూసుకోవలసివచ్చింది. మొదటి రంగుల సీరియల్ రాయడం, ప్రూఫ్ రీడింగ్, ప్రొడక్షన్ వ్యవహారాలూ మొదటినుంచీ దా.సు.గారే చూసుకునేవారు.

  బేతాళ కథలు 1980 తరవాత ఆయనే రాశారు కనక ఆయనకు క్రెడిట్ ఇచ్చారేమో. ఈ తరం జర్నలిస్టులకు ఈ వివరాలు తెలియకపోవడం సహజమే.

  రో.ప్ర.

 9. anwar on February 16, 2010 11:39 PM

  చిన్న సంజాయిషి ,
  శంకర్ గారంటే వున్న ఇష్టం వల్ల ఆయన్ని నేను మదరాసుకు వెల్లి దర్శించుకున్నాను , నేను ఆయన్ని వీడియొ గాని పొటొలు గాని తీయలేదు , నావద్ద వున్న చిన్న టేప్ రికార్డ్లొ ఆయన మాటల్ని వొ గంటనర్ర వరకు రికార్డ్ చేసుకున్నా , ఆ వీడియొ తీసింది, దాని సొంతదారు బెంగుళూరు లొ వుండే ఒక ఇంజనీరుగారు.

 10. chandamama on February 17, 2010 12:52 AM

  అన్వర్ గారూ,
  పొరపాటు జరిగిపోయింది. శంకర్ గారిపై ఇటీవల వీడియో రికార్డు చేసింది విజయవర్ధన్ గారే కదూ. క్షంతవ్యుడిని. ఆయనతో ఇంకా సంప్రదించలేదు. పొరపాటు గుర్తు చేసినందుకు కృతజ్ఞుడిని.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind