మన గుమ్మడి : మన తిమ్మరుసు

January 27th, 2010

MahamantriThimmarusu_400-300

ఈటీవీలో రాత్రి 11 గంటలకు మహామంత్రి తిమ్మరుసు చిత్రం ప్రసారం చేశారు. గుమ్మడి వేంకటేశ్వరరావు గారు మనమధ్య లేరు. ఆయన జీవంపోసిన మహామంత్రి తిమ్మరుసు పాత్ర ఉంది. అది చూసిన ప్రతిసారీ రాజనీతికి సంబంధించిన దుష్టపాఠాలను చెబుతూనే ఉంది. ఇంకో అయిదు వందలేళ్లు గడిచినా తిమ్మరుసు పాత్రకు చరిత్రలో మసక అంటదు. మాసిపోదు కూడా..

రాజుల్ మత్తులు, వారి సేవలు నరకప్రాయంబు… అంటూ పద్యం. పద్య సాహిత్యం సామాజిక దౌష్ట్యాన్ని నిరసించలేదని చెప్పిందెవరు?

ఈ పద్యం చరిత్రలో ఏ సందర్బంలో రాయబడిందో తెలీదు కానీ, ఒక మహాసామ్రాజ్యాన్ని తన యుక్తి, చతురతల బలం మీద నిర్మించి పెట్టిన మహామంత్రిని ఆయన అడుగులకు మడుగులొత్తిన మహారాజే అనుమానించిననాడు గదా తిమ్మరుసు జీవన్మృతుడయింది.

దక్షిణభారత దేశ చరిత్రలో ఓ స్వర్ణయుగానికి కారణ భూతుడైన మహామాత్య్డు తాను ఉలిపెట్టి చెక్కిన కృష్ణదేవరాయలే తనను అనుమానించిన క్షణంలో కదా విజయనగర చరిత్ర అంతానికి నాంది జరిగింది. దశాబ్దాలుగా ప్రోది చేసుకున్న ఓ మహా విశ్వాసానికి ఇంత అపచారం జరిగినప్పుడు కదా ఎదురేలేని విజయనగర సామ్రాజ్యం బీటలు వారిపోయింది.

గుమ్మడి గారు తప్ప మరెవరినైనా మహామంత్రి తిమ్మరుసు పాత్రకు న్యాయం చేయగలిగేవారా? ఆయన నటించిన 500 పైగా సినిమాలు మొత్తంగా లేకుండా పోయినా సరే మహామంత్రి తిమ్మరుసు చిత్రం ఒక్కటి నిలిస్తే చాలు ఆయన పేరు ఆచంద్రతారార్కమై ఉంటుంది.

ఇది చరిత్ర కాకపోవచ్చు. పుక్కిటి పురాణం కావచ్చు. చారిత్రక ఆధారాలకు ఈ కథలో తావు లేకపోవచ్చు. కానీ నమ్మినవారిని నామరూపాలు లేకుండా చేసే క్రూరాత్ములు 500 సంవత్సరాల తదుపరి చరిత్రలోనూ పొడసూపుతున్నప్పుడు, ఇలాంటివి జరగవని, జరగలేదని మనం భావించడానికి కూడా ఆస్కారం లేదు.

ఇద్దరు మనుషుల సంబంధంలో, ఒక పనిలో, ఒక వ్యవస్థ నిర్మాణంలో, ఓ సామ్రాజ్య వైభవంలో కూడా వ్యక్తుల మధ్య విశ్వాసం అనేది అంతరిస్తే అక్కడ మానవాత్మ అనేది ఇక ఉండదు. అటు రాయలు, ఇటు మహామంత్రి తిమ్మరుసు ఈ సత్యాన్ని ఎంత చక్కగా చాటిచెప్పారు.

గుమ్మడి గారూ, మీరు లేని లోకంలో మేం ఉంటున్నాం. ఓ ‘మహామంత్రి తిమ్మరుసు’లో ఓ ‘పండంటి కాపురం’లో ఓ ‘మాయాబజార్‌’లో మిమ్మల్ని చూసుకుంటా రాజరికపు పాఠాలను నేర్చుకుంటాం. మీరు వదిలిపెట్టి వెళ్లిన పాత్రల్లో మిమ్మల్ని చూసుకుంటూ పాత్రలో ఒదిగిపోవడం అంటే ఏమిటో తెలుసుకుంటూ బతికేస్తాం.

మీరు లేరని ఎనరన్నారు? పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రపోషణ. అత్యంత విరుద్ధమైన వసిష్ట, విశ్వామిత్ర పాత్రల ధారణ. దశరధునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు,భృగుమహర్షి, మొదలైన పౌరాణిక పాత్రలకు జీవం పోసిన మూర్తిమత్వం.

మన చరిత్రలో గుమ్మడి అనే పెద్దాయనను ఇలాగే తల్చుకుందాం. తెలుగు సినిమాలో అప్పటికే స్టార్ల కాలం ప్రబలిన కాలంలో హీరోలను, వారి స్టార్‌డమ్‌లను అధిగమించి తన పేరునే చిత్రం టైటిల్‌గా మార్చుకోగలిగిన గొప్పపాత్రలు ధరించిన మేటినటుడిగా ఆయనను గుర్తుంచుకుందాం.

ఆ సినిమాలో చివరి పాట. పాషాణ హృదయాలను సైతం కరిగిస్తూ ఓ వేగు పాడిన పాట ఇది.

చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా

ఆంధ్రదేవా వెంకటేశ్వరా, విరూపాక్షస్వామీ

ఉపకారమె ఒకనేరమా అపకారమె ప్రతిపలమా

ఇదే నీ విధానమా మౌనమె నీ సమాధానమా

చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా

నాల్గు పాదముల ధర్మము నడిచే రోజు నేటితో తీరినదా

చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా

గుమ్మడి గారూ, మీరే చెప్పాలి. కోల్పోయిన మీ కళ్లు చెప్పే భారత రాజనీతి చరిత్ర మర్మం ఏమిటి? నాల్గు పాదముల ధర్మము నడిచే రోజు నేటితో తీరినదా!

RTS Perm Link


4 Responses to “మన గుమ్మడి : మన తిమ్మరుసు”

  1. వాసు on January 27, 2010 6:35 PM

    చెత్త కార్యక్రమాలతో,ఇంకా సినిమా కూడా పూర్తీ చెయ్యని పిల్ల కాకుల ఇంటర్వ్యూలతో టీవీ ని నిమ్పేసే ఈ చానళ్ళు ఇలాటి వారి ఇంటర్వ్యూలు పెట్టుంటే ఎంత బావుండు. మొన్నే ఎవరో అంటున్నారు గుమ్మడి గారి లాటి వాళ్ళ జ్ఞాపకాలు మాయ బజార్ కలర్ సినిమా డి వి డి లో పొందు పరిస్తే బావుంటుంది అని. ఈ లోపే ఈ వార్త.

    అయినా మీరన్నట్టు నలుపు తెలుపు సినిమాలలో రకరకాల పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవులే గుమ్మడి.

  2. subhadra on January 27, 2010 10:33 PM

    ఈ సినిమా ప్రసారం చేసినందుకు ఈటీవీ వారిని అభినందించాలి. ఎంత గొప్పగా తీసేవారో కదా ఆ రోజుల్లో సినిమాలు అనిపించింది చూస్తున్నంత సేపు. ధీరోదాత్తుడైన క్రిష్ణదేవరాయలుగా రామారావుగారూ, మంత్రాంగానికి మారుపేరైన మహామంత్రి తిమ్మరుసుగా గుమ్మడిగారూ స్క్రీన్ మీదనించి చూపు తిప్పుకోలేనంత గా ఆ పాత్రలకి జీవం పోసారు. ఆహార్యాం, ఆంగికం, వాచకం.. ఎంత అద్భుతంగా ఉంటాయో.. మరలిరాని, మళ్ళీ పుట్టని తారలలోంచి మరొక తార వినీలాకాశంలోకి వెళ్ళిపోయింది.. ఆ మహానటులగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. నాలాంటి వారికి వయసూ, అనుభవమూ కూడా చాలవు.. శ్రీయుతులు గుమ్మడిగారికి నా నివాళులు..

  3. రవి on January 27, 2010 10:36 PM

    గుమ్మడి గారి సినిమాలో ఆయన నటన చూస్తుంటే, మన ఇంట్లో వ్యక్తిని చూసినట్టు ఉంటుంది. మహానుభావుడు!

    తిమ్మరుసయ్య చివ్వరి రోజుల్లో, గుడ్డివాడై, ఆదరించేవారు కఱువై, పొట్టపోసుకోడం కోసం తిరుమలలో లడ్లు అమ్ముకుంటూ జీవించే వాడని కృష్ణదేవరాయ వైభవం అన్న పుస్తకం లో చదివాను. (సినిమాలో అలా లేదనుకుంటాను)

  4. చందమామ on January 30, 2010 3:49 PM

    వాసు, సుభద్ర, రవి గార్లకు
    చందమామ సంపాదక వర్గ సభ్యుడు, ధారావాహికల రచయిత దాసరి సుబ్రహ్మణ్యంగారి ఆకస్మిక మరణంతో మీ స్పందనలకు ప్రతిస్పందించడం కుదరలేదు.

    గుమ్మడి గారి పరిచయం లేకుండానే మాయాబజార్ విడుదలయిపోయింది. ఇటీవలే కాలధర్మం చెందిన గుమ్మడి గారు, మాయాబజార్ సినిమాలో నటించిన వారిలో ఇంకా మిగిలి ఉన్న ప్రముఖులు అక్కినేని, మిక్కిలినేని గార్ల పరిచయ వాక్యాలు కూర్చి మాయాబజార్ సినిమాను విడుదల చేయడానికి ఇవి పాతరోజులు కావండీ. మాయాబజార్‌కు రంగులద్దడం గొప్పే కాదనలేం. కానీ ఆ సినిమాలో నటించిన, ఇంకా మిగిలి ఉన్న వారికి కనీసం గౌరవ సూచకంగా అయినా వారిగురించి నాలుగు మాటలు చొప్పించి సినిమాలో ఓ డాక్యుమెంటరీలాగా 10 నిమషాలు వేయగల సెన్స్ -ఇంగితజ్ఞానం- రంగులద్దిన వారికి ఉన్నట్లు లేదు. పైగా అసలు సినిమాలోనే రెండు పాటలకు పల్లవి,చరణం తప్ప మొత్తంగా కొత పెట్టారాయె. ఇక నటించిన వయోవృద్దుల గురించి నాలుగు పరిచయ వాక్యాలు కూడానా. అలా అనుకోవడానికి మనమే అమాయకులమేమో.. పైగా ఈ రంగులద్దిన గోల్డ్‌స్టోన్ కంపెనీ సినిమాను అమ్ముకుని లాభం గడించింది కానీ మూడేళ్లుగా రంగులద్దే పనిలో నిబద్దంగా కృషిచేసిన 160మంది ఉద్యోగులను ఉన్నఫళానా తొలగించి ఇంటికి పంపిన ఘనత కూడా దక్కించుకుందట. రంగులద్దిన వారి జీవితంలో రంగులు మాసిపోయాయి. రంగుల మాయాబజార్ పేరు వింటే ముందుగా ఈ దారుణమే తలపుకొస్తోంది.

    సుభద్రగారూ, మహామంత్రి తిమ్మరుసు చిత్రంపై మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    రవిగారూ, ప్రజలకు మాయే నచ్చుతుంది కానీ, నిజం పెద్దగా నచ్చదు. అందుకే మాయాబజార్ అంతగా జనాలకు నచ్చేసిందని అక్కినేని గారు ఈ రోజే టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పారు. మహామంత్రి తిమ్మరుసు కూడా చారిత్రక వాస్తవం విషయంలో మాయచేసిందేమో. తిమ్మరుసు కళ్లు తీసేసిన దృశ్యమే తీయకుంటే ఆ సినిమాకు ముగింపు ఉండేది కాదు. అలా కాక రాయలు పోయిన తర్వాత కూడా తిమ్మరుసు తిరుమలలో లడ్లు అమ్ముకుని బతికాడని తీస్తే జనం చూసేవారా.. ఏమో..

Trackback URI | Comments RSS

Leave a Reply

Name (required)

Email (required)

Website

Speak your mind