చందమామలు ప్రసాదించినవారికి…!

January 13th, 2010

chandamama-logo-306-300

అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నుంచి మద్రాసుకు పనిమీద వచ్చిన మా మోహన్ అన్న -కె.మోహన్ రాజు-ను ఈ జనవరి 1న చెన్నయ్ ఐఐటి గెస్ట్ హౌస్‌లో కలిశాను. తను ఎస్కేయూలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. పోతూ పోతూ ఇంగ్లీష్, తెలుగు చందమామలు పాతవి కొత్తవి కొన్ని పట్టుకెళ్లాను. చందమామలో నా పని వివరాలు తెలుసుకుని నేను తీసుకువచ్చిన కొత్త చందమామలు తిరగేశారు.

ఈ సందర్భంగా ఆయనకూ, చందమామకూ అనుబంధం చాలా కాలం కొనసాగిన వైనం మొదటిసారిగా తెలియవచ్చింది. 1970ల చివరలోఆయన ఎస్కే యూనివర్శిటీలో రీసెర్చ్ మొదలెట్టారు. అప్పటినుంచి రీసెర్చ్ పూర్తయి అదే వర్శిటీలో ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా ఆయన చందమామలను కొని పదిలపర్చడం సాగించారట.

దాదాపు 1996 వరకు దాదాపు 15 ఏళ్లకు పైగా చందమామలను ఆయన క్రమం తప్పకుండా తీసుకుని సంవత్సరానికి రెండు బౌండ్ల లెక్కన వాటిని భద్రపర్చారట. చిన్నప్పటినుంచి తాను కొంటూ వచ్చిన ఏ పుస్తకాన్నయినా చదవకుండా వదిలిపెట్టింది లేదని, ఇప్పటికీ ఆనాటి పత్రికలు తన ఇంటిలో లైబ్రరీలో భద్రంగా ఉంచానని ఆయన తెలిపారు.

తాను చెప్పే ఆర్గానిక్ సబ్జెక్ట్ కోసం స్వంత ఖర్చులతో వేలరూపాయలు విలువచేసే పుస్తకాలు కూడా ఎన్నో కొని పదిలపర్చారు. టీచింగ్ కోసం అవసరమై ఓసారి దాదాపు 20 వేల రూపాయలు ఖరీదు చేసే సబ్జెక్ట్ పుస్తకం కూడా అమెరికా నుంచి తెప్పించుకున్నారట.

ఈ సందర్భంగా పుస్తకాల గురించి, వాటిని పోగొట్టకుండా భద్రపర్చుకోవడం గురించి ఆయన నాకు పాఠం చెప్పారు. పుస్తకం విలువ తెలియని వారే పుస్తకాలు అరువు తీసుకుని తర్వాత తిరిగి ఇవ్వరని, అలాగే పుస్తకాల విలువ తెలిసినవారు కొన్న తర్వాత ఎప్పటికీ వాటిని పోగొట్టుకోరని ఆయన చెప్పారు. 20 ఏళ్లుగా జీవితం మలుపుల్లో వందలాది పుస్తకాలను కొని, సేకరించి పోగొట్టుకున్న నాకు గతుక్కుమంది ఒక్కసారిగా. కానీ ఇదొక అనివార్యత. అంతే…

96-98లో చందమామ అజ్ఞాతవాసం చేసిన కాలంలో ఆయనకు చందమామతో సంబంధం తెగిపోయింది. తర్వాత దాన్ని తీసుకోలేక పోయానని, తిరిగి చందా కట్టాలని ఎన్నోసార్లు అనుకున్నానని ఇప్పుడు నువ్వే కలిశావు కాబట్టి ఈ జనవరి నుంచి ఇంగ్లీషు, తెలుగు చందమామలు చందా కడతానని చెప్పారు.

చందమామకు తిరిగి చందా కడతానని తను చెప్పడం సంతోషం కలిగిస్తున్నప్పటికీ మా అన్న చెప్పిన మరో అంశంపైనే దృష్టి పెట్టాను. చందమామ పాత కాపీలు చందమామ అభిమానులకు అడపాదడపా దొరుకుతున్నాయని తెలిసినప్పుడు వారి కంటే ముందుగా నేను ఎగిరి గంతేసి పాత చందమామలు దొరికాయోచ్ అని బ్లాగులో పెట్టి అందరితో పంచుకున్నవాడిని..

పాత చందమామలు

పాత చందమామలు

ఇప్పుడు మా పెద్దనాన్న కుమారుడు, మా అన్న వద్దే 15 ఏళ్ల పైగా చందామామలు ఉన్నాయని వినగానే గాల్లో తేలిపోయాను. ‘ఇంతకూ ఏం చేస్తారు వాటిని’ అని అడిగాను. మీరు వాటిని వదిలించుకోవాలని ఎప్పటికయినా అనుకుంటే వెంటనే నాకు కబురంపమని, అఘమేఘాలమీద వచ్చి వాలిపోతానని చెప్పాను.

ఆయన అంత సులభంగా చందమామలను వదులుకోరని అర్థమవుతున్నప్పటికీ ఎందుకైనా మంచిదని ఓ రాయి వేశాను. ఒకవేళ తాను చందమామలు ఎవరికయనా ఇచ్చేయాలనుకుంటే.. ముందువరుసలో మనమే ఉంటే మంచిది కదా.. చావుతెలివి కూడా ఒక్కోసారి పనికివస్తుంది కదా..

ఇక చందమామకు చందా కట్టడం గురించి… ఆయన చందా కడతానని సంవత్సరానికి ఎంతవుతుందో చెప్పమని అడిగారు. ఒక్కసారిగా నా ఆలోచనలు 35 సంవత్సరాలు వెనక్కు వెళ్లాయి. మేం హైస్కూల్ చదువుతున్న రోజుల్లో అంటే ఆరేడు తరగతుల్లోనే మాకు చందమామతో పరిచయం ఏర్పడడానికి మూలకారకులు మా సుధాకర్, పురుషోత్తం, మోహన్ అన్నలే కారణం.

మా నాన్న తొలిసారిగా చందమామను తెచ్చి చదవండిరా.. జ్ఞానమొస్తుంది అన్నప్పటికీ అప్పట్లో చందమామ క్రమం తప్పకుండా మా కుటుంబాల్లోని పిల్లలందరికీ అందడానికి కారకులు మా అన్నలే. పనిమీద రాయచోటికి, కడపకు పోతున్న ప్రతిసారీ చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు తెమ్మని మేం అడగటం, వారిలో ఎవరో ఒకరు వాటిని తీసుకురావడం. మా కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ వాటిని అపురూపంగా దాచుకుని దాచుకుని మరీ చదవటం. ముందుచదివిన వారు ఇంకా చదవని వారికి ఆ కథలు చెప్పి ఊరించడం. ఇలా మా అందమైన చందమామ బాల్యానికి వెలుగురేఖలు తెచ్చింది వీరు. 

ఈ కృతజ్ఞతా భావంతోటే ఇప్పుడు మా మోహనన్న చందా కడతానని అనేసరికి ‘వద్దులేండి నేనే ఈ సంవత్సరం చందా కట్టి మీకు పంపుతాను’ అని అన్నాను. దాదాపు ఏడెనిమిదేళ్లు మా బాల్యం నిండా చందమామ తీపి గురుతులను పంచిన వారికి నేను చూపించవలసిన కనీస కృతజ్ఞత అని ఆ క్షణంలో నాకు అనిపించింది. ఈరోజే తెలుగు, ఇంగ్లీష్ చందమామలకు గాను చందమామ ఆఫీసులో మా మోహనన్న ఇంటి చిరునామా ఇచ్చాను.

మా బాల్యాన్ని చందమామ అనుభూతులతో నింపినవారికి రుణం ఇలా తీర్చుకుంటున్నానేమో మరి. మా పురుషోత్తం అన్నకు కూడా చందమామ ఇవ్వాలి. ఆయనకు ఇద్దరు కూతుళ్లు స్వప్న, సంధ్య. 70ల చివర్లో వీరిని ఎత్తుకుని పెంచాము. చందమామ కథలు చెప్పి జోకొట్టాము.

మా కళ్లముందు చిన్న పిల్లలుగా మెలిగిన వీరు ఈరోజు చదువుల్లో ముందుకు పోయారు, స్వప్న ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చదువు ముగించి అక్కడే ఉద్యోగం చేస్తోంది. పురుషోత్తం అన్న, మధు వదిన కూడా ఇప్పుడు కూతురును చూడడానికి ఆస్ట్రేలియా వెళ్లారు. తిరిగి రాగానే వారికి చందమామ పంపాలి. సుధాకర్ అన్న ఇప్పుడు లేరు. వారి పిల్లలిద్దరూ అమెరికా బాటపట్టారు. కాబట్టి దొరకరు.

రుణాలను ఒక్కోసారి జీవితకాలంలో కూడా తీర్చడం సాధ్యం కాకపోవచ్చు.. కానీ చందమామను పంచిపెట్టిన మా అన్నల రుణం ఇలా తీర్చుకునే అవకాశం దొరకడం నిజంగా నన్ను ఉత్తేజితుడిని చేస్తోంది. నేను పంపుతున్న చందమామను ఈ వయసులో కూడా వారు చదువుతారని నాకు నమ్మకం ఉంది.

NB: చందమామ పాఠకులు, అభిమానులు, పెద్దలు, పిన్నలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చందమామ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామ ప్రచురణకోసం పంపడం మరవకండి.

రేపటినుంచి ఈ ఆదివారం వరకు బెంగళూరులో మా చెల్లెలు ఇంటికి వెళుతున్నాను. తిరిగి 18వ తేదీనే కలుసుకుందాం. అంతవరకు సెలవు.

రాజు
mobile: 9884612596
Email: krajasekhara@gmail.com
rajasekhara.raju@chandamama.com

RTS Perm Link


9 Responses to “చందమామలు ప్రసాదించినవారికి…!”

 1. రవి on January 13, 2010 3:39 AM

  ఇదివరకు పుస్తకాలు అద్దెకిచ్చే షాపులు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు చాలా వరకూ మూతబడ్డాయి. వారిదగ్గర పాతపుస్తకాలు దొరకవచ్చు. మీరు, మీ అన్న గారు కానీ ప్రయత్నించండి. నాకు కొన్ని అలానే దొరికాయి.

  మీరు బెంగళూరొస్తున్నారు, నేను మా ఊరికి వెళుతున్నాను. :-(. ఇక్కడ ఉంటే తప్పక కలిసి ఉండేవాణ్ణి. సరే, మళ్ళీ కలుద్దాం. పండుగ శుభాకాంక్షలు మీకు.

 2. వేణు on January 13, 2010 11:27 AM

  రాజు గారూ, పాత చందమామలు మీ సోదరుడి దగ్గరే ఉన్నాయన్న సంగతి ఇప్పుడు తెలిసిందన్నమాట . వాటి సేకరణ విషయంలో మీ ముందుచూపు భలే వుంది 🙂

  చందమామ అ‘రుణ’ కిరణుడి దగ్గర్నుంచి రుణం గ్రహిస్తాడనేది ముళ్ళపూడి రుణానందలహరి! ఇప్పుడిలా మీరు ‘చందమామ రుణం’ తీర్చుకునే ప్రయత్నాలు చాలా బావున్నాయండీ.

 3. Sarath on January 13, 2010 2:18 PM

  chanda mama abhimanulaku chiru kanuka…check this website for all issues of chandamama

  http://www.chandamama.com/lang/index.php?lng=TEL

 4. chandamama on January 18, 2010 5:42 AM

  రవి, వేణు, శరత్ గార్లకు
  మీ మెయిళ్లు అందుకోకుండానే బెంగళూరుకు వెళ్లిపోవడంతో సత్వరం స్పందించలేక పోయాను. పాతపుస్తకాల కొట్లవద్ద చందమామలను ఎన్నని సేకరించగలం? ఎప్పుడో కానీ బయటకు కదలలేని మావంటివారికయితే మరీ కష్టం. రవిగారూ మీ సలహా మాత్రం గుర్తుపెట్టుకుంటాను. మనం మరోసారి కలుసుకుందాం లేండి. మీ పాత చందమామల ఫోటోనే ఈ కథనంలో వాడాను. ఏమనుకోరు కదూ?

  వేణు గారూ, చందమామల సేకరణలో ముందుచూపు భలే ఉంది అన్నారు. ముందు చూపు అనే కన్నా పోగొట్టుకున్న వారి చూపు అంటే బాగుంటుందేమో.. చందమామ రుణం తీర్చుకోలేనిదనుకోండి. ఏదో మా అన్నకు ఉడతా భక్తిగా సంవత్సరం చందమామలను పంపుతున్నానంతే.. అంతకు మించి మరేం లేదు.

  శరత్ గారూ, చందమామ పాతసంచికల లింకును అందరికీ మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఈ లింకును వీలైనంతమందికి తెలుపండి. పాత ప్రింట్ చందమామలకోసం వెతుకులాట క్రమం కొనసాగుతూ ఉంటుందనుకోండి. తప్పదు మరి…

 5. vanam jwala narasimha rao on January 18, 2010 11:32 PM

  చందమామ గారూ,
  రాద్దాం-రాద్దాం అనుకుంటూ, ఎన్నడు రాద్దాం అని ఏ రోజుకారోజు వాయిదా వేస్తూ వచ్చాను. అలా వాయిదా వేస్తే ఈ జీవిత కాలం సరిపోదని అర్థమైపోయింది. రాజు గారితో “ఇంటర్ నెట్” పరిచయమై, చందమామ బ్లాగ్ చూసిన వెంటనే, బాల్యంలోకి సరాసరి దూరి పోయాను. ఎంత చదివినా-ఎన్ని చదివినా తనివి తీరడం లేదు. ఈ ఒక్కటి చదివి “కామెంట్” రాద్దామని అనుకుంటూ ఇన్నాళ్లు గడిపాను. నదిలో చేపలు పట్టేవాడికి దప్పిక వేసిందట-ఈ ఒక్క వల వేసి, చేపలు పట్టి నీళ్లు తాగుదామనుకుంటాడు-అలానే చేపలు పట్టుకుంటూ పోతూ-దప్పికతో చనిపోతాడు.

  అలా కాకూడదని, ఒక్క సారన్నా “చంద మామ” ను, దాన్ని నిర్వహిస్తున్న “మేధావులను” అభినందించడానికి ఈ కామెంట్.

  “న భూతో న భవిష్యత్”
  అమెరికాలో ప్రస్తుతం వుంటున్న నేను, ఇక్కడి తెలుగువారందరు “చందమామ బ్లాగ్” ను గురించి చర్చించు కుంటుంటే, ఆనందం కలుగుతోంది.

  జ్వాలానరసింహారావు వనం

 6. హెచ్చార్కె on January 19, 2010 2:19 AM

  మీ మనస్సులోని వెన్నెలకు నమస్కరిస్తున్నాను… హెచ్చార్కె.

 7. chandamama on January 19, 2010 6:19 AM

  జ్వాలానరసింహారావు గారూ,

  నదిలో చేపలు పట్టేవాడి దప్పిక గురించి మీరు చెప్పిన చాటువు చాలాబాగుంది. చందమామ బ్లాగు మీ బాల్యాన్ని మరోసారి తట్టిలేపినందుకు చాలా సంతోషంగా ఉంది. “చందమామను నిర్వహిస్తున్న మేధావులను” అని అన్నారు. చిన్న సవరణ. చందమామను మాన్యులు, గొప్పవారు గతంలో నిర్వహించిన మాట నిజమే.కాని ఇప్పుడు చందమామను సామాన్యులే నిర్వహిస్తున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా చందమామను చదువుతున్న, చూస్తున్న, ఆదరిస్తున్న మీ వంటి పాఠకులే నిజంగా గొప్పవారు. మీవంటి పాఠకుల, అభిమానుల గొప్ప తర్వాతే అన్నీ.. చందమామ బ్లాగుతో మీ బంధం ఇలాగే కొనసాగుతుందని, కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము.

  అమెరికాలో తెలుగువారు చందమామ బ్లాగును గురించి చర్చించుకుంటున్నారన్న చల్లటి వార్తను మీరు వ్యాఖ్యలో రాశారు. అందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. చందమామలో పనిచేస్తున్న వారిని సంతోషపెట్టిన మీకు నిండు నూరేళ్లు. చందమామ చరిత్రకు సంబంధించిన అంశాలను మరింత బాధ్యతాయుతంగా అందివ్వగలమని తప్ప వారికి మరే వాగ్దానం చెయ్యగలం? మీరు ఈ వార్త తెలిపిన తర్వాత మా బాధ్యత మరింత పెరిగిందనే భావిస్తున్నాము. వీలైతే చందమామతో అనుబంధం కలిగి ఉన్న అమెరికా తెలుగువారిలో మీకు పరిచయమున్నవారిని సంప్రదించి చందమామతో వారి జ్ఞాపకాలను ఇంగ్లీషులో లేదా తెలుగులో రాసి కింది లింకుకు పంపవలసిందిగా చెప్పగలరు.

  abhiprayam@chandamama.com

  ధన్యవాదాలతో
  రాజు
  చందమామ

  హెచ్చార్కె గారూ,

  మీకు మా కృతజ్ఞతాభివందనలు.

 8. bhandaru srinivasrao on January 20, 2010 1:41 PM

  అభిమానం ఆర్ణవమయితే- ఎలాగుంటుందో తెలుసుకోవాలంటే ‘ఈ ఉత్తరాయణం’ చదివితీరాలి.
  ఒక మహత్తర ధ్యేయంతో కష్టపడుతున్నవాళ్ళను, దాన్ని ఇష్టపడుతున్న వాళ్ళను ఒక గాటన కట్టి పడేస్తున్న ఈ బ్లాగుకు నా జోహార్
  -భండారు శ్రీనివాసరావు

 9. చందమామ on January 20, 2010 1:59 PM

  శ్రీనివాసరావు గారూ,
  మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ మాస్కో అనుభవాలు తదుపరి భాగాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. మీగురించి, జ్వాలా నరసింహారావుగారి గురించి ఈ బ్లాగులో పరిచయం చేయాలని ఉంది. త్వరలోనే ఇందుకు పూనుకోగలను.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind