ఆన్‌లైన్‌లో 53 ఏళ్ల చందమామలు

December 31st, 2009

First issue cover of TELUGU

చందమామ కథలు

“భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి.”

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారి 12 అద్వితీయ ధారావాహికలు, (తోకచుక్క, శిధిలాలయం, రాకాసిలోయ, యక్షపర్వతం, పాతాళదుర్ఘం వగైరా) 55 ఏళ్లుగా చందమామలో నిరవధికంగా ప్రచురితమవుతున్న బేతాళకథలు, పరోపకారి పాపన్న, తాతయ్య చెప్పిన కథలు, గుండుభీమన్న, సాహసయాత్రలు, గ్రీకు పురాణ గాధలు చందమామ కథల చరిత్రలో మకుటాయమానంగా నిలిచి ఈనాటికీ పాఠకుల ఆదరణ పొందుతూ వస్తున్నాయి.

చందమామలో దయ్యాల కథలు కూడా పుష్కలంగా ఉండేవి. కాని, అవి పిల్లల్లో మూఢ నమ్మకాలను పెంచేవిగా ఉండేవి కావు. దయ్యాలంటే సామాన్యంగా భయం ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు. అయితే, చందమామలోని కథలు అటువంటి కారణంలేని భయాలను పెంచి పోషించేట్లుగా ఉండేవి కావు. చందమామ కథల్లో ఉండే దయ్యాల పాత్రలు ఎంతో సామాన్యంగా, మనకి సరదా పుట్టించేట్లుగా ఉండేవి. అవి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దాం అనిపించేది.

దయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి గానీ పిల్లలను భయభ్రాంతులను చేసేట్లు ఉండేవి కాదు. సామాన్యంగా దయ్యాల పాత్రలు రెండు రకాలుగా ఉండేవి – ఒకటి, మంచివారికి సాయం చేసే మంచి దయ్యాలు, రెండు, కేవలం సరదా కోసం తమాషాలు చేసే చిలిపి దయ్యాలు. తెలుగు నాట దెయ్యాల కథలకు విశేష గౌరవం కల్పించిన ఘనత చందమామది.

మనుషులకు సహాయం చేసే దెయ్యాలు, రాక్షసులు, మనిషి కష్టాలు సుఖాలలో తోడు వచ్చే దెయ్యాలు చందమామ కథల్లో తప్ప ఇంకెక్కడ ఉంటాయి. అందుకే అప్పటి దెయ్యాల కథలను చందమామ పాఠకులు ఈనాటికీ గుండెలకు హత్తుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

“దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.”

చందమామ చిత్రాలు

తెలుగు సాహిత్యం చదివిన వారిలో ” చందమామ “, ” యువ ” పత్రికలు కొంతవరకైనా చదవని వారు ఉండరు. కాలానుగుణముగా ఈ పత్రికలకు లక్షల అభిమానులను సంపాయించుకున్నాయి. అవి అంత జనాదరణ పొందడానికి కారణం చక్కటి కధలు, వాటితో ఉండే సందర్భోచిత కధా చిత్రాలు. ముఖ చిత్రం కూడ తనదైన శైలిలో ప్రత్యేకత ఉట్టిపడుతూంటుంది.

ఆ ఊహా చిత్రాలను తమ మనస్సులోంచి, కుంచెతో రూపుదిద్ది జీవం పోసిన చందమామ చిత్రకారులు చిత్రా, వడ్డాది పాపయ్య (వపా), ఎంటీవీ ఆచార్య, శంకర్ గార్లు. దాదాపు అరవై ఏళ్ళ పాటు – ” చందమామ ” పత్రిక ముఖ చిత్రాలు, కధా చిత్రాల ద్వారా వీరు తమ కుంచెతో చిత్రకళాద్భుతాలు సృస్టిస్తూ కధలను కళ్ళకి కడుతూ దేశంలో చదువరుల అభిమానాన్ని సంపాయించుకుంటూ వచ్చారు.

తెలుగు చదువరులు మరచిపోలేని ” చందమామ – ముఖ చిత్రాలు ” వీరి చిత్రకళా సృష్టే. చందమామ పత్రిక ముఖ చిత్రాలు, విభిన్న కధా చిత్రాలు రూపొందించి, చదువరులను, విశేషించి వారి అభిమానాన్ని ఆకట్టుకున్నారు. ఒకటా రెండా… ఏకంగా 63 సంవత్సరాలుగా వీరి చిత్రాలు చందమామను అలరిస్తూ వస్తున్నాయి. చందమామను పోలిన అనేక పత్రికలు చోటు చేసుకున్నా, చందమామ ప్రత్యేక దృక్పథాన్ని, పరంపరను సాధించలేక పోయాయి.

దివ్య పురుషులను, దేవతలను కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించిన వపా… మహాభారతం పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన ఆచార్య, రామాయణం తదితర పౌరాణిక గాధలకు అద్వితీయమైన చిత్రాలు గీయడమే కాక బేతాల కథల చిత్రకారుడిగా యావద్దేశాన్ని మురిపిస్తున్న శంకర్, జానపద చిత్రలేఖన శైలీ విన్యాసంతో చందమామ చిత్రకారులలోనే అద్వితీయుడిగా నిలిచిన చిత్రా… వీరితో పాటు రాజీ, జయ..  చందమామ కీర్తిప్రతిష్టల చరిత్రలో వీరు కలికితురాయిలు.

గత 57 ఏళ్లుగా చందమామలో కొనసాగుతూ సహచరుల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్న శంకర్ గారు ఒకే పత్రికలో దాదాపు ఆరుదశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్న అరుదైన గౌరవాన్ని పొందుతున్నారు. చందమామ చిత్రకారుల చిత్రాలు కధలను కళ్ళకి కడతాయి. తెలియకుండానే చదువరుల హృదయం ఆకట్టుకుంటూ, మనసులను రంజింపజేస్తాయి.

ఆన్‌లైన్‌‍లో చందమామ భాండాగారం

భారతీయ కథా సాహిత్యంలో ఇంతటి ఘనతర చరిత్రను సాధించిన చందమామ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా లభ్యమవుతున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో పాఠకులు చదవడానికి వీలుగా రూపొందించిన చందమామ కథలు ఆనాటి, నేటి పాఠకులకు సమానంగా కనువిందు చేస్తూ భారతీయ పాఠకుల కథల దాహాన్ని తీరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

చందమామ పాతకాపీలు లేనివారు, అప్పట్లో తీసుకుని కూడా పోగొట్టుకున్నవారు. నేటి తరాలకు చెందిన పిల్లలు, పెద్దలు కూడా చందమామ పాత కథలకు ఆన్‌లైన్ చందమామ భాండాగారం -ఆర్కైవ్స్- లో చూడవచ్చు. ఈ మహత్తర కృషికి గత సంవత్సరం నాంది పలికిన తర్వాత నేటికి, ప్రారంభం సంచిక -1947- నుంచి 2000 సంవత్సరం చివరివరకు తెలుగు తదితర పది భారతీయ భాషల్లో చందమామలు ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్ విభాగంలో పాఠకులకు అందించడం జరిగింది. త్వరలో 2008 వరకు కూడా చందమామలను ఆన్‌లైన్‌లో అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చందమామ పాఠకులారా..! రండి మనదైన జాతి సంపదను ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచడానికి చందమామ చేసిన కృషిని స్వీకరించండి. ప్రపంచ ప్రచురణా రంగ చరిత్రలోనే తన పాఠకులకు 53 ఏళ్ల పాత సంచికలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన అరుదైన పత్రిక చందమామే అని ఈ సందర్భంగా సవినయంగా గుర్తు చేస్తున్నాం.

మీ చందమామను, మన చందమామను ఎప్పటిలాగే ఆదరిస్తారని, మీ పిల్లలకు, భవిష్యత్ తరాల పిల్లలకు చందమామ పత్రికను అరుదైన బహుమతిగా పంచిపెడుతూ వస్తారని మనసారా ఆశిస్తున్నాం

పది భారతీయ భాషల్లో -తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడం, మరాఠీ, మలయాళం, ఒరియా, బెంగాలీ, సంస్కృతం- చందమామలను ఆన్‌లైన్ భాండాగారంలో చూడడానికి కింది లింకుపై క్లిక్ చేయండి. మీ భాషను, సంవత్సరాన్ని, నెలను ఎంపిక చేసుకుని ఇష్టమైన చందమామ కథను ఆస్వాదించండి

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

సమస్త భారత పాఠక లోకానికి, చందమామ ప్రియులకు ఇదే చందమామ ఆహ్వానం.

దయచేసి మీ అభిప్రాయాన్ని, సూచనలను కింది లింకుకు  పంపండి.

abhiprayam@chandamama.com

చందమామ పాఠకులకు, అభిమానులకు, కథల ప్రేమికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…

RTS Perm Link