మామా! మమ్మల్ని మర్చిపోవు కదూ!

December 2nd, 2009

“మామా! మారుతున్న కాలానికి అనుగుణంగా నువ్వు కూడా మారాలని ప్రయత్నిస్తున్నావు కదూ! కాని ఒక్కటి మాత్రం నిజం. ఈ నాటి చాలా మంది ‘టెక్నో పిల్లలు’ జానపద లోకాలలో కాక-సాంకేతిక లోకాలలో విహరిస్తున్నారు. మరి వారికి అనుగుణంగా నువ్వూ మారాలని అనుకోవడం- పొరపాటు కాదేమో! కానీ మామా! యాభై ఏళ్లుగా నీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ- నీ స్నేహ మాధుర్యాన్ని అనుభవించినవాళ్లం. మేము కూడా ఉన్నామని గుర్తుంచుకుంటావా? మమ్మల్ని కూడా అలరించాలని ప్రయత్నిస్తావు కదూ!”

ఇది చందమామ డిసెంబర్ సంచికలో శివకుమార్ అనే కొంపల్లి పాఠకుల లేఖా పలకరింపు. చందమామలో వస్తున్న ఆధునిక రీతుల పట్ల ఆగ్రహం ప్రకటిస్తున్న పాఠకుల స్పందనలకు కాస్త భిన్నంగా… గతాన్ని, ఆనాటి పాఠకుల అభిరుచులను కాస్త పట్టించుకోవలిసిందిగా కోరుతూ ఈయన చందమామకు ఉత్తరం పంపడానికి ముందే చందమామ మళ్లీ పాత రూపంలోకి మారింది.

పాఠకుల అభిప్రాయాలకు, విమర్శలకు, ఆగ్రహ ప్రకటనలకు తలొగ్గిన చందమామ మళ్లీ కథల పత్రికగా మారుతోంది. ఇంకా మారవలసి ఉందనుకోండి. కథా విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పాఠకులు కోరుకుంటున్న పాత అభిరుచులకే పట్టం గడుతూ చందమామ మారుతోంది. మళ్లీ పూర్వ రూపానికి క్రమక్రమంగా పరిణమిస్తోంది.

ఈ డిసెంబర్ సంచికలో నమ్మలేని విధంగా నాలుగు చిన్న కథలు, ఒక జానపద కథ, ఒక హాస్య కథ, 25 ఏళ్లనాటి చందమామ కథ, రామాయణం, బేతాళ కథలు, పాతాళదుర్గం ధారావాహికలతో చందమామ కథల పత్రికగా నిండుగా ముస్తాబైంది.

వీటితోపాటుగా అలనాటి చందమామ పాఠకులను రంజింపచేసిన పంచతంత్రం కథలు మళ్లీ చందమామలో అచ్చవుతున్నాయి. సరిగ్గా ఈ డిసెంబర్ నుంచే ఈ కథల ముద్రణ ప్రారంభమైంది. విష్ణుశర్మ, అతడి శిష్యులతో వడ్డాది పాపయ్య గారి ముఖచిత్రం రంగులీనుతూ డిసెంబర్ చందమామను కాంతివంతం చేసింది.

‘మామా! యాభై ఏళ్లుగా నీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ- నీ స్నేహ మాధుర్యాన్ని అనుభవించినవాళ్లం. మేము కూడా ఉన్నామని గుర్తుంచుకుంటావా? మమ్మల్ని కూడా అలరించాలని ప్రయత్నిస్తావు కదూ!’ అంటూ పాఠకుడు శివకుమార్ వెల్లడించిన చిరుకోరికతో చందమామ మమేకమవుతోంది.

యాభై ఏళ్లుగా తన స్నేహమాధుర్యంతో పరవశించిన పాఠకులను పోగొట్టుకునేది లేదని ఘంటాపధంగా చందమామ ప్రకటిస్తూ మీ ముందుకు వస్తోంది. ఇది ఆరంభం మాత్రమే… కొత్త సంవత్సరంలో మరిన్ని మార్పులతో మీ ముందుకు రావడానికి చందమామ తొలి అడుగులు వేసింది.

మునుపటి లాగే మీ ఆదరణ, అభిమానాలను కోరుకుంటూ…
చందమామ.

గమనిక: పంచతంత్ర కథల పరిచయం కోసం ఈ బ్లాగులో నిన్న పోస్ట్ చేసిన “చందమామ – పంచతంత్ర కథలు” చదవండి.

RTS Perm Link