ఆన్‌లైన్‌లో 53 ఏళ్ల చందమామలు

December 31st, 2009

First issue cover of TELUGU

చందమామ కథలు

“భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి.”

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారి 12 అద్వితీయ ధారావాహికలు, (తోకచుక్క, శిధిలాలయం, రాకాసిలోయ, యక్షపర్వతం, పాతాళదుర్ఘం వగైరా) 55 ఏళ్లుగా చందమామలో నిరవధికంగా ప్రచురితమవుతున్న బేతాళకథలు, పరోపకారి పాపన్న, తాతయ్య చెప్పిన కథలు, గుండుభీమన్న, సాహసయాత్రలు, గ్రీకు పురాణ గాధలు చందమామ కథల చరిత్రలో మకుటాయమానంగా నిలిచి ఈనాటికీ పాఠకుల ఆదరణ పొందుతూ వస్తున్నాయి.

చందమామలో దయ్యాల కథలు కూడా పుష్కలంగా ఉండేవి. కాని, అవి పిల్లల్లో మూఢ నమ్మకాలను పెంచేవిగా ఉండేవి కావు. దయ్యాలంటే సామాన్యంగా భయం ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు. అయితే, చందమామలోని కథలు అటువంటి కారణంలేని భయాలను పెంచి పోషించేట్లుగా ఉండేవి కావు. చందమామ కథల్లో ఉండే దయ్యాల పాత్రలు ఎంతో సామాన్యంగా, మనకి సరదా పుట్టించేట్లుగా ఉండేవి. అవి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దాం అనిపించేది.

దయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి గానీ పిల్లలను భయభ్రాంతులను చేసేట్లు ఉండేవి కాదు. సామాన్యంగా దయ్యాల పాత్రలు రెండు రకాలుగా ఉండేవి – ఒకటి, మంచివారికి సాయం చేసే మంచి దయ్యాలు, రెండు, కేవలం సరదా కోసం తమాషాలు చేసే చిలిపి దయ్యాలు. తెలుగు నాట దెయ్యాల కథలకు విశేష గౌరవం కల్పించిన ఘనత చందమామది.

మనుషులకు సహాయం చేసే దెయ్యాలు, రాక్షసులు, మనిషి కష్టాలు సుఖాలలో తోడు వచ్చే దెయ్యాలు చందమామ కథల్లో తప్ప ఇంకెక్కడ ఉంటాయి. అందుకే అప్పటి దెయ్యాల కథలను చందమామ పాఠకులు ఈనాటికీ గుండెలకు హత్తుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

“దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.”

చందమామ చిత్రాలు

తెలుగు సాహిత్యం చదివిన వారిలో ” చందమామ “, ” యువ ” పత్రికలు కొంతవరకైనా చదవని వారు ఉండరు. కాలానుగుణముగా ఈ పత్రికలకు లక్షల అభిమానులను సంపాయించుకున్నాయి. అవి అంత జనాదరణ పొందడానికి కారణం చక్కటి కధలు, వాటితో ఉండే సందర్భోచిత కధా చిత్రాలు. ముఖ చిత్రం కూడ తనదైన శైలిలో ప్రత్యేకత ఉట్టిపడుతూంటుంది.

ఆ ఊహా చిత్రాలను తమ మనస్సులోంచి, కుంచెతో రూపుదిద్ది జీవం పోసిన చందమామ చిత్రకారులు చిత్రా, వడ్డాది పాపయ్య (వపా), ఎంటీవీ ఆచార్య, శంకర్ గార్లు. దాదాపు అరవై ఏళ్ళ పాటు – ” చందమామ ” పత్రిక ముఖ చిత్రాలు, కధా చిత్రాల ద్వారా వీరు తమ కుంచెతో చిత్రకళాద్భుతాలు సృస్టిస్తూ కధలను కళ్ళకి కడుతూ దేశంలో చదువరుల అభిమానాన్ని సంపాయించుకుంటూ వచ్చారు.

తెలుగు చదువరులు మరచిపోలేని ” చందమామ – ముఖ చిత్రాలు ” వీరి చిత్రకళా సృష్టే. చందమామ పత్రిక ముఖ చిత్రాలు, విభిన్న కధా చిత్రాలు రూపొందించి, చదువరులను, విశేషించి వారి అభిమానాన్ని ఆకట్టుకున్నారు. ఒకటా రెండా… ఏకంగా 63 సంవత్సరాలుగా వీరి చిత్రాలు చందమామను అలరిస్తూ వస్తున్నాయి. చందమామను పోలిన అనేక పత్రికలు చోటు చేసుకున్నా, చందమామ ప్రత్యేక దృక్పథాన్ని, పరంపరను సాధించలేక పోయాయి.

దివ్య పురుషులను, దేవతలను కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించిన వపా… మహాభారతం పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన ఆచార్య, రామాయణం తదితర పౌరాణిక గాధలకు అద్వితీయమైన చిత్రాలు గీయడమే కాక బేతాల కథల చిత్రకారుడిగా యావద్దేశాన్ని మురిపిస్తున్న శంకర్, జానపద చిత్రలేఖన శైలీ విన్యాసంతో చందమామ చిత్రకారులలోనే అద్వితీయుడిగా నిలిచిన చిత్రా… వీరితో పాటు రాజీ, జయ..  చందమామ కీర్తిప్రతిష్టల చరిత్రలో వీరు కలికితురాయిలు.

గత 57 ఏళ్లుగా చందమామలో కొనసాగుతూ సహచరుల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్న శంకర్ గారు ఒకే పత్రికలో దాదాపు ఆరుదశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్న అరుదైన గౌరవాన్ని పొందుతున్నారు. చందమామ చిత్రకారుల చిత్రాలు కధలను కళ్ళకి కడతాయి. తెలియకుండానే చదువరుల హృదయం ఆకట్టుకుంటూ, మనసులను రంజింపజేస్తాయి.

ఆన్‌లైన్‌‍లో చందమామ భాండాగారం

భారతీయ కథా సాహిత్యంలో ఇంతటి ఘనతర చరిత్రను సాధించిన చందమామ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా లభ్యమవుతున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో పాఠకులు చదవడానికి వీలుగా రూపొందించిన చందమామ కథలు ఆనాటి, నేటి పాఠకులకు సమానంగా కనువిందు చేస్తూ భారతీయ పాఠకుల కథల దాహాన్ని తీరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

చందమామ పాతకాపీలు లేనివారు, అప్పట్లో తీసుకుని కూడా పోగొట్టుకున్నవారు. నేటి తరాలకు చెందిన పిల్లలు, పెద్దలు కూడా చందమామ పాత కథలకు ఆన్‌లైన్ చందమామ భాండాగారం -ఆర్కైవ్స్- లో చూడవచ్చు. ఈ మహత్తర కృషికి గత సంవత్సరం నాంది పలికిన తర్వాత నేటికి, ప్రారంభం సంచిక -1947- నుంచి 2000 సంవత్సరం చివరివరకు తెలుగు తదితర పది భారతీయ భాషల్లో చందమామలు ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్ విభాగంలో పాఠకులకు అందించడం జరిగింది. త్వరలో 2008 వరకు కూడా చందమామలను ఆన్‌లైన్‌లో అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చందమామ పాఠకులారా..! రండి మనదైన జాతి సంపదను ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచడానికి చందమామ చేసిన కృషిని స్వీకరించండి. ప్రపంచ ప్రచురణా రంగ చరిత్రలోనే తన పాఠకులకు 53 ఏళ్ల పాత సంచికలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన అరుదైన పత్రిక చందమామే అని ఈ సందర్భంగా సవినయంగా గుర్తు చేస్తున్నాం.

మీ చందమామను, మన చందమామను ఎప్పటిలాగే ఆదరిస్తారని, మీ పిల్లలకు, భవిష్యత్ తరాల పిల్లలకు చందమామ పత్రికను అరుదైన బహుమతిగా పంచిపెడుతూ వస్తారని మనసారా ఆశిస్తున్నాం

పది భారతీయ భాషల్లో -తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడం, మరాఠీ, మలయాళం, ఒరియా, బెంగాలీ, సంస్కృతం- చందమామలను ఆన్‌లైన్ భాండాగారంలో చూడడానికి కింది లింకుపై క్లిక్ చేయండి. మీ భాషను, సంవత్సరాన్ని, నెలను ఎంపిక చేసుకుని ఇష్టమైన చందమామ కథను ఆస్వాదించండి

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

సమస్త భారత పాఠక లోకానికి, చందమామ ప్రియులకు ఇదే చందమామ ఆహ్వానం.

దయచేసి మీ అభిప్రాయాన్ని, సూచనలను కింది లింకుకు  పంపండి.

abhiprayam@chandamama.com

చందమామ పాఠకులకు, అభిమానులకు, కథల ప్రేమికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…

RTS Perm Link

చందమామ తోడుగా పెరిగి పెద్దవాడినయ్యా!

December 20th, 2009

chandamama beemboy

పల్లెల్లో పూర్వం లంకెబిందెలు బయటపడినట్లుగా తెలుగునేలలో ఈ నాటికీ అటకలమీదనుంచి, పాత భోషాణాల్లోంచి పాత చందమామ సంచికలు బయటపడుతున్నాయి. అదీ కూడా 1960ల నాటి అపురూపమైన చందమామలు. వార్త వింటూనే ఉన్న మతి పోతున్న స్థితి. కొందరికి భాగ్యం అనేది ఈ రూపంలో కూడా లభిస్తుండగా, మరి కొందరికి ఉన్న సంపదలు ఊడిపోతున్నాయి.
 
హైదరాబాద్‌ నివాసి, కన్సల్టెంట్ కృష్ణబాలు గారి కథ ఇది. చందమామ అంటేనే వెర్రెత్తిపోయే ఈ కథల ప్రేమికుడు తాను అపరూపంగా దాచుకున్న చందమామ బౌండ్ పుస్తకాలను మొత్తంగా తన బంధువొకరు తస్కరించేశాడని వాపోతున్నాడు. ఆరోజునుంచి తనకు ఒక పాత చందమామ కూడా కనిపించలేదట.

సాహిత్య అభిమాని శివరామ్ ప్రసాద్ గారు ఆరు నెలల క్రితం ఈయనను సులేఖ బ్లాగులో పట్టుకుని చందమామలు తిరిగి సేకరించుకునే వెసలుబాటు గురించి మెయిల్ చేసేంతవరకు ఈయనది నిరాశా ప్రపంచమే. భూమి గుండ్రంగా ఉన్నది చందాన ఆయన ఇప్పుడు పోయిన చోటే సంపదలను తిరిగి వెతుక్కుంటున్నారు.

ఈయన 2007 అక్టోబర్ 11న తన బ్లాగులో పోస్ట్ చేసిన ఆంగ్ల కథనం దీనికి మూలం.

చందమామ తోడుగా తను పుట్టి పెరుగుతూ వచ్చానని అంటూ కృష్ణ బాలు గారు చెబుతున్న ఆ చందమామ జ్ఞాపకాల దొంతరను మనమూ విందామా!

అనువాదం మూలాన్ని I grew with Chandamama! అన్న ఆన్‌లైన్ స్టోరీ నుంచి తీసుకోవటమైంది.

చందమామ తోడుగా పెరిగి పెద్దయ్యా! అనే ఈ కథనం పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడండి.

చందమామ తోడుగా పెరిగి పెద్దవాడినయ్యా!

ఎంత మంచి రోజు. ఈ రోజు శుభవార్తతో నిద్రలేచా. అయితే ఇది రాజకీయ వార్త కాదు ఆధ్యాత్మిక వార్త అంతకంటే కాదు. నా జీవితాన్ని వెలిగించేటటువంటి మంచి వార్త.

చందమామ ప్రచురణల పునరుద్ధరణ వార్త. నిజంగా అచ్చెరువు గొల్పే వార్తే. చెన్నయ్ నుంచి వస్తున్న ఈ పిల్లల (నిజానికి కాదు) మాస పత్రిక 1950, 60, 70, 80ల కాలంలో దక్షిణ భారత దేశంలోని లక్షలాది కుటుంబాలపై చెరగని ముద్ర వేసింది.

చందమామ అంటే పడి చస్తాను. చందమామ తోడుగా పెరుగుతూ వచ్చాను మరి. చందమామ కథలు నన్ను ఉత్తేజపర్చి, బోధించి, మనిషిగా నిలబెట్టాయి. నన్ను సంతోషపెట్టాయి. నా ఊహా ప్రపంచంలో ఓ భాగమయ్యాయి. పిల్లల్లో సహజసిద్ధంగా ఉండే కాల్పనిక ప్రపంచపు ఊహలను ఆవి సంతృప్తి పర్చాయి. ఒక హ్యారీ పోటర్‌, ఓ ఎనిడ్ బ్లైటన్‌ కథల్లా అవి నేటి తరం పిల్లలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుత్తున్నాయి.

చందమామ కథలు నీతి నియమాలను సర్వ సాధారణ రీతిలో బోధిస్తాయి. ప్రతి చందమామ కథలోని సారాంశం మనలో మంచి భావాలను పెంచి పోషిస్తూ వచ్చింది. చాలా వరకు ఇదంతా స్వచ్చందంగా జరుగుతూ వచ్చింది. చందమామ కథలు మా చిరు హృదయాలను తట్టిలేపాయి. అవి ఇప్పటికీ మాలో పనిచేస్తూనే ఉన్నాయి. జీవితం చివరి క్షణాల వరకు చందమామ కథలు మనలో నిండే ఉంటాయి.

పల్లె సీమల గురించిన మన అవగాహనను, జాతి మహత్తర సంస్కృతిని, నాగరికతను చందమామ కథలు మరింత ఉద్దీప్తం చేశాయి. మన ప్రాచీన మేధో సంపదను కథ రూపంలో చందమామ మనముందుకు తీసుకువచ్చింది. అదే సమయంలో చందమామ కథలు మూఢనమ్మకాలు, దురాచారాల గురించి పిల్లల మనస్సులను నిరంతరం హెచ్చరిస్తూ వచ్చాయి.

తెలుగు జాతీయాలు, పదజాలం, అక్షరదోషాలను గురించి చందమామ కథలే మనకు బోధిస్తూ వచ్చాయి. నిజం చెప్పాలంటే పాఠశాల సిలబస్ కంటే చందమామే మన మాతృభాషను ఎక్కువగా బోధిస్తూ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

పైగా, చందమామ కథల్లోని ఇతివృత్తం కాలుష్యానికి, వాదప్రతివాదాలకు, పస లేని సూక్తులకు, అన్నిటికి మించి కుహనా సిద్ధాంతాలకు చాలా దూరంగా ఉండేది.

అదే సమయంలో పిల్లల మెదళ్లకు మేతపెట్టే అద్బుత కల్పనలకు చందమామ కథలు నెలవుగా ఉండేవి.

ప్రతి చందమామ ధారావాహిక కూడా ‘ఇంకా ఉంది’ అనే పేరుతో ముగిసేది.

ఇది పిల్లల్లో ఉత్సాహాన్ని, ఆత్రుతను మరింతగా పెంచి మరుసటి నెల పత్రిక కోసం వారు ఆబగా ఎదురుచూసేలా చేసేది.

పాతాళదుర్గం, రాకాసిలోయ, దుర్గేశనందిని, నవాబు నందిని వంటి ధారావాహికలతో సరితూగగలిగే సీరియళ్లు నేటి కాలంలో కలికానికైనా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా అవి ఆరోజుల్లో మమ్మల్ని కట్టిపడేశాయి. మర్యాద రామన్న కథలు, గుండు భీమన్న కథలు, పరోపకారి పాపన్న కథలు వంటి కథలు మాలో సద్బుద్ధులను పెంచి పోషించేవి.

వీటన్నిటికి మించి చందమామ ముద్రించే అద్భుత చిత్రాలు సంవత్సరాలుగా మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వచ్చాయి. సాటిలేని చిత్రకారులు చిత్ర, శంకర్ నిర్విరామంగా గీస్తూ వచ్చిన చిత్రాలు, డ్రాయింగులు మమ్మల్ని అద్భుతలోకాలకు తీసుకెళ్లేవి.

ఎంతో వ్యయప్రయాసలకు లోనైప్పటికీ పలు సంవత్సరాల చందమామ బైండు కాపీలను నేను పొందగలిగాను. కాని మా బంధువు ఒకరు వాటిని మొత్తంగా తస్కరించారు. ఆనాటి నుంచి చందమామ పాత కాపీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నా వద్ద లేవు.

అయినప్పటికీ నా చందమామ జ్ఞాపకాలను ఇప్పటికీ మనసులో గుర్తు చేసుకుంటూ సంతోషపడుతుంటాను. చివరకు నా బ్లాగులో ఉంచిన కొన్ని కథలు సైతం చందమామ నుంచి తీసుకున్నవే.

థ్యాంక్యూ మామా, తెలుగు చందమామ ప్రింట్ కాపీ నా చేతికి వచ్చే క్షణంకోసం నేను వేచి ఉంటున్నా…

కృష్ణ బాలు – 2007

RTS Perm Link

చందమామ : ఓ పరామర్శ

December 4th, 2009

ఇది చందమామలో ‘ఆర్కైవ్‌లు’ అనే పదాన్ని తెలుగు చేయడానికి సంబంధించి ఈ మధ్యే ఓ మిత్రుడితో జరిగిన ఈమెయిల్ చర్చ. ఈ చర్చలో చందమామకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు రావడంతో వాటిని ఇక్కడ పొందుపర్చడమైంది. ఈ కథనంలో ముద్దక్షరాలతో ఉన్న భాగాలు మా మిత్రుడి వ్యాఖ్యలని గుర్తించాలి.

రావు గారూ,
 
ఆన్‌లైన్ చందమామలోని ఆర్కైవ్‌లు అనే పదప్రయోగంపై మీ జోడింపుకు ధన్యవాదాలు. అది కధల భాండాగారానికి ఆంగ్ల పదం. తెలుగు పదాన్ని కేటగిరీగా ఉంచాలనుకున్నా మొదట్లో స్పేస్ అందుకు అనుమతించడం లేదని ఆర్కైవ్ అనే పదాన్నే ఎంచుకోవడం జరిగింది.తర్వాత సాంకేతిక కారణాలతో అది అలాగే కొనసాగుతూ వస్తోంది. ఆర్కైవ్స్ అంటే మరీ ఇంగ్లీషులాగా ఉంటుందని ఎస్‌కు బదులు ‘లు’ తగిలించి ఆర్కైవ్‌లు అని ఉంచడమైంది. ఇది మన డుమువుల తంటా అనుకోండి.
 
ఈ కథల భాండాగారంలో 1947 నుంచి 90 వరకు వచ్చిన చందమామ కథలు అలాగే ఆన్‌లైన్ పుస్తక రూపంలో లభ్యమవుతాయి. త్వరలో 2000 సంవత్సరం వరకు కథలను దీంట్లో అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

“నాకు తెలిసి తెలుగు బాగా బతికి బట్టకడుతున్నది బహుశా… మీ ‘చందమామ’ వంటి పత్రికల్లోనే”

“మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు… ఇక్కడే మేం ఇంకా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని పనిచేయవలసి ఉంటుంది. అక్షర దోషం లేకుండా, తప్పులు లేకుండా, పిల్లలు, పెద్దలు ఇష్టపడే విషయాలు ఏవీ వదలకుండా, ముఖ్యంగా చందమామ పట్ల పాతతరం వారి మనోభావాలు దెబ్బతినకుండా.. పత్రికను నడపడం అంటే చాలా కష్టమే. పాత కంటెంట్ వద్దు నూతన తరాల అభిరుచులకు అనుగుణమైన చందమామ రావాలి అనే యాజమాన్యం వైఖరికి, పాత కథలే మాకు ముద్దు.. అవే వెయ్యండి అనే పాత తరం పాఠకులకు మధ్య చందమామ ప్రస్తుతం నలుగుతోంది.

సరైన సమయంలోనే దీంట్లోకి అడుగుపెట్టాననుకోండి. ఎవరివైపు మొగ్గితే ఎవరికి కోపం వస్తుందో.. ఇరు పక్షాల మధ్య బ్యాలెన్స్‌గా నడవడం నేర్చుకోవాలిప్పుడు. నిజంగా చందమామ పాఠకులు, వారి లేఖలు, పత్రికలో కొత్తదనం పేరిట జరుగుతున్న మార్పులపై అలనాటి పాఠకుల శాపనార్ధాలు ఇవన్నీ చూస్తుంటే కొత్త లోకంలో అడుగుపెట్టినట్లే ఉంది లెండి. ఏమయినా మరోవైపు భయం కూడా ఉంది.”

“ఒకటి మాత్రం నిజమండీ,. చందమామ కలెకర్స్ ఎడిషన్ కోసం కథలు అనువాదం చేయవలసి వచ్చినప్పుడు అదో కొత్త అనుభవం. ఇంగ్లీష్ ముక్క వాడకుండా ఆ మధ్యయుగాల రాజూ రాణీల కథలు తెలుగు చేయాలి. సాధ్యమా అనుకున్నాను. కానీ పుటలు నడిచే కొద్దీ సంపూర్ణ తెలుగు అనువాదం వంట బట్టిందనుకోండి. ఇలా రాయలేమేమో అని భయపడ్డాను. కాని అలా కూడా రాయవలసిన అవసరం నాకు చందమామే నేర్పిందనుకోండి.”

“చందమామ మాత్రమే కాదనుకోండి. అయితే భాష, విషయం వరకు చూస్తే మూడు నాలుగు తరాల పిల్లలు, పెద్దలపై చందమామ ప్రభావం చరిత్రలో నిలిచిపోయేలాగే ఉంది. 10 సంవత్సరాల వయసులో చందమామ చదవడం మొదలు పెట్టిన వారు ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో కూడా చందమామలను ఆప్యాయంగా కొని చదువుతూ రేపటి తరం పిల్లల కోసం భద్రపరుస్తూ వస్తున్న తీరు ప్రపంచ చరిత్రలోనే ఏ పత్రిక విషయంలోనూ జరిగి ఉండదనుకుంటాను.

ఇలాంటి ఘటనలు ఒకటీ రెండూ కాదు. వందల మంది పాత తరం పిల్లలు నేటి పెద్దలు చందమామతో తమ అనుబంధాన్ని ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఇన్ని సమస్యల మధ్య కూడా చందమామ ఇంకా బతికి ఉందంటే అది ఇలాంటి ఘనతర పాఠకుల వల్లేననిపిస్తోంది.”

“గత రెండు మూడు నెలలుగా చందమామ అభిమానులైన బ్లాగర్లతో పరిచయాలు పెంచుకుని, అభిప్రాయాలు పంచుకుని బ్లాగురూపంలో వ్యక్తిగతంగా నేను చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి. చందమామ అభిమానుల ఆదరణ సాక్షిగానే నా పర్సనల్ బ్లాగు చందమామకే అధికారిక బ్లాగుగా మారింది. ఇంతకుమించిన గౌరవం ఇంకేం కావాలి.

ఇప్పుడు చందమామ బ్లాగు చందమామ అభిమానులు నిత్యం పంచుకునే వేదికగా మారింది. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు చందమామ బ్లాగును దానిలోని వంద కథనాల్లో తమకు నచ్చినదాన్ని చూస్తున్నారు. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంతకు మించి నా బ్లాగుకు,నా జీవితానికి ఏం కావాలి?”

“మచిలీ పట్నం సమీపంలోని ఓ గ్రామీణ ప్రాంతం నుంచి వారం క్రితం ప్రభావతి అనే ఓ చందమామ చందాదారు ఉత్తరం పంపారు. మారుమూల ప్రాంతమేమో మరి.. పిన్ నంబర్ వేయలేదు. నేరుగా మాట్లాడడానికి మొబైల్, ల్యాండ్ లైన్ నంబర్లు పొందుపర్చలేదు. పైగా తమ చందా నెంబర్ కూడా వేయలేదు.వీరు రామాయణం సీరియల్ కోసమే చందమామకు చందా కట్టారట. కానీ ఈ సంవత్సరం దాదాపు నాలుగైదు నెలల చందమామలు వారికి చేరలేదట.నవంబర్ సంచిక కూడా రాలేదు.పైగా ఫిబ్రవరి నెల ఇంగ్లీష్ చందమామ అందిందట. రామాయణం సీరియల్ కోసం చందమామను తెప్పించుకుంటుంటే ఇంగ్లీష్ చందమామను ఏం చేసుకోనూ అని ఆమె బాధ.

ఆమె గతంలో చందమామలు రానప్పుడు వెంటనే ఆఫీసుకు  ఉత్తరం పంపారో నాకు తెలీదు. ఆ ఉత్తరం చూసిన వెంటనే వివరాలను సంబంధిత చందమామ విభాగానికి మెయిల్ చేస్తూ వీలయితే వారు పొందకుండా పోయిన అన్ని చందమామలను వారికి ప్రత్యేక మినహాయింపు కింద పంపవలసిందిగా సూచించాను. గ్రామీణ ప్రాంతం నుంచి చందమామ  తెప్పించుకుంటున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయమని ఇటువంటి వారిని చందమామ ఎన్నటికీ పోగొట్టుకోకూడదని,  కారణాలేవయినా సరే.. వారికి పరిహారంగా ఆ చందమామలను త్వరలో పంపాలని సలహా ఇచ్చాను.ప్యాకింగ్ విభాగం వారు సానుకూలంగా స్పందించారనుకోండి.”
 
“…రావు గారూ, నాదో చిన్న కోరిక. మీ పిల్లలకు చందమామ కొనిపిస్తారా లేదా. అయితే ఎప్పుడు? దీన్ని పోటీ పత్రిక లేదా సైట్‌గా చూడవద్దండి. చందమామ మన జాతి సాంస్కృతిక సంపద. తరాలు గడిచినా అది పిల్లలను పెద్దలను ఆకట్టుకుంటూనే ఉంది. పరాయి రాష్ట్రంలో ఉన్నప్పటికీ మీ పిల్లలు కూడా చందమామ పాఠకులుగా అయితే బాగుంటుందేమో కదూ.. ఆలోచించండి..”

“మా పిల్లలకు చందమామ. ముందు వారికి నేను తెలుగు నేర్పాలి. మీ పత్రిక కోసమైనా నేర్పుతాను. అలాగైనా పరాయి రాష్ట్రంలో పరాయి భాషను నేర్చుకుంటున్న మా పిల్లలు పరాయి రాష్ట్రంవారు కాకుండా తెలుగువారుగానే ఉంటారు. మరొక విషయం ఏమిటంటే భవిష్యత్ దర్పణంలో తమిళనాడులో తెలుగుకు “తెగులు” ఏ స్థాయిలో ఉండబోతోందోనన్న ఆందోళన కూడా నాలో కలిగింది. కానీ ఏం చేద్దామండీ.”

“…తమిళనాడులో తెలుగు నేర్చుకున్న వారు ఒక రకంగా శాపగ్రస్తులే. వారిలో కష్టపడే తత్వం, ర్యాంకులు తెచ్చుకునే సామర్థ్యం ఉన్నా ఇది సరైందా, తప్పా అనే భాషా పరిజ్ఞానం లేకుండానే వారి జీవితంలో తదుపరి దశల్లోకి పోతున్నారు. ఇదే వారిని చివరివరకూ వెంటాడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే, తమిళనాడులో అంతంతమాత్రంగానే తెలుగు పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ మరికాస్త కరువైతే వచ్చే తరాల పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో ఊహించడం కూడా సాధ్యం కాదు. పరాయిరాష్ట్రంలో తెలుగు నేర్చుకోలేని వారి దౌర్భాగ్యం ఇది.  వాళ్ల చేతుల్లో లేని దానికి,  వాళ్లు నేర్చుకోలేకపోయిందానికి కూడా వారే బలవుతున్నారేమో కదా..”

మీ అభిమాన పూర్వకమైన పలకరింపుకు..
హృదయపూర్వక కృతజ్ఞతలతో..

రాజు.

RTS Perm Link

మామా! మమ్మల్ని మర్చిపోవు కదూ!

December 2nd, 2009

“మామా! మారుతున్న కాలానికి అనుగుణంగా నువ్వు కూడా మారాలని ప్రయత్నిస్తున్నావు కదూ! కాని ఒక్కటి మాత్రం నిజం. ఈ నాటి చాలా మంది ‘టెక్నో పిల్లలు’ జానపద లోకాలలో కాక-సాంకేతిక లోకాలలో విహరిస్తున్నారు. మరి వారికి అనుగుణంగా నువ్వూ మారాలని అనుకోవడం- పొరపాటు కాదేమో! కానీ మామా! యాభై ఏళ్లుగా నీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ- నీ స్నేహ మాధుర్యాన్ని అనుభవించినవాళ్లం. మేము కూడా ఉన్నామని గుర్తుంచుకుంటావా? మమ్మల్ని కూడా అలరించాలని ప్రయత్నిస్తావు కదూ!”

ఇది చందమామ డిసెంబర్ సంచికలో శివకుమార్ అనే కొంపల్లి పాఠకుల లేఖా పలకరింపు. చందమామలో వస్తున్న ఆధునిక రీతుల పట్ల ఆగ్రహం ప్రకటిస్తున్న పాఠకుల స్పందనలకు కాస్త భిన్నంగా… గతాన్ని, ఆనాటి పాఠకుల అభిరుచులను కాస్త పట్టించుకోవలిసిందిగా కోరుతూ ఈయన చందమామకు ఉత్తరం పంపడానికి ముందే చందమామ మళ్లీ పాత రూపంలోకి మారింది.

పాఠకుల అభిప్రాయాలకు, విమర్శలకు, ఆగ్రహ ప్రకటనలకు తలొగ్గిన చందమామ మళ్లీ కథల పత్రికగా మారుతోంది. ఇంకా మారవలసి ఉందనుకోండి. కథా విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పాఠకులు కోరుకుంటున్న పాత అభిరుచులకే పట్టం గడుతూ చందమామ మారుతోంది. మళ్లీ పూర్వ రూపానికి క్రమక్రమంగా పరిణమిస్తోంది.

ఈ డిసెంబర్ సంచికలో నమ్మలేని విధంగా నాలుగు చిన్న కథలు, ఒక జానపద కథ, ఒక హాస్య కథ, 25 ఏళ్లనాటి చందమామ కథ, రామాయణం, బేతాళ కథలు, పాతాళదుర్గం ధారావాహికలతో చందమామ కథల పత్రికగా నిండుగా ముస్తాబైంది.

వీటితోపాటుగా అలనాటి చందమామ పాఠకులను రంజింపచేసిన పంచతంత్రం కథలు మళ్లీ చందమామలో అచ్చవుతున్నాయి. సరిగ్గా ఈ డిసెంబర్ నుంచే ఈ కథల ముద్రణ ప్రారంభమైంది. విష్ణుశర్మ, అతడి శిష్యులతో వడ్డాది పాపయ్య గారి ముఖచిత్రం రంగులీనుతూ డిసెంబర్ చందమామను కాంతివంతం చేసింది.

‘మామా! యాభై ఏళ్లుగా నీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ- నీ స్నేహ మాధుర్యాన్ని అనుభవించినవాళ్లం. మేము కూడా ఉన్నామని గుర్తుంచుకుంటావా? మమ్మల్ని కూడా అలరించాలని ప్రయత్నిస్తావు కదూ!’ అంటూ పాఠకుడు శివకుమార్ వెల్లడించిన చిరుకోరికతో చందమామ మమేకమవుతోంది.

యాభై ఏళ్లుగా తన స్నేహమాధుర్యంతో పరవశించిన పాఠకులను పోగొట్టుకునేది లేదని ఘంటాపధంగా చందమామ ప్రకటిస్తూ మీ ముందుకు వస్తోంది. ఇది ఆరంభం మాత్రమే… కొత్త సంవత్సరంలో మరిన్ని మార్పులతో మీ ముందుకు రావడానికి చందమామ తొలి అడుగులు వేసింది.

మునుపటి లాగే మీ ఆదరణ, అభిమానాలను కోరుకుంటూ…
చందమామ.

గమనిక: పంచతంత్ర కథల పరిచయం కోసం ఈ బ్లాగులో నిన్న పోస్ట్ చేసిన “చందమామ – పంచతంత్ర కథలు” చదవండి.

RTS Perm Link