చందమామ – పంచతంత్ర కథలు
ప్రపంచ సాహిత్యానికి భారత దేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం . క్రీ. శ. 5 వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంధం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద నేర్చుకోదలచిన విద్యార్ధులకు పాఠ్యగ్రంధంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు.
ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్న కథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు.
పంచతంత్ర నేపథ్యం
దక్షిణ భారతాన మిహిలారోప్యము అనే రాజ్యానికి అమరశక్తి రాజు. ఆతనికి బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అని ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు చదువుసంధ్యలు లేక మూర్ఖుల వలె తయారయ్యారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి చదువుపై శ్రద్ధ కలుగలేదు. మనోవేదన చెందిన రాజు తన బాధను మంత్రుల వద్ద వ్యక్తపరచి తరుణోపాయం సూచింపుమన్నాడు. ఒక మంత్రి విష్ణుశర్మ అనే గురువు గురించి చెప్పి అతనికి రాకుమారులను అప్పగింపుమని సలహా ఇచ్చాడు.
రాజు విష్ణుశర్మను పిలిపించి, రాకుమారుల చదువు విషయమై తన వేదనను వివరించి, ‘నా బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పండి, మీకు తగిన పారితోషికం ఇస్తాను’ అని అన్నాడు. విష్ణుశర్మ బదులిస్తూ ‘నేను విద్యను అమ్ముకోను, నీ బిడ్డలను నీతిశాస్త్ర కోవిదులను చేస్తాను, నాకే విధమైన పారితోషికం అవసరం లేదు’ అని చెప్పి రాకుమారులను తీసుకొని వెళ్ళాడు.
వారికి బోధించదలచిన పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్ని కథలను స్వయంగా రచించి, బృహత్కథ నుండి కొన్ని కథలను గ్రహించి, పంచతంత్రమును రచించాడు. ఆ కథలను వారికి చెప్పి, నీతిని బోధించి ఆరు నెలలలో వారిని నీతిశాస్త్ర కోవిదులను చేసి, రాజుకిచ్చిన మాటను చెల్లించుకున్నాడు.
విశిష్టత
విషయ పరిజ్ఞానం, బోధనా సామర్థ్యం, చక్కని పాఠ్య ప్రణాళిక ఉంటే, చదువంటే ఇష్టము, ఆసక్తి లేని వారికి కూడా బోధించి విద్యావంతులను చెయ్యవచ్చని 5 వ శతాబ్దం లోనే విష్ణుశర్మ నిరూపించాడు. 1500 సంవత్సరాల నాటి ఈ రచన ఈనాటికీ ప్రతి సమాజానికీ అనుసరణీయమే, ఆమోదయోగ్యమే! అదే పంచతంత్రం యొక్క విశిష్టత.
పంచతంత్రం 5 విభాగాల, 69 కథల సంపుటి. కథలలోని పాత్రలు ఎక్కువగా జంతువులే. పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని, సహజ ప్రవృత్తినీ, నడతను సూచిస్తూ ఉంటాయి. కథనం సరళంగా ఉంటూ, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ, ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలు కథలలో మిళితమై వస్తాయి. పంచతంత్రం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం.
ఈరోజుకి మనకి తెలిసినంతవరకు, క్రీ.శ. ఆరవ శతాబ్దం నుంచి మొదలుపెట్టి మన పంచతంత్రం కనీసం యాభై ప్రపంచ భాషల్లోకి అనువదించబడిందట. పంచతంత్ర కథలు అనేక దేశాల సంస్కృతుల్లోనూ, కథా సాహిత్యంలోనూ కలిసిపోయి, ఆయా దేశాల సామాన్య ప్రజల నోళ్ళలో నాని, వాళ్ళ ప్రాంతీయమైన రంగు, రూపు, వాసనల్ని పొంది, చివరికి ఆ ప్రాంతాల కథలుగానే ఇప్పటికీ చెలామణీ అవుతున్నాయట. పాశ్చాత్య కథా సాహిత్యం మీద పంచతంత్రం ప్రభావం అపారమని చాలామంది పండితులు అభిప్రాయపడుతుంటారు.
పంచతంత్రం క్రీ.శ. ఆరవ శతాబ్దంలో పహ్లవీ (పర్షియా) భాషలోకి అనువదించబడిందనీ, అదే తర్వాత సిరియన్ భాషలోకి, సిరియన్ అనువాదం ఖలీల్ వదిమ్న అన్న పేరుతో అరబ్బీ భాషలోకి అనువదించబడిందని తెలుస్తోంది. అరబిక్ పంచతంత్రం తర్వాత శతాబ్దాల్లో గ్రీకు, లాటిన్, హిబ్రూ ల్లోకి అనువాదం చెయ్యబడింది. ఆ తర్వాత క్రమంగా అనేక యూరోపియన్ భాషల్లోకి కూడా అనువాదాలు వచ్చాయట. ఏషియా, యూరోపు, ఆఫ్రికాలో కూడా పంచతంత్ర కథలు వ్యాపించాయని ప్రతీతి.
గ్రీకుభాషలోని ఈసప్ కథల్లోనూ, అరేబియన్ నైట్సులోనూ కూడా పంచతంత్ర కథలు కలిసిపోయాయని రచయితలు అభిప్రాయపడ్డారు. అయితే పంచతంత్ర కథలకి మూలం గ్రీకు కథలని కూడా వాదాలు ఉన్నాయి. భారత, గ్రీకు సంస్కృతుల మధ్య జరిగిన ఆదాన, ప్రదానాల్లో ఇక్కడి కథలు అక్కడికీ, అక్కడి కథలు ఇక్కడికీ వెళ్ళి ఉండచ్చని కూడా ఒక ఊహ.
(ఈ పంచతంత్ర కథల పరిచయానికి పూర్తిగా తెవికీ, నాగమురళి గారి బ్లాగ్‌లోని వ్యాస భాగాలే ఆధారం.)
పంచతంత్రం ధారావాహికగా తెలుగులో ప్రచురించిన ఘనత చందమామ పత్రికకు దక్కింది. సరళమైన తెలుగులో, ఆకర్షణీయమైన బొమ్మలతో కొన్ని సంవత్సరాల పాటు, పంచతంత్రం ధారావాహికగా ప్రచురించారు.
కొన్ని దశాబ్దాల క్రితం చందమామలో వచ్చిన ఈ పంచతంత్ర కథలను పాఠకుల కోరిక మేరకు ఈ డిసెంబర్ నుంచి చందమామ మళ్లీ ప్రచురిస్తోంది. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు కొనసాగే పంచతంత్ర కథలను చందమామ నూతన సంవత్సర కానుకగా తన పాఠకులకు తిరిగి అందిస్తోంది.
ప్యాకింగ్‌కు తయారవుతున్న డిసెంబర్ చందమామ ముఖచిత్రాన్ని సోమవారం ఉదయం ఆఫీసులో దూరంనుంచి చూడగానే కళ్లముందు ఓ మెరుపు మెరిసినట్లయింది. రాజకుమారులకు కథలు చెబుతున్న విష్ణుశర్మను ముఖచిత్రంగా చూడగానే మళ్లీ ఓ నాలుగు దశాబ్దాలకు ముందునాటి చందమామ ముఖచిత్రాన్ని చూసిన అనుభూతి.
చందమామను చదవండి. వీలైతే చందా కట్టండి అని ధైర్యంగా మిత్రులకు సిఫార్సు చేయడానికి ఇప్పుడు ఏ సందేహాలూ లేవు. ఒక పంచతంత్రం కథలు, బేతాళ కథలు, దాసరి సుబ్రహ్మణ్యం గారి పాతాళదుర్గం సీరియల్, రామాయణం, 25 ఏళ్ల నాటి చందమామ కథ, జానపద కథ ఇవి చాలు…. చందమామను చూడండి, చదవండి, తీసుకోండి అని రెకమెండ్ చేయడానికి…
అందుకే గతంలో లేని ధైర్యంతో ఇప్పుడు మిత్ర బృందానికి, బంధువులకు, తెలిసిన వారికి చందమామను చూడమని ఫోన్లు చేయడం. ఇప్పుడీ బ్లాగులో కూడా చందమామ అభిమానులకు తెలియజేయడం.
ఇంతకు ముందే ప్రస్తావించినట్లుగా… ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం పంచతంత్ర కథలు.. ఈ డిసెంబర్ నుంచి మళ్లీ మీ ముందుకు ప్రింట్ రూపంలో వస్తోంది. వడ్డాది పాపయ్య గారి ముఖచిత్రంతో జిగేలుమంటున్న డిసెంబర్ చందమామ ఈ వారం మొదట్లోనే మార్కెట్లోకి రావచ్చు. తీసుకుని చదువుతారు కదూ..
ఆద్యంతం జంతువుల పాత్రలతో సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలను మానవజాతికి సుబోధకం చేసిన ఇప్పటికీ చేస్తున్న అపూర్వ కథా సాగరం పంచతంత్ర కథలు.
తల్లిదండ్రులారా! అలనాటి చందమామ పాఠకాభిమానులారా! ఈ డిసెంబర్ నుంచి చందమామను మీ పిల్లలకు తప్పక పరిచయం చేయండి. ఓ అరగంటైనా వారితో కూర్చుని పంచతంత్ర కథలను చదివించండి.. చదివి వినిపించండి.
test Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Tags: కథలసమాహారం., చందమామ, పంచతంత్రకథలు, పాతాళదుర్గం., ప్రపంచభాషలు, బేతాళకథలు, విష్ణుశర్మ, సంస్కృతం | Comments (2)2 Responses to “చందమామ – పంచతంత్ర కథలు”
Leave a Reply








రాజుగారూ,
పంచతంత్ర కథలకు మంచి పరిచయం. ఈ వ్యాసాన్ని కొద్దిగా తగ్గించి, మన తెలుగు చందమామ బ్లాగులో ప్రచురించబడినది. బొమ్మమటుకు, విష్ణు శర్మ పంచతంత్ర కథలను పిల్లలకు చెబుతున్నట్టుగా శ్రీ వడ్డాది పాపాయ్య గారు వేసిన బొమ్మ ఉంచాను.
చందమామలో మళ్ళి పంచతంత్రం పున:ముద్రణ జరగబోతున్న విషయం ఆనంద దాయకం. చందమామకు పూర్వ పాఠకులమైన నాలాంటివారు మళ్ళి చందమామను కొనటం సాగించేరోజు దగ్గరలోనె ఉన్నదనిపిస్తున్నది(దాదాపు 20 సంవత్సరాల క్రితం కొనటం మానేశాను) .
పాత ధారావాహికల పున:ముద్రణతో పాటుగా, దాసరివారికి దీటుగా జానపద ధారావాహికలను వ్రాయగలవారిని, చిత్రాలాగ బొమ్మలు వేయగలవరిని, శంకర్, వపాగార్లకు వారసులను కనిపెట్టి చందమామలోకి తేవలిసిన అవసరం ఎంతయినా ఉన్నది.
చందమామలో ఇంతవరకు వేయని జానపద, చారిత్రాత్మక కథలను, మన దేశ చరిత్రలో మహా పురుషులకు కొదువలేదు, శివాజి, వల్లభ్ భాయ్ పటేల్, సుభాష్‌చంద్ర బోసు, అల్లూరి సీతారామరాజు ల కథలను మంచి బొమ్మలతో, పూర్తి వివరాలతో వేస్తే ఎంతయినా బాగుంటుంది.
పరోపకారి పాపన్న కథలు, గుండు భీమన్న కథలు, తాతయ్య కథలు “కొత్తవి”(పున:ముద్రణకాదు) కథా వాతావరణం అదే ఉంచి వ్రాయించి వేస్తే బాగుంటుంది.
శివరాం ప్రసాద్ గారూ,
“చందమామకు పూర్వ పాఠకులమైన నాలాంటివారు మళ్ళి చందమామను కొనటం సాగించేరోజు దగ్గరలోనె ఉన్నదనిపిస్తున్నది.” మనఃపూర్వక కృతజ్ఞతలు. 20 ఏళ్ల క్రితం చందమామను తీసుకోవడం ఆపివేసిన మీరు మళ్లీ దాన్ని కొనడం గురించి ఆలోచిస్తున్నారంటే మళ్లీ చందమామకు మంచిరోజులు వస్తున్నాయనే భావిస్తున్నాము. తాను పోగొట్టుకున్న, కోల్పోయిన అలనాటి పాఠకులను తిరిగి సంపాదించుకోవడం కంటే మించిన గొప్పతనం ఇప్పుడు చందమామకు మరొకటి లేదు. మీ వంటి వారు తిరిగి చందమామను తెలుగు ముంగిళ్లలోకి ఆహ్వానించే క్షణాలకోసం ఎదురు చూస్తుంటాము. లభ్యమవుతున్న వనరులు, అవకాశాలు ప్రాతిపదికన చందమామకు పాత మెరుగులు దిద్దే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పడం తప్ప ఇంకే వాగ్దానం చేయగలం చెప్పండి.
ధన్యవాదాలతో
రాజు