వంద కథనాల చందమామ బ్లాగు

November 19th, 2009
చందమామ తొలిసంచిక ముఖచిత్రం

చందమామ తొలిసంచిక ముఖచిత్రం

మిత్రులారా! ఇవ్వాళ్టితో నా బ్లాగులో వంద పోస్టులు చేరాయి. నాలుగు నెలల క్రితం అంటే జూలై 7న ‘చందమామ’ జ్ఞాపకాలను పదిలపర్చాలన్న చిరుకోరికతో, సదసత్సంశయంతో మొదలుపెట్టిన ‘చందమామలు’ బ్లాగు ‘చందమామ చరిత్ర’ సాక్షిగా నేటికి 130 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ఈ పోస్టుతో కలిపి ఈ నాలుగు నెలలూ ఈ బ్లాగులో పొందుపర్చిన కథనాలు, కథలు, పరిచయాలు, జ్ఞాపకాలు సరిగ్గా వందకు చేరుకున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే దాదాపుగా 14 వేల హిట్లు కూడా ఈ బ్లాగు సాధించింది.

ప్రధానంగా పాఠకులు, చందమామ అభిమానులు… మీరే ఈ విజయానికి నిజమైన కారకులు. తొలి పేరాలో సదసత్సంశయం అని ఎందుకు వాడానంటే చందమామతో అనుభూతులు, జ్ఞాపకాలు, పరిచయాలు ప్రధానంగా ఈ బ్లాగులో ఉంచాలని మొదట్లో అనుకున్నప్పుడు ఓ చిన్నపాటి సందేహం కూడా కలిగింది

గతంలో ఉజ్వలంగా వెలిగిన ఈ నిరుపమాన కథల పత్రిక గురించి, దాని చరిత్ర గురించి, మరుగున పడిన చందమామ అంతర్గత విషయాల గురించి, దాంట్లో దశాబ్దాలుగా పనిచేస్తూవచ్చిన ధీమంతుల గురించి రాస్తే ఎవరు చూస్తారు, ఎవరికి చందమామ గత చరిత్రను చదవగలిగిన ఓపిక, తీరిక ఈ స్పీడ్ యుగంలో ఉందని భయపడిన మాట వాస్తవం. అందుకే మంచి పనిని కించిత్ సంశయంతోనే మొదలు పెట్టాను.

అయితే ఆగస్టు నెలలో కూడలి, జల్లెడ, హారం వంటి తెలుగు బ్లాగుల సమాహారంలో చేరిన తర్వాత ఈ బ్లాగులో కదలిక పుంజుకుంది. చందమామతోడుగా బాల్యంలో పెరిగి పెద్దయిన వారు, చందమామను మధ్యలో స్కూలు, కాలేజీ రోజుల్లో చదివి దానిపై మమకారం పెంచుకున్నవారు, ఒక ఇంటలెక్చువల్ ప్యాషన్‌తో చందమామ చరిత్రను తలపులనిండా ఉంచుకుని తమ బ్లాగుల్లో అలనాటి చందమామపై మంచి మంచి వ్యాసాలు, కథనాలు ఇప్పటికే పోస్ట్ చేసిన వారు, చేస్తున్నవారు… సామాన్యుల నుంచి మాన్యుల వరకు, ఇలా ప్రతి ఒక్కరూ.. ఈ బ్లాగును తమ స్వంతం చేసుకున్నారు.

చందమామ చరిత్రను, వ్యక్తుల పరంగా, కథల పరంగా, సంఘటనల పరంగా అక్షరబద్ధం చేస్తూ వచ్చిన ప్రతి దశలోనూ మీరంతా హితవచనాలు పలుకుతూ, విలువైన వ్యాఖ్యల ద్వారా నాలో మరింత ప్రోత్సాహాన్ని ప్రోది చేశారు. రాష్ట్రం సరిహద్దులు దాటి ప్రపంచం నలుమూలలనుంచి మీరు ఎప్పటికప్పుడు ఈ బ్లాగును చూస్తూ, వ్యాఖ్యలు రాస్తూ, వ్యక్తిగతంగా కూడా ఈమెయిల్ సందేశాలు పంపుతూ చందమామ చరిత్రను సాధ్యమైన మేరకు వెలికి తీయాలన్న నా కుతూహలాన్ని రెట్టింపు చేశారు.

నిజం చెప్పాలంటే ఒక బ్లాగర్‌కు తోటి బ్లాగర్లతో, ఒక చిన్న రచయితకు తోటి రచయితలతో, చందమామ అభిమానులతో ఏర్పడిన స్నేహం, పరిచయం, హృదయ స్పందనలు ఉద్దీప్తం చెందిన రోజులివి. సరిగ్గా 10 నెలల క్రితం ఆన్‌లైన్‌ చందమామలో ఉద్యోగిగా చేరిన నాకు గత నాలుగు నెలలుగా మనసుకు స్వాంతన కలిగించిన రోజులివి.

గత 30 ఏళ్లుగా చందమామ ప్రింట్ ఎడిషన్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న బాలుగారు, ఇదే చందమామలో 1952 నుంచి గత 57 సంవత్సరాలుగా శ్రమిస్తూ వచ్చిన చందమామ చిత్రమాంత్రికుడు శంకర్ గారు… నేను లేవనెత్తిన ప్రతి సందేహాన్ని ఓపిగ్గా వివరించడం ద్వారా చందమామ గత చరిత్ర తలుపుల వద్ద నన్ను నిలబెట్టారు.

చందమామ తీరంలో గవ్వలు ఏరుకోవడానికి ఆబగా పరుగెత్తిన నన్ను సంస్థ లోపలనుంచి ప్రోత్సహించడంలో, అడిగిన ప్రతి సమాచారాన్ని దాచుకోకుండా చెప్పడంలో వీరు అందించిన నిజమైన సహకారం జీవితకాలంలో మరువలేను. అలాగే చందమామ అమూల్యనిధిని – సర్వశ్రీ చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వడ్డాది పాపయ్య గార్లు గీసిన చిత్రాలు- పరిరక్షించిన వైనం గురించి చందమామ లైబ్రేరియన్ బాలసుబ్రహణ్యం గారు ఇచ్చిన సమాచారం కూడా మరువలేనిది.

ఈ బ్లాగు మొదలు పెట్టేటప్పుడు ఈ బ్లాగులక్ష్యం గురించి నాగురించి పరిచయంలో ఇలా రాసుకున్నాను.

“తెలుగు జాతి సాంస్కృతిక సంపద అయిన చందమామను ఈ నాటికీ తమ జ్ఞాపకాల దొంతరలలో పదిలపర్చుకుంటున్న చందమామ అభిమానుల గుండె చప్పుళ్లను ఓ చోట చేర్చి అందరికీ పంచిపెట్టాలనే చిరు కోరికే ఈ బ్లాగ్ రూపకల్పనకు మూలం.
 
…జీవించడం కోసం ప్రపంచం నలుమూలలకు వలసపోయిన తెలుగు వారు చందమామ పత్రికతో తమ తరాల అనుబంధాన్ని నేటికీ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, పరస్పరం చందమామతో తమ జ్ఞాపకాలను ఎలా పంచుకుంటున్నారో తెలిపే అమూల్యమైన వ్యాసాలు, లింకులు, తదితర సమాచారం కోసం ఈ బ్లాగులో చూడవచ్చు. చందమామ చరిత్ర, చందమామ కథల సమీక్ష, పరిచయం, వ్యక్తుల పరామర్శ తదితర చందమామ సంబంధింత సమాచారాన్ని ఈ బ్లాగులో అందరూ చూడవచ్చు.”

చందమామ సంస్థ లోపలనుంచి నేను గత నాలుగు నెలలుగా సేకరించిన సమాచారం, పత్రిక చరిత్ర, అడపా దడపా అంతర్గత విషయాలు ఈ బ్లాగు పాఠకులకు, చందమామ అభిమానులకు, పెద్దలకు ఏ మేరకు సమ్మతమైనాయో, ఉపయోగపడ్డాయో నాకయితే తెలీదు కాని ప్రతి కథనంలోనూ, మీరు చేస్తూ వచ్చిన వ్యాఖ్యలు, స్పందనలు, హితోక్తులు మాత్రమే, ఇంత తక్కువ కాలంలో ఈ బ్లాగులో వంద పోస్టులు పూర్తి కావడానికి ప్రేరణగా నిలిచాయని వినమ్రంగా చెబుతున్నాను.

వ్యక్తిగతంగా నేను  రూపొందించుకున్న ఈ బ్లాగు చివరకు సంస్థకే అధికారిక బ్లాగుగా మారిందంటే ఇంతకు మించిన విజయం మరొకటి ఉండదనే అనుకుంటున్నాను. ఇది నా స్వంత బ్లాగుగా ఉండకపోవచ్చు కానీ చందమామ అభిమానులందరి ఆదరణను పొందిన బ్లాగుగా మీరిచ్చిన ఈ భాగ్యాన్ని, సంతోషాన్ని, మహదానుభూతిని జీవితం చివరి వరకు మర్చిపోలేను.

చందమామ చరిత్రపై మీరు చూపుతూ వచ్చిన ఈ ఆదరణ, అభిమానం రేపోమాపో చందమామపై రాసే, రాయబోయే ప్రతి బ్లాగరుకూ అందిస్తారని, ప్రతి చందమామ చరిత్ర కథనాన్ని, మన చందమామ గత వైభవాన్ని ఇలాగే పంచుకుంటారని, పంచుకుంటూ ఉండాలని కోరుకోవడం తప్ప ఈ తరుణంలో మరేమీ చెప్పలేను.

మీ అందరికీ శతసహస్రవందనాలతో
చందమామ రాజు

RTS Perm Link


13 Responses to “వంద కథనాల చందమామ బ్లాగు”

 1. వీరుభోట్ల వెంకట గణేష్ on November 19, 2009 4:26 AM

  అభినందనలు !!

 2. lahari67 on November 19, 2009 4:41 AM

  మీ సంతోషాన్ని ఇలాగే కాపాడుకోండి. సంస్ధకే అధికారిక బ్లాగుగా ఈ బ్లాగు తయారైనందుకు మీకు నా హృదయపూర్వక అభివందనములు. మనసు పెట్టి ప్రయత్నిస్తే విజయం ఖాయం అన్న మాటకి మీరే ఒక ఉదాహరణ. ఇలాగే ముందుకు దూసుకు వెలతారని ఆశిస్తూ….

  మీ తమ్ముడు
  బాబు
  lahari67@gmail.com

 3. రవి on November 19, 2009 4:49 AM

  అభినందనలు.

 4. రామకృష్ణ రోహిణీకుమార్ వెలువలి on November 19, 2009 4:53 AM

  అందుకోండి నా అభినందనలు…

 5. జ్యోతి on November 19, 2009 4:57 AM

  చందమామ రాజుగారు,
  సాధారణంగా ఎవరి బ్లాగు వారి సొంతం. కాని ఈ బ్లాగు మొదలెట్టింది మీరైనా ఇది అందరూ తమ స్వంతం. మరిచిపోలేని,మరపురాని చందమామ కధలను ఇక్కడ చూసుకుని తమ బాల్యాన్ని నెమరువేసుకుంటున్నారు..
  శతటపోత్సవ శుభాకాంక్షలు.. అభినందనలు..

 6. chandamama on November 19, 2009 6:09 AM

  గణేష్, బాబు, రవి, రోహిణీకుమార్, జ్యోతి గార్లకు… సత్వరస్పందనలకు ధన్యవాదాలు. శత టపోత్సవం… జ్యోతి గారూ చక్కటి పదం పట్టారు. అభివందనలు..

 7. Amma Odi on November 19, 2009 9:09 AM

  జ్యోతి వలబోజు గారి మాటే, నా మాట. శతటపోత్సవ శుభాకాంక్షలు. పదం చాలా బాగుంది కదండి. ఎవరు కనిపెట్టకపోతే మాటలెలా పుడతాయి అన్నాడు మన ఘటోత్కజుడు. [మాయాబజార్ లో] కాబట్టి జ్యోతి గారికి వీరతాళ్ళు వేయాల్సిందే!ఎన్ని?

 8. SIVARAMAPRASAD KAPPAGANTU on November 19, 2009 12:44 PM

  రాజుగారూ,

  అద్భుతమండి. చాలా ఆనందంగా ఉన్నది. మీరు వంద పోస్టులు పూర్తిచేసిన శుభసందర్భంగా అభినందనలు. మీరు ఇలాగే ఈ బ్లాగును మీ బ్లాగుగానే ఉంచి చందమామ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి తేవాలని చందమామ అభిమానులందరూ ఆశిస్తున్నారు. మీకు చందమామలో మరింత ఉన్నతి కలగాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనసారా అకాంక్షిస్తున్నాను.

 9. వేణు on November 20, 2009 2:12 AM

  రాజు గారూ,

  వంద కథనాలు రాయటంలో ‘విశేషం’ నాకేమీ కనపడటం లేదండీ. 🙂

  కానీ, బ్లాగు గమనాన్ని మీరలా సమీక్షించుకోవటం బావుంది, నిజంగా!

  ‘చందమామ చరిత్రను సాధ్యమైన మేరకు వెలికి తీయాలన్న’ మీ ఆశయం ఎంతో గొప్పది. దానికి , మీ చక్కని వ్యక్తీకరణ నైపుణ్యం తోడైంది! ఇక ఈ బ్లాగు ఆదరణ పొందటంలో ఆశ్చర్యమేమీ లేదు.

  మీరు ‘వ్యక్తిగతంగా రూపొందించుకున్న ఈ బ్లాగు చివరకు సంస్థకే అధికారిక బ్లాగుగా మారిందంటే..’- ఎంతో ఆనందం చందమామ అభిమానులందరికీ!

 10. chandamama on November 20, 2009 6:31 AM

  అమ్మఒడి….
  శతటపోత్సవ పద ప్రయోగంతో మొదలై మాయాబజార్‌లో ఆ సుప్రసిద్ధ డైలాగునే గుర్తు చేశారు. ఈ పద ప్రయోగ కారిణి జ్యోతిగారికి మీ ఇష్టమొచ్చిన వీరతాళ్లు వేయండి. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  శివరాం గారు…
  చందమామతో నా అనుబంధం కొనసాగినన్ని రోజులు ఈ బ్లాగు అవిచ్చిన్నంగానే కొనసాగుతుంది లెండి. అంతవరకు ఈ రూపంలో కలుసుకుంటూనే ఉంటాం. “చందమామలో మరింత ఉన్నతి కలగాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని” పోండి సార్ మీరు మరీనూ… ఇప్పుటికే భయపడి చస్తున్నాం.. ఇంకా మరింత ఉన్నతి, ఉన్నత స్థానమా.. ఇలా ఉండనిద్దురూ….

  వేణుగారూ,
  నిజంగా మీరన్నట్లు బ్లాగులో వంద కథనాలు రాయటంలో విశేషం ఏదీ లేదు. ఉన్న విషయానికే ప్రాధాన్యత గాని, సంఖ్యల కొలమానాలకు కాదు. ఈ విషయంలో నా ఓటు మీకే…. చక్కని వ్యక్తీకరణ నైపుణ్యం అన్నారు. సిగ్గుగా ఉందండీ మీ ప్రశంస చూస్తుంటే.. ‘వ్యక్తిగా నేను రూపొందించుకున్న బ్లాగు సంస్థ అధికారిక బ్లాగుగా మారింది’. అందుకే మీరు గమనించి ఉంటారు. గత కొద్ది వారాలుగా నా దూకుడు కూడా కాస్త తగ్గింది మరి.

  ఈ బ్లాగుపై చూపిన అభిమానానికి, ప్రోత్సాహానికి మీ అందరికీ శతటపా వందనాలు.
  రాజు

 11. మన్నవ on November 21, 2009 11:53 PM

  రాజు గారూ..

  ఎక్కడికో వెళ్లిపోయారు,దూరంగా..
  హిమాలయాల పైకి వెళ్లి పోయారు.

  బ్లాగును మహాబాగా నిర్వహిస్తున్నందుకు జగిడీలు.
  మీ సదాశయం సహస్రాంశలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ.. మన్నవ గం…

 12. chandamama on November 22, 2009 2:25 AM

  గంగాధర్ గారూ. ఆప్తవాక్యానికి ధన్యావాదాలు. ఎక్కడికో వెళ్లలేదు. మీతోటే ఉన్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా రాయవలసిన బాధ్యతల నేపధ్యంలో నా బ్లాగులో వరుస టపాలు పోస్ట్ చేయడం జరిగిందే తప్ప ఇందులో మరే విశేషమూ లేదు. ఒకటి మాత్రం చెప్పగలను. ఎన్నడూ ఊహించని రంగాలనుంచి ఎంతోమంది మిత్రులను, చందమామ అభిమానులను ఈ బ్లాగ్ ద్వారా సంపాదించుకున్నాను. చందమామ చరిత్రను అక్షరబద్దం చేయటం, ఎంతోమంది చందమామ ప్రియులు, ‘చంపి’లతో పరిచయం పెంచుకోవడం.. ఇవే ఈ మధ్యకాలంలో నేను పోగు చేసుకున్న నిధులు. వృత్తి పనుల ఒత్తిడిలో మీ బ్లాగ్ రచనను వదిలేసినట్లున్నారు. వీలు చూసుకుని కొనసాగించగలరు. అలాగే చెన్నయ్ నగరంపై మీ చక్కటి కవితలు కూడా.

 13. chandamama on November 24, 2009 9:22 PM

  చందమామకు చంద్రగ్రహణం పట్టి కానరాని సుదూరాలకు కనిపించకుండ వెళ్ళినా .. నిండు చంద్రుడు లేకుండా రాత్రి వేళ నింగి వెలవెలబోయినా.. బాధపడని వారికి చందమామ పుస్తకం చదవందే నిదురరాదట. అలాగే తెలుగు బ్లాగింగ్ చేసే వారికి చందమామ కధలను చూడకుండా ఉండలేరనిపిస్తుంది. అందుకు నిదర్శనం మీ బ్లాగ్‌కు వస్తున్న స్పందనే. మీ బ్లాగ్‌లో అందిస్తున్న చందమామ శీర్షికలు అందరిని గగన లోకాలకు తీసుకొని వెళ్లి చక్కని అనుభూతిని అందించాలని అశిస్తూ.
  ప్రవీణ్
  ఆంధ్ర జ్యోతి – చెన్నై

  ప్రవీణ్ గారూ, మీ ఆప్తవాక్యాలకు ధన్యవాదాలు. ఆన్‌లైన్ చందమామను, చందమామ బ్లాగును వీలయినప్పుడు చూసి సూచనలు పంపగలరు. మీ పిల్లలకు చందమామ పత్రికను పరిచయం చేయరా. చందమామ బంధం తరాలుగా తెలుగుదేశంలో తల్లిదండ్లులు తమ పిల్లలకు అందిస్తూ వచ్చిన మరపురాని అనుబంధం. మర్చిపోకండి.

  రాజు

  గమనిక: చందమామ బ్లాగులో వందవ టపాకు గాను మిత్రులు ప్రవీణ్ పంపిన ఇ-మెయిల్ సందేశాన్ని ఇక్కడ పోస్ట్ చేయడమైనది.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind