అపురూప శిల్పాల చెన్నయ్ మ్యూజియం -1

నటరాజ శిల్పం
ఇది నా చిన్నప్పటి మాట. 1977లో పదో తరగతి చదువుతున్న రోజులు. మా స్కూలు తరపున కంచికామాక్షి, మదుర మీనాక్షి మహాబలిపురం ఆలయాలు, అప్పటి మద్రాసు నగర సందర్శన కోసం ఓ విహారయాత్ర ఏర్పాటు చేశారు. ఓ బస్సులో 50 మంది విద్యార్థులు, అధ్యాపకులు కలిసి చేసిన ఆనాటి యాత్ర ఇప్పటికీ గుర్తు ఉంది.
ముఖ్యంగా కంచి దేవాలయంలో బంగారు బల్లి, మదుర దేవాలయం శిల్పకళా సంపద, మహాబలిపురంలో ఆ పెద్ద రాతిగోడపై దిగ్భ్రాంతి కలిగించే రూపంలో ఉన్న మహా గజరాజ శిల్పం, చెన్నయ్ -ఎగ్మూరు మ్యూజియంలో ఓ పెద్ద రూమునిండా వ్యాపించిన తిమింగలం అస్థిపంజరం, ఈ నగరంలోని బతికిన, చచ్చిన కాలేజీల విశేషాలు వంటివి ఎప్పటికీ మర్చిపోలేను కూడా.
ఎగ్మూరులోని ప్రభుత్వ మ్యూజియంపై ఆన్లైన్ చందమామ తరపున కథనాలు ప్రచురించేందుకోసం రెండు వారాల క్రితం మరోసారి దానిని సందర్శించాము. చిన్నప్పుడు మా స్కూలు విహారయాత్రలో భాగంగా దాన్ని చూడటం జరిగింది. 1996లో ఓ పూర్తిరోజు అక్కడే గడిపాము. తిరిగి 13 ఏళ్ల తర్వాత మళ్లీ పక్షంరోజుల క్రితం చందమామ పనిలో భాగంగా అక్కడికి వెళ్లాము. ఆ విశేషాలను తొలి భాగాన్ని ఇక్కడ అందిస్తున్నాం.
అపురూప శిల్పాలు
పాతవస్తువులు ఏవైనా ఉంటే అటకెక్కించండిరా అని పల్లెల్లో పెద్దలు అంటుంటారు. ఏ వస్తువును కూడా అంత సులభంగా వదులుకోలేని మనస్తత్వం పల్లెటూళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ జీవిత నేపథ్యంలోంచే అటక, అటకెక్కించడం అనే పదాలు పుట్టాయి. పాత వస్తువులను పెద్ద ఎత్తున సేకరించి ఒక చోట పెట్టడమే కాలక్రమంలో మ్యూజియం, వస్తుప్రదర్శన శాలల ఉనికికి దారి తీసి ఉంటుంది.
మరి పాత వస్తువులు అంటే ఎంత పాతవి. పదేళ్లకు ముందు ఉన్నవీ, 50 ఏళ్లు లేక వందేళ్ల ముందు ఉన్నవీ అయితే వాటికి పెద్దగా విలువ ఇవ్వలేము కదా. కొన్ని వందల, వేల ఏళ్లు, లక్షల ఏళ్ల క్రితం నాటి అపురూప వస్తువులు, శిలాజాలు, మనుషులు ఉపయోగించిన పనిముట్లు, తదితర వస్తువులను మనం ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియాలలోనే చూడగలం.
మరి చెన్నయ్‌లో ఎగ్మూరులో ఉన్న సుప్రసిద్ధ ప్రభుత్వ మ్యూజియం విశేషమేమిటి? మ్యూజియంలోఅడుగు పెట్టినప్పటి నుంచి పురాతన చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన అద్భుత శిల్పాలు మన కళ్లముందు కనబడతాయి. ఇవి మన ప్రాచీన చరిత్రకు, శిల్పకళా వైదగ్ధ్యానికి నమూనాలుగా మిగిలిన మౌనసాక్షులు. వీటిని తావులేక బయటపెట్టారేమో కాని మ్యూజియంలో ఆ పాడుబడిన చోట గోడ పక్కన ఆనించి ఉంచారు. ఒకరకంగా చెప్పాలంటే ఇవి చరిత్ర లేని రాతి శిల్పాలు
రెండు కోట్ల ఏళ్ల నాటి శిలాజ దుంగ

రెండు కోట్ల ఏళ్ల నాటి శిలాజ దుంగ
వెయ్యేళ్లకు ముందు నాటి విశేషం మనకు కనబడితేనే మనం ఆశ్చర్యంతో నోరు తెరిచేస్తాం. అలాంటిది.. 2 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పొరల్లో కప్పబడి శిలాజంగా మారిపోయిన అరుదైన కొయ్య శిలాజం మనకు ఈ మ్యూజియం బయటే దర్శనమిచ్చి అబ్బురపరుస్తుంది. ఇంగ్లీషులో దీన్ని Fossile tree trunk అంటారు. మానవ చరిత్రలో బయల్పడిన అత్యంత పురాతన వస్తువులలో ఒకటి మన కళ్లముందు మ్యూజియం బయటే ఉందంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది.
సాధారణంగా ఏ కొయ్య అయినా, దుంగ అయనా, చెట్టు మొద్దు అయినా ఉపయోగంలో లేకుండా పడి ఉంటే కొన్నాళ్లకు చెదలు పట్టి భూమిలో కలిసిపోతుంది. అలాంటిది రెండు కోట్ల సంవత్సరాలుగా ఈ అరుదైన కొయ్య ఎలా సురక్షితంగా ఉండిపోయిందో తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
మ్యూజియం బయట ఆ పురాతన కొయ్య ముందు ఫలకం మీద రాసిన దాని ప్రకారం నదులలో కొట్టుకు వచ్చిన చెట్లు లోతట్టు సరస్సులలో భద్రపర్చబడతాయి. అవి తర్వాత పరిణామక్రమంలో శిలాజాలుగా రూపొందుతాయి. ఇలా ఏర్పడిన ఈ శిలాజ దుంగలలోని కొయ్య భాగాన్ని సిలికాన్ పదార్థం భర్తీ చేస్తుంది.
అలా ఏర్పడేదే ఫాజిల్ ట్రీ ట్రంక్. ఇవి మానవులకు ప్రకృతి ప్రసాదిత నిధులుగా మిగిలిపోతాయి. ఇలాంటి శిలాజ దుంగలు తమిళనాడులో విల్లుపురం జిల్లా వన్నూరు తాలూకాలోని తిరువక్కారై నేషనల్ ఫాజిల్ పార్క్‌లో కూడా ఉన్నాయట.
ఎగ్మూర్ మ్యూజియం విశేషాలు…
పాత చెన్నయ్ నగరంలో దట్టమైన చెట్లమధ్య ప్రభుత్వ మ్యూజియం నెలకొని ఉంది. ఆ ప్రాంతంలోని అన్ని భవంతులూ మ్యూజియంకు చెందినవే మరి. మ్యూజియంలో 6 గ్యాలరీలు ఉన్నాయి. ఇవి ఒకదానికి ఒకటి తీసిపోవు. వీటిలో మొదటిది మెయిన్ బిల్డింగ్. ఇది పురావస్తుశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భూగర్భశాస్త్రం, పోస్టల్ స్టాంపుల అధ్యయన శాస్త్రం వంటి అధ్యయన విశేషాలతో కూడి ఉంటుంది.
ఇక రెండవదైన ఫ్రంట్ బిల్డింగ్‌లో తోలుబొమ్మలు, పూర్వచరిత్ర, ఆయుధాలు, మందుగుండు, సంగీత వాయిద్యాలు, శరీర నిర్మాణ శాస్త్రం, జానపద సంస్కృతి, కొయ్య శిల్పాలు, అలంకరణ శిల్పం వంటి అంశాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.
ఇక మూడవదైన బ్రాంజ్ గ్యాలరీలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దినుంచి క్రీస్తు శకం 18వ శతాబ్ది వరకు లభ్యమైన అపురూపమైన కంచు శిల్పాలు ఉన్నాయి. నాలుగవదైన చిల్డ్రన్స్ మ్యూజియంలో అలంకృత బొమ్మలు, ప్రపంచ నాగరికత, సైన్స్, రవాణా, టెక్నాలజీ, సైన్స్ పార్కు ఉన్నాయి.
అయిదవదైన నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో మొఘలాయీ, రాజపుత్ర చిత్రాలు, తంజావూరు చిత్రాలు, ఇతర సాంప్రదాయిక చిత్రాలు, ఏనుగు దంతాలతో చేసిన కళాకృతులు వంటివి ఉన్నాయి. ఇక ఆరవదైన సమకాలీన ఆర్ట్ గ్యాలరీలో తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి, బ్రిటిష్ చిత్తరువులు, రవివర్మ చిత్రాలు, హోలోగ్రాములు, శిలా, గుహా కళా రూపాలు వంటివి ఉన్నాయి.
మరిన్ని చిత్రాలు చూడాలంటే ఈ లింకులో చూడండి.
వచ్చే వారం మరికొన్ని విశేషాలతో…..
test Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Tags: ఎగ్మూరు, కళలు, కొయ్య, చందమామ కథలు, చరిత్ర, చిత్తరువులు, చెన్నయ్, నటరాజు, నాణేలు, మ్యూజియం, రాజముద్రికలు, రూపాయలు, విగ్రహాలు, శిలలు, శిలాజ దుంగ, శిల్పాలు | Comments (3)3 Responses to “అపురూప శిల్పాల చెన్నయ్ మ్యూజియం -1”
Leave a Reply
mamchi samaachaaram
ఈ మ్యూజియం ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా వివరంగా సమాచారం ఇచ్చారు.
దుర్గేశ్వర, జయగార్లకు ధన్యవాదాలు. రెండో భాగం కూడా త్వరలో చూడగలరు