తరాల ఊహలను ఒడిసి పట్టుకున్న చిత్రకారుడు

November 17th, 2009
శంకర్ - బేతాళ కథలు

శంకర్ - బేతాళ కథలు

అనగా అనగా ఓ ఊరిలో శివశంకరన్ అనే ఓ అబ్బాయి ఉండేవాడు. ఆ ఊరిపేరు కారత్తొళువు. ఇది కోయంబత్తూరు సమీపంలో ఉండే చిన్న ఊరు. పదేళ్ల వయసులో అతడు చదువుకోడానికి మద్రాసు మహానగరానికి వచ్చాడు. పదవ తరగతి పూర్తి చేశాడు. తనకు డ్రాయింగ్ నేర్పిన టీచర్ అతడిని డిగ్రీ చదువుకు పోవద్దని, ఎగ్మూరులో ఉండే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరమని సలహా ఇచ్చారు.

తన టీచర్ సలహాను పాటించిన ఆ అబ్బాయి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళను అభ్యసించాడు. తర్వాత ఓ ప్రముఖ పిల్లల పత్రికలో చిత్రకారుడిగా చేరాడు. తను గీసిన చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. దాంతో అతడి జీవితం సాఫీగా, సంతోషంగా గడిచిపోయింది.

ఇది.. శంకర్ గారి కథ. ఓ రకంగా చందమామ కథ కూడా. ఆయనకు ఇప్పుడు 85 ఏళ్లు.  మీరు, మీ తల్లిదండ్రులు, చివరకు మీ తాత ముత్తాతలు కూడా దేన్నయితే చదువుతూ, పెరిగి పెద్దవారవుతూ వచ్చారో.. ఆ ‘చందమామ’ పత్రికను ఉన్నత శిఖరాలమీద నిలిపిన అలనాటి మేటి బృందంలో, మన కళ్లముందు సజీవంగా మిగిలి ఉన్న ఏకైక చిత్రకారుడు శంకర్ గారే.

కత్తి చేత బట్టి వీపుపై శవాన్ని మోసుకుని నడిచే సాహస చక్రవర్తిని వర్ణించే ‘బేతాళ కథలు’ ధారావాహికకు గత యాభై ఏళ్లుగా చిత్రాలు గీస్తూ వస్తున్న చిత్రకారులు శంకర్. 1950ల మధ్యలో తొలిసారిగా బేతాళ కథలకు బొమ్మలు గీయడం ప్రారంభించారు. తర్వాత చందమామ పత్రికకు వందలాది చిత్రాలు గీసిన చరిత్రను సొంతం చేసుకున్నారు.

శంకర్ గారు అధికారికంగా రెండు దశాబ్దాలకు ముందే పదవీవిరమణ చేశారు. అయితే ఎప్పుడు రిటైర్ అయ్యిందీ ఆయనకు కాని ఆయన సతీమణికి కాని ఇప్పుడు స్పష్టంగా తెలీదు. అయితే రిటైర్ అయన తర్వాత కూడా చందమామకు చిత్రాలు గీయడం మాత్రం కొనసాగించారాయన. ఆయన జ్ఞాపకశక్తి ప్రస్తుతం అంత చురుగ్గా లేకపోవచ్చు కానీ, ఆయన చిత్రరేఖలు మాత్రం ఇప్పటికీ వాడిగానే ఉంటున్నాయి.

ఈ నవంబర్ మొదటి వారం వరకు ఆయన చందమామ ఆఫీసుకు వెళ్లి పనిచేసేవారు. నవంబర్ 2న ఆయన ఉదయం ఆఫీసుకు వస్తుండగా క్యాబ్‌లోనే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాక కోలుకున్నారు. దీంతో ఇకపై ఇంటినుంచే చందమామ పని చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన 1952లో రూ.300ల వేతనంతో చందమామలో చేరారు.

శంకర్ గారి కథ చందమామతో పెనవేసుకుపోయింది. నిజంగానే చందమామ, శంకర్ ఇరువురూ తమ ఆరోగ్యం గురించి ఆలోచించవలసిన సమయమిది. శంకర్ గారికి విశ్రాంతి అవసరం. చందమామకు కాయకల్ప చికిత్స జరగడం అవసరం.

ఈ కథనం పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 NB: ప్రస్తుతం ఇంట్లోనుంచే చందమామ చిత్రరచన చేస్తున్న శంకర్‌గారితో మాట్లాడాలంటే కింది ల్యాండ్ ఫోన్ నంబర్‌కు కాల్ చేయండి.

044-64508610

ఆన్‌లైన్ చందమామలో శంకర్ గారిపై వివిధ సందర్భాలలో వచ్చిన కథనాలను కింద చూడగలరు.

చందమామ చిత్ర మాంత్రికుడు : శంకర్

చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…

చందమామ శంకర్ గారి జీవిత వివరాలు…

చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ

శంకర్ గారి నోట కమ్మటి తెలుగు భాష

చందమామ శంకర్ గారికి అనారోగ్యం

ఇకపై ఇంటివద్దనుంచే పనిచేస్తా…

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

RTS Perm Link