ఇంటివద్దనుంచే పనిచేస్తా: శంకర్

ఆఫీసులో శంకర్ గారు
గత 57 ఏళ్లుగా చందమామలో అవిశ్రాంతంగా చిత్రాలు గీస్తూ వచ్చిన శంకర్ గారు వయోపరిమితుల కారణంగా చందమామ ఆఫీసుకు “సెలవు” తీసుకున్నారు. కార్యాలయానికి సెలవే కాని పనికి కాదు. రెండువారాల క్రితం క్యాబ్‌లో చందమామ కార్యాలయానికి వస్తూ మైకం కమ్మి పడిపోయిన శంకర్ గారు ఓ వారం రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక ఇంటినుంచి చందమామ చిత్రాలు గీయాలని నిర్ణయించుకున్నారు.
‘చివరి వరకూ చందమామతో ఉంటాను, చందమామలోనే పని చేస్తాను’ అంటూ 85 ఏళ్ల వయసులో కూడా పంటిబిగువన వాహన ప్రయాణ భారం సహిస్తూ వచ్చిన శంకర్ గారు, వృద్ధాప్యం ఇక ప్రయాణానికి సహకరించదన్న గ్రహింపుతో తన పనిరంగాన్ని ఇంటికి పరిమితం చేసుకున్నారు.
ఇప్పటికే వారంలో తొలి మూడు రోజులు మాత్రమే చందమామ కార్యాలయంలో పనిచేస్తూ వస్తున్న ఆయన ఇకపై అయిదు రోజులూ ఇంటిలోనే ఉండి చందమామ బొమ్మలు గీయనున్నారు. ఓ వైపు తన కుటుంబం, మరోవైపు చందమామ యాజమాన్యం, సిబ్బంది కూడా ఎప్పటినుంచో ఇస్తూ వస్తున్న సలహాను ఈ నవంబర్ రెండో వారం నుంచే శంకర్ గారు అమలులో పెట్టేశారు.
గత అయిదు దశాబ్దాలకు పైగా భారతీయ పిల్లల మనో ప్రపంచంలో దాగిన ఊహలను ఒడిసి పట్టుకుని ఓ సరికొత్త చిత్రప్రపంచాన్ని కళ్లముందు ఆవిష్కరించిన చందమామ మేటి చిత్రకారులలో ఈయన ఒకరు. లక్షలాది పిల్లల బాల్యాన్ని జీవం ఉట్టిపడే బొమ్మలతో తేజోవంతం చేసిన చందమామ తొలి చిత్రకారుల బృందంలో ఒకరైన శంకర్ గారు చందమామ మూలస్తంభాల్లో మనకు మిగిలిన ఏకైక వ్యక్తి.
చందమామను, దాని బొమ్మలను చూసి చదువు నేర్చుకున్న ఆ తెలుగు మహిళ… చందమామలో శంకర్ గారు గీసిన కృష్ణుడి ముఖ చిత్రాన్ని తీసుకుని పూజలు సల్పి ఇంట్లోని దేవుడికి పూజ చేసినప్పటికంటే ఎక్కువగా తాదాత్మ్యత పొందిన చెన్నయ్ కృష్ణ భక్తుడు… చందమామను వెదురుబొంగులో భద్రంగా దాచుకుని ఏనాటికైనా శంకర్, చిత్రా గార్ల లాగా బొమ్మలు గీయక పోతానా అని కలలు కంటూ వచ్చిన ఆ ఒరిస్సా గొర్రెలకాపరి…
ఇలా ఒకటేమిటి, భారతదేశంలోని నలుమూలల నుంచి లక్షలాది పిల్లలు, పెద్దలు, వయోవృద్ధులు చందమామను తమదిగా చేసుకుని హత్తుకున్న చరిత్రకు ప్రతీకలుగా నిలిచిన సజీవ వ్యక్తులలో శంకర్ గారు ఒకరు.
ఆయన ఇకనుంచి చందమామ ఆఫీసుకు రారు. ఇంట్లోంచే చందమామ పని చేస్తారు. 10 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వచ్చే ఆ స్పురద్రూపి, మెల్లగా కాళ్లు ఈడ్చుకుంటూ ఆఫీసులో తన చోటు వద్దకు సాగిపోయే ఆ వయోవృద్ధుడు… తనతో కాస్సేపు అభిమానంగా మాట్లాడితే చాలు, పలకరిస్తే చాలు, ఇంటికి వెళ్లిపోయేటప్పుడు రివాజుగా పాపిన్స్ బిళ్లలను తలొకటి చేతిలో పెట్టే తీపిని పంచే ఆ చిత్రమాంత్రికుడు…. ఇక చందమామకు రారు.
తాను దశాబ్దాలుగా దాచుకుంటూ వస్తున్న అరుదైన చిత్రాలను ఒక్కటొకటిగా చూపిస్తూ, పేజీలు తిరగేస్తూ, ఆనాటి వ్యక్తుల, మిత్రుల, సన్నిహితుల ఫోటోలను పట్టి పట్టి చూస్తూ, చూపిస్తూ అలనాటి చరిత్రను కళ్లముందు నిలిపే ఆ ఎనిమిదన్నర పదుల చందమామ తాత ఇక ఆఫీసుకు రారు. ఆయనతో నేరుగా సంభాషిస్తూ, నవ్వుతూ, ఒకనాటి చరిత్ర జ్ఞాపకాల చిత్తడిలో మునిగితేలుతూ నమ్రతగా కాగితంపై రాసుకునే అరుదైన అవకాశం ఇక లేదు.
లేకపోతేనేం. ఆయన మాటకు కట్టుబడి ఇప్పటికీ చందమామ పని చేస్తూనే ఉన్నారు. ఆఫీసులో కాకుండా ఇంట్లో.. మరింత విశ్రాంతిగా, మరింత సౌకర్యంగా,, మరింత భక్తి శ్రద్ధలతో నమ్ముకున్న లక్ష్యానికి, ఆడిన మాటకు త్రికరణ శుద్ధిగా న్యాయం చేస్తూ చందమామకు చిత్రవర్ణాలను అద్దుతూ మాకూ, ప్రపంచానికి కూడా స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
ఆయన మాట, గీత, రేఖ, లక్ష్యం చిరకాలం కొనసాగుతాయని, కొనసాగాలని ఆశించడం తప్ప మనమిక ఏం చేయగలం.
శంకర్ గారూ ఉంటాము.. మీరు ఇంటినుంచి వేసి పంపే బొమ్మల ద్వారా మిమ్మల్ని చూసుకుంటూ చందమామ చిత్రాలలో మీ రూపాన్ని తలుచుకుంటూ ఉంటాము.
సర్వదా మీ ఆయురారోగ్యాలను కోరుకుంటూ…
ఆన్లైన్ చందమామలో, ఈ బ్లాగులో శంకర్ గారిపై వివిధ సందర్భాలలో వచ్చిన కథనాలను కింద చూడగలరు.
చందమామ చిత్ర మాంత్రికుడు : శంకర్
చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…
చందమామ శంకర్ గారి జీవిత వివరాలు…
చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ
శంకర్ గారి నోట కమ్మటి తెలుగు భాష
శంకర్ గారు ఆకస్మికంగా క్యాబ్‌లో స్పృహ తప్పి పడిపోయిన ఆ రోజు, టైమ్స్ ఆఫ్ ఇండియా విలేఖరి బిశ్వాస్ ఘోష్ ఆయనను ఇంటర్వ్యూ చేయాలని చందమామ ఆఫీసుకు వచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. కోలుకున్న తర్వాత గత వారం ఆయనను కలిసి మాట్లాడిన సందర్భాన్ని ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెన్నయ్ ఈ-పేపర్ ఆర్టికల్‌గా 4వ పేజీలో పబ్లిష్ చేశారు.
ఆ ఆర్టికల్ పేరు An Artist Who Caught IMAGINATION OF GENERATIONS
దాని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి. ఒకవేళ కింది లింకు ఏ కారణం వల్ల అయినా తెరుచుకోకపోతే చెప్పండి. తర్వాత దాని ఆంగ్లపాఠాన్ని పంపుతాము.
Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Tags: అనారోగ్యం, ఆఫీసు, ఇంటిపని, చందమామ, చిత్రా, మార్పు, రజీ, వపా, శంకర్ | Comments (3)మౌనమే దీటైన సమాధానం
పిల్లల కథల్లో మనదే పెద్ద స్థానం. పంచతంత్ర కథలు, అక్బర్ బీర్బల్ కథలు, భట్టివిక్రమార్క కథలు, కాశీమజిలీ కథలు, జాతక కథలు, బేతాళ కథలు…. ఇలా మనకున్న కథా సంపద అపారం. 16వ శతాబ్దంలో పేరొందిన కథల్లో ముఖ్యమైనవి బీర్బల్ కథలు. మాట విరుపుతో, మెరుపు యోచనతో ఎంత క్లిష్టమైన పరిస్థితినయినా ఎలా అధిగమించవచ్చో తెలిపే చక్కటి కథలివి.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగడిలాగా, అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్ది తిరుగులేని స్థానం. -తెనాలి, బీర్బల్ ఇద్దరూ ఓ రకంగా సమకాలికులు కూడా-. ఈ స్థానమే తోటి సభికులకు, రాజోద్యోగులకు కంటగింపుగా మారి, చక్రవర్తి సమక్షంలో బీర్బల్‌ను కుయుక్తులతో పడగొట్టాలని వారు ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ బీర్బల్ తనకే సముచితమైన సమయస్ఫూర్తితో వారి ప్రయత్నాలను వమ్ము చేస్తాడు.
మౌనానికి గల శక్తి వివేక సంపన్నులు మాత్రమే గ్రహించగలరని, అసంబద్ధ ప్రశ్నలకు మౌనమే దీటైన సమాధానమని ఈ వారం బీర్బల్ ధారావాహిక 18వ భాగం కథ “మూర్ఖుల ప్రశ్నలకు దీటైన సమాధానం” బోధిస్తోంది. అదేంటో ఇక్కడ చూడండి.
మూర్ఖుల ప్రశ్నలకు దీటైన సమాధానం
విజయం విజేతకు ఆనందాన్నిస్తుంది. అతడి మిత్రులకూ, శ్రేయోభిలాషులకూ సంతోషాన్నిస్తుంది. తక్కిన వారిలో ఈర్ష్యాసూయలకు కారణమవుతుంది. ఇక శత్రువుల సంగతి చెప్పనవసరం లేదు. అసూయతో కుతకుతలాడిపోతారు. బీర్బల్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది.
బీర్బల్ సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించి చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్నప్పుడల్లా సభలో కొందరు అసూయతో దహించుకు పోయేవారు. బీర్బల్‌ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయడం ఎలాగా అని ఆలోచించేవారు.
వాళ్ళు ఒకనాడు సమావేశమై తమ ఆశ ఫలించడానికి రకరకాల మార్గాల గురించి చర్చించారు. ఆఖరికి తిరుగులేని పథకం అని ఒక దాన్ని రూపొందించుకుని, అది గనక నెరవేరినట్టయితే బీర్బల్ పని అయిపోయినట్టేనని సంబరపడి పోయారు!
మరునాడు అలాంటి అసూయాపరుల నాయకుడు షైతాన్‌ఖాన్ తన అనుచరులతో కాస్త ముందుగానే సభకు వచ్చాడు. ముఖ్యమైన చర్చలు, కార్యకలాపాలు పూర్తయ్యాక చక్రవర్తి సభికుల నుంచి సూచనలు, కొత్త కొత్త సలహాలు స్వీకరించడానికీ, ఆసక్తికరమైన విశేషాలు వినడానికీ సమాయత్తమయ్యాడు.
షైతాన్‌ఖాన్ లేచి నిలబడి చక్రవర్తి అనుమతి కోసం ఆగాడు. ‘‘చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి.
‘‘షహేన్షా! మనకందరికీ బీర్బల్ తెలివితేటల గురించి తెలుసు. ఆయన ఎంతో కుశాగ్రబుద్ధి కలవాడు కదా,’’ అన్నాడు షైతాన్‌ఖాన్.
‘‘గొప్ప వివేకవంతుల మధ్య ఉన్న అనుభూతి నాకు కలుగుతోంది షహేన్షా,’’ అన్నాడు బీర్బల్ సంతోషంగా.
‘‘నిజమే షహేనషా! చమత్కార సంభాషణలో ఆయనకు సాటి రాగలనని నేను భావించడం లేదు. అంతే కాదు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మనలో ఏ ఒక్కరం కూడా బీర్బల్‌కు సాటి కాలేము,’’ అన్నాడు షైతాన్‌ఖాన్.
ఆ తరవాత అతడు స్వరం తగ్గించి, ‘‘బీర్బల్ ఇంత కుశాగ్రబుద్ధిగా వున్నాడు. మరి, ఆయన్ను కన్నతండ్రి మరెంత మేధావిగా ఉంటాడో కదా?’’ అన్నాడు చక్రవర్తితో.
ఆ మాటతో చక్రవర్తిలో కుతూహలం పుట్టుకువచ్చింది. ఇన్నాళ్ళు తనకీ యోచన రానందుకు ఆశ్చర్యపోయాడు.
ఈ కథ పూర్తి భాగంకోసం ఇక్కడ చూడండి.
బీర్బల్ కథలు ధారావాహికలో ఇంతవరకు ఆన్లైన్ చందమామ ప్రచురించిన 18 కథలు చూడాలంటే, ఈ లింకుపై క్లిక్ చేయండి.
Filed under చందమామ కథలు | Tags: అక్బర్, ఆస్థానం, కథలు, కాశీమజిలీకథలు, చందమామ, చందమామకథలు, చక్రవర్తి, జాతకకథలు, తండ్రి, పంచతంత్ర కథలు, బీర్బల్, సమయస్పూర్తి | Comment (0)






