చందమామ శంకర్ గారికి అనారోగ్యం

November 2nd, 2009
శంకర్ గారు

శంకర్ గారు

వారాంతపు సెలవుల తర్వాత ఉదయం చందమామ కార్యాలయానికి క్యాబ్‌లో వస్తున్నాం. తిరువాన్మయూర్ దాటుకుని నీలాంకరై వేపుకు బండి వస్తుండగా ఉన్నట్లుండి మా మరో క్యాబ్ డ్రైవర్ మా వైపు పరుగెత్తుకొచ్చారు. ఏమై ఉంటుంది అని ఒక్కసారిగా మాలో ఉద్రిక్తత. ఆ క్యాబ్‌కు ప్రమాదం ఏమైనా జరిగిందా అని కలవరం.

విషయం మరోలా ఉంది. ఆ క్యాబ్‌లో విరుగంబాక్కం నుంచి వస్తున్న శంకర్ గారు ఉన్నట్లుండి అనారోగ్యానికి గురయ్యారట. తనకే తెలీకుండా ముఖం వివర్ణమయిపోయిందట. పక్కన ఉన్నవారు గమనించి పక్కనే ఉన్న ఆసుపత్రికి బండిని తీసుకెళ్లి ఆయనకు ఈసీజీ వగైరా పరీక్షలు చేయించారు.

ప్రమాదం లేదని, నాడి మామూలుగా కొట్టుకుంటోందని వైద్యులు చెప్పారట. ఉన్నట్లుండి ఆయన శరీరంలో మార్పులు సంభవించాయి ఒక రోజంతా విశ్రాంతిలో ఉంచి పరీశీలనలో పెట్టాలని సూచించారట. తర్వాత మిగిలిన సిబ్బందితో పాటు ఆయనా ఆఫీసుకు అదే క్యాబ్‌లో వచ్చారు.

రాగానే, ఆయనను కలిశాము. పరామర్శించడానికి రావడంతో ఆయన మాకే ధైర్యం చెప్పారు. “ఏం జరగలేదు. ఉన్నట్లుండి ఒళ్లు అలసినట్లనిపించింది. ఏమయిందో నాకు అర్థం కాలేదు. ఎందుకయనా మంచిదని మనవాళ్లు పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకుపోయారు. ఈసీజీ, మరికొన్ని పరీక్షలు చేయించారు. అంతా నార్మల్‌గానే ఉందని చెప్పారు. ఒక రోజు పని చేయవద్దని, విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అంతే మరేం కాలేదు” అంటూ చేయి పట్టుకుని నవ్వారు.

“ఇదీ దైవకృపే మరి. నిద్రలోనే ఏదయినా జరిగి ఉంటే ఏమయ్యేదో కదా.. ఇంతమంది మధ్యన క్యాబ్‌లో అలా జరిగింది కాబట్టి వెంటనే చికిత్స చేయించారు. ఏం కాలేదు. వారి సలహా ప్రకారం ఇంటికి వెళుతున్నా” అని  చెప్పారు.

తర్వాత ఆయనను ఇంటివరకు తీసుకుపోయి దింపడానికి సహాయకులు వెంటరాగా ఆయన వెళ్లిపోయారు. 85 ఏళ్లు పైబడిన ఆయన చివరివరకు చందమామలో పనిచేయాలనే మొండి పట్టుదలతోటే దాదాపు 10 కిలోమీటర్ల పైగా దూరం క్యాబ్‌లో ప్రయాణం చేస్తున్నారు. వారంలో తొలి మూడు దినాలు కార్యాలయానికి వస్తూ మిగతా రెండు రోజులు ఇంటివద్దే ఉండి పనిచేస్తున్నారు.

ఈ క్యాబ్‌లో ప్రయాణం వల్ల వళ్లు అదురుతూ, నడుము నొప్పి వస్తోందని, అందుకనే మా ఆవిడ ఈ వయసులో ఇంత శ్రమ ఎందుకు, పని ఆపేయకూడదా అంటోందని పది రోజుల క్రితం కలిసినప్పుడు చెప్పారు. నడుము కాసేపు వత్తించుకుంటే తగ్గిపోతుందని ఈ మాత్రం దానికి అలసిపోతే ఎలాగన్నది ఆయన పట్టుదల.

తన బిడ్డలు ఎదిగి వచ్చి పైకి ప్రస్తుతం చెన్నైలోనే మంచి  స్థితిలోనే ఉన్నా, ఓ మేరకు సుఖమైన విశ్రాంతి జీవితాన్ని చివరి దశలో గడిపే సౌకర్యం ఆయనకు బిడ్డల ద్వారా ఏర్పడినా సరే తాను పనిచేయడం ద్వారా మాత్రమే బతకాలని, కన్న బిడ్డలమీద అయినా సరే ఆధారపడకూడదని ఆయన చెప్పారు. అదే విశ్వాసంతోటే చందమామలో పనిచేస్తున్నారు కూడా. ఈ వయసులో మీరు పనిచేసి బతకాలా అని బిడ్డలు నిష్టూరమాడినా గత కొన్ని ఏళ్లుగా ఆయన ఇలాగే పనిచేస్తున్నారు.

తన తరం ఆయుఃప్రమాణాల ప్రకారం చూసినా మరో పదేళ్లు ఆరోగ్యంగా గడిపే అవకాశం ఆయనకు ఉంది. ఏ దుర్వ్యసనాలకు అలవాటు పడని శరీరం కాబట్టి ప్రాథమికంగా ఇంతవరకు ఆయన ఆరోగ్యవంతుడి కిందే లెక్క. ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా జరగడంతో మాకందరికీ ఒక్కసారిగా కలవరం.

రాత్రి 11 గంటల వరకు పనిచేస్తూ పోయానని. ఆ శ్రమ భారం కూడా ఇలా బయటపడిందేమో అని ఆయన సందేహం. జీవితంలో ఒక దశకు చేరుకున్న తర్వాత రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోవడం ఆరోగ్యానికి భంగకరమే.. ఇక అయినా జాగ్రత్తలు తీసుకోమని సూచించాము.

మా కళ్లముందే ఆయన క్యాబ్‌లో వెళ్లారు. ప్రింట్ విభాగంలోంచి కొందరు పెద్దలు తోడు రాగా ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు ఏమీ కాదనే, కాకూడదని, మళ్లీ మాతో కలిసి పనిచేయాలని. మాతో ఉండాలని ప్రగాఢంగా కోరుకుంటూ లోపలకు వచ్చేశాం.

చందమామ అభిమానులు, చందమామ స్పర్ణయుగ ప్రేమికులు, చందమామ చిత్రకారుల ఏకలవ్య శిష్యులూ కూడా ఆయన ఆరోగ్యం గురించి పరామర్శిస్తారని, ఆయన మరి కొంతకాలం చల్లగుండాలని కోరుకుంటారని ఆశిస్తున్నాం. .

శంకర్ గారూ!

మీకోసం బేతాళుడు కూడా కలవరపడుతూ ఉంటాడు. కోరిన కోరికలు నెరవేర్చే ఆ బేతాళుడు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహిస్తాడని, తన బొమ్మలు మీ చేత మరికొంత కాలం గీయించుకుంటాడని, చందమామ బేతాళుడికి ‘శంకర’ పురస్కారం భవిష్యత్తులో కూడా అందుతుందని, అందాలని మేం  మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

మా ఈ చిన్న కోరికను మీరు మన్నిస్తారని ఆశిస్తూ,

మీ ఆరోగ్యం చల్లగా ఉండాలని కోరుకుంటూ…  మీనుంచి చల్లటి వార్తకోసం ఎదురుచూస్తూ…

మీ చందమామ.

RTS Perm Link


8 Responses to “చందమామ శంకర్ గారికి అనారోగ్యం”

 1. వేణు on November 2, 2009 1:30 AM

  శంకర్ గారి ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడి, ఆయన చాలా కాలం ఎప్పటిలా బొమ్మలు వేస్తుండాలని కోరుకుంటున్నాను.

  ప్రయాసభరితమైన క్యాబ్ ప్రయాణం చేసే అవసరం లేకుండా .. వారంలో మొదటి మూడు రోజులు కూడా ఆయన ఇంటి దగ్గరే ఉండే ఏర్పాటు చేయకూడదా? సంచిక కోసం
  అవసరమయ్యే చర్చల కోసం టెలి కాన్ఫరెన్స్ సదుపాయం వినియోగించుకోవచ్చు.

  ఆర్ కే లక్ష్మణ్ తమ ఇంటి దగ్గర్నుంచే సేవలు అందించేలా సాంకేతిక హంగులను సమకూర్చి, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వారు చూపిన మార్గం ఇప్పటికే ఉంది. ‘చందమామ’యాజమాన్యం అలా ఎందుకు చేయకూడదు? చందమామ ఉజ్వల చరిత్రలో భాగమైన ఓ అద్భుత చిత్రకారుడికి అలాంటి గౌరవం ఇవ్వటం సముచితం కాదా?

 2. రవి on November 2, 2009 1:52 AM

  ఆయన ఇంటివద్ద నుండే పని చేసేలా ప్రత్యేక సదుపాయం ఇవ్వాలి.

 3. చిలమకూరు విజయమోహన్ on November 2, 2009 2:06 AM

  వేణు,రవిగార్ల అబిప్రాయమే నాది కూడా.

 4. SIVARAMAPRASAD KAPPGANTU on November 2, 2009 6:27 AM

  రాజుగారూ,

  ఓ క్షణం గుండె పట్టేసింది, శంకర్ గారు ఇప్పుడెలా ఉన్నారో అని. మరింత చదివినాక, కొంత కుదుటపడ్డాను. శంకర్‌గారి ఆరోగ్యం త్వరలోనే కుదుటపడాలని, వారు ఎప్పటిలాగానే మంచి బొమ్మలు ఆయన మనసుకు నచ్చేవిధంగా వెయ్యగలరని, మనందరిని ఎల్లకాలం అలరించగలరని నా ఆకాంక్ష.

  వెణుగారు చెప్పినట్లుగా, శంకర్‌గారికి ఇంటిదగ్గరనుండే పనిచేసే సదుపాయం చందమామవారు కల్పించాలి, ఈనాటి సాంకేటిక ఉపకరణాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఇంతటి సీనియర్ కళాకారునికి చందమామ ఇవ్వగలిగిన అతి చిన్న సౌకర్యం.

 5. chandamama on November 2, 2009 6:34 AM

  వేణు, రవి, విజయమోహన్, శివరాం ప్రసాద్ గార్లకు

  వెంటనే మీరు చూపిన స్పందనకు ధన్యవాదాలు. ఇక్కడ ఓ చిన్న వివరణ అవసరం అనుకుంటున్నాను. శంకర్ గారు ఇంటివద్ద నుంచే పని చేసేలా ప్రత్యేక సదుపాయం ఇవ్వాలని మీరు కోరడం చాలా న్యాయసమ్మతమైనదే. తాజాగా నా దృష్టికి వచ్చిన సమాచారం ఇది.

  శంకర్ గారు వారం రోజులూ ఇంటివద్దే ఉండి పని చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు కల్పించడానికి చందమామ ఎప్పుడో సిద్ధమై పోయింది. చందమామలోని ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులూ కూడా ఈ విషయమై గతంలోనే సలహా చెప్పారట. ఈ వయసులో ఇరుకుగా ఉంటే క్యాబ్‌లో, ట్రాఫిక్ కాలుష్యంలో అంతదూరం ప్రయాణించి రావడం కష్టం కాబట్టి ఆగిపోయి ఇంటివద్దే పనిచేయవచ్చని. ఆయనకు ప్రత్యేక సదుపాయం కల్పించడానికి కూడా చందమామ సిద్ధమైంది.

  కానీ ఆయన పట్టుదల ముందు ఈ ప్రతిపాదన వీగిపోయింది. నెలంతా ఇంటిలోనే ఉండి పనిచేయడం కష్టం. నాకు కొంచెం స్థలమార్పు కావాలి. అందుకే మూడురోజులు మాత్రం కార్యాలయానికి వచ్చి తక్కిన రోజులు ఇంట్లోనే ఉండి పనిచేస్తానని ఆయన చెప్పారట. దీంతో చేసేదేమీ లేక ఆయన ఇష్టప్రకారమే చందమామ వ్యవహరిస్తోంది.

  ఈరోజు కూడా ఆయన క్యాబ్‌లో శ్వాస సమస్యతో బాధపడుతున్నట్లు పక్కనున్న వారు గమనించి వెంటనే బండి ఆపి పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంత పొద్దునే ఆయనకు ఈసీజీతో సహా అన్ని పరీక్షలూ తీయించి. వాటికయ్యే ఖర్చును చందమామ ఉద్యోగులే తమ వద్ద ఉన్నమేరకు తలా ఇంత అని వేసుకుని చెల్లించి వేశారట.

  కాస్త తేరుకున్నాక, మీకు విశ్రాంతి కావాలని డాక్టర్ చెప్పారు. ఇంటికి వెళ్లి పడుకోండి అని తోటి ఉద్యోగులు చెబితే ఆయన నేరుగా ఆఫీసుకే వచ్చి అక్కడే విశ్రాంతి తీసుకుంటానులే అని అన్నారు. ఇక్కడా ఇతరులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించకూడదనే ఆయన తాపత్రయం. తన కోసం క్యాబ్ వస్తే మిగతావారంతా ఆపీసుకు పోవాలి కదా అని ఆలోచన.

  అలా చికిత్స తర్వాత శంకర్ గారు నేరుగా అదే క్యాబ్‌లో ఆఫీసుకు వస్తే ఇక్కడ అందరూ మాట్లాడి ఆయనను అదే క్యాబ్‌లో మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి వచ్చిన ఆయన సంతానం ఆయనకు అవసరమైన పరీక్షలకోసం వేచి ఉన్నారు.
  బహుశా ఈ సాంయంత్రం ఆయన ఇంటికి వెళ్లవచ్చు. రేపు కూడా ఆఫీసుకు రాకపోవచ్చు. ఆయన రాగానే మీరు తన ఆరోగ్యం గురించి పరామర్శించిన విషయం తెలియజేస్తాను.

  చందమామలో శంకర్ గారంటే అపారమైన అభిమానం ఉంది. విశిష్ట గుర్తింపు ఉంది. పెద్దతరం నుంచి పిల్లతరం వరకు అందరూ ఆయన ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెట్టుకునే ఉంటున్నారు. ఆయన చెప్పకపోయినా తనకు ఏదో అవుతోందని పక్కనున్న వారు గమనించి అఘమేఘాల మీద ఆసుపత్రికి తీసుకెళ్లడమే ఇందుకు గుర్తు.

  పసిపిల్లాడికి తగిన మొండితనంతో ఆయన ఆఫీసుకు కూడా తనంతట తాను వస్తున్నారు తప్పితే తాను తప్పక ఆఫీసుకు అటెండ్ కావలిసిందే నని ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదు. ఉన్న నిబంధనలను సడలించడానికి కూడా సిద్ధమయిన చోట ఆయన స్వచ్చంద నిర్ణయంతో చందమామకు ఈ వయసులోనూ వ్యయప్రయాసలకు ఓర్చి వస్తున్నారు.

  అది కూడా సాధ్యం కాని పరిస్థితి వచ్చినప్పుడు తనంతట తాను నిర్ణయం తీసుకుని ఆగిపోవలసిందే తప్ప ఆయనను ఈ విషయంలో ఎవరూ శాసించలేరు కదా..

  అంతవరకు ఆయన చందమామకు వస్తూనే ఉంటారు.

  మీ తక్షణ స్పందనకు నెనర్లు.

 6. kcubevarma on November 2, 2009 9:21 AM

  నిజమే, కొంతమంది పని రాక్షసులుంటారు. వారు ఎవరి మాటా వినరు. ఇలా అనడం వారి పట్ల ప్రేమతో మాత్రమే. వారికి పనిలో వున్న తృప్తిని ఏదీ ఇవ్వలేదు. అందుకే వారు దాని నుండి దూరమైతే మనకు అందని దూరం పయనిస్తారు. కాబట్టి వారికి పని కల్పించగలగడంలోనే మనం వారిని మరికొంత కాలం మనమధ్య చూసుకొనగలం. మాకూ చలసాని ప్రసాద్ లాంటి వారున్నారు. ఈనాటికీ ఎక్కడకురమ్మన్నా సమయానికి హాజరయి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆయన ఎనభైల దగ్గరకు వస్తున్నా అలుపెరగకుండా నేటికీ విశాఖలో వుంటే స్కూటర్ పై వెలతారు రోజూ.
  శంకర్ గారు తన శిఖలో ధరించిన చందమామను మరింత అందంగా మనముందుంచేందుకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను…

 7. సుజాత on November 2, 2009 11:35 AM

  ఒక్కక్షణం కలవరపెట్టేశారండీ! శంకర్ గారూ ఇప్పుడెలా ఉన్నారు? ఈ వయసులో అనారోగ్యానికి గురైనా మొక్కవోని విశ్వాసంతో ఆయన మీ అందరికీ ధైర్యం చెప్పారంటే ఆశ్చర్యం వేస్తోంది. ఆఫీసులోనే పని చేయాలన్న ఆయన పట్టుదల మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

  శ్రీ శంకర్ త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన ఇష్టప్రకారమే చందమామ ఆఫీసులోనే అద్భుత చిత్రాలను మా వంటి అభిమానుల కోసం గీస్తూ గీస్తూ …..గీస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.

 8. chandamama on November 2, 2009 1:47 PM

  వర్మగారూ,

  మీరు వాడిన పనిరాక్షసులు అనే మాట శంకర్ గారికి చక్కగా సరిపోతుంది. వారికి పనిలో ఉన్న తృప్తి మరి దేంట్లోనూ దొరకదనేది కూడా వాస్తవమే. వారికి పని కల్పించగలగడంలోనే మనం వారిని మరికొంత కాలం మనమధ్య చూసుకొనగలం. ఇదీ వాస్తవమే..

  చలసాని ప్రసాద్ గారి గురించి నాకు తెలుసు. 1980ల మధ్యలో శ్రీశ్రీ, కుటుంబరావు గార్ల బృహత్ సంపుటాలను సంకలనం చేయడంలో, వారి రచనల సేకరణలో ఆయన చేసిన అనితర సాధ్యమైన కృషిని ఎలా మరువగలం? మరోసారి కొకు గారి 16 సంపుటాల సాహిత్య సర్వస్వం ఈయన అధ్వర్యంలోనే జరుగుతోంది కదా.

  ఇప్పటికే నాలుగు భాగాలు తీసుకున్నాం. మిగిలిన భాగాల ముద్రణను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయగలరని ఆశిస్తున్నాం. కొకు గారి వ్యాసాల్లోని నూతన ప్రపంచ భావ వీచికలకోసం మహాసక్తితో ఎదురు చూస్తున్నామని ఆయనకు చెప్పగలరు.

  “చందమామను తన శిఖలో ధరించిన శంకర్‌గారు” చక్కటి ప్రతీకాత్మక వ్యాఖ్య. మీకు ధన్యవాదాలు.

  సుజాత గారూ!

  శంకర్ గారికి ఇప్పుడు ఫర్వాలేదు. రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన చందమామ కార్యాలయానికి తిరిగి రావచ్చు. మేమంతా ఎవరి వేదనలో వారుంటే ఆయన దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. తన ఆరోగ్యం పట్ల ఇంతమంది కలవరపడటం కూడా ఆయనకు వింతగా అనిపించి ఉండవచ్చు.

  పదిమంది తోడుగా ఉన్నప్పుడు తనకు శ్వాససమస్య రావడం కూడా దైవ కృపలో భాగంగానే చూసేంత పరమ సాంప్రదాయికవాది ఆయన. ఎవరూ లేనప్పడు ఇలాంటిది జరిగి ఉంటే ఏమై ఉండేదో కదా అని లాజిక్‌ను కూడా ఆయన ఉపయోగిస్తుంటే అంత బాధలోనూ నవ్వు వచ్చింది.

  “చందమామ ఆఫీసులోనే అద్భుత చిత్రాలను మా వంటి అభిమానుల కోసం గీస్తూ గీస్తూ …..గీస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.” మీ కోరిక ఫలించాలన్నదే మా అందరి ఆకాంక్ష కూడా..

  మీకు నెనర్లు

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind