శంకర్ గారి నోట కమ్మటి తెలుగుమాట

శంకర్ గారి తెలుగు మాట
శంకర్ గారికి ఇప్పుడు ఫర్వాలేదు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే ఆయన చందమామ కార్యాలయానికి రావచ్చు. ఆపీసుకు రాకుండా ఇంట్లో నుంచే తాను పనిచేసుకునే అవకాశాన్ని, సౌలభ్యాన్ని కల్పిస్తామని చందమామ వారు ఎప్పుడో తనకు సూచించినప్పటికీ ఒంటరిగా కాకుండా మనుషుల్లో ఉంటూ పనిచేసుకోవడంపై మమకారంతో ఆయన స్వచ్చందంగా చందమామ ఆఫీసుకు వస్తున్నారు. ఆయన స్వస్థత పొందిన సందర్భంగా ఆయనలోని ఓ అరుదైన గుణాన్ని చందమామ అభిమానులతో పంచుకోవాలని ఉంది.
ఈ మూడు నెలల పరిచయ కాలంలో తనతో మాట్లాడిన ప్రతిసారీ ఆయన చక్కటి తెలుగులో మాట్లాడటం గమనించాను. మద్రాసులో ఉన్న లేదా తమిళనాడులో ఉన్న తెలుగువారు రెండు భాషల సంపర్క ప్రభావానికి గురై తెలుగు క్రియకు నుకారాంతాన్ని జోడించి వినగానే నవ్వు వచ్చేలా పదజాలాన్ని ప్రయోగించడం నాకు గత 13 ఏళ్లుగా అనుభవమే.
వాక్యం చివరలో వచ్చును, తెచ్చును, కొట్టును, పాడును, చేయును, పూడ్సును అని మద్రాసుకు మాత్రమే తెలిసిన పద ప్రయోగాలతో కూడిన వింత భాషను చదువుకున్న తెలుగువారే ఉపయోగించడం చాలా సహజంగా ఉంటోంది. అలాంటిది… తమిళుడైన శంకర్ గారు స్వచ్ఛమైన తెలుగును తియ్యగా పలుకడం చూస్తుంటే విన్నప్పుడల్లా ఆశ్చర్యమేస్తూ ఉంటుంది.
మూడు వారాల క్రితం ఈ విషయమై సందేహ నివృత్తికోసం ఆయననే నేరుగా అడిగేశాను. ఆ సందర్భంగా భాషాధ్యయన, భాషాభ్యసన చరిత్రలోనే అపూర్వమైన విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. జన్మతా తమిళుడైన మీరు ఇంత స్వచ్ఛంగా తెలుగులో ఎలా మాట్లాడగలుగుతున్నారని అడిగితే ఇలా సమాధానం చెప్పాపాయన.
రాయడం, చదవడం తెలియక పోయినా తెలుగు బాగా మాట్లాడడానికి వారి తల్లి ప్రధమ కారకురాలట. ఎందుకంటే చిన్నతనంలో తల్లి బయట పనులు చేసే క్రమంలో మద్రాసులోనే అన్ని భాషలవారితో పరిచయాలు ఏర్పడ్డాయట. ఒకసారి వింటే చాలు అట్టే పట్టేసుకునేటటువంటి నిశిత గ్రాహ్య శక్తితో ఆమె ఏకకాలంలోనే అయిదారు భాషలను అలవోకగా నేర్చుకుని మాట్లాడేదట.
అప్పట్లో మద్రాసు అంటే తెలుగు నాడు అని లెక్క కాబట్టి ఈమె ఇంట్లో తెలుగు కూడా ఉపయోగించేదట. ఇది బాల్య ప్రభావం కాగా, ఆయన నోట తీయటి తెలుగు మాట రావడానికి మరో కారణం తెలుసుకుంటే గమ్మత్తుగా ఉంటుంది.
మరేంలేదు.. చందమామే శంకర్ గారికి తెలుగు భాషను నేర్పింది. అదీ చక్కటి తెలుగు భాషను మాట్లాడటం నేర్పించింది. ఎలా అంటే కథలకు బొమ్మలు వేసేటప్పుడు విషయాన్ని చిత్రకారులు తమ తమ మార్గాలలో గ్రహిస్తారు. రచయిత లేదా సంపాదకుడు కథను తన మాటల్లో వివరిస్తే దాన్ని బట్టి బొమ్మలు గీసేవారు ఒక రకం, కథను పాయింట్లుగా రాసి ఇస్తే దాన్ని చూసుకుని బొమ్మలు గీసేవారు కొందరు.
శంకర్ గారికి కథను పూర్తిగా చెప్పించుకుని తర్వాత మనసులో బొమ్మను ఊహించుకుని గీయటం అలవాటు. ఎవరో ఒకరి వద్ద తెలుగులో ముందుగా కథను పూర్తిగా చదివించుకుని వింటారీయన. తర్వాత కథకు తగిన బొమ్మ గీయటానికి పూనుకుంటారు.
ఇలా ఒకటి, రెండూ, మూడూ కాదు.. 57 ఏళ్లుగా చందమామ కథను తెలుగులో చదివించుకున్న క్రమంలో శంకర్ గారికి యాదృచ్ఛికంగా తెలుగు మాట్లాడటం వచ్చేసింది. మరి తెలుగు యాస లేకుండా ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే ఇంకా గమ్మత్తైన విషయం చెప్పారీయన. దానికి కూడా చందమామే కారణమట.
ఎలాగంటే.. చందమామ మొదటినుంచీ ప్రాంతీయ యాసలకు దూరంగా ఉంది. ఒక్కో ప్రాంతానికే పరిమితమై ఉండే రకం జాతీయాలకు, నుడికారాలకు, వర్ణనలకు చందమామ చాలా దూరంగా ఉంది. ఒక ప్రాంతం వారికి అర్థం కాని రీతిలో ఉండే యాసను పత్రికలోకి ఎందుకు తెస్తారు అనేది చక్రపాణి గారి మార్కు వ్యాఖ్య.
దీంతో చందమామను ఆబాలగోపాలమూ, ప్రాంత భేదాలెరుగకుండా తెలుగు దేశంలోని అన్ని రీజియన్లు తమ స్వంతం చేసుకునేవి. ఈ క్రమంలోనే శంకర్ గారికి చందమామ భాష వచ్చేసింది. చిత్రరచనకోసం చందమామ కథలను దశాబ్దాలుగా చదివించుకుని వింటూ వచ్చిన శంకర్ గారు అలా చందమామ భాషకు దాసోహమైపోయారు.
“మా తెలుగు బాల్యానికి ధన్యవాదాలు” అని గత రాత్రి పంపిన టపాలో నేను రాసినట్లుగా “ఐ నెవర్ స్పీక్ తెలుగు” బాపతు గాళ్లు రాజ్యమేలుతున్న పాడు కాలమిది. తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్ది బతుకుతున్న విషకీటకాలు చెప్పే చదువుల రంధిలో తెలుగు దేశం ప్రస్తుతం కాలిపోతోంది.
ఇక్కడ… 55 సంవత్సరాలుగా చందమామ అనుబంధంతో జీవితం పండించుకుంటూ వచ్చిన కేసీ శివశంకరన్ అనే ఓ తమిళుడు.. అదే… మన శంకర్ గారు… చందమామ కథా శ్రవణం సాక్షిగా తెలుగు మాటలు నేర్చుకుని తెలుగు భాష విలువను ఆకాశమంత ఎత్తులో నిలిపారు. జీవిత ఔన్నత్యానికి, పతనానికి వార మనకు ఇక్కడ సులభంగానే బోధపడుతోంది కదా!
శంకర్ గారూ, మీకూ, మీరు వాడే ఆ చక్కటి చందమామ భాషకు శతకోటి వందనాలు..
మీ నోట జాలువారే ఆ చందమామ భాష తియ్యదనాన్ని ఆస్వాదించేందుకోసమయినా మీరు ఆరోగ్యంగా ఉంటూ, మాతో కలిసి మరి కొంతకాలం పనిచేయండి. మా చిన్ని జీవితాలకు ఇది చాలు…
Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Tags: కథలు, చందమామ, చందమామభాష, తమిళుడు, తెలుగు, మద్రాసు, యాస, శంకర్, శివశంకరన్ | Comment (0)చందమామ శంకర్ గారికి అనారోగ్యం

శంకర్ గారు
వారాంతపు సెలవుల తర్వాత ఉదయం చందమామ కార్యాలయానికి క్యాబ్‌లో వస్తున్నాం. తిరువాన్మయూర్ దాటుకుని నీలాంకరై వేపుకు బండి వస్తుండగా ఉన్నట్లుండి మా మరో క్యాబ్ డ్రైవర్ మా వైపు పరుగెత్తుకొచ్చారు. ఏమై ఉంటుంది అని ఒక్కసారిగా మాలో ఉద్రిక్తత. ఆ క్యాబ్‌కు ప్రమాదం ఏమైనా జరిగిందా అని కలవరం.
విషయం మరోలా ఉంది. ఆ క్యాబ్‌లో విరుగంబాక్కం నుంచి వస్తున్న శంకర్ గారు ఉన్నట్లుండి అనారోగ్యానికి గురయ్యారట. తనకే తెలీకుండా ముఖం వివర్ణమయిపోయిందట. పక్కన ఉన్నవారు గమనించి పక్కనే ఉన్న ఆసుపత్రికి బండిని తీసుకెళ్లి ఆయనకు ఈసీజీ వగైరా పరీక్షలు చేయించారు.
ప్రమాదం లేదని, నాడి మామూలుగా కొట్టుకుంటోందని వైద్యులు చెప్పారట. ఉన్నట్లుండి ఆయన శరీరంలో మార్పులు సంభవించాయి ఒక రోజంతా విశ్రాంతిలో ఉంచి పరీశీలనలో పెట్టాలని సూచించారట. తర్వాత మిగిలిన సిబ్బందితో పాటు ఆయనా ఆఫీసుకు అదే క్యాబ్‌లో వచ్చారు.
రాగానే, ఆయనను కలిశాము. పరామర్శించడానికి రావడంతో ఆయన మాకే ధైర్యం చెప్పారు. “ఏం జరగలేదు. ఉన్నట్లుండి ఒళ్లు అలసినట్లనిపించింది. ఏమయిందో నాకు అర్థం కాలేదు. ఎందుకయనా మంచిదని మనవాళ్లు పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకుపోయారు. ఈసీజీ, మరికొన్ని పరీక్షలు చేయించారు. అంతా నార్మల్‌గానే ఉందని చెప్పారు. ఒక రోజు పని చేయవద్దని, విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అంతే మరేం కాలేదు” అంటూ చేయి పట్టుకుని నవ్వారు.
“ఇదీ దైవకృపే మరి. నిద్రలోనే ఏదయినా జరిగి ఉంటే ఏమయ్యేదో కదా.. ఇంతమంది మధ్యన క్యాబ్‌లో అలా జరిగింది కాబట్టి వెంటనే చికిత్స చేయించారు. ఏం కాలేదు. వారి సలహా ప్రకారం ఇంటికి వెళుతున్నా” అని చెప్పారు.
తర్వాత ఆయనను ఇంటివరకు తీసుకుపోయి దింపడానికి సహాయకులు వెంటరాగా ఆయన వెళ్లిపోయారు. 85 ఏళ్లు పైబడిన ఆయన చివరివరకు చందమామలో పనిచేయాలనే మొండి పట్టుదలతోటే దాదాపు 10 కిలోమీటర్ల పైగా దూరం క్యాబ్‌లో ప్రయాణం చేస్తున్నారు. వారంలో తొలి మూడు దినాలు కార్యాలయానికి వస్తూ మిగతా రెండు రోజులు ఇంటివద్దే ఉండి పనిచేస్తున్నారు.
ఈ క్యాబ్‌లో ప్రయాణం వల్ల వళ్లు అదురుతూ, నడుము నొప్పి వస్తోందని, అందుకనే మా ఆవిడ ఈ వయసులో ఇంత శ్రమ ఎందుకు, పని ఆపేయకూడదా అంటోందని పది రోజుల క్రితం కలిసినప్పుడు చెప్పారు. నడుము కాసేపు వత్తించుకుంటే తగ్గిపోతుందని ఈ మాత్రం దానికి అలసిపోతే ఎలాగన్నది ఆయన పట్టుదల.
తన బిడ్డలు ఎదిగి వచ్చి పైకి ప్రస్తుతం చెన్నైలోనే మంచి స్థితిలోనే ఉన్నా, ఓ మేరకు సుఖమైన విశ్రాంతి జీవితాన్ని చివరి దశలో గడిపే సౌకర్యం ఆయనకు బిడ్డల ద్వారా ఏర్పడినా సరే తాను పనిచేయడం ద్వారా మాత్రమే బతకాలని, కన్న బిడ్డలమీద అయినా సరే ఆధారపడకూడదని ఆయన చెప్పారు. అదే విశ్వాసంతోటే చందమామలో పనిచేస్తున్నారు కూడా. ఈ వయసులో మీరు పనిచేసి బతకాలా అని బిడ్డలు నిష్టూరమాడినా గత కొన్ని ఏళ్లుగా ఆయన ఇలాగే పనిచేస్తున్నారు.
తన తరం ఆయుఃప్రమాణాల ప్రకారం చూసినా మరో పదేళ్లు ఆరోగ్యంగా గడిపే అవకాశం ఆయనకు ఉంది. ఏ దుర్వ్యసనాలకు అలవాటు పడని శరీరం కాబట్టి ప్రాథమికంగా ఇంతవరకు ఆయన ఆరోగ్యవంతుడి కిందే లెక్క. ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా జరగడంతో మాకందరికీ ఒక్కసారిగా కలవరం.
రాత్రి 11 గంటల వరకు పనిచేస్తూ పోయానని. ఆ శ్రమ భారం కూడా ఇలా బయటపడిందేమో అని ఆయన సందేహం. జీవితంలో ఒక దశకు చేరుకున్న తర్వాత రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోవడం ఆరోగ్యానికి భంగకరమే.. ఇక అయినా జాగ్రత్తలు తీసుకోమని సూచించాము.
మా కళ్లముందే ఆయన క్యాబ్‌లో వెళ్లారు. ప్రింట్ విభాగంలోంచి కొందరు పెద్దలు తోడు రాగా ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు ఏమీ కాదనే, కాకూడదని, మళ్లీ మాతో కలిసి పనిచేయాలని. మాతో ఉండాలని ప్రగాఢంగా కోరుకుంటూ లోపలకు వచ్చేశాం.
చందమామ అభిమానులు, చందమామ స్పర్ణయుగ ప్రేమికులు, చందమామ చిత్రకారుల ఏకలవ్య శిష్యులూ కూడా ఆయన ఆరోగ్యం గురించి పరామర్శిస్తారని, ఆయన మరి కొంతకాలం చల్లగుండాలని కోరుకుంటారని ఆశిస్తున్నాం. .
శంకర్ గారూ!
మీకోసం బేతాళుడు కూడా కలవరపడుతూ ఉంటాడు. కోరిన కోరికలు నెరవేర్చే ఆ బేతాళుడు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహిస్తాడని, తన బొమ్మలు మీ చేత మరికొంత కాలం గీయించుకుంటాడని, చందమామ బేతాళుడికి ‘శంకర’ పురస్కారం భవిష్యత్తులో కూడా అందుతుందని, అందాలని మేం మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
మా ఈ చిన్న కోరికను మీరు మన్నిస్తారని ఆశిస్తూ,
మీ ఆరోగ్యం చల్లగా ఉండాలని కోరుకుంటూ… మీనుంచి చల్లటి వార్తకోసం ఎదురుచూస్తూ…
మీ చందమామ.
Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Tags: అనారోగ్యం, అలసట, కార్యభారం, చందమామ, చిత్రమాంత్రికులు, నిద్రలేమి, బేతాళుడు, విశ్రాంతి, శంకర్, శివశంకరన్ | Comments (8)






