చిత్రా, శంకర్‌, ఆచార్యలపై మరికొంత

October 27th, 2009

వేణూ గారూ! చాలా పొరపాటు జరిగిపోయింది. చందమామ కలెక్టర్ ఎడిషన్‌ను తెలుగులో ప్రచురించే పనుల్లో ఉండి గత వారం రోజులపైగా అనువాదాల ఒత్తిడిలో ఉండి ఇంటర్నెట్ చాలా తక్కువగా చూడటం. మధ్యలో ఓ మూడురోజులు తప్పనిసరై తిరుపతి, కడపలకు వెళ్లవలసిరావడంతో మీ హృదయంలోంచి వచ్చిన ఈ అపరూప కథనం -“చందమామ’పై చెరగని సంతకం ‘చిత్రా’-  చూడటం కుదరలేదు.

ఇవ్వాళ కూడా ఎందుకో మీ బ్లాగును రెఫర్ చేయాలనిపించి తెరిచి చూస్తే మహాద్భుత దృశ్యం ఇదిగో ఇలా కళ్లముందు సాక్షాత్కరించింది. రెండు రోజులు కూడలి, జల్లెడ, హారం కేసి చూడలేకపోయినా, చందమామ అభిమానుల బ్లాగులు తెరువలేకపోయినా ఎంత ప్రమాదం జరుగుతుందో ఇప్పటికి ఏ నాలుగోసారో, అయిదో సారో నా అనుభవంలోకి వచ్చింది. అందులో తాజాగా మీది.

అందుకే కనీసం చందమామ అభిమానులు అయినా తాము కొత్తగా ఏదైనా రాసినప్పుడు ప్రత్యేకించి చందమామ గురించి, దాని చిత్రకారుల గురించి కథనం రాసిన పక్షంలో ఆ విషయాన్ని ఊరికే పోస్ట్ చేసి ఊరుకుండటం కాకుండా మనందరి ఈమెయిళ్లు కాస్త ఒపికగా సేకరించి అందరికీ బల్క్‌మెయిల్ రూపంలో మన కొత్త లింకులను పరస్పరం పంపగలిగితే ఎంత బాగుంటుందని గతంలోనే నేను రెండు మూడు సార్లు మొత్తుకున్నాను కూడా.

ఎందుకంటే అగ్రిగేటర్ సైట్లలో మన కథనాలు ఉంచినా, తాజాగా మంచి కథనాలు పోస్ట్ చేసినా సరే్ ఒక్కోసారి కాదు చాలాసార్లు అనివార్యంగా వాటిని సకాలంలో చూడలేని ఘటనలు నా అనుభవంలో చాలా సార్లు వచ్చాయి. ఇకనైనా మనం ఇలాంటి సందర్భాల్లో స్వయంగా మన రచనల పరస్పర పంపకం చేస్తేనే బాగుంటుందని బలంగా భావిస్తున్నా..

పరిమిత వనరులతో అయినా సరే చిత్రాగారి బొమ్మల గురించి ఇంత చక్కటి కథనం ప్రచురించారు. ఇదే మీరు చందమామ ఆఫీసుకు వచ్చి చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా గార్ల చిత్రాలు భారీ సైజులో చూడగలిగితే మీరు, శివరాం ప్రసాద్ గారు వంటి వారు ఎంత చక్కటి ప్రేరణ పొంది ఉండేవారో మాటల్లో చెప్పలేను.

కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. దాసరి సుబ్రహ్మణ్యం, చిత్రా గార్ల గురించి మీరు చేసిన కృషి చందమామ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ఇదే విధమైన క్వాలిటీ రైటింగ్‌ను మీరు, శివరాం గారు, తదితరులు కొనసాగించగలరని ప్రగాఢంగా ఆశిస్తున్నాను.

దీని కొనసాగింపుగా చిత్రా, శంకర్ గార్లపై నేను పొందుపర్చిన వార్తా విశేషాల సమాచారం ఓ పెద్ద కథనంలాగా తయారవడంతో దాన్ని మీ బ్లాగులో కామెంట్ రూపంలో పెట్టడం బాగుండదనే ఉద్దేశంతో ఈ మొత్తం కథనాన్ని నా చందమామ చరిత్ర బ్లాగులో పోస్ట్ చేయాలనుకుంటున్నాను.

చిత్రా గారి అస్తమయం గురించి “చందమామ గుండె పగిలిన వేళ” అనే పేరుతో నా బ్లాగులో రెండు వారాలక్రితం కథనం రాస్తూ ఆయన జీవిత వివరాల గురించి వచ్చే టపాలో తెలుసుకుందామని రాశాను. శంకర్ గారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలిపారు. పైగా ఆయన 40 లేదా 50 ఏళ్ల క్రితం తన ఫోటో ఆల్బమ్‌లలో దాచుకున్న అపరూప చిత్రాలను ఒక్కటొక్కటిగా మాకు అంద జేస్తున్నారు.

సరిగ్గా వారం రోజుల క్రితమే ఆయన చిత్రాగారి అపరూప చిత్రాలు కొన్ని మాకు అందించారు. అవి అంత స్పష్టంగా లేకపోవచ్చు కానీ, చిత్రలేఖనంతో జీవితం పండించుకున్న ఇద్దరు చిత్రకారుల అపరూప జ్ఞాపకాలుగా చూడగలిగితే వాటి విలువ మనకు తెలుస్తుంది. అసలు చిత్రాగారికి ఫోటోగ్రపీపై ఉన్న అవగాహనను మరింత మెరుగుపర్చిందీ, ఆయనకు ఉత్తమ నాణ్యత కలిగిన కెమెరాలను దగ్గరుండి చూపించి మరీ కొనేలా చేసీందీ శంకర్ గారేనట.

చందమామ కలెక్టర్ ఎడిషన్‌లో ఉన్న గ్రూప్ పోటోలోని ఫోటోల్లో చిత్రాగారిని తదితర ప్రముఖులను గుర్తుపట్టి శంకర్ గారు గతవారంలో వివరంగా రాసి ఇచ్చినప్పుడు నాకు ఒక్కసారిగా ఎగిరి గంతేయాలనిపిపించింది. చిత్రాగారి సమకాలికులు, చందమామ తొలి ఇన్‌ఛార్జ్ ఎడిటర్ రాజారావు గారి టీమ్ సభ్యులు ముద్దా విశ్వనాధం గారి ఫోటోలు ఇక దొరకవు అని నిశ్చయించుకున్న తరుణంలో అతి స్పష్టంగా కనిపించే ఆయన ఫోటోను శంకర్ గారు ప్రసాదించారు.

ఎంటీవీ ఆచార్య గారి ఫోటోయే ఇంకా దొరక్కుండా మిగిలిపోయింది. ఆయన వ్యక్తిగత చరిత్ర కాని, చందమామలో ఆయన పోషించిన పాత్ర కాని చెప్పేవారు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఆయన తన పనులమీద పదే పదే చందమామను విడిచి బెంగళూరు వెళ్లిపోవడం, తన చిత్రాల ప్రదర్శన పట్లే మక్కువ పెట్టి రష్యా వంటి దేశాలకు కూడా వెళ్లడం, ఈ క్రమంలో చందమామలో తను గీసిన అపరూప చిత్రాల ఒరిజినల్ నమూనాలను తన వెంట తీసుకుపోయి తిరిగి ఇవ్వకుండా అట్టే పెట్టుకోవడం వంటి ఘటనలతో శంకర్ గారికి కూడా ఎంటీవీ ఆచార్య గారిపై పెద్దగా గౌరవభావం లేనట్లు కనిపిస్తోంది. కన్నడ మేధావి వర్గాలలో ఆచార్య గారి గురించి జరిగిన చర్చలు ఆన్‌లైన్‌లో అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ తన వ్యక్తిగత వివరాలు దాదాపుగా దొరకని స్థితి.

వేణు గారూ, మీ తదుపరి ప్రాజెక్టు ఎంటీవీ ఆచార్య గారిమీదే అయితే మీ సోర్సులో మీరూ తన వ్యక్తిగత వివరాలకోసం ప్రయత్నించగలరు. అలా కాక వపాగారిపై మీరు దృష్టి పెడుతున్నట్లయితే తన గురించిన సమాచారం కొంచెం నా వద్ద కూడా ఉంది. ఈ మధ్యే 70, 80ల నాటి ఆయన ఫోటోను స్వాతి వార పత్రిక వారినుంచి సంగ్రహించాము.

చిత్రాగారి వ్యక్తిగత, ఉద్యోగ జీవితం గురించి శంకర్‌గారు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. కాని కలెక్టర్ ఎడిషన్ అనువాదాల పనిలో ఉండి గత వారం, పది రోజులుగా ఈ విషయం పక్కకు పోయింది. మీరు, ఇంతకుముందే శివరాం ప్రసాద్ గారు చిత్రాగారి చిత్రాల గురించి రాసిన సమాచారానికి ఆయన వ్యక్తిగత వివరాలు కూడా తోడయితే ఓ సమగ్ర చిత్రం వస్తుందనే నా అభి్ప్రాయం.

అలాగే శంకర్ గారి గురించి తమిళ, ఆంగ్ల పత్రికలలో ప్రచురించిన అయిదారు వ్యాసాలను కూడా ఆయన ఈ మధ్యే ఇచ్చారు. 1960లలో చందమామ సిబ్బంది సిలోన్ యాత్రకు సంబంధించిన పూర్తి ఆల్బం కూడా ఇచ్చారు. ఇంకా 1946లో స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో కోర్సు పూర్తయిన సందర్భంగా తీసుకున్న గ్రూప్ ఫోటో కూడా ఆయన ఇన్నాళ్లుగా భద్రపర్చారు. ఎన్ని అరుదైన చిత్రాలను ఆయన కాపాడుకుంటూ వచ్చారంటే ఒక్క మాటలో వర్ణించలేము.

ఈ అనువాదాల ఒత్తిడి నా అన్నిపనులనూ మింగేస్తోంది. కానివ్వండి ఆలస్యంగా అయినా సరే. వీరి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ఖాళీని పూడ్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను..

కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. దాసరి సుబ్రహ్మణ్యం, చిత్రా గార్ల గురించి మీరు చేసిన కృషి చందమామ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ఇదే విధమైన క్వాలిటీ రైటింగ్‌ను మీరు, శివరాం గారు, తదితరులు కొనసాగించగలరని ప్రగాఢంగా ఆశిస్తున్నాను.

చందమామ కలెక్టర్స్ ఎడిషన్ -60 ఏళ్ల సందర్భంగా ప్రచురించినది-, చందమామ చిత్రకారుల చిత్రాలపై విడి విడి పుస్తకాల ప్రచురణ కు సంబంధించిన పనులు ఊపు అందుకుంటున్నాయి. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈసారి ఇవి ఖాయంగా వెలుగు చూస్తాయనిపిస్తోంది.

“చందమామ’పై చెరగని సంతకం ‘చిత్రా’ ” పేరిట వేణుగారు రాసిన కథనం ఇక్కడ చదవండి.
http://venuvu.blogspot.com/2009/10/blog-post.html

చిత్ర – చందమామ అద్భుత చిత్రకారుడు” పేరిట శివరాం ప్రసాద్ గారు రాసిన కథనం ఇక్కడ చదవండి.

RTS Perm Link


2 Responses to “చిత్రా, శంకర్‌, ఆచార్యలపై మరికొంత”

  1. వేణు on October 27, 2009 10:11 PM

    రాజు గారూ,

    చిత్రా గారి వ్యక్తిగత-ఉద్యోగ జీవిత విశేషాలూ, బొమ్మలూ బయటపడటం ఎంతో సంతోషం కలిగిస్తోంది. చిత్రా, శంకర్ గార్ల అనుబంధం తెలుసుకోవటం చాలా బావుంది.

    ఎంటీవీ ఆచార్య గారి ఫొటో కూడా దొరికితే బావుణ్ణు.

    చందమామ చిత్రకారుల చిత్రాలపై విడి విడి పుస్తకాల ప్రచురణ కు సంబంధించిన పనులు ఊపు అందుకుంటున్నాయనేది విశేషమే.

    మీరు చందమామకూ, పాఠభిమానులకూ వారధిగా ఉన్నారు కాబట్టే ఇలాంటి ప్రాజెక్టులు సఫలమవుతాయని నమ్మకం ఏర్పడుతోంది. మీకు బోలెడన్ని అభినందనలూ, ధన్యవాదాలూ !

  2. chandamama on October 28, 2009 12:03 AM

    వేణు గారూ, కృతజ్ఞతలు. అయితే ప్రాజెక్టుల సాఫల్యతకు సంబంధించి మన పాత్ర ఏమీ లేదనుకోండి. మార్కెట్ దృష్టితో అయినా సరే యాజమాన్యంవారు పూనుకుంటే తప్ప ఇలాంటి అరుదైన పుస్తకాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదనుకుంటాను. అందుకే ఈ పనులు అన్నీ పూర్తిగా ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే అందరికీ తెలియచేద్దామనుకున్నాను కాని, ఈలోగా మీరు చిత్రాగారిపై కథనం సంధించడంతో ఇక ఆగలేక ఇలా బయటపడిపోయాను. అదీ కథ.

    చందమామ చరిత్రకు సంబంధంచి ఓ పథకం ప్రకారం మీవంటి వారు చేస్తున్న కృషి మరింతగా ఫలించాలని కోరుకుంటున్నా.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind