ఈ వారం బేతాళ కథ – రెండు నెమళ్లు
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, ఇంత అర్ధరాత్రివేళ, భీతిగొలిపే ఈ శ్మశాన వాతావరణం, ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా, నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు, నాకు అనుమానం కలుగుతున్నది. కానీ, ప్రకృతిలోని వైపరీత్యాలూ, అందులోని జీవరాసుల ప్రవర్తనా గురించిన అంచనా వేయవలసి వచ్చినప్పుడు, పండితులూ, పామరుల మధ్య ఎంతో భేదభావం గమనించగలం. ఇందుకు ఉదాహరణగా నీకు, చంద్రశర్మ అనే ఒక చిత్రకారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:
ఒకానొకప్పుడు సువర్ణదేశాన్ని పాలించిన సువర్ణదేవ మహారాజు గొప్ప భూతదయాపరుడు. తనదేశంలోని ప్రకృతి పరిసరాలను కాపాడుకోవాలనీ, అందుకుగాను చెట్లకూ, అక్కడ నివసించే పశుపక్ష్యాదులకు కూడా ఎలాంటి హానీ జరక్కుండా రక్షించుకోవాలనీ అందరికీ చెబుతూండేవాడు. ఆయన ప్రతి సంక్రాంతికి ఎడ్లకు పరుగుపందాలతో పాటువాటిలో చూడముచ్చటగా వుండేవాటికి మంచి బహుమతులు కూడా ఇస్తూండేవాడు. ప్రకృతిదృశ్యాలను అందచందాలతో చిత్రించిన చిత్రకారులను కూడా ఘనంగా సన్మానించేవాడు.
రాజధానికి దాపునగల ఒక గ్రామంలో వున్న చంద్రశర్మ మంచి చిత్రకారుడు. ఎవరైనా తమ రూపచిత్రం కావాలని కోరితే, కొద్దిసేపట్లో చిత్రించి ఇచ్చేవాడు. అందువల్ల, ఎంతోమంది ధనవంతులు అతడిచేత తమ చిత్రాలను గీయించుకునేవారు. ఒకసారి చంద్రశర్మ, రాజుగారు సంక్రాంతి నాడు ఏర్పాటుచేసే చిత్రకళా పోటీలలో పాల్గొనదలచి – రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుగల చెక్కపలక మీద, రెండు అందమైన నెమళ్ళు పురివిప్పి ఒకదానికొకటి ఎదురుగా నాట్యం చేస్తున్నట్టు చిత్రించాడు.
ఆ చిత్రాన్ని చూసిన ఒకడు, ‘‘ఆహా, ఎంత అద్భుతం! పురివిప్పిన నెమళ్ళు కళ్ళ ఎదుట నాట్యం చేస్తున్నట్లే వుంది. దీన్ని ఇంటి ముఖ ద్వారానికి వేలాడదీస్తే, ఇంటికే చెప్పరానంత కళ వస్తుంది,’’ అంటూ మెచ్చుకున్నాడు. చిత్రకళలో పరిచయం వున్న మరొకవ్యక్తి, ‘‘మన చంద్రం, నెమలి కంఠం రంగులు బాగా కలిపాడు. ఆ రంగులు అలా ఎవరూ కలపలేరు; ఒకవేళ కలిపినా, ఆ మెరుపు రాదు. రాజుగారు చూస్తే, దీనికి వంద బంగారు నాణేలిచ్చి తనదిగా చేసుకుంటారు,’’ అన్నాడు.
ఈ వారం బేతాళ కథ పూర్తి పాఠం -4 పుటలు- కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97&stId=2287
గమనిక: ఈ కథ చివరలో బేతాళుడు సంధించిన ప్రశ్నకు విక్రమార్కుడు ఇచ్చిన జవాబును ముందుగా చదవకుండా మీరే ఆలోచించి సమాధానం చెప్పండి చూద్దాం. సమాధానం తెలిసీ చెప్పకపోయారో…. మీ శిరస్సు….. అంతే…….
ఆన్లైన్ చందమామలో ఇప్పటివరకు ప్రచురించిన 64 బేతాళ కథలు చదవాలని ఉందా?
అయితే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
test Filed under చందమామ కథలు | Tags: చందమామ, చంద్రం, చంద్రశర్మ, చిత్రకారుడు, చిత్రపటం, ధనవంతులు, నెమలికంఠం, నెమళ్లు, పండితులు, పామరులు, బంగారు, బేతాళ, బేతాళ కథలు, బేతాళుడు, మహారాజు, విక్రమార్కుడు, విక్రముడు, సంక్రాంతి, సాహసం, సువర్ణదేవుడు | Comments (7)7 Responses to “ఈ వారం బేతాళ కథ – రెండు నెమళ్లు”
Leave a Reply
అసలు విక్రమార్కుడు ఎందుకు అలా స్మశానం కి రోజూ వెళ్తాడు..దెయ్యాన్ని రోజూ మోసుకు వెళ్ళాసిన అవసరం తనకేంటి
క్లుప్తంగా మీరడిగిన నేపధ్యం గురించి చెబుతాను. విక్రమార్కుడి అస్థానంలోకి పూర్వం ఓ ముని రోజూ వచ్చేవాడు. వచ్చిన ప్రతిసారీ రాజుచేతిలో పండు పెట్టి వెళ్లే వాడు. పండు కదా అని రాజు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఓరోజు ముని పండు ఇవ్వగానే సందేహం కొద్దీ దాన్ని విప్పిచూసిన రాజుకు పండులోపల మణులు కనపడతాయి. మరుసటి రోజు ముని తిరిగి అస్థానానికి రాగానే తనకు ఎందుకు ఇలా మణుల బహుమతి ఇస్తున్నారని రాజు అడిగాడు. తాను లోకకళ్యాణార్థం ఓ పని చేస్తున్నానని, దానికి నగరానికి దూరంలో ఓ స్మశానంలో ఓ చెట్టుమీద ఉన్న బేతాళుడిని బలి ఇస్తే మంచి జరుగుతుందని ముని నమ్మబలుకుతాడు. వాస్తవానికి అతడు మునిరూపంలోని మాంత్రికుడు. అతడి మాటలు విశ్వసించిన విక్రమార్కుడు స్మశానానికి వెళ్లి చెట్టుమీదనుంచి బేతాళుడిని దించి మోసుకుని పోతుంటాడు. మెలకువతో వున్న బేతాళుడు తనను మోస్తున్న శ్రమ కనబడకుండా ఉండేందుకు గాను రాజుకు కథ చెబుతానని, అయితే కథ విన్నాక చివరలో ఓ ప్రశ్న వేస్తానని దానికి సమాధానం తెలిసి ఉంటే రాజు తప్పనిసరిగా చెప్పాలని షరతు పెడతాడు. రాజు కథవిని చివర్లో బేతాళుడు వేసే పొడుపుకథలాంటి ప్రశ్నకు జవాబు తెలుసు కాబట్టి సమాధానం చెబుతాడు. సమాధానం చెప్పగానే బేతాళుడు రివ్వున ఎగిరి తిరిగి చెట్టుమీద వాలతాడు. మునికి ఇచ్చిన మాటకోసం విక్రమార్కుడు తిరిగి చెట్టుమీదికి వెళ్లి బేతాళుడిని పట్టుకోవడం కథకు సమాధానం చెప్పగానే కథ మళ్లీ కంచికి చేరడం ఇదీ.. బేతాళ కథల నేపధ్యం. చివరలో బేతాళుడి కథకు రాజు సమాధానం చెప్పలేక పోయిన సందర్భంలో కథకు ఓ అద్భుతమైన మలుపు తిరుగుతుంది. ఇది ఒరిజనల్ బేతాళ కథల్లో ఉంది. అవి మొత్తం పాతిక దాకా ఉంటాయి. చందమామ సంస్థ బేతాళ కథల మూలంనుంచి తొలి రెండు మూడు కథలు మాత్రమే ఫార్ములా కోసం తీసుకుని తర్వాత వందలాది కథలను గత 65 ఏళ్లుగా రూపొందిస్తూ వచ్చారు. పాఠకులు ఆదరించినంత కాలం చందమామ బేతాళ కథలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికి 700 బేతాళ కథలు చందమామలో వచ్చి ఉంటాయి. బేతాళ కథలు చివరి భాగం కావాలంటే ఒరిజనల్ బేతాళ కథలు చదవండి. తెలుగులో కూడా ఇవి బాల సాహిత్యం కింద దొరుకుతున్నాయి. లేదా పాత సినిమా భట్టి విక్రమార్క చూసినా మీకు కథ ముగింపు తెలుస్తుంది. చందమామలో బేతాళ కథ తొలి కథ చదవాలంటే ఆన్లైన్ చందమామ ఆర్కైవ్స్ 1972 నాటి సంచికలు తిరగేయండి. చందామామకు పాతికేళ్లు నిండిన సందర్భంగా రజతోత్సవ సంచికలో దాన్ని తిరిగి ముద్రించారు.
ఇది అబద్ధం ఆ నెమల్ల బొమ్మను వేసింది మన శంకర్ గారు కదా చంద్ర శర్మ అని అబద్ధం చెప్తారేంటి?
ఇది అందమైన అబద్దం కదూ.. బొమ్మ వేసింది శంకర్ గారే. కాని చంద్రశర్మ అనే చిత్రకారుడి కథకు గాను ఈ బొమ్మలు వేశారంతే… ఒక్కోసారి అబద్దాలు కూడా అందంగానే ఉంటాయి కదూ..
వ్యాఖ్యకు ధన్యవాదాలు.
thank you sir
రాజశేఖర్ గారు మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు శివరామ ప్రసాద్ గారి ఆతిధ్యాన్ని స్వీకరించడానికి ఆ విశేషాలు చాలా బాగా రాసారండీ ! మీరు మళ్ళీ వెళ్ళాలని మా అభిలాష
అమృతగారూ,
వ్యాఖ్యకు ధన్యవాదాలు. తప్పిపోయిన ఆప్తబంధువును మళ్లీ కలుసుకున్నట్లు అనిపించింది అని ఆయన అన్నారు. ఆతిథ్యాన్ని మించిన మంచిమాట అది. మీ మాట ఫలించాలని కోరుకుంటున్నా కానీ, ఇప్పుడిప్పుడే కాదు లెండి. ఓ మంచి సందర్భం వచ్చినప్పుడు తప్పక కలుసుకుంటాము.