చందమామ ఆత్మకథ

October 16th, 2009

పూర్వకాలంనుంచి భారతీయ జనపదాల నోళ్లలో నానుతున్న లెక్కలేనన్ని కథలను సేకరించి, గుదిగూర్చి, ఆ కథల్లోని నీతి, ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు, ప్రజలకు అందజేయాలని చక్రపాణి గారు కలగన్నారు. ఆ మహత్తర స్వప్నమే 1947లో చందమామగా సాకారమైంది. ఇది చక్రపాణి గారి మానసపుత్రిక, ఆయన కన్న వేల కలల ప్రతిరూపం చందమామ.

ప్రాచీన సంస్కృతిలోని అత్యుత్తమ భావనలను పిల్లలకు అందించాలని, భారతీయ కథలను తమ భావి జీవన సంస్కృతికి పునాదిగా వేసుకుని తరించేలా చేయాలని చక్రపాణి కన్న కలలు సాకారమవడానికి దశాబ్దకాలం పట్టింది. పల్లీయ సంస్కృతిని అణువణువునా పుణికిపుచ్చుకున్న సీమ బిడ్డ నాగిరెడ్డి రూపంలో ఓ మహనీయుడు తోడయిన మహత్తర క్షణాలు చక్రపాణి కలలకు వాస్తవరూపమిచ్చాయి.

భారతీయ పత్రికా ప్రచురణ చరిత్రలో అపూర్వమైన ఘటనకు అలా బీజం పడింది. నాగిరెడ్డి ‘హార్డ్‌వేర్’ చక్రపాణి ‘సాఫ్ట్‌వేరు’ అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఆ అద్వితీయ చరిత్రకు నాంది పలికిన క్షణాలకు చందమామ స్వయంగా అక్షరరూపమిచ్చింది.

పాఠకులూ, అభిమానులూ ఎన్నాళ్లనుంచో వినడానికి కుతూహలపడుతున్న చందమామ ఆత్మకథను 1954 నవంబర్ దీపావళి ప్రత్యేక సంచిక తొలిసారిగా వినిపించింది. దీంట్లో ‘చందమామ కథ’ పేరిట 13 పేజీలలో ఓ పెద్ద వ్యాసం ప్రచురించారు.

రచయితలు రచనలు పంపినది మొదలు, పత్రికను తయారుచేసి రవాణా చేయడం— కలకల్లాడే ఆ చందమామను పాఠకులు అందుకుని ఆహ్లాదంతో చదువుకోవడం వరకూ జరిగే అన్ని దశలనూ, పరిణామాలనూ కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ “చందమామ కథ” లోని విశేషం.

చందమామ సంస్థాపకులు, సంపాదకులు, రచయితలు, చిత్రకారులు, ప్రెస్, ప్రింటింగ్, ప్యాకింగ్ విభాగం, చందమామ స్వంత రాజభవనాలు మొదలైన చందమామ కథా కమీమిషులను మొత్తంగా గుదిగూర్చి ఈ వ్యాసంలో పొందుపర్చారు. దీనిని రెండు భాగాలుగా ఆన్‌లైన్‌లో ప్రచురిస్తున్నాము. తొలి భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాము.

అన్‌లైన్ చందమామలో ఈ కథనంకోసం వేసిన ఫోటోలు సర్వశ్రీ నాగిరెడ్డి, చక్రపాణి, వీరి పుత్రులు ప్రసాద్, తిరుపతిరావు (వరుసక్రమంలో) గా గుర్తించగలరు.
 
చందమామ కథ తొలి భాగం పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2285
 
చందమామ కథ పూర్తి పాఠంకోసం (13 పుటలు) ఆసక్తి కలవారు చందమామ ఆర్కైవ్స్‌లో కింది లింకు తెరిచి లోపలి పుటలలో చూడగలరు.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

RTS Perm Link


3 Responses to “చందమామ ఆత్మకథ”

 1. SIVARAMAPRASAD KAPPGANTU on October 17, 2009 9:09 PM

  రాజుగారూ,

  మీరు వ్రాసిన చందమామ ఆత్మకథ మీ బ్లాగులోనూ, చందమామ ఆన్ లైను లోనూ చదివాను. ఆ పాత విషయాలు చదువుతుంటే హాయిగా ఉన్నది. నవెంబరు 1954 చందమామ నా దగ్గరలేదు. ఉలిబ్ లో కూడ లేదు. చందమామ అర్ఖైవ్స్‌లోకి వెళ్ళి చదవాలి.

  ఏది ఏమైనా ఈ విధంగా సొంత బిడ్డలా చందమామను సాకి అలనాటి పెద్దలు నాగిరెడ్డి గారు చక్రపాణిగారు మన తెలుగు వారికి అపూర్వమైన కానుకను ఇచ్చారు. అనేక తరాల పిల్లలకు మార్గ దర్శకంగా నిలిచింది చందమామ.

  అప్పటి చందమామ లేదు అన్న చేదు నిజాన్ని భరించటం కష్టంగా ఉన్నది.బ్లగులో ఇప్పటి చందమామ గురించి కాని, మనకు ఇష్టమైన పాత చందమామలో ఉన్న ధారావాహికలు గాని వ్రాసి అందిద్దామంటే, ఇప్పటి యాజమాన్యం ఎటువంటి చర్యలకు దిగుతుందో, లేనిపోని గొడవ ఎందుకు అనిపిస్తోంది. ఇప్పటి చందమామ పాఠకుల అభిప్రాయాలకు కూడ ఏమాత్రం స్పందించటంలేదు. చివరకు “మీ వ్యాఖ్య అందింది, ధన్యవాదములు” అని చెప్పటానికి కూడ వారికి చేతులు రావట్లేదనుకుంటాను.చందమామ వారు నేను వ్రాసిన అభిప్రాయానికి సూచనలకు (అంగ్లంలో) చివరకు అందినట్టుగా కూడ స్పందించలేదు. అందుకని, చందమామ గురించి ఏమీ వ్రాయ బుధ్ధి అవటంలేదు. పాఠకులనుండి అభిప్రాయాలు కావాలని వెంపర్లాడుతూ ప్రకటనలు దేనికి, పంపినాక ఏమీ పట్టనట్టు ఊరుకోవటం దేనికి. వ్రాసేవారికి ఇంకేమీ పని లేదని అనుకుంటున్నారా అని బాధ కలిగి, ఇప్పటి చందమామకు అనవసరపు ప్రాచుర్యాన్ని కలగ చేయటం ఇష్టంలేక పోయింది. పాఠకులు అభిప్రాయాలు పంపినప్పుడు వాటిని కనీసం ఎక్నాలిడ్జి చెస్తె ఒక మర్యాద. లేనప్పుడు అభిప్రాయాలు కావాలి కావాలి అని ప్రకటనలు వేసుకోవటం మానాలి.

  ఏవన్నా వ్రాస్తే మీ వంటి స్నేహితులకోసమే.

 2. chandamama on October 18, 2009 11:43 AM

  శివరాం గారూ,
  “…చందమామ వారు నేను వ్రాసిన అభిప్రాయానికి సూచనలకు (అంగ్లంలో) చివరకు అందినట్టుగా కూడ స్పందించలేదు. అందుకని, చందమామ గురించి ఏమీ వ్రాయ బుధ్ధి అవటంలేదు. పాఠకులనుండి అభిప్రాయాలు కావాలని వెంపర్లాడుతూ ప్రకటనలు దేనికి, పంపినాక ఏమీ పట్టనట్టు ఊరుకోవటం దేనికి…..పాఠకులు అభిప్రాయాలు పంపినప్పుడు వాటిని కనీసం ఎక్నాలిడ్జి చెస్తె ఒక మర్యాద….”

  మీరు వ్యక్తపరిచిన అసంతృప్తిని, బాధను అర్థం చేసుకుంటున్నాను. ఇక్కడ చందమామ పాలసీకి సంబంధించిన అంశాలు కూడా తోడవుతున్నాయి. పాఠకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పంపే స్పందనలను, అభిప్రాయాలను, విమర్శలను మీరన్నట్లు కనీసం ఎక్నాలెడ్జ్ చేయకపోవడం అనే సమస్య ఉంది. ఇది ఇప్పుడే కాదు. కుటుంబరావు గారి కాలంనుంచి లేదా అంతకు ముందు నుంచి కూడా చందమామలో అలవాటుగా ఉంటోందని రోహిణీ ప్రసాద్ గారు చందమామపై, వారి నాన్నగారిపై రాసిన వ్యాసాలలో ఇప్పటికే రాశారు కూడా.

  కొన్ని వందల ఉత్తరాలు, డజన్ల సంఖ్యలో రచనలు అందుతూ వచ్చిన కాలంలో కూడా చందమామ వారు ఆ ఉత్తరాలకు పెద్దగా స్పందించేవారు కారని, బాగున్నాయి అనిపించినవాటిని ఆ నెల పత్రికలో అచ్చేసి మిగతావి అలా పడేసేవారని వినికిడి. కుటుంబరావు గారు కూడా అంతకుముందు ఉన్న సంప్రదాయాన్ని -అంటే చూడకుండానే పక్కన పడేసే అలవాటు- తోసిరాజని బాగున్నవాటిని వేరుచేసి బాగలేవు అనుకున్న వాటిని పక్కన పెట్టేసేవారని బాలు గారు చెబుతున్నారు.

  తర్వాత చందమామ చరిత్రలో ఒక్క దాసరి సుబ్రహ్మణ్యం గారు మాత్రమే ఉత్తరాలకు, రచనలకు స్పందించి ప్రత్యుత్తరం పంపడాన్ని నియమబద్దంగా దశాబ్దాల పాటు కొనసాగించారని బాలుగారు ప్రశంసా పూర్వకంగా చెబుతున్నారు. ఉద్యోగంలో భాగంగా ధారావాహికల భాగాలను రాయటం పూర్తి చేశాక మిగిలే ఖాళీ సమయాన్ని ఆయన ఇలాగా ఉపయోగించుకున్నారేమో తెలీదు గాని పాఠకుల ఉత్తరాలు, అభిప్రాయాలకు ఠంచన్‌గా సమాధానాలు రాసి పంపటంలో దాసరి గారికి దాసరి గారే సాటి అని బాలు గారు చెప్పారు.

  ఇప్పుడు చందమామ పని తీరు కూడా పాత వాసనలు వేస్తూనే, అస్సలు సమాధానాలు పంపడం, కనీసం ఎక్నాలెడ్జ్ చేయకపోవడం అనే సంప్రదాయానికి కట్టుబడి ఉంది. చందమామ ఆఫీసుకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడితే బాలుగారు అందుబాటులో ఉంటే ఆయన సమాధానం చెబుతారు తప్ప ఇంకెవ్వరూ ప్రత్యుత్తరాల జోలికి వెళ్లరు.

  దానికి తోడు రచయితలు, పాఠకులతో నేరుగా సంబంధం పెట్టుకోవడం బాలుగారికి ఇష్టం లేనట్లుంది. చందమామ భారాన్ని ఒక్కడే మోయవలసి రావటానికి తోడుగా ఎడిటర్‌గా మనం వివాదాస్పద అంశాలను, సంస్థ అంతర్గత విషయాలను పాఠకులతో నేరుగా పంచుకోవడంపై బాలుగారికి భిన్నాభిప్రాయం ఉన్నట్లుంది. ఏ సంస్థలో అయినా ఇది పాటింపులో ఉంటుందనుకోండి. ఈ కోణంలో చూస్తే నేను చందమామలో ఓ ఉద్యోగిగా నా పరిమితులను దాటేసినట్లే మరి.

  అయితే చందమామ పాఠకులు, అభిమానులు, చంపిలతో ఇంటరాక్టివ్ కావడం సంస్థ మనుగడకు కూడా చాలా ముఖ్యమనే గ్రహింపుతోటే అనుకోండి.. నేను పరిమితులను కూడా దాటి మీవంటి వారితో సమాచారం పంచుకుంటున్నాను. నా బ్లాగులో చందమామ చరిత్రను దాని వెలుగునీడలతో సహా అందరికీ తెలియచేయాలని ప్రయత్నిస్తున్నాను.

  పరస్పరం విశ్వసనీయతను, నమ్మకాన్ని పెంపొదించుకునే ఈ ప్రయత్నం ఎంతగా విజయవంతమయిందంటే కేవలం 3 నెలల లోపే నా బ్లాగు దాదాపు 10 వేల హిట్లను దాటింది. ఇది చందమామకు, దాని అభిమానులకు మధ్య విశ్వసనీయతకు సంకేతం అనే భావిస్తున్నాను. నేను ఈ బ్లాగులో పొందుపర్చిన కొన్ని అభిప్రాయాలు, విసుర్లు ఓ ఉద్యోగిగా నా పరిమితులను దాటిపోయాయి కూడా, కానీ ఉద్వేగాలను, అప్పుడప్పుడు మనసులో రేగే అసంతృప్తిని అణచుకోవడం సాధ్యం కానప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేసాను. చేస్తున్నాను కూడా.

  అందుకే abhiprayama@chandamama.comకు కాని లేదా నా ఈమెయిల్ చిరునామాకు కాని మీరు, మీవంటి వారు పంపుతున్న స్పందనలు అన్నింటికీ దాదాపుగా సత్వరమే లేదా కొంత లేటుగా అయినా ప్రత్యుత్తరం పొందుపరుస్తున్నాను.

  మా ఆన్‌లైన్ ఎడిటర్ సౌమ్యగారు చెబుతుంటారు ‘you and me are not right persons to send replys to readers comments Raju gaaru’ అని. ఎందుకంటే ప్రింట్ చందమామ గురించిన విషయాలను ఆన్‌లైన్‌ ఉద్యోగులుగా చర్చించకూడదనే ఎథికల్ పాయింట్ కూడా ఇక్కడ ఉంది. సరే ఆమె అన్నట్లు మేం సరైన వ్యక్తులం కాకపోవచ్చేమో మరి. మరోవైపు మీరన్నట్లు చెప్పవలసిన వారు చెప్పనప్పడు. నోరు తెరవనప్పుడు. ఏ అభిప్రాయాలకు, వ్యాఖ్యలకు స్పందించనప్పడు, చందమామకు, పాఠకులకు, అభిమానులకు మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుందనే నేను బలంగా భావిస్తున్నా.

  శివరాం గారూ ఇది మా పరిస్థితి..
  నా మట్టుకు నేను మాత్రం నా బ్లాగుకు, ఈమెయిల్‌కు పంపుతున్న ప్రతి అబిప్రాయాన్ని, కామెంటును ప్తత్యుత్తరం ద్వారా వీలయినంతవరకు వెంటనే ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను. అది బ్లాగర్‌గా, రచయితగా నా కనీస విజ్ఞత. దాన్ని నేను కాపాడుకోవాలనే అనుకుంటున్నాను.

  మీకూ, మీవంటివారికీ నా అభ్యర్థన ఏమిటంటే ప్రత్యుత్తరం రాలేదని ఎక్నాలెడ్జ్ పంపడంలేదని అసంతృప్తికి గురై మీలాంటివారు మీ నిశ్చితాభిప్రాయాలను పంపడం ఆపవద్దు. మీ వంటివారి అభిప్రాయాలు, విమర్శలు సైలెంటుగా అవి చేసే పని అవి చేస్తూనే ఉన్నాయి. ప్రింట్ చందమామ లే అవుట్ మళ్లీ పాత రూపానికి వచ్చిందన్నా, రాబోయే నెలల్లో మరిన్ని మార్పులకు గురవుతూ కథలకు ప్రాముఖ్యత వస్తూందన్నా అది మీ ఘనతే. మీవంటి వారు మీ అభిప్రాయాలను పుంఖానుపుంఖాలుగా పంపకపోతే ఇంతటి మేజర్ నిర్ణయం జరిగి ఉండేదు కాదనే అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయంలో మీరు నిరాశపడవద్దనే కోరుకుంటున్నా.

 3. SIVARAMAPRASAD KAPPAGANTU on October 18, 2009 12:34 PM

  THANKS FOR YOUR UNDERSTANDING RAJU GARU.

  ITS BETTER THAT WE FORM A CLUB OF OLD CHANDAMAMA FANS AND UNDER THAT WE SHALL WRITE ABOUT AND SHARE CHANDAMAMAS WHICH ARE MORE THAN 60 YEARS OLD, FOR WHICH THERE IS NO COPY RIGHT!!! SO EVERY MONTH ONE CHANDAMAMA SHALL BE FREED FROM THE CLUTCHES OF THE SO CALLED COPY RIGHT. SO BY 2040 THE REAL CHANDAMAMA ISSUES WOULD BE FREE FROM COPY RIGHT. IF AM ALIVE BY THEN I WOULD BE 82 YEARS. HATS OFF TO COPY RIGHT ACT.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind