మధ్యయుగాల కథలకు కాణాచి చందమామ
కలెక్టర్ ఎడిషన్
ఆ కోవకు చెందిన సుప్రసిద్ధ పిల్లల పత్రికలలో వీటిని చేర్చవచ్చు. టింకిల్, బాలమిత్ర, బొ్మ్మరిల్లు, గోకులం, చంపక్, పూంథాలిర్, రత్నబాల, బుజ్జాయి తదితర పత్రికలు. ఇవన్నీ కూడా తమ స్వంత పాఠకులు, అభిమానులతో విశిష్టత పొందాయి.
వీటిలో ప్రతి పత్రిక కూడా తమవైన ప్రత్యేక కథలతో ఓ ప్రత్యేకతను సంతరించుకుంటూ వచ్చాయి. టీవీ మీడియా ప్రభుత్వ యాజమాన్యంలోని టీవీ ఛానెళ్ల యాజమాన్యం నియంత్రణలో ఉన్న కాలంలో, మనసులను ఆకర్షించడానికి మరే ఇతర వినోద సాధనాలూ అందుబాటులో లేని కాలంలో ఈ కథలను పిల్లలూ, యువతీ యువకులూ చక్కగా ఆస్వాదించారు.
అయితే ఈ పత్రికల్లో ఏవి కూడా ప్రారంభించబడిన మరుక్షణం అద్భుత విజయాలను సాధించిన డిసి అండ్ మార్వెల్ పత్రికల మాదిరి ప్రపంచ ప్రఖ్యాతి పొందకపోయి ఉండవచ్చు, కానీ, ఇవి దశాబ్దాలుగా తమ పాఠకుల అభిమానం, ఆదరణను చూరగొన్నాయి.
అయితే కాలం మారే కొద్దీ, దేశంలో క్రీడలు, టీవీ మీడియా వంటి ఇతర వినోద సాధనాలు పెరుగుతున్న పరిస్థితుల్లో, ఆధునిక తరం పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులతో అలరించిన ఈ పత్రికలు తమ మనుగడను కొనసాగించలేక ఉనికిలో లేకుండా పోయాయి.
వీటిలో ఇప్పుడు చాలా కొద్ది పత్రికలు మాత్రమే ఇప్పుడు కూడా ప్రచురణ రంగంలో ఉంటున్నాయి. సంఖ్యాపరంగా పాఠకులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, నేటి కాలపు ఆశలకు అనుగుణంగా కథలను, కంటెంటును మార్చుకుంటూ ఇవి మనుగుడ సాగిస్తున్నాయి.
ఇలాంటి పత్రికలలో చందమామ ఒకటి. మధ్యయుగ భారతీయ కథలకు ఇది కాణాచి. చందమామ కథలు రాజులు, రాణులు, రాజకుమారులు, రాజకుమారిలు, వారి సాహసకృత్యాలు, హాస్యప్రవృత్తికి మారుపేరుగా ఉండేవి. చందమామను బి.నాగిరెడ్డి 1947 జూలై నెలలో స్థాపించారు. ఆనాటికి ఈయన దక్షిణభారతంలోనే పేరుమోసిన సినీ నిర్మాత, ఆసియాలో అతిపెద్ద సినిమా స్టూడియోగా పేరు పొందిన విజయా స్టూడియోస్ (చెన్నయ్) యజమాని.
వ్యవస్థాపకుడి ధనబలం దన్ను, భారతీయ పురాణగాధలు, జానపదకథలు ఆధారంగా సాగే అద్భుతమైన అమ్మకాలు చందమామను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. అచిరకాలంలోనే చందమామ ఓ ఇంగ్లీష్ ఎడిషన్‌తో పాటు మరో 12 భారతీయ భాషల్లో ప్రచురణకు నోచుకోవడంతో దాని అమ్మకాలు విపరీతంగా ఉండేవి.
1947 జూలై నెలలో మొదలైన చందమామ అయిదు దశాబ్దాలపాటు నిరంతరాయంగా కొనసాగి 1998లో కార్మిక సమస్యలుగా చెప్పబడుతున్న వాటి కారణంగా సంవత్సరం పైగా నిలచిపోయింది. సంవత్సరం లోపే తిరిగి మొదలైన చందమామ ఈనాటికీ కొనసాగుతూ ఉంది.
చందమామ కీర్తి ఎంతగా వ్యాపించిందంటే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ డీస్నీ భారత ప్రచురణరంగంలోకి ప్రవేశించే ఉద్దేశ్యంతో ఉండి చందమామను కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. తెరవెనుక సాగిన అనేక ప్రయత్నాలు, వ్యతిరేకతల కారణంగా డీస్నీ ప్రయత్నం వమ్మయిపోయింది.
చందమామపై మక్కువ గల నలుగురు ఉత్తర భారతీయ టెక్నోక్రాట్లు చందమామలో అధిక వాటాలు తీసుకుని కొన్నేళ్లు నిర్వహించారు. చివరకు నిర్వహణా సమస్యల కారణంగా వారు వైదొలగడంతో 2007లో చందమామ జియోదెసిక్ -Geodesic- అనే టెక్నాలజీ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోయంది. దాదాపు రూ. 10 కోట్లకు చందమామను కొనుగోలు చేసిన ఈ కలకత్తా ఆధారిత సంస్థ చందమామ పాత సంచికలను డిజిటలీకరించి అన్ని పాత సంచికలను భద్రపర్చేందుకు నడుం కట్టింది.
జియోదెసిక్ కార్పొరేట్ వెబ్సైట్లో చందమామ పాత సంచికలను 2008 మొదట్లో పీడీఎఫ్ రూపంలో ఉంచారు. కానీ, తర్వాత ఇవి ఆన్లైన్లో చదవడానికి అనువుగా ఫ్లాష్ పైళ్ల రూపంలో పెట్టారు. 2009 తొలి నాలుగు నెలలకాలంలో ఇంగ్లీష్ చందమామ ఎడిషన్‌లో గత సంవత్సరాలకు సంబంధించిన సీడీలు ఇవ్వడం ప్రారంభించారు. మార్కట్ వ్యూహంలో భాగంగా తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లీష్ చందమామల చందాలు బాగా పెరిగాయని ప్రతీతి.
2007 సంవత్సరం చందమామకు 60వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా చందమామ కాపీ బుక్ పేరిట ఓ కలెక్టర్స్ ఎడిషన్ అని ఓ పుస్తకం ఇంగ్లీషులో తెచ్చారు. చందమామ స్వర్ణయుగం నాటి వివిద ప్రచురణలలోని అద్భుత దృశ్యాలలోకి ఈ పుస్తకం తీసుకెళుతుంది. దశాబ్దం క్రితం కథలనే ఎక్కువగా నింపారని విమర్శలు ఉన్నప్పటికీ చందమామ తొలితరం చిత్రకారులు వేసిన అత్యద్భుత చిత్రాలు, కళ్లు చెదిరే ఆర్ట్‌వర్క్‌ను ఈ కాపీటేబుల్ పుస్తకంలో అచ్చేశారు.
వైభవోజ్వల శకంతో పోలిస్తే చందమామ తన చిత్రకథా సంపద సుగంధ పరిమళాలను చాలావరకు పోగొట్టుకున్నప్పటికీ చందమామను ప్రేమించే, అభిమానించే పాతతరాల పాఠకులకు, చందమామ చరిత్రను స్థూలంగా అయినా తెలుసుకోవాలని కుతూహలం ఉండే కొత్తతరం పాఠకులకు ఈ కలెక్టర్ ఎడిషన్ ఓ మేరకు చక్కగా ఉపయోగపడుతుంది. తొలిపేజీల్లో చందమామ చరిత్రకు సంబంధించిన సమీక్ష, మధ్యపేజీల్లో బేతాల కథలతో పాటు వివిధ కథలు లభ్యమవుతున్నాయి.
పైగా చివరి పేజీల్లో తక్కువే అయినప్పటికీ చందమామ చిత్రమాంత్రికులు చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపాతో పాటు రజీ, శక్తిదాస్, కేశవరావు తదితర చిత్రకారులు గీసిన హై రిజల్యూషన్ చిత్రాలు పాఠకులు కళ్లకు మిరుమిట్లు గొలుపుతాయి. 60 సంవత్సరాల సందర్భంగా తెలుగులో పుస్తకం విడుదల చేయకపోవడం ఓ మచ్చలా మిగిలి ఉన్నా, ఆసక్తిగల పాఠకులకు ఓ నజరానాగా చందమామ కాపీ బుక్ మిగిలిపోతుంది.
ఎ4 సైజుతో చక్కటి ఆయిల్ పేపర్‌తో, నీట్‌గా బౌండ్ చేసిన ప్యాకేజీతో ఉన్న ఈ పుస్తకం వెల 449లు. సామాన్య పాఠకుడికి ఈ ధర మింగుడు పడకపోవచ్చు. ఈ పుస్తకం చందమామ వెబ్సైట్లో 20 శాతం డిస్కౌంటుతో లభ్యమవుతోంది. రూ.900 రూపాయల ఖరీదు చేసే కాపీబుక్, చందమామ రామాయణం కార్టూన్ రంగుల పుస్తకాలను ఈ దీపావళి సందర్భంగా రూ.670లకే కాంబో ప్యాక్ కింద ఇస్తున్నారు.
లోపలి కవర్ పేజీలలో చందమామ కలెక్టర్ ఎడిషన్ గురించి, పత్రిక చరిత్ర గురించి విశ్వంగారి వ్యాసం ఉన్నప్పటికీ 60 ఏళ్ల సందర్భంగా వచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్‌లో చందమామ సుప్రసిద్ధ కథకులు, సంపాదకులు, చిత్రకారుల గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం బాధాకరమే అయినప్పటికీ ఈ తరుణంలో కూడా చందమామ పాలసీ -రచయితలు, చిత్రకారులకు ప్రచారమివ్వని పాలసీ- అమలయ్యిందనే చెప్పాలి.
ఓ దశాబ్ది కాలంలో దేశ కాల పరిస్థితుల్లో వచ్చిన పెను మార్పుల కారణంగా ఇతర పిల్లల పత్రికలతో పాటు చందమామ కూడా బాగా దెబ్బతినిపోయింది. ఒకప్పుడు ఆరేడు లక్షల ప్రతులతో భారతీయ భాషల్లో వెలువడిన చందమామ సర్క్యులేషన్ ఇప్పుడు బాగా పడిపోయింది.
సంవత్సరం అజ్ఞాతవాసపు దెబ్బ ఈనాటికి చందమామ మార్కెట్‌పై తన దెబ్బ వేస్తూనే ఉంది. దానికి తోడు మారుతున్న పిల్లల అభిరుచులకు అనుగుణంగా మనమూ మారాలనే తలంపుతో చందమామ రూపురేఖలు మార్చడానికి చేసిన ప్రయత్నం ప్రత్యేకించి తెలుగు చందమామ వీరాభిమానుల్లో తీరని అసంతృప్తి కలిగించింది.
మొత్తం 13 భాషలు, మరో జూనియర్ చందమామతో వస్తున్న చందమామ ప్రచురణలు పరిమిత ప్రింట్లతోనే నడుస్తూ వస్తున్నాయి.
మొత్తంమీద చందమామకు ఇది సంధియుగం. ఎన్ని మార్పులు వస్తున్నప్పటికీ అప్పుడూ, ఇప్పుడూ చందమామను కొని చదవడంపై ఇప్పటికీ ఆసక్తి చూపుతున్న సాధారణ పాఠకుల కొనుగోళ్లపైనే చందమామ ప్రస్తుతం మనుగడ సాధిస్తోంది.
పాఠకుల అభిరుచులకు అనుగుణంగా చందమామ మారుతుందా లేదా కాలమాన పరిస్థితుల్లో మార్పులు పేరిట ప్రయోగాలు, నూతన తరం పిల్లల్లో మార్కెట్ అవకాశాల గమ్యం గమనంలో కొట్టుకుపోతుందా అనేది కాలానికే వదిలిపెట్టాల్సిన ప్రశ్న.
ఎ4 సైజుతో, భారీ సైజు చిత్రాలతో నడుస్తున్న ఇంగ్లీష్ చందమామ అమ్మకాలు క్రమక్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో దేశీయ భాషల్లో చందమామలను కూడా కాస్త ధర పెంచి పెద్ద సైజులో తీసుకువస్తే బాగుంటుందనే అభిప్రాయాలు బలపడుతున్న నేపథ్యంలో చందమామ సంధిదశలో పయనిస్తోంది.
చందమామ గమ్యం, గమనం మరింత మెరుగుపడుతుందని, మారుతున్న తరాల అభిరుచులు, పాతతరాల మనోద్వేగాలు పరస్పరం ఘర్షించడం ద్వారా చందమామ మరింత ముందుకు పోగలదనే ఆశిస్తున్నాం.
ఈ పెద్ద వ్యాసంపై పాఠకులు, అభిమానుల నుంచి స్పందనలు ఆశిస్తూ..
test Filed under చందమామ చరిత్ర | Tags: ఆచార్య, కలెక్టర్ ఎడిషన్, కాపీ బుక్, కొకు, చందమామ, చక్రపాణి, చరిత్ర, చిత్రా, నాగిరెడ్డి, పిల్లలు, బ్రాండ్, వపా, శంకర్ | Comments (2)2 Responses to “మధ్యయుగాల కథలకు కాణాచి చందమామ”
Leave a Reply








Chanda Mama audi kadhala chanda mama,
Chanda Mama audi andala Bhama,
chanda mamanu chuchi pulakinchu menu,
chanda mamanu chuchi alochanalu rekettu madilo,
chitti chitti manasullo neetini nimpu,
chitti chitti burralaku padunu pettu chandamama,
bheshu bheshu chandamama,
bhavi tarala kosam bratakali chandamama.
కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారూ, చందమామను అందాల భామగా, కథల చందమామగా పోలుస్తూ మీరు చేసిన కవితాత్మక వర్ణన బాగుంది. అప్పుడప్పుడూ చందమామను చూస్తుంటారని ఆశిస్తున్నాము.