చందమామ శంకర్‌ గారి జీవిత వివరాలు…

September 25th, 2009
శంకర్ గారు

శంకర్ గారు

చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారు 1946 నుంచి చిత్రలేఖన పనిని వృత్తిగా ఎంచుకున్నారు. అప్పటినుంచి చిత్రాలు గీయడమే తప్ప మరొక వ్యాపకం పెట్టుకున్న చరిత్ర లేదు. నిజంగా చెప్పాలంటే బొమ్మలు గీయడం. పరమ భక్తిప్రపత్తులతో పనిలో దిగటం తప్ప మరొక పని ఈయనకు తెలియదు.

ఏమీ తెలియకపోవడం కూడా మంచిదయ్యిందేమో మరి. చందమామ చిత్రప్రపంచానికి, చిత్రలేఖన చరిత్రకు వన్నెలద్దిన గొప్ప హస్తనైపుణ్యం మన కాలం ప్రపంచానికి సజీవంగా ఇన్ని దశాబ్దాలుగా మిగలడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.

ప్రస్తుతం వయసు మీద పడిన కారణంగా (85 ఏళ్లు) వారంలో తొలి మూడు రోజులు మాత్రమే చందమామ కార్యాలయానికి వచ్చి పని చేస్తారు. గురు, శుక్ర వారాల్లో మాత్రం ఇంటివద్దే ఉంటూ చందమామ చిత్రాలు గీస్తారు.

రోడ్లమీద మలుపుల్లో, గతుకుల్లో ఊగుతూ వచ్చే క్యాబ్‌లో అందరితోపాటు కూర్చుని 85 ఏళ్ల వయసులో రోజూ ఆఫీసుకు రాలేనని చెబితే యాజమాన్యం ఈయనకు మినహాయింపు ఇచ్చి చివరి రెండు రోజులు ఇంటివద్దే పనిచేయడానికి వీలు కల్పించింది. మొదటి మూడు రోజులు ప్రింట్ చందమామ వర్క్ ప్లాన్‌ అమలుకోసం తప్పక రావలసి ఉంటుంది.

వయోభారం మీద పడుతూనే ఉన్నా సరే.. ‘జీవితం చివరి వరకూ  చందమామలోనే పనిచేయాల’నే సంకల్పబలం సాక్షిగా శంకర్ గారు చందమామ ఆఫీసుకు వస్తూనే ఉన్నారు. జీతం పట్ల, పదవి పట్ల, హోదా పట్ల కించిత్ ఆశలు, ఆకాంక్షలు కూడా లేని ఈ నిగర్వి… మా వంటి తదుపరి తరాలకు, ప్రస్తుతం చందమామలో పనిచేస్తున్న పిల్లలకు (20 నుంచి 25 ఏళ్ల వయసులోపు) ఓ అద్భుతమైన ‘శ్రామిక ఉదాహరణ’లాగే ఉంటారు.

పని సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచే ఈ మహనీయ మూర్తిమత్వం మాతో ఉంది. మేం ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. ఆయనతో మా ఉద్యోగ జీవితాన్ని, మాటలను, చూపులను, ప్రయాణాన్ని కూడా పంచుకుంటున్నాం అనే విషయం తల్చుకుంటేనే మాకు ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది.

శంకర్ గారి జీవిత వివరాల పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2253
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&sbCId=&stId=2253&pg=1

RTS Perm Link


3 Responses to “చందమామ శంకర్‌ గారి జీవిత వివరాలు…”

 1. వేణు on September 25, 2009 12:30 PM

  శంకర్ గారి గురించి చదువుతుంటే ఎంతో ఉత్తేజకరంగా అన్పిస్తోంది.

  ఇంత పెద్ద వయసులో కూడా ఆయన గీస్తున్న బొమ్మల్లో సూక్ష్మ వివరాలూ, వాటిలో అలంకరణలూ, నగిషీలూ చెక్కటంలో ఎంత శ్రద్ధ కనిపిస్తుందో! సంపూర్ణమైన అంకితభావం లేకపోతే ఇది సాధ్యం కాదు.

  మహాభారతం, రామాయణం, దేవీ భాగవతం, వీర హనుమాన్ లాంటి పౌరాణిక ధారావాహికలకు వేల బొమ్మలను అనితర సాధ్యంగా వేసిన శంకర్ గారు ఇప్పటి తరానికి నిశ్చయంగా తరగని స్ఫూర్తి.

  ఆయన బొమ్మల శైలి గురించిన విశేషాలను ఆయనతో చెప్పిస్తే బావుంటుంది. చిత్రా, ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య లాంటి చిత్రకారులతో ఆయన అనుభవాలను కూడా సేకరించగలిగితే ఎంతో విలువైన సమాచారమవుతుంది!

 2. chandamamalu on September 25, 2009 8:55 PM

  వేణుగారూ,,, చందమామ చరిత్రకు సంబంధించిన ఏ కొత్త విషయం ఈ బ్లాగులో కనిపించినా క్రమం తప్పకుండా మీరు విలువైన వ్యాఖ్యలు పోస్ట్ చేస్తూ మాకు మరింత ప్రేరణ, ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. హృదయపూర్వక కృతజ్ఞతలు..

  ‘సంపూర్ణమైన అంకితభావం…’ శంకర్ గారి చిత్రలేఖన పనిపై అక్షర సత్యం లాంటి గొప్ప వ్యాఖ్య..

  అలాగే మీరు ఇచ్చిన సూచనలను తప్పక దృష్టిలో పెట్టుకుంటాము. చిత్రాగారు శంకర్ గారికి ఆప్రమిత్రులు. చిత్రా, ఆచార్య, వపా గార్ల గురించిన విలువైన సమాచారం శంకర్ గారి నుంచే మనకు లబ్యమవుతుంది. ఎక్కువ సార్లు శంకర్ గారి గురించి చందమామలో రాస్తే మూస అవుతుందేమో అనే అనుమానాలు మాలో ఉన్నప్పటికీ 50 ఏళ్లపైబడిన చరిత్రకు సంబంధించిన అమూల్య వివరాలను మూడు నాలుగు కథనాల్లోనే ముగించడం కష్టం.

  పైగా ఒకేసారి అన్ని జ్ఞాపకాలను ఆయన గుర్తుకు తెచ్చుకుని చెప్పడం కూడా కష్టమే.. అందుకనే ఆయనకు ఆఫీసు వేళల్లో ఎప్పుడు తీరిక దొరికినా ఓ అరగంట పాటు కూర్చుని ఆయన చెప్పే ప్రతి విలువైన అంశాన్ని ముందుగా అక్షరబద్దం చేయాలని వీలును బట్టి వాటిని చందమామలో ప్రచురించాలని నిన్ననే అనుకున్నాము.

  ఆయన బొమ్మల్లో సూక్ష్మవివరాలు, వాటిలో అలంకరణలు, నగిషీలు చెక్కడం… ఆయన బొమ్మల శైలి గురించిన విశేషాలు వంటి విలువైన అంశాలపై మీరు సూచించిన వాటిని తప్పక ఆయనను అడిగి తీసుకుంటాము. ఇలాగే చిత్రకారుల దృక్కోణంలో ఇంకా ఏయే అంశాలను ఆయననుంచి తెలుసుకోవచ్చో కూడా సూచించండి. వీటిని ఉమ్మడి బాధ్యతకింద తీసుకుని మనం ఆయననుంచి మంచి సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంది.

  మీరు పనిమీద చెన్నయ్ వచ్చినట్లయితే తప్పక ఆయనను కలవండి. సోమ, మంగళ, బుధ వారాల్లో ఆయన ఆఫీసుకు వస్తారు కాబట్టి ఇక్కడే కలవవచ్చు. తదుపరి రోజుల్లో నేరుగా ఇంటివద్ద కూడా ముందస్తు సమాచారం అందించి మరీ ఆయనను కలవవచ్చు… మీకు తన ల్యాండ్ ఫోన్ నంబర్ కూడా ఇంతకు ముందే ఇచ్చాము కాబట్టి వీలైతే పోన్ ద్వారా కూడా మాట్లాడండి.

  ఖచ్చితంగా మీకు అదొక దివ్యానుభవమే మరి..

  తండ్రిచేసిన అప్పులు తీర్చడానికి బాల్యంలోనే వంటమనిషిగా పనిచేసిన ఓ సామాన్యుడు తదనంతర జీవితంలో కన్నడ చందమామ కంట్రిబ్యూటింగ్ ఎడిటర్‌గా పరోపకారి పాపన్న, గుండుభీమన్న వంటి అద్భుత ధారావాహికలతో చందమామకు వన్నె తెచ్చిన వైనం మీరు ఎన్నడయినా విన్నారా..? ఆయన రంగారావు గారు. వచ్చేవారం ఆయన గురించి మాట్లాడుకుందాం….

  చందమామలో ఇంతవరకు పనిచేసిన ఎడిటోరియల్ బృందాలు, చిత్రకారుల చరిత్ర జాబితాను కూడా రూపొందిస్తున్నాము.. ఇక్కడే ఇంత చరిత్రను పెట్టుకుని కూడా ఇన్నాళ్లుగా ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. చందమామలో పనిచేసిన, చేస్తున్న వారి ఈ అజ్ఞాతవాసం త్వరలోనే ముగుస్తుందనే భావిద్దాము..

  ఒక్కటి మాత్రం నిజం.. గత రెండునెలలుగా మీవంటి వారు ఇస్తున్న ప్రోత్సాహం, ప్రేరణ లేకుంటే చందమామ చిత్రకారులు, రచయితల గురించిన విలువైన సమాచారం సేకరించడం కల్లోని మాటే అయ్యేది.

  అందుకు మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు..

 3. SIVARAMAPRASAD KAPPAGANTU on September 27, 2009 1:09 AM

  DEAR SIRS,

  I like Sankar’s pictures more especially the pictures of epics drawn by him.

  Kindly consider publishing a separate book only with the pictures drawn by Shri Sankar. You may be surprised to know the demand for such a book.

  Please continue to write about all other great Artists like Shri Chitra and Shri Vaddadi Papaiah.

  Shri Sankar is a living legend in Chandmamam. Please interview him and publish in our beloved Chandamama. I hope you will not disappoint avid fans like me.
  Regards,

  K.SIVARAMAPRASAD
  FROM BANGALORE, INDIA

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind