ప్రతి ఇంట్లో చందమామ ఉన్న అందమైన కాలం
చిన్నప్పటి విషయాలు అందరికి అన్ని గుర్తుండవు. నా సంగతి అంతే అనుకోండి. కాని చందమామతో అనుబంధం జీవితాంతం మనసులోనుండి పోదు పోలేదు అని నేను, నాలాంటి ఎందరో చంపిల అభిప్రాయం అని ఖచ్చితంగా చెప్పగలను. స్కూలులో చెప్పిన తెలుగు పాఠాలకంటే అమ్మ ఇంట్లో చదివించిన చందమామ వల్లే నాకు తెలుగు మీద ఆసక్తి, పట్టు కలిగింది అని గర్వంగా చెప్పుకుంటాను.
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది. అమ్మలు, నాన్నలు తమకోసం, తమ పిల్లల కోసం చందమామ కొనేవారు. ప్రతి నెల క్లాసు ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే ఎక్కువగా (అంతకంటే ఎక్కువగా) చందమామ కోసం ఎదురుచూపులు. అది రాగానే నాకు, తమ్ముళ్ళకు మధ్య బల ప్రదర్శన. నాదే గెలుపనుకోండి.
అప్పుడప్పుడు ఆ పుస్తకం వాళ్ళ కంటపడకుండా మొత్తం చదివేసి డ్రాయింగ్ రూం లో పెట్టేయడం. ఇక ఎవరేమన్నా చేసుకోండి నేను చదివేయడం ఐపోయింది అని ..కాని గంటలో పుస్తకం అవ్వగొట్టి నేలంతా ఎదురుచూడాలంటే మాత్రం విసుగేసేది. అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా………
జ్యోతి గారూ,
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే మెరుపువాక్యంతో అదరగొట్టేశారు. వ్యక్తిగతంగా సమాచారం పంపకున్నా మీరు చందమామ జ్ఞాపకాలు స్వయంగా పంపారు. అందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.. ఆన్‌లైన్ చందమామతో మీ చందమామ జ్ఞాపకాల బంధం ఇలాగే కొనసాగుతుందని.. కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాము.
“పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది.”
చందమామ స్వర్ణయుగ చరిత్రకు ఈ వాక్యం సాక్షీభూతంగా నిలుస్తోంది కదా..
“అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా.”
అమ్మా.. అమ్మమ్మా.. ఎంత పెద్ద ఆశండీ మీకు. ఇక్కడ నెలకు ఓ సంచిక తీసుకువస్తూంటేనే మా పని “అయిపోతోంది” అన్నిరకాలుగా.. ఇక వారానికోసారా…
“క్లాసు పుస్తకాలు బోర్ కొడితే పాత చందమామలు తీసి సింగిల్ పేజీ కథలు చదవడం అలవాటు.”
అన్ని కాలాలకు వర్తించే గొప్ప మాట..
“పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కోసం తెప్పించే చందమామలు ముందు నేనే చదివేదాన్ని.”
చందమామ బతుకుతోందంటే మీవంటి ఆరాధకుల వల్లే కాబోలు.
“పుస్తకం చేత పట్టుకుని కథలో లీనమై చదువుతుంటే ఉండే ఆనందం, తన్మయత్వం, ఆన్‌లైన్‌లో.. కంప్యూటర్‌లో చదివితే వస్తుందా? రాదు గాక రాదు గాక రాదు..”
చందమామను కొని భద్రపెట్టుకున్న వారికి పుస్తకం పట్టుకుని చదివే భాగ్యం ఉందనుకోండి. ఆ భాగ్యం లేనివారి మాటేమిటి? అందుకే.. ఇలాంటివారికోసమే… నాలాంటి వారికోసమే.. ఆన్‌లైన్ ఆర్కైవ్స్‌లో పాత చందమామల నిధి ఓ పెన్నిధిలాగా ఉపయోగపడుతోంది. అయితే రిఫరెన్స్ కోసం చందమామ కథలు వెతుక్కోవాలంటే పుస్తక రూపంలో ఉన్న సౌలభ్యం ఆన్‌లైన్‌లో ఉండదనుకోండి. చందమామ కథల మొత్తం కేటలాగ్‌ను (గత 62 సంవత్సరాల సంచికలవి) రూపొందించి పాఠకులకు అందుబాటులోకి తెస్తే బాగుంటుందేమో మరి.
జ్యోతిగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కిందిలింకులో చదవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2244
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
2 Responses to “ప్రతి ఇంట్లో చందమామ ఉన్న అందమైన కాలం”
Leave a Reply








జ్యోతి గారూ,
బావున్నాయి, మీ చందమామ జ్ఞాపకాలు!
> స్కూలులో చెప్పిన తెలుగు పాఠాలకంటే అమ్మ ఇంట్లో చదివించిన చందమామ వల్లే నాకు తెలుగు మీద ఆసక్తి, పట్టు కలిగింది అని గర్వంగా చెప్పుకుంటాను.
… తెలుగువారిలో చాలామందికి వర్తించే విషయమిది!
కొద్దిసేపు చందమామ చదవకుండా ఉండలేని మధురమైన బాల్యాన్ని గుర్తుచేసిన అందరికీ, ముఖ్యంగా జ్యోతిగారికి కృతఙ్ఞతలు.