చందమామ అంటే అమ్మ చేతి గోరుముద్ద…!

September 22nd, 2009
సంకీర్తన - చందమామలు

సంకీర్తన - చందమామలు

చందమామంటే నాకు అమ్మ చేతి గోరుముద్ద,
నాన్న గారాబం,
చెల్లెలితో పేచీ,
అన్నయ్యతో లాలూచీ! 

చందమామలేకుండా బాల్యముంటుందంటే కొద్ది రోజుల క్రితం వరకూ ఆశ్చర్యమే!

ప్రతినెలా మొదటివారంలో పేపర్ బాయ్ తెచ్చే చందమామ కోసం వరండాలో పడిగాపులు కాస్తుంటే ఎదురుచూపులంటే ఎలా వుండేవో తెలిసేది. చందమామను అందుకోడానికి అన్నయ్య, నేను, చెల్లితో పాటు ఇంకొకరు పొటీ పడేవారు. అది మా నాన్నగారు. ఒక్కోసారి మమ్మల్ని అధికార దుర్వినియోగంతో మొట్టికాయలేసి తనే  దక్కించుకుని జానపద సీరియల్ చదివి అప్పుడు కానీ మాకిచ్చేవారు కాదు.

కానీ ముందుగా పుస్తకం అందుకుని మృదువైన కవర్ పేజీని తడుముతూ, కొత్త పుస్తకం సువాసనను ఆఘ్రాణిస్తూ, ఎవరికీ ఇవ్వకుండా చదువుకోవడంలో ఉన్న మజా ఇంకెవరో చదివేసి మన చేతికొచ్చాక ఏముంటుంది? చందమామను మొదటగా చేజిక్కించుకునేందుకు ఎంతెంత యుద్ధాలు జరిగేవో తల్చుకుంటే  ఆశ్చర్యంగా ఉంటుంది.

ఈ పోటీ ఎంతవరకూ వెళ్ళిందంటే నాన్నగారు మాతో పడలేక చందమామను ఆఫీసుకు తెప్పించుకుని అక్కడే చదివేసి సాయంత్రం వస్తూ ఇంటికి తెచ్చేంత వరకూ!

నాకు బాగా గుర్తున్నవి, మొదట్లోనే ఉండే పంచతంత్ర కథలు “కాకోలుకీయం”(ఈ మాటకు ఈ మధ్య వరకూ అర్థం తెలీదంటే నమ్మండి) మాచిరాజు కామేశ్వర రావు గారి పిశాచాలు, దెయ్యాల కథలు, నా అభిమాన సీరియల్ వీర హనుమాన్, చివర్లో సింగిల్ పేజీ కథ ఒకటి ఇచ్చి దానికి పేరు పెట్టమనే చిన్న పోటీ!

ఆఖరుపేజీలో ఫొటోలకు వ్యాఖ్యలు రాయడం, అలాగే సింగిల్ పేజీలో ఇచ్చే కథలకు ప్రతినెలా పేర్లు పెట్టడమే కానీ  పంపిన పాపాన ఒక్కసారీపోలేదు. డబ్బు, నగల మూటల్తో అవసరానికి ఆదుకునే పిశాచాలు ఒక్కటి కూడా నిజంగా తారసపడకపోవడం అప్పట్లో ఒక తీరని కోరికగా ఉండేది.

చందమామ చదవడం వల్ల కలిగే మానసికానందం ఒక ఎత్తయితే చందమామ వల్ల కలిగిన మహోపకారం భాష మీద ప్రేమ! సాహిత్యాభిలాషకు బాటలు వేసే సరళమైన భాష మీద ఎవరికైనా ప్రేమ కలిగి తీరుతుంది.

 పిల్లల పత్రికలు ఎన్నో ఉన్నా, తల్లిదండ్రుల మొదటి ఎంపికగా చందమామ నిలబడిందంటే అందుకు కారణం భాషే! అందుకే ఇంతకు ముందెవరో తమ జ్ఞాపకాల్లో చెప్పినట్లు చందమామకు బాల్యంలో దూరమైన వారు సాహిత్యానికి దూరమయ్యారంటే నాకు ఆశ్చర్యం కలగదు.

సుజాతగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2236

సుజాతగారు నిర్వహిస్తున్న చక్కటి బ్లాగుకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
www.manishi-manasulomaata.blogspot.com

సుజాత గారూ, మనఃపూర్వక కృతజ్ఞతలు..
గత నాలుగు రోజులుగా వ్యక్తిగత, అధికారిక పనిమీద తిరుపతికి వెళ్లవలసివచ్చింది. తిరిగి ఆఫీసుకు వచ్చి సిస్టమ్ తెరువగానే.. అవుట్‌లుక్‌లో మీ చందమామ జ్ఞాపకాలు. కొంచెం ఆలస్యమయినా అపరూపమైన చందమామ జ్ఞాపకాలు పంపారు.

చందమామంటే నాకు అమ్మ చేతి గోరుముద్ద…!

చందమామ వల్ల కలిగిన మహోపకారం భాష మీద ప్రేమ!

పిల్లల పత్రికలు ఎన్నో ఉన్నా, తల్లిదండ్రుల మొదటి ఎంపికగా చందమామ నిలబడిందంటే అందుకు కారణం భాషే!

రాకుమార్తెలను అందంగా ఊహించుకోవడం చందమామతోనే మొదలు!

ఇద్దరికీ మధ్య గల తేడాని కథలో కాక కేవలం బొమ్మల్లోనే చూపించగల అనితర సాధ్యులు చందమామ చిత్రకారులు.

మా ఇంట్లోనే కాదు, నా తోడబుట్టిన వాళ్ళంతా కూడా వదులుకోకుండా పాటిస్తున్న సత్సంప్రదాయం పిల్లలకు చందమామ చదవడం అలవాటు చేయడం!

సాహిత్యం పట్ల ఆసక్తి చందమామ తోనే ఆరంభమవుతుందని మా అందరి నమ్మిక కూడా!

ఇన్ని మెరుపు వాక్యాలను మీ చందమామ జ్ఞాపకాల్లో చొప్పించాక వేరే వ్యాఖ్యానం అవసరం లేదనుకుంటాను..

ఒకే ఒక చిన్నమాట. మీ పాపాయి సంకీర్తనది ధన్య జీవితం. ఆడపిల్లల ప్రపంచం ఆసిడ్ దాడులతో స్వంత ఇంట్లో కూడా రక్షణ కోల్పోయి గజ గజ వణుకుతున్న పాడుకాలంలో ఆమె చందమామతో తన బాల్యాన్ని పండించుకుంటోంది. ఆమెను కొన్నాళ్లు అలాగే పెరగనివ్వండి.

తిరుపతిలో మాకు తెలిసిన ఓ అమ్మను (ఇటీవలే భర్తపోయారు) నిన్న కలిసినప్పుడు తన జీవితంలోని తొలి 15 ఏళ్ల బాల్యం తనకు తిరిగి దొరికితే ఎంత బాగుండు అని బాధపడిపోయారు. ఆమె బాల్య జ్ఞాపకాల్లో ‘చందమామ’ కూడా ఉంది.

మీరు ప్రస్తావించిన కింది వ్యాఖ్య నాదే కదూ. సిహెచ్ వేణుగారి చందమామ జ్ఞాపకాలకు నా బ్లాగులో పరిచయ వ్యాసంలో ఇది ఉంది.

“ఇంతకు ముందెవరో తమ జ్ఞాపకాల్లో చెప్పినట్లు చందమామకు బాల్యంలో దూరమైన వారు సాహిత్యానికి దూరమయ్యారంటే నాకు ఆశ్చర్యం కలగదు.”

నా వ్యాఖ్య పూర్తి  పాఠం ఇదిగో ఇక్కడ…

“…ఈరోజు కూడా మనం ఒక పరీక్ష పెట్టుకోవచ్చు. ఎవరైతే బాల్యంలో కథలు వినడానికి, కథలు చదవడానికి దూరమైపోయారో వారు సాహిత్యానికి కూడా దూరమైపోయి ఉంటారు. వారి కుటుంబంలో సాహిత్య వాతావరణం కూడా దూరంగానే ఉంటుంది.

బాల్యంలో ఎలాంటి సాహిత్య పరిచయం లేనివారు మధ్యలో సాహిత్య వాతావరణంలోకి రావడం కూడా అరుదుగానే జరుగుతుందనుకుంటాను.

అయితే సమాజంలో లక్షలాది మంది ఇప్పటికీ సాహిత్యానికి, పుస్తక పఠనానికి దూరంగా ఉంటూ ఉండడానికి సామాజిక, ఆర్థిక, బౌద్ధిక కారణాలు ఎన్నో ఉన్నాయనుకోండి….”

సుజాత గారూ, ధన్యవాదాలు.. మీకు, సంకీర్తనకు, మీ కుటుంబానికి కూడా.. పిల్లలకు చందమామ చదవడం అలవాటు చేస్తున్నందుకు… వేవేల కృతజ్ఞతలు…

మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link


One Response to “చందమామ అంటే అమ్మ చేతి గోరుముద్ద…!”

  1. వేణు on September 22, 2009 8:28 PM

    చాలా బావున్నాయి మీ జ్ఞాపకాలు! ఆత్మీయమైన శైలిలో, చందమామపై మీ అభిమానాన్ని ప్రతి అక్షరంలో వ్యక్తమయ్యేలా రాశారు. అభినందనలు!

    చందమామ చిత్రకారుల ప్రత్యేకత గురించి మీ పరిశీలన చక్కగా ఉంది.

    > డబ్బు, నగల మూటల్తో అవసరానికి ఆదుకునే పిశాచాలు ఒక్కటి కూడా నిజంగా తారసపడకపోవడం అప్పట్లో ఒక తీరని కోరికగా ఉండేది.:)

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind