చందమామీకరణ

September 16th, 2009

తెలుగుభాషకు ఓ కొత్త పదం దొరికిందా అనిపిస్తోంది. అంతర్జాతీయీకరణ, పరాయీకరణ, సాంస్కృతికీకరణ, సైనికీకరణ, వర్గీకరణ వంటి పదాలను మనం గతంలోనే చదువుకున్నాం. కానీ ఇప్పుడు వీటి సరసన మరోకొత్త పదం చేరిందా…! అవుననే అనిపిస్తోంది. అదే.. “చందమామీకరణ.” ఇంగ్లీషులో దీనినే “Chandamamization” అని అంటారేమో.

నేపథ్యంలోకి పోయి చూస్తే… కథారచయితలు పంపుతున్న కథలను చందమామకు అనుగుణంగా కాస్త మెరుగులు దిద్ది, మూలకథకు కొన్ని మార్పులు చేసి చందమామలో ప్రచురిస్తూ వస్తున్న సంప్రదాయానికే “చందమామీకరణ” అని పేరు వచ్చినట్లుంది. దీన్ని గతంలోనే రోహిణీ ప్రసాద్ గారు తన “చందమామ జ్ఞాపకాలు” వ్యాసంలోనూ, వికీపీడీయాలో చందమామ అభిమానులు రాసిన “చందమామ” ప్రధాన వ్యాసంలోనూ ప్రస్తావించినట్లుంది.

మూలకథకు మెరుగులు దిద్దినా, మార్పు చేసినా, ఆ కథారచయితలకు నగదు విషయంలో ఖచ్చితంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు చెల్లించే విషయంలో చందమామ ఎన్నడూ వెనుకడుగు వేయకపోవడం వల్ల తమ కథల్లోని మార్పులను సంబంధిత రచయితలు పెద్దగా పట్టించుకునేవారు కారని చందమామపై ఈ రకమైన వ్యాసాలు తెలుపుతూ వచ్చాయి.

మానవ ప్రయత్నానికి అంతిమంగా  విజయం దక్కేలా కథను తీసుకురావడం అనే మహత్వ సంప్రదాయాన్ని చందమామ మొదటినుంచి పాటిస్తున్నందువల్ల చందమామ కథలు దాదాపుగా ఈ కోణంలోంచే మార్పులకు గురవుతూ వస్తున్నాయి. దయ్యాలు, భూతాల ఇతివృత్తంతో నడిచే కథల్లో కూడా ఆ దయ్యాలే, భూతాలే మంచివాళ్లకు సహాయం చేసేలా ముగిసే కథలు చందమామలో తప్ప ఇంకెక్కడ ఉంటాయి.

పిశాచాలు, దెయ్యాలు చందమామ కథల్లో ఎక్కువగా ఉంటున్నాయని మొదటినుంచి చందమామపై విమర్శలు కూడా వస్తున్నప్పటికీ చందమామ సంపాదకుల అభిప్రాయం మరొక రకంగా ఉంటూవచ్చింది. దెయ్యాల కథల్లో కూడా చెడుకు విజయం లభించినట్లు ఏ కథా ముగియలేదు. పిశాచాలు కూడా మంచిమనుషులకు సహాయం చేస్తాయి.

చందమామ కథలకు వరవడి దిద్దిన కొడవటిగంటి కుటుంబరావు గారిపైనే దయ్యాలు, భూతాల కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారని గతంలో చాలా విమర్శలు వచ్చాయట. ఈ విమర్శలన్నింటినీ కొకు గారు ఒకే వాదనతో కొట్టిపడేశేవారట. మనం ఎన్ని దయ్యాలు, భూతాల కథలు వినిపించి భయపెట్టినా 15 ఏళ్లు దాటిన ఏ పిల్లలూ దయ్యాలు, భూతాలను నమ్మరని ఆయన వాదించేవారట.
 
కథల్లో పిశాచాల కేరెక్టర్లు ఉండాలి. కాని అవి మంచికి తోడ్పడాలి. అలాగే కథ ముగియాలి. అనే ఓ గొప్ప ధర్మసూత్రాన్ని కొకుగారి హయాంనుంచి కూడా చందమామ పాటిస్తూనే వస్తోంది. దీన్నే చందమామీకరణ అంటారేమో మరి. అంతిమంగా గెలవాల్సినవి మానవ ప్రయత్నమూ, సద్బుద్దీ మాత్రమేనని కొకు పదే పదే చెప్పేవారట.

అందుకే సాంప్రదాయక రీతిలో కథలు రాసి పంపినా వాటిలో బలమున్నప్పుడు స్వీకరిస్తూ చివరలో మూలకథకు కొంచెం ట్విస్ట్ ఇవ్వడం ద్వారా మనిషి ప్రయత్నానికి విలువ ఇవ్వడాన్నే చందమామ కథలు అప్పుడూ ఇప్పుడూ కూడా పాటిస్తున్నాయి. ఇదే “చందమామీకరణ.”

సరిగ్గా దాన్ని నిరూపిస్తోందా అనే విధంగా ఈ సెప్టెంబర్ చందమామ సంచికలో ‘తీరిన సందేహం’ అనే కథను సంపాదకులు మార్చినట్లుంది. ఆ మార్పుల పట్ల సంబంధిత రచయిత ఏ మాత్రం నొచ్చుకోకుండా తన స్వంత కథకు జరిగిన “చందమామీకరణ”ను మెచ్చుకుంటూ, తన కథను ఎన్నుకుని మార్పులు చేసి మరీ ప్రచురించినందుకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చందమామ ఆఫీసుకు ఉత్తరం రాశారు.

తన కథను ప్రచురించడం ద్వారా చందమామ ఇచ్చిన ప్రోత్సాహం, అభిమానం పట్ల రచయిత కృతజ్ఞత తెలుపుకుంటూనే ప్రపంచస్థాయి పత్రికలో ఈ కొంచెం స్థానం తనకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ రచయిత ఉత్తరం ముగించారు.

చందమామ ద్వారా తెలుగు భాషకు అందిన “చందమామీకరణ” వెనుక రచయితల సంపూర్ణ అంగీకారం ఉందనిపిస్తుంది. లేకుంటే చందమామకు, కథారచయితలకు మధ్య ఇంతటి అవినాభావ సంబంధం ఏర్పడి ఉండేది కాదనిపిస్తుంది. గత 60 సంవత్సరాలుగా చందమామలో ‘చందమామీకరణ’ నిరంతరాయంగా సాగిపోతూండటానికి ఈ అవినాభావ సంబంధమే ప్రధాన కారణం.

చందమామలో తమ కథలు అచ్చుకాకపోవడం, ప్రచురణకు స్వీకరించకపోవడం వల్ల ప్రముఖ రచయితలు కూడా నొచ్చుకుని ఉండవచ్చు, మనసు బాధపడి ఉండవచ్చు కానీ, తమ కథలకు చందమామ దిద్దిన మెరుగులను ఇంతవరకు ఏ కథా రచయిత కూడా అడ్డు చెప్పిన చరిత్ర ఉన్నట్లు లేదు.

ఇది చందమామ గొప్పతనం. అంతకు మించి చందమామ కథకుల సహృదయత గొప్పదనం. అందుకే “చందమామీకరణ”కు జై..

చందమామ పాతకథలు చదవాలంటే కింది లింకును క్లిక్ చేయండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

మీ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు దయచేసి పంపండి.

abhiprayam@chandamama.com

RTS Perm Link