చందమామతో భాషలు నేర్చుకున్న వారు…

September 15th, 2009

ఆంధ్రరాష్ట్రంలో ఓ వ్యక్తి. పసితనంలో చందమామ చదివే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. బాల్యంలో భాషలను నేర్చుకుంటున్న క్రమంలో అన్ని భాషల్లోని చందమామలను తెప్పించుకున్నాడు. తదుపరి జీవితంలో ఓ పది పన్నెండు భారతీయ భాషల్లో ప్రావీణ్యం సాధించడానికి, చిన్నతనంలో అన్ని భాషల చందమామల అధ్యయన అనుభవం అతడికి చక్కగా ఉపయోగపడింది.

అతడు పీవీ నరసింహారావు కాదు. ఈయన కూడా 14 దేశవిదేశీ భాషలను నేర్చుకున్నట్లు వినికిడి. ఈయన హిందీలోకి అనువదించిన వేయిపడగలు నవల -విశ్వనాథ సత్యనారాయణ రచన- బాగా ప్రాచుర్యం పొందింది కూడా. అయితే పైన మనం చెప్పుకుంటున్న వ్యక్తి  పీవీ కాదు.

చందమామ ప్రేరణతో వివిధ భాషలను నేర్చుకున్న ఆయన డాక్టర్ నలిమెల భాస్కర్. ప్రస్తుతం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్య అకాడెమీకోసం తమిళం లోంచి, మలయాళీ భాషలోంచి పుస్తకాలు అనువదించి ప్రచురించారు. కథలూ, కవితలూ, నవలలూ, వ్యాసాలు ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనువదిస్తున్నారు.

1985 నుంచి 2000 వరకు తెలుగులోని విభిన్నవాదాల ప్రాతినిధ్య కవితల్ని ‘తెలుంగు తోట్టత్తిల్ తమిళ్ కుయిల్‌గళ్’ పేరున పుస్తకం తీసుకువచ్చారీయన. అంటే ‘తెలుగు తోటలో తమిళ కోయిలలు’ అని అర్థం. ఈ మధ్యనే సాహిత్య అకాడమీకి ఓ నవలను మలయాళం నుంచి తెలుగు చేశారట.

ప్రస్తుతం చందమామకు ఈయనకు పరిచయమే అనధికారికంగా, గమ్మత్తుగా జరిగింది. ఈ మధ్య ఈయన ఎన్ గోపీగారి నానీలను తమిళీకరించి అనువాదం సరిగా ఉందో లేదో నిర్దారించుకునేందుకోసం తనకు తెలిసిన మార్గంలో చందమామ ప్రింట్ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారి జాడను పట్టుకుని ఆయనకు ఓ ప్రతిని పంపించారు. తమిళ భాషతో ముప్పై ఏళ్లకు పైగా పరిచయం ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారు కొంత సమయం తీసుకుని తమిళ నానీలను సరిదిద్ది టైప్ చేయించి హార్డ్ కాపీనీ, సీడీనీ కలిపి పంపించారు.

తర్వాత భాస్కర్ గారు సుబ్రహ్మణ్యంగారికి కృతజ్ఞతలు తెలుపుతూ 14-07-09న కరీంనగర్ నుంచి ఓ ఆత్మీయ లేఖ పంపారు. భారతీయ భాషలన్నింటినీ తాను ఉద్దేశ్యపూర్వకంగా నేర్చుకున్నందున, మాతృభాషేతర భాషలోకి, అది కూడా కవిత్వాన్ని అనువదించడం కష్టసాధ్యమని తనకు తెలుసునని ఈ లేఖలో పేర్కొన్నారు.

సుబ్రహ్మణ్యం గారు ఈ తమిళ అనువాదాన్ని సరిచేసిన తర్వాత అనువాదం శరీరానికి ఆత్మసౌందర్యంలా అమరిందని చెబుతూ ఆయనకు భాస్కర్ గారు ఈ లేఖలో కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంతవరకూ ఇది వ్యక్తిగత వ్యవహారమే. కాని తర్వాత పేరాలో తాను ఏవిధంగా భాషలు నేర్చుకున్నదీ చెబుతూ చరిత్రను తడిమారాయన. చందమామలో అసోసియేట్ ఎడిటర్‌గా ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారే తన తమిళ అనువాదాన్ని సరిచూశారని తెలుసుకున్నాక ఆయన ఉప్పొంగిపోయారు.

దీంతో చందమామతో తన అనుబంధాన్ని పంచుకోవడం ద్వారా చందమామ అబిమానులకు ఓ గొప్ప విషయాన్ని ఆయన తెలియజేశారు.

అదేంటో ఆయన మాటల్లోనే విందామా…!

“…… ఎంత గొప్ప సేవ! ఎంత గొప్ప సంస్థ!! నా భాషాధ్యయనానికి చందమామ చేసిన ఉపకారం మరువలేనిది. తొలినాళ్లలో అంటే భాషల్ని నేర్చుకుంటున్న ప్రారంభంలో అన్ని భాషల్లోని చందమామల్ని తెప్పించుకునేవాణ్ణి. తెలుగు చందమామ కథల్లోంచి కొన్ని ఇతర భాషల్లో కొంచెం అటూఇటూ వేరే నెలల్లో వచ్చేవి. అట్లా అవి చాలా ఉపయోగపడ్డాయి. ఏది ఏమైనా చందమామ వెన్నెలనే ప్రత్యేకం కదా…..”

చివరగా, విలువైన సమయాన్ని హెచ్చించి తన అనువాదానికి వన్నె తీసుకొచ్చారంటూ సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు చెబుతూ ఈ ఉత్తరాన్ని ముగించారు.

మొదట్లో సుబ్రహ్మణ్యంగారు వారం రోజుల క్రితం భాస్కర్ గారు తనకు రాసిన ఉత్తరం చూపించినప్పుడు ఓ సారి చదివేసి ఇచ్చేశాను. క్యాబ్‌లో చందమామ ఆఫీసు నుంచి ఇంటికి పోతూండగా జరిగిందిది.

మాతృభాషల మూలంతో సంబంధం లేకుండా ఉత్సాహం, ఆసక్తి కొద్దీ ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ మాతృభాషలోంచి ఇతర భాషల్లోకి అనువాదాలు చేయడం చాలాకష్టమని, రెండు లేదా మూడు భాషల్లో ప్రావీణ్యం సాధించి అనువాదం చేయడం సాధ్యమేమో కానీ వరుసగా ఓ పది పన్నెండేసి భాషలను చిన్నతనంలో నేర్చుకున్నంత మాత్రాన ఆయా భాషలపై సంపూర్ణమైన పట్టు సాధించినట్లు కాదని, పీవీ నరసింహారావు గారి 14 భాషల అధ్యయనాన్ని కూడా ఈ కోణంలోనే చూడాలని.. ఇలా మాలో మేం చర్చించుకుంటూ పోతున్నాం.

ఇలా భాషలమీద, పత్రిక మీద చర్చలు జరుపుకుంటూ పోతున్న సమయంలో ఉన్నట్లుండి నాకు ఓ ఆలోచన తట్టింది. అదే ఇంత రాత్రివేళ ఈ విషయాన్ని పోస్ట్ చేయడానికి ప్రేరణను ఇచ్చింది. వివిధ భాషల్లో చందమామలు చదివి భాషలు నేర్చుకున్న భాస్కర్ గారి ఉదంతం సాధారణ విషయం కాదని దీన్ని చందమామ అభిమానులకు తెలియజేస్తే బాగుంటుందని తట్టింది.

వెంటనే సుబ్రహ్మణ్యంగారిని అడిగి ఆ ఉత్తరం తీసేసుకున్నాను. వారాంతపు సెలవు కాబట్టి తీరిక దొరికి దీన్ని సాపు చేసి పోస్టు చేస్తున్నాను. పలు భాషల చందమామలను చదివి ఆ అనుభవంతో బాల్యంలో భాషలను నేర్చుకున్న వైనాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలంటే భాస్కర్ గారినే నేరుగా సంప్రదించవచ్చు.

ఆయన చిరునామా..

డాక్టర్ నలిమెల భాస్కర్,
9-5-218/1,
ప్రగతి నగర్, రాంనగర్
కరీంనగర్ – 505001
మొబైల్ 94915 98988

RTS Perm Link