చందమామ జ్ఞాపకాలు అమృతాలు

పాత చందమామల కట్నం
” జ్ఞాపకం అంటే గతించినది. అంటే మృతం. కొన్ని జ్ఞాపకాలు మాత్రం అమృతాలు. చందమామ జ్ఞాపకాలు. అచ్చంగా అలాంటివే. నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ మొట్టమొదటి సారి చందమామ కొని తెచ్చింది, నాకూ మా అన్నకూనూ. వీధిబడి కాబట్టి తెలుగు మీడియంలోనే చదువు. అప్పటికి తెలుగు చదవడం, కొన్ని తెలుగు పద్యాలు నోటికి రావడం, ఇంతే తెలిసింది నాకు. ఆ చందమామ చదవగానే చాలా డవుట్లు వచ్చాయి……”
రవిగారూ,
మధ్యాహ్నమే 11-09-09 మీ చందమామ జ్ఞాపకాలు ఆన్లైన్లో పోస్ట్ చేశాము. మీకు చెప్పడం మర్చిపోయాను. మీ ఫోటోను సముద్రం డామినేట్ చేసేసింది. వేరేది లేకపోవడంతో ఇదే కొంచెం మార్చి ఆన్లైన్ చందమామలో పెట్టాము. చూడండి.
మీ చందమామ జ్ఞాపకాలులో మీకు దొరికిన అమూల్యమైన కట్నం గురించి రాసారు. బహుశా ఇంత గొప్ప కట్నం మరెవ్వరికీ దొరకదేమో కూడా. చందమామల కట్నం.. పాత చందమామల కట్నం. అదీ మీ శ్రీమతిగారు తీసుకురావడం.
ఎంత గొప్ప సంపద. ఇంకా వేరే కట్నం కావాలా మీకు?
ముందే చెప్పినట్లు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను రేపటినుంచి రెండు రోజులు కూర్చుని ‘చంపి’ల మెయిల్ ఐడీలు నావద్ద ఉన్నవి ఒకచోటకు చేరుస్తాను. కనీసం ఓ యాభై ఐడీలు అయినా ఉంటాయని అనుకుంటున్నాను. కొన్ని కూడగానే మీకు పంపిస్తాను. మనం పరస్పరం షేర్ చేసుకుందాం.
శివరామ్ ప్రసాద్ గారు ఇప్పటికే చందమామ ప్రియులు పేరిట యాహూలో ఓ చందమామ ప్రియుల బృందాన్ని రూపొందించారు. మీరు చేరారో లేదో తెలియదు. వీలైతే శివరాం గారి బ్లాగ్ ఓ సారి చూడండి. మీకు తెలిసిన చందమామ అభిమానులకు కూడా ఈ విషయం తెలుపగలరు.
http://saahitya-abhimaani.blogspot.com/
ఇప్పటికి ఉంటాను.
రాజు.
—————
10-09-09 10.30 PM
రవిగారూ, వంద కృతజ్ఞతలు.
ఇంత త్వరగానా…. ఊహించలేదు.
అయితే నాకు ఇక్కడ పాత చందమామల ఇమేజీ, మీ జ్ఞాపకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వీలైతే మీ ఫోటో ఒకటి తప్పక పంపించండి. మీ ఫోటోతో సహా మీ జ్ఞాపకాలను ప్రచురించగలము. మీ చందమామ జ్ఞాపకాలను రేపే ప్రచురించగలం. తప్పక ఆ లింకుకే మీ ఫోటోను పంపగలరు.
ఒక్క మాటలో. చందమామ చదువుతున్నప్పుడు మీకు వచ్చిన సందేహాలు అప్పట్లో మాకూ వచ్చాయండీ. సరిగ్గా ఇవే సందేహాలు. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి చదువుతూంటే.. ‘వపా అంటే ఏమిటి,’ ‘ఇంకావుంది .. ఎక్కడ..’ ఆహా.. 35 ఏళ్లు వెనక్కి పోయినట్లుంది నాకు.
చింతచెట్లమీద దెయ్యాల గురించి చందమామలో కథల మాటేమిటో గానీ, మా చిన్నప్పుడు పొద్దు గూకి చీకటి పడిందంటే చాలు పల్లెటూళ్లలో ఇళ్లల్లోంచి బయటకు వచ్చే వాళ్లం కాదు. చివరకు పాస్ పోసుకోవాలంటే కూడా అమ్మను తోడుకోసం లేపాల్సిందే.
మరోసారి ధన్యవాదాలు.
మీ మెయిల్ ఐడీని నా వద్ద ఉన్న చంపిల ఐడీల జాబితాలో బద్రపరుస్తున్నా. తదుపరి కమ్యూనికేషన్‌కి ఇది చాలా అవసరం. మీకు తెలిసిన చంపిల మెయిల్ ఐడీలను కూడా మీ వీలునుబట్టి సేకరించగలరు. మనందరివీ కలుపుకుంటే చాలా మంచే జరుగుతుంది.
————-
10-09-09
చందమామ జ్ఞాపకాలు రాసి పంపమని రవిగారిని కోరినప్పుడు ఆయన స్పందన, నా ప్రతిస్పందన కింద చూడగలరు.
చందమామతో..అబ్బో, ఎన్ని అనుభవాలో.. అసలు నేను చదువు నేర్చుకున్నదే చందమామతోనండి. వేణు గారి అనుభవాలు చదివినప్పుడే, రాయాలనిపించింది. తప్పక రాస్తాను.
మా అమ్మ గారిప్పుడు లేరండి. అందమైన రాత్రి ఆకాశంలో ఓ అందమైన చుక్కను చూస్తే, అమ్మ, తోకచుక్కా రెండూ గుర్తుకు వస్తాయి!
నా దగ్గరా చాలా పాత చందమామలున్నాయండి. (బవుండు వేసి కొన్ని, విడి ప్రతులుగా కొన్ని) వర్షం తర్వాత మట్టి వాసనా, ఈ పుస్తకాల సగంధం తల్చుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది.
——
ఓ.. క్షమించండి. మాకూ అమ్మ లేదిప్పుడు.
‘అందమైన రాత్రి ఆకాశంలో ఓ అందమైన చుక్కను చూస్తే, అమ్మ, తోకచుక్కా రెండూ గుర్తుకు వస్తాయి!’
కళ్లు చెమ్మగిల్లుతున్నాయి మీ వ్యాఖ్య చదువుతుంటే.
పాత చందమామల సుగంధ పరిమళాలను చవిచూసే భాగ్యవంతులలో మీరూ ఒకరు. జీవిత పయనంలో సేకరించిన అమూల్య సాహిత్యాన్ని పొగొట్టుకుంటూ వచ్చిన అభాగ్యుల జాబితాలో నా పేరు ఉంది. ఏం చేస్తాం.
అందుకే మీరంతా పాత చందమామల గురించి చెబుతున్నప్పుడల్లా గుండె కనలి కనలి, చేసేదేమీ లేక ఈరోజే ఈనెల అన్ని భాషల్లోని చందమామలను (12) ఓ సెట్ ఆఫీసులో కొనుక్కుని తీసుకుని వచ్చాను. కనీసం ఈ రకంగా అయినా తృప్తి పడవచ్చు కదా. నా వద్దా 12 బాషల్లో చందమామలు ఉన్నాయి అనుకుంటా. ఈ సెట్‌ను మంచి జ్ఞాపకం లాగే భద్రపర్చుకుంటాను.
ఇలా అంటున్నానే కాని మళ్లీ ఎవరు ఇంటికొచ్చి అడుక్కుని వీటిని కూడా తీసుకుపోతారేమో అని భయంగా ఉందనుకోండి. మొహమాటం ముందు పుట్టి తర్వాత మనం పుట్టాం మరి. ఏం చేస్తాం మరి.
చందమామ జ్ఞాపకాలు పంపుతానని చెప్పారు. పంపకముందే కృతజ్ఞతలు..
మీ
రాజు.
రవి గారి ‘చందమామ జ్ఞాపకాలు’ చూడాలంటే కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2209
test Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: కట్నం, కథలు, చందమామ, జ్ఞాపకాలు, దెయ్యాలు, పాపాయి, బేతాలకథలు, రవి, వేణు | Comment (0)Leave a Reply







