చందమామ చిత్ర మాంత్రికుడు : శంకర్

September 10th, 2009
శంకర్ గారు

శంకర్ గారు

ఆయన గురించి గత 63 సంవత్సరాలుగా బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు. ఇన్ని దశాబ్దాలుగా ఆయన తనకు తెలిసిన ఒకే ఒక పనిని చేసుకుంటూ పోయారంతే. బొమ్మలు గీయడం తప్ప అంతకు మంచి ఇంకే ‘ఘనమైన’ పనీ ఆయన చేయలేదు. రాదు కూడా. ప్రపంచ రికార్డుల మీద ఆయనకు ఎలాంటి ఆసక్తి కూడా లేదు. ‘చందమామ’లో బేతాళ కథలకు, తదితర కథలకు బొమ్మలు గీస్తారు అనే విషయం తప్ప ఆయన గురించి మరే విశేషాలు ఈ ప్రపంచానికి తెలీవు.

ఆయన… శంకర్ గారు… చందమామ ఆస్థాన చిత్రకార త్రిమూర్తులు లేదా చతుష్టయంలో ఒకరు… గత 57 ఏళ్లుగా చందమామ కోసం తన యావజ్జీవితమూ అర్పించిన, అర్పిస్తున్న మహనీయులు. కుంచె వాడకుండా చేతితో చిత్రాలు గీస్తూ చందమామ చిత్ర ప్రపంచాన్ని అయిదున్నర దశాబ్దాలకు పైగా ఉద్దీప్తం చేసిన, చేస్తున్న రుషితుల్యులు.

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు  తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు,‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, ఇంత అర్ధరాత్రివేళ నువ్వు పడుతున్న శ్రమ అంతా ఎలాంటి కార్యం సాధించేందుకో తెలియడం లేదు. విక్రమ సేనుడనే రాజుకు, పరస్పర విరుద్ధమూ, ఎక్కడా పొంతనలేని హాస్యాస్పదమైన సలహానిచ్చిన, ఆయన గురువు గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:

ఈ కథా పరిచయం వినగానే కథా సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం ఉన్న ఎవరైనా సరే ఇట్టే చెప్పేస్తారు ఇది బేతాళ కథ అంటూ. బేతాళుడు ఆవహించిన శవాన్ని భుజాన వేసుకుని, ఒక చేత్తో కత్తి దూసి చురుకైన కళ్ళతో చుట్టూ చూస్తూ ముందుకు అడుగేస్తున్న విక్రమార్కుడి బొమ్మను చూడగానే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు అది చందమామలోని బేతాళ కథకు శంకర్ గారు వేసిన బొమ్మ అని.

చందమామలో పౌరాణిక ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం ధారావాహికలకు లోపలి పుటల్లో చిత్రాలు గీసినవారిలో శంకర్ గారు అగ్రగణ్యులు. అలాగే జాతక కథలు, విష్ణుపురాణం వంటి ధారావాహికలు, కథలకు కూడా ఈయనే చిత్రాలు వేశారు.

అన్నిటికంటే మించి తెలుగు సాహిత్యంలో, ఇంకా చెప్పవలసి వస్తే భారతీయ కధాసాహిత్యంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సుదీర్ఘ ధారావాహిక బేతాళ కథలకు చిత్రాలు గీసిన వారు శంకర్ గారు. బేతాళ కథలకు ముఖచిత్రం మాత్రమే కాకుండా ఇంతవరకు 300 పైగా బేతాళ కథలకు లోపలి చిత్రాలు -ఇన్‌సైడ్ చిత్రాలు- గీసింది శంకర్ గారే.

ఒకనెలలో చందమామలో 20 స్టోరీలు – కథలు, ధారావాహికలు, కథనాలు, ఇతర రచనలు- అచ్చవుతాయనుకుంటే వీటిలో 5 లేదా 6 స్టోరీలకు శంకర్ గారే చిత్రాలు గీస్తున్నారు. ఈ నాటికీ ఆయన ఇదే పని చేస్తున్నారు. చివరి శ్వాస ఉన్నంతవరకూ చందమామతో ఉండాలని, అందులోనే పనిచేయాలని ఒకే ఒక చిన్న కోరిక తప్ప మరే ఇతర ఆకాంక్షలూ ఆయనకు లేవు.

ఆరు నెలలు పనిచేస్తే చాలు.. వెంటనే మరో చోట అవకాశాలు వచ్చి ఆఫీసులను వదలి వెళుతున్న తరహా సమాజంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. అలాంటిది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదున్నర దశాబ్దాల పైగా అవిరామంగా ఒకే పత్రికలో ఒక వ్యక్తి పనిచేయగలగడం… చరిత్రలో అరుదైన విషయమే. ఇలాంటి అరుదైన ఘటనలు చందమామలోనే జరగడం మరీ విశేషం.

ఆయన శంకర్ గారు… చందమామ చిత్ర మాంత్రికుడు… జీవిత కాలం ప్రపంచానికి తెలియకుండా పోయిన మానవలోకపు మహనీయుడు.. ఆయన గురించి విందామా… 85 ఏళ్ల ఆ వృద్ద యువకుడిని చూద్దామా…

అయితే కింది లింకుపై క్లిక్ చేయండి…..

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2203

RTS Perm Link


13 Responses to “చందమామ చిత్ర మాంత్రికుడు : శంకర్”

 1. వేణు on September 10, 2009 7:57 PM

  రాజు గారూ!
  మహా చిత్రకారుడు శంకర్ గారి గురించి రాయటం ఎంతో సంతోషాన్ని కల్గిస్తోంది. ‘జీవిత కాలం ప్రపంచానికి తెలియకుండా పోయిన మానవలోకపు మహనీయుడు’ అనటం ఎంతో వాస్తవం. చందమామలో పౌరాణిక ధారావాహికలకు ఆయన తన కుంచె స్పర్శతో ప్రాణం పోసి, తర తరాల పాఠకులకు అద్భుత అనుభూతులను అందించారు.
  ఆయన్ను కలిసి మాట్లాడినపుడు మీ స్పందనను ఎంతో బాగా అభివర్ణించారు. మన: పూర్వక అభినందనలు!

 2. laxmi on September 10, 2009 9:30 PM

  నాకు ఊహ తెలిసిన దగ్గరి నుండీ నేను ఎంతో ఇష్టం గా చదివిన ఏకైక పుస్తకం చందమామ. చివరిలో అవసరం ఉన్నా లేకపోయినా “ఇందులో నీతి ఏంటి అంటే…” అంటూ అనవసరమైన సంభాషణలను చొప్పించకుండానే బోల్డంత నీతిని, లోక జ్ఞానాన్నీ పంచిన సరస్వతీ రూపం చందమామ. చందమామ అంటే వపా ముఖ చిత్రం, శంకర్ బొమ్మలు, వసుంధర కథలు ఇలా ఒక ముద్ర పడిపోయింది మెదడులో. అటువంటి చందమామ ఇప్పుడు ఎటు పోతోందో అర్థం కాక, మార్పు సహజం అన్న మాట నిజం ఐనా చందమామ మారుతుంది అన్న నిజాన్ని జీర్ణించుకోలేక, మళ్ళా పూర్వ వైభవం వస్తుందేమో అన్న ఆశతో ఇంకా ప్రతి నెలా కొంటూనే ఉన్నాను. ఒక్కప్పటి చందమామ పాఠకుల్లో ఊహాశక్తిని పెంపొందిస్తే ఇప్పడు చందమామ లక్ష్యం ఏమిటో తెలియకుండానే ముందుకు పోతోంది.

  మీ టపా కన్నా పెద్ద కామెంట్ రాసాను, మన్నించండి. శంకర్ గారిని చూసేటప్పడికి అప్రయత్నంగా రెండు కన్నీటి చుక్కలు చెంపల మీదకి జారాయి. వీరి తర్వాత అంతటి చిత్రకారుడెవరా అని. పిల్లలకి విక్రమార్కుడు ఎలా ఉంటాడో తెలిపేవారెవరా అని.

  చందమామ గురించి చక్కని అనుభవాలను మాతో పంచుతున్నారు, ధన్యవాదాలు

 3. రవి on September 10, 2009 10:25 PM

  శంకర్ గారి పరిచయం అద్భుతంగా ఉంది. కారణజన్ములయిన శంకర్ గారికి పాదాభివందనాలు.

 4. రాజశేఖర రాజు on September 10, 2009 11:47 PM

  వేణు, లక్ష్మి, రవి గార్లకు,

  మీ స్పందన నిజంగా నన్ను కదిలించివేస్తోంది. సమస్త చందమామ ప్రియులకు, అభిమానులకు, ‘చంపి’లకు శంకర్ గారిని కలుసుకోవడమో లేదా ల్యాండ్ ఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం త్వరలో లభిస్తుంది. తెలుగు చందమామ పాఠకులు, అభిమానులు మిమ్ములను ఆరాధిస్తున్నారు అని ఆరోజు చెబితే ఆయన చలించిపోయారు. మెల్లగా నా చెయ్యి పట్టుకుని నిమిరారు.

  నిజం చెప్పాలంటే దగ్గరికెళ్లి ఆయన్ను చూసిన క్షణాల్లో దుఃఖం తన్నుకుని వచ్చింది. కానీ అందరూ ఉన్నారు చూస్తే బాగుండదని బలవంతంగా ఆపుకున్నాను. కేవలం పరిచయం కాలేదు అనే కారణంతో, ప్రింట్ చందమామ వ్యవహారాల్లో తలదూర్చకూడదు అనే మొహమాటంతో ఆరునెలలు కాదు.. కాదు. 8 నెలలుగా ఆయనను అడపా దడపా చందమామ ఆఫీసులో చూస్తూ ఉండి కూడా పలుకరించలేకపోయాను.

  దాదాపు ఆన్‌లైన్‌లో అందరి పరిస్థితీ ఇంతే. ఒక్క సౌమ్య గారు తప్ప. చివరకు ఆమెతోటే ఈ విషయం ప్రస్తావించి శంకర్ గారి పరిచయం కావాలి అని అడిగితే అప్పటికప్పుడే అందుకు తగిన ఏర్పాటు చేశారు. పరిచయ మాత్రంతోటే ఆగిపోవడం కాకుండా అందరికీ ఉపయోగకరంగా చందమామ జ్ఞాపకాలు కేటగిరీలో ఆయన పరిచయం లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకోవడం. వెంటనే అందుకు సిద్ధపడిపోవడం చకచకా జరిగిపోయాయి.

  ఆయన గురించి పరిచయం చేయడం వరకే నా పరిధి. కాబట్టి చిత్రరచన పరంగా మీలో ఆసక్తి, అభిరుచి కలిగిన వారెవరయినా సరే ఆయన అనుభవాలను తెలుసుకోవచ్చు. వచ్చే సోమవారం లోగా ఆయన చిరునామా, ఇంటి ల్యాండ్‌లైన్ నంబర్ ఇస్తామని చెప్పారు. బహుశా ఈరోజు కూడా ఆయన ఇంటిలోనే ఉండి పనిచేస్తారనుకుంటాను. తెలుగు, తమిళం, ఇంగ్లీషు భాషల్లో ధారాళంగా మాట్లాడే ఆయనతో వ్యక్తిగతంగా కూడా ఒకసారి వీలుచూసుకుని మాట్లాడగలరు.

  మీ అందరికీ ఓ విజ్ఞప్తి…. ఈ బ్లాగులో మీ కామెంట్ల కంటే కూడా శంకర్ గారికి సంబంధించినంతవరకు నేరుగా ఈ కింది లింకుకే మీ అభిప్రాయాలు, స్పందనలు లాంటివి పంపగలరు. ఇది ఆన్‌లైన్ చందమామ‌ అఫిషియల్ ఫీడ్‌బ్యాక్ లింక్ కాబట్టి స్పందనలు దీనికే పంపితే నేరుగా ప్రయోజనం ఉంటుందని భావన.

  abhiprayam@chandamama.com

  ‘జీవిత కాలం ప్రపంచానికి తెలియకుండా పోయిన మానవలోకపు మహనీయుడు’ అనటం ఎంతో వాస్తవం.

  ‘శంకర్ గారిని చూసేటప్పడికి అప్రయత్నంగా రెండు కన్నీటి చుక్కలు చెంపల మీదకి జారాయి. వీరి తర్వాత అంతటి చిత్రకారుడెవరా అని. పిల్లలకి విక్రమార్కుడు ఎలా ఉంటాడో తెలిపేవారెవరా అని.’

  ‘కారణజన్ములయిన శంకర్ గారికి పాదాభివందనాలు.’

  మీకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు…

  నోట్: ఎప్పుడో మూడేళ్ల క్రితం అవసరానికి ఉపయోగపడుతుంది లెమ్మని ఓ డిజిటర్ కెమెరా కొనుక్కుని పెట్టుకున్నాను. ఇన్నాళ్లకు నాతో పాటు ఆ కెమెరా జీవితం కూడా సార్థకమైనట్లుంది.

 5. సుజాత on September 11, 2009 1:20 AM

  రాజశేఖర్ గారు,
  మీ స్పందన చదువుతుంటేనే దుఃఖం వచ్చేలా ఉంది.చందమామ పట్ల మీకెంత తపన! చందమామ కథల్లో మాంత్రికులు నిజంగా ఉన్నారో లేరో నాకు తెలీదు కానీ దశాబ్దాలుగా చందమామ పాఠకులను తన చిత్రాలతో కట్టిపడేసిన శంకర్ గారు నిజంగా మాంత్రికుడే! పట్టువదలని విక్రమారుడంటే ఊహల్లోకి దూసుకొచ్చేది శంకర్ గారుగీసిన బొమ్మే!అంతకంటే మరెవరూ కాదు!ఇంకెవరూ ఉండరు కూడా!

  “ఈ నాటికీ ఆయన ఇదే పని చేస్తున్నారు. చివరి శ్వాస ఉన్నంతవరకూ చందమామతో ఉండాలని, అందులోనే పనిచేయాలని ఒకే ఒక చిన్న కోరిక తప్ప మరే ఇతర ఆకాంక్షలూ ఆయనకు లేవు”.

  ఎంతటి డెడికేషన్…. ఎంతటి శ్రద్ధ…. చందమామ మీద ఎంతకూ తీరని ఎంత మమకారం? అనితర సాధ్యం కాదా!

  ఇటువంటి వారికి చేసే పాదాభివందనాలకే విలువ!
  వారికి నా నమస్సులు! మీకు అనేకానేక ధన్యవాదాలు!

 6. SIVARAMAPRASAD KAPPAGANTU on September 11, 2009 8:25 PM

  ధన్యవాదాలు రాజుగారూ. ఇంతకాలానికి శంకర్ గారిని చూసే అదృష్టం కలిగింది, మీ చొరవ వల్ల. ఈన్నేళ్ళబట్టి, ఆయన గురించి చందమామ వారు వ్రాయకపోవటం, పాఠకులకు చేసిన అన్యాయం. ఏది ఏమైనా, మీరు పూనుకుని అందరికి, శంకర్ గారిని చూపించారు.

  నేను ఆయన గురించి వ్యాసం వ్రాద్దామని అనుకూంటున్నాను. బ్లాగుల్లో ఉన్న చందమామ ప్రియులు ఎవరు వ్రాయకుండా ఉండగలరు. మీ సహాయంతో మరిన్ని ఆయన వ్యక్తిగత, చిత్ర కళా వివరాలు పోగుచేసి, ఒక సమగ్ర వ్యాసం వ్రాద్దామని ఉన్నది. పురాణ బొమ్మల సృష్టికర్త శంకర్ గారు. ఆయన చలవ వల్లే దాదాపు 5 తరాల పిల్లలకు, పురాణ పాత్రలు ఎలా ఉంటారు అని తెలిసింది.

  మరొక్కసారి ధన్యవాదాలు.

  శివరామప్రసాదు కప్పగంతు
  బెంగుళూరు, భారత్

 7. SIVARAMAPRASAD KAPPAGANTU on September 11, 2009 8:34 PM

  ఇంతకు ముందటి వ్యాఖ్యలో వ్రాయటం మరచాను. ఓక చిత్రకళాకారుడు అదే సంతకంతో వేసిన బొమ్మలు ఎన్ని అని ఎంచితే, నేననుకుంటాను శంకర్ గారు వేసినన్ని బొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా ఇంకెవరూ వేసి ఉండరు. ఒకే వ్యక్తి మ్రింకెవరి సహకారమూ లేకుండా( ఈ కామిక్కుల వాళ్ళు ఐదారుగురు కలసి ఒకే శైలొళొ బొమ్మలు వేసి ఉండవచ్చు)బొమ్మలు వేసిన ఏకైక వ్యక్తి శంకర్ గారని నా అభిప్రాయం. చందమామ వారు తప్పకుండా ఈ విషయాన్ని మరింత లోతుగా శోధించి, గిన్నీస్ బూక్ లో ప్రచురించటానికి తగిన చర్యలు తీసుకోవాలి. అదే ఆయన చందమామకు చేసిన సేవకు తగిన సత్కారం. ప్రింటు చందమామను ఈ త్రిమూర్తుల ఫొటోలను (చిత్రా, శంకర్ మరియు వడ్డాది పాపయ్య)లను ముఖ చిత్రంగా వేసి, లోపల వారి గురీంచి విపులంగా వ్రాసి, వారి బొమ్మలను కొన్ని ప్రచురించి, రాబొయ్యే దీపావళికి పర్త్యేక సంచికగా విడుదల చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఎన్ని దశాబ్లయిపోయింది, చందమామ పర్త్యేక సంచిక చూసి. పరిశీలించంది.

  శివరామప్రసాదు కప్పగంతు
  బంగుళూరు, భారత్

 8. chandamamalu on September 12, 2009 1:25 AM

  సుజాతగారికి,

  పట్టువదలని విక్రమారుడు, బేతాళుడు శంకర్ గారిని ఆవహించారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ‘చందమామ’లో బేతాళ కథలకు ముగింపు లేదు. ముగింపు ఉంటే చందమామ పని అంతే. నాటి నుంచి నేటిదాకా ఆబాలగోపాలాన్నీ ఆద్యంతం ఆకర్షిస్తున్న ధారావాహిక బేతాళ కథలే మరి. ప్రపంచ ధారావాహికల చరిత్రలోనే ఇదొక అమోఘ విజయం.

  తెలుగు సాహిత్యం, ఇంకా విస్తృతంగా చెబితే భారతీయ సాహిత్యం కూడా విశ్వసాహిత్యానికి అందించిన మణిపూస బేతాళ కథలు. శివరాం గారూ, మీరు చెప్పినట్లు శంకర్ గారి చిత్రాలతో పాటు, బేతాళ కథలు సీరియల్‌ కూడా గిన్నెస్ బుక్ అవార్డులలోకి ఎక్కవలసినవే. (అది మనకు అవసరం అనుకుంటే)

  సుజాత గారూ మీ చందమామ జ్ఞాపకాలమాటేమిటి. ఇప్పటికే నేను మీకు నా బ్లాగు వ్యాఖ్య రూపంలోనూ, పర్సనల్ మెయిల్ రూపంలోనూ అభ్యర్థన పంపాను. మీ చందమామ జ్ఞాపకాలు పంపమని.. మీరు కాకపోతే ఇంకెవరు పంపాలి. వీలైనంత త్వరగా వస్తుందని ఎదురుచూడవచ్చా..

  మీ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు మాత్రమే పంపించండి.

  abhiprayam@chandamama.com

  వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  NB: అన్నట్లు మీ చెల్లెలుగారి పాత చందమామల విషయం ఏమిటి? ఇంకా అందలేదా. విశేషం ఉంటే రాయండి.

 9. chandamamalu on September 12, 2009 1:38 AM

  శివరాం గారూ…

  “ఆయన వ్యక్తిగత, చిత్ర కళా వివరాలు పోగుచేసి, ఒక సమగ్ర వ్యాసం వ్రాద్దామని ఉన్నది.”

  “శంకర్ గారు వేసినన్ని బొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా ఇంకెవరూ వేసి ఉండరు. ఇంకెవరి సహకారమూ లేకుండా ఇన్ని బొమ్మలు వేసిన ఏకైక వ్యక్తి శంకర్ గారేనని నా అభిప్రాయం. చందమామ వారు తప్పకుండా ఈ విషయాన్ని మరింత లోతుగా శోధించి, గిన్నీస్ బూక్ లో ప్రచురించటానికి తగిన చర్యలు తీసుకోవాలి.”

  రచయితలకు, చిత్రకారులకు, వ్యక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే అలవాటు చందమామకు మొదటినుంచి లేదు కాబట్టి గిన్నెస్ తదితర రికార్డులకు ఎక్కడం అనే ఆలోచనే చందమామకు లేదనుకుంటాను. అయితే మీ అభిప్రాయం విలువైందే. ఇప్పటికే మీరు దీన్ని ఆన్‌లైన్ చందమామ అధికారిక మెయిల్‌కు తెలుగులో, ఇంగ్లీషులో పంపారు కాబట్టి వేచి చూద్దాం. స్పందన ఎలా ఉంటుందో.

  అయితే పాఠకుల, అభిమానుల అభిప్రాయాలు, స్పందనలు యాజమాన్యం వారి దృష్టికి తీసుకు పోవాలంటే.. ఇంగ్లీషులో కామెంట్లు పంపడం చక్కటి మార్గం. ఇది ఇంకా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు కూడా..

  వ్యాఖ్యలకు ధన్యావాదాలు.

 10. chandamamalu on October 6, 2009 1:41 AM

  చందమామ శంకర్ గారిపై ఆన్‌లైన్‌లో ప్రచురించిన తొలి కథనంపై తెలుగు చందమామ అభిమాని నారాయణ రాజు గారు abhiprayam@chandamama.com కు తమ అభిప్రాయం పంపారు. చందమామ పాఠకుల సౌకర్యార్థం దానిని ఇక్కడ వ్యాఖ్య రూపంలో ఉంచుతున్నాము. ఆయనకు సమాధానం కూడా ఇక్కడే పోస్ట్ చేస్తున్నాము. ఆలస్యానికి క్షమాపణలు.

  Dear Chandhamama

  Many many thanks for the great stories since decades.

  I buy this book since my childhood for pictures. i feel like going to another world of joy by looking those pictures and reading story.
  the one of the outstanding feature among the competitors of chandhamama is pictures I believe. Hats off to Sankar, Chitra, Vapa, …
  by the way many thanks for making those stories available online.

  My hearty congratulations to my dearest artist Shankar on completing 56 years of great service.
  Padhabhi vandhanamulu guru samaanulu Shankar gaariki.

  Best Regards
  Narayana Raju

  Dear MLN Raju Garu,
  Very sorry for late reply..

  very happy to know that you are fond of chandamama from your childhood days.

  శ్రీ శంకర్, చిత్రా, వపా వంటి అపరూప చిత్రకారులను చందమామ కానీ, చందమామ పాఠకులు కాని ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఎన్నటికీ మర్చిపోలేరు. చందమామను భారతీయ బాలసాహిత్యంలో, కథాసాహిత్యంలో శిఖర స్థాయిలో నిలబెట్టడానికి వీరు చేసిన కృషి అసామాన్యం. ఆన్‌సైన్ చందమామలోని చందమామ జ్ఞాపకాలు విభాగంలో శంకర్ గారిపై ఇంతవరకు 3 భాగాలు ప్రచురించాము. వాటి లింకులు కింద చూడగలరు.

  చందమామ చిత్రమాంత్రికుడు
  http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2203

  చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…
  http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2211

  చందమామ శంకర్ గారి జీవిత వివరాలు
  http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2253

  ఈరోజే శంకర్ గారిపై మరో కథనం ఆన్‌లైన్ చందమామలో ప్రచురిస్తున్నాం. “చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ” అనే పేరుతో దీనిని పోస్ట్ చేస్తున్నాం. చూసి మీ అభిప్రాయం తప్పక పంపగలరు.

  అంతకు మించి చందమామతో మీ బాల్య అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ మీ చందమామ జ్ఞాపకాలను తప్పక పంపగలరు. ఇంతవరకు ఆన్‌లైన్ చందమామలో వచ్చిన చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకులో చూడగలరు.

  http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

  ఆన్‌లైన్ చందమామతో మీ అనుబంధం మరింతగా కొనసాగుతుందని ఆశిస్తూ..
  మీనుంచి చందమామ జ్ఞాపకాలకోసం ఎదురుచూస్తూ..

  కె.రాజశేఖర రాజు.

 11. Ruth on October 14, 2009 3:47 AM

  కళ్ళ ముందు కనిపిస్తున్న శంకర్ గారి బొమ్మలను మనం గుర్తించక బాపు బొమ్మ అని సినిమాల్లో ఉన్నవి కీర్తిస్తున్నాం ఇదే మన దౌర్భాగ్యం

 12. Ruth on October 14, 2009 3:51 AM

  చందమామ కు ప్రాణం పోసి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహానుభావునికి మా అభినందనలు
  ఇంత మంచి వ్యాసం పరిచయం చేసినందుకు రాజశేఖర్ గారు శివరాం గారికి కూడా ధన్యవాదములు

 13. చందమామలు on October 14, 2009 9:27 AM

  Ruth గారూ, ఆలస్యంగా అయినా శంకర్‌ గారి పరిచయ కథనం చూసినందుకు చాలా సంతోషం. ‘కళ్ళ ముందు కనిపిస్తున్న శంకర్ గారి బొమ్మలను మనం గుర్తించక’ దీనికి చందమామే బాద్యత వహించాలి. రచయితలు, చిత్రకారులు, తదితర సిబ్బంది కనీస వివరాలను 60 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉంచిన చందమామ… దీనికి పాలసీ అనండి. చందమామ విధానం అనండి.. పేరు ఏదైతేనేం. ఇవ్వాళ వెనక్కు తిరిగి చూసుకుంటే గతకాలంలో పనిచేసిన వారి పోటోలు సైతం దొరకని దుస్థితి. దీనికి ఎవరో ఒకరిని తప్పు పట్టీ ప్రయోజనం లేదు. ఎందుకంటే,చందమామ పాలసీకి యజమానులతో పాటు సిబ్బంది కూడా తొలినుంచీ కట్టుబడిపోయారు. అజ్ఞాత వాసానికి అలవాటుపడిపోయారు. కళ్లముందు చందమామ సకల పర్ణ శోభితమై నెలనెలా అలరారుతోంది చాల్లెమ్మని మిన్నకుండిపోయారు. ఫలితం. ఇవ్వాళ కాసింత చిన్న వివరం కోసం రోజుల తరబడి గాలించాల్సిరావడం.. గాలించినా సమాచారం దొరక్కపోవడం. చితుకులనుంచి కొంచెం కొంచెంగా సమాచారాన్ని పేర్చుకుంటూ పోవలసి రావటం.. కనీసం ఇన్నేళ్లకయినా ఓ ప్రయత్నం అంటూ జరుగుతోంది. కొంతైనా సమాచారం లభ్యమవుతోంది. ఆ సంతృప్తి తోటే మరింత సమాచార సేకరణకు పూనుకుంటున్నాం. రోహిణీ ప్రసాద్, త్రివిక్రమ్, శివరాం, వేణు గార్లు తదితర చందమామ ప్రేమికులు, అబిమానులు గతంలో రాసిన చందమామ విశేషాలు మాకు ఎంతో ప్రేరణను, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. పైగా చందమామకు సంబంధించిన కొన్ని వివరాలకోసం వీరి బ్లాగులు, రచనలే మంచి వనరులుగా ఉండి వాటిపైనే పూర్తిగా ఆధారపడక తప్పని స్థితి కూడా కొనసాగుతోంది. వీరు పొందుపర్చిన సమాచారం ప్రాతిపదికనే కొత్త సమాచారం గురించి వెతుకుతున్నాం. అందుకు వీరందరికీ కృతజ్ఞతలు చెప్పాలి.

  మీ ప్రశంసలకు ధన్యవాదాలు

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind