చందమామ కథలు : పాతాళదుర్గం

September 10th, 2009
దాసరి సుబ్రహ్మణ్యం

దాసరి సుబ్రహ్మణ్యం

చందమామలో ప్రారంభం నుంచి మంచి మనుషులు, మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వస్తున్నప్పటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పన్నెండు ధారావాహికలు తెలుగు జాతికి, పిల్లలకు, పెద్దలకూ కథల రూపంలో అమృతాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు.

ప్రముఖ తెలుగు బ్లాగర్ వేణు గారు అన్నట్లుగా దాదాపు పాతికేళ్లపాటు “చందమామ పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు” దాసరి సుబ్రహ్మణ్యం గారు.

ఖడ్గవర్మ, జీవదత్తు, జయశీలుడు, సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ వంటి పాత్రలతో  రెండు, లేదా మూడు తరాల పిల్లలకు బాల్యపు హీరోలను అందించిన మేటి రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన ఈయన చందమామలో యాబై నాలుగేళ్ళు పాటు (2006వరకూ) పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు.

“కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన” తెలుగు కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.  జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారు భారతీయ కథకులలో అగ్రగణ్యులు.

ప్రపంచానికి హ్యారీ పాటర్లు, స్పైడర్ మేన్లు, తెలియని కాలంలోనే, ‘తోకచుక్క’తో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్య సృష్టి – చందమామ లోని ఈ ధారావాహికలు!

తోకచుక్క- 1954
మకర దేవత -1955
ముగ్గురు మాంత్రికులు-1957
కంచుకోట – 1958
జ్వాలాద్వీపం- 1960
రాకాసిలోయ- 1961
పాతాళదుర్గం – 1966
శిథిలాలయం- 1968
రాతిరథం- 1970
యక్ష పర్వతం- 1972
మాయా సరోవరం- 1976
భల్లూక మాంత్రికుడు- 1978

చందమామలో ఆయన రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24 సంవత్సరాలపాటు వరుసగా రాసినవి.

బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్‌వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం కూడా మళ్లీ చందమామను పెద్దలకు లాగే హత్తుకోవాలనే ఆకాంక్షతో ఆయన 1966లో రాసిన ‘పాతాళదుర్గం’ సీరియల్‌ను తిరిగి ఆన్‌లైన్ చందమామలో ప్రచురిస్తున్నాం.

అద్భుతమైన ఊహాశక్తి, నిసర్గ పద సౌందర్యంతో, కల్పనా చాతుర్యంతో సుబ్రహ్మణ్యంగారు 1950, 60, 70లలో చెక్కిన అపరూప కథాశిల్పాల్లో ‘పాతాళ దుర్గం’ ఒకటి. ఆయన 1972లో రాసిన ‘యక్షపర్వతం’ ధారావాహిక (13 భాగాలు) ను ఇప్పటికే telugu.chandamama.com లో ప్రచురించిన విషయం తెలిసిందే.

పాతాళదుర్గం ధారావాహిక కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138

చందమామ ధారావాహికల కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138

దాసరి సుబ్రహ్మణ్యం గారి విశేషాలు తెలుసుకోవాలంటే వేణుగారి బ్లాగ్ చూడండి.

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు
http://venuvu.blogspot.com/2009/07/blog-post_18.html

“చందమామ రచయితను కలిసిన వేళ….”
http://venuvu.blogspot.com/2009/04/blog-post_16.html

‘చందమామకి వెన్నెముక- సుబ్రహ్మణ్య సృష్టి’
http://koumudi.net/Monthly/2009/april/index.html

RTS Perm Link


17 Responses to “చందమామ కథలు : పాతాళదుర్గం”

 1. రవి on September 10, 2009 4:22 AM

  చందమామకు సంబంధించి మా ఇంట ఓ అందమైన ఉదంతం. మా అమ్మ గారు తన బాల్యంలో తోకచుక్క చదువుతూ, ఆనందించారట. నేను చిన్నప్పుడు, తోకచుక్క ను పునర్ముద్రించారు. అప్పుడు నా బాల్యంలోనూ, అదే సీరియల్ నేను తిరిగి చదువుతూ ఆనందించాను. “ఏకాక్షి”, “చతుర్నేత్రుడు” – ఈ పదాలకు అర్థం మా అమ్మే విశదీకరించి చెప్పింది!

 2. chandamamalu on September 10, 2009 4:36 AM

  ధన్యవాదాలు రవిగారూ,

  అమ్మ చదివిన తోకచుక్కను మళ్లీ మీ చిన్నప్పుడు మీరూ చదవడం. ఎంత బాగుందో. రేపు మీ పిల్లలు కూడా తోకచుక్క చదివేలా చేస్తారు కదూ. ఎంతయినా ‘చంపి’లు కదా ఆ మాత్రం నమ్మకం ఉంది మీమీద. అమ్మను అడిగామని చెప్పగలరు.

  అవునూ.. ఇంతకూ.. మీరు ఆన్‌లైన్ చందమామకు “చందమామ జ్ఞాపకాలు” ఎప్పుడు పంపుతున్నారు. అమ్మ చదివిన తోకచుక్క మీరూ చదవడం. వారసత్వంగా చందమామతో మీకు అనుబంధం ఏర్పడటం ఇవే రాయండి చాలు. వీలైనంత త్వరలో కింది లింకుకు పంపించగలరు.

  abhiprayam@chandamama.com

 3. రవి on September 10, 2009 7:07 AM

  చందమామతో..అబ్బో, ఎన్ని అనుభవాలో.. అసలు నేను చదువు నేర్చుకున్నదే చందమామతోనండి. వేణు గారి అనుభవాలు చదివినప్పుడే, రాయాలనిపించింది. తప్పక రాస్తాను.

  మా అమ్మ గారిప్పుడు లేరండి. అందమైన రాత్రి ఆకాశంలో ఓ అందమైన చుక్కను చూస్తే, అమ్మ, తోకచుక్కా రెండూ గుర్తుకు వస్తాయి!

  నా దగ్గరా చాలా పాత చందమామలున్నాయండి. (బవుండు వేసి కొన్ని, విడి ప్రతులుగా కొన్ని) వర్షం తర్వాత మట్టి వాసనా, ఈ పుస్తకాల సగంధం తల్చుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది.

 4. రాజు on September 10, 2009 9:41 AM

  ఓ.. క్షమించండి. మాకూ అమ్మ లేదిప్పుడు.

  ‘అందమైన రాత్రి ఆకాశంలో ఓ అందమైన చుక్కను చూస్తే, అమ్మ, తోకచుక్కా రెండూ గుర్తుకు వస్తాయి!’

  కళ్లు చెమ్మగిల్లుతున్నాయి మీ వ్యాఖ్య చదువుతుంటే.

  పాత చందమామల సుగంధ పరిమళాలను చవిచూసే భాగ్యవంతులలో మీరూ ఒకరు. జీవిత పయనంలో సేకరించిన అమూల్య సాహిత్యాన్ని పొగొట్టుకుంటూ వచ్చిన అభాగ్యుల జాబితాలో నా పేరు ఉంది. ఏం చేస్తాం.

  అందుకే మీరంతా పాత చందమామల గురించి చెబుతున్నప్పుడల్లా గుండె కనలి కనలి, చేసేదేమీ లేక ఈరోజే ఈనెల అన్ని భాషల్లోని చందమామలను (12) ఓ సెట్ ఆపీసులో కొనుక్కుని తీసుకుని వచ్చాను. కనీసం ఈ రకంగా అయినా తృప్తి పడవచ్చు కదా. నా వద్దా 12 బాషల్లో చందమామలు ఉన్నాయి అనుకుంటా. ఈ సెట్‌ను మంచి జ్ఞాపకం లాగే భద్రపర్చుకుంటాను.

  ఇలా అంటున్నానే కాని మళ్లీ ఎవరు ఇంటికొచ్చి అడుక్కుని వీటిని కూడా తీసుకుపోతారేమో అని భయంగా ఉందనుకోండి. మొహమాటం ముందు పుట్టి తర్వాత మనం పుట్టాం మరి. ఏం చేస్తాం మరి.

  చందమామ జ్ఞాపకాలు పంపుతానని చెప్పారు. పంపకముందే కృతజ్ఞతలు..

 5. laxmi on September 10, 2009 9:37 PM

  ప్చ్ చందమామ ఇంతటి దుస్థితికి దిగజారిపోతుంది అని తెలిసి ఉంటే నేను కూడా అన్ని పుస్తకలానీ బైండింగ్ చేయించి ఉంచేదాన్ని. నేను తాగిన ఆ అమృతాన్ని మా పాపాయికి అందించాలి అంటే అక్కడక్కడా కొన్ని జ్ఞాపకాలే తప్పించి సాలిడ్ ప్రూఫ్ అంటూ లేకుండా పోయింది. ఇలాంటి రచయితలు మళ్ళా పుడతారా, ముందు తరాలను వారి ఊహాశక్తితో ఉర్రూతలూగిస్తారా? ఏమో 🙁

 6. rajeswari on July 17, 2010 5:29 AM

  bhallega undi.mana andariki aanandanni iche chandamama
  adbhutala pandiri mana onlinelo.geemutavahanudi address unda?ramayanam etc andulove manaki modata chadavadiniki parmission.malli kalustaa.

 7. rajeswari on July 17, 2010 5:31 AM

  bhallega undi.mana andariki aanandanni iche chandamama
  adbhutala pandiri mana onlinelo.geemutavahanudi address unda?ramayanam etc andulove manaki modata chadavadiniki permission.malli kalustaa.

 8. ganta satyanarayana on November 20, 2010 12:05 PM

  chandamama ante naku chala ishtam.chinnappudu library ki velli modhata vedikedi ee book kosame. ee websitelo marala chaduvutunte chinnappati sangatulu gurthuku vachayi.

 9. v.tirumala rao on January 20, 2011 2:32 AM

  nenu chinnappudu betala kadhalu ekkuvaga istapadevadini. eemadya kalamlo chandamama chadavadaniki avatamledu. pl tell me about your web site so that i can read and i can also tell my children to read the same

 10. chandamama on January 31, 2011 1:44 PM

  తిరుమల రావుగారికి,
  నమస్తే, మీరు చందమామలు బ్లాగుకు గతంలో పంపిన కామెంటు స్పామ్ విభాగంలోకి వెళ్లిపోవడంతో చాలా ఆలస్యంగా చూస్తున్నాను. చందమామపై మీ అభిరుచికి చాలా సంతోషం. మీరు కోరిన వివరాలు కింద ఇస్తున్నాను చూడండి.

  1947 నుంచి 2005 వరకు 58 ఏళ్ల చందమామలను ఆన్‌లైన్లో చదవాలంటే చందమామ వెబ్‌సైట్ లోకి వెళ్లి చూడండి. కింది చందమామ ఆర్కైవ్‌ల లింకుపై క్లిక్ చేయండి.
  http://www.chandamama.com/archive/TEL/storyArchive.htm

  అలాగే చందమామ చరిత్ర గురించిన అరుదైన వ్యాసాలు, కథనాలు చూడాలంటే మీరు కింది బ్లాగులు చూడవచ్చు.
  blaagu.com/chandamamalu

  manateluguchandamama.blogspot.com

  venuvu.blogspot.com

  http://manishi-manasulomaata.blogspot.com/

 11. RAZ on July 24, 2011 4:50 AM

  hai na peru raz adi edi antha kadhu okkamatalo chppestunna chandamama katha super

 12. satish on July 27, 2011 11:08 AM

  kadhalu

 13. laxman on December 18, 2011 7:55 AM

  chala bhagunaiiiiiiiiiiiiiiiiiiiiii

 14. P.KALYAN SATISH on December 24, 2011 6:34 AM

  మా ఇంటిలో చందమామ చదవడం మేము పుట్టాక ముందు నుంచి ఉంది. ఇప్పటికి నా దగ్గర తోక చుక్క,మకర దేవత,భల్లుక మాంత్రికుడు,కంచుకోట,ముగ్గురు మాంత్రికులు,ఐదు ప్రశ్నలు,దేవి భాగవతం మొ” సిరియల్స్ ఇతర పాత చందమామ కథల పుస్తకాలు చాల ఉన్నాయ్.వీటిలో కొన్ని ముగ్గురు మాంత్రికులు మరి కొన్ని పాత పుస్తకాలు చదవడానికి ఇతరులకు ఇచ్చి తిరిగి నా చేతికి రాక మోసపోయాను,మిగిలిన వాటిని బంగారం లా చూసుకోవాల్సి వష్తుంది.పాత చందమామ ను గాని రీడర్స్ ను గాని చుస్తే ఆప్తులను చూసినట్లు ఉంటుంది.పాత కథలు తిరిగి పున్హముద్రణ ఐనప్పుడు మన దగ్గర పాత వాటితో అదే కథను తిరిగి చదివితే ఆనందంగా ఉంటుంది.ఇప్పటి చందమామ లో దాని లో ఆత్మ ఏదో పోఇన భావన ఉంటుంది. తిరిగి పాతదనం తీసుకు వస్తే బాగుంటుంది.పాత కథలు సీరియల్స్ తిరిగి లబించినట్లు అయితే బాగుంటుంది.

 15. chandamama on December 25, 2011 5:25 AM

  సతీష్ గారూ,
  చాలా సంతోషమండీ. పాత చందమామపై మీ మమకారం ఎంత లోతుగా ఉందో అర్థమయింది. “ఇప్పటి చందమామలో దాని ఆత్మ ఏదో పోయిన భావన ఉంటుంది. తిరిగి పాతదనం వస్తే బాగుంటుంది” అన్నారు. చందమామ స్వర్ణయుగం దాటేసింది. నాగరెడ్డి, చక్రపాణి గార్ల మార్గ నిర్దేశకత్వం, కొకు, దాసరి, వపా, చిత్రా, శంకర్, ఆచార్య వంటి దిగ్ధంతుల పనితనం చందమామకు దూరమైంది. చందమామ ఇప్పటికీ బతుకుతోందంటే ఈనాటికీ దాని కథలు కావాలని పిచ్చిగా కోరుకుంటున్న అభిమానులే, పాఠకులే కారణం. పది కథలు పాతవి, పది కథలు కొత్తవి వేస్తూ గతంలోలా కాకపోయినా చందమామ బ్రాండ్ కథలను మరీ దిగజారకుండా వేస్తున్నందుకు కూడా పాఠకాభిమానుల ఆదరాభిమానాలే కారణం. పాత కథలు, సీరియల్స్ పుస్తక రూపంలో రావు. కాని ఆన్‌లైన్‌లో 1947 నుంచి 2008 వరకు తెలుగు చందమామలు అన్నీ లభ్యమవుతున్నాయి. చదువుకోవడానికి మాత్రమే ఇవి వీలుగా ఉంటాయి. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

 16. Harikumar on March 31, 2012 1:23 AM

  I am wondered that a blog is opened for Chandamama, I read chandamama from 1969 to 2001, there after I read it now and then, the stories in chandamama are really inspiring, we have played one playlet basing on the story published in 1972 and won first prize during my school days. it reminded me the olden days suddenly. I have also read the posts, some are very emotional, Thanks to all.

 17. chandamama on March 31, 2012 7:02 AM

  హరికుమార్ గారూ,
  నమస్తే, చందమామపై ఈ బ్లాగే కాదండి.. చందమామ కథలు, సీరియల్స్ చిత్రకారులు, సంపాదకులు, రచయితలు, జ్ఞాపకాలు తదితర చరిత్రపై చాలా మంచి బ్లాగులు ఆన్‌లైన్‌లో ఉన్నాయండీ మచ్చుకు శివరామ్ ప్రసాద్ గారి మనతెలుగుచందమామ (దీన్నే అలనాటిచందమామ బ్లాగుగా మార్చారు), వేణుగారి వేణువు బ్లాగ్ మీరు చూడవచ్చు.
  చందమామతో మీకూ సుదీర్ఘ అనుబంధం ఉంది కాబట్టి మీ చందమామ జ్ఞాపకాలను తప్పక పంపించగలరు.
  మీరు ఇంగ్లీషులోనే రాసి పంపినా తెలుగులోకి మార్చి ప్రచురించవచ్చు.

  rajasekhara.raju@chandamama.com

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind