చందమామ చిత్ర మాంత్రికుడు : శంకర్

September 10th, 2009
శంకర్ గారు

శంకర్ గారు

ఆయన గురించి గత 63 సంవత్సరాలుగా బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు. ఇన్ని దశాబ్దాలుగా ఆయన తనకు తెలిసిన ఒకే ఒక పనిని చేసుకుంటూ పోయారంతే. బొమ్మలు గీయడం తప్ప అంతకు మంచి ఇంకే ‘ఘనమైన’ పనీ ఆయన చేయలేదు. రాదు కూడా. ప్రపంచ రికార్డుల మీద ఆయనకు ఎలాంటి ఆసక్తి కూడా లేదు. ‘చందమామ’లో బేతాళ కథలకు, తదితర కథలకు బొమ్మలు గీస్తారు అనే విషయం తప్ప ఆయన గురించి మరే విశేషాలు ఈ ప్రపంచానికి తెలీవు.

ఆయన… శంకర్ గారు… చందమామ ఆస్థాన చిత్రకార త్రిమూర్తులు లేదా చతుష్టయంలో ఒకరు… గత 57 ఏళ్లుగా చందమామ కోసం తన యావజ్జీవితమూ అర్పించిన, అర్పిస్తున్న మహనీయులు. కుంచె వాడకుండా చేతితో చిత్రాలు గీస్తూ చందమామ చిత్ర ప్రపంచాన్ని అయిదున్నర దశాబ్దాలకు పైగా ఉద్దీప్తం చేసిన, చేస్తున్న రుషితుల్యులు.

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు  తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు,‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, ఇంత అర్ధరాత్రివేళ నువ్వు పడుతున్న శ్రమ అంతా ఎలాంటి కార్యం సాధించేందుకో తెలియడం లేదు. విక్రమ సేనుడనే రాజుకు, పరస్పర విరుద్ధమూ, ఎక్కడా పొంతనలేని హాస్యాస్పదమైన సలహానిచ్చిన, ఆయన గురువు గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:

ఈ కథా పరిచయం వినగానే కథా సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం ఉన్న ఎవరైనా సరే ఇట్టే చెప్పేస్తారు ఇది బేతాళ కథ అంటూ. బేతాళుడు ఆవహించిన శవాన్ని భుజాన వేసుకుని, ఒక చేత్తో కత్తి దూసి చురుకైన కళ్ళతో చుట్టూ చూస్తూ ముందుకు అడుగేస్తున్న విక్రమార్కుడి బొమ్మను చూడగానే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు అది చందమామలోని బేతాళ కథకు శంకర్ గారు వేసిన బొమ్మ అని.

చందమామలో పౌరాణిక ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం ధారావాహికలకు లోపలి పుటల్లో చిత్రాలు గీసినవారిలో శంకర్ గారు అగ్రగణ్యులు. అలాగే జాతక కథలు, విష్ణుపురాణం వంటి ధారావాహికలు, కథలకు కూడా ఈయనే చిత్రాలు వేశారు.

అన్నిటికంటే మించి తెలుగు సాహిత్యంలో, ఇంకా చెప్పవలసి వస్తే భారతీయ కధాసాహిత్యంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సుదీర్ఘ ధారావాహిక బేతాళ కథలకు చిత్రాలు గీసిన వారు శంకర్ గారు. బేతాళ కథలకు ముఖచిత్రం మాత్రమే కాకుండా ఇంతవరకు 300 పైగా బేతాళ కథలకు లోపలి చిత్రాలు -ఇన్‌సైడ్ చిత్రాలు- గీసింది శంకర్ గారే.

ఒకనెలలో చందమామలో 20 స్టోరీలు – కథలు, ధారావాహికలు, కథనాలు, ఇతర రచనలు- అచ్చవుతాయనుకుంటే వీటిలో 5 లేదా 6 స్టోరీలకు శంకర్ గారే చిత్రాలు గీస్తున్నారు. ఈ నాటికీ ఆయన ఇదే పని చేస్తున్నారు. చివరి శ్వాస ఉన్నంతవరకూ చందమామతో ఉండాలని, అందులోనే పనిచేయాలని ఒకే ఒక చిన్న కోరిక తప్ప మరే ఇతర ఆకాంక్షలూ ఆయనకు లేవు.

ఆరు నెలలు పనిచేస్తే చాలు.. వెంటనే మరో చోట అవకాశాలు వచ్చి ఆఫీసులను వదలి వెళుతున్న తరహా సమాజంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. అలాంటిది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదున్నర దశాబ్దాల పైగా అవిరామంగా ఒకే పత్రికలో ఒక వ్యక్తి పనిచేయగలగడం… చరిత్రలో అరుదైన విషయమే. ఇలాంటి అరుదైన ఘటనలు చందమామలోనే జరగడం మరీ విశేషం.

ఆయన శంకర్ గారు… చందమామ చిత్ర మాంత్రికుడు… జీవిత కాలం ప్రపంచానికి తెలియకుండా పోయిన మానవలోకపు మహనీయుడు.. ఆయన గురించి విందామా… 85 ఏళ్ల ఆ వృద్ద యువకుడిని చూద్దామా…

అయితే కింది లింకుపై క్లిక్ చేయండి…..

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2203

RTS Perm Link

చందమామ కథలు : పాతాళదుర్గం

September 10th, 2009
దాసరి సుబ్రహ్మణ్యం

దాసరి సుబ్రహ్మణ్యం

చందమామలో ప్రారంభం నుంచి మంచి మనుషులు, మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వస్తున్నప్పటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పన్నెండు ధారావాహికలు తెలుగు జాతికి, పిల్లలకు, పెద్దలకూ కథల రూపంలో అమృతాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు.

ప్రముఖ తెలుగు బ్లాగర్ వేణు గారు అన్నట్లుగా దాదాపు పాతికేళ్లపాటు “చందమామ పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు” దాసరి సుబ్రహ్మణ్యం గారు.

ఖడ్గవర్మ, జీవదత్తు, జయశీలుడు, సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ వంటి పాత్రలతో  రెండు, లేదా మూడు తరాల పిల్లలకు బాల్యపు హీరోలను అందించిన మేటి రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన ఈయన చందమామలో యాబై నాలుగేళ్ళు పాటు (2006వరకూ) పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు.

“కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన” తెలుగు కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.  జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారు భారతీయ కథకులలో అగ్రగణ్యులు.

ప్రపంచానికి హ్యారీ పాటర్లు, స్పైడర్ మేన్లు, తెలియని కాలంలోనే, ‘తోకచుక్క’తో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్య సృష్టి – చందమామ లోని ఈ ధారావాహికలు!

తోకచుక్క- 1954
మకర దేవత -1955
ముగ్గురు మాంత్రికులు-1957
కంచుకోట – 1958
జ్వాలాద్వీపం- 1960
రాకాసిలోయ- 1961
పాతాళదుర్గం – 1966
శిథిలాలయం- 1968
రాతిరథం- 1970
యక్ష పర్వతం- 1972
మాయా సరోవరం- 1976
భల్లూక మాంత్రికుడు- 1978

చందమామలో ఆయన రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24 సంవత్సరాలపాటు వరుసగా రాసినవి.

బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్‌వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం కూడా మళ్లీ చందమామను పెద్దలకు లాగే హత్తుకోవాలనే ఆకాంక్షతో ఆయన 1966లో రాసిన ‘పాతాళదుర్గం’ సీరియల్‌ను తిరిగి ఆన్‌లైన్ చందమామలో ప్రచురిస్తున్నాం.

అద్భుతమైన ఊహాశక్తి, నిసర్గ పద సౌందర్యంతో, కల్పనా చాతుర్యంతో సుబ్రహ్మణ్యంగారు 1950, 60, 70లలో చెక్కిన అపరూప కథాశిల్పాల్లో ‘పాతాళ దుర్గం’ ఒకటి. ఆయన 1972లో రాసిన ‘యక్షపర్వతం’ ధారావాహిక (13 భాగాలు) ను ఇప్పటికే telugu.chandamama.com లో ప్రచురించిన విషయం తెలిసిందే.

పాతాళదుర్గం ధారావాహిక కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138

చందమామ ధారావాహికల కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138

దాసరి సుబ్రహ్మణ్యం గారి విశేషాలు తెలుసుకోవాలంటే వేణుగారి బ్లాగ్ చూడండి.

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు
http://venuvu.blogspot.com/2009/07/blog-post_18.html

“చందమామ రచయితను కలిసిన వేళ….”
http://venuvu.blogspot.com/2009/04/blog-post_16.html

‘చందమామకి వెన్నెముక- సుబ్రహ్మణ్య సృష్టి’
http://koumudi.net/Monthly/2009/april/index.html

RTS Perm Link