చిరునవ్వుల రుచి చూపిన వాడికి…

September 3rd, 2009
చివరిసారి...

చివరిసారి...

నవ్వులు కరువవుతున్న ప్రపంచానికి మనసారా నవ్వడంలోని మహత్తును రుచిచూపిన చిరునవ్వుల రేడు ఆయన. చిరునవ్వు ముగ్దసౌందర్యం ఎంత మనోహరంగా ఉంటుందో కోట్లాది జనానికి నిత్యం చవి చూపించిన మనిషి ఆయన. ప్రజల నమ్మకం అనే పునాదిని బలంగా చేసుకుని జీవితంలో ఉత్తుంగ శిఖరాలను అధివశించిన వ్యక్తి ఆయన, ఓ ప్రాభాతవేళ, ఓ కొండ శిఖరంపై క్రూరంగా.. ఘోరంగా.. మహావృక్షం విరిగిపడిన రీతిలో ఒక్కసారిగా తను నేలకొరిగిన వార్త నిజమైనప్పుడు తన గురించి తెలిసిన ప్రపంచం యావత్తూ విలపిస్తోంది.

ప్రమాదస్థలి

ప్రమాదస్థలి

ఒంటిచేతి మీదుగా పూర్పవైభవాన్ని తెచ్చిపెడతానని శపధం చేసి మరీ బరిలోకి దిగినప్పుడు, ఏమిటీ దుస్సాహసం అంటూ స్వకీయులే విస్తుపోయినవ్పుడు, తొడ గొట్టకుండానే జనం నమ్మికే శ్వాసగా మరోసారి పీఠాన్ని అధిరోహించినప్పుడు యావద్దేశమే విభ్రమంగా తనకేసి చూసింది. మూతిమీద మీసం తిప్పడమే, తొడగొట్టడమే పౌరుషానికి, ధీరత్వానికి చిహ్నంగా ఇతరులు భ్రమించిన క్షణాల్లో.. తెలుగు పంచెకట్టుతో, చెరగని చిరునవ్వుతో విశ్వాసాన్ని ఓట్లుగా రాబట్టిన జన హృదయ నేత ఆయన.

8.30 AM

8.30 AM

రచ్చబండకు పోయి జనం రచ్చలో భాగం పంచుకుందామని వేసుకున్న పథకాన్ని ఘోరమైన ప్రతికూల వాతావరణంలోనూ వాయిదా వేసుకోకుండా ముందుగా సాగిన ఆ చివరిక్షణం కూడా అదే ధీరత్వం. మొక్కవోనితనం. మడమ తిప్పనితనం. ముప్పై ఏళ్లుగా తన శ్వాసలో, తన చిత్తంలో ఓ భాగమైపోయిన ఆ వెనుకచూపులేని దృఢత్వమే చివరి క్షణం వరకూ తనను నమ్మిన రంగంలో ధీరుడిగా నిలబెట్టింది.

నిజాన్ని నిగ్గుతీసి చెప్పాలంటే ఈ దేశ పాలకవర్గంలో ఓ బలమైన కూటమికి ప్రతినిధి ఆయన. మనసులో ఒకటి అనుకుంటే రక్తపుటేరులు పారించైనా సరే దాన్ని నెరవేర్చుకునేదాకా దారిమార్చని పాలెగాళ్ల సంస్కృతిలో సహనాన్ని, నమ్రతను ఆభరణంగా మార్చుకున్న చివరితరం పాలెగాడు ఆయన.

సంపన్న రైతుగా, భూస్వామిగా, పారిశ్రామికుడిగా పరిణమించిన క్రమంలోనూ, తన కుటుంబం కోట్లకొలదీ సంపదను హక్కుభుక్తం చేసుకున్నదని ఆరోపణలు దేశమంతటా వ్యాపించిన సమయంలో కూడా రైతు లేనిదే జాతిలేదన్న ప్రజా విజన్‌ను చివరికంటా వినిపించిన పల్లెసీమల ప్రతినిధి ఆయన.

ప్రపంచ ప్రగతికి ఐటి తప్ప మరొక మార్గంలేదనే సాంకేతిక నిరంకుశోద్యోగవర్గం రాజ్యమేలిన రోజుల్లో, పల్లెబాటలో కూడా రాజ్యమేలవచ్చని బూర్జువా రాజకీయాల సాక్షిగా నిరూపించి గద్దెకెక్కిన వాడాయన.

ఈ రోజు తన అస్తమయ తీరు కూడా సాంకేతికజ్ఞానం డొల్లతనాన్ని మరోసారి నిరూపించింది. చంద్రయాన్ ద్వారా చంద్రుడిమీద సంపదలు జుర్రుకోవడంకోసం ఆశల పల్లకిపై ఊరేగిన దేశంలో, మాయమైన 23 గంటల వరకు హెలికాప్టర్ జాడలేదు. మనుషుల సవ్వడి లేదు. ఉన్నారో పోయారో తేలీదు. ల్యాండింగ్ అయి ఉంటే ఎక్కడ అయిందో తెలీదు.

కిందినుంచి పైదాకా ప్రతి ఒక్కరూ సాకులు చెప్పి తప్పుకోడానికి తుఫాన్ కారణంగా దొరికింది. నిజంగా మన సాంకేతిక విజ్ఞానపు డొల్ల గురించి వింటూ, చూస్తూ అమెరికాలోని మన ప్రవాసాంధ్రులే పగలబడి నవ్వుకుంటున్నారిప్పుడు.

ఇది వర్గసమాజమే.. సందేహమే లేదు. అభిప్రాయాలు, సిద్ధాంతాలు, భిన్నమార్గాలు ఘర్షించవచ్చు. జన సమూహంలో ఓ మెజారిటీ అభిప్రాయాన్ని సమ్మోహన శక్తితో రెండవసారి కూడా తన వైవుకు తిప్పుకున్నప్పుడు, వాళ్ల ఊపిరిని తన శ్వాసగా ప్రకటించుకుని చిరునవ్వు బలంతో తానున్నాననే ధైర్యాన్ని జనంలో చొప్పిస్తున్నప్పుడు… భావాలు, సిద్ధాంతాలకు అతీతంగా ఆ మనిషి జనం ముందు పరచిన జీవన ప్రసారాన్ని ఎవరైనా చూడవలసిందే.

వరుస కరువుతో ఠావుల్ దప్పిన ప్రపంచానికి, మళ్లీ నవ్వులు తెప్పించిన ఘనత ఆయనదే. ఆయన గద్దెనెక్కడానికి, అప్పటినుంచి ప్రతి ఏటా వర్షం వర్షమై రాష్ట్రంలో కురవడానికి కార్యకారణ సంబంధం ఉండకపోవచ్చు. కానీ రాయలసీమలో ఏ ఊరుకెళ్లినా జనం అదే చెబుతూ వచ్చారు. “మాకు మణులూ, మాణిక్యాలు ఏమీ ఇవ్వనవసరంలేదు. కారు -అదును-కు తగినట్లుగా, వాన వస్తోంది. అది చాలు.”

దీనికి ఆయనే కారణమనుకుంటున్న జనాన్ని ఉత్త అమాయకులుగా భావించాలో లేక భూమ్మీద పదివేల సంవత్సరాల తర్వాత కూడా వ్యవసాయం సాగాలంటే రైతు ఆకాశం కేసి చూడక తప్పని పాలకుల అసమర్థతను తప్పు పట్టాలో తెలియదు గానీ… రైతుల సమస్యను (నీరు) పరిష్కరించకుండా భారతదేశ సమస్యను పరిష్కరించలేరన్న ప్రాథమిక సత్యాన్ని తన రైతు మనస్తత్వం సాక్షిగా మళ్లీ కనుగొన్న మనిషికి, ఆ సత్యాన్ని భారత రాజకీయ వ్యవస్థముందు నిలిపిన మనిషికి చివరి నమస్సులర్పిస్తున్నా.

నిన్న రాత్రి…2 గంటల వేళ.. జాడతెలియని హెలికాప్టర్, అందులో పయనమైన వారి గురించి తడుముతూ ‘నల్లమలలో ముఖ్యమంత్రి’ అనే కథనం పోస్టు చేస్తూ, “ముఖ్యమంత్రి గారూ.. మీరు క్షేమంగానే తిరిగి రావాలని తెలుగువారు కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు నల్లమల నుంచి క్షేమంగా తిరిగి వస్తే… మీకే అపాయమూ జరగకుండా ఇంకా బతికి ఉంటే….” అంటూ అప్పటికే ఏర్పడుతూ వస్తున్న అనుమానాన్ని చివర్లో లేవనెత్తాను.

అనుమానం ఇంత నగ్నంగా వాస్తవరూపం దాలుస్తుందని ఏమాత్రం ఊహించలేదు. మరణం చివరి వరకు వైరుధ్యం కొనసాగాల్సిందేనా అనే ‘ఇరువురు’ సినిమాలోని ఆ మహత్తర తాత్విక ప్రశ్నను మరోసారి గుర్తు చేసుకుంటూ…

వైఎస్ఆర్… మీకు వీడ్కోలు….

RTS Perm Link


One Response to “చిరునవ్వుల రుచి చూపిన వాడికి…”

  1. అబ్రకదబ్ర on September 3, 2009 3:11 PM

    విఫలమయింది సాంకేతికత కాదు. దాన్ని సరిగా ఉపయోగించుకోలేని సంబంధిత అధికారుల అసమర్ధత, ఉదాసీనతలదే అసలు వైఫల్యం. వాతావరణ నివేదికలు పెడచెవిన పెట్టి బయలుదేరకపోతే అసలా ప్రమాదమే జరిగుండేది కాదు కదా. చివరాఖరికి వైఎస్ హెలికాప్టర్ జాడ కనుగున్నది ఆ సాంకేతికతే అన్న సంగతి గుర్తించండి. అదే లేకుంటే మానవ మాత్రుడు వెళ్లలేని ఆ కొండకొమ్మున ఆ ఐదు దేహాలూ ఎప్పటికీ అలాగే ….

Trackback URI | Comments RSS

Leave a Reply

Name (required)

Email (required)

Website

Speak your mind