పరోపకారి పాపన్న కథల సేకర్త ఎం.రంగారావు…

September 30th, 2009
పరోపకారి పాపన్న

పరోపకారి పాపన్న

అతడు…కర్నాటకలో మంగుళూరు (దక్షిణ కెనరా) కు చెందిన పసివాడు. తండ్రి చేసిన అప్పులను తీర్చడానికి చిన్నతనంలోనే మంగళూరు నగరంలో ఓ ఇంట్లో పనికి కుదిరాడు. వంటపని చేస్తూ బతుకు సాగించాడు. చదువు సంధ్యలు లేకుండా సంవత్సరాలు గడిపాడు. తండ్రి చేసిన అప్పు పూర్తిగా తీర్చేసిన తర్వాత కుటుంబంతో పాటు తమిళనాడుకు వలస వచ్చాడు.

అటునుంచి మన రాష్ట్రంలో నెల్లూరు, గూడూరు పట్టణాల వరకు వలసపోయాడు. రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగిన ఈ వలస జీవితంలో మాతృభాష కన్నడకు తోడుగా కొంతవరకు తెలుగు కూడా నేర్చుకున్నాడు. రెండో భాషలో కొద్ది ప్రావీణ్యం అందించిన గొప్ప అవకాశం దన్నుతో అలనాటి చిత్రకారుడు ఎంటీవీ ఆచార్య గారి సిఫార్సుతో చందమామలో అడుగుపెట్టాడు.

ఆయనే ఎం.రంగారావు. చందమామ కన్నడ భాషా ఎడిటర్‌గా 1950ల ప్రారంభం నుంచి నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన రంగారావు గారు. చందమామకు రంగారావు గారు చేసిన గొప్ప దోహదం ఏదంటే పరోపకారి పాపన్న కథలు, గుండుభీమన్న కథలను సేకరించి తెలుగులో రాసి ఇవ్వడం. కన్నడ జానపద సంప్రదాయంలోంచి పుట్టుకొచ్చిన ఈ కథలు తెలుగు కథా సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఓ కన్నడిగుడు తెలుగు బాల సాహిత్యానికి అందించిన అమూల్యమైన కథలివి.  

చందమామలో ప్రచురించబడిన ధారావాహికలలో ముఖ్యమైనది పరోపకారి పాపన్న కథలు. 1962 నుంచి ఈ కథలు చందమామలో సీరియల్ రూపంలో వచ్చాయి. ‘ఈ కథలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ఎవరైనా కొంచెం మంచికి పోయి సహాయపడితే, అటువంటివారిని ‘పరోపకారి పాపన్నరా వాడు’ అని పిలవటం వాడుక అయ్యింది.’ అలాగే అంతకు ముందు ఈయన రాసిన గుండు భీమన్న అనే మరో సీరియల్ కూడా చందమామలో వచ్చింది. దీన్ని కుటుంబరావు గారు రాకముందు తెలుగు ఎడిటర్‌గా ఉన్న రాజారావుగారు సాపుచేసి మొదట తెలుగులో ప్రచురించారు.

కర్నాటక ప్రాంతానికి చెందిన ఓ పిల్లవాడు బాలకార్మికుడిగా, వంటమనిషిగా జీవితం ప్రారంభించి సాహిత్యం వాతావరణం ఉన్న కుటుంబాల్లో పెరిగి స్వయంకృషితో రచయితగా పరిణమించడమే కాక, తదనంతర కాలంలో చందమామ కన్నడ ఎడిటర్‌గా రూపొందిన క్రమం గత 60 సంవత్సరాలుగా మరుగున పడిపోవడమే ఓ విషాదంగా చెప్పాలి. చదువు నేర్చుకోవడం ద్వారా ఓ వంటమనిషి జీవితంలో సంభవించిన మౌలిక మార్పుకు రంగారావు గారు నిలువెత్తు సంకేతంలా చరిత్రలో నిలిచిపోయారు.

ఈ కథనం పూర్తి పాఠం చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2260

మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.

గమనిక: కన్నడ చందమామ పూర్వ ఎడిటర్ రంగారావు గారి వివరాల సేకరణకు ఇద్దరు ప్రేరణగా నిలిచారు. ఒకరు రోహిణీ  ప్రసాద్ గారు. మూడు నెలల క్రితం ఆయనతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఆయన పత్యుత్తరమిస్తూ చందమామలో గతంలో పనిచేసిన కన్నడ ఎడిటర్ రంగారావు గారు, తమిళ ఎడిటర్ స్వామినాథన్ గారు తదితరులను ప్రస్తావిస్తూ వీలైతే వారి గురించిన వివరాలు కనుక్కోవలిసిందిగా కోరారు.

అలాగే శివరాం ప్రసాద్ గారు.. పరోపకారి పాపన్నలోకి పరకాయప్రవేశం చేశారా అన్నట్లుగా ఇటీవలే తన బ్లాగులో రెండు మంచి కథనాలను పోస్ట్ చేశారు. కన్నడ జానపద మూలానికి చెందిన పాపన్న, గుండుభీమన్న తెలుగులోకి ఎలా వచ్చారనే కుతూహలం వీరిద్దరి ప్రేరణలకు తోడైన క్షణాల్లో ఈ వ్యాసం రూపు దిద్దుకుంది. అందుకు వారిద్దరికీ కృతజ్ఞతాభివందనలు…

రంగారావు గారికి సంబంధించిన ఇతర అంశాలు ఇంకా వెలుగులోకి రావల్సి ఉంది. చందమామ సీనియర్ ఉద్యోగులు శంకర్, బాలు గార్లతో మాట్లాడే క్రమంలో ఈ అదనపు వివరాలు లభిస్తాయనే ఆశిద్దాం…

RTS Perm Link

ఇష్టం లేని పని చేయవలసి వస్తే….

September 29th, 2009

ఇష్టపడి చేసేది కష్టమైనా సరే సంతోషంగా చేస్తారు అని నానుడి.. మరి, లౌకిక వాంఛలవల్ల కలిగే అనర్థాలను గుర్తించి, సన్యాసం అవలంబించి, యాభై ఏళ్ళపాటు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ గడిపిన కృష్ణద్వైపాయనుడు కాని, జగత్ప్రసిద్ధి పొందిన దాతలు తాతా, తండ్రీ మార్గాన్ని అనుసరిస్తూ వచ్చిన మాండవ్యుడు కాని, పసితనంలోనే ఓ భర్తకు భార్యగా మెట్టింటికి వచ్చి జీవితం గడిపిన మహిళ కాని ఎందుకు తమ తమ విధులను ఇష్టంగా చేయలేకపోయారు.

అందుకు వారికి జీవితంలో ఒరిగిందేమిటి….? చివరికి వారికి మిగిలిందేమిటి…? పేమాభిమానాలు లేకుండానే సంవత్సరాల పాటు కాపురం చేసిన భార్య చివరకు అనివార్య పరిస్థితుల్లో ఈ చేదునిజాన్ని భర్తకే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, తర్వాత ఆ భార్య గతి ఏమిటి? వంటి మౌలిక విలువల సారాన్ని తెలుసుకోవాలంటే ఈ కింది కథను చదవండి. అనుభవం ప్రాతిపదికగా మనిషిలో కలిగే పరివర్తనను అద్భుతంగా చెప్పిన ఈ జాతక కథను మీరు తప్పక కింది లింకులో చదవండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=93&stId=2254

మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.

RTS Perm Link

ఏదుపందికి పొట్టి తోక ఏర్పడింది!

September 27th, 2009

మనం చిన్నప్పుడు అనేక కథలను వినే ఉంటాం.. చందమామపై చెట్టుకింద ముసలమ్మ ఒకతే కూర్చుని ఎందుకు దోసెలు పోస్తా ఉంది? అనేది ఓ కథ. బహుశా ఈ కథను అందరూ తమ తమ ప్రాంతాల సంస్కృతి, వాడుకకు అనుగుణంగా వినే ఉంటారు. ఇంకో అద్భుత కథ. పిల్లి రెంటికి పోయాక ఎందుకు మట్టివేసి మూసిపెడుతుంది?

ఇలాంటివే మరికొన్ని కథలు… ఉడతకు వీపు మీద చారలు ఎందుకు ఏర్పడ్డాయి? కుక్కతోక ఎప్పుడూ వంకరగానే ఎందుకుంటుంది? కుక్క ఒంటికి పోసే ప్రతిసారీ ఎందుకు వాసన చూస్తూ ఉంటుంది? మన నిత్య జీవితంలో మనం చూసే ప్రతి జంతువు, చెట్టు, రాయి.. ఇలా కంటికి కనిపించే వస్తువులన్నింటిమీదా మనుషులు అల్లుకున్న అద్భుతమైన కాల్పనిక కథలు ఇవి.

శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ పై ప్రశ్నలకు మనం హేతుపూర్వకంగా సమాధానాలు పొందవచ్చు. అవి మరింత హేతుబద్ధంగా ఉండవచ్చు కూడా.. కాని పల్లెటూళ్లలో బాల్య జీవితం అప్పటికీ ఇప్పటికీ కూడా కాల్పనిక ప్రపంచం, కాల్పనిక ఊహల మీదే ఆధారపడి ఉందనిపిస్తుంది.

ఉడత వీపు మీద చారలు ఫలానా జన్యుమార్పుల వల్ల కలిగిందని సైన్స్ చెబుతున్నా.. సేతువు కట్టడంలో ఉడత చేసిన సాయానికి రాముడు ప్రేమగా దాని వీపు నిమిరితే దాని గుర్తుగా చారలు ఏర్పడ్డాయి అనే కథ పిల్లల మనస్సులపై, బాల్యపు ఊహలపై ఎంత గట్టి ప్రభావం వేస్తుందో మాటల్లో చెప్పలేం…

శాస్త్రీయ విజ్ఞానం సమాజానికి ఎంత అవసరమో.. పిల్లల ఊహా ప్రపంచానికి వన్నెలద్దే కాల్పనిక కథలు కూడా అంతగానే అవసరమే.. అందుకే భవిష్యత్తు సమాజాలు సైతం పిల్లల కాల్పనిక కథలకు పెద్ద పీట వేయాల్సిందే… సోషలిస్టు పునాదుల మీద ఏర్పడ్డ సోవియట్ సమాజం ప్రపంచ బాల సాహిత్యంలోనే తలమానికంగా నిలిచిన వందలాది కాల్పనిక చిత్రకథలను పెద్ద ఎత్తున ప్రచురించిన విషయం తెలిసిందే కదా..

ఏ సమాజమైనా జంతువులు పాత్రలుగా మానవ మనస్తత్వాన్ని విపులీకరించే బాల సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ వస్తోంది.

ఏదుపందికి పొట్టి తోక ఎలా ఏర్పడింది అనే కథ కూడా ఈ కోవకు చెందిందే..

ఇదొక చెరూకీ కథ. ఇప్పటి జంతువులకన్నా పూర్వకాలం నాటి జంతువులు పెద్దవిగానూ, దృఢంగానూ, తెలివిగలవిగానూ ఉండేవని చెరూకీ జాతివాళ్ళు విశ్వసించేవారు. అవి మనుషులతో కలిసిమెలిసి తిరుగుతూ సరిసమానంగా ఉండేవని కూడా వాళ్ళు నమ్మేవారు.

ఆ కాలంనాటి ఒక ఏదుపందికి ఒకనాడు విపరీతంగా ఆకలి వేసింది. ఎవరైనా తన బొరియలోకి ఇంత తిండి పడేస్తే ఎంత బావుణ్ణు! అన్న ఆశతో ఆలోచించసాగింది. కొంతసేపటికి దానికి కొన్నాళ్ళ క్రితం మనుషులుంటున్న ఇంటివైపుగా తాను పరిగెత్తుతున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటూండగా తన చెవిని పడ్డ, ‘కోరికలే గుర్రాలయితే, మూర్ఖులే వాటి మీద స్వారీ చేస్తారు’ అనే సూక్తి గుర్తుకు వచ్చింది. అది చటుక్కున లేచింది.

తన మూర్ఖత్వం కాకపోతే, ఎవరు పనికట్టుకుని తన బొరియలోకి ఆహారం తెచ్చిపెడతారు? తనే వెళ్ళి సంపాయించడం తప్ప మరో మార్గంలేదనుకున్నది. తను వెలుపలికి వెళ్ళక తప్పదు. అంటే సురక్షతమైన తన బొరియను వదిలిపెట్టాలి. వెలుపల తనను వేటాడే జంతువుల కంటబడకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే అవి, తనను పట్టి తినేయగలవు. మరుక్షణమే తనలోని భయాన్ని తలుచుకుని నవ్వుకున్నది. తను ఎన్నిసార్లు చావు నుంచి తప్పించుకోలేదు? అపాయం నుంచి తప్పించుకోవడానికి తనకు ఎన్నెన్ని ఉపాయాలు తెలుసు!

ఈ కథ కావాలంటే కింది లింకును చూడండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&&stId=1402

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపగలరు.

RTS Perm Link

చందమామ శంకర్‌ గారి జీవిత వివరాలు…

September 25th, 2009
శంకర్ గారు

శంకర్ గారు

చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారు 1946 నుంచి చిత్రలేఖన పనిని వృత్తిగా ఎంచుకున్నారు. అప్పటినుంచి చిత్రాలు గీయడమే తప్ప మరొక వ్యాపకం పెట్టుకున్న చరిత్ర లేదు. నిజంగా చెప్పాలంటే బొమ్మలు గీయడం. పరమ భక్తిప్రపత్తులతో పనిలో దిగటం తప్ప మరొక పని ఈయనకు తెలియదు.

ఏమీ తెలియకపోవడం కూడా మంచిదయ్యిందేమో మరి. చందమామ చిత్రప్రపంచానికి, చిత్రలేఖన చరిత్రకు వన్నెలద్దిన గొప్ప హస్తనైపుణ్యం మన కాలం ప్రపంచానికి సజీవంగా ఇన్ని దశాబ్దాలుగా మిగలడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.

ప్రస్తుతం వయసు మీద పడిన కారణంగా (85 ఏళ్లు) వారంలో తొలి మూడు రోజులు మాత్రమే చందమామ కార్యాలయానికి వచ్చి పని చేస్తారు. గురు, శుక్ర వారాల్లో మాత్రం ఇంటివద్దే ఉంటూ చందమామ చిత్రాలు గీస్తారు.

రోడ్లమీద మలుపుల్లో, గతుకుల్లో ఊగుతూ వచ్చే క్యాబ్‌లో అందరితోపాటు కూర్చుని 85 ఏళ్ల వయసులో రోజూ ఆఫీసుకు రాలేనని చెబితే యాజమాన్యం ఈయనకు మినహాయింపు ఇచ్చి చివరి రెండు రోజులు ఇంటివద్దే పనిచేయడానికి వీలు కల్పించింది. మొదటి మూడు రోజులు ప్రింట్ చందమామ వర్క్ ప్లాన్‌ అమలుకోసం తప్పక రావలసి ఉంటుంది.

వయోభారం మీద పడుతూనే ఉన్నా సరే.. ‘జీవితం చివరి వరకూ  చందమామలోనే పనిచేయాల’నే సంకల్పబలం సాక్షిగా శంకర్ గారు చందమామ ఆఫీసుకు వస్తూనే ఉన్నారు. జీతం పట్ల, పదవి పట్ల, హోదా పట్ల కించిత్ ఆశలు, ఆకాంక్షలు కూడా లేని ఈ నిగర్వి… మా వంటి తదుపరి తరాలకు, ప్రస్తుతం చందమామలో పనిచేస్తున్న పిల్లలకు (20 నుంచి 25 ఏళ్ల వయసులోపు) ఓ అద్భుతమైన ‘శ్రామిక ఉదాహరణ’లాగే ఉంటారు.

పని సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచే ఈ మహనీయ మూర్తిమత్వం మాతో ఉంది. మేం ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. ఆయనతో మా ఉద్యోగ జీవితాన్ని, మాటలను, చూపులను, ప్రయాణాన్ని కూడా పంచుకుంటున్నాం అనే విషయం తల్చుకుంటేనే మాకు ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది.

శంకర్ గారి జీవిత వివరాల పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2253
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&sbCId=&stId=2253&pg=1

RTS Perm Link

ఆకాశంలోకి అమాంతంగా ఎగురగలిగినా…

September 25th, 2009
గోవిందుడి లంఘనం

గోవిందుడి లంఘనం

చందమామ కథలు దశాబ్దాలుగా పిల్లల ఊహా ప్రపంచంలో ఓ భాగమయ్యాయి. పిల్లల్లో సహజసిద్ధంగా ఉండే కాల్పనిక ప్రపంచపు ఊహలను ఆవి సంతృప్తి పర్చాయి. చందమామ కథలు నీతి నియమాలను సర్వ సాధారణ రీతిలో బోధిస్తాయి. ప్రతి చందమామ కథలోని సారాంశం పిల్లల్లోనే కాక పెద్దల్లో కూడా మంచి భావాలను పెంచి పోషిస్తూ వచ్చింది. చాలా వరకు ఇదంతా పనిగట్టుకుని బోధించినట్లుగా కాకుండా, సహజాతిసహజంగా, స్వచ్చందంగా జరుగుతూ వచ్చింది.

మన ప్రాచీన మేధో సంపదను కథ రూపంలో చందమామ మనముందుకు తీసుకువచ్చింది. పల్లె సీమల గురించిన మన అవగాహనను, జాతి మహత్తర సంస్కృతిని, నాగరికతను చందమామ కథలు మరింత ఉద్దీప్తం చేశాయి.

‘విద్యావంతుడు’ అనే శీర్షికతో వచ్చిన బేతాళకథ దీనికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఇది చందమామ మరో కథల మాంత్రికుడు వసుంధర గారు రాసిన కథ. 2003 సంవత్సరం చందమామ సంచికలో ఇది అచ్చయింది. అంతకు ముందే కూడా ఇది ముద్రణ పొందిందేమో తెలియదు.

రామాయణ కాలంనాటి వానరులకు మల్లే ఆకాశంలోకి అమాంతంగా ఎగురగలిగిన అమోఘ శక్తి మనిషికి సిద్ధించడం అనే ఊహే మనిషి మనస్సును పరవశింపజేస్తుంది. నా చిన్నప్పటి స్వప్న ప్రపంచంలో నేను కూడా కోతి కొమ్మచ్చి ఆట ఆడుతూ చెట్టు మీదనుంచి ఆటలో భాగంగా దుముకుతున్నప్పుడు కింద పడకుండా అలాగే పైకి ఎగిరి పోయేలాంటి కలలు చాలాసార్లే వచ్చాయి.
 
మనిషిలో అద్భుతశక్తులు నిజంగా ఉంటే కూడా అవి మనిషి ఇబ్బందులను తీర్చాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు, స్వార్ధాలకు, ధనసంపాదనకు ఉపయోగపడకూడదనే మానవీయ విలువను ఈ కథ అతి సరళంగా చాటి చెబుతోంది.

‘‘జీవితం కొత్త విద్యలు నేర్చుకునేందుకేనా! హాయిగా రోజులు వెళ్ళిపోవడానికి డబ్బు సంపాదించాలి. ఉన్నంతలో నలుగురికీ సాయపడాలి. జీవితమంతా కొత్త విద్యలు నేర్చుకుంటూ గడిపివేయడం, నాకిష్టముండదు,’’ అంటూ ఈ కథలో వాదించిన గోవిందుడు చివరకు రాజశేఖరుడి వంటి గొప్ప కీర్తిమంతుడే తన వద్దకు శిష్యరికం కోసం వచ్చినప్పుడు, మనసు పొరల్లో కరడు గట్టిన అహాన్ని చంపుకున్నాడు. మానవ జీవన పరమార్థాన్ని ఆకళింపు చేసుకుని వినయమనే ఉత్తుంగ శిఖరాలను చేరుకున్నాడు.

ఇది నీతి కథ కాదు. జాతి కథ. విశ్వ మానవాళి ఆచరించి తీరవలసిన కథ.

విద్యావంతుడు కథను తప్పకుండా కిందిలింకులో చదవండి..
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97&stId=2251

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపగలరు.

RTS Perm Link

ప్రతి ఇంట్లో చందమామ ఉన్న అందమైన కాలం

September 23rd, 2009

చిన్నప్పటి విషయాలు అందరికి అన్ని గుర్తుండవు. నా సంగతి అంతే అనుకోండి. కాని చందమామతో  అనుబంధం జీవితాంతం మనసులోనుండి పోదు పోలేదు అని నేను, నాలాంటి ఎందరో చంపిల అభిప్రాయం అని ఖచ్చితంగా చెప్పగలను. స్కూలులో చెప్పిన తెలుగు పాఠాలకంటే అమ్మ ఇంట్లో చదివించిన చందమామ వల్లే నాకు తెలుగు మీద ఆసక్తి, పట్టు కలిగింది అని గర్వంగా చెప్పుకుంటాను.

పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది. అమ్మలు, నాన్నలు తమకోసం, తమ పిల్లల కోసం చందమామ కొనేవారు. ప్రతి నెల క్లాసు ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే ఎక్కువగా (అంతకంటే ఎక్కువగా) చందమామ కోసం ఎదురుచూపులు. అది రాగానే నాకు, తమ్ముళ్ళకు మధ్య బల ప్రదర్శన. నాదే గెలుపనుకోండి.

అప్పుడప్పుడు ఆ పుస్తకం వాళ్ళ కంటపడకుండా మొత్తం చదివేసి  డ్రాయింగ్ రూం లో పెట్టేయడం. ఇక ఎవరేమన్నా చేసుకోండి నేను చదివేయడం ఐపోయింది అని ..కాని గంటలో పుస్తకం అవ్వగొట్టి నేలంతా ఎదురుచూడాలంటే మాత్రం విసుగేసేది. అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా………

జ్యోతి గారూ,
పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే మెరుపువాక్యంతో అదరగొట్టేశారు. వ్యక్తిగతంగా సమాచారం పంపకున్నా మీరు చందమామ జ్ఞాపకాలు స్వయంగా పంపారు. అందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు.. ఆన్‌లైన్ చందమామతో మీ చందమామ జ్ఞాపకాల బంధం ఇలాగే కొనసాగుతుందని.. కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాము.

“పిల్లలున్న ప్రతి ఇంట్లో చందమామ ఉండి తీరాల్సిందే అనే అందమైన కాలం అది.”

చందమామ స్వర్ణయుగ చరిత్రకు ఈ వాక్యం సాక్షీభూతంగా నిలుస్తోంది కదా..

“అమ్మ చదివే వారపత్రికలలాగా చందమామ కూడా వారానికోటి వేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది. డబ్బులిచ్చే కొంటాము కదా అని పదో క్లాసు వరకు తిట్టుకున్నాను కూడా.”

అమ్మా.. అమ్మమ్మా.. ఎంత పెద్ద ఆశండీ మీకు. ఇక్కడ నెలకు ఓ సంచిక తీసుకువస్తూంటేనే మా పని “అయిపోతోంది” అన్నిరకాలుగా.. ఇక వారానికోసారా…

“క్లాసు పుస్తకాలు బోర్ కొడితే పాత చందమామలు తీసి సింగిల్ పేజీ కథలు చదవడం అలవాటు.”
అన్ని కాలాలకు వర్తించే గొప్ప మాట..

“పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కోసం తెప్పించే చందమామలు ముందు నేనే చదివేదాన్ని.”
చందమామ బతుకుతోందంటే మీవంటి ఆరాధకుల వల్లే కాబోలు.

“పుస్తకం చేత పట్టుకుని కథలో లీనమై చదువుతుంటే ఉండే ఆనందం, తన్మయత్వం, ఆన్‌లైన్‌లో.. కంప్యూటర్‌లో చదివితే వస్తుందా? రాదు గాక రాదు గాక రాదు..”

చందమామను కొని భద్రపెట్టుకున్న వారికి పుస్తకం పట్టుకుని చదివే భాగ్యం ఉందనుకోండి. ఆ భాగ్యం లేనివారి మాటేమిటి? అందుకే.. ఇలాంటివారికోసమే… నాలాంటి వారికోసమే.. ఆన్‌లైన్ ఆర్కైవ్స్‌లో పాత చందమామల నిధి ఓ పెన్నిధిలాగా ఉపయోగపడుతోంది. అయితే రిఫరెన్స్ కోసం చందమామ కథలు వెతుక్కోవాలంటే పుస్తక రూపంలో ఉన్న సౌలభ్యం ఆన్‌లైన్‌లో ఉండదనుకోండి. చందమామ కథల మొత్తం కేటలాగ్‌ను (గత 62 సంవత్సరాల సంచికలవి) రూపొందించి పాఠకులకు అందుబాటులోకి తెస్తే బాగుంటుందేమో మరి.

జ్యోతిగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కిందిలింకులో చదవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2244

మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.

చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

మద్యపాన ఫలితం

September 23rd, 2009

బోధిసత్వుడి శిష్యుల్లో ఎన్నదగిన వాడు సాగతస్థవిరుడు. మంత్రశాస్త్రంలో ఆరితేరినవాడు, అసామాన్య ధైర్యశాలి. మహాభయంకరమైన విషసర్పానికి సైతం జంకక దానితో ఢీకొని కోరలు పీకి ప్రాణాలతో వదిలిన ధీశాలి.

అలాంటి వాడు జీవితంలో చేసిన ఒకే ఒక పొరపాటుకు బురదపామును సైతం ఏమీ చేయలేని దుస్థితికి దిగజారిపోయాడు.

ఆ పొరపాటు ఏమిటి? ఏమా కథ అని తెలుసుకోవాలనిపిస్తే… దయచేసి కింది లింకును తెరవండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=93&stId=2237

ఈ కథపై మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

RTS Perm Link

చందమామ అంటే అమ్మ చేతి గోరుముద్ద…!

September 22nd, 2009
సంకీర్తన - చందమామలు

సంకీర్తన - చందమామలు

చందమామంటే నాకు అమ్మ చేతి గోరుముద్ద,
నాన్న గారాబం,
చెల్లెలితో పేచీ,
అన్నయ్యతో లాలూచీ! 

చందమామలేకుండా బాల్యముంటుందంటే కొద్ది రోజుల క్రితం వరకూ ఆశ్చర్యమే!

ప్రతినెలా మొదటివారంలో పేపర్ బాయ్ తెచ్చే చందమామ కోసం వరండాలో పడిగాపులు కాస్తుంటే ఎదురుచూపులంటే ఎలా వుండేవో తెలిసేది. చందమామను అందుకోడానికి అన్నయ్య, నేను, చెల్లితో పాటు ఇంకొకరు పొటీ పడేవారు. అది మా నాన్నగారు. ఒక్కోసారి మమ్మల్ని అధికార దుర్వినియోగంతో మొట్టికాయలేసి తనే  దక్కించుకుని జానపద సీరియల్ చదివి అప్పుడు కానీ మాకిచ్చేవారు కాదు.

కానీ ముందుగా పుస్తకం అందుకుని మృదువైన కవర్ పేజీని తడుముతూ, కొత్త పుస్తకం సువాసనను ఆఘ్రాణిస్తూ, ఎవరికీ ఇవ్వకుండా చదువుకోవడంలో ఉన్న మజా ఇంకెవరో చదివేసి మన చేతికొచ్చాక ఏముంటుంది? చందమామను మొదటగా చేజిక్కించుకునేందుకు ఎంతెంత యుద్ధాలు జరిగేవో తల్చుకుంటే  ఆశ్చర్యంగా ఉంటుంది.

ఈ పోటీ ఎంతవరకూ వెళ్ళిందంటే నాన్నగారు మాతో పడలేక చందమామను ఆఫీసుకు తెప్పించుకుని అక్కడే చదివేసి సాయంత్రం వస్తూ ఇంటికి తెచ్చేంత వరకూ!

నాకు బాగా గుర్తున్నవి, మొదట్లోనే ఉండే పంచతంత్ర కథలు “కాకోలుకీయం”(ఈ మాటకు ఈ మధ్య వరకూ అర్థం తెలీదంటే నమ్మండి) మాచిరాజు కామేశ్వర రావు గారి పిశాచాలు, దెయ్యాల కథలు, నా అభిమాన సీరియల్ వీర హనుమాన్, చివర్లో సింగిల్ పేజీ కథ ఒకటి ఇచ్చి దానికి పేరు పెట్టమనే చిన్న పోటీ!

ఆఖరుపేజీలో ఫొటోలకు వ్యాఖ్యలు రాయడం, అలాగే సింగిల్ పేజీలో ఇచ్చే కథలకు ప్రతినెలా పేర్లు పెట్టడమే కానీ  పంపిన పాపాన ఒక్కసారీపోలేదు. డబ్బు, నగల మూటల్తో అవసరానికి ఆదుకునే పిశాచాలు ఒక్కటి కూడా నిజంగా తారసపడకపోవడం అప్పట్లో ఒక తీరని కోరికగా ఉండేది.

చందమామ చదవడం వల్ల కలిగే మానసికానందం ఒక ఎత్తయితే చందమామ వల్ల కలిగిన మహోపకారం భాష మీద ప్రేమ! సాహిత్యాభిలాషకు బాటలు వేసే సరళమైన భాష మీద ఎవరికైనా ప్రేమ కలిగి తీరుతుంది.

 పిల్లల పత్రికలు ఎన్నో ఉన్నా, తల్లిదండ్రుల మొదటి ఎంపికగా చందమామ నిలబడిందంటే అందుకు కారణం భాషే! అందుకే ఇంతకు ముందెవరో తమ జ్ఞాపకాల్లో చెప్పినట్లు చందమామకు బాల్యంలో దూరమైన వారు సాహిత్యానికి దూరమయ్యారంటే నాకు ఆశ్చర్యం కలగదు.

సుజాతగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2236

సుజాతగారు నిర్వహిస్తున్న చక్కటి బ్లాగుకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
www.manishi-manasulomaata.blogspot.com

సుజాత గారూ, మనఃపూర్వక కృతజ్ఞతలు..
గత నాలుగు రోజులుగా వ్యక్తిగత, అధికారిక పనిమీద తిరుపతికి వెళ్లవలసివచ్చింది. తిరిగి ఆఫీసుకు వచ్చి సిస్టమ్ తెరువగానే.. అవుట్‌లుక్‌లో మీ చందమామ జ్ఞాపకాలు. కొంచెం ఆలస్యమయినా అపరూపమైన చందమామ జ్ఞాపకాలు పంపారు.

చందమామంటే నాకు అమ్మ చేతి గోరుముద్ద…!

చందమామ వల్ల కలిగిన మహోపకారం భాష మీద ప్రేమ!

పిల్లల పత్రికలు ఎన్నో ఉన్నా, తల్లిదండ్రుల మొదటి ఎంపికగా చందమామ నిలబడిందంటే అందుకు కారణం భాషే!

రాకుమార్తెలను అందంగా ఊహించుకోవడం చందమామతోనే మొదలు!

ఇద్దరికీ మధ్య గల తేడాని కథలో కాక కేవలం బొమ్మల్లోనే చూపించగల అనితర సాధ్యులు చందమామ చిత్రకారులు.

మా ఇంట్లోనే కాదు, నా తోడబుట్టిన వాళ్ళంతా కూడా వదులుకోకుండా పాటిస్తున్న సత్సంప్రదాయం పిల్లలకు చందమామ చదవడం అలవాటు చేయడం!

సాహిత్యం పట్ల ఆసక్తి చందమామ తోనే ఆరంభమవుతుందని మా అందరి నమ్మిక కూడా!

ఇన్ని మెరుపు వాక్యాలను మీ చందమామ జ్ఞాపకాల్లో చొప్పించాక వేరే వ్యాఖ్యానం అవసరం లేదనుకుంటాను..

ఒకే ఒక చిన్నమాట. మీ పాపాయి సంకీర్తనది ధన్య జీవితం. ఆడపిల్లల ప్రపంచం ఆసిడ్ దాడులతో స్వంత ఇంట్లో కూడా రక్షణ కోల్పోయి గజ గజ వణుకుతున్న పాడుకాలంలో ఆమె చందమామతో తన బాల్యాన్ని పండించుకుంటోంది. ఆమెను కొన్నాళ్లు అలాగే పెరగనివ్వండి.

తిరుపతిలో మాకు తెలిసిన ఓ అమ్మను (ఇటీవలే భర్తపోయారు) నిన్న కలిసినప్పుడు తన జీవితంలోని తొలి 15 ఏళ్ల బాల్యం తనకు తిరిగి దొరికితే ఎంత బాగుండు అని బాధపడిపోయారు. ఆమె బాల్య జ్ఞాపకాల్లో ‘చందమామ’ కూడా ఉంది.

మీరు ప్రస్తావించిన కింది వ్యాఖ్య నాదే కదూ. సిహెచ్ వేణుగారి చందమామ జ్ఞాపకాలకు నా బ్లాగులో పరిచయ వ్యాసంలో ఇది ఉంది.

“ఇంతకు ముందెవరో తమ జ్ఞాపకాల్లో చెప్పినట్లు చందమామకు బాల్యంలో దూరమైన వారు సాహిత్యానికి దూరమయ్యారంటే నాకు ఆశ్చర్యం కలగదు.”

నా వ్యాఖ్య పూర్తి  పాఠం ఇదిగో ఇక్కడ…

“…ఈరోజు కూడా మనం ఒక పరీక్ష పెట్టుకోవచ్చు. ఎవరైతే బాల్యంలో కథలు వినడానికి, కథలు చదవడానికి దూరమైపోయారో వారు సాహిత్యానికి కూడా దూరమైపోయి ఉంటారు. వారి కుటుంబంలో సాహిత్య వాతావరణం కూడా దూరంగానే ఉంటుంది.

బాల్యంలో ఎలాంటి సాహిత్య పరిచయం లేనివారు మధ్యలో సాహిత్య వాతావరణంలోకి రావడం కూడా అరుదుగానే జరుగుతుందనుకుంటాను.

అయితే సమాజంలో లక్షలాది మంది ఇప్పటికీ సాహిత్యానికి, పుస్తక పఠనానికి దూరంగా ఉంటూ ఉండడానికి సామాజిక, ఆర్థిక, బౌద్ధిక కారణాలు ఎన్నో ఉన్నాయనుకోండి….”

సుజాత గారూ, ధన్యవాదాలు.. మీకు, సంకీర్తనకు, మీ కుటుంబానికి కూడా.. పిల్లలకు చందమామ చదవడం అలవాటు చేస్తున్నందుకు… వేవేల కృతజ్ఞతలు…

మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.
చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

చందమామీకరణ

September 16th, 2009

తెలుగుభాషకు ఓ కొత్త పదం దొరికిందా అనిపిస్తోంది. అంతర్జాతీయీకరణ, పరాయీకరణ, సాంస్కృతికీకరణ, సైనికీకరణ, వర్గీకరణ వంటి పదాలను మనం గతంలోనే చదువుకున్నాం. కానీ ఇప్పుడు వీటి సరసన మరోకొత్త పదం చేరిందా…! అవుననే అనిపిస్తోంది. అదే.. “చందమామీకరణ.” ఇంగ్లీషులో దీనినే “Chandamamization” అని అంటారేమో.

నేపథ్యంలోకి పోయి చూస్తే… కథారచయితలు పంపుతున్న కథలను చందమామకు అనుగుణంగా కాస్త మెరుగులు దిద్ది, మూలకథకు కొన్ని మార్పులు చేసి చందమామలో ప్రచురిస్తూ వస్తున్న సంప్రదాయానికే “చందమామీకరణ” అని పేరు వచ్చినట్లుంది. దీన్ని గతంలోనే రోహిణీ ప్రసాద్ గారు తన “చందమామ జ్ఞాపకాలు” వ్యాసంలోనూ, వికీపీడీయాలో చందమామ అభిమానులు రాసిన “చందమామ” ప్రధాన వ్యాసంలోనూ ప్రస్తావించినట్లుంది.

మూలకథకు మెరుగులు దిద్దినా, మార్పు చేసినా, ఆ కథారచయితలకు నగదు విషయంలో ఖచ్చితంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు చెల్లించే విషయంలో చందమామ ఎన్నడూ వెనుకడుగు వేయకపోవడం వల్ల తమ కథల్లోని మార్పులను సంబంధిత రచయితలు పెద్దగా పట్టించుకునేవారు కారని చందమామపై ఈ రకమైన వ్యాసాలు తెలుపుతూ వచ్చాయి.

మానవ ప్రయత్నానికి అంతిమంగా  విజయం దక్కేలా కథను తీసుకురావడం అనే మహత్వ సంప్రదాయాన్ని చందమామ మొదటినుంచి పాటిస్తున్నందువల్ల చందమామ కథలు దాదాపుగా ఈ కోణంలోంచే మార్పులకు గురవుతూ వస్తున్నాయి. దయ్యాలు, భూతాల ఇతివృత్తంతో నడిచే కథల్లో కూడా ఆ దయ్యాలే, భూతాలే మంచివాళ్లకు సహాయం చేసేలా ముగిసే కథలు చందమామలో తప్ప ఇంకెక్కడ ఉంటాయి.

పిశాచాలు, దెయ్యాలు చందమామ కథల్లో ఎక్కువగా ఉంటున్నాయని మొదటినుంచి చందమామపై విమర్శలు కూడా వస్తున్నప్పటికీ చందమామ సంపాదకుల అభిప్రాయం మరొక రకంగా ఉంటూవచ్చింది. దెయ్యాల కథల్లో కూడా చెడుకు విజయం లభించినట్లు ఏ కథా ముగియలేదు. పిశాచాలు కూడా మంచిమనుషులకు సహాయం చేస్తాయి.

చందమామ కథలకు వరవడి దిద్దిన కొడవటిగంటి కుటుంబరావు గారిపైనే దయ్యాలు, భూతాల కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారని గతంలో చాలా విమర్శలు వచ్చాయట. ఈ విమర్శలన్నింటినీ కొకు గారు ఒకే వాదనతో కొట్టిపడేశేవారట. మనం ఎన్ని దయ్యాలు, భూతాల కథలు వినిపించి భయపెట్టినా 15 ఏళ్లు దాటిన ఏ పిల్లలూ దయ్యాలు, భూతాలను నమ్మరని ఆయన వాదించేవారట.
 
కథల్లో పిశాచాల కేరెక్టర్లు ఉండాలి. కాని అవి మంచికి తోడ్పడాలి. అలాగే కథ ముగియాలి. అనే ఓ గొప్ప ధర్మసూత్రాన్ని కొకుగారి హయాంనుంచి కూడా చందమామ పాటిస్తూనే వస్తోంది. దీన్నే చందమామీకరణ అంటారేమో మరి. అంతిమంగా గెలవాల్సినవి మానవ ప్రయత్నమూ, సద్బుద్దీ మాత్రమేనని కొకు పదే పదే చెప్పేవారట.

అందుకే సాంప్రదాయక రీతిలో కథలు రాసి పంపినా వాటిలో బలమున్నప్పుడు స్వీకరిస్తూ చివరలో మూలకథకు కొంచెం ట్విస్ట్ ఇవ్వడం ద్వారా మనిషి ప్రయత్నానికి విలువ ఇవ్వడాన్నే చందమామ కథలు అప్పుడూ ఇప్పుడూ కూడా పాటిస్తున్నాయి. ఇదే “చందమామీకరణ.”

సరిగ్గా దాన్ని నిరూపిస్తోందా అనే విధంగా ఈ సెప్టెంబర్ చందమామ సంచికలో ‘తీరిన సందేహం’ అనే కథను సంపాదకులు మార్చినట్లుంది. ఆ మార్పుల పట్ల సంబంధిత రచయిత ఏ మాత్రం నొచ్చుకోకుండా తన స్వంత కథకు జరిగిన “చందమామీకరణ”ను మెచ్చుకుంటూ, తన కథను ఎన్నుకుని మార్పులు చేసి మరీ ప్రచురించినందుకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చందమామ ఆఫీసుకు ఉత్తరం రాశారు.

తన కథను ప్రచురించడం ద్వారా చందమామ ఇచ్చిన ప్రోత్సాహం, అభిమానం పట్ల రచయిత కృతజ్ఞత తెలుపుకుంటూనే ప్రపంచస్థాయి పత్రికలో ఈ కొంచెం స్థానం తనకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ రచయిత ఉత్తరం ముగించారు.

చందమామ ద్వారా తెలుగు భాషకు అందిన “చందమామీకరణ” వెనుక రచయితల సంపూర్ణ అంగీకారం ఉందనిపిస్తుంది. లేకుంటే చందమామకు, కథారచయితలకు మధ్య ఇంతటి అవినాభావ సంబంధం ఏర్పడి ఉండేది కాదనిపిస్తుంది. గత 60 సంవత్సరాలుగా చందమామలో ‘చందమామీకరణ’ నిరంతరాయంగా సాగిపోతూండటానికి ఈ అవినాభావ సంబంధమే ప్రధాన కారణం.

చందమామలో తమ కథలు అచ్చుకాకపోవడం, ప్రచురణకు స్వీకరించకపోవడం వల్ల ప్రముఖ రచయితలు కూడా నొచ్చుకుని ఉండవచ్చు, మనసు బాధపడి ఉండవచ్చు కానీ, తమ కథలకు చందమామ దిద్దిన మెరుగులను ఇంతవరకు ఏ కథా రచయిత కూడా అడ్డు చెప్పిన చరిత్ర ఉన్నట్లు లేదు.

ఇది చందమామ గొప్పతనం. అంతకు మించి చందమామ కథకుల సహృదయత గొప్పదనం. అందుకే “చందమామీకరణ”కు జై..

చందమామ పాతకథలు చదవాలంటే కింది లింకును క్లిక్ చేయండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

మీ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు దయచేసి పంపండి.

abhiprayam@chandamama.com

RTS Perm Link

చందమామతో భాషలు నేర్చుకున్న వారు…

September 15th, 2009

ఆంధ్రరాష్ట్రంలో ఓ వ్యక్తి. పసితనంలో చందమామ చదివే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. బాల్యంలో భాషలను నేర్చుకుంటున్న క్రమంలో అన్ని భాషల్లోని చందమామలను తెప్పించుకున్నాడు. తదుపరి జీవితంలో ఓ పది పన్నెండు భారతీయ భాషల్లో ప్రావీణ్యం సాధించడానికి, చిన్నతనంలో అన్ని భాషల చందమామల అధ్యయన అనుభవం అతడికి చక్కగా ఉపయోగపడింది.

అతడు పీవీ నరసింహారావు కాదు. ఈయన కూడా 14 దేశవిదేశీ భాషలను నేర్చుకున్నట్లు వినికిడి. ఈయన హిందీలోకి అనువదించిన వేయిపడగలు నవల -విశ్వనాథ సత్యనారాయణ రచన- బాగా ప్రాచుర్యం పొందింది కూడా. అయితే పైన మనం చెప్పుకుంటున్న వ్యక్తి  పీవీ కాదు.

చందమామ ప్రేరణతో వివిధ భాషలను నేర్చుకున్న ఆయన డాక్టర్ నలిమెల భాస్కర్. ప్రస్తుతం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్య అకాడెమీకోసం తమిళం లోంచి, మలయాళీ భాషలోంచి పుస్తకాలు అనువదించి ప్రచురించారు. కథలూ, కవితలూ, నవలలూ, వ్యాసాలు ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనువదిస్తున్నారు.

1985 నుంచి 2000 వరకు తెలుగులోని విభిన్నవాదాల ప్రాతినిధ్య కవితల్ని ‘తెలుంగు తోట్టత్తిల్ తమిళ్ కుయిల్‌గళ్’ పేరున పుస్తకం తీసుకువచ్చారీయన. అంటే ‘తెలుగు తోటలో తమిళ కోయిలలు’ అని అర్థం. ఈ మధ్యనే సాహిత్య అకాడమీకి ఓ నవలను మలయాళం నుంచి తెలుగు చేశారట.

ప్రస్తుతం చందమామకు ఈయనకు పరిచయమే అనధికారికంగా, గమ్మత్తుగా జరిగింది. ఈ మధ్య ఈయన ఎన్ గోపీగారి నానీలను తమిళీకరించి అనువాదం సరిగా ఉందో లేదో నిర్దారించుకునేందుకోసం తనకు తెలిసిన మార్గంలో చందమామ ప్రింట్ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారి జాడను పట్టుకుని ఆయనకు ఓ ప్రతిని పంపించారు. తమిళ భాషతో ముప్పై ఏళ్లకు పైగా పరిచయం ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారు కొంత సమయం తీసుకుని తమిళ నానీలను సరిదిద్ది టైప్ చేయించి హార్డ్ కాపీనీ, సీడీనీ కలిపి పంపించారు.

తర్వాత భాస్కర్ గారు సుబ్రహ్మణ్యంగారికి కృతజ్ఞతలు తెలుపుతూ 14-07-09న కరీంనగర్ నుంచి ఓ ఆత్మీయ లేఖ పంపారు. భారతీయ భాషలన్నింటినీ తాను ఉద్దేశ్యపూర్వకంగా నేర్చుకున్నందున, మాతృభాషేతర భాషలోకి, అది కూడా కవిత్వాన్ని అనువదించడం కష్టసాధ్యమని తనకు తెలుసునని ఈ లేఖలో పేర్కొన్నారు.

సుబ్రహ్మణ్యం గారు ఈ తమిళ అనువాదాన్ని సరిచేసిన తర్వాత అనువాదం శరీరానికి ఆత్మసౌందర్యంలా అమరిందని చెబుతూ ఆయనకు భాస్కర్ గారు ఈ లేఖలో కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంతవరకూ ఇది వ్యక్తిగత వ్యవహారమే. కాని తర్వాత పేరాలో తాను ఏవిధంగా భాషలు నేర్చుకున్నదీ చెబుతూ చరిత్రను తడిమారాయన. చందమామలో అసోసియేట్ ఎడిటర్‌గా ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారే తన తమిళ అనువాదాన్ని సరిచూశారని తెలుసుకున్నాక ఆయన ఉప్పొంగిపోయారు.

దీంతో చందమామతో తన అనుబంధాన్ని పంచుకోవడం ద్వారా చందమామ అబిమానులకు ఓ గొప్ప విషయాన్ని ఆయన తెలియజేశారు.

అదేంటో ఆయన మాటల్లోనే విందామా…!

“…… ఎంత గొప్ప సేవ! ఎంత గొప్ప సంస్థ!! నా భాషాధ్యయనానికి చందమామ చేసిన ఉపకారం మరువలేనిది. తొలినాళ్లలో అంటే భాషల్ని నేర్చుకుంటున్న ప్రారంభంలో అన్ని భాషల్లోని చందమామల్ని తెప్పించుకునేవాణ్ణి. తెలుగు చందమామ కథల్లోంచి కొన్ని ఇతర భాషల్లో కొంచెం అటూఇటూ వేరే నెలల్లో వచ్చేవి. అట్లా అవి చాలా ఉపయోగపడ్డాయి. ఏది ఏమైనా చందమామ వెన్నెలనే ప్రత్యేకం కదా…..”

చివరగా, విలువైన సమయాన్ని హెచ్చించి తన అనువాదానికి వన్నె తీసుకొచ్చారంటూ సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు చెబుతూ ఈ ఉత్తరాన్ని ముగించారు.

మొదట్లో సుబ్రహ్మణ్యంగారు వారం రోజుల క్రితం భాస్కర్ గారు తనకు రాసిన ఉత్తరం చూపించినప్పుడు ఓ సారి చదివేసి ఇచ్చేశాను. క్యాబ్‌లో చందమామ ఆఫీసు నుంచి ఇంటికి పోతూండగా జరిగిందిది.

మాతృభాషల మూలంతో సంబంధం లేకుండా ఉత్సాహం, ఆసక్తి కొద్దీ ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ మాతృభాషలోంచి ఇతర భాషల్లోకి అనువాదాలు చేయడం చాలాకష్టమని, రెండు లేదా మూడు భాషల్లో ప్రావీణ్యం సాధించి అనువాదం చేయడం సాధ్యమేమో కానీ వరుసగా ఓ పది పన్నెండేసి భాషలను చిన్నతనంలో నేర్చుకున్నంత మాత్రాన ఆయా భాషలపై సంపూర్ణమైన పట్టు సాధించినట్లు కాదని, పీవీ నరసింహారావు గారి 14 భాషల అధ్యయనాన్ని కూడా ఈ కోణంలోనే చూడాలని.. ఇలా మాలో మేం చర్చించుకుంటూ పోతున్నాం.

ఇలా భాషలమీద, పత్రిక మీద చర్చలు జరుపుకుంటూ పోతున్న సమయంలో ఉన్నట్లుండి నాకు ఓ ఆలోచన తట్టింది. అదే ఇంత రాత్రివేళ ఈ విషయాన్ని పోస్ట్ చేయడానికి ప్రేరణను ఇచ్చింది. వివిధ భాషల్లో చందమామలు చదివి భాషలు నేర్చుకున్న భాస్కర్ గారి ఉదంతం సాధారణ విషయం కాదని దీన్ని చందమామ అభిమానులకు తెలియజేస్తే బాగుంటుందని తట్టింది.

వెంటనే సుబ్రహ్మణ్యంగారిని అడిగి ఆ ఉత్తరం తీసేసుకున్నాను. వారాంతపు సెలవు కాబట్టి తీరిక దొరికి దీన్ని సాపు చేసి పోస్టు చేస్తున్నాను. పలు భాషల చందమామలను చదివి ఆ అనుభవంతో బాల్యంలో భాషలను నేర్చుకున్న వైనాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలంటే భాస్కర్ గారినే నేరుగా సంప్రదించవచ్చు.

ఆయన చిరునామా..

డాక్టర్ నలిమెల భాస్కర్,
9-5-218/1,
ప్రగతి నగర్, రాంనగర్
కరీంనగర్ – 505001
మొబైల్ 94915 98988

RTS Perm Link

చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…

September 13th, 2009
శంకర్ గారి బేతాళ కథలు

శంకర్ గారి బేతాళ కథలు

 చందమామ చిత్రకారుడు శంకర్ గారి మాటల్లోనే చెప్పాలంటే ఆయన ఉద్యోగ జీవితం 1946లోనే మొదలైంది. 1952లో చందమామలో చేరారు. అంటే ఆయన మొత్తం ఉద్యోగ జీవిత కాలం ఇప్పటికి 64 ఏళ్లు. వయస్సు 85 ఏళ్లు. దేహం పండిపోయి, సహకరించని కాళ్లతో, భారంగా అడుగులేస్తూ కూడా, పనిచేయకపోతే పొద్దు పోదనే పాత తరం సంస్కృతికి నిలువెత్తు అద్దంలా నిలుస్తూ, చందమామతో నిండు జీవితం పండించుకున్న నిరుపమాన వ్యక్తి శంకర్ గారు.

నాగిరెడ్డి గారి పేరు చెబితే నిలువెల్లా కదిలిపోవడం శంకర్ గారి నైజం. కేవలం వారు తనకు అందించిన మంచి అవకాశం కారణంగానే చందమామతో తన జీవితాన్ని ముడివేసుకున్నానని చెబుతారాయన. ఇదే విషయంపై మాట్లాడుతూ ‘Till my last breath… I will be with Chandamama’ (చివరి శ్వాస వరకు చందమామతో ఉంటా..) అని ఉద్వేగంగా ప్రకటించారు.

చిత్రాగారు కుంచెతో, తాను చేతితో గీసే విధానం పట్ల అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయిన సందర్భంలో ‘చిత్రా, శంకర్‌లు చందమామలో జోడెద్దుల్లాంటి వారు. పని సజావుగా సాగేంతవరకు వారి ఇచ్ఛప్రకారమే పనిచేయవచ్చు’ అని నాగిరెడ్డిగారు గతంలో అన్న వ్యాఖ్యలను తలచుకునీ మరీ కదిలిపోయారు.

శంకర్ గారితో సంభాషణ

శంకర్ గారితో సంభాషణ

చివరిశ్వాస వరకు చందమామతోనే ఉంటా అని ప్రకటించుకోవడం శంకర్ గారి మూర్తిమత్వపు గొప్పే తప్ప మరొకటి కాదు. నేటి ఆధునిక చిత్రకారుల ఉద్యోగ జీవితాలతో పోలిస్తే ఆయన ఎవరూ ఊహించలేనంత తక్కువ వేతనం ప్రాతిపదికనే చందమామలో దశాబ్దాలుగా పనిచేశారు. దానికి ఆయన ఏ రోజూ బాధపడింది లేదు.

శంకర్ గారి పరిచయం రెండో భాగం పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును చూడండి

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2211

శంకర్ గారి పరిచయం తొలి భాగం పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును చూడండి.

 http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2203

 మీ స్పందనను abhiprayam@chandamama.com కు తప్పక పంపండి.

RTS Perm Link

చందమామ జ్ఞాపకాలు అమృతాలు

September 12th, 2009
పాత చందమామల కట్నం

పాత చందమామల కట్నం

” జ్ఞాపకం అంటే గతించినది. అంటే మృతం. కొన్ని జ్ఞాపకాలు మాత్రం అమృతాలు. చందమామ జ్ఞాపకాలు. అచ్చంగా అలాంటివే. నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ మొట్టమొదటి సారి చందమామ కొని తెచ్చింది, నాకూ మా అన్నకూనూ. వీధిబడి కాబట్టి తెలుగు మీడియంలోనే చదువు. అప్పటికి తెలుగు చదవడం, కొన్ని తెలుగు పద్యాలు నోటికి రావడం, ఇంతే తెలిసింది నాకు. ఆ చందమామ చదవగానే చాలా డవుట్లు వచ్చాయి……”

రవిగారూ,
మధ్యాహ్నమే 11-09-09 మీ చందమామ జ్ఞాపకాలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాము. మీకు చెప్పడం మర్చిపోయాను. మీ ఫోటోను సముద్రం డామినేట్ చేసేసింది. వేరేది లేకపోవడంతో ఇదే కొంచెం మార్చి ఆన్‌లైన్ చందమామలో పెట్టాము. చూడండి.
 
మీ చందమామ జ్ఞాపకాలులో మీకు దొరికిన అమూల్యమైన కట్నం గురించి రాసారు. బహుశా ఇంత గొప్ప కట్నం మరెవ్వరికీ దొరకదేమో కూడా. చందమామల కట్నం.. పాత చందమామల కట్నం. అదీ మీ శ్రీమతిగారు తీసుకురావడం.

ఎంత గొప్ప సంపద. ఇంకా వేరే కట్నం కావాలా మీకు?

ముందే చెప్పినట్లు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను రేపటినుంచి రెండు రోజులు కూర్చుని ‘చంపి’ల మెయిల్ ఐడీలు నావద్ద ఉన్నవి ఒకచోటకు చేరుస్తాను. కనీసం ఓ యాభై ఐడీలు అయినా ఉంటాయని అనుకుంటున్నాను. కొన్ని కూడగానే మీకు పంపిస్తాను. మనం పరస్పరం షేర్ చేసుకుందాం.
 
శివరామ్ ప్రసాద్ గారు ఇప్పటికే చందమామ ప్రియులు పేరిట యాహూలో ఓ చందమామ ప్రియుల బృందాన్ని రూపొందించారు. మీరు చేరారో లేదో తెలియదు. వీలైతే  శివరాం గారి బ్లాగ్ ఓ సారి చూడండి. మీకు తెలిసిన చందమామ అభిమానులకు కూడా ఈ విషయం తెలుపగలరు.

http://saahitya-abhimaani.blogspot.com/

ఇప్పటికి ఉంటాను.
రాజు.
—————
10-09-09 10.30 PM
రవిగారూ, వంద కృతజ్ఞతలు.
 
ఇంత త్వరగానా…. ఊహించలేదు.
 
అయితే నాకు ఇక్కడ పాత చందమామల ఇమేజీ, మీ జ్ఞాపకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వీలైతే మీ ఫోటో ఒకటి తప్పక పంపించండి. మీ ఫోటోతో సహా మీ జ్ఞాపకాలను ప్రచురించగలము. మీ చందమామ జ్ఞాపకాలను రేపే ప్రచురించగలం. తప్పక ఆ లింకుకే మీ ఫోటోను పంపగలరు.
 
ఒక్క మాటలో. చందమామ చదువుతున్నప్పుడు మీకు వచ్చిన సందేహాలు అప్పట్లో మాకూ వచ్చాయండీ. సరిగ్గా ఇవే సందేహాలు. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి చదువుతూంటే.. ‘వపా అంటే ఏమిటి,’ ‘ఇంకావుంది .. ఎక్కడ..’ ఆహా.. 35 ఏళ్లు వెనక్కి పోయినట్లుంది నాకు.

చింతచెట్లమీద దెయ్యాల గురించి చందమామలో కథల మాటేమిటో గానీ, మా చిన్నప్పుడు పొద్దు గూకి చీకటి పడిందంటే చాలు పల్లెటూళ్లలో ఇళ్లల్లోంచి బయటకు వచ్చే వాళ్లం కాదు. చివరకు పాస్ పోసుకోవాలంటే కూడా అమ్మను తోడుకోసం లేపాల్సిందే.

మరోసారి ధన్యవాదాలు.
 
మీ మెయిల్ ఐడీని నా వద్ద ఉన్న చంపిల ఐడీల జాబితాలో బద్రపరుస్తున్నా. తదుపరి కమ్యూనికేషన్‌కి ఇది చాలా అవసరం. మీకు తెలిసిన చంపిల మెయిల్ ఐడీలను  కూడా మీ వీలునుబట్టి సేకరించగలరు. మనందరివీ కలుపుకుంటే చాలా మంచే జరుగుతుంది.
————-
10-09-09

చందమామ జ్ఞాపకాలు రాసి పంపమని రవిగారిని కోరినప్పుడు ఆయన స్పందన, నా ప్రతిస్పందన కింద చూడగలరు.

చందమామతో..అబ్బో, ఎన్ని అనుభవాలో.. అసలు నేను చదువు నేర్చుకున్నదే చందమామతోనండి. వేణు గారి అనుభవాలు చదివినప్పుడే, రాయాలనిపించింది. తప్పక రాస్తాను.

మా అమ్మ గారిప్పుడు లేరండి. అందమైన రాత్రి ఆకాశంలో ఓ అందమైన చుక్కను చూస్తే, అమ్మ, తోకచుక్కా రెండూ గుర్తుకు వస్తాయి!

నా దగ్గరా చాలా పాత చందమామలున్నాయండి. (బవుండు వేసి కొన్ని, విడి ప్రతులుగా కొన్ని) వర్షం తర్వాత మట్టి వాసనా, ఈ పుస్తకాల సగంధం తల్చుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది.
——
ఓ.. క్షమించండి. మాకూ అమ్మ లేదిప్పుడు.
 
‘అందమైన రాత్రి ఆకాశంలో ఓ అందమైన చుక్కను చూస్తే, అమ్మ, తోకచుక్కా రెండూ గుర్తుకు వస్తాయి!’

కళ్లు చెమ్మగిల్లుతున్నాయి మీ వ్యాఖ్య చదువుతుంటే.
 
పాత చందమామల సుగంధ పరిమళాలను చవిచూసే భాగ్యవంతులలో మీరూ ఒకరు. జీవిత పయనంలో సేకరించిన అమూల్య సాహిత్యాన్ని పొగొట్టుకుంటూ వచ్చిన అభాగ్యుల జాబితాలో నా పేరు ఉంది. ఏం చేస్తాం.
 
అందుకే మీరంతా పాత చందమామల గురించి చెబుతున్నప్పుడల్లా గుండె కనలి కనలి, చేసేదేమీ లేక ఈరోజే ఈనెల అన్ని భాషల్లోని చందమామలను (12) ఓ సెట్ ఆఫీసులో కొనుక్కుని తీసుకుని వచ్చాను. కనీసం ఈ రకంగా అయినా తృప్తి పడవచ్చు కదా. నా వద్దా 12 బాషల్లో చందమామలు ఉన్నాయి అనుకుంటా. ఈ సెట్‌ను మంచి జ్ఞాపకం లాగే భద్రపర్చుకుంటాను.
 
ఇలా అంటున్నానే కాని మళ్లీ ఎవరు ఇంటికొచ్చి అడుక్కుని వీటిని కూడా తీసుకుపోతారేమో అని భయంగా ఉందనుకోండి. మొహమాటం ముందు పుట్టి తర్వాత మనం పుట్టాం మరి. ఏం చేస్తాం మరి.
 
చందమామ జ్ఞాపకాలు పంపుతానని చెప్పారు. పంపకముందే కృతజ్ఞతలు..

మీ
రాజు.

రవి గారి ‘చందమామ జ్ఞాపకాలు’ చూడాలంటే కింది లింకును తెరవండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2209

RTS Perm Link

చందమామ చిత్ర మాంత్రికుడు : శంకర్

September 10th, 2009
శంకర్ గారు

శంకర్ గారు

ఆయన గురించి గత 63 సంవత్సరాలుగా బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు. ఇన్ని దశాబ్దాలుగా ఆయన తనకు తెలిసిన ఒకే ఒక పనిని చేసుకుంటూ పోయారంతే. బొమ్మలు గీయడం తప్ప అంతకు మంచి ఇంకే ‘ఘనమైన’ పనీ ఆయన చేయలేదు. రాదు కూడా. ప్రపంచ రికార్డుల మీద ఆయనకు ఎలాంటి ఆసక్తి కూడా లేదు. ‘చందమామ’లో బేతాళ కథలకు, తదితర కథలకు బొమ్మలు గీస్తారు అనే విషయం తప్ప ఆయన గురించి మరే విశేషాలు ఈ ప్రపంచానికి తెలీవు.

ఆయన… శంకర్ గారు… చందమామ ఆస్థాన చిత్రకార త్రిమూర్తులు లేదా చతుష్టయంలో ఒకరు… గత 57 ఏళ్లుగా చందమామ కోసం తన యావజ్జీవితమూ అర్పించిన, అర్పిస్తున్న మహనీయులు. కుంచె వాడకుండా చేతితో చిత్రాలు గీస్తూ చందమామ చిత్ర ప్రపంచాన్ని అయిదున్నర దశాబ్దాలకు పైగా ఉద్దీప్తం చేసిన, చేస్తున్న రుషితుల్యులు.

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు  తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు,‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, ఇంత అర్ధరాత్రివేళ నువ్వు పడుతున్న శ్రమ అంతా ఎలాంటి కార్యం సాధించేందుకో తెలియడం లేదు. విక్రమ సేనుడనే రాజుకు, పరస్పర విరుద్ధమూ, ఎక్కడా పొంతనలేని హాస్యాస్పదమైన సలహానిచ్చిన, ఆయన గురువు గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:

ఈ కథా పరిచయం వినగానే కథా సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం ఉన్న ఎవరైనా సరే ఇట్టే చెప్పేస్తారు ఇది బేతాళ కథ అంటూ. బేతాళుడు ఆవహించిన శవాన్ని భుజాన వేసుకుని, ఒక చేత్తో కత్తి దూసి చురుకైన కళ్ళతో చుట్టూ చూస్తూ ముందుకు అడుగేస్తున్న విక్రమార్కుడి బొమ్మను చూడగానే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు అది చందమామలోని బేతాళ కథకు శంకర్ గారు వేసిన బొమ్మ అని.

చందమామలో పౌరాణిక ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం ధారావాహికలకు లోపలి పుటల్లో చిత్రాలు గీసినవారిలో శంకర్ గారు అగ్రగణ్యులు. అలాగే జాతక కథలు, విష్ణుపురాణం వంటి ధారావాహికలు, కథలకు కూడా ఈయనే చిత్రాలు వేశారు.

అన్నిటికంటే మించి తెలుగు సాహిత్యంలో, ఇంకా చెప్పవలసి వస్తే భారతీయ కధాసాహిత్యంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సుదీర్ఘ ధారావాహిక బేతాళ కథలకు చిత్రాలు గీసిన వారు శంకర్ గారు. బేతాళ కథలకు ముఖచిత్రం మాత్రమే కాకుండా ఇంతవరకు 300 పైగా బేతాళ కథలకు లోపలి చిత్రాలు -ఇన్‌సైడ్ చిత్రాలు- గీసింది శంకర్ గారే.

ఒకనెలలో చందమామలో 20 స్టోరీలు – కథలు, ధారావాహికలు, కథనాలు, ఇతర రచనలు- అచ్చవుతాయనుకుంటే వీటిలో 5 లేదా 6 స్టోరీలకు శంకర్ గారే చిత్రాలు గీస్తున్నారు. ఈ నాటికీ ఆయన ఇదే పని చేస్తున్నారు. చివరి శ్వాస ఉన్నంతవరకూ చందమామతో ఉండాలని, అందులోనే పనిచేయాలని ఒకే ఒక చిన్న కోరిక తప్ప మరే ఇతర ఆకాంక్షలూ ఆయనకు లేవు.

ఆరు నెలలు పనిచేస్తే చాలు.. వెంటనే మరో చోట అవకాశాలు వచ్చి ఆఫీసులను వదలి వెళుతున్న తరహా సమాజంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. అలాంటిది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదున్నర దశాబ్దాల పైగా అవిరామంగా ఒకే పత్రికలో ఒక వ్యక్తి పనిచేయగలగడం… చరిత్రలో అరుదైన విషయమే. ఇలాంటి అరుదైన ఘటనలు చందమామలోనే జరగడం మరీ విశేషం.

ఆయన శంకర్ గారు… చందమామ చిత్ర మాంత్రికుడు… జీవిత కాలం ప్రపంచానికి తెలియకుండా పోయిన మానవలోకపు మహనీయుడు.. ఆయన గురించి విందామా… 85 ఏళ్ల ఆ వృద్ద యువకుడిని చూద్దామా…

అయితే కింది లింకుపై క్లిక్ చేయండి…..

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2203

RTS Perm Link

చందమామ కథలు : పాతాళదుర్గం

September 10th, 2009
దాసరి సుబ్రహ్మణ్యం

దాసరి సుబ్రహ్మణ్యం

చందమామలో ప్రారంభం నుంచి మంచి మనుషులు, మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వస్తున్నప్పటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పన్నెండు ధారావాహికలు తెలుగు జాతికి, పిల్లలకు, పెద్దలకూ కథల రూపంలో అమృతాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు.

ప్రముఖ తెలుగు బ్లాగర్ వేణు గారు అన్నట్లుగా దాదాపు పాతికేళ్లపాటు “చందమామ పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు” దాసరి సుబ్రహ్మణ్యం గారు.

ఖడ్గవర్మ, జీవదత్తు, జయశీలుడు, సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ వంటి పాత్రలతో  రెండు, లేదా మూడు తరాల పిల్లలకు బాల్యపు హీరోలను అందించిన మేటి రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన ఈయన చందమామలో యాబై నాలుగేళ్ళు పాటు (2006వరకూ) పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు.

“కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన” తెలుగు కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.  జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారు భారతీయ కథకులలో అగ్రగణ్యులు.

ప్రపంచానికి హ్యారీ పాటర్లు, స్పైడర్ మేన్లు, తెలియని కాలంలోనే, ‘తోకచుక్క’తో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్య సృష్టి – చందమామ లోని ఈ ధారావాహికలు!

తోకచుక్క- 1954
మకర దేవత -1955
ముగ్గురు మాంత్రికులు-1957
కంచుకోట – 1958
జ్వాలాద్వీపం- 1960
రాకాసిలోయ- 1961
పాతాళదుర్గం – 1966
శిథిలాలయం- 1968
రాతిరథం- 1970
యక్ష పర్వతం- 1972
మాయా సరోవరం- 1976
భల్లూక మాంత్రికుడు- 1978

చందమామలో ఆయన రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24 సంవత్సరాలపాటు వరుసగా రాసినవి.

బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్‌వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం కూడా మళ్లీ చందమామను పెద్దలకు లాగే హత్తుకోవాలనే ఆకాంక్షతో ఆయన 1966లో రాసిన ‘పాతాళదుర్గం’ సీరియల్‌ను తిరిగి ఆన్‌లైన్ చందమామలో ప్రచురిస్తున్నాం.

అద్భుతమైన ఊహాశక్తి, నిసర్గ పద సౌందర్యంతో, కల్పనా చాతుర్యంతో సుబ్రహ్మణ్యంగారు 1950, 60, 70లలో చెక్కిన అపరూప కథాశిల్పాల్లో ‘పాతాళ దుర్గం’ ఒకటి. ఆయన 1972లో రాసిన ‘యక్షపర్వతం’ ధారావాహిక (13 భాగాలు) ను ఇప్పటికే telugu.chandamama.com లో ప్రచురించిన విషయం తెలిసిందే.

పాతాళదుర్గం ధారావాహిక కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138

చందమామ ధారావాహికల కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138

దాసరి సుబ్రహ్మణ్యం గారి విశేషాలు తెలుసుకోవాలంటే వేణుగారి బ్లాగ్ చూడండి.

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు
http://venuvu.blogspot.com/2009/07/blog-post_18.html

“చందమామ రచయితను కలిసిన వేళ….”
http://venuvu.blogspot.com/2009/04/blog-post_16.html

‘చందమామకి వెన్నెముక- సుబ్రహ్మణ్య సృష్టి’
http://koumudi.net/Monthly/2009/april/index.html

RTS Perm Link

అందమైన చందమామ బంధం

September 8th, 2009
మా చందమామ జ్ఞాపకాలు

మా చందమామ జ్ఞాపకాలు

సిహెచ్ వేణు గారికి
మనఃపూర్వక కృతజ్ఞతలు.

పని ఒత్తిడిలోనూ తీరిక చేసుకుని మీరు పంపిన చందమామ జ్ఞాపకాలు -‘అందమైన చందమామ బంధం’- అందింది (06-09-09). కోరగానే మీ అమూల్యమైన చందమామ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామకు పంపినందుకు కృతజ్ఞతలు.

“నేను పుట్టకముందు ప్రచురితమై నేను గతంలో ఎన్నడూ చూడని చందమామలనూ చదవగలిగానంటే ఇంటర్నెట్టే కారణం.”
 
మీరన్నది నిజం. ఎంత నాసిరకంగానే అయినప్పటికీ ఆన్‌లైన్‌లో చందమామ ఆర్కైవ్‌లు పెట్టకపోయి ఉంటే 50, 60 ఏళ్ల క్రితంనాటి అద్భుత కథలను ఇలా మనం చదివే వాళ్లం కాము. నాకు తెలిసి 60 ఏళ్ల సంచికలను మొత్తంగా ఆన్లైన్‌లో పెట్టాలని నిర్ణయించుకుని ఆ పనిలో ముందుకు సాగుతున్న పత్రిక చందమామ మినహా ప్రపంచంలోనే మరొకటి ఎక్కడాలేదు. నేషనల్ జాగ్రఫీ వాళ్లు కూడా 112 సంవత్సరాల సంచికలను టోకున సీడీలలో పెట్టి అమ్మారు తప్ప ఉచితంగా ఆన్‌లైన్‌లో పొందుపర్చలేదు.

ఆన్‌లైన్‌లో 60 సంవత్సరాల క్రితం నాటి అపరూప సంచికలు. ఒక్కచోటే అన్ని చందమామలు… తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది నాకు. వేణుగారూ ఈ విషయంపైనే మీరు ఎందుకు ఓ కథనం రాసి మీ బ్లాగులో పెట్టకూడదు? చందమామ యాజమాన్యం తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇంటర్నెట్‌లో చందమామ ఆర్కైవ్స్ ఒకటి.

ఏ మహత్తర క్షణంలో ఈ నిర్ణయం తీసుకున్నారో కాని తెలుగు వాళ్లకు తమదైన సాంస్కృతిక సంపద కళ్లముందు కనిపిస్తోందిప్పుడు. ఇప్పుడు కొన్ని కారణాల రీత్యా అంతకు ముందు ఉన్న పీడీఎఫ్ డౌన్లోడ్ సౌకర్యం తీసివేసి చదవగలిగేలా ఫ్లాష్ ఇమేజ్ ఫార్మేట్‌లో చందమామలను ఇంటర్నెట్‌లో పెట్టారు.

“అనంతమైన ప్రకృతిలో ఒదిగిన అరణ్య సౌందర్యం చందమామ బొమ్మల్లో అద్భుతంగా సాక్షాత్కరిస్తుంది.”     

“సజీవమైన, చక్కని తెలుగు వాడుక భాష చందమామ ద్వారానే నాకు అందింది. బాల్యంలోనే నాలో తరగని పఠనాసక్తిని పెంచింది  చందమామే!”

“చందమామ అంటే అక్షరాల్లో సంపూర్ణంగా వ్యక్తం కానంత అపురూపమైన అనుబంధం!”

మీ ‘చందమామ జ్ఞాపకాలు’ లో ఇవన్నీ మెరుపు వాక్యాలే మరి. అక్షర సత్యాలు కూడా. ఈరోజు కూడా మనం ఒక పరీక్ష పెట్టుకోవచ్చు. ఎవరైతే బాల్యంలో కథలు వినడానికి, కథలు చదవడానికి దూరమైపోయారో వారు సాహిత్యానికి కూడా దూరమైపోయి ఉంటారు. . వారి కుటుంబంలో సాహిత్య వాతావరణం కూడా దూరంగానే ఉంటుంది.

బాల్యంలో ఎలాంటి సాహిత్య పరిచయం లేనివారు మధ్యలో సాహిత్య వాతావరణంలోకి రావడం కూడా అరుదుగానే జరుగుతుందనుకుంటాను.

అయితే సమాజంలో లక్షలాది మంది ఇప్పటికీ సాహిత్యానికి, పుస్తక పఠనానికి దూరంగా ఉంటూ ఉండడానికి సామాజిక, ఆర్థిక, బౌద్ధిక కారణాలు ఎన్నో ఉన్నాయనుకోండి.

పని గట్టుకుని మంచి పుస్తకం మనం ఇచ్చి, కొనిపించి చదివించినట్లయితే కొంతమంది పిల్లల్లో ఈనాటికీ పుస్తకాల పట్ల అనురక్తి ఏర్పడుతోంది. అంటే పిల్లలు పుస్తకాలు చదవరనే మాట వట్టిదే. వారికి చదివే అవకాశం, తీరిక సమయాన్ని ఇంట్లో, పాఠశాలల్లో కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

జీవితంలో పోరాటం అవసరమైన పరిస్థితుల్లో కాకుండా, మంచి సాహిత్యం చదివి, అన్యాయంపై ఆగ్రహంతో ఉద్యమాల బాటను ఎంచుకున్న వారు ఎంతోమంది ఉన్నారని నా అనుభవంలో తెలిసింది.

వేణుగారూ.. చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు. మరి సెలవు.

మీ చందమామ జ్ఞాపకాలను ఒక్కరోజు వ్యవథి తీసుకుని రేపు (07-09-09) తప్పకుండా ఆన్‌లైన్‌లో ప్రచురించగలం. వచ్చిన వెంటనే ప్రచురించడం రివాజు అయినప్పటకీ, మా ఆన్‌లైన్ కంటెంట్ హెడ్ ఆఫీసుకు రాకపోవడంతో ఈ ఇబ్బంది ఏర్పడింది. ఒకసారి ఆమెతో మీ జ్ఞాపకాలను పంచుకున్న తర్వాత రేపు అంటే మంగళవారం దీన్ని తప్పక పోస్ట్ చేయగలం. ఇది చిన్న సాంకేతిక విషయంతో ముడిపడిన విషయం మాత్రమే అని గుర్తించగలరు….

అన్యధా భావించరని ఆశిస్తూ….

మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలతో.. ఈ చందమామ జ్ఞాపకాల అనుబంధం ఇలాగే కొనసాగుతుందని ప్రగాఢంగా ఆశిస్తూ…

మీ
చందమామ

వేణుగారి చందమామ జ్ఞాపకాలు చదవాలనుకుంటే ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2197

బీవీ ఫణి, రోహిణీ కుమార్, త్రివిక్రమ్, శివరామ్ ప్రసాద్ గార్లు ఇదివరకే పంపిన వారి చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
………………………….

మా చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా తమ హృదయంలో పొదవుకుని భద్రపర్చుకున్న వందలాదిమంది చందమామ అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో telugu.chandamama.com లో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము. చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు ఇదే మా ఆహ్వానం.

ఆ రోజుల్లో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు.  వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్ వివరాలను కూడా పంపగలరు.

abhiprayam@chandamama.com

చందమామ పాతసంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

 నోట్:

చందమామ అభిమానులందరినీ ఉర్రూత లూగించే ఒక చల్లటి వార్త త్వరలో మీ ముందుకు…  సర్వశ్రీ ఎంటీవీ ఆచార్య, చిత్ర, వడ్డాది పాపయ్య, శంకర్ గార్ల పేర్లు తెలుసు కదూ.. చందమామ చరిత్రకే మణిభూషణాలను దిద్దిన ఈ అపరూప చిత్రకారులకు సంబంధించిన ఓ మంచి విషయం కోసం త్వరలో ఇక్కడే కలుసుకుందాం.

 చందమామ.

RTS Perm Link

చందమామ జ్ఞాపకాలు

September 2nd, 2009
చందమామ జ్ఞాపకాలు : శివరాంప్రసాద్ కప్పగంతు.

చందమామ జ్ఞాపకాలు : శివరాంప్రసాద్ కప్పగంతు.

శివరాం ప్రసాద్ గారూ,

మనఃపూర్వక కృతజ్ఞతలు. అడిగిన వెంటనే తీరిక చేసుకుని మరీ మీ చందమామ జ్ఞాపకాలు పంపారు. మీరు కోరినట్లు మీరు సూచించిన ఫోటోయే ఆన్‌లైన్ చందమామలో ప్రచురించాము. పెద్ద పెద్ద పేరాలను చిన్నవిగా చేయడం తప్పిస్తే మీరు పంపిన పూర్తి పాఠాన్ని యధాతథంగా ప్రచురించాము. నిన్ని త్రివిక్రమ్ గారు, ఇవ్వాళ మీరు… వెంటవెంటనే చందమామ జ్ఞాపకాలను పంపడం.. నిజంగా చక్కటి అనుభూతి.

‘చందమామలో బొమ్మలను ఉదహరించకపోతే, చందమామ జ్ఞాపకాలేమిటి’  చక్కటి వ్యాఖ్య. కొత్తగా వచ్చిన చంద్రబాల అలనాటి చందమామను గుర్తుకు తెస్తూ బొమ్మలతో అదరగొడుతోంది. దాంట్లో పూర్తి పేజీ రంగుల చిత్రాలను చూస్తుంటే చందమామ పోగొట్టుకున్నదేమిటో అర్థమవుతుంది. ఇప్పటికైనా చందమామ మేలుకుంటే మంచిది.

‘కొత్త చందమామను షాపువాళ్ళు వరుసగా పెట్టినప్పుడు, ఆ దుకాణానికే గొప్ప అలంకరణ చేసినట్టుగా ఉండేది’

మళ్లీ ఆరోజులు రావాలనే కోరుకుంటున్నా. మన అందరి ఆశలు, ఆకాంక్షలు, డిమాండ్లు అన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుతాయనే అనుకుంటున్నా. పాత చందమామలు దుకాణాల్లో పేర్చి ఉన్న ఫోటోలు ఒకటో రెండు దొరికితే బాగుండు. చందమామ ఆఫీసులో పేర్చి ఉన్న చందమామలను చూస్తుంటేనే మనసు తుళ్లింతలు పోతుంది. అలాంటింది పాత చందమామల ముఖచిత్రాల గురించి చెప్పపనిలేదు.

‘ఇంతటి అద్భుతమైన బొమ్మలను సేకరించి, ఒక పుస్తకం వెయ్యగలిగితే చందమామ వారు తెలుగు సాహిత్యానికి చిత్రలేఖన  కళకు ఎంతగానో సేవచేసినవారిగా చరిత్రకు ఎక్కుతారు’.

ఇప్పుడు చందమామ అభిమానులు, పాఠకులు, చంపిలు పత్రికకు పంపే డిమాండ్లలో దీన్నికూడా మొదటి వరుసలో చేర్చాలి. చందమామకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంగ్లీషులో కలెక్టర్ ఎడిషన్ వేసి తెలుగు వారి సెంటిమెంట్లను గాయపర్చారు. కనీసం ఈ ప్రతిపాదనను అయినా చందమామ నిర్వాహకులు పరిగణనలోకి తీసుకుని చందమామ ఆస్థాన చిత్రకారుల త్రయం గీసిన చిత్రాలను ఒక పుస్తకంగా వేస్తే అది ఓ అద్భుత ఆవిష్కరణగా చరిత్రలో మిగులుతుంది.

చక్కటి రిజల్యూషన్‌తో చందమామ చిత్రాలను ప్రచురిస్తే ఎంత ఖర్చైనా వెచ్చించి తీసుకోవడానికి పాఠకులు పూనుకుంటారనే నా నమ్మకం. Chandamama Collector’s edition పుస్తకం చివర్లో Art Galleryలో చిత్రాలు ఓసారి చూడండి. అదిరిపోయేలా వేశారు. మళ్లీ మెయిన్ పుస్తకంలో వేసిన చిత్రాలు అంత కళగా లేవు. కాని అరుదైన పుస్తకంగా దీన్ని మనం కొని భద్రపర్చుకోవచ్చు.

చందమామ చిత్రాలు పుస్తక రూపంలో రావాలంటే చందమామకు అభిమానులు పంపే ఉత్తరాలు, ఈ మెయిళ్లలో దీన్నికూడా చేర్చి పంపించాలి. చందమామ ధారావాహికలు, చందమామ చిత్రాలు వంటివి తిరిగి ముద్రించబడితే ఎంతగా పాఠకుల ఆదరణ పొందుతాయో నిజంగానే నిర్వాహకులకు తెలియకపోవచ్చు కూడా. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడితే ఈరోజు కాకపోతే రేపయినా వీటి పునర్ముద్రణ విషయం ఆలోచిస్తారు.

అందుకే వీలయినంత మంది చంపిల, చందమామ అభిమానుల, పాఠకుల ఈమెయిళ్లు మనం సేకరించగలగితే ఏక కాలంలోనే నిర్దిష్ట సంఖ్యలో పాఠకులు ఓ ప్రత్యేక అంశంపై డిమాండును మరిత బలంగా పంపించడానికి అవకాశముంటుంది. అలా అది యాజమాన్యంపై తప్పకుండా ప్రభావం చూపుతుంది కూడా. ఎంతలేదన్నా సంఖ్యా బలానికి ప్రాధాన్యత ఉన్న కాలం కదా ఇది.

దీన్నే నా బ్లాగులో కూడా చందమామ అభిమానులకోసం పోస్ట్ చేస్తాను.

మరోసారి మీ చందమామ జ్ఞాపకాలకు కృతజ్ఞతలు.

మీ చందమామ జ్ఞాపకాల కోసం కింది లింకును తెరవండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2176

రాజు.

నోట్: చందమామ అభిమానులకు, చంపిలకు విజ్ఞప్తి.  చందమామతో మీ బాల్య, తదుపరి జీవిత జ్ఞాపకాల గురించి రెండు పుటలకు మించని కథనం కింది లింకుకు పంపగలరు. మీ ఫోటోతో  సహా పంపితే మరీ మంచిది. తెలుగు పాఠకుల చందమామ జ్ఞాపకాలకు ఆన్‌లైన్ చందమామ వేదిక కావాలన్న మా ఆకాంక్షను మన్నిస్తారని ఆశిస్తూ..

చందమామ జ్ఞాపకాలు పంపవలసిన లింకు

abhiprayam@chandamama.com

RTS Perm Link

చందమామతో చెలిమి – మా చందమామ జ్ఞాపకాలు

September 1st, 2009
చందమామ జ్ఞాపకాలు : త్రివిక్రమ్

చందమామ జ్ఞాపకాలు : త్రివిక్రమ్

త్రివిక్రమ్ గారూ,
మనఃపూర్వక కృతజ్ఞతలు. పని ఒత్తిళ్లలో ఉండి కూడా ఆలస్యంగా అయితేనేం, మీ చందమామ జ్ఞాపకాలను “చందమామతో చెలిమి మా చందమామ జ్ఞాపకాలు’ పేరిట  తీపిగుర్తులుగా ఆన్‌లైన్ చందమామకు పంపారు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2166

ఈ శీర్షిక మొదలు పెట్టినప్పుడు మొదట మీదే రావలసి ఉండె. మొత్తంమీద 30, 40 సంవత్సరాల క్రితం తెలుగు చదవగలిగిన కుటుంబాలు ఆంధ్రరాష్టం నలుమూలలా సాగించిన చందమామ ఒరవడిని మీ ‘చందమామతో చెలిమి’ కథనం చక్కగా వివరించింది. చదువుతుంటే మా యింట్లో నాన్న చందమామను తొలిసారిగా తీసుకువచ్చి మాకు పరిచయం చేసిన నాటి అమృత గడియలు ఒక్కసారిగా జ్ఞాపకానికి వచ్చాయి.

రెండు మూడు తరాల క్రితం కుటుంబానికి చందమామకు లంకె కుదర్చాలంటే నాన్నే ప్రధాన ఆధారం. అందుకే తెలుగునాట చందమామ నాన్నల ఆదరణ సాక్షిగా మొగ్గతొడిగిందంటే అతిశయోక్తి కాదనుకుంటా. (అమ్మల ప్రోత్సాహం, తమపిల్లలకు వారు కథలతో జోకొట్టడం వంటివి ఉన్నప్పటికీ, ఊకొడితే చాలు ఆ గడియకో కథ చెబుతూ పిల్లల కథా దాహాన్ని తీర్చడంలో అమ్మల పాత్ర తక్కువేమీ కాదు) 

ఈ శీర్షిక కేవలం చందమామ అభిమానులకు, ‘చంపి’ లకు, పాఠకులకు మాత్రమే సంబంధించింది కాబట్టి  వీలైనంత మంది చందమామ ప్రేమికులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు తమ ఫోటోతో సహా పంపితే బాగుంటుంది.

చందమామను తన సవతుల్లో ఒకటిగా భావించిన మీ జీవన సహచరి చివరకు తానే చందమామ ప్రేమికురాలిగా మారడం…
ఇంతకంటే చందమామకు ఏం కావాలి. తెలుగు జాతికి, చందమామకు ఏర్పడిన ఈ రుణానుబంధం ఎన్నటికీ చెరిగి పోకూడదని ఆశించడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి.

అంతవరకూ పాఠకుల ‘చందమామ జ్ఞాపకాలు’ కోసం నిరీక్షిస్తూ…

రాజు.

 

త్రివిక్రమ్ గారి ‘చందమామతో చెలిమి’ కథనం కోసం కింది లింకులో చూడగలరు

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2166

ఆన్‌లైన్ చందమామ హోమ్ పేజీలో కూడా చూడగలరు.

telugu.chandamama.com కు మీ రచనలు, చందమామ జ్ఞాపకాలు, సూచనలను కింది లింకుకు పంపండి.

abhiprayam@chandamama.com

RTS Perm Link