చందమామ పాత కాపీలు దొరికాయోచ్

August 30th, 2009
భీష్మార్జునులు

భీష్మార్జునులు

చందమామ పిల్లల కథల పత్రికగా మొదలై ‘సాహిత్యాభిలాషలో పిన్నలకూ, పెద్దలకూ, స్త్రీలకూ, పురుషులకూ ఉండే వ్యత్యాసాలను సరిచేసిన పత్రిక’ గా, కుటుంబంలోని అందరి పత్రికగా 50 ఏళ్ల క్రితమే చరిత్రకెక్కిన విషయాన్ని 1960 జూన్ చందమామ సంపాదకీయం ఆధారంగా నా బ్లాగులో ‘అందరి చందమామ’ పేరుతో ఇవాళ ఓ కథనం పోస్ట్ చేశాను.

జలుబు, జ్వరంతో అన్ని పనులు మానుకుని విశ్రాంతిగా ఉండగా ‘చంపి’ సభ్యురాలు సుజాత గారు ఓ చల్లటి వ్యాఖ్య ఈ సాయంత్రం పంపారు. దాన్ని వ్యాఖ్యలాగా కథనం లోపల ఉంచటం కన్నా చందమామ అభిమానులందరూ పంచుకునేలా చేస్తే బాగుంటుందని భావిస్తూ ఇక్కడ ‘చందమామ పాత కాపీలు దొరికాయోచ్’ అనే పేరిట కొత్త కథనం పోస్ట్ చేస్తున్నాను. 1968-74 కాలం నాటి చందమామలు భద్రంగా దొరకడం అంటే మాటలా… ఈ గొప్ప వార్తను మీరూ చదవండి మరి…

Comment by సుజాత — 08/30/2009 @ 7:58 am |

రాజు గారు,
నిన్న మా చెల్లెలుతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా మాటల మధ్యలో బ్లాగుల్లో చందమామ గురించి, చంపిల గురించి చెప్పాను. అప్పుడు తను ‘ఎవరికీ చెప్పనంటే ఒక విషయం చెప్తాను”అంటు తన వద్ద 1968-74 మధ్య కాలం నాటి చందమామలు కొన్ని ఉన్నాయని చెప్పి మతి పొగొట్టింది. కనీసం చూడ్డానికైనా ఇవ్వమని అడిగాను. చందమామల విషయంలో ఎవ్వర్నీ(నన్ను ఐనా సరే) నమ్మనంటూనే ఎలాగో ఒప్పుకుంది. త్వరలో వాటిని చూడ్డమే కాక, చదువుతాను కూడా! సంతోషం పట్టలేక ఇక్కడ పంచుకుంటున్నా!

ప్రతి వ్యాఖ్య
అమ్మా సుజాతమ్మ తల్లీ,
నాకు మతి పోతోందిక్కడ ఈ వార్త వింటూంటే. 68-74 చందమామలా? ఆహా… ఎంత గొ్ప్ప నిధి దొరికింది మీకు. అవి అలాగే జిరాక్స్ చేసి కాపీకి ఇంత అని అమ్మకం పెట్టినా అలాగే కొనేసేందుకు చాలామందే సిద్ధంగా ఉంటారు. అదేదో మీ చెల్లెలికి చెప్పి ఆ ఏర్పాట్లేవో మీరే చేస్తే బాగుంటుందేమో కదా. ఎంత మంచి వార్త.

10 రోజులు క్రితం చందమామ ప్రింట్ ఆన్ డిమాండ్ పాలసీ అమలు కావడం లేదు అని చెప్పి మీ అందరినీ నిరాశపర్చాను. కాని ఇప్పుడు అందుకు భిన్నమైన వార్త చెబుతున్నా. 60 సంవత్సరాల చందమామల డీటీపీ వర్క్ త్వరలోనే మొదలు కావచ్చు. అది పూర్తయిందంటే కోరిన వారికి కోరిన పాత చందమామలను ముద్రించి ఇచ్చే పని ఆమల్లోకి వస్తుంది. దీనికి మహా అంటే మరో 4 నెలల సమయం పడుతుందని అంచనా. అలాగే దాసరి సుబ్రహ్మణ్యం గారి 12 ధారావాహికలను విడివిడిగా ముద్రించి చందమామ ప్రచురణల పేరిట పాఠకులకు అందివ్వమని మా యాజమాన్యానికి ప్రతిపాదించబోతున్నాం. త్వరలో వీటిపై నిర్ణయం జరుగవచ్చు.

మొత్తం మీద ఆశ, నిరాశల మధ్య దోబూచులాడుతూ వస్తున్నాం కదా. మంచే జరుగుతుందని ఆశిద్దాం.

మీ వద్ద మంచి స్కానర్ లాంటిది ఉంటే ఆ పాత చందమామల రెండు కవర్ పేజీలను స్కాన్ చేసి (కనీసం 300 డీపీఐ) అభిమానులకు ఇస్తే బాగుంటుంది కదా…

చల్లటి వార్తకు ధన్యవాదాలు. ఇన్నాళ్లుగా పాత చందమామలను కాపాడిన మీ చెల్లెలు గారికి కూడా మరి!

Comment by chandamamalu — 08/30/2009 @ 8:43 am

RTS Perm Link