అందరి “చందమామ”

August 29th, 2009

ch n3

సాహిత్యాభిలాషలో పిన్నలకూ, పెద్దలకూ, స్త్రీలకూ, పురుషులకూ ఉండే వ్యత్యాసాలను సరిచేసిన పత్రిక “చందమామ”. చందమామ పిల్లల పత్రికా, పెద్దల పత్రికా లేదా ఇద్దరి పత్రికా అనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి ఉండవచ్చు.

సాక్షాత్తూ ప్రస్తుత యాజమాన్యమే, యంగ్ జనరేషన్ అవసరాలకు అనుగుణంగా చందమామ రూపురేఖలను మార్చాలని తనదైన దృక్పధంతో ఆలోచించి చందమామ లేఅవుట్‌తో పాటు విషయం ఎంపికలో కూడా సమూల మార్పులు చేయాలని తలపోస్తుండవచ్చు.

కానీ కుటుంబం లోని అందరి పత్రికగా చందమామ మారిపోయిన విషయం 50 ఏళ్ల క్రితమే చరిత్రకెక్కింది. 1960 నాటి జూన్ చందమామ సంపాదకీయం స్పష్టంగా ఈ విషయాన్ని పాఠకులకు సూచించింది.

ఈరోజు రాత్రి నెట్‌లో బ్లాగర్ల సముదాయాన్ని గాలిస్తుండగా haaram.com బ్లాగు సముదాయంలో ఈ కింది బ్లాగ్ యుఆర్ఎల్ కనిపించింది.

http://telugupatrikalu.blogspot.com/2009/08/june-1960.html

దీన్ని చూస్తే చందమామతో సహా తెలుగులో అన్ని పత్రికలను ఈ బ్లాగరి పీడీఎఫ్‌గా మార్చి డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తూ తన బ్లాగులో పెడుతున్నారు. ఈ ఒక్క బ్లాగులో ఇంతవరకూ 34 చందమామ సంచికలను పీడీఎఫ్‌లుగా ఇవ్వడం గమనార్హం. 2001, 2003, 2004. చందమామలను కూడా పీడీఎఫ్‌గా ఇక్కడ ఇవ్వడం మరీ విశేషం.

ఈ బ్లాగులో ఉన్న 1960 జూన్ చందమామ పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తూ సంపాదకీయం కేసి చూస్తే ‘చందమామ పిల్లల చందమామ కాదు అందరి చందమామ’ అంటూ నాటి సంపాదకీయం ఢంకా భజాయించి చెప్పిన విషయం కనబడింది. ఆ సంపాదకీయం తొలి సగాన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. చందమామ ఎవరిదో ఇక్కడ అందరూ తెలుసుకోవచ్చు.

” ఈ సంచికతో ‘చందమామ’కు పదమూడేళ్లు నిండుతున్నాయి. ఈ పదమూడేళ్ల కాలంలో చందమామ తన పాఠకులతోబాటు ఎంతో పెరిగింది. ఎన్నోరకాల అందచందాలు సమకూర్చుకున్నది. అచ్చంగా చిన్నపిల్లల విజ్ఞాన వినోదాలకు మాత్రమే తోడ్పడుతుందనుకున్న ఈ పత్రిక త్వరలోనే కుటుంబంలోని అందరి పత్రికా అయిపోయింది. సాహిత్యాభిలాషలో పిన్నలకూ, పెద్దలకూ, స్త్రీలకూ, పురుషులకూ ఉండే వ్యత్యాసాలను సరిచేసిన పత్రిక చందమామ ఒక్కటేనని చెప్పవచ్చు. దీని ప్రభావం ఇంకా అనేక ఇతర పత్రికలపైన కూడా పడిందనటానికి సందేహం లేదు.”

దీనిపై ఇక ఏ వ్యాఖ్యానాలు కూడా అనవసరం కదూ..

(పైన సూచించిన బ్లాగులో 34 చందమామల పీడీఎఫ్‌లను స్వంతం చేసుకోవడం మరువరుగా..)

నోట్: తెలుగులో ఇలాంటి డౌన్‌లోడ్ సైట్లను నాకు తెలిసిన మేరకు నా బ్లాగు హోమ్ పేజీలో “చందమామ డౌన్‌లోడ్” విభాగంలో పెట్టాను. –తెలుగు పత్రికలు, చందమామలు, బ్లాగాగ్ని, సాహిత్య అభిమాని. చందమామ ఈ బుక్స్– ఇంకా ఏవయినా ఇలాంటివి ఉంటే ‘చంపి’లు తప్పక సూచించగలరు.

RTS Perm Link