పాత బంగారం మాకు ఎప్పటికి ముద్దే

August 27th, 2009
పాత చందమామ కవర్ పేజీ

పాత చందమామ కవర్ పేజీ

(చందమామ పాత సంచికల పట్ల, పత్రిక పాత నమూనా పట్ల అపారమైన ప్రేమాభిమానాలు పెంచుకున్న వెలువలి రామకృష్ణ రోహిణీ కుమార్ గారు చందమామ పాత తరం శ్రేయోభిలాషుల్లో ఒకరు. చందమామలో కథలు తగ్గిపోతున్న రీతి, రివాజుల పట్ల బాగా అసంతృప్తి ఉన్న రోహిణీ కుమార్ గారు దాదాపు 3 నెలల క్రితం పత్రికకు ఆప్తవాక్యాలు పలుకుతూ మొదటగా కింది మెయిల్ పంపారు. ఆయన అసంతృప్తిని గౌరవిస్తూనే, దృష్టిలో ఉంచుకుంటూనే చందమామకు ఆయన తెలిపిన శుభాకాంక్షలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము. అయన కోరిన డిమాండ్లు అన్నీ ఇప్పటికప్పుడు తీర్చలేకపోతున్నప్పటికీ, చందమామ హితం కోరే వారిని, వారి విలువైన అభిప్రాయాలను ఎన్నటికీ మర్చిపోమని, చందమామ మంచి దశవైపు మళ్లే శుభక్షణం కోసం మాకు వీలైనంత మేరకు, చేయగలిగనంత కృషి తప్పక చేస్తామని మరోసారి హామీ ఇస్తూ… వారు నిండు నూరేళ్లు చల్లగా బతకాలని కోరుకుంటూ….)

 

చందమామకు గల అశేష పాఠక ప్రజానీకంలో నేనూ ఒకడిని.

కొత్త సంచిక ఎప్పుడెప్పుడు అందుకుంటానా అని ఆశగా ప్రతి నెల ఎదురు చూస్తుంటా.

చందమామ కథలు అమ్మ చెప్పిన కథలను తలపించే రీతిన ఉంటాయనటంలో అతిశయోక్తి లేదు.

నా చిన్నతనంలో మండువేసవి సెలవుల్లో చక్కటి నీతి కథలతో సేద తేర్చిన ఈ చందమామ, నేటికీ పసి హృదయాలను, పెద్దల మనసులను గెలుచుకోవడం ముదావహం.

మహోత్కృష్టమయిన ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ చందమామ “ఇంతింతై వటుడింతై” అన్న చందాన దినదిన ప్రవర్థమానమై ఆచంద్రార్కం అలరారాలని మనసారా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

భవదీయుడు

వెలువలి రామకృష్ణ రోహిణీ కుమార్.
—————

మా చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందిస్తున్నాము. చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు ఇదే మా ఆహ్వానం. ఆ రోజుల్లో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు.  వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్ వివరాలను కూడా పంపగలరు. 

abhiprayam@chandamama.com

చందమామ పాతసంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

RTS Perm Link