పాంపీ నగరంలో ఆ కుటుంబం చివరి క్షణాలు…

August 24th, 2009
వెసూవియస్ అగ్నిపర్వతం

వెసూవియస్ అగ్నిపర్వతం

పాంపీ నగరం… ఈ పేరు వినగానే చరిత్రలో అరుదుగా జరిగిన పరమ భయానక ఘటనల చీకటి అధ్యాయం మన ముందుకు వచ్చి నిలబడినట్లవుతుంది. దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం ఇదే ఆగస్టు 24వ తేదీన ఉన్నట్లుండి పేలిన అగ్నిపర్వతం ధాటికి ఇటలీలో లావా కింద 60 అడుగుల లోతులో శాశ్వతంగా కప్పబడిపోయిన చారిత్రక నగరమే పాంపీ..

పాంపీ గురించి, గత రెండు వేల సంవత్సరాలుగా భూగర్భంలో చెక్కుచెదరకుండా దాగి ఉన్న ఆ నగర జనజీవిత హృదయ విదారక అంతిమ క్షణాల గురించి మనం చిన్నప్పటినుంచి స్కూలు పుస్తకాలలో చదివాం. ఇటలీలో పాంపీతో సహా మూడు నగరాలపై విరుచుకుపడిన ఈ అగ్నిపర్వతం దాదాపు 30 వేల మంది ప్రజలను క్షణాల్లో బూడిదలో ముంచేసింది.

మౌంట్ వెసూవియస్ - పాంపీ

మౌంట్ వెసూవియస్ - పాంపీ

మౌంట్ విసూవియస్ అగ్నిపర్వతం వెదజల్లిన లావాకింద కప్పబడిపోతున్న సమయంలో ఓ ఇంటిలోని డజను మంది తమ చివరి క్షణాల వరకు ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఇప్పడు ఇటలీ పరిశోధక బృందం పునర్నిర్మించింది. దాదాపు 19 గంటల పాటు ఈ అగ్నిపర్వతం వెదజల్లిన లావాగ్నికీలల నుంచి తప్పించుకుంటూ ఆ ఇంటిలోని వారు గడిపిన అంతిమ క్షణాలను ఈ పరిశోధక బృందం వెలికి తీసింది

డిస్కవరీ న్యూస్ నివేదిక ప్రకారం అగ్నిపర్వత శాస్త్ర నిపుణుడు క్లాడియో స్కార్పాటి, నేపుల్స్ యూనివర్శిటీకి చెందిన సహచరులు గిసెప్పీ ల్యూంగో, అన్నామారియా పెరోట్టాలు పాంపీ నగరంలోని ఓ ఇంటిపై అగ్నిపర్వతం వెలువరించిన బూడిద పొరలను విశ్లేషించారు.

ఓ కుటుంబంలో 13మది మృతదేహాలు

ఓ కుటుంబంలో 13మది మృతదేహాలు

ఆ ఇంటిలో పేరుకుపోయిన లావాతో ఏర్పడిన స్పటికం కింద ఉన్న 13 మంది వ్యక్తుల పుర్రెలను పరిశీలించారు. అగ్నిపర్వతం లావాను వెదజల్లుతున్నప్పుడు ఆ ఇంటిలో జరిగిన సంఘటనల దొంతరను పునర్నిర్మించడానికి ఈ బృందం ప్రయత్నించింది.

పాంపీ నగరంలోని ప్రధాన వీధి అయిన వయా డెల్ఫ్ అబోండాంజాలో ఉన్న జూలియస్ పోలీబియస్ ఇంటిని గురించి ఈ పరిశోధక బృందం విస్తృతంగా అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా స్కార్పాటీ డిస్కవరీ న్యూస్ విభాగంతో మాట్లాడుతూ పాంపీ నగరంలోంచి బయటపడిన ఈ ఇల్లు సంపద్వంతమైన, వైవిధ్యపూరితమైన పురావస్తు ఆధారాలకు నిలయంగా ఉందని చెప్పారు. పైగా, పాంపీ నగరంపై కురిసిన అగ్నిపర్వత లావా వర్షపు పూర్తి పొరలకు సంబంధించిన ఆధారం ఇక్కడ లభిస్తోందని తెలిపారు.

బద్దలైన అగ్నిపర్వతం

బద్దలైన అగ్నిపర్వతం

క్రీస్తు శకం 79వ సంవత్సరం ఆగస్ట్ 24వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విసూవియస్ అగ్నిపర్వతం నుంచి నల్లటి పొగ సుడులు తిరుగుతూ పైకి లేవడాన్ని నగర వాసులు గమనించారు. ఆకాశంలో తొమ్మిది మైళ్ల పొడవునా వ్యాపించిన ఈ లావా సుడి బూడిద వర్షాన్ని కురింపించడం ప్రారంభించింది. దీంతో నగరంలోని చాలామంది ప్రజలు వీధుల్లోకి పరుగెత్తి నగరం వీడి వెళ్లేందుకు ప్రయత్నించారు

ఆ సమయంలో జూలియస్ పోలిబియస్ ఇంటిలో 12 మంది వ్యక్తులు ఉండేవారు. వీరిలో ప్రసవం ధరించడానికి సిద్ధంగా ఉన్న ఓ యువ మహిళ కూడా వారితో ఉంది. ఆ మహిళ ప్రాణాలకు సురక్షితంగా ఉంటుందనే దృష్టితో వీరు ఆ ఇంటిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పరిస్థితుల్లో వారి ఆలోచన సరైందేనని స్కార్పాటి అభిప్రాయపడ్డారు.

పోలిబియస్ ఇంటిలో తల్లిదండ్రులు, వారి పిల్లలు, ఒక కజిన్ అతడి పడచు భార్య, కొంతమంది సేవకులు ఉండేవారు. వీరిలో ముగ్గురు మగవారు, ముగ్గురు మహిళలు కాగా, నలుగురు అబ్బాయిలు, ఒక బాలిక, ఒక బిడ్డ, భూమ్మీదికి వచ్చి పడడానికి మాతృగర్భంలో సిద్ధంగా ఉన్న 8 నెలల జీవి ఆ ఇంటిలో ఉండేవారు.

బూడిదలో కప్పబడిన మహిళ

బూడిదలో కప్పబడిన మహిళ

తవ్వకాలలోఈ అండం 16 లేదా 18 సంవత్సరాల వయసుగల ఆ యువ మహిళ అస్తిపంజరానికి కరుచుకుని ఉందని స్కార్పాటి చెప్పారు. వీరంతా అగ్నిపర్వతం వెదజల్లిన లావా పరిణామ క్రమానికి సాక్షీభూతులుగా నిలిచారని చెప్పారు. గంటకు 6 అంగుళాల పరిమాణంతో లావా బూడిద కురిసిందనే అంచనాతో అగ్నిపర్వత డిపాజిట్ల సాంద్రతను పరిశీలించిన తర్వాత, పోలీబియస్ ఇల్లు కుప్పకూలడానికి ఆరుగంటలు పట్టి ఉందని అంచనా వేసినట్లుగా చెప్పారు.

రాత్రి 7 గంటల వేళకు లావా బూడిద తాకిడికి ఇంటి ముందు భాగం కుప్పగూలి పోయిందని, దీనితో ఇంట్లోని వారు వెనుక గదిలో ఆశ్రయం తీసుకున్నారని స్కార్పాటి చెప్పారు. తర్వాత లావా ప్రవాహం ఏకధాటిగా పొంగివచ్చి వెనుక గదులను పూడ్చి వేసిందని తెలిపారు.

తదనంతంరం లావా తోటలోకి ప్రవహించి ఇంటి ముంగిటికి చేరిందని, దీంతో లోపలున్న వారికి తప్పించుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. లావా బూడిద క్రమక్రమంగా ఇంట్లోని మూలమూలలకు చేరుకుని లోపలున్న వారిని హతమార్చిందని ఇటాలియన్ పరిశోధకుడు చెప్పారు.

పాంపీ శిధిల నగరం

పాంపీ శిధిల నగరం

పాంపీ నగరం… పకృతి వైపరీత్యం సాధించిన విలయ విధ్వంసంపై పురాతన చరిత్ర మిగిల్చిన ఏకైక సాక్షీభూతం.. దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం లావా బూడిద కింద ఆనవాళ్లు లేకుండా పోయిన ఈ ప్రాచీన నగరాన్ని తిరిగి వెలికి తీస్తున్న క్రమంలో పురావస్తు శాస్త్రజ్ఞులు ఆనాడు ఆ నగరంలోని ఓ కుటుంబం ముంచుకొస్తున్న లావా నుంచి తప్పించుకోవడానికి గాను తపన పడిన ఆ చివరి క్షణాలను ఆధారాలతో సహా ఇప్పుడు వెలికి తీయడం శాస్త్ర విజ్ఞానం సాధిస్తున్న విజయాలకు గీటురాయిగా నిలబడుతుంది.

RTS Perm Link


7 Responses to “పాంపీ నగరంలో ఆ కుటుంబం చివరి క్షణాలు…”

  1. సుజాత on August 24, 2009 6:33 AM

    భీభత్స రస ప్రధానమైన దృశ్యాన్ని ఎంత హృద్యంగా వర్ణించారండీ! ఫొటోలు చూస్తుంటే అదేదో కళ్ళముందే జరిగినంత బాధగా అనిపించింది. చాలా బావుంది పోస్టు సమాచారాత్మకంగా కూడా!

  2. Sree on August 24, 2009 6:51 AM

    “ఆనాడు ఆ నగరంలోని ఓ కుటుంబం ముంచుకొస్తున్న లావా నుంచి తప్పించుకోవడానికి గాను తపన పడిన ఆ చివరి క్షణాలను ఆధారాలతో సహా ఇప్పుడు వెలికి తీయడం శాస్త్ర విజ్ఞానం సాధిస్తున్న విజయాలకు గీటురాయిగా నిలబడుతుంది.”

    జరిగిపోయిన రణానికి, దారుణానికి కారణాలను అన్వేషించడంలో సఫలీకృతమైన శాస్త్రజ్ఞులు సాధిస్తున్న విజయాలను చక్కగా అందించినందుకు ధన్యవాదాలు. (ఇది వ్యంగ్యోక్తి కాదు – గమనించగలరు!) :) కానీ, శాస్త్రజ్ఞులు మేథోపరంగా, సాంకేతికంగా ఎంతగా ఎదిగినప్పటికీ, ఎప్పటికీ తనదే పైచేయి అని ఏటేటా కొత్త కొత్త ప్రమాదాలతో ప్రకృతి నిరూపిస్తోంది. ఈ అకాల మరణాలకు అంతు ఎప్పుడో కదా..

  3. Bhaskara Rami Reddy on August 24, 2009 12:06 PM

    మంచి సమాచారాత్మక వ్యాసం. మీ మనసులోని భావాలకు సైన్స్ తో రంగరించి చాలా బాగా వ్రాశారు.

  4. chandamamalu on August 24, 2009 2:52 PM

    సుజాత, శ్రీ, భాస్కర రామిరెడ్డి గార్లకు
    సత్వరమే స్పందించలేకపోయాను. ఇప్పుడు కుదురుతోంది. ఈ పోస్టు సమాచారాత్మకంగా ఉందన్నందుకు నెనర్లు.

    అయితే రోజువారీ పనిఒత్తిళ్ల ప్రభావం ఫలితంగా నేను సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా ఈ వ్యాసంలో పొందుపర్చలేకపోయాను. ఆంగ్లంలో ఉన్న డేటాను మొత్తంగా అనువదించి సాపు చేయాలంటే మనకు సాధ్యం కాదు కూడా. రోజులు తరబడి లేదా గంటల తరబడి ఒకే ఒక ప్రత్యేక అంశంమీద దృష్టి సారించేందుకు ప్రస్తుత పని వ్యవస్థలో కుదరదు.

    దానికి తోడు ప్రస్తుత మాంద్య పరిస్థితులలో కింది నుంచి పై దాకా అన్ని స్థాయిల్లోనూ చేతులు పెట్టవలసిన ఏక వ్యక్తి పనివిధానం అమలవుతోంది కనుక ఇప్పుడు ఒక ప్రత్యేక అంశం మీద సుదీర్ఘకాలం పని చేయడం అసాధ్యం. కాబట్టి ఈ గంటలో లేదా అరగంటలో ఎంత పని చేయగలం, ఎంత కంటెంట్ ఇవ్వగలం.. అనే లెక్కల పంచాంగంలో మనం మునగాల్సిందే.

    ఒక గంటలో ఒక ఆర్టికల్ మనం రూపొందించగలిగామంటే, దానికి తగ్గ మంచి చిత్రాలను సకాలంలో మనం వెతికి పట్టుకోగలిగామంటే ఆ రోజులో పెద్ద అదృష్టం (?) కిందే లెక్క. ఉచిత విశ్వవిజ్ఞాన దర్శిని వికీ పీడియా సైతం ఇంత గొప్ప చారిత్రక ఘటనను ఇంగ్లీషులో మాత్రమే రూపొందించగలిగింది కాని, భారతీయ భాషా పీడియాల్లో పెట్టినట్లు లేదు.

    అందుకే ప్రస్తుత పనివ్యవస్థకు తగినట్లుగా బిట్లు బిట్లుగా సమాచారాన్ని దొరికిన మేరకు, కుదిరిన మేరకు కూర్చి వదిలేయవలసిందే తప్ప సమగ్ర వివరణ జోలికి పోలేం. ఇది రోజువారీ పనిలో నిత్యం ఎదుర్కొనే అనుభవమే.. రాస్తున్న, రాసిన వ్యాసంలో ఎక్కడో సమగ్రత లోపిస్తోంది అని అనేకసార్లు తడుతూంటుంది. కానీ వెనకు నుంచి తరుముకొచ్చే పనిగంటలు, అదనపు పనులు అప్పటికే రాసిన దాన్ని ఎడిట్ చేయడానికి, మార్చడానికి కూడా అవకాశం ఇవ్వవు. ఇప్పటికి ఇంతే…

    రేపు ఇంకో వ్యాసం ఇదే పాంపీ మీద రాసి పోస్ట్ చేసినా అది కూడా ఓ బిట్ గానే ఉంటుంది. తప్పదు.

    మీ ప్రోత్సాహకర వ్యాఖ్యలకు మటుకు నిజంగా ధన్యవాదాలు.

  5. చదువరి on August 24, 2009 10:23 PM

    పాంపీ గురించి చాలా విశేషాలు చెప్పారు. మరిన్ని సంగతులు తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతోంది. సంబంధిత లింకులు -ముఖ్యమైనవి – కూడా ఇచ్చి ఉంటే నాబోటివాళ్ళకు మరింత ఉపయోగకరంగా ఉండేది. ఇలాంటి వ్యాసాలకు ఆకరాలు మంచి విలువ నిస్తాయి. అన్నట్టు ఆ మొదటి ఫోటోయే నిన్నటి బింగ్ హోమ్ పేజీ ఫొటో!

  6. బొల్లోజు బాబా on August 24, 2009 11:19 PM

    good article

  7. chandamamalu on August 24, 2009 11:28 PM

    అయ్యో. లింకులు అంత అవసరం లేదేమో అని ఇవ్వలేదు. ఇకనుంచి మీ సూచనను తప్పక పాటిస్తాను. జనరల్‌గా wikipedia.org లేదా google.co.in వెబ్ సైట్లలో మరికొన్ని న్యూస్ వెబ్‌సైట్లలో కూడా ఇలాంటి సమాచారం లభ్యమవుతూ ఉంటుందనేది మీకు తెలిసిన విషయమే. ఇంగ్లీషులో ఉన్న మంచి విషయాన్ని తెలుగు చేద్దామనే ఉద్దేశ్యంతో అప్పుడప్పుడూ ఇలాంటివి అనువదించడం అలవాటు. పాంపీ చరిత్రమీద, ఆనాడు జరిగిన ఘటనలను వెలుగులోకి తీసుకువచ్చిన పురావస్తు పరిశోధనల మీద మంచి చిత్రాలు నెట్‌లో ఉన్నాయి. నిన్న రాత్రి కూడా ఇలాంటి లింకులు చాలా పట్టుకున్నాను. వీలయితే వాటిని ఇప్పుడే పొందుపరుస్తాను. ధన్యావాదాలు

    పాంపీ ఘటనల మీద మరోక వ్యాసం ఈ తెల్లవారు జామున పోస్టు చేశాను దానిపేరు “మానవ చరిత్రలో చీకటి అధ్యాయం : పాంపీ”. ఈ బ్లాంగులోనే మొదట్లో ఉంది చూడగలరు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name (required)

Email (required)

Website

Speak your mind