మన చందమామ

August 6th, 2009

అఖిలాంధ్ర, అఖిల భారత, అఖిల ప్రపంచ చందమామ పాఠకులకు, అభిమానులకు, చందమామ పిచ్చోళ్లకు ఇందుమూలంగా తెలియజేయుచున్నది ఏమనగా…

చందమామ అతి త్వరలో పాత రూపంలోకి రాబోతోందొహో… ఆరునెలలుగా చందమామ పాఠకులను కలవరపెడుతున్న, కలత సృష్టిస్తున్న ఒక అతి పెద్ద సమస్యకు త్వరలో పరిష్కారం లభించబోతోంది.

60 సంవత్సరాలుగా రూటు మార్చకుండా పంథా విడవకుండా అవిచ్చిన్నంగా కొనసాగిన చందమామ పత్రిక లే అవుట్ యంగ్ జనరేషన్ అభిరుచులకు అనుగుణంగా  అన్ని రకాలుగా మార్పు చెందాలనే కొత్త పాలసీ చేపట్టింది.

తెలుగు జానపద చిత్రశైలితో దశాబ్దాలుగా పాఠకులను మంత్రముగ్దులను చేస్తున్న చిత్రా, వడ్డాది పాపయ్య, శంకర్ చిత్రాల స్థానంలో చందమామకు ఆధునిక రూపం తొడగాలని భావించిన యాజమాన్యం పాలసీ ప్రకారం, చందమామ తన చరిత్రను తానే అభాస చేసుకుని పాఠకుల తీర్పుకోసం బోనులో నిలబడింది.

ఆదునిక రూపం తొడుగుకున్నది మొదలుకొని కొత్త చందమామ గత నాలుగయిదు నెలలుగా పాఠకులు, అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటూ వచ్చింది.

సాధారణ పాఠకులు మినహాయిస్తే చందమామ  చరిత్రను తొలినుంచి నిశితంగా పరిశీలిస్తున్న సీరియస్ పాఠకులు, అంతకు మించి అభిమానులు చందమామ నూతన మార్పులను ఏ మాత్రం జీర్ణం చేసుకోలేకపోయారు.

యూనివర్శిటీ ప్రొఫెసర్లనుంచి వృద్ధ పాఠకాభిమానుల వరకు చందమామ రూపంలో, విషయంలో మార్పులను గత కొద్ది నెలలుగా ఎంతగా బండకేసి ఉతికారంటే ఇది సూర్యుడు ఎప్పుడూ తూర్పువైపునే ఉదయిస్తాడన్నంత నిజం.

నా కన్నబిడ్డను రేప్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవలసి వస్తోంది అని ఒకరు, నా బిడ్డ చనిపోయిందనుకుని ఇవ్వాళ్టినుంచి చందమామను పూడ్చి పెడుతున్నాను అని మరొకరు, చిత్రా, వపా, శంకర్ బొమ్మలు లేని చందమామ మాకు అవసరం లేదు చందా వెనక్కు పంపమని రాసిన వారు కొందరు, చందమామకు చందా కట్టి ఎంత మతిహీనమైన పని చేశాను అని కొందరు.

కేవలం ఆరు నెలలు. ఇంకా చెప్పాలంటే నాలుగు నెలలు… 60 ఏళ్ల చరిత్రను తృణప్రాయంగా మార్చి తెలుగు పాఠకుల ఓపికను పరీక్షించిన చందమామ నూతన రూపం, ఎట్టకేలకు చందమామ సాంప్రదాయక రూపాన్ని మోహిస్తున్న తెలుగు పాఠకుల, అభిమానుల ధర్మాగ్రహ జ్వాలల బారిన పడి అంతర్ధానమవుతోందా?

అవుననే చెప్పాలి. ‘పాఠకుల అబిరుచులకు దూరంగా జరిగే పత్రిక మనలేద’నే శ్రేయోభిలాషుల హెచ్చరికలను నిజం చేస్తూ త్వరలోనే చందమామ పాత రూపాన్నే తిరిగి తలకు ఎత్తుకోబోతోంది.

ఇది చందమామ పాఠకుల విజయం. చందమామ చరిత్రనే తారుమారు చేసేంత సమూల మార్పులకు గురవుతున్న కొత్త చందమామపై పాత తరం పాఠకులు సాగించిన సుదీర్ఘ విజయంలో  ఓ పెద్ద మలుపు ఇది. ఈ గొప్ప పరిణామంపై ఎవరు ఎలా వ్యాఖ్యానాలు చేసినప్పటికీ, అంతిమ సత్యం ఇదీ..

చందమామ…. తెలుగు జాతికి కథల దాహం తీర్చిన చందమామ… తెలుగు లోగిళ్లలో దశాబ్దాల పాటు కథల అమృతాన్ని వర్షిస్తూ దోబోచులాడిన చందమామ… వ్యవస్థాపకుటు చక్రపాణి అభిప్రాయాలను కూడా కొన్ని సందర్భాల్లో తోసిరాజని తన పంధాలో తాను నడిచిన చందమామ…

మీ చందమామ… మా చందమామ..

ఇకపై…..

మన ‘చందమామ’ లాగే ఉండబోతోంది.

RTS Perm Link


4 Responses to “మన చందమామ”

 1. సాయి ప్రవీణ్ on August 6, 2009 10:21 PM

  చాలా చక్కని, చల్లటి వార్త చెప్పారు. మీ నోట్లో పంచదార పొయాలని ఉంది.

 2. రవి on August 6, 2009 10:25 PM

  పొద్దునే చల్లటి వార్త చెప్పేను. ఆగస్టు చందమామ లొ 4 పేజీలు తమిళంలో వచ్చాయి. ఇంకా లోపల పేజీల్లో నచ్చని విషయాలు ఉన్నాయి. అన్నిటిని నా బ్లాగులో పెడదామనుకున్నాను. ఇంతలో ఈ వ్యాసం చూశాను.

  చందమామ స్థాయి ఇదివరకు లానే ఉంటుందని ఆశిస్తూ..

 3. Raja Sekhara Raju on August 7, 2009 12:12 AM

  ‘ఆగస్టు చందమామలో 4 పేజీలు తమిళంలో వచ్చాయి’

  మీ వ్యాఖ్య చూసి ఇప్పుడే కార్యాలయంలో ఉన్న చందమామ పత్రికలను తనిఖీ చేశాము. వీటిలో తమిళం లేని చందమామలే ఉన్నాయి. ప్రింటింగ్ పూర్తయ్యాక ప్యాకింగ్ జరిగేటప్పుడు పిన్నింగ్ సమయంలో భాష తెలియక తమిళ ఫారంని తెలుగు సంచికలో కుట్టేసి ఉంటారని ఇక్కడి అనుభవజ్ఞుల నిర్థారణ. ప్రస్తుతం చందమామ అన్ని భాషల ముద్రణ బొంబాయిలోనే జరుగుతోంది కాబట్టి భాష తెలీని వారు ఫారాలను పిన్ చేస్తున్న సందర్భంలో కొన్ని సంచికలు సంబంధిత భాష కాని ఇతర భాషా చందమామల ఫారాలను తమవిగా స్వీకరిస్తుంటాయంట. ఒక్కోసారి 16 పుటల ఫారం మొత్తంగా కూడా వేరే భాషలో వచ్చిన సందర్భాలు ఉన్నాయట.

  ఏది ఏమైనా తెలుగు చందమామలో తమిళ ఫారం జోడింపు జరిగి, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీకు వీలయితే మీరు కొన్న పుస్తకాల షాపులో వేరే ప్రతి ఇవ్వమని అడగగలరు. చందా కట్టి ఉన్నట్లయితే చందమామ మార్కెటింగ్ విభాగానికి చిన్న కార్డు ముక్క పంపి మీ సమస్య తెలిపితే వారు కొత్త కాపీని మీకు పంపగలరు. ఇవి కుదరని పనులు అని ఫీలయినట్లయితే మీ చిరునామా పంపిస్తే మేమే మీకు కొత్త కాపీని పంపించే ఏర్పాట్లు చేయగలం.

  అన్నిటికన్నా మించి.. తెలుగులో తమిళ చందమామతో (అంబులిమామ) మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించండి.

  ‘లోపలి పేజీల్లో నచ్చని విషయాలు ఉన్నాయి.

  దీనికి సంబంధించి కాస్త ఓపిక పట్టండి. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాం. మీ ఆదరణ, అభిరుచికి మించి చందమామకు కావలసింది ఏమీ లేదు. నచ్చని విషయాలు ఏవి ఉన్నా ఇలాగే వ్యాఖ్య పంపుతూ ఉండండి.

  మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి. ఇంగ్లీషులో అయితే మరీ మంచిది. విషయం వెంటనే Pass on అవుతుంది.

  కొన్ని విషయాలను అప్పటికప్పుడు కూడా సరి చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు తోడ్పడతాయి.

  ధన్యవాదాలు.

 4. Raja Sekhara Raju on August 7, 2009 12:27 AM

  ‘చల్లటి వార్త చెప్పారు. మీ నోట్లో పంచదార పొయాలని ఉంది.’

  అమ్మమ్మా.. నాకిప్పటికే మదుమేహం వచ్చేసింది. భరాయించుకోలేను కానీ… ఉదయాన్నే మీకు చల్లటి వార్తతో సంతోషపెట్టగలిగాము. అది చాలు. నిజంగానే పంచదార కాస్త నోట్లో వేసుకోవాలని ఉంది మీ వ్యాఖ్య చూశాక. అయితే ప్రపంచంలో కొన్ని ఉన్నాయని ఇకపై మర్చిపోవాలంటూ మా చెన్నయ్ గోడవున్ డాక్టర్ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసేశారు. ఏం చేసేది.

  మదుమేహ రోగులకు.. ప్రపంచంలో ఇవి లేవట.

  మామిడి, పనస, అరటి, సీతాఫలం, పళ్ల రసం, ఇతర తీపి పదార్ధాలు

  మరోవైపున మామిత్రుడు గంగాధర్ ఇలా వాపోతున్నారు. ” మామిడి పళ్లు, అరటి పళ్లు తినని బతుకూ బతుకేనా ప్రపంచంలో”.

  మీకూ సుగర్ వస్తే కానీ తెలియదు మా బాధ అనుకున్నాను.

  ఈ కథా కమామిషూ తెలుసుకోవాలంటే ఆన్‌లైన్ చందమామలోని కింది లింకును చూడండి.

  http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&&stId=1896

  చందమామతో మీ జ్ఞాపకాలను పాఠకులకు పంచుకోదలిచారా? అయితే..
  మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.

  చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
  http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind