మన చందమామ

August 6th, 2009

అఖిలాంధ్ర, అఖిల భారత, అఖిల ప్రపంచ చందమామ పాఠకులకు, అభిమానులకు, చందమామ పిచ్చోళ్లకు ఇందుమూలంగా తెలియజేయుచున్నది ఏమనగా…

చందమామ అతి త్వరలో పాత రూపంలోకి రాబోతోందొహో… ఆరునెలలుగా చందమామ పాఠకులను కలవరపెడుతున్న, కలత సృష్టిస్తున్న ఒక అతి పెద్ద సమస్యకు త్వరలో పరిష్కారం లభించబోతోంది.

60 సంవత్సరాలుగా రూటు మార్చకుండా పంథా విడవకుండా అవిచ్చిన్నంగా కొనసాగిన చందమామ పత్రిక లే అవుట్ యంగ్ జనరేషన్ అభిరుచులకు అనుగుణంగా  అన్ని రకాలుగా మార్పు చెందాలనే కొత్త పాలసీ చేపట్టింది.

తెలుగు జానపద చిత్రశైలితో దశాబ్దాలుగా పాఠకులను మంత్రముగ్దులను చేస్తున్న చిత్రా, వడ్డాది పాపయ్య, శంకర్ చిత్రాల స్థానంలో చందమామకు ఆధునిక రూపం తొడగాలని భావించిన యాజమాన్యం పాలసీ ప్రకారం, చందమామ తన చరిత్రను తానే అభాస చేసుకుని పాఠకుల తీర్పుకోసం బోనులో నిలబడింది.

ఆదునిక రూపం తొడుగుకున్నది మొదలుకొని కొత్త చందమామ గత నాలుగయిదు నెలలుగా పాఠకులు, అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటూ వచ్చింది.

సాధారణ పాఠకులు మినహాయిస్తే చందమామ  చరిత్రను తొలినుంచి నిశితంగా పరిశీలిస్తున్న సీరియస్ పాఠకులు, అంతకు మించి అభిమానులు చందమామ నూతన మార్పులను ఏ మాత్రం జీర్ణం చేసుకోలేకపోయారు.

యూనివర్శిటీ ప్రొఫెసర్లనుంచి వృద్ధ పాఠకాభిమానుల వరకు చందమామ రూపంలో, విషయంలో మార్పులను గత కొద్ది నెలలుగా ఎంతగా బండకేసి ఉతికారంటే ఇది సూర్యుడు ఎప్పుడూ తూర్పువైపునే ఉదయిస్తాడన్నంత నిజం.

నా కన్నబిడ్డను రేప్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవలసి వస్తోంది అని ఒకరు, నా బిడ్డ చనిపోయిందనుకుని ఇవ్వాళ్టినుంచి చందమామను పూడ్చి పెడుతున్నాను అని మరొకరు, చిత్రా, వపా, శంకర్ బొమ్మలు లేని చందమామ మాకు అవసరం లేదు చందా వెనక్కు పంపమని రాసిన వారు కొందరు, చందమామకు చందా కట్టి ఎంత మతిహీనమైన పని చేశాను అని కొందరు.

కేవలం ఆరు నెలలు. ఇంకా చెప్పాలంటే నాలుగు నెలలు… 60 ఏళ్ల చరిత్రను తృణప్రాయంగా మార్చి తెలుగు పాఠకుల ఓపికను పరీక్షించిన చందమామ నూతన రూపం, ఎట్టకేలకు చందమామ సాంప్రదాయక రూపాన్ని మోహిస్తున్న తెలుగు పాఠకుల, అభిమానుల ధర్మాగ్రహ జ్వాలల బారిన పడి అంతర్ధానమవుతోందా?

అవుననే చెప్పాలి. ‘పాఠకుల అబిరుచులకు దూరంగా జరిగే పత్రిక మనలేద’నే శ్రేయోభిలాషుల హెచ్చరికలను నిజం చేస్తూ త్వరలోనే చందమామ పాత రూపాన్నే తిరిగి తలకు ఎత్తుకోబోతోంది.

ఇది చందమామ పాఠకుల విజయం. చందమామ చరిత్రనే తారుమారు చేసేంత సమూల మార్పులకు గురవుతున్న కొత్త చందమామపై పాత తరం పాఠకులు సాగించిన సుదీర్ఘ విజయంలో  ఓ పెద్ద మలుపు ఇది. ఈ గొప్ప పరిణామంపై ఎవరు ఎలా వ్యాఖ్యానాలు చేసినప్పటికీ, అంతిమ సత్యం ఇదీ..

చందమామ…. తెలుగు జాతికి కథల దాహం తీర్చిన చందమామ… తెలుగు లోగిళ్లలో దశాబ్దాల పాటు కథల అమృతాన్ని వర్షిస్తూ దోబోచులాడిన చందమామ… వ్యవస్థాపకుటు చక్రపాణి అభిప్రాయాలను కూడా కొన్ని సందర్భాల్లో తోసిరాజని తన పంధాలో తాను నడిచిన చందమామ…

మీ చందమామ… మా చందమామ..

ఇకపై…..

మన ‘చందమామ’ లాగే ఉండబోతోంది.

RTS Perm Link