“చందమామ”తోటే “చంద్ర మహాదశ”

August 5th, 2009

 

చందమామ

చందమామ

చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.

చందమామను బి.నాగిరెడ్డి – చక్రపాణి(వీరు తెలుగు, తమిళ బాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) 1947 జూలైలో ప్రారంభించారు.

కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం , ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 – 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా.

టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్‌లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు.

చందమామ అందంగా రూపొందడానికి గల మరో కారణం నాణ్యమైన ముద్రణ. నాగిరెడ్డి తన తమ్ముడైన బి.ఎన్.కొండారెడ్డి (ఈయన మల్లీశ్వరి లాంటి కొన్ని సినిమాలకు కెమెరామాన్‌గా పని చేశాడు) పేరుతో నడుపుతున్న బి.ఎన్.కె. ప్రెస్సులోనే మొదటినుంచి చందమామ ముద్రణ జరుగుతూ వచ్చింది.

(ఇప్పుడు కలకత్తాకు చెందిన జియోదెశిక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆధ్వర్యంలో చందమామ ముద్రణ పూర్తిగా బొంబాయికి తరలిపోయింది. ఈ సెప్టెంబర్ నుంచి చందమామ అన్ని భాషల ప్యాకింగ్ కూడా టోకున బొంబాయికి తరలిపోతోంది. ముద్రణ బొంబాయిలో, ప్యాకింగ్ చెన్నయ్‌లో జరుగుతున్న మార్కెట్ పరమైన అసంబద్దతను యాజమాన్యం ఇలా పరిష్కరించిందన్నమాట.)

నాగిరెడ్డి అతి ప్రతిభావంతంగా నడిపిన బి.ఎన్‌.కె.ప్రెస్‌ “చందమామ”ను అందంగా ముద్రిస్తూ ఉండేది. ఎన్నో కొత్త రకం అచ్చు యంత్రాలను మనదేశంలో మొట్టమొదటగా నాగిరెడ్డి కొని వాడడం మొదలుపెట్టాడు. ఈ విధంగా చక్రపాణి “సాఫ్ట్‌వేర్‌”కు నాగిరెడ్డి “హార్డ్‌వేర్‌” తోడై “చందమామ”ను విజయవంతంగా తీర్చిదిద్దింది.

అసలు చక్రపాణికి నాగిరెడ్డి పరిచయమైంది ఈ ప్రెస్సులోనే. శరత్ వ్రాసిన బెంగాలీ నవలలకు తాను చేసిన తెలుగు అనువాదాలను ప్రచురించే పని మీద చక్రపాణి అక్కడికి వచ్చాడు. తర్వాత నాగిరెడ్డి-చక్రపాణి పేర్లు స్నేహానికి పర్యాయపదంగా నిలిచిపోవడం చరిత్ర.

భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి.

దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి

ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, వెయ్యిన్నొక్క రాత్రులు(అరేబియన్‌ నైట్స్‌), ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని షేక్‌స్పియర్‌ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు.

ఇవికాక గ్రీక్‌ పురాణాలైన ఇలియడ్‌, ఒడిస్సీ, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ చందమామలో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలేగాక ఇతర భాషా సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి. చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దలైన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు

చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుతో(గా) మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతినెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టమైన ఈ పనిని, దశాబ్దాలపాటు నిరాఘాటంగా కొనసాగించడం చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం.

మొదటి బేతాళ కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల ఆసక్తిని గమనించి గాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జులై, 1972లో మొదటి బేతాళ కథను రంగుల్లో పునర్ముద్రించారు. మరి కొన్ని పిల్లల పత్రికలు బొమ్మరిల్లు వంటివి ఇదేపద్ధతిలో కథలను (కరాళ కధలు) సృష్టించడానికి ప్రయత్నించాయి గాని, అంతగా విజయం సాధించలేదని చెప్పవచ్చు.

జానపద కథలకు చందమామ కాణాచి. చందమామ కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి. చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు. ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి. రాజులూ, వారి రాజ్యాలూ, రాజకుమారులూ, రాజకుమార్తెలూ, వారి స్వయంవరాలు, వారి సాహసాలు, మంత్రుల తెలివితేటలు, పరిపాలనా దక్షత, విదూషకుల హాస్యం/చురుకైన బుధ్ధి, ప్రభువుల విశాల హృదయం మరియు ముందుచూపు, జానపదులు, వారి అమాయకత్వంవంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజ పరిచాయి.

చందమామలోని మరో ప్రత్యేకత – తేనెలూరే తియ్యటి తెలుగు. అసలు ఏ భారతీయ భాషైనా నేర్చుకోవడానికి ఆ భాషలోని చందమామ చదవడం ఉత్తమ మార్గం అనడం అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. కథ, కథకి సంబంధించిన బొమ్మలు ఎలా ఉండాలో, ఏ నిష్పత్తిలో ఉండాలో చక్కగా చేసి చూపించి, మిగిలిన పత్రికలకు మార్గదర్శకమైంది. చందమామ శైలిని, ఒరవడిని, ఇతరులు అనుకరించడం లేదా అనుసరించడం చెయ్యగలిగారుగాని, కొత్త శైలినిగాని ఒరవడినిగాని ఇంతవరకు సృష్టించలేక పోయారు

చందమామ సంస్థాపకుడు చక్రపాణి కాగా సంచాలకుడు నాగిరెడ్డి. చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణిదే. 1975లో చనిపోయే వరకూ ఎనలేని సేవచేశాడు. అనంతరంనాగిరెడ్డి కుమారుడైన విశ్వనాధ రెడ్డి దాదాపు 33 ఏళ్లపాటు చందమామ వ్యవహారాలు చూస్తూ, సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

చందమామ సంపాదకుల వ్యాఖ్యలు

“బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. -కొడవటిగంటి కుటుంబరావు

క్లుప్తంగా, ఏ విధమైన యాసా చోటు చేసుకోకుండా సూటిగా సాగే కుటుంబరావు శైలిని చక్రపాణి “గాంధీగారి భాష” అని మెచ్చుకునేవాడట. ఇంకెవరు రాసినా ఆయనకు నచ్చేది కాదు.

కొడవటిగంటి కుటుంబరావు స్వయంగా పేరొందిన కథా/నవలా రచయిత కావటంవల్ల, ఆయన చందమామను సర్వాంగసుందరమైన ఆకర్షణీయ పత్రికగా, ప్రతి మాసం మలచేవాడు. దీనికి తోడు, ఎంతో కళా దృష్టి ఉన్న చక్రపాణి పర్యవేక్షణ ఎంతగానో ఉపకరించేది. కథలలో ఎక్కడా అసంబద్ధమైన విషయాలు ఉండేవి కావు. ప్రతి కథా చాలా సూటిగా, కొద్ది పాత్రలతో మంచి విషయాలతో నిండి ఉండేది.

చందమామలో దాదాపు మొదటినుంచీ ఉన్నవారిలో దాసరి సుబ్రహ్మణ్యం ఒకరు.మొదటి రంగుల సీరియల్‌ ఆయన ప్రత్యేకత. తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే. ఎందుచేతనో చక్రపాణికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు. పాఠకులకు మాత్రం అవి చాలా నచ్చేవి. ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్‌ తగ్గింది. దాంతో దాసరివారికి మళ్ళీ పనిపడింది. చక్రపాణి అభిరుచి, పాఠకుల అభిరుచి వేరని తేలిపోయింది.

“చందమామ”కు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి. చక్రపాణి అంతవరకూ ఏ పత్రికలోనూ లేని విధంగా చందమామలో ప్రతి పేజీ లోనూ ఒక బొమ్మ వచ్చేటట్లు, కథ సరిగ్గా గీత గీసినట్లు బొమ్మ దగ్గరే ముగిసేటట్లు శ్రద్ధ తీసుకున్నాడు. తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలన్నీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. కాగా అరవయ్యేళ్ల తర్వాత చందమామే ఇప్పుడు ఆ పద్ధతిని తోసిరాజంటోంది.

“చందమామ” ప్రజాదరణ పొందడానికి చాలా కారణాలుండేవి. మొదటిది కథల ఎంపిక, రెండోది కథనశైలి, మూడోది బొమ్మల అందాలు, నాలుగోది ఉత్తమమైన ప్రింటింగ్‌ క్వాలిటీ. ప్రతి కథనూ చక్రపాణిగారు “అప్రూవ్‌” చెయ్యాలి. సామాన్యంగా ఆయనకు నచ్చనివి తక్కువగానే ఉండేవి. అప్పుడప్పుడూ ప్రజల తిరుగుబాటువంటి లెఫ్టిస్టు అంశాలుంటే ఆయన తీసేయించేవాడు. అందులో ఆయనకు కమ్యూనిస్టు వాసన అనిపించేదేమో. సస్పెన్స్‌ పేజీ కూడా ఆయనకు నచ్చక మాన్పించాడు.

నాగిరెడ్డిగారు యజమాని అయినప్పటికీ పత్రిక వ్యవహారాలన్నీ చక్రపాణికే వదిలేసేవారు. నాగిరెడ్డిగారు అతి ప్రతిభావంతంగా నడిపిన బి.ఎన్‌.కె.ప్రెస్‌ “చందమామ”ను అందంగా ముద్రిస్తూ ఉండేది. ఎన్నో కొత్త రకం అచ్చు యంత్రాలను మనదేశంలో మొట్టమొదటగా నాగిరెడ్డిగారే కొని వాడడం మొదలెట్టారు. ఈ విధంగా చక్రపాణిగారి “సాఫ్ట్‌వేర్‌”కు నాగిరెడ్డిగారి “హార్డ్‌వేర్‌” తోడై “చందమామ”ను విజయవంతంగా తీర్చిదిద్దింది.

కక్కయ్యకు (కొకు),చక్రపాణికి ఏర్పడ్డ మైత్రి ఒక అపూర్వ విశేషంగా పెంపొంది, ఉభయుల అంత్యదశల వరకు ప్రాణప్రదంగా వీరివెంట వచ్చింది. ఇది ఒకరి మేధస్సులను ఒకరు తెలుసుకున్నందువల్లనే సాధ్యమైంది. చక్రపాణి గాఢమైన సాహిత్యప్రియుడు, రచయిత. ఆయన శరత్ చంద్ర చటోపాధ్యాయ, రవీంద్రనాథ మైత్రా, తారాశంకర బెనర్జీ తదితరుల రచనలు తర్జుమా చేసి ‘యువ’ ప్రచురణలనే పేర పుస్తకాలు ముద్రించటం సాగించాడు. కక్కయ్య కథల పుస్తకాలు కూడా చక్రపాణి ద్వారానే మొదట అచ్చయ్యాయి.

చక్రపాణిగారి “చాదస్తాలు” ఒక కొత్త ఒరవడిని సృష్టించాయనడంలో సందేహం లేదు. ప్రతి పేజీకీ బొమ్మ ఉండడం, బొమ్మల సరిహద్దుల్లో కథలన్నీ ఇమిడిపోవడం అంతకు మునుపెన్నడూ ఏ పత్రికలోనూ ఉండేది కాదు. ఇందుకుగాను కథల మాటలను సరైన పొడవుకు కత్తిరించే దర్జీ పని చాలా ఉండేది. కథ సరిగ్గా బొమ్మ వద్దే పూర్తయేది. అర అంగుళం ఎడం కూడా మిగిలేది కాదు.

చక్రపాణి గారికున్న పట్టింపుల్లో మరొకటి విచిత్రమైనది. పత్రిక మధ్య పేజీలో (స్టేప్‌ల్‌ ఉండేది) ఎడమ పేజీలో కథ పూర్తవకూడదు. కథల క్రమం ఎలాగైనా మార్చి మధ్య పేజీలు రెండింటిలోనూ ఒకే కథ కొనసాగేట్టు చూడాలి. ఎడిటర్లకు ఇదొక తలనొప్పిగా ఉండేది. 1975లో ఒకసారి ఈ పొరబాటు జరగనే జరిగింది. ఇది సరిదిద్దుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూండగానే అదే నెల చక్రపాణిగారు చనిపోయారు. సంచిక అంతా తయారయిపోయింది కనక ఆయన గురించి మా నాన్నగారు నాలుగు పేజీలు రాసి, ఆ కాగితాన్ని మధ్యపేజీగా సంచికలోకి చేర్చవలసి వచ్చింది. ఆ విధంగా చక్రపాణిగారి కోరికా నెరవేరింది.

అసలు “చందమామ” పిల్లల పత్రికేనా అనే అనుమానం కూడా వ్యక్తం చేసినవారున్నారు. ఎందుకంటే అందులోని కథలు అందరూ చదవదగినవే. ఏది ఏమైనా తెలుగు బాలసాహిత్యం జాతకంలో “చంద్ర మహాదశ” వంటిదేదో “చందమామ”తోనే మొదలైనట్టుగా అనిపిస్తుంది. దాని ధాటికి అంతకు ముందు వచ్చిన “బాల”, తరవాత మొదలైన “బాలమిత్ర” వగైరా పత్రికలేవీ నిలవలేకపోయాయి. తెలుగులో “చందమామ”కు పోటీయే ఉండేది కాదు. ఇప్పటికీ అది అందరికీ అభిమాన పత్రికే.

మూలం:
రోహిణీ ప్రసాద్ వ్యాసం – చందమామ జ్ఞాపకాలు
వికీపీడియాలో వ్యాసం – చందమామ
మాధవపెద్ది గోఖలే వ్యాసం – భావవిప్లవకారుడు కొడవటిగంటి

RTS Perm Link