చేతికందిన “చందమామ”

August 4th, 2009
చందమామ

చందమామ

“…తెలుగు రచయితగా, పత్రికా సంపాదకులుగా, సినీ నిర్మాతగా, దర్శకుడిగా పలు విభిన్న పార్శ్వాలను కలిగి ఉన్న బహుభాషావేత్త చక్రపాణి. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరైన చక్రపాణిగారు… కష్టపడితే ఫలితం ఉంటుందన్న ప్రాథమిక సూత్రాన్ని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి.

తనదైన ఓ ప్రత్యేక తెలుగు నుడికారంతో శరత్‌బాబు బెంగాలీ నవలను అనువాదం చేసిన చక్రపాణి… ఆ తెలుగు నవలా రచయిత శరత్ అనే అందరూ అనుకునేటట్లు, తను బెంగాలీ కుటుంబాలతో ఉన్నట్లుగా భ్రమింపజేశారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో, ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఈయన తగినంత పాఠశాల విద్య లేకపోయినా, తన సుదీర్ఘ సాధనచేత నాలుగైదు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. తన కలంపేరునే సొంత పేరుగా చేసుకున్న చక్రపాణిగారి జన్మదినం నేడు.(ఆగస్టు 5) ఈ సందర్భంగా ఆయన స్మృతిలో…

చక్రపాణిగారు, నాగిరెడ్డిగారు కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి… అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక వారిద్దరూ కలసి 1945లో ప్రారంభించిన ఆంధ్రజ్యోతి పత్రిక, 1947 జులైలో పిల్లల కోసం ప్రారంభించిన చందమామ జయప్రదం అయ్యాయి. నాగిరెడ్డి, చక్రపాణిల పేర్లు తెలుగు దేశమంతా మార్మోగాయి.

చందమామ ఈ రోజు పన్నెండు భారతీయభాషల్లో అపూర్వమైన రీతిలో ప్రచురించబడటానికి చక్రపాణిగారు వేసిన బలమైన పునాదులే కారణంగా చెప్పవచ్చు. అంతేగాకుండా, యువ ప్రచురణల ద్వారా చౌకధరలకు ఉత్తమసాహిత్యాన్ని అందించి ప్రజానీకంలో సాహిత్య విలువలను పెంచిన వ్యక్తిగా ఆయన సేవలు అజరామరం. తను సృష్టించిన ప్రతి పాత్ర, రచయితగా ఆయన కలం నుండి వెలువడిన ప్రతిమాట తెలుగువారి నిత్య జీవితాల్లోనుంచే వెలికితెచ్చి, ప్రజలకు ప్రీతిపాత్రుడయ్యారు.

రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా తన బహుముఖ ప్రజ్ఞాపాటవాలను తెలుగు ప్రజలకు రుచి చూపించి, “చేతికందిన చందమామ”గా పిల్లల హృదయాలలో సైతం చోటు సంపాదించిన శ్రీ చక్రపాణి సెప్టెంబరు 24, 1975 సంవత్సరంలో పరమపదించారు. చక్రపాణిగారి ఖచ్చితమైన కాలిక్యులేషన్, కఠోర పరిశ్రమ, నిబద్ధత, తన మీద తనకు గల అచంచల విశ్వాసాలే… తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాత, దర్శకుల్లో ఒకరిగా ఆయనని నిలబెట్టింది.

అరమరికలు, దాపరికాలు చక్రపాణిగారికి గిట్టవు. చెప్పదలుచుకుంది కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పటం ఆయన స్వభావం. ఇతరులు ఏమనుకుంటారోనన్న భావం వీరికి ఏ కోశానా ఉండేది కాదు. భేషజాలు లేని అమృత హృదయుడు. తనలో ఎన్ని బాధలున్నా.. అన్నీ దాచుకుని లోకానికి చల్లని ప్రశాంతమైన చిరునవ్వుల్ని ప్రసాదించిన స్తితప్రజ్ఞుడీయన…..”

(‘చందమామ’ను తెలుగుజాతి చేతికందించిన చక్రపాణి గారి జన్మదినం సందర్భంగా వెబ్‌దునియా తెలుగు వెబ్‌సైట్ ప్రచురించిన కథనంలో కొంత భాగాన్ని ఇక్కడ పొందుపర్చాము.  చక్రపాణిగారిపై వెబ్‌దునియా పూర్తి పాఠం చదవాలంటే కింది రెండు లింకులను తెరవండి.)

http://telugu.webdunia.com/miscellaneous/kidsworld/gk/0908/04/1090804089_1.htm

http://telugu.webdunia.com/miscellaneous/kidsworld/gk/0908/04/1090804089_2.htm

RTS Perm Link


5 Responses to “చేతికందిన “చందమామ””

 1. subhadra on August 4, 2009 3:33 PM

  గుడ్ ఒన్…
  చిన్నప్పుడూ నాకు చాలా ఇశ్ట౦ చ౦దమామ అ౦టే…దొరికితే ఇప్పుడు చదువుతా

 2. chandamamalu on August 4, 2009 4:02 PM

  తప్పకుండా చదవండి. సంతోషం.. దన్యవాదాలు

 3. kcubevarma on August 4, 2009 7:15 PM

  ఇప్పటికీ చందమామ పుస్తకం ముట్టుకుంటే చాలు రెక్కల గుఱ్రంపై ఏడేడులోకాల విహరించిన రాజకుమారుడ్ని ఐపొతా. చందమామను చేతికందించిన రాకుమారుడు కీ. శే. శ్రీ చక్రపాణి గారికి నా హృదయాంజలి.

 4. ravichandra on August 4, 2009 8:50 PM

  నాగిరెడ్డి, ఈయన కారణ జన్ములు. తెలుగు నేటివిటీ కు అనుగుణంగా సినిమాలు ఎలా తీయాలి అనే విషయంలో ఒక బెంచ్ మార్కింగ్ ను క్రియేట్ చేశారు.

 5. చందమామ on August 6, 2009 12:36 AM

  ఔను సుమా..
  నిజం.. నిజం..
  మీరన్నది
  నిజం నిజం.

  “రెక్కల గుఱ్రంపై ఏడేడులోకాల విహరించిన రాజకుమారుడ్ని ఐపోతా” ఎంత చక్కటి ఊహ. ప్రపంచానికి హ్యారీ పోటర్‌లు ఎవరో తెలియని కాలంలో 60 ఏళ్ల క్రితం చందమామ ఇలాంటి గొప్ప కల్పనలు, భావుకత్వం తోటే రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రసీమలో వచ్చిన జానపద, పౌరాణిక సినిమాలు అన్నింటికీ ప్రేరణ చందమామ అని చెప్పుకున్నా అతిశయోక్తి కాదు. ఒక పాతాళ భైరవి, గులేబకావళి కథ, మాయాబజార్, ఇంకా ఎన్టీరామారావు నటించిన బోలెడు జానపద సినిమాలు చూస్తే తెలుగు కథ ఎన్నెన్ని ఊహలు అల్లుకుందో, ఎన్నెన్ని ఊసులు చెబుతూ వచ్చిందో అర్థమవుతుంది. చందమామ.. నిజంగా…మన చందమామే.. ఇలాంటి మాంత్రిక ఊహలను భూమ్మీదికి తీసుకొచ్చింది. ‘ఇలా జరిగితే ఎంత బాగుండు’ అనే ఊహా స్వప్నం కథ చదివిన పాఠకులకు కలగడం, కలిగించడమే కథ విజయం. సరిగ్గా చందమామ సాధించిన విజయం కూడా ఇదే. ఈ విజయ మంత్రాన్నిఎవరు పాటించినా వారికి తిరుగులేదు. ఇది కథల సాక్షిగా చందమామ చెప్పిన సత్యం.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind