తరగని తీపి అనుభవం చందమామ

August 3rd, 2009

చందమామని చూపిస్తూ అమ్మ తినిపించే గోరుముద్దలు, రాముడు మారాం చేస్తె కంచంలొ చందమామను భువికి దించిన కథ మన అందరికి చందమామ తోటి మొదటి మరపురాని తీపి పరిచయం. చందమామ పుస్తకం కూడా అలాంటి మరువలేని తీపి అనుభవమే, ఇది వయసు పెరిగినా తరగని తీపి అనుభవం.

చందమామతో నా మొదటి జ్ఞాపకాలు ఇవీ.. నా చిన్నప్పుడు ఇంకా నాకు చదవటం పూర్తిగా రాని వయసులో నేను ప్రతి నెల చందమామ పుస్తకం కోసం కళ్లు కాయలు కాసేలాగ వేచి ఉండటం, పుస్తకం రాగానే, అమ్మని చదివి చెప్పమని విసిగించడం. ఇంటి పని పూర్తి అయ్యాక రాత్రి పడుకునేటప్పుడు అమ్మ ఒడిలొ కూర్చొ పెట్టుకుని రోజుకి ఒక కథ చొప్పున వినిపించటము….

అమ్మ ప్రేమతొ కుడిన ఆ చందమామ జ్ఞాపకాలు ఎన్నటికీ మరచి పోలేము.

తెలుగు నేర్చుకోవటానికి మొదటి స్పూర్తి చందమామ అని చెపితే అది అతిశయోక్తి అనిపించుకోదు. నలభై ఏళ్ల తరువాత ఈరోజుకి కూడ ప్రతి నెల ఎక్కడ ఉన్నా చందమామ కోసం ఎదురు చూస్తాను. చందమామలొ 25 ఏళ్ల నాటి కథ చదివినప్పుడల్లా ఆ చిన్ననాటి తీపి గుర్తులు మనసును కదల్చి వేస్తాయి.

నా ఇన్నేళ్ల అనుభవం బట్టి చెబుతున్నా. 60 ఏళ్ల పైబడిన చందమామ.. నేను గమనించినంత వరకు ప్రపంచ సాహిత్యంలో ఇంత గొప్ప పత్రిక మరొకటి లేదు. కొన్ని తరాల ప్రజలమీద ఇంతటి ప్రభావం చూపిన పత్రిక మరొకటి నేను చూడలేదు. తెలుగులో, ఇతర భాషల్లో పిల్లల పత్రికలు చాలానే ఉన్నాయనడంలో సందేహం లేదు.

కానీ, 60 ఏళ్లుగా చందమామలా నాణ్యమైన కథలు, రచనలు నిరంతరంగా అందిస్తూ వస్తున్న పత్రిక ప్రపంచంలో మరొకటి లేదనే నా అభిప్రాయం. ఇంతటి చరిత్ర ఉన్న చందమామ ఆన్‌లైన్‌లో కూడా వస్తుండటం సంతోషకరం. ఆన్‌లైన్ చందమామ కూడా ప్రింట్ చందమామలా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నా.

రచయిత:  బివి ఫణి

కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్

నోట్‌: కాన్పూర్‌ ఐఐటి ప్రొఫెసర్ బివి ఫణిగారితో పరిచయమే గమ్మత్తుగా జరిగింది. చెన్నయ్‌లో చదువుతున్న వారి అమ్మాయి మానస ఈ వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు చందమామలో అప్రెంటిస్‌గా పనిచేసినప్పుడు మాటల సందర్భంలో నాన్నకు చందమామ అంటే ప్రాణం అని చెప్పారు. ఇక ఉండబట్లలేక  ఫణిగారి ఇమెయిల్ ఐడి తీసుకుని చందమామ జ్ఞాపకాలు పంవవలసిందిగా కోరడమైంది.

ఈ మెయిల్ చూసుకున్నది తడవుగా ఆయన వెంటనే కాన్పూర్ నుంచి ఫోన్ చేసి చందమామతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. పసిపిల్లాడిలాగా చందమామతో తన అనుబంధం, అమ్మ చెప్పిన చందమామ కథల గురించి రెండు నెలల క్రితం ఆయన ఫోన్ ద్వారా మాట్లాడిన మాటలు ఇప్పటికీ సజీవ జ్ఞాపకంలా వినిపిస్తున్నాయి.

తర్వాత బిజీ అకడమిక్ షెడ్యూల్ మధ్యలోనే తీరిక చేసుకుని ఆయన క్లుప్తంగా చందమామ గురించి తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈమెయిల్ పంపారు. ఆయన ఆరోజు ఫో‌న్‌లో మాట్లాడినవి, ఈమెయిల్‌లో పంపినవి కలిపి “తరగని తీపి అనుభవం చందమామ” పేరిట ఆన్‌లైన్ చందమామలో పోస్ట్ చేయడం జరిగింది.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=1907

బీవీ ఫణిగారి చందమామ జ్ఞాపకాలను చందమామ అభిమానులకోసం ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేయడమైంది.

కృతజ్ఞతలు ఫణిగారూ.. ఊహించని సందర్భంలో మీరు సత్వరం స్పందించి చందమామ జ్ఞాపకాలను పంపినందుకు ధన్యవాదాలు. మిడిల్ ఈస్ట్ నుంచి తిరిగి వచ్చాక ఆర్థిక తదితర అంశాలపై చిన్ని చిన్ని రచనలు పంపుతామని మీరు ఆరోజు చెప్పారు. ఎదురు చూస్తున్నాం.

మానస ఈమధ్య అకడమిక్ ఒత్తిళ్లలో పడి చందమామలో సైన్స్ రచనలు (విశ్వం) పంపడం తగ్గింది. వీలు చూసుకుని ఏదయినా రాయమని తనకు చెప్పండి. ఒక అనుహ్య క్షణంలో ఒకే కుటుంబంలో తండ్రీ కుమార్తె ఇద్దరూ ఆన్‌లైన్ చందమామతో అనుబంధంలోకి రావడం నిజంగా చెప్పలేని సంతోషాన్నిస్తోంది మాకు.

చందమామతో మీ ఈ అనుబంధం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…

రాజశేఖర్

మా చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము. చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు ఇదే మా ఆహ్వానం.

ఆ రోజుల్లో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు.  వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్ వివరాలను కూడా పంపగలరు.

abhiprayam@chandamama.com

చందమామ పాతసంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

RTS Perm Link