మచ్చరకోశియుడి పిసినారితనం

August 31st, 2009
మచ్చరకోశియుడు

మచ్చరకోశియుడు

చాలామంది పిసినారులను చూసే ఉంటాం. కానీ మచ్చరకోశియుడి తరహా పిసినారితనం గురించి మీరు ఇంతకు ముందెన్నడూ ఎరిగిఉండరు.

ఈ మచ్చరకోశియుడు, అతడి కథా కమామిషు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

అయితే ఈ వారం ఆన్‌లైన్ చందమామ జాతక కథను కింది లింకులో చదివి ఆనందించండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2159&pg=1

RTS Perm Link

చందమామ పాత కాపీలు దొరికాయోచ్

August 30th, 2009
భీష్మార్జునులు

భీష్మార్జునులు

చందమామ పిల్లల కథల పత్రికగా మొదలై ‘సాహిత్యాభిలాషలో పిన్నలకూ, పెద్దలకూ, స్త్రీలకూ, పురుషులకూ ఉండే వ్యత్యాసాలను సరిచేసిన పత్రిక’ గా, కుటుంబంలోని అందరి పత్రికగా 50 ఏళ్ల క్రితమే చరిత్రకెక్కిన విషయాన్ని 1960 జూన్ చందమామ సంపాదకీయం ఆధారంగా నా బ్లాగులో ‘అందరి చందమామ’ పేరుతో ఇవాళ ఓ కథనం పోస్ట్ చేశాను.

జలుబు, జ్వరంతో అన్ని పనులు మానుకుని విశ్రాంతిగా ఉండగా ‘చంపి’ సభ్యురాలు సుజాత గారు ఓ చల్లటి వ్యాఖ్య ఈ సాయంత్రం పంపారు. దాన్ని వ్యాఖ్యలాగా కథనం లోపల ఉంచటం కన్నా చందమామ అభిమానులందరూ పంచుకునేలా చేస్తే బాగుంటుందని భావిస్తూ ఇక్కడ ‘చందమామ పాత కాపీలు దొరికాయోచ్’ అనే పేరిట కొత్త కథనం పోస్ట్ చేస్తున్నాను. 1968-74 కాలం నాటి చందమామలు భద్రంగా దొరకడం అంటే మాటలా… ఈ గొప్ప వార్తను మీరూ చదవండి మరి…

Comment by సుజాత — 08/30/2009 @ 7:58 am |

రాజు గారు,
నిన్న మా చెల్లెలుతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా మాటల మధ్యలో బ్లాగుల్లో చందమామ గురించి, చంపిల గురించి చెప్పాను. అప్పుడు తను ‘ఎవరికీ చెప్పనంటే ఒక విషయం చెప్తాను”అంటు తన వద్ద 1968-74 మధ్య కాలం నాటి చందమామలు కొన్ని ఉన్నాయని చెప్పి మతి పొగొట్టింది. కనీసం చూడ్డానికైనా ఇవ్వమని అడిగాను. చందమామల విషయంలో ఎవ్వర్నీ(నన్ను ఐనా సరే) నమ్మనంటూనే ఎలాగో ఒప్పుకుంది. త్వరలో వాటిని చూడ్డమే కాక, చదువుతాను కూడా! సంతోషం పట్టలేక ఇక్కడ పంచుకుంటున్నా!

ప్రతి వ్యాఖ్య
అమ్మా సుజాతమ్మ తల్లీ,
నాకు మతి పోతోందిక్కడ ఈ వార్త వింటూంటే. 68-74 చందమామలా? ఆహా… ఎంత గొ్ప్ప నిధి దొరికింది మీకు. అవి అలాగే జిరాక్స్ చేసి కాపీకి ఇంత అని అమ్మకం పెట్టినా అలాగే కొనేసేందుకు చాలామందే సిద్ధంగా ఉంటారు. అదేదో మీ చెల్లెలికి చెప్పి ఆ ఏర్పాట్లేవో మీరే చేస్తే బాగుంటుందేమో కదా. ఎంత మంచి వార్త.

10 రోజులు క్రితం చందమామ ప్రింట్ ఆన్ డిమాండ్ పాలసీ అమలు కావడం లేదు అని చెప్పి మీ అందరినీ నిరాశపర్చాను. కాని ఇప్పుడు అందుకు భిన్నమైన వార్త చెబుతున్నా. 60 సంవత్సరాల చందమామల డీటీపీ వర్క్ త్వరలోనే మొదలు కావచ్చు. అది పూర్తయిందంటే కోరిన వారికి కోరిన పాత చందమామలను ముద్రించి ఇచ్చే పని ఆమల్లోకి వస్తుంది. దీనికి మహా అంటే మరో 4 నెలల సమయం పడుతుందని అంచనా. అలాగే దాసరి సుబ్రహ్మణ్యం గారి 12 ధారావాహికలను విడివిడిగా ముద్రించి చందమామ ప్రచురణల పేరిట పాఠకులకు అందివ్వమని మా యాజమాన్యానికి ప్రతిపాదించబోతున్నాం. త్వరలో వీటిపై నిర్ణయం జరుగవచ్చు.

మొత్తం మీద ఆశ, నిరాశల మధ్య దోబూచులాడుతూ వస్తున్నాం కదా. మంచే జరుగుతుందని ఆశిద్దాం.

మీ వద్ద మంచి స్కానర్ లాంటిది ఉంటే ఆ పాత చందమామల రెండు కవర్ పేజీలను స్కాన్ చేసి (కనీసం 300 డీపీఐ) అభిమానులకు ఇస్తే బాగుంటుంది కదా…

చల్లటి వార్తకు ధన్యవాదాలు. ఇన్నాళ్లుగా పాత చందమామలను కాపాడిన మీ చెల్లెలు గారికి కూడా మరి!

Comment by chandamamalu — 08/30/2009 @ 8:43 am

RTS Perm Link

అందరి “చందమామ”

August 29th, 2009

ch n3

సాహిత్యాభిలాషలో పిన్నలకూ, పెద్దలకూ, స్త్రీలకూ, పురుషులకూ ఉండే వ్యత్యాసాలను సరిచేసిన పత్రిక “చందమామ”. చందమామ పిల్లల పత్రికా, పెద్దల పత్రికా లేదా ఇద్దరి పత్రికా అనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి ఉండవచ్చు.

సాక్షాత్తూ ప్రస్తుత యాజమాన్యమే, యంగ్ జనరేషన్ అవసరాలకు అనుగుణంగా చందమామ రూపురేఖలను మార్చాలని తనదైన దృక్పధంతో ఆలోచించి చందమామ లేఅవుట్‌తో పాటు విషయం ఎంపికలో కూడా సమూల మార్పులు చేయాలని తలపోస్తుండవచ్చు.

కానీ కుటుంబం లోని అందరి పత్రికగా చందమామ మారిపోయిన విషయం 50 ఏళ్ల క్రితమే చరిత్రకెక్కింది. 1960 నాటి జూన్ చందమామ సంపాదకీయం స్పష్టంగా ఈ విషయాన్ని పాఠకులకు సూచించింది.

ఈరోజు రాత్రి నెట్‌లో బ్లాగర్ల సముదాయాన్ని గాలిస్తుండగా haaram.com బ్లాగు సముదాయంలో ఈ కింది బ్లాగ్ యుఆర్ఎల్ కనిపించింది.

http://telugupatrikalu.blogspot.com/2009/08/june-1960.html

దీన్ని చూస్తే చందమామతో సహా తెలుగులో అన్ని పత్రికలను ఈ బ్లాగరి పీడీఎఫ్‌గా మార్చి డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తూ తన బ్లాగులో పెడుతున్నారు. ఈ ఒక్క బ్లాగులో ఇంతవరకూ 34 చందమామ సంచికలను పీడీఎఫ్‌లుగా ఇవ్వడం గమనార్హం. 2001, 2003, 2004. చందమామలను కూడా పీడీఎఫ్‌గా ఇక్కడ ఇవ్వడం మరీ విశేషం.

ఈ బ్లాగులో ఉన్న 1960 జూన్ చందమామ పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తూ సంపాదకీయం కేసి చూస్తే ‘చందమామ పిల్లల చందమామ కాదు అందరి చందమామ’ అంటూ నాటి సంపాదకీయం ఢంకా భజాయించి చెప్పిన విషయం కనబడింది. ఆ సంపాదకీయం తొలి సగాన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. చందమామ ఎవరిదో ఇక్కడ అందరూ తెలుసుకోవచ్చు.

” ఈ సంచికతో ‘చందమామ’కు పదమూడేళ్లు నిండుతున్నాయి. ఈ పదమూడేళ్ల కాలంలో చందమామ తన పాఠకులతోబాటు ఎంతో పెరిగింది. ఎన్నోరకాల అందచందాలు సమకూర్చుకున్నది. అచ్చంగా చిన్నపిల్లల విజ్ఞాన వినోదాలకు మాత్రమే తోడ్పడుతుందనుకున్న ఈ పత్రిక త్వరలోనే కుటుంబంలోని అందరి పత్రికా అయిపోయింది. సాహిత్యాభిలాషలో పిన్నలకూ, పెద్దలకూ, స్త్రీలకూ, పురుషులకూ ఉండే వ్యత్యాసాలను సరిచేసిన పత్రిక చందమామ ఒక్కటేనని చెప్పవచ్చు. దీని ప్రభావం ఇంకా అనేక ఇతర పత్రికలపైన కూడా పడిందనటానికి సందేహం లేదు.”

దీనిపై ఇక ఏ వ్యాఖ్యానాలు కూడా అనవసరం కదూ..

(పైన సూచించిన బ్లాగులో 34 చందమామల పీడీఎఫ్‌లను స్వంతం చేసుకోవడం మరువరుగా..)

నోట్: తెలుగులో ఇలాంటి డౌన్‌లోడ్ సైట్లను నాకు తెలిసిన మేరకు నా బ్లాగు హోమ్ పేజీలో “చందమామ డౌన్‌లోడ్” విభాగంలో పెట్టాను. –తెలుగు పత్రికలు, చందమామలు, బ్లాగాగ్ని, సాహిత్య అభిమాని. చందమామ ఈ బుక్స్– ఇంకా ఏవయినా ఇలాంటివి ఉంటే ‘చంపి’లు తప్పక సూచించగలరు.

RTS Perm Link

పాత బంగారం మాకు ఎప్పటికి ముద్దే

August 27th, 2009
పాత చందమామ కవర్ పేజీ

పాత చందమామ కవర్ పేజీ

(చందమామ పాత సంచికల పట్ల, పత్రిక పాత నమూనా పట్ల అపారమైన ప్రేమాభిమానాలు పెంచుకున్న వెలువలి రామకృష్ణ రోహిణీ కుమార్ గారు చందమామ పాత తరం శ్రేయోభిలాషుల్లో ఒకరు. చందమామలో కథలు తగ్గిపోతున్న రీతి, రివాజుల పట్ల బాగా అసంతృప్తి ఉన్న రోహిణీ కుమార్ గారు దాదాపు 3 నెలల క్రితం పత్రికకు ఆప్తవాక్యాలు పలుకుతూ మొదటగా కింది మెయిల్ పంపారు. ఆయన అసంతృప్తిని గౌరవిస్తూనే, దృష్టిలో ఉంచుకుంటూనే చందమామకు ఆయన తెలిపిన శుభాకాంక్షలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము. అయన కోరిన డిమాండ్లు అన్నీ ఇప్పటికప్పుడు తీర్చలేకపోతున్నప్పటికీ, చందమామ హితం కోరే వారిని, వారి విలువైన అభిప్రాయాలను ఎన్నటికీ మర్చిపోమని, చందమామ మంచి దశవైపు మళ్లే శుభక్షణం కోసం మాకు వీలైనంత మేరకు, చేయగలిగనంత కృషి తప్పక చేస్తామని మరోసారి హామీ ఇస్తూ… వారు నిండు నూరేళ్లు చల్లగా బతకాలని కోరుకుంటూ….)

 

చందమామకు గల అశేష పాఠక ప్రజానీకంలో నేనూ ఒకడిని.

కొత్త సంచిక ఎప్పుడెప్పుడు అందుకుంటానా అని ఆశగా ప్రతి నెల ఎదురు చూస్తుంటా.

చందమామ కథలు అమ్మ చెప్పిన కథలను తలపించే రీతిన ఉంటాయనటంలో అతిశయోక్తి లేదు.

నా చిన్నతనంలో మండువేసవి సెలవుల్లో చక్కటి నీతి కథలతో సేద తేర్చిన ఈ చందమామ, నేటికీ పసి హృదయాలను, పెద్దల మనసులను గెలుచుకోవడం ముదావహం.

మహోత్కృష్టమయిన ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ చందమామ “ఇంతింతై వటుడింతై” అన్న చందాన దినదిన ప్రవర్థమానమై ఆచంద్రార్కం అలరారాలని మనసారా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

భవదీయుడు

వెలువలి రామకృష్ణ రోహిణీ కుమార్.
—————

మా చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందిస్తున్నాము. చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు ఇదే మా ఆహ్వానం. ఆ రోజుల్లో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు.  వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్ వివరాలను కూడా పంపగలరు. 

abhiprayam@chandamama.com

చందమామ పాతసంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

RTS Perm Link

చందమామ కథల ఖజానా

August 7th, 2009
చందమామ 1960 దీపావళి సంచిక

చందమామ 1960 దీపావళి సంచిక

ఆన్‌లైన్ చందమామ (telugu.chandamama.com) ఆర్కైవ్స్ విభాగం – ఖజానా లేదా భాండాగారం -లో 1947 జూలై ప్రారంభ సంచిక నుంచి 1980 వరకు చందమామ సంచికలను వరుస క్రమంలో ప్లాష్ పైళ్ల రూపంలో పాఠకులకు కింది లింకులో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

ఈ లింకులో తెరుచుకునే పేజీలో భాష (తెలుగు) సంవత్సరం (ఉదా. 1947), నెల (జూలై) ఎంచుకుని ‘వెళ్లండి’ పై క్లిక్ చేసి మీరు కోరిన సంచికను చూడవచ్చు. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే.

అయితే తొలి 33 సంవత్సరాల చందమామ సంచికలను స్కాన్ చేసి పిడిఎఫ్ ఫార్మాట్‌లోకి, తర్వాత ప్రస్తుత ఫ్లాష్ పైళ్ల రూపంలోకి మార్చే క్రమంలో అనివార్యంగా కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయి. స్కానింగ్ సమయంలో ఒరిజనల్ సంచికలో పేజీలు మడతపడిన విషయం గమనించకుండా అలాగే స్కాన్ చేయడంతో ఆ చోటులోని తెలుగు పాఠం కనిపించకుండా పోవడం. దాన్ని అలాగే ఆన్‌లైన్ చందమామలో అప్‌లోడ్ చేయడం జరిగిపోయాయి.

ఇంకా కొన్ని చోట్ల ఒక నెలకు బదులు మరో నెల పేరుతో ఫైల్ నేమ్ రూపొందించడంతో ఏది సరైంది, ఏది తప్పు కాపీ అనేది తెలీకుండా పాఠకులు ఇబ్బంది పడుతూ వచ్చారు. కొంతమంది పాఠకులు ఈ లోపాలను గుర్తించి తెలిపితే 1957 సంవత్సరం సంచికలలోని గందరగోళం ఈ మద్యే సరిచేయడం జరిగింది.

దశాబ్దాల చందమామలను ఒకే సారి స్కాన్ చేయడమే ఓ పెద్ద బృహత్ కార్యం. వనరుల సమస్య అలా ఉంది స్కానింగ్ సమయపు మానవ ప్రయత్నంలో లోపాలు జరగడం సహజం కాబట్టి, వాటిని సరిచెయ్యడం కూడా ఓ పెద్ద కార్యక్రమమే అవుతుంది. వనరుల కొరత కారణంగా చందమామ ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూనే మూడు దశాబ్దాల ఆర్కైవ్స్‌ను పేజీ పేజీ పరిశీలిస్తూ తనిఖీ చేయడం కష్టసాధ్యం.

అందుకే ఈ విషయంలో చందమామ పాత సంచికల అభిమానులు, పాఠకుల సహాయం ఎంతైనా అవసరముంది. చందమామ ఆర్కైవ్స్ చూస్తున్న వారు తమ దృష్టికి వచ్చిన లోపాలను… అంటే స్కాన్ చేసిన పేజీలలో కొన్ని చోట్ల మడతలు పడి పాఠం కనిపించకుండా పోవడం, పేజీలకు పేజీలే మిస్ కావడం, సంచికల సంవత్సరం, నెలల పేర్లు తప్పుగా నమోదు కావడం వంటి లోపాలను గమనించినప్పుడు అలాగే వదిలివేయకుండా కింది లింకుకు సంబంధిత సమాచారం తప్పక పంపించగలరు

abhiprayam@chandamama.com

చందమామ కథల ఖజానాను క్లీన్‌గా ఉంచే బాధ్యత సంస్థకు, పాఠకులకు ఇరువురికీ సంబంధించిన విషయం. పాఠకులు ఫీడ్‌బ్యాక్ ఇక్కడ  చాలా అవసరమవుతుంది.

ఉదాహరణకు… ఈరోజే బెంగళూరు నుంచి శివరామ్ ప్రసాద్ గారు 1960 నవంబర్ చందమామ దీపావళి సంచికలో మార్కోపోలో సాహసయాత్రలు ధారావాహిక -సీరియల్- 8వ భాగం పూర్తిగా ఆర్కైవ్స్‌లో లేని విషయం తెలియపర్చారు. ముందు వెనుకల ఈ సీరియల్ సేకరించి చదివిన ప్రసాద్ గారు 8వ భాగం ఆర్కైవ్స్‌లో లేని విషయం కనుగొని వెంటనే సమాచారం నెట్ ద్వారా పంపారు.

1960 నవంబర్ చందమామ హార్డ్ కాపీ సంస్థ కార్యాలయంలో ఉన్న కారణంగా వెంటనే దీనిపై స్పందించి చందమామ లైబ్రరీ నిర్వాహకులను సంప్రదిస్తే వారు మార్కోపోలో 8వ భాగం లేని విషయం నిర్థారించుకుని 3 గంటలు కష్టపడి పూర్తిగా సంచిక మొత్తాన్ని మళ్లీ స్కాన్ చేసి పంపించారు. దీన్ని వచ్చే సోమవారం ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది.

ప్రసాద్ గారు ఈ విషయం గుర్తించి సమాచారం పంపడం మూలంగా ఈ లోపం సరిదిద్దుకోవడానికి వీలు కలిగింది. పాఠకుల, అభిమానుల పరిశీలన పత్రిక లోపాల సవరణలో ఎంతగా ఉపయోగపడతాయో ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది కదూ.

అందుకే చందమామ పాఠకులు, అభిమానులకు మరోసారి విజ్ఞప్తి. ఇలాంటి పేజీల గల్లంతు, పాఠం గల్లంతు తదితర గల్లంతుల విషయాన్ని మీరు ఆన్‌లైన్ చందమామ దృష్టికి కింది లింకు ద్వారా తీసుకురండి.

abhiprayam@chandamama.com

చందమామ పత్రిక, దాని అమూల్య కథా భాండాగారం మనందరిదీ కాబట్టి తలొ చేయ్యి వేస్తే కాని అది ఖచ్చితమైన రూపంలో అందుబాటులోకి రాదు. కాబట్టి లోపాలు కనిపించినప్పుడు అంతటితో వదిలివేయకుండా ఇలా పరస్పరం షేర్ చేసుకుంటే అవి వీలైనంత చక్కగా పరిష్కరించబడి పాఠకులకు చందమామ సరైన రూపంలో అందాలన్న ఆశయం సకాలంలో నెలవేరుతుంది.

ఈ విషయాన్ని కాస్త ఆలోచిస్తారా..

నోట్: శివరామ్ ప్రసాద్ గారు సూచించిన అంశాలను పట్టించుకునే క్రమంలో మార్కోపోలో సాహసయాత్రలు నేను మళ్ళీ చదవటం జరిగింది. నిజంగానే మార్కోపోలో ఆసియా పర్యటన విశేషాలను చక్కటి శైలితో ఈ ధారావాహిక పొందుపర్చింది. 1960 ఏప్రిల్ చందమామ సంచికనుంచి ఈ సీరియల్ ప్రారంభమైంది. వీలు దొరికితే మీరూ తప్పక ఈ సీరియల్‌ను మరోసారి చదవగలరు.

ఈ సీరియల్ పూర్తి పాఠాన్ని శివరామ్ ప్రసాద్ గారు తన బ్లాగులో ఈరోజే పెట్టారు. ఒకే చోట సీరియల్ మొత్తాన్ని చూడాలనుకునేవారు ఆయన బ్లాగులోంచి తీసుకోవచ్చు.

http://saahitya-abhimaani.blogspot.com/

మీ బ్లాగులో పెట్టకముందే ఈ ధారావాహికను తొలుత నాకే పంపారు. ధన్యుడిని ప్రసాద్ గారూ..

RTS Perm Link

మన చందమామ

August 6th, 2009

అఖిలాంధ్ర, అఖిల భారత, అఖిల ప్రపంచ చందమామ పాఠకులకు, అభిమానులకు, చందమామ పిచ్చోళ్లకు ఇందుమూలంగా తెలియజేయుచున్నది ఏమనగా…

చందమామ అతి త్వరలో పాత రూపంలోకి రాబోతోందొహో… ఆరునెలలుగా చందమామ పాఠకులను కలవరపెడుతున్న, కలత సృష్టిస్తున్న ఒక అతి పెద్ద సమస్యకు త్వరలో పరిష్కారం లభించబోతోంది.

60 సంవత్సరాలుగా రూటు మార్చకుండా పంథా విడవకుండా అవిచ్చిన్నంగా కొనసాగిన చందమామ పత్రిక లే అవుట్ యంగ్ జనరేషన్ అభిరుచులకు అనుగుణంగా  అన్ని రకాలుగా మార్పు చెందాలనే కొత్త పాలసీ చేపట్టింది.

తెలుగు జానపద చిత్రశైలితో దశాబ్దాలుగా పాఠకులను మంత్రముగ్దులను చేస్తున్న చిత్రా, వడ్డాది పాపయ్య, శంకర్ చిత్రాల స్థానంలో చందమామకు ఆధునిక రూపం తొడగాలని భావించిన యాజమాన్యం పాలసీ ప్రకారం, చందమామ తన చరిత్రను తానే అభాస చేసుకుని పాఠకుల తీర్పుకోసం బోనులో నిలబడింది.

ఆదునిక రూపం తొడుగుకున్నది మొదలుకొని కొత్త చందమామ గత నాలుగయిదు నెలలుగా పాఠకులు, అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటూ వచ్చింది.

సాధారణ పాఠకులు మినహాయిస్తే చందమామ  చరిత్రను తొలినుంచి నిశితంగా పరిశీలిస్తున్న సీరియస్ పాఠకులు, అంతకు మించి అభిమానులు చందమామ నూతన మార్పులను ఏ మాత్రం జీర్ణం చేసుకోలేకపోయారు.

యూనివర్శిటీ ప్రొఫెసర్లనుంచి వృద్ధ పాఠకాభిమానుల వరకు చందమామ రూపంలో, విషయంలో మార్పులను గత కొద్ది నెలలుగా ఎంతగా బండకేసి ఉతికారంటే ఇది సూర్యుడు ఎప్పుడూ తూర్పువైపునే ఉదయిస్తాడన్నంత నిజం.

నా కన్నబిడ్డను రేప్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవలసి వస్తోంది అని ఒకరు, నా బిడ్డ చనిపోయిందనుకుని ఇవ్వాళ్టినుంచి చందమామను పూడ్చి పెడుతున్నాను అని మరొకరు, చిత్రా, వపా, శంకర్ బొమ్మలు లేని చందమామ మాకు అవసరం లేదు చందా వెనక్కు పంపమని రాసిన వారు కొందరు, చందమామకు చందా కట్టి ఎంత మతిహీనమైన పని చేశాను అని కొందరు.

కేవలం ఆరు నెలలు. ఇంకా చెప్పాలంటే నాలుగు నెలలు… 60 ఏళ్ల చరిత్రను తృణప్రాయంగా మార్చి తెలుగు పాఠకుల ఓపికను పరీక్షించిన చందమామ నూతన రూపం, ఎట్టకేలకు చందమామ సాంప్రదాయక రూపాన్ని మోహిస్తున్న తెలుగు పాఠకుల, అభిమానుల ధర్మాగ్రహ జ్వాలల బారిన పడి అంతర్ధానమవుతోందా?

అవుననే చెప్పాలి. ‘పాఠకుల అబిరుచులకు దూరంగా జరిగే పత్రిక మనలేద’నే శ్రేయోభిలాషుల హెచ్చరికలను నిజం చేస్తూ త్వరలోనే చందమామ పాత రూపాన్నే తిరిగి తలకు ఎత్తుకోబోతోంది.

ఇది చందమామ పాఠకుల విజయం. చందమామ చరిత్రనే తారుమారు చేసేంత సమూల మార్పులకు గురవుతున్న కొత్త చందమామపై పాత తరం పాఠకులు సాగించిన సుదీర్ఘ విజయంలో  ఓ పెద్ద మలుపు ఇది. ఈ గొప్ప పరిణామంపై ఎవరు ఎలా వ్యాఖ్యానాలు చేసినప్పటికీ, అంతిమ సత్యం ఇదీ..

చందమామ…. తెలుగు జాతికి కథల దాహం తీర్చిన చందమామ… తెలుగు లోగిళ్లలో దశాబ్దాల పాటు కథల అమృతాన్ని వర్షిస్తూ దోబోచులాడిన చందమామ… వ్యవస్థాపకుటు చక్రపాణి అభిప్రాయాలను కూడా కొన్ని సందర్భాల్లో తోసిరాజని తన పంధాలో తాను నడిచిన చందమామ…

మీ చందమామ… మా చందమామ..

ఇకపై…..

మన ‘చందమామ’ లాగే ఉండబోతోంది.

RTS Perm Link

“చందమామ”తోటే “చంద్ర మహాదశ”

August 5th, 2009

 

చందమామ

చందమామ

చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.

చందమామను బి.నాగిరెడ్డి – చక్రపాణి(వీరు తెలుగు, తమిళ బాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) 1947 జూలైలో ప్రారంభించారు.

కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం , ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 – 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా.

టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్‌లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు.

చందమామ అందంగా రూపొందడానికి గల మరో కారణం నాణ్యమైన ముద్రణ. నాగిరెడ్డి తన తమ్ముడైన బి.ఎన్.కొండారెడ్డి (ఈయన మల్లీశ్వరి లాంటి కొన్ని సినిమాలకు కెమెరామాన్‌గా పని చేశాడు) పేరుతో నడుపుతున్న బి.ఎన్.కె. ప్రెస్సులోనే మొదటినుంచి చందమామ ముద్రణ జరుగుతూ వచ్చింది.

(ఇప్పుడు కలకత్తాకు చెందిన జియోదెశిక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆధ్వర్యంలో చందమామ ముద్రణ పూర్తిగా బొంబాయికి తరలిపోయింది. ఈ సెప్టెంబర్ నుంచి చందమామ అన్ని భాషల ప్యాకింగ్ కూడా టోకున బొంబాయికి తరలిపోతోంది. ముద్రణ బొంబాయిలో, ప్యాకింగ్ చెన్నయ్‌లో జరుగుతున్న మార్కెట్ పరమైన అసంబద్దతను యాజమాన్యం ఇలా పరిష్కరించిందన్నమాట.)

నాగిరెడ్డి అతి ప్రతిభావంతంగా నడిపిన బి.ఎన్‌.కె.ప్రెస్‌ “చందమామ”ను అందంగా ముద్రిస్తూ ఉండేది. ఎన్నో కొత్త రకం అచ్చు యంత్రాలను మనదేశంలో మొట్టమొదటగా నాగిరెడ్డి కొని వాడడం మొదలుపెట్టాడు. ఈ విధంగా చక్రపాణి “సాఫ్ట్‌వేర్‌”కు నాగిరెడ్డి “హార్డ్‌వేర్‌” తోడై “చందమామ”ను విజయవంతంగా తీర్చిదిద్దింది.

అసలు చక్రపాణికి నాగిరెడ్డి పరిచయమైంది ఈ ప్రెస్సులోనే. శరత్ వ్రాసిన బెంగాలీ నవలలకు తాను చేసిన తెలుగు అనువాదాలను ప్రచురించే పని మీద చక్రపాణి అక్కడికి వచ్చాడు. తర్వాత నాగిరెడ్డి-చక్రపాణి పేర్లు స్నేహానికి పర్యాయపదంగా నిలిచిపోవడం చరిత్ర.

భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి.

దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి

ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, వెయ్యిన్నొక్క రాత్రులు(అరేబియన్‌ నైట్స్‌), ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని షేక్‌స్పియర్‌ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు.

ఇవికాక గ్రీక్‌ పురాణాలైన ఇలియడ్‌, ఒడిస్సీ, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ చందమామలో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలేగాక ఇతర భాషా సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి. చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దలైన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు

చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుతో(గా) మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతినెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టమైన ఈ పనిని, దశాబ్దాలపాటు నిరాఘాటంగా కొనసాగించడం చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం.

మొదటి బేతాళ కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల ఆసక్తిని గమనించి గాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జులై, 1972లో మొదటి బేతాళ కథను రంగుల్లో పునర్ముద్రించారు. మరి కొన్ని పిల్లల పత్రికలు బొమ్మరిల్లు వంటివి ఇదేపద్ధతిలో కథలను (కరాళ కధలు) సృష్టించడానికి ప్రయత్నించాయి గాని, అంతగా విజయం సాధించలేదని చెప్పవచ్చు.

జానపద కథలకు చందమామ కాణాచి. చందమామ కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి. చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు. ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి. రాజులూ, వారి రాజ్యాలూ, రాజకుమారులూ, రాజకుమార్తెలూ, వారి స్వయంవరాలు, వారి సాహసాలు, మంత్రుల తెలివితేటలు, పరిపాలనా దక్షత, విదూషకుల హాస్యం/చురుకైన బుధ్ధి, ప్రభువుల విశాల హృదయం మరియు ముందుచూపు, జానపదులు, వారి అమాయకత్వంవంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజ పరిచాయి.

చందమామలోని మరో ప్రత్యేకత – తేనెలూరే తియ్యటి తెలుగు. అసలు ఏ భారతీయ భాషైనా నేర్చుకోవడానికి ఆ భాషలోని చందమామ చదవడం ఉత్తమ మార్గం అనడం అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. కథ, కథకి సంబంధించిన బొమ్మలు ఎలా ఉండాలో, ఏ నిష్పత్తిలో ఉండాలో చక్కగా చేసి చూపించి, మిగిలిన పత్రికలకు మార్గదర్శకమైంది. చందమామ శైలిని, ఒరవడిని, ఇతరులు అనుకరించడం లేదా అనుసరించడం చెయ్యగలిగారుగాని, కొత్త శైలినిగాని ఒరవడినిగాని ఇంతవరకు సృష్టించలేక పోయారు

చందమామ సంస్థాపకుడు చక్రపాణి కాగా సంచాలకుడు నాగిరెడ్డి. చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణిదే. 1975లో చనిపోయే వరకూ ఎనలేని సేవచేశాడు. అనంతరంనాగిరెడ్డి కుమారుడైన విశ్వనాధ రెడ్డి దాదాపు 33 ఏళ్లపాటు చందమామ వ్యవహారాలు చూస్తూ, సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

చందమామ సంపాదకుల వ్యాఖ్యలు

“బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. -కొడవటిగంటి కుటుంబరావు

క్లుప్తంగా, ఏ విధమైన యాసా చోటు చేసుకోకుండా సూటిగా సాగే కుటుంబరావు శైలిని చక్రపాణి “గాంధీగారి భాష” అని మెచ్చుకునేవాడట. ఇంకెవరు రాసినా ఆయనకు నచ్చేది కాదు.

కొడవటిగంటి కుటుంబరావు స్వయంగా పేరొందిన కథా/నవలా రచయిత కావటంవల్ల, ఆయన చందమామను సర్వాంగసుందరమైన ఆకర్షణీయ పత్రికగా, ప్రతి మాసం మలచేవాడు. దీనికి తోడు, ఎంతో కళా దృష్టి ఉన్న చక్రపాణి పర్యవేక్షణ ఎంతగానో ఉపకరించేది. కథలలో ఎక్కడా అసంబద్ధమైన విషయాలు ఉండేవి కావు. ప్రతి కథా చాలా సూటిగా, కొద్ది పాత్రలతో మంచి విషయాలతో నిండి ఉండేది.

చందమామలో దాదాపు మొదటినుంచీ ఉన్నవారిలో దాసరి సుబ్రహ్మణ్యం ఒకరు.మొదటి రంగుల సీరియల్‌ ఆయన ప్రత్యేకత. తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే. ఎందుచేతనో చక్రపాణికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు. పాఠకులకు మాత్రం అవి చాలా నచ్చేవి. ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్‌ తగ్గింది. దాంతో దాసరివారికి మళ్ళీ పనిపడింది. చక్రపాణి అభిరుచి, పాఠకుల అభిరుచి వేరని తేలిపోయింది.

“చందమామ”కు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి. చక్రపాణి అంతవరకూ ఏ పత్రికలోనూ లేని విధంగా చందమామలో ప్రతి పేజీ లోనూ ఒక బొమ్మ వచ్చేటట్లు, కథ సరిగ్గా గీత గీసినట్లు బొమ్మ దగ్గరే ముగిసేటట్లు శ్రద్ధ తీసుకున్నాడు. తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలన్నీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. కాగా అరవయ్యేళ్ల తర్వాత చందమామే ఇప్పుడు ఆ పద్ధతిని తోసిరాజంటోంది.

“చందమామ” ప్రజాదరణ పొందడానికి చాలా కారణాలుండేవి. మొదటిది కథల ఎంపిక, రెండోది కథనశైలి, మూడోది బొమ్మల అందాలు, నాలుగోది ఉత్తమమైన ప్రింటింగ్‌ క్వాలిటీ. ప్రతి కథనూ చక్రపాణిగారు “అప్రూవ్‌” చెయ్యాలి. సామాన్యంగా ఆయనకు నచ్చనివి తక్కువగానే ఉండేవి. అప్పుడప్పుడూ ప్రజల తిరుగుబాటువంటి లెఫ్టిస్టు అంశాలుంటే ఆయన తీసేయించేవాడు. అందులో ఆయనకు కమ్యూనిస్టు వాసన అనిపించేదేమో. సస్పెన్స్‌ పేజీ కూడా ఆయనకు నచ్చక మాన్పించాడు.

నాగిరెడ్డిగారు యజమాని అయినప్పటికీ పత్రిక వ్యవహారాలన్నీ చక్రపాణికే వదిలేసేవారు. నాగిరెడ్డిగారు అతి ప్రతిభావంతంగా నడిపిన బి.ఎన్‌.కె.ప్రెస్‌ “చందమామ”ను అందంగా ముద్రిస్తూ ఉండేది. ఎన్నో కొత్త రకం అచ్చు యంత్రాలను మనదేశంలో మొట్టమొదటగా నాగిరెడ్డిగారే కొని వాడడం మొదలెట్టారు. ఈ విధంగా చక్రపాణిగారి “సాఫ్ట్‌వేర్‌”కు నాగిరెడ్డిగారి “హార్డ్‌వేర్‌” తోడై “చందమామ”ను విజయవంతంగా తీర్చిదిద్దింది.

కక్కయ్యకు (కొకు),చక్రపాణికి ఏర్పడ్డ మైత్రి ఒక అపూర్వ విశేషంగా పెంపొంది, ఉభయుల అంత్యదశల వరకు ప్రాణప్రదంగా వీరివెంట వచ్చింది. ఇది ఒకరి మేధస్సులను ఒకరు తెలుసుకున్నందువల్లనే సాధ్యమైంది. చక్రపాణి గాఢమైన సాహిత్యప్రియుడు, రచయిత. ఆయన శరత్ చంద్ర చటోపాధ్యాయ, రవీంద్రనాథ మైత్రా, తారాశంకర బెనర్జీ తదితరుల రచనలు తర్జుమా చేసి ‘యువ’ ప్రచురణలనే పేర పుస్తకాలు ముద్రించటం సాగించాడు. కక్కయ్య కథల పుస్తకాలు కూడా చక్రపాణి ద్వారానే మొదట అచ్చయ్యాయి.

చక్రపాణిగారి “చాదస్తాలు” ఒక కొత్త ఒరవడిని సృష్టించాయనడంలో సందేహం లేదు. ప్రతి పేజీకీ బొమ్మ ఉండడం, బొమ్మల సరిహద్దుల్లో కథలన్నీ ఇమిడిపోవడం అంతకు మునుపెన్నడూ ఏ పత్రికలోనూ ఉండేది కాదు. ఇందుకుగాను కథల మాటలను సరైన పొడవుకు కత్తిరించే దర్జీ పని చాలా ఉండేది. కథ సరిగ్గా బొమ్మ వద్దే పూర్తయేది. అర అంగుళం ఎడం కూడా మిగిలేది కాదు.

చక్రపాణి గారికున్న పట్టింపుల్లో మరొకటి విచిత్రమైనది. పత్రిక మధ్య పేజీలో (స్టేప్‌ల్‌ ఉండేది) ఎడమ పేజీలో కథ పూర్తవకూడదు. కథల క్రమం ఎలాగైనా మార్చి మధ్య పేజీలు రెండింటిలోనూ ఒకే కథ కొనసాగేట్టు చూడాలి. ఎడిటర్లకు ఇదొక తలనొప్పిగా ఉండేది. 1975లో ఒకసారి ఈ పొరబాటు జరగనే జరిగింది. ఇది సరిదిద్దుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూండగానే అదే నెల చక్రపాణిగారు చనిపోయారు. సంచిక అంతా తయారయిపోయింది కనక ఆయన గురించి మా నాన్నగారు నాలుగు పేజీలు రాసి, ఆ కాగితాన్ని మధ్యపేజీగా సంచికలోకి చేర్చవలసి వచ్చింది. ఆ విధంగా చక్రపాణిగారి కోరికా నెరవేరింది.

అసలు “చందమామ” పిల్లల పత్రికేనా అనే అనుమానం కూడా వ్యక్తం చేసినవారున్నారు. ఎందుకంటే అందులోని కథలు అందరూ చదవదగినవే. ఏది ఏమైనా తెలుగు బాలసాహిత్యం జాతకంలో “చంద్ర మహాదశ” వంటిదేదో “చందమామ”తోనే మొదలైనట్టుగా అనిపిస్తుంది. దాని ధాటికి అంతకు ముందు వచ్చిన “బాల”, తరవాత మొదలైన “బాలమిత్ర” వగైరా పత్రికలేవీ నిలవలేకపోయాయి. తెలుగులో “చందమామ”కు పోటీయే ఉండేది కాదు. ఇప్పటికీ అది అందరికీ అభిమాన పత్రికే.

మూలం:
రోహిణీ ప్రసాద్ వ్యాసం – చందమామ జ్ఞాపకాలు
వికీపీడియాలో వ్యాసం – చందమామ
మాధవపెద్ది గోఖలే వ్యాసం – భావవిప్లవకారుడు కొడవటిగంటి

RTS Perm Link

చేతికందిన “చందమామ”

August 4th, 2009
చందమామ

చందమామ

“…తెలుగు రచయితగా, పత్రికా సంపాదకులుగా, సినీ నిర్మాతగా, దర్శకుడిగా పలు విభిన్న పార్శ్వాలను కలిగి ఉన్న బహుభాషావేత్త చక్రపాణి. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరైన చక్రపాణిగారు… కష్టపడితే ఫలితం ఉంటుందన్న ప్రాథమిక సూత్రాన్ని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి.

తనదైన ఓ ప్రత్యేక తెలుగు నుడికారంతో శరత్‌బాబు బెంగాలీ నవలను అనువాదం చేసిన చక్రపాణి… ఆ తెలుగు నవలా రచయిత శరత్ అనే అందరూ అనుకునేటట్లు, తను బెంగాలీ కుటుంబాలతో ఉన్నట్లుగా భ్రమింపజేశారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో, ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఈయన తగినంత పాఠశాల విద్య లేకపోయినా, తన సుదీర్ఘ సాధనచేత నాలుగైదు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. తన కలంపేరునే సొంత పేరుగా చేసుకున్న చక్రపాణిగారి జన్మదినం నేడు.(ఆగస్టు 5) ఈ సందర్భంగా ఆయన స్మృతిలో…

చక్రపాణిగారు, నాగిరెడ్డిగారు కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి… అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక వారిద్దరూ కలసి 1945లో ప్రారంభించిన ఆంధ్రజ్యోతి పత్రిక, 1947 జులైలో పిల్లల కోసం ప్రారంభించిన చందమామ జయప్రదం అయ్యాయి. నాగిరెడ్డి, చక్రపాణిల పేర్లు తెలుగు దేశమంతా మార్మోగాయి.

చందమామ ఈ రోజు పన్నెండు భారతీయభాషల్లో అపూర్వమైన రీతిలో ప్రచురించబడటానికి చక్రపాణిగారు వేసిన బలమైన పునాదులే కారణంగా చెప్పవచ్చు. అంతేగాకుండా, యువ ప్రచురణల ద్వారా చౌకధరలకు ఉత్తమసాహిత్యాన్ని అందించి ప్రజానీకంలో సాహిత్య విలువలను పెంచిన వ్యక్తిగా ఆయన సేవలు అజరామరం. తను సృష్టించిన ప్రతి పాత్ర, రచయితగా ఆయన కలం నుండి వెలువడిన ప్రతిమాట తెలుగువారి నిత్య జీవితాల్లోనుంచే వెలికితెచ్చి, ప్రజలకు ప్రీతిపాత్రుడయ్యారు.

రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా తన బహుముఖ ప్రజ్ఞాపాటవాలను తెలుగు ప్రజలకు రుచి చూపించి, “చేతికందిన చందమామ”గా పిల్లల హృదయాలలో సైతం చోటు సంపాదించిన శ్రీ చక్రపాణి సెప్టెంబరు 24, 1975 సంవత్సరంలో పరమపదించారు. చక్రపాణిగారి ఖచ్చితమైన కాలిక్యులేషన్, కఠోర పరిశ్రమ, నిబద్ధత, తన మీద తనకు గల అచంచల విశ్వాసాలే… తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాత, దర్శకుల్లో ఒకరిగా ఆయనని నిలబెట్టింది.

అరమరికలు, దాపరికాలు చక్రపాణిగారికి గిట్టవు. చెప్పదలుచుకుంది కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పటం ఆయన స్వభావం. ఇతరులు ఏమనుకుంటారోనన్న భావం వీరికి ఏ కోశానా ఉండేది కాదు. భేషజాలు లేని అమృత హృదయుడు. తనలో ఎన్ని బాధలున్నా.. అన్నీ దాచుకుని లోకానికి చల్లని ప్రశాంతమైన చిరునవ్వుల్ని ప్రసాదించిన స్తితప్రజ్ఞుడీయన…..”

(‘చందమామ’ను తెలుగుజాతి చేతికందించిన చక్రపాణి గారి జన్మదినం సందర్భంగా వెబ్‌దునియా తెలుగు వెబ్‌సైట్ ప్రచురించిన కథనంలో కొంత భాగాన్ని ఇక్కడ పొందుపర్చాము.  చక్రపాణిగారిపై వెబ్‌దునియా పూర్తి పాఠం చదవాలంటే కింది రెండు లింకులను తెరవండి.)

http://telugu.webdunia.com/miscellaneous/kidsworld/gk/0908/04/1090804089_1.htm

http://telugu.webdunia.com/miscellaneous/kidsworld/gk/0908/04/1090804089_2.htm

RTS Perm Link

తరగని తీపి అనుభవం చందమామ

August 3rd, 2009

చందమామని చూపిస్తూ అమ్మ తినిపించే గోరుముద్దలు, రాముడు మారాం చేస్తె కంచంలొ చందమామను భువికి దించిన కథ మన అందరికి చందమామ తోటి మొదటి మరపురాని తీపి పరిచయం. చందమామ పుస్తకం కూడా అలాంటి మరువలేని తీపి అనుభవమే, ఇది వయసు పెరిగినా తరగని తీపి అనుభవం.

చందమామతో నా మొదటి జ్ఞాపకాలు ఇవీ.. నా చిన్నప్పుడు ఇంకా నాకు చదవటం పూర్తిగా రాని వయసులో నేను ప్రతి నెల చందమామ పుస్తకం కోసం కళ్లు కాయలు కాసేలాగ వేచి ఉండటం, పుస్తకం రాగానే, అమ్మని చదివి చెప్పమని విసిగించడం. ఇంటి పని పూర్తి అయ్యాక రాత్రి పడుకునేటప్పుడు అమ్మ ఒడిలొ కూర్చొ పెట్టుకుని రోజుకి ఒక కథ చొప్పున వినిపించటము….

అమ్మ ప్రేమతొ కుడిన ఆ చందమామ జ్ఞాపకాలు ఎన్నటికీ మరచి పోలేము.

తెలుగు నేర్చుకోవటానికి మొదటి స్పూర్తి చందమామ అని చెపితే అది అతిశయోక్తి అనిపించుకోదు. నలభై ఏళ్ల తరువాత ఈరోజుకి కూడ ప్రతి నెల ఎక్కడ ఉన్నా చందమామ కోసం ఎదురు చూస్తాను. చందమామలొ 25 ఏళ్ల నాటి కథ చదివినప్పుడల్లా ఆ చిన్ననాటి తీపి గుర్తులు మనసును కదల్చి వేస్తాయి.

నా ఇన్నేళ్ల అనుభవం బట్టి చెబుతున్నా. 60 ఏళ్ల పైబడిన చందమామ.. నేను గమనించినంత వరకు ప్రపంచ సాహిత్యంలో ఇంత గొప్ప పత్రిక మరొకటి లేదు. కొన్ని తరాల ప్రజలమీద ఇంతటి ప్రభావం చూపిన పత్రిక మరొకటి నేను చూడలేదు. తెలుగులో, ఇతర భాషల్లో పిల్లల పత్రికలు చాలానే ఉన్నాయనడంలో సందేహం లేదు.

కానీ, 60 ఏళ్లుగా చందమామలా నాణ్యమైన కథలు, రచనలు నిరంతరంగా అందిస్తూ వస్తున్న పత్రిక ప్రపంచంలో మరొకటి లేదనే నా అభిప్రాయం. ఇంతటి చరిత్ర ఉన్న చందమామ ఆన్‌లైన్‌లో కూడా వస్తుండటం సంతోషకరం. ఆన్‌లైన్ చందమామ కూడా ప్రింట్ చందమామలా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నా.

రచయిత:  బివి ఫణి

కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్

నోట్‌: కాన్పూర్‌ ఐఐటి ప్రొఫెసర్ బివి ఫణిగారితో పరిచయమే గమ్మత్తుగా జరిగింది. చెన్నయ్‌లో చదువుతున్న వారి అమ్మాయి మానస ఈ వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు చందమామలో అప్రెంటిస్‌గా పనిచేసినప్పుడు మాటల సందర్భంలో నాన్నకు చందమామ అంటే ప్రాణం అని చెప్పారు. ఇక ఉండబట్లలేక  ఫణిగారి ఇమెయిల్ ఐడి తీసుకుని చందమామ జ్ఞాపకాలు పంవవలసిందిగా కోరడమైంది.

ఈ మెయిల్ చూసుకున్నది తడవుగా ఆయన వెంటనే కాన్పూర్ నుంచి ఫోన్ చేసి చందమామతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. పసిపిల్లాడిలాగా చందమామతో తన అనుబంధం, అమ్మ చెప్పిన చందమామ కథల గురించి రెండు నెలల క్రితం ఆయన ఫోన్ ద్వారా మాట్లాడిన మాటలు ఇప్పటికీ సజీవ జ్ఞాపకంలా వినిపిస్తున్నాయి.

తర్వాత బిజీ అకడమిక్ షెడ్యూల్ మధ్యలోనే తీరిక చేసుకుని ఆయన క్లుప్తంగా చందమామ గురించి తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈమెయిల్ పంపారు. ఆయన ఆరోజు ఫో‌న్‌లో మాట్లాడినవి, ఈమెయిల్‌లో పంపినవి కలిపి “తరగని తీపి అనుభవం చందమామ” పేరిట ఆన్‌లైన్ చందమామలో పోస్ట్ చేయడం జరిగింది.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=1907

బీవీ ఫణిగారి చందమామ జ్ఞాపకాలను చందమామ అభిమానులకోసం ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేయడమైంది.

కృతజ్ఞతలు ఫణిగారూ.. ఊహించని సందర్భంలో మీరు సత్వరం స్పందించి చందమామ జ్ఞాపకాలను పంపినందుకు ధన్యవాదాలు. మిడిల్ ఈస్ట్ నుంచి తిరిగి వచ్చాక ఆర్థిక తదితర అంశాలపై చిన్ని చిన్ని రచనలు పంపుతామని మీరు ఆరోజు చెప్పారు. ఎదురు చూస్తున్నాం.

మానస ఈమధ్య అకడమిక్ ఒత్తిళ్లలో పడి చందమామలో సైన్స్ రచనలు (విశ్వం) పంపడం తగ్గింది. వీలు చూసుకుని ఏదయినా రాయమని తనకు చెప్పండి. ఒక అనుహ్య క్షణంలో ఒకే కుటుంబంలో తండ్రీ కుమార్తె ఇద్దరూ ఆన్‌లైన్ చందమామతో అనుబంధంలోకి రావడం నిజంగా చెప్పలేని సంతోషాన్నిస్తోంది మాకు.

చందమామతో మీ ఈ అనుబంధం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…

రాజశేఖర్

మా చందమామ జ్ఞాపకాలు

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము. చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు ఇదే మా ఆహ్వానం.

ఆ రోజుల్లో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు.  వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్ వివరాలను కూడా పంపగలరు.

abhiprayam@chandamama.com

చందమామ పాతసంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

RTS Perm Link

తరాలను తీర్చిదిద్దిన చందమామ

August 1st, 2009

మా నాన్నగారు మాకు నేర్పిన ఒక మంచి అలవాటు పుస్తకాలు చదవడం. మాకు చిన్నతనంలోనే రామాయణ, భాగవతాలను పరిచయం చేశారు. అప్పట్లో రాజమండ్రి నుంచి గొల్లపూడి వీరాస్వామీ & సన్స్ వాళ్ళు తెలుగులో ముద్రించే బాలల బొమ్మల రామాయణం, మహాభారతాలు, ఇంకా తెనాలి రామకృష్ణ, బీర్బల్ కథలు, గద్య భాగవతం ఇలాంటి పుస్తకాలెన్నో మాకు చిన్నతనంలోనే కొని ఇచ్చి చదివించేవారు. అప్పటికి టి.వి. ఇంతటి విశ్వరూపం ధరించలేదు, ఆ పల్లెటూళ్ళో మాకు ఉండే సరదాలలో కధల పుస్తకాలు సింహభాగం వహించేవి.

నాలుగవ తరగతిలో ఉండగా అనుకుంటాను, ఒకసారి నాన్నగారు మా ముగ్గురిని తీసుకుని మా ఇంటికి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న శాఖా గ్రంధాలయానికి తీసుకుని వెళ్ళి మాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. చిన్నఫ్ఫుడు చాలా ఇష్టంగా చదివింది చందమామ పుస్తకం. ప్రతి నెలా సుమారు 7 లేదా 8 వ తారీఖులలో మా గ్రంథాలయానికి వచ్చేది. ఇది కాకుండా బాలజ్యోతి, బుజ్జాయి కూడా వచ్చేవి.

ప్రతి నెలా క్రొత్త చందమామ చదివే వరకు ఎంతో ఆతృతగా ఉండేది. నేను వెళ్ళేసరికి అది వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే నేను ఇంక అతని ప్రక్కనే కూర్చుని ఎప్పుడు వదులుతాడా అని చూసేవాడిని. చందమామ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా చదివేవారు.

ఒకవేళ పిల్లలు వచ్చినపుడు చందమామ, బాలజ్యోతి పుస్తకాలు పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే అక్కడ ఉండే లైబ్రేరియన్ వాళ్ళ దగ్గర తీసేసుకుని మాకు ఇప్పించేవాడు, ‘వాళ్ళు ఇక్కడికి వచ్చేదే వీటి కోసం, వాళ్ళు లేనప్పుడు మీరు చదవండి’ అని వాళ్ళకి చెప్తుంటే ఆయనమీద ఎంతో ఇష్టం కలిగేది.

చందమామ కథలు ఏవి కూడా ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఉండవు, అందులో ఉండేదంతా ఒక ఐడియల్ ప్రపంచం. వాటిలో దెయ్యాలు, రాక్షసులు, మంత్రగాళ్ళు, గయ్యాళి అత్తలు,దొంగలు అందరూ ఉండేవారు. కానీ ఎవ్వరూ మరీ క్రూరంగా ప్రవర్తించరు. కధా చివరిలో చెడ్డవాళ్ళు అందరూ మారిపోయినట్టు చూపేవాళ్ళు. ప్రతి కధలోను ఒక నీతి సూత్రం ఉండేది, సమాజానికి కావలసిన ఎదో ఒక విలువని భోధించేటట్టుగా ఉండేవి.

నీతి సూత్రం కానీ, తత్వశాస్త్రం కానీ మనకి సోదాహరణంగా వివరిస్తే బాగా అర్థం అవుతుంది, అందుకే వేదాలు ఉపనిషత్తుల్లో ఉండే నీతి సూత్రాలన్నీ మనకి కథలలో చేర్చి జనానికి అర్థమయ్యే విధంగా రామాయణ, భాగవతాల రూపంలో చెప్పారు కదా.

చందమామలో ఎత్తుగడ కూడా ఇదే, ఒక కధ చెప్పి అందులో ఎలా ప్రవర్తించకూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో చిన్నపిల్లలకి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తుంది.

పూర్వకాలంలో గురుకులాలలో ఇలా కధల ద్వారా నీతిని చెప్పడం (చిన్నయసూరి పంచతంత్రంలో కధల ద్వారా మూర్ఖులయిన రాజకుమారులను మార్చినట్టు) ఉండేది, కానీ ప్రస్తుత విద్యావ్యవస్థలో అది సాధ్యం కావడంలేదు, అమ్మ నాన్నలకు కధలు చెప్పే తీరిక ఉండదు.

సరిగ్గా ఇక్కడే చందమామ ఒక అద్భుతమయిన పాత్ర పోషించింది. మన పురాతన విద్యావిధానంలోని కథా సాంప్రదాయాన్ని ముద్రణా వ్యవస్థ ద్వారా చిన్నారులకు అందించింది.

చిన్న చిన్న కథల ద్వారా నీతిని భోధించడమే కాదు, లౌక్యంగా ఎలా ఉండాలో చందమామలోని గడసరి కోడళ్ళు చెప్పేవారు. ఒక విషయాన్ని వేరే విధంగా ఎలా అలోచించాలో (లేటరల్ థింకింగ్), నాణేనికి రెండో వైపు చూడడం ఎలాగో భేతాళ కథల ద్వారా నేర్పేది. అందులో ఉండే బొమ్మలు (వడ్డాది పాపయ్య బొమ్మలయితే మరీను) మనలను చదివించేటట్టు పురికొల్పుతాయి. ప్రతి పేజీలోను ఒక బొమ్మ తప్పకుండా ఉండేది.

నేను ఈరోజు మంచీ చెడూ, తప్పూ ఒప్పూ ఆలోచించగలుగుతున్నాను అంటే దానిలో చందమామలో చదివిన కథల ప్రభావం చాలా ఉంది. మా ఊరి లైబ్రరీ గోడ మీద ముట్నూరి కృష్ణరావు గారి మాటలు ఇలా రాసి ఉండేవి ” ఎంత పెద్ద రాజభవనం అయినా అందులో పుస్తకాలు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను” అని.

ఈరోజు నా సరదాలలో సినిమాలు, టి.వి, అంతర్జాలం ఎన్ని వచ్చినా కానీ కొత్త పుస్తకం చూడగానే ఏదో తెలియని ఆనందం, అది చందమామ అయితే నిజంగా చిన్నపిల్లవాడిని అయిపోతాను.

కాలం చాలా శక్తివంతమయింది, సమస్త ప్రపంచం కాల ప్రభావానికి లోను అవుతుంది, చందమామ కూడా. కాలవశాన చందమామ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇదివరకు వచ్చే కధలు, అప్పటి భాషా చందమామలో ఇప్పుడు కనిపించడం లేదు.

నాకు అనిపిస్తూ ఉండేది, చందమామలోని పాత కధలన్నీ తిరిగి ముద్రించుకుంటూ పొతే బాగుండు అనీ, వారి దగ్గర 60 సంవత్సరాల బాల సాహిత్యం ఉంది, అది రాబోయే తరానికి పరిచయం చేస్తే బాగుండు అనీన్నూ.

ఈ మధ్య వారు మొదలుపెట్టిన అంతర్జాల ఎడిషన్ ద్వారా ఇది తీరగలదు అని సంతోషంగా ఉంది. ఎన్నో తరాలని తీర్చిదిద్దిన చందమామ రాబోయే తరాలకోసం సిద్దం అవుతోంది.

(ఈ చందమామ అనుభూతులు కింది బ్లాగుల లోనివి.)

http://omyfriend.blogspot.com/

http://telugubudugu.blogspot.com/2008/03/blog-post.html

రామకృష్ణ బైసాని
ఫుట్టింది – ధర్మాజీగూడెం, ప.గో.జిల్లా. చదివింది – ధర్మాజీగూడెం/చింతలపూడి/ఏలూరు/విశాఖపట్నం. ప్రస్తుత నివాసం – చెన్నపట్నం. చేస్తున్నది – సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.

2008 ఆగస్టు తర్వాత ఈ సైట్ అప్‌డేట్ అవుతున్నట్లు లేదు.

RTS Perm Link