అనగనగా ఒక చందమామ

July 29th, 2009
అనగనగా ఒక చందమామ

అనగనగా ఒక చందమామ

అనగనగా ఒక చందమామ

ఏడుస్తున్న బిడ్డను లాలించేందుకు… కొసరి కొసరి గోరుముద్దలు తినిపించేందుకు… ఆకాశంలో వేలాడే చందమామని ఆశ్రయిస్తుంది అమ్మ.

అందుకే పాలుగారే ప్రాయంలోనే మనకు చందమామతో ఆత్మీయమైన అనుబంధం ఏర్పడుతుంది.

మిగతా బంధాల మాట ఎలా వున్నా చందమామతో ఏర్పడిన బంధం మాత్రం ఎన్నటికీ చెక్కు చెదరదు.

ఏ వయసులోనైనా, ఎంత యాంత్రికంగా మనుగడ సాగిస్తున్నప్పుడైనా తలెత్తి తనవంక చూస్తే చాలు చల్లని వెన్నెల స్పర్శతో మనసు పరవశమవుతుంది.

ఆకాశంలోని చందమామతో పాటు భూలోకంలోని మరో చందమామతో ఏర్పడే అనుబంధం కూడా అంత గాఢమైనదే.

చక్రపాణి, నాగిరెడ్డి గార్లు పిల్లలకోసం అలనాడే ఓ పత్రికకు ప్రారంభించడం, దానికి ”చందమామ” అని పేరు పెట్టడం ఎంతో అబ్బురమనిపిస్తుంది.

రెండో తరగతిలోనో మూడో తరగతిలోనో వున్నప్పుడే నాకు చందమామతో పరిచయం ఏర్పడింది.

ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్లు ఒక చందమామ ప్రతిని నాకు కావాలనే ఇచ్చారో, లేక మరిచిపోయి వదిలివెళ్లారో గుర్తులేదు కానీ నన్నది

తొలిచూపులోనే వశీకరించుకుంది.

క్లాసు పుస్తకాలలో లేని ఆకర్షణ ఏదో చందమామలో వుందని అప్పుడే అనిపించింది.

కొన్ని నెలలపాటు రోజుకు ఒకసారైనా ఆ చందమామని ముందేసుకుని తరగని ఆసక్తితో అందులోని బొమ్మల్ని తిరగేస్తూ కూర్చునేవాణ్ని.

ఒక్కో వాక్యాన్ని కూడబలుక్కుంటూ చదివేవాణ్ని.

అది చూసి మా అమ్మ నాకు అప్పుడే బోలెడంత చదువు వచ్చేసినట్టు మురిసిపోతూండేది.

నిజంగా నాకు చదువు మీద జిజ్ఞాసని పెంచిందీ, పుస్తకాలను ప్రేమించడం నేర్పిందీ చందమామే.

ఆ తరువాత కొంతమంది మిత్రులం కలిసి నాలుగో తరగతినుంచే తలా కొంత డబ్బు (!) వేసుకుని చందమామని కొనడం ప్రారంభించాం. రెండు మూడు

సీరియళ్లని బైండు కూడా చేయించాం. అది వేరే కథ.

చందమామలో దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు ఎన్నివున్నా బలమైన నీతిసూత్రం వల్ల కాబోలు ఆ కథలు నాలో మూఢనమ్మకాలను

గానీ, అశాస్త్రీయమైన ఆలోచనలను గానీ పెంచలేదు. పైగా మంచితనాన్ని, మానవతని, సృజనాత్మకతని పెంపొందించాయి.

చందమామ పుస్తకాలు…. కాంతారావు (విఠలాచార్య) సినిమాలు…. దారాసింగ్‌ కింగ్‌కాంగ్‌ల కుస్తీలు…… ఓహ్‌ బాల్యం ఎంత మధురమధురంగా వుండేదో.

ఒక చందమామ కొనాలన్నా…. 37 పైసలు పెట్టి ఒక సినిమా చూడాలన్నా … కనా కష్టంగా వుండేదారోజుల్లో మాకు.

అట్లాంటిది ఇప్పుడు ఒక ఊరి గ్రంథాలయానికి సరిపడేన్ని పుస్తకాలు ఇంట్లో వున్నా నా పిల్లలకు క్లాసు పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాల పట్ల ఆసక్తి  కలగలేదు.

నేనే కలిగించలేకపోయానేమో.

అది నా ఒటమేనేమో.

వాళ్లు ఎంత ఉన్నత చదువులు చదివినా నాకిది తీరని వెలితిగా అనిపిస్తుంది. చాలా బాధనిపిస్తుంది.

సెల్లులు, వీడియో గేములు, కంప్యూటర్లు, చాటింగ్‌లు … వాళ్ల ప్రపంచమేవేరు. వాళ్ల అభిరుచులే వేరు.

ఈమధ్య కూడలిలో చందమామ గురించిన ప్రస్తావనలు చూసిన తరువాత ఇవన్నీ గుర్తొచ్చాయి.

పాత చందమామ సంచికలు ఇంటర్నెట్‌లో లభిస్తాయని తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యమనిపించిందో.

నేను ”గొడ్డలి పదును” అనే ఒకే ఒక చందమామ కథ రాశాను.

దానిని నెట్‌లో వెతికి వెతికి పట్టుకున్నప్పుడు ఎవరెస్ట్‌ శిఖరమెక్కినంత ఆనందం కలిగింది.

అట్లాగే చందమామ ఫోటో వ్యాఖ్యల పోటీలో నాకు మూడు నాలుగు సార్లు బహుమతులు వచ్చాయి. వాటిని కూడా వెతికి పట్టుకోవాలి.

చందమామ అభిమానులు పాత సంచికలకోసం ఈ కింది వెబ్‌సైట్‌ని చూడవచ్చు.

http://www.ulib.org/

(Advanced Search…Title : Chandamama,  Language: Telugu)

ఈ సమాచారం అందించిన సహ బ్లాగర్లు

నాగమురళి,

వేణువు,

బ్లాగాగ్ని

గార్లకు కృతజ్ఞతలు.

ప్రభాకర మందార

http://uyyaala.blogspot.com/2009/03/blog-post.html

1988 నాటి చందమామలో ప్రచురించబడిన తన ఏకైక కథ ‘గొడ్డలి పదును’ ను 20 ఏళ్ల అనంతరం ఆన్‌లైన్‌లో మిత్రుల సహాయంతో  చందమామ ఖజానా (ఆర్కైవ్స్) లో  కనుగొన్న క్షణాల్లో ప్రభాకర మందార గారి స్పందనను ఇక్కడ పోస్టు చేస్తున్నాము.

RTS Perm Link