‘చందమామ’లో చంద్రయాత్ర విశేషాలు

July 23rd, 2009

గగన చంద్రుడు

‘చందమామ రావే జాబిల్లి రావే’ అంటూ పాడుతూ బిడ్డను జోకొట్టని తెలుగు తల్లి ఉండదని ఓ కవి గతంలో అన్నారు. చందమామను చూపిస్తూ బిడ్డకు జోల పాడని సంస్కృతి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు కూడా.. రామాయణ కాలంలో కూడా పసిబాలుడుగా ఉన్న రాముడు చందమామ కావాలని మారాం చేస్తే కిటికీలోంచి చందమామ మిలమిలలను చూపి తల్లి అతడికి అన్నం తినిపించిందని చాటువు.

చందమామ రావే జాబిల్లి రావే అని మనసు విప్పి పాడుకున్న మనిషి ఎంతగా పిలిచినా చంద్రుడు రాకపోయేసరికి మనమే అక్కడికి పోతే పోలా అని కలకన్నాడు. శతాబ్దాలుగా ఊహాలోకంలో గగనయాత్ర చేశాడు. ప్రపంచంలోని ప్రేమికులందరికీ చెలికాడు, భూమ్మీది పిల్లలందరికీ మామ అయిన చందమామ మానవజాతికి అందరాని పండుగా వేల సంవత్సరాలుగా మనిషిని ఊహల్లో ముంచెత్తాడు.

నేటికి సరిగ్గా 40 ఏళ్ల క్రితం.. సహస్రాబ్దాలుగా మనిషికి అందనివాడు.. అయినప్పటికీ అందరివాడు… గా ఉంటూ మానవజాతి బాల్యాన్ని లాలించి, బుజ్జగించి, మైమరిపించి, మురిపించిన అందాల చంద్రుడు మనిషికి దొరికిపోయాడు. నువ్వు రానంటే రాకుండా ఉంటానా అని పాడుకుంటూ, మనిషే చంద్రుడి వద్దకు ప్రయాణమయ్యాడు. 

పిండివెన్నెల కురిపిస్తూ మానవజాతిని శీతల సోయగంతో మురిపించిన చంద్రుడు… మనిషి చిరకాల స్వప్నం శాస్త్ర సాంకేతిక విజయంగా పరిణమించిన మహత్తర క్షణంలో మనిషికి దొరికిపోయాడు. మానవజాతి సుదీర్ఘ స్వప్నాలకు, మేధస్సుకు చందమామ చిక్కిన చారిత్రక క్షణం అది. అది 1969 జూలై 20. అంతర్జాతీయ కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటి 2.17 నిమిషాలు.

చంద్రుడిపై మనిషి అడుగు పెట్టాలని అమెరికా పదేళ్లుగా కంటూ వచ్చిన కలలను సాకారం చేస్తూ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన 1969 జూలై 16న పంపిన ఈగిల్ వాహకనౌక 20వ తేదీ తొలి ఘడియల్లో చంద్రుడిపై దిగింది. చంద్రుడిపై ఉన్న సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని శాస్త్రజ్ఞులు పిలుచుకున్న చోట ఈగిల్ దిగింది. వెంటనే అమెరికాలోని హూస్టన్ కంట్రోలు రూంకు నీల్ ఆమ్‌స్ట్రాంగ్ తొలి సందేశం. ‘ఈగల్‌ క్షేమంగా చంద్రుడిని చేరింది’

ఆ తర్వాత మరో 39 నిమిషాలు భారంగా గడిచాయి. ఆనాటికి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది టీవీలముందు హత్తుకు పోయి చూస్తుండగా నీల్ ఆమ్‌స్ట్రాంగ్ మెల్లగా ఈగిల్ నుంచి బయటకు వచ్చాడు. ముందుగా తన ఎడమకాలును చంద్రుడిపై మోపాడు. ఆ క్షణం మానవ జాతిని అంతులేని ఉద్వేగంలో ముంచెత్తింది. చంద్రుడినే దొరికించుకున్న అనంత ఆనంద క్షణాల మధ్య ఆమ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తన తొలి అడుగు అనుభూతిని భూమితో పంచుకున్నాడు.

చందమామపై మనిషి పాదం మోపిన ఆ మహత్తర క్షణాల గురించి చందమామ పత్రిక 40 సంవత్సరాల క్రితమే 6 పుటల పెద్ద వ్యాసంలో తన పాఠకులకు అందించింది. 1969 నవంబర్ ప్రత్యేక సంచికలో 7నుంచి 12 వరకు గల పుటలలో “గగన చంద్రుడు” అనే పేరిట చందమామ తన పాఠకులకు చంద్రయాత్ర విశేషాలను సచిత్ర సమేతంగా అందించింది.

సరిగ్గా 40 ఏళ్ల క్రితం చందమామ (1969 నవంబర్ సంచిక) లో ప్రచురించిన చంద్రయాత్ర విశేషాలు చదవాలనుకుంటున్నారా? అయితే ఈ కింది లింకును చూడండి.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

ఇంటర్నెట్‌లో ఈ లింకును ఓపెన్ చేసి చందమామ ఆర్కైవ్స్ పుటలో కింది భాగంలో కనిపించే భాష, సంవత్సరం, నెల అనే గళ్లలో వరుసగా తెలుగు, 1969, నవంబర్ అని ఎంచుకోండి. తర్వాత ‘వెళ్లండి’ పై క్లిక్ చేయండి. ప్లాప్ అప్ అయిన నాటి చందమామ పత్రికలో 7-12 పేజీలను తెరిచి ‘గగన చంద్రుడు’ వ్యాసం చదవండి.

జూలై 20న చంద్రుడిపై మనిషి పాదం మోపిన చరిత్రకు 40 ఏళ్లు నిండిన సందర్భంగా ఆన్‌లైన్ చందమామలో కొన్ని రచనలు పోస్ట్ చేయడమైంది. మచ్చుకు ఒకటి కింది లింకులో చూడగలరు.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=44&sbCId=110&stId=1960&pg=1

ఆన్‌లైన్ చందమామలో ప్రస్తుతం పాత రచనలను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం తీసివేశారు. మీరు చంద్రయాత్ర గురించిన విశేషాలను మీ సిస్టంలోకి కాపీ చేసుకోవాలంటే కింది లింకును ఇంటర్నెట్‌లో ఓపెన్ చేసి ఆ పేజీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

http://rapidshare.com/files/258429260/MAN_ON_THE_MOON_CHANDAMAMA.pdf

చందమామతో మీ జ్ఞాపకాలను పాఠకులకు పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.

చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link