చందమామ కథ

July 7th, 2009

“…. దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.

భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు.

చందమామ పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు. ధారావాహికలన్నీ భారతదేశపు రాజ్యాలలోనూ పల్లెటూళ్ళలోనూ జరిగినట్లు వ్రాసేవారు. అన్ని ధారావాహికలలోనూ రాజులు, వారి రాజ్యాలు, అప్పుడప్పుడు రాక్షసులు, మాంత్రికులకు సంబంధించిన పాత్రలు మరియు కథలు ఉండేవి. ఒక్క రాజుల కథలేకాక సాహస వంతమైన యువకుల గురించి (రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క మొదలగునవి) కూడా ధారావాహికలు వచ్చేవి.

అంతేకాకుండా, పురాణాలు, చరిత్రకు సంబంధించిన ధారావాహికలు కూడా ప్రచురించారు. చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దలైన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు.

ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, వెయ్యిన్నొక్క రాత్రులు(అరేబియన్‌ నైట్స్‌), ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని షేక్‌స్పియర్‌ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు.

ఇవికాక గ్రీక్‌ పురాణాలైన ఇలియడ్‌, ఒడిస్సీ, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ చందమామలో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలేగాక ఇతర భాషా సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి.

అసలు బేతాళ కథలు పాతిక మాత్రమేనని తెలిసినవారు చెబుతారు. చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుతో(గా) మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతినెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టమైన ఈ పనిని, దశాబ్దాలపాటు నిరాఘాటంగా కొనసాగించడం చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం.

జానపద కథలకు చందమామ కాణాచి. చందమామ కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి. చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు. ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి. రాజులూ, వారి రాజ్యాలూ, రాజకుమారులూ, రాజకుమార్తెలూ, వారి స్వయంవరాలు, వారి సాహసాలు, మంత్రుల తెలివితేటలు, పరిపాలనా దక్షత, విదూషకుల హాస్యం, చురుకైన బుధ్ధి, ప్రభువుల విశాల హృదయం మరియు ముందుచూపు, జానపదులు, వారి అమాయకత్వంవంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజ పరిచాయి.

అసలు ఏ భారతీయ భాషైనా నేర్చుకోవడానికి ఆ భాషలోని చందమామ చదవడం ఉత్తమ మార్గం అనడం అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. కథ, కథకి సంబంధించిన బొమ్మలు ఎలా ఉండాలో, ఏ నిష్పత్తిలో ఉండాలో చక్కగా చేసి చూపించి, మిగిలిన పత్రికలకు మార్గదర్శకమైంది. చందమామ శైలిని, ఒరవడిని, ఇతరులు అనుకరించడం లేదా అనుసరించడం చెయ్యగలిగారుగాని, కొత్త శైలినిగాని ఒరవడినిగాని ఇంతవరకు సృష్టించలేక పోయారు.

“బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. -కొడవటిగంటి కుటుంబరావు….”

చందమామ కధలు ఏవి కూడా ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఉండవు, అందులో ఉండేదంతా ఒక ఐడియల్ ప్రపంచం. వాటిలో దెయ్యాలు, రాక్షసులు, మంత్రగాళ్ళు, గయ్యాళి అత్తలు, దొంగలు అందరూ ఉండేవారు. కానీ ఎవ్వరూ మరీ క్రూరంగా ప్రవర్తించరు. కధ చివరిలో చెడ్డవాళ్ళు అందరూ మారిపోయినట్టు చూపేవాళ్ళు. ప్రతి కధలోను ఒక నీతి సూత్రం ఉండేది, సమాజానికి కావలసిన ఏదో ఒక విలువని బోధించేటట్టుగా ఉండేవి.
ఇది చందమామ గురించి త్రివిక్రమ్ గారు తదితరులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ వస్తున్న వివరాలు.

ఇక నా విషయానికి వస్తే…

భారతీయ బాలసాహిత్యానికి ఒరవడి దిద్దిన చందమామ గురించి రెండే్ళ్ల క్రితం వికీపీడియాలో త్రివిక్రమ్ గారి పరిచయ వ్యాసం గురించి చదివిన తర్వాత ఇటీవలే ఆ పత్రిక ఆన్‌లైన్ విభాగంలో చేరడం వరకు అంతా కలలోలాగా సాగిపోయింది.

చందమామతో తమ బాల్యాన్ని పెనవేసుకుని పైకి ఎదిగిన నాటి తరం జ్ఞాపకాలను ఒక చోట గుదిగుచ్చి దానికి చందమామ నేటి చరిత్ర, రేపటి భవిష్యత్తుకు సంబంధించిన సమాచారంతో ఒక చరిత్రను చందమామ అభిమానుల ముందుకు తేవాలని చేసిన ప్రయత్నంలో భాగంగా గత రెండు నెలలుగా ఆన్‌లైన్‌లో చందమామ గురించి వచ్చిన, వస్తున్న కథనాలు, వ్యాసాలు, జ్ఞాపకాలను సేకరిస్తూ వస్తున్నా..

చందమామపై జ్ఞాపకాలను విడిగా వెతికి చదువుకోవడం బదులుగా ఒకే బ్లాగులో వీటన్నిటినీ పోస్ట్ చేసి ఉంచితే చందమామ అభిమానులకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనతో http://blaagu.com/chandamamalu/  పేరిట ఓ బ్లాగును తెరుస్తున్నా. త్రివిక్రమ్ గారి జ్ఞాపకాలతో మొదలు పెట్టి ఇంతవరకు నేను సేకరించిన చందమామపై బ్లాగర్ల కథనాలు అన్నిటినీ పోస్ట్ చేయాలని బావిస్తున్నా.

నాటినుంచి నేటిదాకా చందమామను తమ హృదయపు లోతుల్లో ఉంచుకుని ప్రేమిస్తూ వస్తున్న అభిమానులందరికీ ఇదొక వేదికగా ఉంటుందని ఆశిస్తున్నా. నా దృష్టికి రాకుండా మిగిలిపోయిన ఇతర రచయితల చందమామ జ్ఞాపకాలను కూడా పాఠకులు, నెటిజన్లు పంపితే అందరికీ ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నా.

చందమామ చరిత్రను, నాలుగైదు దశాబ్దాలుగా తెలుగు తరాలను మంత్రముగ్ధులను చేస్తున్న చందమామ జ్ఞాపకాలను ఒకే చోట అందిస్తున్న ఈ బ్లాగును ఆదరిస్తారని, చందమామ అభిమానులకు పంచిపెడతారని ఆశిస్తూ..

మొదట చందమామ గురించి త్రివిక్రమ్ గారు వికీపీడియాలో పోస్టు చేసిన పెద్ద వ్యాసాన్ని చిన్న చిన్న బాగాలుగా ప్రచురించడం జరుగుతుంది. తర్వాత రోహిణీ ప్రసాద్, వేణు గార్లు తదితర చందమామ అభిమానుల రచనలు వరుసగా పొందు పర్చడం జరుగుతుంది.

ఈ బ్లాగులో కామెంట్ రూపంలో లేదా నా పర్సనల్ మెయిల్ ఐడి (krajasekhara@gmail.com) కి కూడా మీకు తెలిసిన చందమామ సమాచారాన్ని, మీరు మరువని చందమామతో మీ బాల్యపు జ్ఞాపకాలను పంపుతారని, పంపాలని కోరుకుంటూ….

రాజశేఖర రాజు

RTS Perm Link

Hello world!

July 7th, 2009

బ్లాగు కు స్వాగతం. ఇది మీ మొదటి టపా. దీనిని మార్చి లేదా తొలగించి, బ్లాగడం మొదలు పెట్టండి.

RTS Perm Link