చందమామ అనుభూతులు మరపురానివి

July 31st, 2009

 మా ప్రియ మిత్రుడు రాంకీ వలన మన చిననాటి నేస్తం చందమామను గుర్తుచేసుకునే అవకాశం కలిగింది.

ఈ సందర్భంగా చందమామతో నాకున్న అనుబంధాన్ని నెమరువేస్తున్నాను.

నా చిన్న తనంలో నాకు పుస్తక పఠనంపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. కొబ్బరి మట్టలతో, తాటిటెంకలతో మొదలెట్టిన బంతాట(క్రికెట్) రెండు రూపాయల రబ్బరు బంతి కొని చెక్క బ్యాటుతో ఆడేవరకూ వచ్చింది. బంతి ఉంటే ఏడుపెంకులాట, బ్యాటు కూడా ఉంటే క్రికెట్, రెండూ లేకపోతే చెడుగుడు. ఇలా గడచిపోతున్న కాలంలో ఒకమారు మా సుశీలాబాయి టీచర్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళింట్లో చాలా పుస్తకాలు ఉండడం చూసాను.

వాళ్ళబ్బాయి మధు నా ఈడు వాడు కావడంతో ఇద్దరం కూర్చోని బొమ్మరిల్లు, చందమామ చదివాం. నా చేతిలో చందమామ బొమ్మరిల్లుతో పోలిస్తే కొంచం చిన్నదిగా అనిపించింది, అందుకని వెంటనే పుస్తకాలు మార్చుకుని చూసాను, రెండిటిలో చందమామే బావుందనిపించింది, ఎందుకో తెలియదు. అలా మొదలైన చందమామ పరిచయం కొన్నాళ్ళకి ఆగిపోయింది.

ఒక రోజు క్రికెట్ ఆడుతుండగా ఒక మిత్రుడు బాలమిత్రలోని ఒక మిని నవల కథ చెప్పాడు. అది ఒక రక్త పిచాచి కధ. అది నిజమో కాదోనని తను ఎక్కడ చవివాడో కనుక్కొని అక్కడకు వెళ్ళాను. అది శాఖా గ్రంధాలయం. బజారు దగ్గరే ఒక హోటల్ పక్కగా ఎవరికి బయటకు కనపడనట్లుగా ఉండేది.

ఆ రోజు మొదలు నాలుగు సంవత్సరాలు, ఎనిమిదో తరగతి వరకూ ఒక్క చందమామను కూడా వదల లేదు. ఎప్పుడు కూరగాయల కోసం బజారుకెళ్ళినా అక్కడ కనీసం పావుగంటైనా ఉండాల్సిందే. భేతాళ కథలు, రామాయణం వంటి సీరియల్స్‌తో మొదలుకొని , ఒక అయిదారు మూడు పేజీల కథలు, రెండు మూడు పిట్ట కథలు, పాతికేళ్ళనాటి చందమామ కథ, ఒక విదేశీ కథానువాద, వింత వార్తలు, ఇలా సాగేది ప్రస్థానం.

బొమ్మరిల్లు, బాలమిత్ర ఇలాంటివెన్ని ఉన్నా చందమామ స్థానం చందమామదే!!!

(ఈ చందమామ అనుభూతులను కింది బ్లాగు నుంచి తీసుకోవడమైంది.)

http://omyfriend.blogspot.com/2008/03/blog-post_6846.html
http://omyfriend.blogspot.com/

2008 తర్వాత ఈ బ్లాగులు అప్‌డేట్ అవుతున్నట్లు లేదు.

కృష్ణ కిశోర్ కటికిరెడ్డి  (హరి)
Age: 30
Occupation: సాఫ్ట్ వేర్ నిపుణుడు
Location: నరసాపురం
ఫుట్టింది – సికింద్రాబాద్; పెరిగింది – నరసాపురం,ప.గో.జిల్లా ; చదివింది – సికింద్రాబాద్/నరసాపురం/పాలకొల్లు/విశాఖపట్నం ; ప్రస్తుత నివాసం – బెంగళూరు; వెలగబెడుతుంది – సాఫ్ట్ వేర్ ఉద్యోగం

హరి గారికి ఈ బ్లాగు కూడా ఉన్నట్లుంది.

http://avakaigongura.blogspot.com/
2007 తర్వాత ఈ బ్లాగూ అప్‌డేట్ కావడం లేదు.

RTS Perm Link

అనగనగా ఒక చందమామ

July 29th, 2009
అనగనగా ఒక చందమామ

అనగనగా ఒక చందమామ

అనగనగా ఒక చందమామ

ఏడుస్తున్న బిడ్డను లాలించేందుకు… కొసరి కొసరి గోరుముద్దలు తినిపించేందుకు… ఆకాశంలో వేలాడే చందమామని ఆశ్రయిస్తుంది అమ్మ.

అందుకే పాలుగారే ప్రాయంలోనే మనకు చందమామతో ఆత్మీయమైన అనుబంధం ఏర్పడుతుంది.

మిగతా బంధాల మాట ఎలా వున్నా చందమామతో ఏర్పడిన బంధం మాత్రం ఎన్నటికీ చెక్కు చెదరదు.

ఏ వయసులోనైనా, ఎంత యాంత్రికంగా మనుగడ సాగిస్తున్నప్పుడైనా తలెత్తి తనవంక చూస్తే చాలు చల్లని వెన్నెల స్పర్శతో మనసు పరవశమవుతుంది.

ఆకాశంలోని చందమామతో పాటు భూలోకంలోని మరో చందమామతో ఏర్పడే అనుబంధం కూడా అంత గాఢమైనదే.

చక్రపాణి, నాగిరెడ్డి గార్లు పిల్లలకోసం అలనాడే ఓ పత్రికకు ప్రారంభించడం, దానికి ”చందమామ” అని పేరు పెట్టడం ఎంతో అబ్బురమనిపిస్తుంది.

రెండో తరగతిలోనో మూడో తరగతిలోనో వున్నప్పుడే నాకు చందమామతో పరిచయం ఏర్పడింది.

ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్లు ఒక చందమామ ప్రతిని నాకు కావాలనే ఇచ్చారో, లేక మరిచిపోయి వదిలివెళ్లారో గుర్తులేదు కానీ నన్నది

తొలిచూపులోనే వశీకరించుకుంది.

క్లాసు పుస్తకాలలో లేని ఆకర్షణ ఏదో చందమామలో వుందని అప్పుడే అనిపించింది.

కొన్ని నెలలపాటు రోజుకు ఒకసారైనా ఆ చందమామని ముందేసుకుని తరగని ఆసక్తితో అందులోని బొమ్మల్ని తిరగేస్తూ కూర్చునేవాణ్ని.

ఒక్కో వాక్యాన్ని కూడబలుక్కుంటూ చదివేవాణ్ని.

అది చూసి మా అమ్మ నాకు అప్పుడే బోలెడంత చదువు వచ్చేసినట్టు మురిసిపోతూండేది.

నిజంగా నాకు చదువు మీద జిజ్ఞాసని పెంచిందీ, పుస్తకాలను ప్రేమించడం నేర్పిందీ చందమామే.

ఆ తరువాత కొంతమంది మిత్రులం కలిసి నాలుగో తరగతినుంచే తలా కొంత డబ్బు (!) వేసుకుని చందమామని కొనడం ప్రారంభించాం. రెండు మూడు

సీరియళ్లని బైండు కూడా చేయించాం. అది వేరే కథ.

చందమామలో దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు ఎన్నివున్నా బలమైన నీతిసూత్రం వల్ల కాబోలు ఆ కథలు నాలో మూఢనమ్మకాలను

గానీ, అశాస్త్రీయమైన ఆలోచనలను గానీ పెంచలేదు. పైగా మంచితనాన్ని, మానవతని, సృజనాత్మకతని పెంపొందించాయి.

చందమామ పుస్తకాలు…. కాంతారావు (విఠలాచార్య) సినిమాలు…. దారాసింగ్‌ కింగ్‌కాంగ్‌ల కుస్తీలు…… ఓహ్‌ బాల్యం ఎంత మధురమధురంగా వుండేదో.

ఒక చందమామ కొనాలన్నా…. 37 పైసలు పెట్టి ఒక సినిమా చూడాలన్నా … కనా కష్టంగా వుండేదారోజుల్లో మాకు.

అట్లాంటిది ఇప్పుడు ఒక ఊరి గ్రంథాలయానికి సరిపడేన్ని పుస్తకాలు ఇంట్లో వున్నా నా పిల్లలకు క్లాసు పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాల పట్ల ఆసక్తి  కలగలేదు.

నేనే కలిగించలేకపోయానేమో.

అది నా ఒటమేనేమో.

వాళ్లు ఎంత ఉన్నత చదువులు చదివినా నాకిది తీరని వెలితిగా అనిపిస్తుంది. చాలా బాధనిపిస్తుంది.

సెల్లులు, వీడియో గేములు, కంప్యూటర్లు, చాటింగ్‌లు … వాళ్ల ప్రపంచమేవేరు. వాళ్ల అభిరుచులే వేరు.

ఈమధ్య కూడలిలో చందమామ గురించిన ప్రస్తావనలు చూసిన తరువాత ఇవన్నీ గుర్తొచ్చాయి.

పాత చందమామ సంచికలు ఇంటర్నెట్‌లో లభిస్తాయని తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యమనిపించిందో.

నేను ”గొడ్డలి పదును” అనే ఒకే ఒక చందమామ కథ రాశాను.

దానిని నెట్‌లో వెతికి వెతికి పట్టుకున్నప్పుడు ఎవరెస్ట్‌ శిఖరమెక్కినంత ఆనందం కలిగింది.

అట్లాగే చందమామ ఫోటో వ్యాఖ్యల పోటీలో నాకు మూడు నాలుగు సార్లు బహుమతులు వచ్చాయి. వాటిని కూడా వెతికి పట్టుకోవాలి.

చందమామ అభిమానులు పాత సంచికలకోసం ఈ కింది వెబ్‌సైట్‌ని చూడవచ్చు.

http://www.ulib.org/

(Advanced Search…Title : Chandamama,  Language: Telugu)

ఈ సమాచారం అందించిన సహ బ్లాగర్లు

నాగమురళి,

వేణువు,

బ్లాగాగ్ని

గార్లకు కృతజ్ఞతలు.

ప్రభాకర మందార

http://uyyaala.blogspot.com/2009/03/blog-post.html

1988 నాటి చందమామలో ప్రచురించబడిన తన ఏకైక కథ ‘గొడ్డలి పదును’ ను 20 ఏళ్ల అనంతరం ఆన్‌లైన్‌లో మిత్రుల సహాయంతో  చందమామ ఖజానా (ఆర్కైవ్స్) లో  కనుగొన్న క్షణాల్లో ప్రభాకర మందార గారి స్పందనను ఇక్కడ పోస్టు చేస్తున్నాము.

RTS Perm Link

మా చందమామ జ్ఞాపకాలు

July 25th, 2009

1st-chandamama-1947

బాల్యాన్ని ఎవరు మర్చిపోగలరు? బాల్యంతో ముడిపడిన చందమామ అనుభూతులను ఎవరు మర్చిపోగలరు? చందమామతో కలగలసిన ఆ పసితనాన్ని ఎవరు మరువగలరు? ఆ జ్ఞాపకాలను, చందమామ పరిమళాలను అందరికీ పంచండి. మనకంటూ మిగిలిన జాతి సంపద, సాంస్కృతిక సంపద చందమామ ఒక్కటే కదా…

చందమామ జ్ఞాపకాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వందలాదిమంది అభిమానులకు, బ్లాగర్లకు, నెటిజన్లకు ఆన్‌లైన్ చందమామను సాదర నిలయంగా మార్చాలనే ఆశయంతో http://telugu.chandamama.com     లో “మా చందమామ జ్ఞాపకాలు” విభాగాన్ని రూపొందించాము.

తెలుగునాడులో ఎంతమంది చందమామతో తమ బాల్యజీవితంలోని తాదాత్మ్య క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ పలవరిస్తున్నారో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే చిరు ఆకాంక్షతో… ఆన్‌లైన్ చందమామలో ఈ విభాగాన్ని ఏర్పర్చాము.

http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

తెలుగు జాతి సాంస్కృతిక సంపద అయిన చందమామను ఈ నాటికీ తమ జ్ఞాపకాల దొంతరలలో పదిలపరుచుకుంటున్న చందమామ అభిమానుల గుండె చప్పుళ్లను ఓ చోట చేర్చి అందరికీ పంచిపెట్టాలనే చిరు కోరికే ఈ “మా చందమామ జ్ఞాపకాలు” విభాగం రూపకల్పనకు మూలం.

జీవించడం కోసం ప్రపంచం నలుమూలలకు వలసపోయిన తెలుగు వారు చందమామ పత్రికతో తమ తరాల అనుబంధాన్ని నేటికీ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో, చందమామ జ్ఞాపకాలను పరస్పరం ఎలా పంచుకుంటున్నారో తెలిపే అమూల్యమైన వ్యాసాలు, లింకులు, తదితర సమాచారం ఈ విభాగంలో పొందుపర్చడం జరుగుతుంది.

చందమామతో తమ జ్ఞాపకాలను, అనుభూతులను ఈ విభాగంలో పంచుకోవాలని భావిస్తున్న అభిమానులకు, ‘చంపి’లకు(చందమామ పిచ్చోళ్లు) ఇదే మా సాదర ఆహ్వానం.

బాల్యంలో మీ చిన్ననాటి చిరునేస్తంగా పలకరిస్తూ వచ్చిన చందమామ జ్ఞాపకాలను మీరు తెలుగులో లేదా ఇంగ్లీషులో కింది లింకుకు పంపించగలరు. వీలయితే మీ ఫోటో, ప్రొఫైల్, ఈమెయిల్ చిరునామా తదితర వివరాలను కూడా పంపగలరు. 

ఆన్‌లైన్ చందమామకు మీ ఈమెయిల్ చిరునామాను పంపగలిగితే త్వరలో తీసుకువస్తున్న చందమామ న్యూస్‌లెటర్‌ను మీకు ప్రతివారం నేరుగా మీ ఈమెయిల్ ద్వారా పంపడానికి వీలవుతుంది.

చందమామతో మీ జ్ఞాపకాలు, మీ స్వంత రచనలు, సలహాలు, సూచనలు, విమర్శలను కింది లింకు ద్వారా ఆన్‌లైన్ చందమామకు పంపగలరు.

abhiprayam@chandamama.com

చందమామ పిచ్చోళ్లకు, అభిమానులకు చందమామ తరపున ఇదే మా ఆహ్వానం. మీ అమూల్యమైన సమయంలో కొంత కేటాయించి ఆన్‌లైన్ చందమామకు చందమామతో మీ అనుబంధం గురించి, మీకు ఆసక్తి ఉన్న అంశాలపైనా చిన్ని చిన్ని రచనలు అయినా సరే రాసి పంపడానికి మీకు వీలవుతుందా?

కథలు, గేయాలు, మీకు నచ్చిన పద్యాలు,  పాటలు, సైన్స్, టెక్నాలజీ, హాస్యం, మీకు తెలుసా, లోకజ్ఞానం, భారత దర్శిని, ప్రపంచ దర్శిని,  సాహిత్యం, శ్రావ్యమైన సంగీతం మీ ఇతర అభిరుచులు, ఆసక్తులకు సంబంధించి ఏ విషయంపైన అయినా సరే మీరు రచనలు పంపగలరు.

ప్రతి చందమామ పిచ్చోడికి, పిచ్చోళ్లకి, అభిమానులకు చందమామ ఆన్‌లైన్ తమదిగా ఫీలయ్యే వేదికగా ఉండాలని మా ప్రగాడ కాంక్ష, విశ్వాసం కూడా. హృదయం నిండా చందమామ తలపులను దివ్యంగా పొదవుకున్న మీ వంటి అభిమానులకు ఆన్‌లైన్ చందమామ సాదర నిలయంగా మారాలని కోరుకుంటున్నాం. మీరు పంపే ఏ రచనను అయినా సరే మీ పేరుతోనే చందమామలో పోస్ట్ చేస్తాము.

మీ రచన మీ స్వంతమేనని, ఆన్‌లైన్ చందమామలో ప్రచురణకు దాన్ని పంపుతున్నట్లుగా చిన్న ధ్రువీకరణను  మీ ఈమెయిల్ ఐడి ద్వారా abhiprayam@chandamama.com కు పంపితే చాలు.

చందమామతో మీ అనుబంధం గురించి ఇప్పటికే మీరు బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో పోస్ట్ చేసి ఉంటే ఆ లింకులను (url) ఆన్‌లైన్ చందమామకు పంపగలరు. అన్నిటినీ ఒకచోట అమర్చి పాఠకులందరికీ అందించడానికి వీలవుతుంది.

ఈ లోపల మీనుంచి మీ వంటి చందమామ అభిమానుల నుంచి మాకు నిజమైన సహకారం ఒకటి కావాలి. ఆశిస్తున్నాం కూడా. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఆన్‌లైన్ చందమామ రచన, డిజైన్, హోమ్ పేజీతో సహా ప్రతి ఒక్క అంశంపై మాకు మీ సలహాలు, సూచనలు, విమర్శలు, నిర్మోహమాటమైన అభిప్రాయాలు కావాలి.

చందమామ మరింత మెరుగుపడాలని, పాఠకుల కోరికలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్న మా కోరికను మీరు మన్నించినట్లయితే ఈ కింది లింకులకు మీరు మీ సూచనలు, సలహాలు, ప్రతిపాదనలు దయచేసి పంపగలరు. మీకు తెలిసిన చందమామ అభిమానులకు, ‘చంపి’లకు కూడా ఈ సమాచారం వీలయితే పంపగలరు.

abhiprayam@chandamama.com
Online@Chandamama.com

చందమామ పాత సంచికలలోని కథలను చదువదలిస్తే కింది ఆర్కైవ్స్ లింకులో చూడండి. గత సంచికల కోసం వెనక్కు వెళ్లి మీ అభిమాన కథలను మళ్లీ చదవండి. మా ఆర్కైవ్‌లను చూసి, ఆనందించండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

చందమామతో మీ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామకు తప్పక పంపించగలరు. చందమామ పాఠకులు, అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.

RTS Perm Link

చందమామ కథల మాంత్రికుడి సీరియల్స్ ప్రారంభం

July 24th, 2009

దాసరి సుబ్రహ్మణ్యం గారు … మూడుతరాల చందమామ పాఠకులను అద్భుతలోకాల్లో విహరింపజేసిన సాహితీ స్రష్ట… జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన మేటి రచయిత. ప్రముఖ తెలుగు బ్లాగర్ వేణు గారు అన్నట్లుగా దాదాపు పాతికేళ్లపాటు చందమామ పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.

‘చందమామ’ పత్రికను తల్చుకోగానే చప్పున గుర్తుకొచ్చే కథలు ఏవి అంటే.. శిథిలాలయం, రాతి రథం, యక్ష పర్వతం, మాయా సరోవరం; ఇంకా… తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట లాంటి ఉత్కంఠ భరిత జానపద ధారావాహికలు మదిలో మెదుల్తాయి. ఖడ్గ జీవదత్తులూ, జయశీల సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ… ఇలా ఒక్కొక్కరే జ్ఞాపకాల వీధుల్లో పెరేడ్ చేస్తారు; మైమరపించేస్తారు. వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారు.

 కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన తెలుగు కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.  జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారు భారతీయ కథకులలో అగ్రగణ్యులు.

ప్రపంచానికి హ్యారీ ప్యాటర్లు, స్పైడర్ మేన్లు, తెలియని కాలంలోనే, ‘తోకచుక్క’తో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్య సృష్టి – చందమామ లోని ఈ ధారావాహికలు!

తోకచుక్క                           1954
మకర దేవత                      1955
ముగ్గురు మాంత్రికులు      1957
కంచుకోట                          1958
జ్వాలాద్వీపం                     1960
రాకాసిలోయ                    1961
పాతాళదుర్గం                    1966
శిథిలాలయం                   1968
రాతిరథం                         1970
యక్ష పర్వతం                 1972
మాయా సరోవరం            1976
భల్లూక మాంత్రికుడు        1978

 
చందమామలో ఆయన రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24 సంవత్సరాలపాటు వరుసగా రాసినవి.
 
ఖడ్గవర్మ, జీవదత్తు, జయశీలుడు, సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ వంటి పాత్రలతో  రెండు, లేదా మూడు తరాల పిల్లలకు బాల్యపు హీరోలను అందించిన మేటి రచయిత సుబ్రహ్మణ్యం గారు. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన ఈయన చందమామలో యాబై నాలుగేళ్ళు పాటు (2006వరకూ) పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు.

చందమామలో ప్రారంభం నుంచి మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వస్తున్నప్పటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పన్నెండు ధారావాహికలు తెలుగు జాతికి, పిల్లలకు, పెద్దలకూ కథల రూపంలో అమృతాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు.

బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్‌వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం కూడా మళ్లీ చందమామను పెద్దలకు లాగే హత్తుకోవాలనే ఆకాంక్షతో ఆయన 1966లో రాసిన పాతాళదుర్గం సీరియల్‌ను తిరిగి ఆన్‌లైన్ చందమామలో ఈ వారం నుంచి ప్రచురిస్తున్నాం. ఇప్పటికే ఆయన సీరియల్ ‘యక్షపర్వతం’  ఆన్‌లైన్ చందమామలో పూర్తిగా ప్రచురితమైన విషయం తెలిసిందే.

వరుస క్రమంలో కాకపోయినప్పటికీ, ప్రింట్ చందమామ, ఆన్‌లైన్ చందమామల మధ్య సాంకేతిక సమన్వయం కుదిరిన మేరకు సుబ్రహ్మణ్యంగారి అలనాటి ధారావాహికలను ఒక్కటొకటిగా ఆన్‌లైన్‌లో ప్రచురించబోతున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నాం.

వేణుగారికి నెనర్లు

మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.

చందమామ గత సంచికలలోని కథలకోసం ఆర్కైవ్స్ లోకి వెళ్లి చూడండి.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

 చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

‘చందమామ’లో చంద్రయాత్ర విశేషాలు

July 23rd, 2009

గగన చంద్రుడు

‘చందమామ రావే జాబిల్లి రావే’ అంటూ పాడుతూ బిడ్డను జోకొట్టని తెలుగు తల్లి ఉండదని ఓ కవి గతంలో అన్నారు. చందమామను చూపిస్తూ బిడ్డకు జోల పాడని సంస్కృతి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు కూడా.. రామాయణ కాలంలో కూడా పసిబాలుడుగా ఉన్న రాముడు చందమామ కావాలని మారాం చేస్తే కిటికీలోంచి చందమామ మిలమిలలను చూపి తల్లి అతడికి అన్నం తినిపించిందని చాటువు.

చందమామ రావే జాబిల్లి రావే అని మనసు విప్పి పాడుకున్న మనిషి ఎంతగా పిలిచినా చంద్రుడు రాకపోయేసరికి మనమే అక్కడికి పోతే పోలా అని కలకన్నాడు. శతాబ్దాలుగా ఊహాలోకంలో గగనయాత్ర చేశాడు. ప్రపంచంలోని ప్రేమికులందరికీ చెలికాడు, భూమ్మీది పిల్లలందరికీ మామ అయిన చందమామ మానవజాతికి అందరాని పండుగా వేల సంవత్సరాలుగా మనిషిని ఊహల్లో ముంచెత్తాడు.

నేటికి సరిగ్గా 40 ఏళ్ల క్రితం.. సహస్రాబ్దాలుగా మనిషికి అందనివాడు.. అయినప్పటికీ అందరివాడు… గా ఉంటూ మానవజాతి బాల్యాన్ని లాలించి, బుజ్జగించి, మైమరిపించి, మురిపించిన అందాల చంద్రుడు మనిషికి దొరికిపోయాడు. నువ్వు రానంటే రాకుండా ఉంటానా అని పాడుకుంటూ, మనిషే చంద్రుడి వద్దకు ప్రయాణమయ్యాడు. 

పిండివెన్నెల కురిపిస్తూ మానవజాతిని శీతల సోయగంతో మురిపించిన చంద్రుడు… మనిషి చిరకాల స్వప్నం శాస్త్ర సాంకేతిక విజయంగా పరిణమించిన మహత్తర క్షణంలో మనిషికి దొరికిపోయాడు. మానవజాతి సుదీర్ఘ స్వప్నాలకు, మేధస్సుకు చందమామ చిక్కిన చారిత్రక క్షణం అది. అది 1969 జూలై 20. అంతర్జాతీయ కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటి 2.17 నిమిషాలు.

చంద్రుడిపై మనిషి అడుగు పెట్టాలని అమెరికా పదేళ్లుగా కంటూ వచ్చిన కలలను సాకారం చేస్తూ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన 1969 జూలై 16న పంపిన ఈగిల్ వాహకనౌక 20వ తేదీ తొలి ఘడియల్లో చంద్రుడిపై దిగింది. చంద్రుడిపై ఉన్న సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని శాస్త్రజ్ఞులు పిలుచుకున్న చోట ఈగిల్ దిగింది. వెంటనే అమెరికాలోని హూస్టన్ కంట్రోలు రూంకు నీల్ ఆమ్‌స్ట్రాంగ్ తొలి సందేశం. ‘ఈగల్‌ క్షేమంగా చంద్రుడిని చేరింది’

ఆ తర్వాత మరో 39 నిమిషాలు భారంగా గడిచాయి. ఆనాటికి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది టీవీలముందు హత్తుకు పోయి చూస్తుండగా నీల్ ఆమ్‌స్ట్రాంగ్ మెల్లగా ఈగిల్ నుంచి బయటకు వచ్చాడు. ముందుగా తన ఎడమకాలును చంద్రుడిపై మోపాడు. ఆ క్షణం మానవ జాతిని అంతులేని ఉద్వేగంలో ముంచెత్తింది. చంద్రుడినే దొరికించుకున్న అనంత ఆనంద క్షణాల మధ్య ఆమ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తన తొలి అడుగు అనుభూతిని భూమితో పంచుకున్నాడు.

చందమామపై మనిషి పాదం మోపిన ఆ మహత్తర క్షణాల గురించి చందమామ పత్రిక 40 సంవత్సరాల క్రితమే 6 పుటల పెద్ద వ్యాసంలో తన పాఠకులకు అందించింది. 1969 నవంబర్ ప్రత్యేక సంచికలో 7నుంచి 12 వరకు గల పుటలలో “గగన చంద్రుడు” అనే పేరిట చందమామ తన పాఠకులకు చంద్రయాత్ర విశేషాలను సచిత్ర సమేతంగా అందించింది.

సరిగ్గా 40 ఏళ్ల క్రితం చందమామ (1969 నవంబర్ సంచిక) లో ప్రచురించిన చంద్రయాత్ర విశేషాలు చదవాలనుకుంటున్నారా? అయితే ఈ కింది లింకును చూడండి.
http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

ఇంటర్నెట్‌లో ఈ లింకును ఓపెన్ చేసి చందమామ ఆర్కైవ్స్ పుటలో కింది భాగంలో కనిపించే భాష, సంవత్సరం, నెల అనే గళ్లలో వరుసగా తెలుగు, 1969, నవంబర్ అని ఎంచుకోండి. తర్వాత ‘వెళ్లండి’ పై క్లిక్ చేయండి. ప్లాప్ అప్ అయిన నాటి చందమామ పత్రికలో 7-12 పేజీలను తెరిచి ‘గగన చంద్రుడు’ వ్యాసం చదవండి.

జూలై 20న చంద్రుడిపై మనిషి పాదం మోపిన చరిత్రకు 40 ఏళ్లు నిండిన సందర్భంగా ఆన్‌లైన్ చందమామలో కొన్ని రచనలు పోస్ట్ చేయడమైంది. మచ్చుకు ఒకటి కింది లింకులో చూడగలరు.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=44&sbCId=110&stId=1960&pg=1

ఆన్‌లైన్ చందమామలో ప్రస్తుతం పాత రచనలను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం తీసివేశారు. మీరు చంద్రయాత్ర గురించిన విశేషాలను మీ సిస్టంలోకి కాపీ చేసుకోవాలంటే కింది లింకును ఇంటర్నెట్‌లో ఓపెన్ చేసి ఆ పేజీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

http://rapidshare.com/files/258429260/MAN_ON_THE_MOON_CHANDAMAMA.pdf

చందమామతో మీ జ్ఞాపకాలను పాఠకులకు పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.

చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

వెన్నెల చల్లదనం

July 21st, 2009

నా చిన్నప్పుడు ఒక పున్నమి రాత్రి మాయమ్మ మమ్మల్ని ఒడిలో కూర్చొండబెట్టుకుని చంద్రుని కథ చెప్పింది. వెన్నెలకు ఆ చల్లదనం ఎలా వచ్చింది అనేదే ఆ కథ. చంద్రుడి వెన్నెల చల్లదనం గురించి చందమామ మాసపత్రిక అప్పట్లో చెప్పిన మరుపురాని మానవీయ కథ ఇది. ఇక్కడ మా ఊర్లో మా చిన్నతనంలో చందమామ పత్రిక మాకు ప్రసాదించిన జ్ఞానం గురించి కొంత నేపథ్యం తెలుసుకుంటే మంచిదనుకుంటా…

కడప జిల్లా రాయచోటి తాలూకా సుండుపల్లి మండలంలో బాహుదా (చెయ్యేరు) నది దాటితే వచ్చే మా ఊరులో దాదాపు ముప్పై లేదా ముప్పై అయిదేళ్లకు ముందు మా కుటుంబం (నలుగురు అన్నదమ్ములు, వారి పిల్లలు, అవ్వాతాతలు కలిసి 30మంది) మొత్తం ఇంటికొకటి చొప్పున చందమామ, బాలమిత్ర, బుజ్జాయి వంటి కథల పత్రికలను క్రమం తప్పకుండా తెప్పించుకునేది. వాటిని చదవడంలో పెద్దలు, పెదపెద్దలు, పిల్లలు, పినపిల్లలు అంతా పోటీలు పడేవాళ్లం. వ్యవసాయపనుల్లో అందరూ మునుగుతున్నందున ఎవరికి తీరిక ఉంటే వారు కథ చదివితే తక్కినవారి వంతు తర్వాత వచ్చేది.

ఆ రోజుల్లో సీరియల్‌గా మహాభారతం, రామాయణం, భాగవతం కథలు, భేతాళ కథలు వంటివి వచ్చేవి కాబట్టి ముందుగా చదవని వారు ఈ నెల ఫలానా కథ ఏమైంది అని అప్పటికే చదివిన వారిని అడగటం, వారు యథాశక్తిగా తమ తీరులో కథను చెప్పటం, తర్వాత పుస్తకం వంతులు మారి చేతికొచ్చినప్పుడు మళ్లీ ఆ కథలను చదివి మననం చేసుకోవటం.. ఇలా మా చిన్నతనంలో -1970-77- ఏళ్ల తరబడి ఈ కథా పారాయణం, పఠనం సాగుతూ వచ్చింది. పుస్తకాన్ని కొని చదివే స్తోమత, సాహిత్య పరిచయం కలిగిన తెలుగు కుటుంబాలకు 60, 70 ల కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చేమో…

ఈ నేపథ్యం నుంచి బయటకి వస్తే చందమామకు ఆ చల్లదనం ఎక్కడినుంచి వచ్చింది…. ఏ మహత్తర క్షణంలో మా అమ్మ చందమామ చల్లదనం గురించి చందమామ పత్రికలో వచ్చిన ఆ వెన్నెల రాత్రి కథను చల్లగా చెప్పిందో కాని ఈ రోజుకూ కథ విన్న ఆ రాత్రినీ, ఆ అనుభూతినీ, అది రేపెట్టిన ఆలోచనలను మర్చిపోలేకున్నానంటే నమ్మండి. చందమామలో ఆ నాడు వచ్చిన, అమ్మ చెప్పిన ఆ చల్లదనపు కథను నేను గుర్తుపెట్టుకున్నంతమేరకు చెబుతున్నా వింటారా…. చదవటం కూడా వినటంతో సమానమే కదా..

సూర్యుడు, వరుణుడు, అగ్ని, చంద్రుడు ఈ నలుగురికీ ఒకే తల్లి అట. అల్లారు ముద్దుగా ఎక్కువ తక్కువ తేడాలు లేకుండా ఆ తల్లి తన పిల్లలను పెంచి పెద్ద చేసిందట.. ఒకరోజు దేవతలలో ఎవరో ఒకరికి పెళ్లి జరుగుతోందట…వీళ్ల తండ్రి పనిమీద బయటకు వెళ్లాడట. -దేవతలకు పని ఏముంటుంది అని అడగకండి వాళ్ల స్థాయిలో వాళ్ల పనులు వాళ్లకుంటాయి కదా…కంటెంట్ ప్రొవైడర్లకు, లోకలైజర్లకే కాక కార్పొరేట్ ఆఫీసుల్లో ఎడిటర్లకు, మేనేజర్లకు కూడా వాళ్ల స్థాయి పని వాళ్లకున్నట్లు మరి-

పాపం మరి భర్త లేనప్పుడు ఎంత దేవతా స్త్రీ అయితే మాత్రం ఆ సూర్యవరుణాగ్నిచంద్ర మాత తన ఇల్లు విడిచి బయటకు పోవచ్చా మరి. పోకూడదు కదా… అలాగని పెళ్లికి హాజరు కాకపోతే ఆ పెళ్లాడే దేవతా కుటుంబం ముఖం మళ్లీ చూడాలాయె. అందుకన్జెప్పి తాను పోకున్నప్పటికీ తన పిల్లలను ఆ పెళ్లికి పంపించిందామె.

అలా పిల్లలను పెళ్లికి పంపుతూ తల్లి ఒక మాట చెప్పింది. నాయనా… పెళ్లి పందిర్లో ఎవరితో గొడవపడకండి, అల్లరి చేయకుండా, తోటి పిల్లలతో కొట్లాడకుండా పదిమందిలో పేరు తెచ్చుకోండి. మన ఇంటి పేరు నిలబెట్టండి.. ఇలాంటి బుద్ధి మాటలు చెబుతూ చివరలో పెళ్లి విశేషాలను తిరిగొచ్చాక వివరంగా చెప్పమంది. పెళ్లికి పోయినందుకు గుర్తుగా ఏదైనా అక్కడినుంచి తీసుకురమ్మని చెప్పింది.

తల్లి మాటలకు ఓ అన్నారు పిల్లలు. తల్లి సాగనంపింది. నలుగురు పిల్లలూ ఏ ఒకరూ తనకు ఎక్కువా కాదు తక్కువా కాదు. పేగు బంధం భేదమెరుగదు కదా..వెళుతున్న పిల్లలకేసి చూస్తూ ఆలోచనలతో ఇంటి మార్గం పట్టింది. మరోవైపు ఈ నలుగురూ పెళ్లికెళ్లారు. మాట ప్రకారం మెత్తగా, ఎవరితో గొడవపడకుండా గడిపారు. ముహూర్తం రాగానే అక్షంతలు చల్లారు. తంతు పూర్తి కాగానే విస్తళ్లు పడ్డాయి. పోటీగా పరుగెత్తి భోజనాలకు కూర్చున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు సుష్టుగా భోంచేశారు. ఇకేముంది తోటి పిల్లలకు వస్తామంటూ చెప్పి బయలుదేరారు.

ఇంటికి రాగానే తల్లి దగ్గరకు తీసుకుని ముద్దాడింది. పెళ్ళి విశేషాలు నలుగురు పిల్లలనూ అడిగి మరీ తెలుసుకుంది. తర్వాత తీరిగ్గా అడిగింది. పెళ్లి గుర్తుగా నాకేమన్నా తెచ్చారామ్మా అంటూ….పెద్దవాడు సూర్యుడు బిక్కచూపులు చూశాడు. నడిపోడు వరుణుడు తేల ముఖం వేశాడు. చిన్నోడు అగ్ని పాలిపోయాడు. అమ్మ చెప్పిన మాట మర్చిపోయారుగా. ఇక కట్టకడపటివాడు చంద్రుడు..తల్లి పిలిచింది. తలమీద చేయివేసి హత్తుకుంది. నువ్వు కూడా ఏమీ తేలేదామ్మా అంటూ చిన్నబోయిన స్వరంతో అడిగింది.

తేకేం.. తెచ్చానమ్మా పెళ్లి భోజనంలో లడ్డూ కారాలు పెట్టారు.. లడ్డు కొంత తిని కొంత ఇదిగో నా గోట్లో పెట్టుకుని తీసుకొచ్చా.. అంటూ గోట్లోంచి తుంపిన లడ్డుముక్క తీసి తల్లి చేతిలో పెట్టాడు. (గోట్లో ఎంత లడ్డుపడుతుంది అని అడగకండి.. అవి దేవతల గోళ్లు..) తింటూంటే నువ్వు చెప్పింది గుర్తుకొచ్చింది. జేబులో పెట్టుకుంటే తింటున్న పక్కవారు చూసి నవ్వుతారు కదా అని పట్టినంత ముక్క గోటిలో పెట్టుకుని తీసుకొచ్చా అంటూ చెప్పాడు మెత్తగా….

తల్లి గుండె నీరయింది. కంట నీరు చిప్పిల్లింది. మాతృహృదయం ఒక్కసారిగా ఒణికింది. ఆబగా పిల్లాడిని కౌగలించుకుంది. జుట్టు చెరిపింది. సంతోషంతో తల్లి కడుపు సగం నిండిపోయింది. చాలమ్మా.. నువ్వయినా మాట గుర్తు పెట్టుకున్నావు. చెప్పిన మాట నిలబెట్టావు అంటూ మనసారా నవ్వింది. అంతలోనే రోషకషాయిత నేత్రాలతో పెద్దపిల్లలకేసి చూసింది. నిజంగా వణికిపోయారు వాళ్లు. వాళ్లకేసి తీవ్రంగా చూస్తూ ఇలా శపించింది.

మీరు పెళ్లిలో తిన్నదాంట్లో భాగం అడగలేదురా నేను…తల్లిని నన్ను మర్చిపోవద్దన్నానంతే.. ఏదైనా గుర్తుగా తీసుకురమ్మని చెప్పాను. మరి కనీసం తల్లి మాటను గుర్తు పెట్టుకోలేకపోయారు మీరు. అందుకే తల్లి మనసును బాధించిన మీరు ఎంత మంచిపని చేసినప్పటికీ లోకంచే తిట్లు పడుతూ ఉండండి కలకాలం అంటూ శపించింది.

పెద్ద కొడుకులకు శాపాల వరాలు పూర్తయ్యాక చిన్నపిల్లాడికేసి చూసింది. పెళ్లి తీపి తెచ్చినందుకు, తినిపించినందుకు కాదురా…. నా మాట గుర్తుపెట్టుకున్నావు. అంతే చాలు నాకు..తల్లి మనసును సంతోషపెట్టావు. జన్మకిది చాలు.. ఈ క్షణం తల్లిగా నేను అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని నువ్వు కలకాలం లోకమంతటికీ పంచెదవు గాక అంటూ దీవించింది.

ఇంకేముంది ఆ రోజే సూర్యచంద్రాదుల గతులు నిర్దేశించబడ్డాయట. నలుగురూ లోకకళ్యాణంకోసమే పాటు పడుతున్నప్పటికీ ఆ ఆరోజునుంచి తొలి ముగ్గురూ లోకంలో అందరిచేత తిట్లు, శాపనార్థాలు తింటూ ఉండసాగారు. ఎందుకో తెలుసా…

సకల జీవులకు వెలుగునిచ్చే సూర్యుడు మార్తాండావతారమెత్తి ఆయా పనులు చేసుకునే వారికి ఉక్క పుట్టించి చెడతిట్లు తింటాడు గదా… మరి వరుణుడు…..సకల పంటలకూ, ఫలాలకు, ఫలితాలకు కారకుడైనప్పటికీ అడ్డదిడ్డంగా వర్షాలు కురిపించి, తుపానులు పుట్టించి, ఊర్లకు ఊర్లనే లేపుతూ ప్రపంచంలో ఏదో ఓ చోట ప్రతిరోజూ అకాలవర్ష బాధ్యుడిగా, అతివృష్టి కారకుడిగా జనం శాపనార్థాలకు గురవుతుంటాడు గదా..

ఇక పోతే అగ్ని. భూమిని పునీతం చేసే పని. సకల వ్యర్థాలు, చెత్తలను తనలో మరిగించుకుని కొత్త సృష్టికి నాంది పలికే పని. పనికిమాలినదాన్ని ఎంత తగులబెట్టి అరగించుకున్నప్పటికీ, శాపకారణంగా మనుషులకు ఉపయోగపడే వాటిని కూడా లాగించేస్తుంటాడు. ఎంతమంది కొంపలు ఆ రోజునుంచి ఆర్పేశాడని మరి….ఎన్ని ఊళ్లను మటుమాయం చేశాడని…తల్లి శాపం తగిలిన క్షణంలో అడుగుపెట్టిన చోటల్లా భస్మీపటలమే కదా. మరి తిట్లు గాక దీవెనలు దక్కుతాయా…

మరి చంద్రుడూ… సొంత అన్నలు కూడా గమనించనంత జాగ్రత్తగా పెళ్లి లడ్డును తుంపి గోటిలో ఉంచుకుని తెచ్చి తల్లికి ఇచ్చాడు కదా. ఆ అభిమాన బలం ఊరకే పోతుందా మరి..అందుకే తల్లి దీవెన ఫలించి చల్లటి జీవితం దక్కింది. తన ఈ చిన్ని కార్యంతో తల్లిని సంతోషపెట్టిన వాడు, తల్లి మనస్సును చల్లబరచిన వాడు…సమస్త లోకానికే చల్లదనం పంచి ఇచ్చే మహా వరం పొందాడు.

ఆనాటినుంచి ఈనాటిదాకా చంద్రుడు ఎక్కడ అడుగుపెట్టినా చల్లదనం పారాడుతుంది. సమస్త జీవరాశులూ పిండి వెన్నెలను ఆస్వాదించి పరవశిస్తాయి. తల్లి మనసులో చల్లదనం పోసిన చంద్రుడు సూర్యవరుణాగ్నుల అసందర్భ క్రియలనుంచి లోకాన్ని కాపాడి అందరికీ వెన్నెల చల్లదనాన్ని పంచిపెడతాడు…అన్నిటికంటే మించి చంద్రుడి కంటే మించిన సోషలిస్టు, సమానత్వ వాది ఈ ప్రపంచంలోనే దొరకడేమో కదా…

సూర్యుడు బలవంతులనూ ధనవంతులనూ తాకలేడు వేధించలేడు. ప్రాచీన మధ్యయుగాలలో భారీ ఎత్తు మందపు రాతి కట్టడాలు సూర్యుడి బారినుంచి రాజులను చక్రవర్తులను, నిచ్చెన మెట్ల పైభాగంలో ఉన్నవారిని కాపాడితే ఇప్పుడు ఎసి ఉన్న మారాజులు సూర్యుడి వేడిని ఏ మాత్రం లెక్క చేయరు. రాజమందిరాలు, ధనికుల సౌధాలు అప్పుడూ ఇప్పుడూ కూడా వరుణుడి ప్రతాపానికి, మహోగ్నిజ్వాలలకు బెదిరిపోవు, చెదిరిపోవు..

మరి చంద్రుడి విషయానికి వస్తేనో….చంద్రుడు నిజంగా పేదల మనిషి. రాజాంతఃపురాలకంటే ఆకాశ హర్మ్యాల కంటే అపార్ట్‌మెంట్ బతుకులకంటే మిన్నగా చంద్రుడు పేదలపట్లే పక్షపాతం చూపిస్తాడు. చంద్ర వెన్నెల సోయగం నిజంగా పేదల గుడిసెలలోనే తారాడుతుంది. సామాన్యుల ఇళ్లలోనే వెన్నెల తెల్లగా వెల్లివెరుస్తుంది. తాపం బారిన పడే జనాలకు నిజమైన స్వాంతన వెన్నెల చల్లదనం నుంచే లభిస్తుంది. ప్రజల మిత్రులు ఎవరంటే తనకే సాధ్యమైన రీతిలో చల్లదనాన్ని పంచి పెట్టే చంద్రుడి లాంటి వారే కదా………

అమ్మ కథ ఆపేసింది…. ఆ రాత్రివేళ, ఒక అందమైన స్వాప్నిక ప్రపంచం హద్దుల్లోకి తీసుకు పోయి మమ్మల్ని అక్కడ వదిలేసింది. చల్లదనపు మహత్తు గురించిన అనుభూతిలో మమ్మల్ని ముంచెత్తింది. కథా శ్రవణం నుంచి, పిల్లలకే సాధ్యమైన మంత్రజగత్తులోంచి మెల్లగా లోకంలోకి వచ్చి పడ్డాం. చుట్టూ చూస్తే వెన్నెల.. పిండారబోసినట్లుగా, అమ్మ మనసును సంతోషపెట్టినట్లుగా, తరతరాలుగా, యుగయుగాలుగా ఒకే బాట.. చల్లదనాన్ని లోకంముందు పరుస్తూ పోతూ వెన్నెల..పిండి వెన్నెల….

కధ విన్నది ముగ్గురు పిల్లలం. నోటిమాటలేదు మాకు. మూగబోయాం. ఆ మహిమాన్విత చంద్రకాంతి చల్లదనంలో తడిసి ముద్దయ్యాం. ఆ కథ వినక ముందు మా జీవితాలకు విన్న తర్వాత ఆ క్షణంలో మా జీవితాలకు ఏదో వార..ఏదో అగాథం..ఏదో వ్యక్తావ్యక్తవేదన… స్వప్న, వాస్తవ ప్రపంచాలకు మధ్య ఏదో తేడా. తెలిసీ తెలియని తేడా….ఆ తేడా ఏమిటి అని మేం కొట్టుమిట్లాడుతున్నాం… ఏం చెప్పాలో ఏమని చెప్పాలో అర్థం కాని స్థితి.

కథ చెప్పినప్పుడల్లా అమ్మ అడుగుతుంది మమ్మల్ని.. ఆ కథలోని నీతి ఏమిటి అని..దాంట్లోంచి ఏం గ్రహించారు అని. మాకు తెలియని, ఆనాటి మా ఊహకు అందని మాటల్లో మెల్లగా గొణిగాం…అమ్మ మనసును కష్టపెట్టకూడదు ఇదే కదా ఆ కథలో ఉన్న నీతి..ముగ్గురు పిల్లలమూ దీనికే ఓటేశాం. అమ్మ చాలాసార్లు మేం గ్రహించిన కథాసారాన్ని ఖండించో లేక ఇంకాస్త సవరించో దాంట్లోని అసలు విషయాన్ని చివర్లో వివరించేది…

కానీ ఆరోజు అమ్మ ఆశ్చర్యకరంగా మా ఓటు వైపే మొగ్గు చూపింది. అదే ఆకథలోని అసలు నీతి అని తేల్చి చెప్పేసింది. ఇన్నాళ్లకు అమ్మ మనస్సును అర్థం చేసుకున్నాం, గెలిచాం అని అనుకుంటున్నాం.. ఇంతలో ఉన్నట్లుండి ఒక ప్రశ్న విసిరింది. “తల్లి మనసుకు కష్టం తగలనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా…”

మా పసిహృదయాలకు ఆరోజు అర్థం కాని ప్రశ్న అది. మూగబోయాం.. మాకే తెలియని ఓ కొత్త నిశ్శబ్దం….తన పాతికేళ్ల నవ యవ్వన మాతృ జీవితంలో పొందిన ఏ బాధాకర అనుభవాలు ఆమెను ఆ క్షణంలో ముంచెత్తాయో… ఆ సమయంలో ఆ కథలోని అమ్మ స్థానంలో తానే ఆవహించిందో… తండ్రితో, భర్తతో, మొత్తం సమాజంతో తన హృదయానికి తూట్లు పడిన గాయాల చరిత్రనే ఆరోజు ఆమె అలా ప్రశ్న రూపంలో వెలువరించిందో..

ఇదీ మేము పుట్టిపెరుగుతున్న రోజుల్లో చందమామ పత్రిక మాకు అందించిన గొప్ప మానవీయ కథ. ఆరోజు మేం ఏం చెప్పాలో తెలీని క్షణాల్లో అమ్మను గట్టిగా హత్తుకుని ఆమె మానుంచి ఏ క్షణాల్లో అయినా జారిపోతుందేమో, దూరమైపోతుందేమో అనే భయాందోళనల మధ్య గడిపాం…

కాని ఈ రోజు.. దాదాపు 30 సంవత్సరాలు దాటాక…ఆ తల్లే మాకు దూరమయ్యాక, సమాజం పట్ల కొంచెంగా పెరిగిన జ్ఞానంతో ఆ ప్రశ్నను కాస్త మార్చి ఇలా చెప్పుకుంటే.. స్త్రీల మనసుకు కష్టం తగులనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా

కాస్తంత విశాలంగా ఆలోచిస్తే….. మనిషికి మనిషికి మధ్య భయంకరమైన అగాధాలు, అంతరాలు, వ్యక్తిత్వ హత్యలు, అహంకారాలు, జీవన విధ్వంసాలు పెచ్చరిల్లుతున్న పాడుకాలంలో… మనిషికి ఎందుకు కష్టం తగులుతోంది. మనిషి మనసు ఎందుకు బాధపడుతోంది..అనే ప్రశ్నలోనే పై ప్రశ్నకు కూడా సమాధానం ఉందేమో మరి.

మహిళలకే కాదు, సమాజంలో ఏ ఒక్కరికీ ప్రశాంతత లేదు. తినడం, సంపాదించడం, చావడమే జీవితచక్రంగా మారి మిగిలిన అన్నివిలువలూ లుప్తమవుతున్న కాలంలో స్త్రీల మనస్సుకు కష్టం అనే సమస్య సమస్త మానవుల కష్టం అనే మౌలిక సమస్యలోనే దాగి ఉందేమో…

మనిషి జీవితంలో సుఖమే లేదా మరి. అనుబంధాలలో, బాంధవ్యాలలో చల్లదనమే లేదా…చల్లదనాన్ని పంచిపెట్టే గుణమే సమాజంలో హరించుకుపోయిందా.. ఆ తల్లి మొత్తం సమాజానికే ఇంత గాఢమైన ప్రశ్న సంధించి ఉండవచ్చు కాని ఆమె జీవితంలో ఎప్పుడూ ఏ సుఖమూ అనుభవించలేదా… మరీ ఇంత ప్రతికూల ధోరణితో మానవ జీవితంపైనే వ్యాఖ్యానాలు చేయవచ్చా అనే ప్రశ్నలు ఎవరికయినా రావచ్చు…

అయితే మనం మన అవ్వలను, తాతలను, కాటికి సిద్ధంగా ఉన్న కడు వృద్ధులను ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుంది. నా అనుభవంలో, లోకంలో పుట్టి మహత్కార్యాలు సాధించిన వారు, సాధించకున్నా నిండు జీవితాలను తమ స్థాయిలో తమదైన రీతిలో గడిపి చివరికి మిగిలేదేమిటి అని చివరి పరామర్శకు దిగినవారిని ప్రశ్నించినప్పుడు వారు దాదాపు ఒకేలా సమాధానం ఇచ్చారు.

ఎవరి వద్దకో ఎందుకు తన కూతురు వెళ్లిపోయినా ఇంకా బ్రతికే ఉన్నానంటూ వ్యధ చెందుతున్నప్పటికీ, జీవితసారమిదే, మనం దీనిని భరించాల్సిందే అని చెప్పే మా అవ్వే తన జీవితానుభవాల్లో మానవసారాన్ని ఎత్తి చూపుతుంది. జీవితంలో సుఖం కన్నా కష్టం పాలే ఎక్కువ. సుఖపడుతున్నాం, సంతోషంగా ఉంటున్నాం అనుకునే క్షణంలోనే ఏదో ఒక కష్టం మనలను వెన్నాడుతుంది, ముప్పుతిప్పలు పెడుతుంది. దాన్ని భరించడమే తప్ప మనం ఏం చేయలేం.. అనే సాంప్రదాయ జీవన తాత్వికతకు మా అవ్వ ప్రతిరూపంగా కనిపిస్తుంది.

మొత్తం మీద మనిషి జీవితంలో చల్లదనం లేదు. మానవ సమాజంలో చల్లదనం లేదు. ఇదే వాస్తవమైతే మనలో, మనందరిలో ఆ చల్లదనాన్ని రకరకాలుగా హరించివేసే ఉష్ణతాపం రగులుతూ ఉన్నట్లే… ఇక్కడ స్త్రీల మనస్సే కాదు, పురుషుల మనస్సే కాదు, వృద్ధుల మనస్సే కాదు లోకంలో బతికే ఎవరి మనస్సు కూడా చల్లదనంతో లేదన్నదే వాస్తవం. మనిషి జీవితం వేడెక్కుతుందో లేదో చూడాలంటే… ముప్పై ఏళ్లక్రితమే వచ్చిన అపరూప చిత్రం తాతామనవడు చూడండి చాలు.

ఆ చిత్రంలో, కాటికి కాళ్లు చాపుకున్న కన్నతండ్రి ఇక ఒక్క క్షణం ఉన్నా కుటుంబానికి భారమే అనే ఉద్దేశ్యంతో సాక్షాత్తూ పుత్రరత్నమే తన ముదుసలి తండ్రికి గొయ్యి తవ్వుతూంటే ఆ పుత్రరత్నపు సుపుత్రరత్నం (తాతకు మనవడు) తన తండ్రికి సైతం గొయ్యి తవ్వాలని బయలుదేరుతాడు.. ఈ ఘోరం ఏమిట్రా తండ్రీ అని వాడి కన్నతండ్రి…. అదే తన తండ్రికి గొయ్యి తవ్వాలని చూసిన కొడుకే తన కుర్రాడిని అడిగితే… ఇదే చెబుతాడు. నీవు నేర్పిన న్యాయమే కదా తండ్రీ, నువ్వు నీ తండ్రికి గొయ్యి తవ్వుతున్నప్పుడు కొన్నాళ్లకయినా నా తండ్రికి నేనే గొయ్యి తవ్వాలి కదా..అందుకని ఇప్పుడే మొదలెట్టేస్తున్నా అంటాడు.

ఇదీ మన జీవితాల్లోని విషాదం, విధ్వంసం, ఉష్ణప్రతాపం. జీవితాల్లో వ్యాపించిన ఈ వేయికోణాల వేడి చల్లబడకుండా, చల్లార్చకుండా మనిషి జీవితం చల్లారుతుందా.. మహిళలకే కాదు ఎవరికైనా చల్లదనం లభిస్తుందా…చల్లదనాన్ని అందరికీ పంచిపెట్టే ఆ మహిమాన్విత కాలం ఎప్పుడొస్తుందని కాదు.. అందరికీ రావాలని ఆశించడంలో తప్పులేదు కదా.. వెన్నెల చల్లదనాన్ని పంచిపెట్టే ఆ చంద్రుడే మనకు సాక్షి, నిదర్శనం కావాలని భావించడం తప్పు కాదు కదా……

చందమామా వర్థిల్లు…

వెన్నెల చల్లదనమా వర్ధిల్లు…….

(1973లో మా అమ్మ మా ముగ్గురు పిల్లలకు చెప్పింది మొదలుకుని ఈ కథ నన్ను జీవితం పొడవునా వెంటాడుతూ వస్తోంది. చందమామ చదవండి జ్ఞానం వస్తుంది అని ఏ మహత్తర క్షణంలో మా నాన్న చందమామను చిన్నప్పుడు మాకిచ్చి చదివించాడో అప్పటినుంచి మా లోకమంతా చందమామకే పట్టం. మా బాల్యాన్ని వెన్నెలతో స్పర్శించిన, పండించిన ఆ చందమామ ఇప్పుడీ నడివయసులో.. నాకు చందమామలోనే ఆన్‌లైన్ ఉద్యోగాన్ని పిలిచి మరీ ఇచ్చింది. పల్లెటూరులో పుట్టిపెరిగిన ఓ చిన్ని జీవితానికి ఇంకేం కావాలి.)

RTS Perm Link

చందమామ ప్రెస్సు : వికీపీడియా

July 14th, 2009

చందమామ అందంగా రూపొందడానికి గల మరో కారణం నాణ్యమైన ముద్రణ. నాగిరెడ్డి తన తమ్ముడైన బి.ఎన్.కొండారెడ్డి (ఈయన మల్లీశ్వరి లాంటి కొన్ని సినిమాలకు కెమెరామాన్ గా పని చేశాడు) పేరుతో నడుపుతున్న బి.ఎన్.కె. ప్రెస్సులోనే మొదటినుంచి చందమామ ముద్రణ జరుగుతోంది.

నాగిరెడ్డి అతి ప్రతిభావంతంగా నడిపిన బి.ఎన్‌.కె.ప్రెస్‌ “చందమామ”ను అందంగా ముద్రిస్తూ ఉండేది. ఎన్నో కొత్త రకం అచ్చు యంత్రాలను మనదేశంలో మొట్టమొదటగా నాగిరెడ్డి కొని వాడడం మొదలుపెట్టాడు. ఈ విధంగా చక్రపాణి “సాఫ్ట్‌వేర్‌”కు నాగిరెడ్డి “హార్డ్‌వేర్‌” తోడై “చందమామ”ను విజయవంతంగా తీర్చిదిద్దింది.

అసలు చక్రపాణికి నాగిరెడ్డి పరిచయమైంది ఈ ప్రెస్సులోనే. శరత్ వ్రాసిన బెంగాలీ నవలలకు తాను చేసిన తెలుగు అనువాదాలను ప్రచురించే పని మీద చక్రపాణి అక్కడికి వచ్చాడు. తర్వాత నాగిరెడ్డి-చక్రపాణి పేర్లు స్నేహానికి పర్యాయపదంగా నిలిచిపోవడం చరిత్ర.

చందమామ మూసివేత- పునఃప్రారంభం

1998 అక్టోబరు నెలలో అనివార్య పరిస్థితుల్లో ప్రచురణ ఆగిపోయిన చందమామ 1999 డిసెంబరు నెలలో తిరిగి మొదలైంది. మోర్గాన్ స్టాన్లీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ సేథి, కార్వీ కన్సల్టెంట్స్ కు చెందిన సుధీర్ రావు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఎస్. నీలకంఠన్, ప్రముఖ చిత్రకారుడు ఉత్తమ్ కుమార్, మార్కెటింగ్ నిపుణుడు మధుసూదన్ లు చందమామ పునఃస్థాపనకు మూల కారకులు.

చందమామ ప్రత్యేకతలుగా గుర్తింపు పొందిన కథన శైలి, సాంకేతిక నైపుణ్యాలను రంగరించి పంచతంత్రం, జాతక కథలు లాంటివాటిని బొమ్మల కథలుగా రూపొందించి ఇతర పత్రికలకు అందజేయడానికి సిండికేషన్ ద్వారా ముందుకు వచ్చింది చందమామ. తెలుగు మరియు ఇతర భాషల్లో అనేక పత్రికలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి.

అప్పటి వరకూ పూర్తిగా బి.నాగిరెడ్డి కుటుంబ సభ్యులకే పరిమితమై ఉన్న చందమామ ప్రచురణ మరియు నిర్వహణ హక్కులు కొత్తగా స్థాపించబడిన చందమామ ఇండియా లిమిటెడ్ కు బదిలీ చేయబడ్డాయి. అందులో బి.నాగిరెడ్డి కుమారుడైన బి.విశ్వనాథరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 40% వాటా, వినోద్ సేథి, సుధీర్ రావు, ఇతరులకు 60% వాటా ఇవ్వబడ్డాయి.

బి.విశ్వనాథరెడ్డి (విశ్వం) చందమామ సంపాదకుడుగానూ, ప్రచురణకర్తగానూ, చందమామ ఇండియా లిమిటెడ్ మానేజింగ్ డైరెక్టర్ గానూ కొన్నేళ్ళు కొనసాగాడు. చివరికి 2009 నాటికి చందమామ యాజమాన్యం ముంబైకి చెందిన జియోదెశిక్ అనబడే సాప్ట్‌వేర్ సంస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అన్ని బారతీయ భాషల్లోను చందమామ సంపాదకుడు, ప్రచురణకర్త ఎల్. సుబ్రహ్మణ్యన్.
బయటి లింకులు
చందమామ తెలుగు వెబ్‌సైటు
ఈమాట-చందమామ గురించి కొన్ని విషయాలు
“చందమామ” జ్ఞాపకాలు
ప్రచురణ పునరుద్ధరించిన చందమామ
ప్రచురణకర్త, సంపాదకుడు విశ్వనాథరెడ్డితో ఇంటర్వ్యూ
చందమామ చరిత్ర , ప్రొఫైల్ గురించి ప్రచురణకర్త, సంపాదకుడు విశ్వనాథరెడ్డి
చందమామ సింగపూరు తమిళం-ఇంగ్లీషు ద్విభాషా సంచిక
సంతాలీ భాషలో చందమామ విడుదల
60 వసంతాలు జరుపుకుంటున్న చందమామ
ఆగస్ట్ 1947 మాసం నాటి చందమామ
సెప్టెంబర్ 1947 మాసం నాటి చందమామ
అక్టోబర్ 1947 మాసం నాటి చందమామ
నవంబర్ 1947 మాసం నాటి చందమామ
డిసెంబర్ 1947 మాసం నాటి చందమామ
జనవరి 1948
ఫిబ్రవరి 1948
మార్చి 1948

RTS Perm Link

చందమామ చిత్రకారులు : వికీపీడియా

July 14th, 2009

వడ్డాది పాపయ్య
వడ్డాది పాపయ్య వేసిన చిత్రముతో చందమామ తెలుగు సంచిక”చందమామ”కు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి. చక్రపాణి అంతవరకూ ఏ పత్రికలోనూ లేని విధంగా చందమామలో ప్రతి పేజీ లోనూ ఒక బొమ్మ వచ్చేటట్లు, కథ సరిగ్గా గీత గీసినట్లు బొమ్మ దగ్గరే ముగిసేటట్లు శ్రద్ధ తీసుకున్నాడు. తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలన్నీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. కాగా అరవయ్యేళ్ల తర్వాత చందమామే ఇప్పుడు ఆ పద్ధతిని తోసిరాజంటోంది. చందమామలో బొమ్మలు వేసిన కొందరు ప్రముఖ చిత్రకారులు:

వడ్డాది పాపయ్య
ఒక్క ఇంగ్లీషు తప్ప మిగిలిన భాషలన్నిట్లోనూ ముఖచిత్రాలు వడ్డాది పాపయ్య గీసినవే.

ఎం.టి.వి. ఆచార్య
1952 ప్రాంతాల్లో ఎం.టి.వి. ఆచార్య “చందమామ”లో ఆర్టిస్టుగా చేరాడు. మహాభారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశాడు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించాడు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీశాడు. భీష్మ సినిమాలో ఎన్‌.టి.రామారావు ఆహార్యమంతా “చందమామ”లో ఆయన వేసిన బొమ్మల నుంచి తీసుకున్నదే. ఆ తరవాత ఆయన వ్యక్తిగత కారణాలవల్ల బెంగుళూరుకు వెళ్ళిపోయాడు.

చిత్రా (టి.వి. రాఘవన్‌)
మొదట్లో “చందమామ”కు చిత్రా ప్రధాన ఆర్టిస్టుగా ఉండేవాడు. ప్రారంభ సంచిక ముఖచిత్రం ఆయనదే. చిత్రా చిత్రకళ నేర్చుకోలేదు. స్వంతంగా ప్రాక్టీసు చేశాడు. ఆయన మంచి ఫోటోగ్రాఫరట. ఒక సందర్భంలో బాపు చిత్రా బొమ్మలు తన కిష్టమనీ, గాలిలో ఎగిరే ఉత్తరీయం, ఆయన గీసే పద్ధతి తనకు బాగా నచ్చుతుందనీ అన్నాడు. అమెరికన్‌ కామిక్స్‌ “చందమామ” ఆఫీసులో చాలా ఉండేవి. వివిధ దేశాలవారి డ్రస్సులనూ, వెనకాల బిల్డింగుల వివరాలనూ చిత్రా వాటినుంచి తీసుకునేవాడు. ఈ కారణంగా విదేశీ కథలన్నీ సామాన్యంగా ఆయనకే ఇచ్చేవారు. దాసరివారి సీరియల్‌కు చిత్రా బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పుడప్పుడూ ఆయన బొమ్మల కోసమేనేమో అన్నట్టుగా సుబ్రహమణ్యం “మూడు కళ్ళూ, నాలుగు తలలూ ఉన్న వికృతాకారుడు” మొదలైన పాత్రలను కథలో ప్రవేశపెట్టేవాడు. మొసలి దుస్తులవాళ్ళూ, భల్లూకరాయుళ్ళూ చిత్రా బొమ్మలవల్ల ఆకర్షణీయంగా కనబడేవారు.

శంకర్
బేతాళుడు ఆవహించిన శవాన్ని భుజాన వేసుకుని, ఒక చేత్తో కత్తి దూసి చురుకైన కళ్ళతో చుట్టూ చూస్తూ ముందుకు అడుగేస్తున్న విక్రమార్కుడి బొమ్మను చూడగానే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు అది చందమామలోని బేతాళ కథకు శంకర్ వేసిన బొమ్మ అని. తమిళనాడుకు చెందిన ఆయన ఆర్ట్ స్కూల్లో చిత్రకళ నేర్చుకుని వచ్చినవాడు. టూరిస్టు వింతలవంటి ఒక పేజీ విషయాలకు ఫోటోను చూసి చిత్రీకరించడం ఆయన ప్రత్యేకత. మొత్తంమీద వీరిద్దరూ వివరాలతో కథలకు బొమ్మలువేసే పద్దతిని ప్రవేశపెట్టారు. అప్పుడప్పుడూ యువ దీపావళి సంచికల్లో కూడా కథలకు వీరు చిత్రాలు గీసేవారు.

బాపు
కొన్ని సంచికలకు బాపు కూడా బొమ్మలు వేశాడు. “చందమామ” ఫార్మాట్‌లో గీసినా ఆయన తన శైలిని మార్చుకోలేదు. ఉత్పల సత్యనారాయణాచార్య గేయ కథలకు ఆయన మంచి బొమ్మలు గీశాడు.
జయ, వీరా, రాజి లాంటి మరికొందరు చిత్రకారులు చందమామలో ఎక్కువగా బొమ్మలు వేసేవారు.

RTS Perm Link

చందమామ రచయితలు : వికీపీడియా

July 14th, 2009

దాసరి సుబ్రహ్మణ్యం (ఎడమ చివర), కుటుంబ రావు (కుడి చివర),మరొక సహోద్యోగి (మధ్య)

కొడవటిగంటి కుటుంబరావు:

1952 నుంచి 1980 లో చనిపోయే వరకూ చందమామకు సంపాదకుడిగా విశేషమైన కృషి చేశాడు (సంపాదకుడి పేరు వెయ్యటం చందమామ సంప్రదాయం కాదప్పట్లో). పురాణ గాథల్నీ, పరభాషా కథలను తేట తెలుగులో పిల్లలకు అందించడానికి ఆయన చేసిన కృషి అమోఘం. మొదట్లో బయటి రచయితలు పంపిన కథల వంటివి దాదాపుగా ఏవీ ఉండేవి కావు. రకరకాల మారుపేర్లతో కథలు, శీర్షికలన్నీ ఆయనే రాసేవాడు.

మంచి కథలు ఎవరైనా పంపితే వాటిని అవసరమనిపిస్తే కొడవటిగంటి కుటుంబరావు “మెరుగుపరిచి” తిరగరాసేవాడట. ఇతర భాషలలో వచ్చిన కథ నచ్చితే తెలుగులో తిరగరాయబడి, మళ్ళీ మామూలు ప్రోసెస్‌ ద్వారా అన్ని భాషల్లోకీ తర్జుమా అయేది. 1970ల తరవాత బైటినుంచి రచనలు రావడం, వాటిని “సంస్కరించి” ప్రచురించడం ఎక్కువైంది. క్లుప్తంగా, ఏ విధమైన యాసా చోటు చేసుకోకుండా సూటిగా సాగే కుటుంబరావు శైలిని చక్రపాణి “గాంధీగారి భాష” అని మెచ్చుకునేవాడట. ఇంకెవరు రాసినా ఆయనకు నచ్చేది కాదు.

కొడవటిగంటి కుటుంబరావు స్వయంగా పేరొందిన కథా/నవలా రచయిత కావటంవల్ల, ఆయన చందమామను సర్వాంగసుందరమైన ఆకర్షణీయ పత్రికగా, ప్రతి మాసం మలచేవాడు. దీనికి తోడు, ఎంతో కళా దృష్టి ఉన్న చక్రపాణి పర్యవేక్షణ ఎంతగానో ఉపకరించేది. కథలలో ఎక్కడా అసంబద్ధమైన విషయాలు ఉండేవి కావు. ప్రతి కథా చాలా సూటిగా, కొద్ది పాత్రలతో మంచి విషయాలతో నిండి ఉండేది.

ఇతర రచయితలు

విద్వాన్ విశ్వం
మొదట్లో చందమామలో కథలతో బాటు గేయాలు/గేయకథలు కూడా వస్తూ ఉండేవి. అప్పట్లో చందమామలో ద్విపద కావ్యం రూపంలో వచ్చిన పంచతంత్ర కథలను వ్రాసింది విద్వాన్ విశ్వం. తర్వాతి కాలంలో ఈ కథలను ఆయన చేతే చక్కటి వాడుక భాషలోకి మార్చి చందమామలో ప్రచురించారు. చందమామలో ఈ కథలకు బొమ్మలు వేసింది వడ్డాది పాపయ్య కాగా ఈ కథలను ద్విపద రూపంలోనూ, వచనరూపంలోనూ టి.టి.డి. వాళ్ళు ఒకే పుస్తకంగా ప్రచురించినప్పుడు బాపు చేత బొమ్మలు వేయించారు.

ఉత్పల సత్యనారాయణ
ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈయన చందమామలో వ్రాసిన గేయాలు సుప్రసిద్ధం.
వడ్డాది పాపయ్య
వపా కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన దేవీభాగవతం కథలను పూర్తి చేసింది ఆయనే. విష్ణుకథ పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
దాసరి సుబ్రహ్మణ్యం
చందమామలో దాదాపు మొదటినుంచీ ఉన్నవారిలో దాసరి సుబ్రహ్మణ్యం ఒకడు. మొదటి రంగుల సీరియల్‌ ఆయన ప్రత్యేకత. తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే. ఎందుచేతనో చక్రపాణికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు. పాఠకులకు మాత్రం అవి చాలా నచ్చేవి. ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్‌ తగ్గింది. దాంతో దాసరివారికి మళ్ళీ పనిపడింది. చక్రపాణి అభిరుచి, పాఠకుల అభిరుచి వేరని రుజువయింది.
ఏ.సి. సర్కార్
ప్రజల్లో బాగా పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించడానికి కొడవటిగంటి కుటుంబరావు చందమామ ద్వారా ప్రయత్నాలు చేశాడు. మహిమల పేరుతో అమాయక ప్రజలను మోసగించేవారి గుట్టుమట్లను బయట పెడుతూ ప్రత్యేకంగా ఏ.సి.సర్కార్ అనే ఇంద్రజాలికుడి చేత ఆసక్తికరమైన కథలు వ్రాయించాడు.
వసుంధర
ఒక్క చందమామలోనే ఏడు వందలకు పైగా కథలు రాసిన ఘనత వీరిది.
బూర్లె నాగేశ్వర రావు
ఈయన చాలా చక్కటి కధలు అనేకం రాశాడు.
మాచిరాజు కామేశ్వరరావు
చందమామలో దాదాపు గత ఇరవయ్యేళ్ళ కాలంలో వచ్చిన దయ్యాలు, పిశాచాల కథలన్నీ ఈయన రాసినవే.
మనోజ్ దాస్
ప్రస్తుతం భారత దేశంలో చిన్నపిల్లల కోసం రచనలు చేస్తున్న వారిలో అగ్రగణ్యుడు. మాతృభాష అయిన ఒరియా మరియు ఇంగ్లీషు భాషల్లో విరివిగా వ్రాయడమే గాక చందమామ కోసం వివిధ దేశాల జానపద, పురాణ గాథలను అనువదించాడు. చందమామలో జానపద సీరియల్ రచయిత పేరు వెయ్యడం ఒకేసారి జరిగింది. 1990లలో వచ్చిన “బంగారు లోయ” సీరియల్ రచయితగా మనోజ్ దాస్ పేరు వేశారు.
వీరు కాక ఎందరో ఇతర రచయితలు (పేరు పేరునా ఉదహరించాలంటే చాలా పెద్ద జాబితా అవుతుంది) వారివంతు కృషి చేసి చందమామను చక్కటి పత్రికగా తీర్చి దిద్దారు.

RTS Perm Link

ఇతర భాషల్లో చందమామ – వికీపీడియా

July 14th, 2009

సంస్కృత సంచిక. చందమామ ప్రస్తుతం తెలుగు (జూలై 1947 నుంచి), తమిళం(ఆగస్ట్ 1947 – అంబులిమామ), కన్నడం (1948), హిందీ (1949 – చందామామ), మరాఠీ (1952 – చాందోబా), మలయాళం (1952 – అంబిలి అమ్మావన్‌), గుజరాతీ (1954), ఇంగ్లీషు (1955), ఒరియా (1956), బెంగాలీ (1972), సింధీ (1975), అస్సామీ (1976), సంస్కృత (1979) భాషల్లోనేగాక ఆగస్ట్ 2004 నుంచి సంతాలీ (చందొమామొ) అనే గిరిజన భాషలోకూడా వెలువడుతోంది (మొత్తం పదమూడు భాషలు).

ఒక గిరిజన భాషలో వెలువడుతున్న మొట్టమొదటి పిల్లల పత్రిక చందమామ కావడం విశేషం. సింధీలో 1975 లో మొదలై కొంతకాలం నడిచి ఆగిపోయింది. గురుముఖి (పంజాబి భాష యొక్క లిపి) మరియు సింహళ (1978 – అంబిలిమామ) లో కూడ కొంతకాలం నడిచింది. పంజాబ్ మరియు శ్రీలంక ఘర్షణల తర్వాత ఆ భాషల్లో ప్రచురణ నిలిచిపోయింది.

చందమామను చూసి ముచ్చటపడిన అప్పటి శ్రీలంక ప్రధానమంత్రి , కొన్ని నెలల పాటు సింహళ సంచికకు కథలు కూడా అందించాడు. అంధుల కోసం 4 భాషల్లో (ఇంగ్లీషు, తమిళం, హిందీ, మరాఠి) బ్రెయిలీ లిపిలో(1980 నుంచి) కూడా కొంతకాలం నడిచి 1998లో ఆగిపోయింది. 2004 సంవత్సరం నుండి తెలుగు మరియు ఇంగ్లీషు బ్రెయిలీ లిపి (గుడ్డివారు చదవగలిగిన లిపి) సంచికలు తిరిగి ప్రచురించడం మొదలయింది.[1].

ఇంగ్లీషు.

అమెరికా, కెనడా దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల కోసం రెండుభాషల సంచిక (ఒకే పుస్తకంలో రెండు భాషల చందమామ) లు తెలుగు-ఇంగ్లీషు వెలువడుతున్నాయి. అలాగే, తమిళం-ఇంగ్లీషు, హిందీ-ఇంగ్లీషు భాషల్లో కూడా వెలువడుతున్నాయట. గుజరాతి-ఇంగ్లీషు ద్విభాషా పత్రిక కూడా విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వినికిడి.

ఇక సింగపూరులోని పాఠకులకోసం ప్రత్యేకంగా అంబులిమామ పేరుతో ఇంగ్లీషు-తమిళ భాషల్లో ద్విభాషా సంచిక వెలువడుతోంది. కొత్తలో చందమామ ముందు తెలుగులో తయారయేదట. అది పైనెలలో తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చేది. ఎందుకంటే ఆ సంపాదకులకు తెలుగు చదవడం వచ్చు.

ఆ తరువాతి నెలలో తమిళంనుంచి మలయాళంలోనికీ, హిందీ నుంచి మరాఠీ, గుజరాతీల్లోకీ అనువాదం అయేది. ఏ భాషకా భాషలో వరస తప్పకుండా సంచికలు వచ్చేవి కనక ఎవరికీ ఇబ్బంది ఉండేదికాదు. ఇతర భాషల పాఠకులకు తెలుగే ఒరిజినల్‌ అని తెలిసేది కూడా కాదు.

తమిళంలో అంబులిమామా, మలయాళంలో అంబిలి అమ్మావన్‌, మరాఠీలో చాందోబా ఇలా ప్రతిదీ దేనికదిగా ప్రసిద్ధి చెందిన పత్రికలైపోయాయి. అయితే 1990ల నుండి, ముఖ్యంగా మనోజ్ దాస్ రచనలు ఎక్కువయ్యేకొద్దీ ఈ వరస తిరగబడింది. ఆయన చేసే రచనలు ముందుగా ఒరియా, ఇంగ్లీషు భాషల్లోనూ, ఆ తర్వాత తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ వస్తున్నాయి.
సంపాదకులు, ప్రచురణకర్తలు

సంస్థాపకులు చక్రపాణి-నాగిరెడ్డి

పత్రిక ఉన్నతికి కృషి సల్పిన కొడవటిగంటి కుటుంబరావు, సంపాదకుడు (1952 నుండి 1980 వరకు)చందమామ సంస్థాపకుడు చక్రపాణి కాగా సంచాలకుడు నాగిరెడ్డి. చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణిదే. 1975లో చనిపోయే వరకూ ఎనలేని సేవచేశాడు. ప్రస్తుతం నాగిరెడ్డి కుమారుడైన విశ్వనాధ రెడ్డి చందమామ వ్యవహారాలు చూస్తూ, సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు.

చందమామ సంపాదకుల వ్యాఖ్యలు

“బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. -కొడవటిగంటి కుటుంబరావు

“ప్రతి ఒక్కరికీ తమ సంస్కృతీ సంప్రదాయాలను గురించిన ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఘనమైన భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను పదిలపరచి ఒక తరాన్నుంచి ఇంకో తరానికి అందించడమే లక్ష్యంగా చందమామ పని చేస్తోంది. గతానికీ, వర్తమానానికీ మధ్య వారధిగా నిలుస్తోంది.” -బి.విశ్వనాథరెడ్డి-విశ్వం (చందమామ ప్రస్తుతపు సంపాదకులు (2008), వ్యవస్తాపకులలో ఒకరైన నాగిరెడ్డి కుమారుడు)

చందమామకు ప్రముఖుల ప్రశంసలు

వివిధ ఎడిషన్ల గురించి మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూ: “అసామాన్యమైన విషయం”
ప్రథమ భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాదు: “అక్షరాస్యతను పెంపొందించడంలో సహాయకారి”
పూర్వ ప్రధాని మొరార్జీ దేశాయ్: “పిల్లలకు చక్కని ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తోంది”
పూర్వ ప్రధాని ఇందిరాగాంధీ: చందమామ ఎన్నో భాషల్లో నిరంతరాయంగా ఒక్కమారు వస్తున్నది. ఇది పిల్లల్లో ఊహలను పెంచుతుంది. కళ పట్ల అవగాహన కలిగిస్తుంది. నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందిస్తుంది. సమాజంలోనూ, లోకంలోనూ కలసి మెలసి బ్రతికే సుగుణం నేర్పుతుంది.
పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్: భారతదేశపు సుసంపన్న, బహువిధ సాంస్కృతిక వారసత్వము నుండి ఏర్చి కూర్చిన కధలతో చందమామ లక్షలాది చిన్నారుల మనస్సులను మంత్రముగ్ధులను చేసింది. ఇన్ని భాషలలో ప్రచురించే సాహసాన్ని పెద్దయెత్తున అభినందించాలి.
మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్: (జూనియర్ చందమామగురించి) ఇది యువతరాన్ని చైతన్యపరుస్తుంది.
అమితాబ్ బచ్చన్ “నా చిన్నతనంలో నేను పశ్చిమ దేశాలకు చెందిన ‘కామిక్స్’ ప్రభావంలో ఉండేవాడిని. నా తల్లి తండ్రులు, నాకు చందమామను పరిచయం చేసినప్పటినుండి, ఆ పుస్తకాన్ని వదలలేదు. భారతదేశంలో చందమామ కథలు ప్రాచుర్యంలో లేని గృహం ఉంటుందని నేననుకోవటంలేదు…… నేను చందమామను నా మనమలకు, మనమరాళ్ళకు పరిచయం చేస్తాను” (చందమామ 60వ వార్షికోత్సవ సందర్భంగా, ప్రత్యేక సంచికను విడుదల చేస్తూ. – హిందు దిన పత్రిక, ఏప్రిల్ 18 2008 నుండి)

60 వసంతాల చందమామ
భారతదేశ స్వాతంత్ర్యానికి సరిగ్గా ఒక నెల ముందు ప్రారంభించబడిన చందమామ 2006 జులై కి 60 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపాదకుడు విశ్వనాథరెడ్డి తన తండ్రిని, చక్రపాణిని గుర్తు చేసుకున్నాడు. పత్రిక ఇంకా వారు చూపిన బాటలోనే సాగుతోందని తెలిపాడు. నేటి తరం పిల్లల కోసం పత్రిక స్వరూపాన్ని మార్చే అలోచనేది లేదని తెలిపాడు.ఈ మధ్యనే ప్రముఖ భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థ, ఇన్ఫోసిస్ యొక్క సాంఘిక సేవా విభాగం,ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కర్ణాటకలో 6,000 కన్నడ మరియు ఇంగ్లీషు సంచికలు గ్రామీణ బాలలకు ఇవ్వడానికి చందమామతో ఒప్పందం కుదుర్చుకుంది.

RTS Perm Link

చందమామలో జానపద కథలు : వికీపీడియా

July 14th, 2009

జానపద కథలకు చందమామ కాణాచి. చందమామ కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి. చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు. ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి. రాజులూ, వారి రాజ్యాలూ, రాజకుమారులూ, రాజకుమార్తెలూ, వారి స్వయంవరాలు, వారి సాహసాలు, మంత్రుల తెలివితేటలు, పరిపాలనా దక్షత, విదూషకుల హాస్యం/చురుకైన బుధ్ధి, ప్రభువుల విశాల హృదయం మరియు ముందుచూపు, జానపదులు, వారి అమాయకత్వంవంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజ పరిచాయి.

చందమామ శైలి, ఒరవడి

చందమామ శైలి సామాన్యమైన పదాలతో, చక్కటి నుడికారాలు, జాతీయాలు మరియు సామెతల తో కూడినది. పాఠకులను చీకాకు పరిచే పదప్రయోగాలూ, పదవిన్యాసాలూ ఉండేవి కావు. చదువుతుంటే కథగానీ మరేదైనా శీర్షికగానీ అందులోని భావం హృదయానికి హత్తుకుపోయే విధంగా ఉండేది. కొడవటిగంటి కుటుంబరావు(ఎక్కువకాలం చందమామకు సంపాదకులు)ఏ దేశ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకు సరిపోయేట్టు మలిచి వ్రాసేవాడట. చందమామలోని మరో ప్రత్యేకత – తేనెలూరే తియ్యటి తెలుగు. అసలు ఏ భారతీయ భాషైనా నేర్చుకోవడానికి ఆ భాషలోని చందమామ చదవడం ఉత్తమ మార్గం అనడం అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. కథ, కథకి సంబంధించిన బొమ్మలు ఎలా ఉండాలో, ఏ నిష్పత్తిలో ఉండాలో చక్కగా చేసి చూపించి, మిగిలిన పత్రికలకు మార్గదర్శకమైంది. చందమామ శైలిని, ఒరవడిని, ఇతరులు అనుకరించడం లేదా అనుసరించడం చెయ్యగలిగారుగాని, కొత్త శైలినిగాని ఒరవడినిగాని ఇంతవరకు సృష్టించలేక పోయారు.

ఇతర శీర్షికలు

మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక వైభవానికీ, వైవిధ్యానికీ అద్దం పట్టే శీర్షికలు అనేకం చందమామలో వచ్చాయి. సుభాషితాలు, బేతాళ కథలతోబాటు దశాబ్దాల కాలం నుంచి నిరాఘాటంగా నడుస్తున్న శీర్షిక ఫోటో వ్యాఖ్యల పోటీ. ఈ పోటీలో, రెండు చిత్రాలను ఇస్తారు. పాఠకులు ఆ రెండు చిత్రాలను కలుపుతూ ఒక వ్యాఖ్య పంపాలి. అన్నిటికన్న బాగున్న వ్యాఖ్యకి బహుమతి. ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన కథల పోటీల్లాంటివి పాఠకుల సృజనాత్మకతకు పదును పెడుతున్నాయి. పిల్లలకు విజ్ఞానం, వినోదం, వికాసం అందించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త శీర్షికలతో ప్రయోగాలు చేయడం చందమామ ప్రత్యేకత.
ప్రత్యేక సంచికలు

గాంధీ శతజయంతి సందర్భంగా 1969లో వేసిన ప్రత్యేక సంచిక
చంద్రుని మీద మానవుడు కాలుమోపిన సందర్భంగా 1969లో వేసిన ప్రత్యేక సంచిక

అప్పుడు

చందమామ, మంచి ప్రాభవంలో ఉన్న రోజుల్లో వడ్డాది పాపయ్య, బాపు గార్ల రంగుల బొమ్మలతో, ప్రతి పేజీక్రింద అంచులలో దీపాల బొమ్మలతో, దీపావళికి ప్రత్యేక సంచిక ఉండేది. అలాగే, మనిషి మొట్టమొదటిసారి, చంద్రుడిమీద కాలుపెట్టిన చారిత్రాత్మక సంఘటన (జులై, 1969) సందర్భంగానూ, మహాత్మా గాంధీ శతజయంతి (అక్టోబరు, 1969) సందర్భంగానూ ప్రత్యేక చందమామలు వేయబడ్డాయి.

అలాగే, విజయా సంస్థ వారు హిందీలో “ఘర్ ఘర్ కి కహానీ” ప్రముఖ నటులు బల్రాజ్ సహానీతో తీసినపుడు, ఆ చిత్రం గురించి చందమామలో ప్రత్యేకంగా వ్రాసారు. ఆ చిత్రంలో, కుటుంబంలో తండ్రి – పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి చక్కగా చూపారు. అందుకనే కాబోలు, చందమామలో ప్రత్యేకంగా ప్రచురించారు. ఈ సంచికలు చందమామ ప్రతులు పోగుచేసేవారికి ఎంతో విలువైనవి, బంగారంతో సమానమైనవి.

ఇప్పుడు

2000 సం. నుండి ప్రతి సంవత్సరం నవంబరు సంచికను పిల్లల ప్రత్యేక సంచికగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 14 ఏళ్ళలోపు బాలబాలికలచేత కథలు వ్రాయించి, ఎంపికచేసిన బాల చిత్రకారుల్ని చెన్నై రప్పించి, ఆ కథలకు వారిచేత బొమ్మలు వేయిస్తున్నారు.

RTS Perm Link

బేతాళ కథలు : వికీపీడియా

July 14th, 2009

బేతాళకథల మొదటి పుటలలో ఒకటి, చాలా కాలంగా ముద్రించబడుచున్నది

బేతాళకథ మొదటి కథ 1972లొ పునర్ముద్రించినప్పటిది. గుణాఢ్యుడు సంస్కృతములో రచించిన “బృహత్ కథ” బేతాళకథలకు మూలం. ఈ కథలను కొంతకాలము తరువాత “కథాసరిత్సాగరం” సంపుటి లోనికి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. కాని, బేతాళ కథలలోని చివరి కథ అందుబాటులో లేదు.

మూలకథ
గోదావరీ తీరాన, ప్రతిష్ఠానపురానికి విక్రమార్కుడు రాజు. ఒక భిక్షువు ఆయనకు రోజూ ఒక పండు లోపల రత్నము పెట్టి ఇస్తూ, ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు, కొన్ని రోజుల వరకు రాజుకు తెలియదు. ఆ విషయం తెలిసిన రోజున, విక్రమార్కుడు భిక్షువు యొక్క విశ్వాసానికి మెచ్చి, కారణం చెప్తేగాని మర్నాడు పండు తీసుకోనని చెప్తాడు.

దానికి బిక్షువు, తను ఒక మంత్రాన్ని సాధించదలచాననీ అందుకు ఒక వీరుడి సహాయం కావాలనీ, విక్రమార్కుని నుండి తానా సహాయం ఆశిస్తున్నాననీ అడుగుతాడు. విక్రమార్కుడు తగిన సహాయం చెయ్యటానికి ఒప్పుకుంటాడు. బిక్షువు, రాబోయే కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే రాజును మహా శ్మశానానికి రమ్మంటాడు.

అలాగే విక్రమార్కుడు వెళ్తాడు. అక్కడే ఉన్న భిక్షువు, రాజును శింశుపా వృక్షం మీద వేళ్ళాడుతున్న పురుషుడి శవం తెచ్చి, తన సమీపంలో ఉంచమంటాడు. రాజు ఆ చెట్టు ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు,

ఎందుకు నవ్వుతావు, పోదాం పద అంటాడు. రాజుకు ఇలా మౌనభంగం అవగానే నేలమీది శవం మాయమై, మళ్ళీ చెట్టు మీద వేళ్ళాడుతూ కనపడుతుంది. విక్రమార్కుడు బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని మళ్ళీ కిందపడేసి, భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవటం మొదలు పెడతాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను” అంటూ ఒక కథ చెప్తాడు. కథ చివర ప్రశ్న వేసి, “ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పొయ్యావో, నీ తల పగిలి పోతుంది” అంటాడు. విక్రమార్కుడు తన మౌనం వీడి ప్రశ్నకు తగిన సమాధానం చెపుతాడు. ఆ విధంగా, విక్రమార్కుడికి మౌనభంగం జరగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తెరిగి చెట్టు ఎక్కుతాడు.

చందమామలో ధారావాహిక
ఈ కథలు ఎంతో కాలం చందమామ పత్రికలో కథా స్రవంతిగా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఇదొక చిత్రమైన కథల సంపుటి. ప్రతి మాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని) తో మొదలయ్యేది, అలాగే, మరొక సంఘటన (విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు)తో అంతమయ్యేది.
ప్రతి కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి “శ్రమ తెలియకుండా విను” అని ఓ చక్కటి కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న/లు వేసేవాడు. అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు “ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది” అని.

మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌన భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది.

బేతాళ కథ మొదటి కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల అసక్తిని గమనించి గాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 1972 జూలైలో మొదటి బేతాళకథ రంగులలో పునర్ముద్రించారు. చందమామలో, మొదట చెప్పబడిన కథకు పేరు పెట్టలేదు. ఆ తరువాత కథలన్నిటికీ కథ మొదటి పుటలో పైన కథ పేరు, కింద “బేతాళ కథలు” అని వేయసాగారు.
బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మ చాలా సార్లు మార్చి మార్చారు. అలాగే కథ చివరి పుటలో, బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు కత్తి దూసి వెంట పడుతుండటం కూడా చాలా రకాలుగా వెయ్యబదినది. అందులో కొన్ని, చిత్రాలు వ్యాసం చివర చూడవచ్చు.

శీర్షికగా బేతాళ కథలు

అసలు, బేతాళ కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను (ఇప్పటివరకు 600 పైగా) బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు.

అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం, చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం. తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు(పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం, తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం ఈ శీర్షిక ద్వారా చందమామ వారు అందచేశారు.

కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును. ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

మరి కొన్ని పిల్లల పత్రికలు, బొమ్మరిల్లు వంటివి ఇదే పద్దతిలో కథలను (కరాళ కథలు) సృష్టించటానికి పయత్నించాయి. కాని, అంతగా విజయం సాధించలేక పోయాయి.

RTS Perm Link

చందమామ కథలు : వికీపీడియా

July 14th, 2009

చందమామ కథలు

ప్రస్తుత చందమామ ముఖ చిత్రము

చందమామలో దయ్యం బొమ్మ

భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి.

ఆశ్చర్యకరమైన విషయమేమంటే, చందమామలో దయ్యాల కథలు కూడా పుష్కలంగా ఉండేవి. కాని, అవి పిల్లల్లో మూఢ నమ్మకాలను పెంచేవిగా ఉండేవి కావు. దయ్యాలంటే సామాన్యంగా భయం ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు. అయితే, చందమామలోని కథలు అటువంటి కారణంలేని భయాలను పెంచి పోషించేట్లుగా ఉండేవి కావు. చందమామ కథల్లో ఉండే దయ్యాల పాత్రలు ఎంతో సామాన్యంగా, మనకి సరదా పుట్టించేట్లుగా ఉండేవి. అవి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దాం అనిపించేది.

దయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి గానీ పిల్లలను భయభ్రాంతులను చేసేట్లు ఉండేవి కాదు. సామాన్యంగా దయ్యాల పాత్రలు రెండు రకాలుగా ఉండేవి – ఒకటి, మంచివారికి సాయం చేసే మంచి దయ్యాలు, రెండు, కేవలం సరదా కోసం తమాషాలు చేసే చిలిపి దయ్యాలు.

దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.

RTS Perm Link

చందమామ ధారావాహికలు : వికీపీడియా

July 14th, 2009

చందమామ ధారావాహికలు

చందమామ పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు. “చిత్ర” వేసిన అద్భుతమైన బొమ్మలతో ఎంతో ఆసక్తికరమయిన కథనంతో, సరళమైన భాషలో ఒక్కొక్క చందమామ ధారావాహిక (Chandamama Serial) అనేక నెలలలపాటు జరిగేది. ప్రతి నెల ఒక ఆసక్తి కరమయిన ఘటనతో ఆపేవారు, అంటే మళ్ళీ నెల వరకు అసక్తితో చదువరులు ఎదురు చూసేటట్లు చేసేవారు. పాత్రలు ఒక డజనుకి మించి ఉండేవికాదు.

“చిత్ర” గారు ఒక్కొక్క పాత్రకు మొదటిసారి బొమ్మ ఎలా వేసారో, ధారావాహిక అయ్యేవరకు కూడా, ఆ పాత్రలు అల్లాగే కనిపించేవి. ప్రతి ధారావాహికలోనూ ఇద్దరు నాయకులు ఉండేవారు: శిఖిముఖి – విక్రమకేసరి, ధూమకుడు – సోమకుడు, ఖడ్గవర్మ-జీవదత్తుడు మొదలగు నాయక ద్వయాలు పాఠకులను ఎంతగానో అలరించేవారు. కథా నాయికలు చాలా తక్కువగా కనిపించేవారు.

కథకు ఎంతవరకు అవసరమో అంతవరకే కనబడేవారు. శిధిలాలయంలో ఒక్క నాగమల్లి పాత్ర తప్ప మిగిలిన కథానాయికలందరూ నామ మాత్రమయినవారే. ఒక్క నవాబు నందిని మరియు దుర్గేశ నందిని తప్ప మిగిలిన ధారావాహికలన్నీ కూడా భారతదేశపు రాజ్యాలలోనూ పల్లెటూళ్ళలోనూ జరిగినట్లు వ్రాసేవారు.

అన్ని ధారావాహికలలో రాజులు, వారి రాజ్యాలు, అప్పుడప్పుడు రాక్షసులు, మాంత్రికుల పాత్రలు మరియు కథలు ఉండేవి. ఒక్క రాజుల కథలేకాక సాహస వంతమయిన యువకుల గురించి (రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, తోక చుక్క మొదలగునవి) కూడా ధారావాహికలు వచ్చేవి. అంతేకాకుండా, పురాణాలు, చరిత్ర కు సంబంధించిన ధారావాహికలు కూడా ప్రచురించారు.

అంతే కాదు ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, వెయ్యిన్నొక్క రాత్రులు (అరేబియన్‌ నైట్స్‌) ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలు అన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి.

భాసుడు, కాళిదాసు మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని షేక్‌స్పియర్‌ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు. ఇవికాక గ్రీకు‌ పురాణాలైన ఇలియడ్‌, ఒడిస్సే, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ చందమామలో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలే గాక ఇతర సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి.

చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దయిన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు.
సాధారణ ధారావాహికలు
తోకచుక్క
మకర దేవత
ముగ్గురు మాంత్రికులు
విచిత్ర కవలలు
రాకాసి లోయ
పాతాళ దుర్గం
శిధిలాలయం
రాతి రథం
యక్ష పర్వతం
కంచుకోట
జ్వాలాద్వీపం
మాయా సరోవరం
భల్లూక మాంత్రికుడు
బంగారులోయ (చందమామలో రచయిత పేరు ప్రచురించిన ఏకైక సీరియల్)
అపూర్వుడి సాహసయాత్రలు
బందిపోటు యువరాజు
తండ్రీకొడుకులు
ఐదు ప్రశ్నలు
విచిత్ర పుష్పం
భువన సుందరి (గ్రీకు పురాణగాథ ఇలియడ్)
రూపధరుడి యాత్రలు (గ్రీకు పురాణగాథ ఒడిస్సీ)
దుర్గేశ నందిని
నవాబు నందిని
సమ్రాట్ అశోక
చారిత్రక ధారావాహికలు
నెహ్రూ కథ
భారత చరిత్ర

పురాణ ధారావాహికలు
రామాయణం
కృష్ణావతారం
మహాభారతం
శివ పురాణం
శివ లీలలు
విఘ్నేశ్వరుడు
వీర హనుమాన్
విష్ణుకథ
జగన్నాథ చరిత్ర (పూరీ జగన్నాథాలయ నిర్మాణం వెనకున్న కథ)
దేవీభాగవతం

పైన చెప్పినవి కాక అరణ్య పురాణం అని ఒక చక్కని ధారావాహిక ప్రచురించారు. ఈ ధారావాహికకు ఆధారం రుడ్యార్డ్ కిప్లింగ్ ([Rudyard Kipling) వ్రాసిన ఆంగ్ల నవల The Jungle Book. ఈ ఒక్క ధారావాహికకు మాత్రం, వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేసేవారు. అదే విధంగా విష్ణుశర్మ రచించిన పంచతంత్రం కూడా చక్కటి భాషలో ధారావాహికగా పూర్తిగా ప్రచురించారు. ఈ ధారావాహికకు కూడా, వడ్డాది పాపయ్య గారే బొమ్మలు వేసేవారు.
కథా స్రవంతులు

పరోపకారి పాపన్నచక్కటి విషయాలతో కథాస్రవంతులు కూడా ప్రతి నెలా ఉండేవి. అందులో ముఖ్యమైనవి:

పరోపకారి పాపన్న కథలు
బండ భీమన్న కథలు
తాతయ్య కథలు
జాతక కథలు
ఐంద్రజాలిక కథలు
అరేబియా కథలు (అరేబియన్ నైట్స్)
ఇవేకాక గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి భారతదేశపు నదుల పుట్టుక గురించి, ప్రసిద్ధ దేవాలయాల నిర్మాణాల గురించి ఆసక్తికరమైన కథలను, వివిధ దేశాల పురాణగాథలను కూడా ధారావాహికలుగా అందించింది చందమామ.

1960 ప్రాంతంలో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న పరోపకారి పాపన్న కథలు కొన్నాళ్ళ క్రితం దూరదర్శన్ లో ధారావాహికగా వచ్చాయి.

చిన్న ధారా వాహికలు
అప్పుడప్పుడు 4-5 నెలలు నడిచే చిన్న ధారావాహికలు వేసేవారు. అందులో కొన్ని:

సింద్ బాద్ యాత్రలు
అబూకీర్-అబూసీర్
భూతాలు చేసిన పెళ్ళి
మాయదారి ముసలిది

RTS Perm Link

చందమామ : వికీపీడియా

July 14th, 2009

చందమామ తొలి ముఖపుట,జులై 1947

చందమామ లోగొ రాజా ర్యాబిట్.  చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.

చందమామను బి.నాగిరెడ్డి – చక్రపాణి (వీరు తెలుగు, తమిళ బాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) 1947 జూలైలో ప్రారంభించారు.

కేవలం 6 వేల సర్క్యులేషన్‌తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం , ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 – 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా.

టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ఞాన దాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే.

చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు. రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు వంటి అద్భుత కావ్య రచనలు చేసి జ్ఞానపీఠ ప్రదానం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ..

“చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా” అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థం చేసుకోవచ్చును.

RTS Perm Link

చందమామ – త్రివిక్రమ్ బాట

July 14th, 2009

చందమామ గురించి త్రివిక్రమ్ గారు తదితరులు  వికీపీడియాలో పోస్టు చేసిన పెద్ద వ్యాసాన్ని చిన్న చిన్న భాగాలుగా ఈ బ్లాగులో మొదట ప్రచురిస్తున్నాము. చందమామ పత్రిక చరిత్ర గురించి, దాని విశేషాల గురించి అంతర్జాలంలో విపులంగా, వీలైనంత మేరకు వాస్తవానికి అతి దగ్గరగా చెప్పిన, రాసిన వ్యక్తి ఎవరు అని అడిగితే మొదట త్రివిక్రమ్ గారి పేరే చెప్పుకోవాలి.

అనేకమంది రచయితలు, అభిమానులు చందమామ గురించి రాసినా, ప్రస్తుతం రాస్తూ ఉన్నా అంతర్జాలంలో చందమామ విశేషంగా వ్యాప్తి పొందడానికి, బ్లాగర్లు చందమామను తమదిగా హత్తుకోవడానికి మూల కారకులు త్రివిక్రమ్ గారే అని అంటే అతిశయోక్తి కాదు. చందమామ పత్రిక, దాని యాజమాన్యంలో మార్పులు, పత్రికలో చోటు చేసుకుంటున్న కొత్త మార్పులు వంటి ఇటీవలి చరిత్రను కూడా తాజాగా పొందుపర్చి అంతర్జాల పాఠకులకు అందివ్వడంలో త్రివిక్రమ్ గారే మొదటి వరుసలో ఉన్నారు.

అంతర్జాలంలో చందమామ పిచ్చోళ్లు లేదా ‘చంపి’ అనే పదబంధం బాగా వ్యాప్తిలోకి రావడానికి, వీరంతా కలిసి చందమామను నెట్‌లోంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకుని తెలుగుజాతి సంపదనే తమదిగా జాగ్రత్త పర్చుకున్న అద్భుత చరిత్రకు శ్రీకారం చుట్టింది, ప్రేరణ ఇచ్చిందీ కూడా త్రివిక్రమ్ గారి చందమామ వ్యాసమే -వికీపీడియా- అని చెప్పాలి.

తర్వాత చందమామ పత్రిక, దాంట్లో గత 50, 60 ఏళ్లుగా పనిచేస్తున్న వారి గురించి, చందమామ శైలి, చరిత్ర గురించి సాధికారికంగా చెప్పగలిగిన వ్యక్తి రోహిణీ ప్రసాద్ గారు -కొడవటిగంటి కుటుంబరావు గారి అబ్బాయి. అమెరికాలో న్యూక్లియర్ ఫిజిక్స్ రంగంలో పనిచేస్తున్నారు-.

నాగమురళి, బ్లాగాగ్ని (ఫణి), ఇటీవల వేణు గారు కూడా చందమామ అభిమానుల కోవలో మంచి రచనలు చేయడం, విలువైన సమాచారం అందివ్వడం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో చందమామను డౌన్‌లోడ్ చేయడానికి తన వంతుగా సాప్ట్‌వేర్ ప్రోగ్రామ్ రూపకల్పన చేసి అందించిన బ్లాగాగ్ని (ఫణి) గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

సదాశయంతో, సదుద్దేశంతో వ్యక్తులు చేసే చిన్నపాటి మంచి పనులు కూడా ఒక సమాజపు కథల దాహాన్ని తీర్చడానికి ఎంతగా తోడ్బడగలదో చెప్పడానికి బ్లాగాగ్ని గారి ఉదంతం ఓ సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.

చందమామ పిచ్చోళ్లు ఆన్‌లైన్‌లో స్వంతంగా ఓ కమ్యూనిటీని సైతం ఏర్పర్చుకుని చందమామ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు, కలబోసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే 1940ల చివరినాటి చందమామలు, 50, 60, 70ల నాటి చందమామలను ఎవరు చదివారు అంటూ ఆన్‌లైన్ పోల్ సర్వే కూడా నిర్వహిస్తూ వీరు చందమామను  తమ సజీవ జ్ఞాపకంగా మల్చుకుంటున్నారు.

తెలుగుజాతి సాంస్కృతిక సంపద చందమామను తమ జీవితంలో ఓ భాగం చేసుకున్న, చేసుకుంటున్న ఇలాంటి చందమామ పిచ్చోళ్లకు హృదయ పూర్వక అభివందనలు తెలియజేస్తున్నాను.

వీరి రచనలు, అభిప్రాయాలు, వ్యాఖ్యలను, వీరిలో కొందరితో నేను వ్యక్తగతంగా పెట్టుకున్న పరిచయ విశేషాలను కూడా వివరంగా ఈ బ్లాగులో ఉంచాలని చిరు ప్రయత్నం చేస్తున్నాను. కేవలం చందమామ చరిత్ర, వివరాలు, జ్ఞాపకాలతో కూడిన ఈ బ్లాగును చందమామ అభిమానులు తమదిగా చేసుకుంటారని, చేసుకోవాలని ఆశిస్తూ…

ఎందరో చందమామ అభిమానులు…. అందరికీ వందనాలతో..
రాజు
చందమామ

చందమామ పాత సంచికలను చదవదలిచిన వారు ఈ కింది లింకుపై క్లిక్ చేయండి. మీకు కావలిసిన సంచిక నెల, సంవత్సరం ఎంచకుని చూడండి. 1947 నుంచి 80ల దాకా పాత సంచికలను ఇందులో చూడవచ్చు.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

ఇప్పుడిప్పుడే రూపు దిద్దుకుంటున్న ఆన్‌లైన్ చందమామను చూడండి. మీ వ్యాఖ్యలు కింది లింకుకు పంపండి.

abhiprayam@chandamama.com

చందమామతో పాఠకులు, అభిమానులు తమ జ్ఞాపకాలను పంచుకోవడానికి గాను అవకాశమిస్తున్న కింది లింకును చూడండి. చందమామతో మీ చిన్ననాటి అనుబంధాన్ని పాఠకులతో పంచుకోండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=1907

RTS Perm Link

చందమామ కథ

July 7th, 2009

“…. దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.

భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు.

చందమామ పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు. ధారావాహికలన్నీ భారతదేశపు రాజ్యాలలోనూ పల్లెటూళ్ళలోనూ జరిగినట్లు వ్రాసేవారు. అన్ని ధారావాహికలలోనూ రాజులు, వారి రాజ్యాలు, అప్పుడప్పుడు రాక్షసులు, మాంత్రికులకు సంబంధించిన పాత్రలు మరియు కథలు ఉండేవి. ఒక్క రాజుల కథలేకాక సాహస వంతమైన యువకుల గురించి (రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క మొదలగునవి) కూడా ధారావాహికలు వచ్చేవి.

అంతేకాకుండా, పురాణాలు, చరిత్రకు సంబంధించిన ధారావాహికలు కూడా ప్రచురించారు. చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దలైన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు.

ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, వెయ్యిన్నొక్క రాత్రులు(అరేబియన్‌ నైట్స్‌), ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని షేక్‌స్పియర్‌ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు.

ఇవికాక గ్రీక్‌ పురాణాలైన ఇలియడ్‌, ఒడిస్సీ, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ చందమామలో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలేగాక ఇతర భాషా సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి.

అసలు బేతాళ కథలు పాతిక మాత్రమేనని తెలిసినవారు చెబుతారు. చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుతో(గా) మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతినెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టమైన ఈ పనిని, దశాబ్దాలపాటు నిరాఘాటంగా కొనసాగించడం చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం.

జానపద కథలకు చందమామ కాణాచి. చందమామ కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి. చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు. ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి. రాజులూ, వారి రాజ్యాలూ, రాజకుమారులూ, రాజకుమార్తెలూ, వారి స్వయంవరాలు, వారి సాహసాలు, మంత్రుల తెలివితేటలు, పరిపాలనా దక్షత, విదూషకుల హాస్యం, చురుకైన బుధ్ధి, ప్రభువుల విశాల హృదయం మరియు ముందుచూపు, జానపదులు, వారి అమాయకత్వంవంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజ పరిచాయి.

అసలు ఏ భారతీయ భాషైనా నేర్చుకోవడానికి ఆ భాషలోని చందమామ చదవడం ఉత్తమ మార్గం అనడం అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. కథ, కథకి సంబంధించిన బొమ్మలు ఎలా ఉండాలో, ఏ నిష్పత్తిలో ఉండాలో చక్కగా చేసి చూపించి, మిగిలిన పత్రికలకు మార్గదర్శకమైంది. చందమామ శైలిని, ఒరవడిని, ఇతరులు అనుకరించడం లేదా అనుసరించడం చెయ్యగలిగారుగాని, కొత్త శైలినిగాని ఒరవడినిగాని ఇంతవరకు సృష్టించలేక పోయారు.

“బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. -కొడవటిగంటి కుటుంబరావు….”

చందమామ కధలు ఏవి కూడా ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఉండవు, అందులో ఉండేదంతా ఒక ఐడియల్ ప్రపంచం. వాటిలో దెయ్యాలు, రాక్షసులు, మంత్రగాళ్ళు, గయ్యాళి అత్తలు, దొంగలు అందరూ ఉండేవారు. కానీ ఎవ్వరూ మరీ క్రూరంగా ప్రవర్తించరు. కధ చివరిలో చెడ్డవాళ్ళు అందరూ మారిపోయినట్టు చూపేవాళ్ళు. ప్రతి కధలోను ఒక నీతి సూత్రం ఉండేది, సమాజానికి కావలసిన ఏదో ఒక విలువని బోధించేటట్టుగా ఉండేవి.
ఇది చందమామ గురించి త్రివిక్రమ్ గారు తదితరులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ వస్తున్న వివరాలు.

ఇక నా విషయానికి వస్తే…

భారతీయ బాలసాహిత్యానికి ఒరవడి దిద్దిన చందమామ గురించి రెండే్ళ్ల క్రితం వికీపీడియాలో త్రివిక్రమ్ గారి పరిచయ వ్యాసం గురించి చదివిన తర్వాత ఇటీవలే ఆ పత్రిక ఆన్‌లైన్ విభాగంలో చేరడం వరకు అంతా కలలోలాగా సాగిపోయింది.

చందమామతో తమ బాల్యాన్ని పెనవేసుకుని పైకి ఎదిగిన నాటి తరం జ్ఞాపకాలను ఒక చోట గుదిగుచ్చి దానికి చందమామ నేటి చరిత్ర, రేపటి భవిష్యత్తుకు సంబంధించిన సమాచారంతో ఒక చరిత్రను చందమామ అభిమానుల ముందుకు తేవాలని చేసిన ప్రయత్నంలో భాగంగా గత రెండు నెలలుగా ఆన్‌లైన్‌లో చందమామ గురించి వచ్చిన, వస్తున్న కథనాలు, వ్యాసాలు, జ్ఞాపకాలను సేకరిస్తూ వస్తున్నా..

చందమామపై జ్ఞాపకాలను విడిగా వెతికి చదువుకోవడం బదులుగా ఒకే బ్లాగులో వీటన్నిటినీ పోస్ట్ చేసి ఉంచితే చందమామ అభిమానులకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనతో http://blaagu.com/chandamamalu/  పేరిట ఓ బ్లాగును తెరుస్తున్నా. త్రివిక్రమ్ గారి జ్ఞాపకాలతో మొదలు పెట్టి ఇంతవరకు నేను సేకరించిన చందమామపై బ్లాగర్ల కథనాలు అన్నిటినీ పోస్ట్ చేయాలని బావిస్తున్నా.

నాటినుంచి నేటిదాకా చందమామను తమ హృదయపు లోతుల్లో ఉంచుకుని ప్రేమిస్తూ వస్తున్న అభిమానులందరికీ ఇదొక వేదికగా ఉంటుందని ఆశిస్తున్నా. నా దృష్టికి రాకుండా మిగిలిపోయిన ఇతర రచయితల చందమామ జ్ఞాపకాలను కూడా పాఠకులు, నెటిజన్లు పంపితే అందరికీ ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నా.

చందమామ చరిత్రను, నాలుగైదు దశాబ్దాలుగా తెలుగు తరాలను మంత్రముగ్ధులను చేస్తున్న చందమామ జ్ఞాపకాలను ఒకే చోట అందిస్తున్న ఈ బ్లాగును ఆదరిస్తారని, చందమామ అభిమానులకు పంచిపెడతారని ఆశిస్తూ..

మొదట చందమామ గురించి త్రివిక్రమ్ గారు వికీపీడియాలో పోస్టు చేసిన పెద్ద వ్యాసాన్ని చిన్న చిన్న బాగాలుగా ప్రచురించడం జరుగుతుంది. తర్వాత రోహిణీ ప్రసాద్, వేణు గార్లు తదితర చందమామ అభిమానుల రచనలు వరుసగా పొందు పర్చడం జరుగుతుంది.

ఈ బ్లాగులో కామెంట్ రూపంలో లేదా నా పర్సనల్ మెయిల్ ఐడి (krajasekhara@gmail.com) కి కూడా మీకు తెలిసిన చందమామ సమాచారాన్ని, మీరు మరువని చందమామతో మీ బాల్యపు జ్ఞాపకాలను పంపుతారని, పంపాలని కోరుకుంటూ….

రాజశేఖర రాజు

RTS Perm Link

Hello world!

July 7th, 2009

బ్లాగు కు స్వాగతం. ఇది మీ మొదటి టపా. దీనిని మార్చి లేదా తొలగించి, బ్లాగడం మొదలు పెట్టండి.

RTS Perm Link