చందమామ అపురూప పాఠకుడు

July 26th, 2010

చందమామ సంపాదకులకు తెలుగు చందమామ పాఠకుడు టార్జాన్ రాజు నమస్కరించి రాస్తున్న ఉత్తరం. ప్రస్తుతం నా వయస్సు 75 సంవత్సరాలు. 1947 సంవత్సరం  జూలై-ఆగస్టు నెలలో మన చందమామ మొదటి పుస్తకం కొని చదివినాను. అప్పటినుండి ఈ రోజు వరకు 60 సంవత్సరాలకు పైగా చందమామను కొని చదువుతూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం పూర్తి అయిన తర్వాత 6 + 6 పుస్తకాలు చొప్పున బైండింగ్ చేయించి. నా లైబ్రరీలో భద్రంగా ఉంచినాను. ఈ చందమామలు, నా తండ్రి, నేను, నా కుమారుడు, మనమడు, ఇప్పుడు మునిమనుమడు చదువుచున్నారు. నేను చందమామ తప్ప ఏ ఇతర మాసపత్రికలు, వారపత్రికలు చదవను.

నాకు 1947 నాటికి పదేళ్లు. స్కూలుకు పోతూ పాన్‌షాపులో చందమామ కనిపిస్తే కొన్నాను. అప్పట్లో చందమామ ధర 25 పైసలు. నా బ్యాగులో చందమామ పత్రికను చూసి కోప్పడిన నాన్న దాన్ని తీసుకుని చదివారు. ఆగస్టునుంచి స్కూలు ఫీజును ఎక్కువగా ఇచ్చిన నాన్న, మిగిలిన డబ్బుతో చందమామ కొనుక్కోమని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకూ మా కుటుంబంలో అందరూ చందమామ పాఠకులే.

నా వయస్సు ఇప్పుడు 75 ఏళ్లు. నా మునిమనమరాలు చందమామ కథలు చెప్పమని రోజూ సాయంకాలం పూట పోరు పెడుతుంటే అప్పటినుంచి ఇప్పటి వరకు చందమామలను బైండు చేయించి రోజూ పిల్లలకు చందమామ కథలు వినిపిస్తున్నాను.

గత కొద్ది నెలలుగా మొదటి పేజీలో బేతాళ కథను ప్రచురిస్తున్నారు. బాగాలేదు. గతంలో ఉన్నట్లుగానే చందమామను ముద్రించగలరు.

పత్రిక 74 పేజీల్లో 20 పుటలు కార్టూన్‌లు, క్రీడలు, ప్రకటనలే ఉంటున్నాయి. తగ్గించగలరు.

నా అడ్రస్
జి.టార్జాన్ రాజు.
G.Tarzan Raju
ఫ్లాట్ నెంబర్ 150, NCL North Avenue
kompalli (via)
Hakimpet
(Near Sai baba temple)
Succendrabad -500014
AP.
మొబైల్: 98483 34503

గమనిక: “నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరేదేమిటంటే, 2009 సంవత్సరం నవంబర్- డిశంబర్ నెల చందమామ పుస్తకాలు నాకు అందలేదు. ఏ కారణం చేతనో పేపర్ బాయ్ ఇవ్వలేదు. నేను హైదరాబాదులో కన్పించిన ప్రతి పుస్తకాల షాపులో అడిగినాను. లేవు అని చెప్పినారు. మీరు నా కోరికను మన్నించి పై 2 పుస్తకాలు పంపించమని కోరుతున్నాను. పోస్ట్‌మెన్‌కు డబ్బు చెల్లించి పుస్తకాలు విడిపించుకొంటాను. నమస్తే.”

టార్జాన్ రాజు
సికిందరాబాద్

వీర చంపికి వీరతాడు

శ్రీ టార్జాన్ రాజు గారు  ఆరు దశాబ్దాల చందమామ పత్రిక చరిత్రలో ఒక అపరూప పాఠకులు. 1947 జూలై నెలలో స్కూలుకు పోతూ పాన్‌షాపులో చందమామ కనిపిస్తే కొనుక్కున్న ఈయన అప్పటినుంచి చందమామను చదువుతూనే ఉన్నారు. గత 63 ఏళ్లుగా చందమామ ప్రతులను ఆయన భద్రపరుస్తూనే ఉన్నారు. 2009 నవంబర్-డిసెంబర్ నెల చందమామ పుస్తకాలు హైదరాబాద్‌లో దొరకలేదని తప్పక వాటిని తనకు పంపించే ఏర్పాట్లు చేయించమని జనవరి చివరలో ఉత్తరం పంపారు. మొబైల్ నంబర్ పంపించడంతో వెంటనే ఆయనకు కాల్ చేస్తే అప్పటికే ఎలాగోలా ఆ పుస్తకాలను సేకరించుకున్నట్లు తెలిపారు.

మళ్లీ గత ఫిబ్రవరి నుంచి చందమామలు లేటుగా వస్తూండటంతో అప్పటినుంచి చందమామలు మిస్ అవుతున్నాయని. తప్పక ఈ కాపీలను పంపవలసిందని కోరుతూ ఇవ్వాళే ఆయన చెప్పారు. నెల దాటిన తర్వాత చందమామ వద్ద పాత కాపీలు అందుబాటులో ఉండని పరిస్థితుల్లో ఆయన కోరిక తీరటం కష్టమే.

కానీ ఇలాంటి అవసరాలు వస్తాయనే ఉద్దేశంతో అదనపు చందమామలను ముందుగా కొని పెట్టడం వల్ల ఆయనకు వ్యక్తిగతంగా అయినా కోరిన చందమామలను పంపించగల అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అదే సమయంలో ప్రతినెలా లేటుగా రావడం మూలాన చందమామను నిలిపివేశారని హైదరాబాద్‌ బుక్ ఏజెన్సీల వారు ఈయనకు చెప్పారనే వార్త విన్నందుకు బాధగా ఉంది.

నిన్న ఆదివారం (25-07-2010) చందమామ పత్రికపై పరిశోధన చేస్తున్న బాల సాహిత్య పరిషత్ కార్యదర్శి శ్రీ దాసరి వెంకటరమణ గారితో ఫోన్‌లో మాట్లాడుతూ ఈ చందమామ అపురూప పాఠకుడి గురించి సమాచారం తెలిపితే మహదానందపడ్డారు. 60 సంవత్సరాల చందమామలు ఆయన వద్ద ఉండటమే ఒక అపురూప విషయం అంటూ వాటిని శాశ్వతంగా భద్రపర్చటంపై చర్చించారు. ఆయనతోటే నేరుగా ఈ విషయం ప్రస్తావించవలసిందిగా కోరుతూ ఆయన గతంలో రాసిన ఉత్తరంలోని విశేషాలను చందమామ బ్లాగులో పెడుతున్నట్లు చెప్పాను.

టార్జాన్ రాజు గారు ఇంటర్నెట్, ఈ మెయిల్ వంటివాటి గురించి ఏమీ తెలియని అతి సాధారణ అరుదైన పాఠకులు కాబట్టి నేరుగా కలిసి ఆయనతో మాట్లాడితే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తూ హైదరాబాద్‌లో ఆసక్తి ఉన్న చందమామ అభిమానులు ఆయనను సంప్రదించేందుకు గాను ఆయన చిరునామా కింది ఇస్తున్నాము.

చందమామ పరిశోధనకోసం తన వద్ద లేని ఒక పాత చందమామను హైదరాబాద్ పేవ్‌మెంట్ల మీది అంగళ్లలో ఒక సంచికను అక్షరాలా వెయ్యిరూపాయలు ఇచ్చి కొన్న వీరాభిమాని దాసరి వెంకట రమణ గారు. శ్రీ చొక్కపు వెంకటరమణ గారివంటి పరిచయస్తులు తనను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మరీ తమ వద్ద ఉన్న పాత చందమామలను ఇచ్చి ఉపయోగించుకోమని చెప్పిన విషయం నిన్ననే ఆయన మాట్లాడుతుంటే ఆప్రతిభుణ్ణయిపోవడం నావంతైంది.

“ఆ… చందమామ కథలేనా”  అంటూ తేలిక చేసి మాట్లాడటం ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సమీక్షకులకు, సాహిత్యకారులకు అలవాటుగా తయారయిందట. లక్షలాదిమందిని కథా మంత్ర జగత్తులో విహరింపజేసిన మహిమ, మ్యాజిక్ అలనాటి చందమామ కథల్లో ఉందని. ఈ తరానికి వేటి మీదా అభిరుచి లేకుండా పోతున్నట్లే చందమామ కథల టేస్ట్‌ను పొందే అవకాశం కూడా లేకుండా పోయిందని రమణగారు నిన్ననే బాధపడ్డారు.

శ్రీ పాలంకి వెంకట రామచంద్ర మూర్తి  గారు తొలి తరం చందమామ రచయితగా పుంఖానుపుంఖాలుగా కథలు రాశారని, ఒక్కో సందర్భంలో చందమామ పత్రిక నిండా ఆయన కథలే రకరకాల మారుపేర్లతో ప్రచురించబడేవని మరెన్నో చరిత్రకు సంబంధించిన విషయాలు ధారాళంగా చెప్పుకుంటూ పోయారాయన.

వెంకట రమణ గారూ, మీకు వీలయితే సికిందరాబాద్‌లో హకీంపేట్ ప్రాంతంలో ఉన్న టార్జాన్ రాజుగారిని కలిసి లేదా ఫోన్ చేసి సంప్రదించడానికి ప్రయత్నించగలరు. మీరు చందమామ చరిత్రకు సంబంధించి ఎన్ని విషయాలు తోడుతున్నా, వ్యాసాల రూపంలో రాస్తున్నా ఇంకా చాలావరకు మీవద్ద సమాచారం మిగిలే ఉందనిపిస్తోంది.

ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు విభాగానికి చెందిన శ్రీ ఎమ్.దాసు గారు కూడా చందమామ  పత్రిక పై పరిశోధన చేస్తున్నానని, కావున మీ పత్రికలో పనిచేసిన రచయితలు, వారి జీవితచరిత్రకు సంబంధించిన విషయాలు (1947-2000) దయచేసి పంపగలరని ఈ మధ్యే చందమామకు ఈమెయిల్ పంపారు. మీవద్దనుంచి అవసరమైన సహాయాన్ని ఆయనకూ అందించగలరు

Sri. DASU.M
DEPT OF TELUGU
ANDHRA UNIVERSITY
VISAKHAPATNAM
PIN-530003
CELL NO : 9989283692

NB: గత నలబై, యాభై ఏళ్లుగా చందమామలు వరుసగా చదువుతున్న అభిమానుల వివరాలు పాఠకులకు తెలిసి ఉంటే వారి వివరాలు చందమామకు పంపించగలరు.

RTS Perm Link

కూరగాయల కథ

June 25th, 2010

బుడంకాయంత బుడ్డోడికి వంకాయంత వజ్రం దొరికిందట, ఆ బుడంకాయంత బుడ్డోడు ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో దాచాడంట. ఆ చాచటాన్ని దోసకాయంత దొంగోడు చూస్తాడు. ఆ దోసకాయంత దొంగోడు బీరకాయంత బీరువా దగ్గరికి వచ్చి ఆ వంకాయంత వజ్రాన్ని తీస్తుంటే మునక్కాయంత ముసలవ్వ చూసి గుమ్మడికాయంత పోలీస్ స్టేషన్ కెళ్లి పొట్లకాయంత పోలీసులకు చెప్పుతుంది.

ఆ పొట్లకాయంత పోలీసులొచ్చి ఆ దొంగని పట్టుకొని, కాకరకాయంత కర్రతో కొట్టి, సొరకాయంత స్టేషన్లో ఉంచి, ఆ వంకాయంత వజ్రాన్ని ఆ బుడంకాయంత బుడ్డోడికి ఇప్పిస్తారు. అప్పుడు వాడు సంతోషించి, ఆ మునక్కాయంత ముసలవ్వకి చెంచలాకంత చెయ్యితో బచ్చలాకంత బహుమానం ఇస్తాడు.
- బి. గిరిబాబు

పాతాళదుర్గం 17 వ భాగాన్ని ఆన్‌లైన్ చందమామలో ప్రచురించవలసిందిగా కోరుతూ చందమామ మెయిల్ కమ్యూనికేషన్‌లోకి వచ్చిన బోయ గిరిబాబు గారు అడక్కుండానే తన చందమామ జ్ఞాపకాన్ని ఈ చిన్ని కథ రూపంలో పంపారు. కూరగాయలకు, మనుషులకు, వస్తువులకు, పోలిక పెట్టి కథ నడిపించే తీరు అచ్చంగా మన దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న స్వచ్ఛమైన మౌఖిక సంప్రదాయానికి నమూనాగా నిలుస్తుంది.

ప్రస్తుతం ప్రింట్ చందమామలో ఇలాంటి కథలు అచ్చు వేయనప్పటికీ, మనందరి బాల్యం ఇలాంటి మౌఖిక కథలతో, ఊకొడితే గాని నోట్లోంచి ఊడిపడని కథలతోనే నడిచి ఉంటుంది.ఒకప్పుడు పల్లెటూళ్లలో పదిమంది పిల్లలు, పెద్దలు కూడితే చాలు… “ఒక ఊళ్లో ఒక రాజు ఉండేవాడంట. ఆతడికి ఏడుగురు కొడుకులంట..” అంటూ టకారాంత ప్రయోగంతో కథను అల్లుకుంటూ పోయే హృద్యమైన వాతావరణం రాజ్యమేలేది.

బుడంకాయంత బుడ్డోడు, వంకాయంత వజ్రం, బీరకాయంత బీరువా, దోసకాయంత దొంగోడు, మునక్కాయంత ముసలవ్వ, గుమ్మడి కాయంత పోలీస్ స్టేషన్, పొట్లకాయంత పోలీసులు.. మౌఖిక సాహిత్య శైలిలో కూడా ఆది ప్రాస ఎంత చక్కగా కుదిరిందో ఈ కథలో పోలికలన్నీ చెబుతున్నాయి.

రచయితలు, కథకులు పంపుతున్న కథలు సవరణకు గురైనప్పుడు ప్రత్యేక వ్యావహారిక భాషలోకి మారిపోయి వాటి సహజత్వం కోల్పోతున్నాయేమో అనిపిస్తుంటుంది. కాని సవరణలు లేకుండా, శిష్ట సాహిత్య రీతులకు అవతలనే ఉంటూ టకార ప్రయోగంతో మనిషి అల్లుకుంటున్న సహజమైన కథలను కూడా రికార్డు చేయవలసిన అవసరముంది. ఇప్పటికే ఇలాంటి ఎన్ని అపరూప కథలు -బహుశా వీటికి సాహిత్య గౌరవం లేకపోవచ్చు- తెలుగునేలపై అంతరించిపోయాయో చెప్పలేము.

మా చిన్నప్పుడు అంటే 1970లలో అమ్మ దగ్గిర, అవ్వ దగ్గర, తాత దగ్గిర కూర్చుని కథలు చెప్పించుకుని పిల్లలందరం సంబరపడేవాళ్లం. కొన్నాళ్లకు స్కూళ్లకు పోయాక, టౌన్లకు పోయాక కొత్త సినిమాలు, పాతసినిమాలు చూసే అవకాశం వచ్చినవారిని మధ్యలో కూచో బెట్టుకుని సినిమా కథ మొత్తం ఆ అదృష్టవంతుల నోట్లోంచి చెప్పించుకుంటూ గంటల కొద్దీ గడిపేవాళ్లం. ఇలా బాల్యమంతా కథలే. ఇంటర్మీడియట్‌లోకి వచ్చాక ఆ కథల ప్రపంచం స్థానంలో కొత్త సాహిత్యం, అభిరుచులతో కాలం కొట్టుకుపోయింది.

తన చిన్ని చందమామ జ్ఞాపకం ద్వారా మళ్లీ అందరి బాల్యాన్ని గుర్తు చేసిన గిరిబాబు గారికి ధన్యవాదాలు.
మీ చందమామ జ్ఞాపకాలను పోస్ట్ ద్వారా చందమామ ఆఫీసుకు-చెన్నయ్ చిరునామా మళ్లీ వడపళనికి మారింది- కాని, కింది ఈమెయిల్ ఐడీకి కాని పంపండి.
abhiprayam.@chandamama.com

తెలుగు ఆన్‌లైన్ చందమామలో చందమామ పాఠకులు, అభిమానులు, రచయితలు పంపిన చందమామ జ్ఞాపకాలకోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

‘చందమామ’ జ్ఞాపకాలతో వృధ్ధాప్యమూ పసితనమే…!!

June 18th, 2010

చందమామ యాజమాన్యం ‘ చందమామను (1947-2000) అన్‌లైన్‌లో పెట్టడమే ఓ గొప్ప సేవ! యధాలాపంగా కధలు చదువుతుండగా 1947 నాటికధ చదివి  ‘ నేను పుట్టిన సంవత్సరం నాటికధ’ నాలో స్పందన  కల్గించింది. చదివే ఊహ నాకు  కలిగినప్పటినుండీ చందమామను మానాయనగారు కొనితెచ్చేవారు.పెరిగేకొద్దీ’ కాసులు ‘దాచుకుని చందమామ కొని చదివి నాతర్వాతి వారికి వివరిస్తూ, ఊరిస్తూ చెప్పిన జ్ఞాపకం నాకింకాఉంది.

చందమామకు ఫోటో వ్యాఖ్యలు పంపాలనీ, దాన్లో అచ్చులో నాపేరు చూచుకోవాలనే కోరిక అమితంగా ఉండేది. చందమామకు కధలు వ్రాయాలనీ, అచ్చులో పేరుతోపాటుగా ఆ నా కధకు ఎలాంటి బొమ్మలు వేస్తారో అనే ఊహతో  పసితనమంతా గడచిపోయింది. ఆ ప్రయత్నం మాత్రం ఎందుకో జరగలేదు.అప్పట్లో పోస్టుకార్డు కొనడమే కష్టం, ఇహ కవరుకొని వ్రాసి పంపడమంటే మహా కష్టం.

చదువు, ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగం, పల్లెల్లో పని చేయడం, నీతికధల పిరీయడ్‌లో పాత చందమామ కధలు పిల్లలకు  మరికొంత సంభాషణలు, వివరణలు జోడించి ఆసక్తిదాయకంగా చెప్పడం కూడానాకింకా గుర్తుంది. పల్లెల్లో పని చేసేప్పుడు స్కూల్ లోని పిల్లలందరిచేతా నయాపైసలు కూడబెట్టించి, చందమామ పుస్తకాలు నెలనెలా నేనే కొని పట్టు కెళ్ళి చదివించడమూ, ఆపైన వాటిని ‘ స్కూల్ లైబ్రరీ’లో ఉంచడమూ కూడా నాకింకాగుర్తే!.
         
స్కూల్‌లో చదువుకునేప్పుడు బోర్ కోట్టే పిరీయడ్‌లో నోట్‌బుక్‌లో చందమామ సంచిక పెట్టుకుని చదివిన రోజులూ గుర్తే. తోటి స్నేహితులు చూస్తే వారినీ  చదువుకోమని చూపిన సంఘటన ఇప్పటికీ నవ్వుతెప్పిస్తుంది. చందమామ చేసినంత సాహిత్యసేవ ఇంతింతనరానిది. చిన్నతనంలోనే పిల్లలకు, చదవడాన్నీ, కధలపట్ల మమకారాన్నీ నేర్పినది మాత్రం  చందమామే!

చందమామ నా ఉద్యోగ జీవితంలో బోధనకు సహకరించడమేకాక, ఆధ్యాత్మిక జీవితంలోనూ సహకరించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. చందమామ ఎప్పటికీ అందరికీ ‘మామే!’ మరి. చందమామ జ్ఞాపకాలతో  వృధ్ధాప్యమూ పసితనంగానే ఉంటున్నది.  చందమామ జ్ఞాపకాలు మీఅందరితో పంచుకోడమూ ఎంతో ‘థ్రిల్లింగ్’గా ఉంది..

నేను 40 సంవత్సరాలు ఊపాధ్యాయినిగా పని చేసి విశ్రాంతి పొందిఉన్నాను. నా సర్వీసులో అంతా ‘ చందమామ కధల,నాస్టూడెంట్స్‌కు  చెప్తూ, చదివిస్తూ, వారికి తెలుగు నేర్ప్డమేకాక, కధలపట్ల ఆసక్తి  పెంచాను.నా అనుభవాలతో చిన్న చిన్న కధలు వ్రాస్తుండటం నావిశ్రాంత జీవనంలో కాలక్షేపంగా  ఉంది.

నా జీవితంలో 40సంవత్సరాలు పిల్లలతో గడపడం వల్ల నాకు పిల్లలతో మాట్లాడటమన్నా, వారికి పనికి వచ్చే పనులు కధలు, గేయాలు, నీతినేర్పే ఆటలు  క్రొత్తక్రొత్తవి  తయారు చేయడమన్నా మహా ఇష్టం. నాకు 64 సం.లు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా పిల్లలతోనే గడుపుతుంటాను, వారిలో ఒకరిగా, శేష జీవితాన్ని చందమామ స్నేహంతో గడపాలనేది నా కోరిక.
 
మామిత్రుడు  ఒక హైస్కుల్  ప్రధానోపాధ్యాయుడు  ఒకసభలో మాట్లాడుతూ ‘నేను హాయిగానిద్రపోతాను  అన్ని ఆలోచనలు మరచి, ఎందుకంటే పడుకునే ముందు చందమామ చదువుతాను’ అనిచెప్పారు. చందమామ పిల్లలకే కాక పెద్దలకూ మితృడేనన్నమాట!
చందమామ జ్ఞాపకాలు కోకొల్లలు. ఇంకా మరి కొన్ని ‘చందమామ జ్ఞాపకాలు’ మరోసారి…

“…..చందమామ కొనాలని ముందుగానే డబ్బు కూడబెట్టుకునే దాన్ని. ఆరోజుల్లో ఉపాధ్యాయుల జీతాలు చాలాతక్కువ. వారంలో ఓరోజు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్‌కు నడిచి  ఆడబ్బుతో చందమామ వచ్చినరోజే కొని ఇంటికి వెళ్ళగానే ముందుగా ఫొటో వ్యాఖ్యలు చూసి, ‘అయ్యో ఇలా నేను వ్రాసి ఉండవలసింది’ అనుకుని, ఆనెల వ్యాఖ్యల గురించీ, ఆ వారమంతా ఆలోచించడమూ ఇంకా గుర్తుంది. చందమామ ‘ పిల్లలమామగా ‘ ‘మామ కాని మామ  చందమామ’. ఆకాశంలో చందమామ వెన్నెలనిస్తే, ఈచందమామ విజ్ఞానాన్నిస్తాడని  నా స్టుడెంట్స్‌కు  చెప్పడమూ గుర్తుంది.

చందమామ పిల్లల నేస్తమనీ, దాన్ని మించిన నేస్తం మరేదీ లేదనే నమ్మకంతో స్కూల్ పిల్లలచే చందమామ తప్పక ప్రతినెలా చదివించాను.. ఉద్యోగ జీవితంలో బోధనకు చందమామ బొమ్మలను, కథలను ఉపయోగించుకున్నాను.. కుమార్తె, కుమారులకూ చందమామ చదవడం అలవరచాను… 40 సంవత్సరాలు ఊపాధ్యాయినిగా పని చేసి, నా సర్వీసులో అంతా’ చందమామ కధలను, నా స్టూడెంట్స్‌కు చెప్తూ, చదివిస్తూ, వారికి తెలుగు నేర్ప్డమేకాక, కధలపట్ల ఆసక్తి  పెంచాను…”

శ్రీమతి ఆదూరి హైమవతి గారూ,

మీ ఆత్మనివేదనను జ్ఞాపకాల రూపంలో చందమామ కోసం పరిచి చూపారు.. మీ చిన్ని జీవితంలో మీరు చేసిన -పైన ఉటంకించిన- ప్రతి పనీ మంచిదే. మీ జన్మ సార్థకం అని మీరు వినమ్రంగా చెప్పుకున్నారు. కాని చందమామ జన్మ సార్థకమైందని మేం అనుకుంటున్నాము.

అక్షరాక్షరంలో పిండివెన్నెల చిలికించి మీరు అల్లిన వాక్యాలు చూస్తుంటే నాకు ఇటీవలే, రచన మే నెల ప్రత్యేక సంచిక -చందమామ కథల మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారిపై ప్రత్యేక సంచిక- చూసిన సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రిత్వ శాఖలో కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న మేడేపల్లి శేషు గారు చెప్పిన కింది మాటలు గుర్తుకొస్తున్నాయి.

“పిల్లలకు మెదడు ఒక్కటే కాదు, మనసూ ఉంటుందని గ్రహించకుండా వాళ్ళను ‘చదువుల యంత్రాలుగా’ మారుస్తున్న మన ప్రస్తుత విద్యవిధానమంటే నాకు మొదటినుంచీ అసహ్యమే. వాళ్ళను మరింత అసహ్యకరమైన వినోద (?) కార్యక్రమాలకు బలికావించే టి.వి. చానెల్సు అన్నా, ఇప్పటి సినిమాలన్నా నాకు మరింత అయిష్టం. నాకే కనుక విద్యావిధానాన్ని నిర్ణయించే అధికారమిస్తే, నెలకో రోజు ‘చందమామ’ చదివే పీరియడ్ పెడతాను. మార్కులతో పనిలేకుండా, వాళ్లకు కొన్ని పాఠ్య అంశాలు ప్రవేశపెడతాను. మంచి పుస్తకాలు చదివిస్తాను. మంచి చలన చిత్రాలు చూపిస్తాను. పరీక్షలకు బదులు వాటిగురించి చర్చ పెడతాను…

…..జ్ఞానంతోపాటు పిల్లల్లో మనసూ, బుద్ధీ కూడా వికసించాలి. అప్పుడే వాళ్లకు పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. ఏ చదువు చదివితే ఎంత సంపాదించవచ్చు అనే పద్ధతిలోనే నడుస్తోంది మన ప్రస్తుత విద్యావిధానం. ఇది ఎటు వెళ్లి ఎటు తేలుతుందో అర్థం కాకుండా ఉంది. భాష, సాహిత్యం, కళలు అనేవి ఉపయోగంలేని వ్యాపకాలు అనే ధోరణి బాగా ప్రబలుతోంది. ఇది ముందు తరాలకు చాలా ప్రమాదం.”

మీకులాగే మేడేపల్లి శేషు గారి కల ఫలించాలని, మన రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు, బాలబాలికలకు చందమామ పత్రిక అందాలని, క్లాసుల్లో చందమామ చదివే పీరియడ్ అంటూ ఒకటి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేం కూడా హైస్కూలులో తరగతి గదుల్లో టీచర్ పాఠం చెబుతుంటే చందమామ చదువుతూ పట్టుబడి దెబ్బలు తిన్నవాళ్లమే మరి.

కొసమెరుపు:

హైమవతి గారూ,
చందమామ నుంచి మీకు చల్లటి వార్త.

మీ ‘సందేశం’ కథను చందమామ ప్రచురణకు తీసుకుంటున్నాము. బహుశా మీ కథ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ప్రచురించబడవచ్చు. ప్రాథమిక ఎంపిక ఈరోజే పూర్తయింది.

చందమామలో కథ చూసుకోవాలనుకున్న మీ జీవిత కాల ఆకాంక్షను నెరవేరుస్తున్నందుకు మాకూ సంతోషంగా ఉంది. కొన్ని తరాల పిల్లలకు చందమామ కథలను, బొమ్మలను పరిచయం చేసిన మనీషి మీరు. మీ కథను ప్రచురించబోతూ చందమామ తనను తానే గౌరవించుకుటోందని భావిస్తున్నాము.

మీరు ఆరోగ్యం కాపాడుకుంటూ, ఇలాగే వీలు  కలిగినప్పుడల్లా 1, 2, 3 పేజీల కథలను పంపుతుంటారని ఆశిస్తున్నాము. మీరు ఉన్నది అమెరికాలోనే అయినప్పటికీ చందమామకూ మీకు అట్టే దూరం లేదు లెండి.

చందమామతో మీ ఈ కొత్త అనుబంధం కూడా దీర్ఘకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

చందమామలో కథ చూసుకోవాలనుకుంటున్న మీ చిన్న ఆశను నెరవేర్చటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. మీరు చిన్న కథలు ఇలాగే పంపిస్తూ ఉండండి. చందమామకు మీరు కధలు పంపటం మాకు గౌరవం, సంతోషం కూడా.

ఆదూరి హైమవతి గారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం.. కింది చందమామ వెబ్‌సైట్ లింకు చూడండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2453

మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.  మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.

లేదా
పోస్టులో కూడా, మారిన చందమామ కొత్త చిరునామా (చెన్నయ్‌)కు మీ జ్ఞాపకాలు పంపండి.

Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6, Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone :  +91 44 43992828 Extn: 818

RTS Perm Link

ఇంతగా అమ్ముడుపోయామా?

June 16th, 2010

యూనియన్ కార్బైడ్.. ప్రపంచ పారిశ్రామిక యుగ చరిత్రపై ఒక పెద్ద మచ్చ. పాతికేళ్ల తర్వాత కూడా ఆ మచ్చ భోపాల్ భాధితులపై వేస్తున్న దుష్ర్పభావం తగ్గుముఖం పట్టలేదు. ఆర్థికంగానే కాదు, మనుషుల ప్రాణాల పరంగానే కాదు. ఘోరమైన శారీరక బాధల పరంగానే కాదు.. జీవితంలో అన్నిటికంటే విలువైన ఆత్మగౌరవ పరంగా కూడా యూనియన్ కార్బైడ్ మచ్చ ఈ దేశాన్ని పాతికేళ్లుగా కాలుస్తోంది.

అన్ని వ్యవస్థలూ ప్రజా వ్యతిరేక స్వభావంలో కూరుకుపోయిన నేపధ్యంలో.. న్యాయపరంగా కూడా భోపాల్ మానవ ఆర్తనాదం ఓటమి బాట పట్టింది. న్యాయం కూడా ఇంత నిస్సిగ్గుగా అమ్ముడయిపోయిన వేళ.. ఈ దేశంలో బాధితులకు, నిజంగా సహాయం కావలసిన వారికి ఇక దిక్కెవ్వరు?

కొన్ని వందల, వేల ప్రాణాలు హరీమన్నాయి. వేలాది మంది శరీరాలు రసాయనిక విస్పోటనంతో చితికిపోయాయి. ఎవరిని కదిపినా ఆక్రోశం, ఆర్తనాదం.. మానని గాయాలు పచ్చి పుండును పాతికేళ్ల  తర్వాత మరోసారి కెలికిన అనుభూతి.

న్యాయమూర్తులంగారూ,
మీరు న్యాయం చేయకపోయినా ఫర్వాలేదు. దేశదేశాల్లో పాతుకుపోయిన ఆ బహుళ జాతి కంపెనీ మీద చేయి వేసే సాహసం మీకు లేకపోవచ్చు. మీరు చదివిన చదువులు, నేర్చిన సంస్కారం… ఇవేవీ భోపాల్ బాధితుల గోడును వినడంలో పనికిరాకుండా పోయి ఉండవచ్చు… ఏవో.. ఏవేవో తెలియని ఏ ఇతర శక్తులో మీ గొంతుకు, మీ కలానికి, మీ ధర్మవివేచను, మీ ఉనికికి కూడా అడ్డుపడి ఉండవచ్చు.. రావలసిన నిజమైన తీర్పును మీ స్వరంలోంచి రాకుండా చేసి ఉండవచ్చు.

కాని ఆ హంతక స్వభావం గల కంపెనీ ప్రతినిధికి వయసు మీరిన కారణం చూపి రెండేళ్ల శిక్షతో సరిపెట్టారు. మీరు బాధల్ని, దశాబ్దాల నొప్పులను వినకపోయినా ఫర్వాలేదు. బాధితుల మానని పుండ్లను మరింతగా కెలికే అధికారం మీకు ఎవరిచ్చారు? దేశానికి వెలుగునిస్తామని చెప్పిన ఆ ఎవరెడీ టార్చ్ లైట్ల అసలు పెట్టుబడిదారుడి ఊసు కూడా మీ తీర్పులో కనబడకుండా పోయింది.

న్యాయమూర్తులంగారూ! కోటిగొంతుకల పెనుకేకలే సాక్ష్యంగా మేం ఈ చిన్ని ప్రశ్న వేస్తున్నాం. మీరు న్యాయవర్తనులేనా? మీరు న్యాయంగానే వ్యవహరిస్తున్నారా? మీరు అమ్ముడు పోయారో, అమ్ముడుపోలేదో, అదృశ్య వత్తిడులకు లొంగిపోయారో మాకనవసరం. విషరక్కసి విసిరిన పుండ్లు మానక, పాతికేళ్లకే వృద్ధాప్యంతో అలిసిపోయిన భోపాల్ బాధితుల వయసు, వారి హాహాకారాలు మీ చెవిన పడ్డాయా లేదా అన్నదే మా సందేహం, ప్రశ్న కూడా.

ఈ అహింసా దేశంలో ఇంత అహింసాత్మకంగా ఇంత విషపు తీర్పును ప్రకటించేశారే… వ్యవస్థా వ్యతిరేక పోరాటాలను ‘అవతార్’ సినిమాల్లోనే చూసి ఆనందించమని భజాయించేశారే.. పాతికేళ్ల తర్వాత ఇంత నిస్సిగ్గు తీర్పుతో మీరు ఈ దేశ వాసులను ఎంఎన్‌‌సీల ముందు కట్ట కట్టుకు చావమంటూ తాంబూలాలిచ్చేశారే..!

ప్రపంచంలో సాయుధపోరాటాలు ఎందుకు పుడతాయో, హింసాత్మక, ప్రతి హింసాత్మక తిరుగుబాట్లు ఎందుకు చెలరేగుతాయో.. కమ్యూనిస్టు ‘భూతాలూ’, నక్సలైటు ‘రాక్షసులూ’, ఛావెజ్ ‘కర్కోటకులూ’, ఎందుకు ఆవిర్భవించారో, ఆవిర్భవిస్తున్నారో… మీకు ఏ ‘లా’ పుస్తకాలూ చెప్పవు లెండి. ఉన్నా చదివే తీరికా, ఆసక్తీ మీకు ఉండవు కదా..

ఎందుకంటే.. శ్రీశ్రీ అన్నట్లు… “అదృష్టవంతులు మీరు.. వెలుగును ప్రేమిస్తారు..”

అవునూ.. మీరు ఇప్పటికీ యూనియన్ కార్బైడ్ వాడి ఎవరెడీ టార్చ్‌లను కొని వాడుతూనే ఉన్నారు కదూ..

వెలుగును ప్రేమించేవారూ.. దేశభక్తిపరులూ కదా…

వాడుతూనే ఉంటారు లెండి…

రెండువందల లోపు జనాన్ని చంపిన కసబ్‌కు ఉరిశిక్ష…
పదిహేను వేలమందిని విషం కక్కి చంపించిన వాడి ఊసే లేదు..
కసబ్‌ది మాత్రమే నేరం…ఆండర్సన్ ఆత్మకు కూడా మలినం అంటదు…

ఢిల్లీలో ‘రాజపక్షే’ వాలిన వేళ.. భోపాల్‌లో సమస్త ప్రజా వ్యతిరేక తీర్పు వెలువడిన వేళ…
ఎంత చక్కటి టైమింగ్… ఎంత చక్కటి సమయపాలన

న్యాయం ఎంత గొడ్డుపోయిందీ దేశంలో..

కొసమెరుపు: శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని యూనియన్ కార్బైడ్స్ నాటి సీఈఓ ఆండర్సన్‌ను అఘమేఘాల మీద బయటకు పంపించి వేశారట కేంద్ర, రాష్ట్ర్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే జరిగేది లెండి. ఇంతకూ ఆండర్సన్ ఇక్కడే ఉంటే ఎవరి శాంతిభద్రతలకు భంగం కలిగేదో..

మరీ ఇంతగా అమ్ముడు పోయామా!!

ఇది చందమామ కథల గోడు కాదు.. నా గోడు.. ఏ న్యాయానికీ నోచుకోని ప్రజల గోడు…
(పాతికేళ్ల తర్వాత కూడా కనీస న్యాయం పొందలేక ఓడిపోయిన భోపాల్ బాధితులకు సహానుభూతితో…)

RTS Perm Link

ఊహలకు రెక్కలు తొడిగిన అందాల చందమామ

June 7th, 2010

ఇనగంటి రవిచంద్ర గారూ,

మీ చందమామ జ్ఞాపకాలు పంపిస్తూ తెలుగుభాషలోని తీయదనాన్నంతటినీ రంగరించిపోసినట్లుగా కిందివాక్యాలు రాశారు.

“మట్టి వాసన తప్ప మరో ప్రపంచం తెలియని నాకు బాహ్యప్రపంచపు ద్వారాలు తెరిచింది చందమామ.”

“చందమామలో ఉండేవి మామూలు కథలు కావు. ఊహా ప్రపంచంలోకి లాక్కుపోయే రెక్కల గుర్రాల్లాంటివి.”

“చిన్నపిల్లల మనసులు అప్పుడే పంటకు సిద్ధం చేసిన నేలలాంటివి. వాటిలో ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటివి మొక్కలే మొలకెత్తుతాయి.”

“పెద్దయ్యే కొద్దీ బాహ్యప్రపంచపు వాస్తవాలతో మెదడు మొద్దుబారిపోతుందేమో గాని చిన్నపిల్లల ఊహలకు హద్దే లేదు. ఊహ ఎప్పుడూ ఆనందమే. అలాంటి ఊహలకు రెక్కలు తొడిగింది అందాల చందమామ.”

“నా వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది ఒకరు మా అమ్మమ్మ అయితే మరొకరు చందమామ.”

మీరు ఇంకా చిన్నవారే.. చందమామ నాలుగవ లేదా అయిదవ తరం పాఠకుల కోవకు చెంది ఉంటారనుకుంటున్నాను.అయినా చందమామ పట్ల అభిమానంలో పాత తరాలకు తీసిపోని అనురక్తి మీది.

ముఖ్యంగా “మట్టి వాసన తప్ప మరో ప్రపంచం తెలియని నాకు బాహ్యప్రపంచపు ద్వారాలు తెరిచింది చందమామ.” అనే మీ వాక్యం చదువుతుంటే గుండె పట్టేసింది నాకయితే.

చిన్నతనంలో చందమామతో మా అనుబంధపు జ్ఞాపకాల తడి తగులుతోందిప్పుడు..

మీరు చల్లగుండాలని, మీ అక్క గారి పిల్లలకు కూడా చందమామను పరిచయం చేస్తున్న మీ మమకారం చల్లగుండాలని, ఈ సాంప్రదాయం అనంతంగా ఇలా సాగిపోవాలని మేము కూడా మనసారా కోరుకుంటున్నాము.

బాల్యంలో చందమామను మీకు పరిచయం చేసిన మీ అమ్మమ్మ గారికి చందమామ పరామర్శలు తెలియజేయండి.

ఏప్రిల్ చివరలో పంపిన మీ చందమామ జ్ఞాపకాలను అనివార్య కారణాల వల్ల ఇంత ఆలస్యంగా ప్రచురిస్తున్నందుకు క్షమాపణలు.

రవిచంద్రగారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠంకోసం కింది లింకును తెరవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2450
NB:
మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా? అయితే..
మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి. 
మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.

చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

“చందమామ జ్ఞాపకాలు” నేపథ్యం

June 6th, 2010

చందమామ ధారావాహికల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన మే నెల ప్రత్యేక సంచిక గురించి పాఠకులు, అభిమానులు పంపిన ఉత్తరాలు, వ్యాఖ్యలను రచన శాయి గారు చందమామ అభిమానులకు ఈమెయిల్‌లో పంపారు. ఆ మెయిల్‌కు స్పందిద్దామని అనుకుంటూండగానే కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు తన చందమామ జ్ఞాపకాలు బృహత్ వ్యాసం నేపధ్యం గురించి అరుదైన క్లుప్త సమాచారాన్ని పంపారు.

2006లో ఈమాట.కామ్ వెబ్‌సైట్‌లో ఆయన రాసిన “చందమామ జ్ఞాపకాలు” వ్యాసం తొలిసారిగా ఆన్‌లైన్‌లో చందమామ చరిత్ర రచనకు నాంది పలికింది.

“చందమామ జ్ఞాపకాలు”

http://www.eemaata.com/issue41/chandamama.html

తర్వాత ఈనాడు, వికీపీడియా కూడా చందమామ పత్రికపై బృహత్ వ్యాసాలు ప్రచురించాయి.

చందమామ

http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE

గత రెండేళ్లుగా ఆన్‌లైన్‌లో బ్లాగర్లు చందమామ చరిత్రను లిఖితం చేస్తున్న తీరుపై ఇక్కడ మళ్లీ చెప్పవలసిన పనిలేదు. ఇప్పుడు చందమామ గురించి పత్రికల్లోనూ, ఆన్‌లైన్ లోనూ రాయడం అంటే ఫ్యాషన్ కాదు ప్యాసన్ -passion-

http://www.chandamama.com/lang/index.php?lng=TEL

http://manateluguchandamama.blogspot.com

చందమామ జ్ఞాపకాలపై ఇంతటి చరిత్రకు నాంది పలికిన రోహిణీ ప్రసాద్ గారి కథనం నేపథ్యం గురించి ఆయన మాటల్లోనే ఇక్కడ విందామా!

“2005-6లో నేను టెక్సస్‌లో ఉన్నప్పుడు Chicago మిత్రుడు కందాళం రమానాథ్‌తో ఈమెయిళ్ళ ద్వారా పిచ్చాపాటీ కొనసాగించేవాణ్ణి. ఆ విధంగా నేను చందమామలో మా నాన్నగారు పనిచేసిన సంగతి ప్రస్తావించినప్పుడు, రచయితగా ఆయన్ని అభిమానించే రమానాథ్ ఆ సంగతి విని ఆశ్చర్యం ప్రకటించడంతో నేను ‘చందమామ జ్ఞాపకాలు’ అనే పెద్ద వ్యాసం రాసి ఈమాటకు పంపాను. అది చదివాక ఈనాడు పత్రిక కూడా చందమామ గురించిన పెద్ద feature article ప్రచురించింది.

నా వ్యాసంలో సహజంగా దా.సు.గారి ప్రస్తావన రావడంతో ఆయన గురించి కూడా నలుగురికీ తెలిసింది. ఇప్పుడు ఆయన విశేషాలతో ‘రచన’ ప్రత్యేక సంచిక అద్భుతంగా వెలువడడం ఎంతో అభినందనీయం. ఇందుకు శాయిగారితో కలిసి శ్రమించిన వారందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలి.”

Rohiniprasad

RTS Perm Link

బాల్య సంస్కారం నేర్పిన చందమామ

May 14th, 2010

చందమామకు రెగ్యులర్‌గా కథలు పంపుతున్న మాన్యులు శ్రీ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. రాజమండ్రిలో పుట్టి సమీపంలో ఉన్న పేరవరం గ్రామంలో పెరిగిన ఈయన  చిన్నప్పుడు చందమామ కోసం ఎదురుచూపులు చూసిన మరపురాని జ్ఞాపకాలు ఆయన పంపిన చందమామ ముచ్చట్లలో తడుముతూ, యాభై ఏళ్ల క్రితం రాజమండ్రి రావాలంటే లాంచీలలో, నావలలో ఒంటెద్దు బళ్లలో ప్రయాణం చేయవలసిన అపురూప జ్ఞాపకాలను చందమామ పాఠకులతో పంచుకున్నారు.

బాల్యంలో తాను చదివిన చందమామ కథలలోని వర్ణనను తమ చుట్టూ పరిసరాలకు అన్వయించుకుంటూ పరవశం చెందిన మార్కండేయులుగారు, “పెరట్లో దబ్బ చెట్టు కాయకపోతే చందమామ కథ చదివిన మేము లంకె బిందెలున్నాయని చెట్టు చుట్టూ తవ్వేశాము. లంకెబిందెలు దొరకలేదు గాని నేల గుల్లబారిందో ఏమో దబ్బచెట్టు కొద్ది రోజుల్లోనే పూత పూసి విరగకాసింది.” అంటూ చందమామ బాల్యాన్ని హృద్యంగా పంచుకున్నారు.

పైగా సంచార గ్రంధాలయాల లెక్కన ఊర్లుకు సైకిళ్లలో, తోపుడు బళ్లలో చందమామ, బాలమిత్ర తదితర కథల పుస్తకాలు,వారపత్రికలు తీసుకువచ్చి తెలుగువారి పుస్తక పఠనాభిరుచికి అపురూప తోడ్పాటు అందించిన రెడ్డి వంటి సాధారణ వ్యక్తుల చరిత్రను ఆయన ఈ చందమామ ముచ్చట్లలో తడిమారు.

ఎదుటివారిని ఏకవచనంతో సంబోధించిన ఘటనలో చందమామ చిన్నప్పుడు నేర్పిన సంస్కారాన్ని ఆయన తన ముచ్చటలో మనతో పంచుకున్నారు.

చందమామ ముచ్చట్లను ఆయన ఈ మెయిల్ ద్వారా ఏప్రిల్ చివరిలోనే పంపినప్పటికీ, గత రెండు వారాలుగా అనివార్య కారణాల వల్ల చందమామ వెబ్‌సైట్‌లో, బ్లాగులో పోస్టే చేయలేక పోయాము. ఆలస్యానికి క్షంతవ్యులము. అలాగే చందమామ అభిమాని ఇనగంటి రవిచంద్ర గారు కూడా చందమామ జ్ఞాపకాలను ఏప్రిల్ చివరలో పంపారు. వచ్చే శుక్రవారం వారి చందమామ జ్ఞాపకాలను పోస్ట్ చేయనున్నాము.

శ్రీ మార్కండేయులు గారు పంపిన చందమామ ముచ్చట్ల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్‌సైట్‌ లింకులో చూడగలరు.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2448

RTS Perm Link

రచన -దాసరి- ప్రత్యేక సంచిక : అపూర్వ స్పందనలు

May 9th, 2010

పిల్లలను, పెద్దలను ‘చందమామ’ ద్వారా కొన్ని దశాబ్దాలపాటు అలరించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అద్భుత అజ్ఞాత రచయిత గురించి తెలుగు పాఠకలోకానికి ‘చాటి’ చెప్పాలన్న తపనతో సర్వశక్తులూ ఒడ్డి నభూతో అన్న చందంగా రచన శాయి గారు తీసుకువచ్చిన మే నెల రచన ప్రత్యేక సంచిక పట్ల ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..

ప్రస్తుతానికి శాయి గారు ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ శేషు గారి అద్భుతమైన స్పందనను చందమామ బ్లాగుకోసం పంపారు.. ‘ఒక పత్రిక గురించి మరొక పత్రికలో ఊసే లేని (ఈసు తప్ప) తెలుగు పత్రికా లోకంలో ఇలాంటి ప్రయోగం జరగటం ఇదే మొదలనుకుంటాను.’ అంటున్న శేషుగారు మే నెల రచన ప్రత్యేక సంచిక తీసుకురావడంలో శాయి గారు పడ్డ కష్టం గురించి విచారం వ్యక్తం చేశారు.

రచన వంటి పత్రికలు వ్యాపార ఒడిదుడుకులను తట్టుకుని నిలబడాలని మనస్పూర్తిగా కాంక్షిస్తూ రచనకు త్వరలో చందా కడతానని కూడా చెప్పారు. సదాశయంతో, ఉత్తమాభిరుచితో లాభాపేక్ష అనే పదానికి అర్ధం ఏమిటో తెలియని తత్వంతో పత్రిక నడిపిస్తున్న వారికి పత్రిక విడివిడిగా కొనడం కాకుండా చందా రూపంలో తీసుకుంటే ఎంత ఊపిరి పోస్తుందో, మనకు తెలియని విషయం కాదు. అందుకే శేషుగారితో నూటికి నూరుపాళ్లూ ఏకీభవిస్తూ నేను కూడా ఈ నెల నుంచి రచనకు చందా పంపిస్తున్నాను.

నిజం చెప్పాలంటే మూడు నెలల క్రితం వరకు రచన శాయి గారి గురించి నాకు పెద్దగా పరిచయం లేదు. చందమామ వీరాభిమానుల్లో. అగ్రగణ్యుడిగా 8 నెలల క్రితం త్రివిక్రం గారు ఆయన గురించి చెప్పడం వరకే నాకు గుర్తుంది. ఎందుకో శాయిగారితో పరిచయం చాలా ఆలస్యంగా జరిగింది. కానీ  గత మూడు నెలలుగా దాసరి గారిపై ప్రత్యేక సంచికకోసం మన రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాల్లోని, ప్రపంచంలోని తెలుగు వాళ్లను, దాసరి గారి అభిమానులను సంప్రదించడంలో, దాసరి జ్ఞాపకాలు, అరుదైన అంశాలను పంపమని తాను ఎంత తీవ్రస్థాయిలో శ్రమించారో చందమామ -దాసరి- అభిమానులకు తెలుసు.

మొదట అనుకున్న పథకాన్ని మించి దాసరిగారిపై విశేష స్పందనలు రచన కార్యాలయానికి వెల్లువెత్తడంతో ఏప్రిల్ సంచిక ముద్రణను సైతం ఆపివేసి ప్రత్యేక సంచికకు ప్రాధాన్యత ఇవ్వడంలో శాయిగారు రచన ఉనికినే సవాలుగా పెట్టారు. సాహిత్య అధ్యయనాన్ని సీరియస్‌గా తీసుకునే వారికోసం, రచన కంట్రిబ్యూటర్లకోసం ఉత్తమ పుస్తకాలను బహుమతిగా ఉచితంగా అందిస్తున్న సత్సంప్రదాయం కూడా రచన శాయిగారికే సొంతమనుకుంటాను.

కాళీపట్నం రామారావు గారి సాహిత్య సంచికలను 150 కాపీలకు పైగా తాను స్వయంగా కొనుగోలు చేసి రచన కంట్రిబ్యూటర్లకు ఉచితంగా అందించడం, తన అబిరుచికి తగిన పుస్తకాలను ముందే కొనుగోలు చేసి తదనంతర కాలంలో వాటిని అవసరమైన వారికి అందించడం, ఏ పుస్తకం కావాలన్నా దానికి సోర్స్ చెప్పి సహకరించడం.

ఇవన్నీ ఒక ఎత్తైతే తెలుగు బాల సాహిత్యం మర్చిపోలేని గొప్ప పనులు మూడు శాయిగారి స్వంతమయ్యాయి. అవి చందమామ పత్రికకు ముందు ప్రారంబించబడి 1945 నుంచి 59 వరకు బాలసాహిత్యానికి ఊపిరులు పోసిన ‘బాల’ పత్రికలోని ముఖ్యమైన కథలు, తదితర అంశాలను 1300 పైజీలకు పైగా క్రోడీకరించి నాలుగు పుస్తకాలుగా -కావాలంటే హార్డ్ బౌండ్‌గా కూడా దొరుకుతోంది- ప్రచురించడం, తెలుగు బొమ్మల రేడు బాపూ బొమ్మల సర్వస్వాన్ని పుస్తకంగా అచ్చేసి బాపూగారికి శాశ్వత గౌరవం కల్పించడం, ఇప్పుడు ప్రపంచ చందమామ అభిమానులంతా గర్వించదగిన దాసరి గారి జీవిత, సాహిత్య విశేషాల మే నెల రచన ప్రత్యేక సంచికను నభూతో న భవిష్యతి లాగా అతి తక్కువ ధరకు అందించడం…

ఒక్క మాటలలో చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో ఏ పత్రికా ప్రచురణ సంస్థకూ సాధ్యంకాని, కాలేని మూడు గొప్పపనులు రచన పత్రిక మాత్రమే చేయగలిగింది. ఈ మూడు పుస్తకాల ప్రచురణ విషయంలో పైసా ఆదాయం ఆయనకు రాకపోవడం గమనార్హం. మే నెల రచన ప్రత్యేక సంచిక ఉత్పత్తి ఖర్చులే ఒక్కో పత్రికకు రూ.46లు అయ్యాయనే చేదునిజం ఇవ్వాళే ఆయన బయటపెట్టారు. ముద్రణా సంస్థ ఎంత తక్కువ వ్యయంతో ముద్రించినా విడి పత్రిక ఉత్పత్తి ధర రూ.46లకు చేరుకుందట. మార్కెట్‌లో మే నెల ప్రత్యేక సంచిక వెల రూ.50లు. ఈ వార్త వినగానే మనసంతా చేదయిపోయింది. ఈ విపత్కర పరిణామాలను రచన తట్టుకుని నిలబడుతుందా..

రచన బతకడం, మనగలగడం, మిగలడం….  కావాలిప్పుడు. ఇందుకు రచనకు చందాలు, ప్రకటనలు కావాలి. అవి మాత్రమే రచనను పది కాలాలపాటు బతికిస్తాయి. రచన పాఠకులు, చందమామ అభిమానులు, ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించగల సంస్థలు తమ వంతు సాయం ఈ విషయంలో అందించగలిగితే ఎంత బావుణ్ణు. రచన బతకాలి. శాయి గారు రచన పత్రికను పది కాలాల పాటు నడపగలగాలి. ఇప్పుడు రచనకు ఆపన్న హస్తాలు నిజంగా కావాలి. చందాల రూపంలో… ప్రకటనల రూపంలో.. ఇంకా వీలైతే పెద్ద పెద్ద సంస్థల, వ్యక్తుల ఆర్థిక ఔదార్యం రూపంలో….

యునెస్కో వారు ప్రపంచంలోని కొన్ని పురాతన కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటిస్తుంటారు. పత్రికలకు సంబంధించి అలాంటి విధానమేదైనా ఉంటే, ‘చందమామకు’ ఆ గౌరవం దక్కాలి అంటూ రచన ప్రత్యేక సంచికపై  మేడేపల్లి శేషు గారు పంపిన హృదయ స్పందనను ఇక్కడ చదవండి.

చందమామ ప్రపంచ వారసత్వ సంపద కావాలి!
రచన శాయి గారికి,
నమస్కారం (ఆంధ్రాలో ‘సాయి’ కాని ‘శాయి’ మీరొక్కరే అనుకుంటాను).
 
‘రచన’పత్రికకు నేను చాలాకాలంగా దూరమైనా, మళ్ళీ ‘చందమామ’ పత్రిక్కి సంబంధించిన  ఒక  గొప్ప రచయితను (ఆయన దాసరి సుబ్రహ్మణ్యం గారని ఇప్పుడే తెలిసింది) గురించి మీరేదో ప్రత్యేక సంచిక వేశారని తెలిసి (రామవరపు  గణేశ్వర రావు గారు ఫార్వర్డ్ చేసిన మెయిల్ ద్వారా) మళ్ళీ మీ దగ్గరకొచ్చాను.
 
ఈ ‘రచన’ ప్రత్యేక సంచిక గురించి మీరు పడ్డ కష్టం బాగా తెలిసొచ్చింది. ఒక పత్రిక గురించి మరొక పత్రికలో ఊసే లేని (ఈసు తప్ప) తెలుగు పత్రికా లోకంలో ఇలాంటి ప్రయోగం జరగటం ఇదే మొదలనుకుంటాను. పిల్లలను, పెద్దలను ‘చందమామ’ ద్వారా కొన్ని దశాబ్దాలపాటు అలరించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అద్భుత అజ్ఞాత రచయిత గురించి తెలుగు పాఠకలోకానికి ‘చాటి’ చెప్పాలన్న మీ తపనకు జోహార్లు. తీగ లాగితే, డొంకంతా కదిలినట్లు (అలా కదిలించటం అంత తేలికపని కాదని తెలుసు), ‘చందమామ’ తో సంపర్కమున్న ఎంతోమందిని కదిలించి అచిరకాలంలో వారి దగ్గరనుంచి ఎన్నో అనుభవాలను పోగుచేసి, వాటిని ఏర్చి, కూర్చి ఒక ప్రత్యేక సంచిక రూపంలో మా ముందుంచిన మీ కృషి అభినందనీయం. యునెస్కో వారు ప్రపంచంలోని కొన్ని పురాతన కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటిస్తుంటారు. పత్రికలకు సంబంధించి అలాంటి విధానమేదైనా ఉంటే, ‘చందమామకు’ ఆ గౌరవం దక్కాలి. ఇన్ని భాషల్లో ప్రచురింపబడే ‘చందమామ’ మన తెలుగువాళ్ళ సృష్టి అనుకున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది.
 
నేను ‘చందమామ’ లోని అన్ని సీరియళ్ళూ చదవకపోయినా, దాసరి వారి ‘భల్లూక మాంత్రికుడు’ మాత్రం చిన్నప్పుడు చదివాను. అది మొత్తం బైండు చేసిన కాపీ కూడా మా ఇంట్లో ఉండేది. వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఉండే మేము (నేను, మా చెల్లెలు) సెలవుల్లో ఖమ్మంలోని మా మేనత్తగారింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళమ్మాయి దగ్గర ‘చందమామ’ చూసేవాళ్ళం. రంగులతో తళతళలాడే కొత్త కాపీని ముట్టుకుంటేనే జన్మ ధన్యమైనట్టు ఉండేది. జానపద సీరియల్ కింద రచయిత పేరు స్థానంలో ‘చందమామ’ అని ఉండేది కనుక, అసలు రచయిత పేరు తెలిసేది కాదు. కొ.కు గారివంటి గొప్ప రచయిత కూడా ‘చందమామ’లో పనిచేశారని చాలాకాలానికి తెలిసి అలాంటి పత్రికను చదవగలిగినందుకు గర్వంగా అనిపించింది.  నేను డిల్లీలో ఉద్యోగంలో చేరిన తర్వాత కన్నడ, తమిళ, మళయాళ చందమామలు కొని ఆ భాషలు కొంతవరకూ నేర్చుకున్నాను.
 
ఈ ‘రచన’ ప్రత్యేక సంచిక చదవకపోయి ఉంటే, దాసరి సుబ్రహ్మణ్యం గారివంటి గొప్ప రచయితగురించి నాకు తెలిసి ఉండేది కాదు. ఆయన గురించి ప్రముఖులందరూ రాసిన వ్యాసాలు ఎంతో అపురూపంగా ఉన్నాయి. ఆ కథలను ఎంతగానో మెచ్చుకుని ఆసక్తిగా చదివిన మేము  ఆ రచయిత ఎవరో ఇంతకాలంగా తెలుసుకునేందుకు ప్రయత్నించనందుకు ఎంతో సిగ్గుగా కూడా ఉంది.   ఇంతకాలంగా ‘రచన’కు దూరంగా ఉండటంవల్ల ఇంకా ఇటువంటి ఎంతెంత విలువైన సమాచారం కోల్పోయానో అని బాధపడుతున్నాను. చిన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన సీరియళ్ళు ‘చందమామ’లో చదివినందువల్లనేమో, కొందరు రాసినట్టు, హారీ పాటర్ నవలలుగాని, ‘అవతార్’ వంటి సినిమాలుగాని పెద్ద అద్భుతాలని అనిపించలేదు. వీలైనంతవరకూ పాత చందమామలన్నీ కొనేసి ఇంట్లో ఒక ర్యాక్ లో పెట్టేస్తే, పిల్లలు టి.వి. వైపు కన్నెత్తి కూడా చూడరనుకుంటాను.
 
పిల్లలకు మెదడు ఒక్కటే కాదు, మనసూ ఉంటుందని గ్రహించకుండా వాళ్ళను ‘చదువుల యంత్రాలుగా’ మారుస్తున్న మన ప్రస్తుత విద్యవిధానమంటే నాకు మొదటినుంచీ అసహ్యమే. వాళ్ళను మరింత అసహ్యకరమైన వినోద (?) కార్యక్రమాలకు బలికావించే టి.వి. చానెల్సు అన్నా, ఇప్పటి సినిమాలన్నా నాకు మరింత అయిష్టం. నాకే కనుక విద్యావిధానాన్ని నిర్ణయించే అధికారమిస్తే, నెలకో రోజు ‘చందమామ’ చదివే పీరియడ్ పెడతాను. మార్కులతో పనిలేకుండా, వాళ్లకు కొన్ని పాఠ్య అంశాలు ప్రవేశాపెడతాను. మంచి పుస్తకాలు చదివిస్తాను. మంచి చలన చిత్రాలు చూపిస్తాను. పరీక్షలకు బదులు వాటిగురించి చర్చ పెడతాను. జ్ఞానంతోపాటు పిల్లల్లో మనసూ, బుద్ధీ కూడా వికసించాలి. అప్పుడే వాళ్లకు పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. ఏ చదువు చదివితే ఎంత సంపాదించవచ్చు అనే పద్ధతిలోనే నడుస్తోంది మన ప్రస్తుత విద్యావిధానం. ఇది ఎటు వెళ్లి ఎటు తేలుతుందో అర్థం కాకుండా ఉంది. భాష, సాహిత్యం, కళలు అనేవి ఉపయోగంలేని వ్యాపకాలు అనే ధోరణి బాగా ప్రబలుతోంది. ఇది ముందు తరాలకు చాలా ప్రమాదం.

ఎన్నో వ్యాపార ఒడిదుడుకులను తట్టుకుని ‘రచన’ వంటి ఉత్తమాభిరుచులుగల పత్రికను ఇంతకాలంగా నిర్వహిస్తున్నందుకు మీకెలా అభినందనలు తెలియజేయాలో తెలియటంలేదు (‘ఆహ్వానం’, ‘హాసం’ వంటి పత్రికలూ ఈ పోటీ ప్రపంచంలో అంతరించిపోయాయి).  త్వరలో మళ్ళీ ‘రచన’కు చందా కడతాను. మరెందరో దాసరి సుబ్రహ్మణ్యం గారి వంటి అజ్ఞాత రచయితలు తెలుగు సాహిత్య లోకంలో ఉండవచ్చు. అటువంటి వారిని కూడా వెలుగులోకి తెస్తారని ఆశిస్తాను.
- మేడేపల్లి శేషు, కొత్త డిల్లీ

M. Seshu,
Office of Secretary,
Ministry of Labour & Employment,
109, Shram Shakti Bhavan,
Rafi Marg,
New Delhi – 110 001
Tel: 011-23738603
Mob: 9868912258

RTS Perm Link

చందమామ కథ : అల్లుడి శక్తి

May 3rd, 2010

దశాబ్దాలుగా చందమామలో తరచుగా ప్రచురించబడుతున్న చింతచెట్టు దయ్యం కథలు, రాక్షసుల కథలూ పాఠకులను విశేషంగా అలరించాయి. ఈ తరహా కథలు ఎంత ఆకట్టుకున్నాయంటే అప్పట్లో వచ్చిన దయ్యాలు, రాక్షసుల కథలను మళ్లీ ప్రచురించవలసిందిగా ఈనాటికీ విభిన్న తరాల పాఠకులు కోరుకుంటున్నారు.

కానీ, చందమామ సరదా కోసమో, పాఠకులను అలరించడంకోసమో దయ్యాలు, రాక్షసుల కథలను ప్రచురించలేదు. వర్తమాన సమాజంలో పెనుభూతంగా మారిన సమస్యలకు ముడిపెట్టి దయ్యాలు, రాక్షసుల కథలను శక్తివంతంగా నడపడంలో కూడా చందమామ అద్వితీయ విజయం సాధించింది. పాతికేళ్ల క్రితం చందమామలో ప్రచురించిన ‘అల్లుడి శక్తి’ అనే కథ ఇందుకు గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.

1980ల పొడవునా దేశవ్యాప్తంగా మహిళల జీవితాలను, కుటుంబ వ్యవస్థను నరకప్రాయం చేసిన వరకట్నం సమస్యపై చందమామ తనవంతుగా ఈ గొప్ప కథను పాఠకులకు అందించింది. నీతి బోధించడమో, వరకట్నం సమస్యను చెండాడటమో చేయకుండా, మానవులను గజగజలాడించే బ్రహ్మరాక్షసులు కూడా ఈ కాలపు అల్లుళ్ల ముందు దిగదుడుపే అనీ, ఇంటల్లుళ్లు కోపంగా చూస్తే ఇంటిల్లిపాదీ నీరుగారిపోవలసిందేనని సూచన ప్రాయంగా తెలిపిన గొప్ప కథ ఇది.

మన సమాజంలో వరకట్నం సమస్య ఎంత భయానకంగా తయారయిందో అతి సున్నితంగా చెప్పిన కథ ‘అల్లుడి శక్తి’. దీర్ఘకాలంగా చెట్టుమీదనే ఉండిపోయిన రాక్షసుడు ఈ మూడువందల ఏళ్లలో మానవుల శక్తి ఇంతగా పెరిగిపోయిందా అని ఆశ్చర్య పడిపోయిన ఇతివృత్తంతో ఈ కథ తయారయింది. క్లుప్తంగా ఈ కథ పరిచయం లోకి వెళదాం.

అల్లుడి శక్తి కథ పూర్తి పరిచయం కోసం కింది లింకులో చూడండి.

చందమామ కథ :  అల్లుడి శక్తి

http://prajakala.org/mag/2010/05/alludi_shakti

గత నెలలో ప్రజకళ.ఆర్గ్ లో వచ్చిన చందమామ పరిచయం కోసం కింది లింకులో చూడండి.

ఆబాల గోపాల కథల పత్రిక “చందమామ”

http://prajakala.org/mag/2010/04/chandamama

ప్రతినెలా ఒక్కో చందమామ కథ పరిచయం కోసం అవకాశమిస్తున్న ప్రజాకళ.ఆర్గ్ వారికి కృతజ్ఞతలు.

RTS Perm Link

దాసరి సుబ్రహ్మణంగారు : ‘రచన’ ప్రత్యేక సంచిక

April 29th, 2010

“తనకే సొంతమైన ఏకాంతంలోకి నిశ్శబ్దంగా , అనాయాసంగా అంతర్థానమైన రచయిత…
 జానపద కథల మాంత్రికుడు..
 దాసరి సుబ్రహ్మణ్యం గారు!

దశాబ్దాలపాటు ఆయన చందమామకు వెన్నెముకగా నిలిచారు. సంపాదక వర్గ సభ్యునిగా ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పారు.

1954లో  ‘తో్కచుక్క’తో మొదలైన ఆయన   ధారావాహికల సమ్మోహన ఇంద్రజాలం  1980లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ  విజయవంతంగా  కొనసాగింది.

చందమామ అనన్య ప్రచారానికి కారణమయింది. ఆ రచనల పున: ప్రచురణలు చదువరులకు చేరువై, చందమామ విలువను పెంచుతూ వచ్చాయి. 

ఆయన  అక్షరాలను మంత్రిస్తే..అవి  అవధుల్లేని   కథాకల్పనలయ్యాయి. వీర, బీభత్స, రౌద్ర, అద్భుత రసావిష్కరణలతో  అపురూప జానపద కథలై నిలిచాయి. ఆ శైలీ విన్యాసం జవనాశ్వాలై  పరుగులు పెడితే అసంఖ్యాక  పాఠకులు ఉత్కంఠతో, ఆసక్తితో, ఇష్టంతో  ఏళ్ళతరబడి చదివారు. ఆ అక్షర ‘చిత్రా’లను గుండెల్లో దాచుకున్నారు.

ప్రతి సంచిక కోసం విరహపడ్డారు.ఎదురుచూశారు.దశాబ్దాలు గడిచినా వాటిని  తలపోసుకుంటూనే ఉన్నారు.

 ఊహల  విహంగాల రెక్కలపై తరతరాల పఠితలను..పిల్లలనూ, పెద్దలనూ   వింత  వింత లోకాల్లో   విహరింపజేసి మంత్రముగ్ధులను చేశారు.

కానీ…ఆయన  మాత్రం  పేరు ప్రఖ్యాతులేమీ పట్టనితనంతో  ఆ   పాఠకులకు కూడా తనెవరో  తెలియని అజ్ఞాత రచయితగానే  ఉండిపోయారు!”

కథల మాంత్రికుణ్ణి స్మరించుకున్నాం!
సి.హెచ్. వేణు
http://venuvu.blogspot.com/2010/02/blog-post.html

పత్రికకు తప్ప రచయితలు, సిబ్బందికి ప్రాధాన్యత అవసరం లేదనే చందమామ సంప్రదాయం కారణంగా చందమామ ధారావాహికల రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు దాదాపు 60 ఏళ్లుగా అజ్ఞాత రచయితగానే ఉండిపోయారు. చందమామ వైభవోజ్వల చరిత్రకు అధ్బుతమైన ధారావాహికలతో పట్టం గట్టిన దాసరి గారి జీవిత, సాహిత్య జీవిత వివరాలు, చందమామకు ఆయన అందించిన గొప్ప తోడ్పాటు గురించి ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఓ మాన్యుడి నిర్విరామ కృషి, సంకల్ప బలం వల్ల బాల సాహిత్య చరిత్రలో ఓ అరుదైన పుస్తకం  ప్రత్యేక సంచిక రూపంలో మన ముందుకు వచ్చింది.

చందమామ అభిమానులు, పాఠకులందరినీ గత రెండు నెలలుగా ఊరిస్తూ, నిరీక్షణకు గురిచేసిన రచన ప్రత్యేక సంచిక -మే నెల- ఇవ్వాళే మార్కెట్‌లోకి వచ్చింది. శాయిగారు ఈ విషయం నిన్న సాయంత్రమే నిర్దారించారు. 

ప్రతి చందమామ పాఠకుడూ, అభిమానీ ఈ అపరూప ప్రత్యేకసంచికను తప్పక తీసుకుంటారని, దాసరి సుబ్రహ్మణ్యం గారి అరుదైన జ్ఞాపకాలను, ఆరు దశాబ్దాల పాటు ఆయన సాగించిన అలుపులేని సాహిత్య కృషిని తమ హృదయాలకు హత్తుకుంటారని ఆశిస్తున్నాము.
ఈ సందర్బంగా వారం రోజుల క్రితం శాయిగారికి రాసిన ఈమెయిల్ సారాంశాన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము.

డియర్ శ్రీ శాయి గారూ,
మీరు పంపిన, దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన ప్రత్యేక సంచిక -మే, 2010- వివరాల పీడీఎఫ్ ఫైల్ అందింది. నిన్న సాయంత్రం నుంచి సిస్టమ్ నాకు అందుబాటులో లేదు. దీంతో వెంటనే మీకు మెయిల్ పంపలేకపోయాను. ఇది ప్రశంస అనుకోండి. కృతజ్ఞత అనుకోండి. మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఉంది.

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు జనవరి చివరలో పోయాక ఆయనపై రచన ప్రత్యేక సంచిక తీసుకురావాలనే ఆలోచనే మీకు రాకుండా ఉండి ఉంటే.. బాలసాహిత్యానికి సంబంధించినంతవరకూ ఓ గొప్ప తెలుగు పుస్తకం చరిత్రలో రికార్డుకు కూడా లేకుండా పోయేది. అందుకు చందమామ అభిమానులందరూ మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీ ప్రకటన అందించిన ప్రేరణతో దాసరి గారి అభిమానులు ఓరకంగా వీరావేశంతోనే పనిచేసి, పోటీలు పడి మరీ ఆయన రచనలపై, జీవితంపై తమకు తెలిసిన సమస్త సమాచారాన్ని ప్రోది చేసి పంపారు.

చందమామ వైభవోజ్వల స్వర్ణయుగానికి కారణభూతులైన మహనీయులలో దాసరి గారు ఒకరు. ఆయన 1954 నుంచి 1980 వరకు విరామం లేకుండా చందమామ చరిత్రలోనే అజరామరమైన 12 ధారావాహికలను రాశారన్న విషయం కూడా దశాబ్దాల పాటు మరుగునపడింది. పత్రికకు తప్ప సిబ్బందికి, ఇన్ హౌస్ రచయితలకు ప్రాముఖ్యత కల్పించరాదన్న సంప్రదాయం చందమామది. ఈ పాలసీ చందమామకు మేలు చేసినప్పటికీ చందమామ ధారావాహికల రచయిత ఎవరో ప్రపంచానికి తెలియకుండా చేసింది. కుటుంబరావుగారే చందమామలో పేరులేని ఎడిటర్‌గా దశాబ్దాలపాటు పనిచేశారనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు, ఇన్ని దశాబ్దాలకు… చందమామలో 54 ఏళ్లపాటు నిరవధికంగా పనిచేసిన ఓ గొప్ప మనిషి జీవిత, కథాసాహిత్య వివరాలు రచన పత్రిక ద్వారా, కేవలం మీ ద్వారా ప్రపంచం ముందుకు వస్తున్నాయి. సమస్త చందమామ అభిమానుల తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలుపుతున్నాను.

ప్రత్యేక సంచిక నిడివి పెరగడం, ఊహించిన దానికంటే సమాచారం ఎక్కువగా పోగుపడటం వంటి కారణాలతో రచన ఏప్రిల్ సంచిక ముద్రణను పక్కనపెట్టి కూడా మీరు దాసరి గారిపై ప్రత్యేక సంచికకోసం తీవ్ర కృషి చేశారు. ఒక నెల పత్రిక ముద్రణ నిలిచిపోయినా ఫర్వాలేదనే తెగింపే ఓ సాహసోపేత నిర్ణయం. 1998లో చందమామ తాత్కాలిక అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు తగిలిన దెబ్బనుంచి చందమామ ఇప్పటికీ కోలుకోలేదు.

అందుకే మీ నిర్ణయం సాహసోపేతమైనది. దశాబ్దాలుగా తెలుగు వారి సాంస్కృతిక రాయబారిగా పనిచేసిన, చేస్తున్నచందమామ పత్రికపై అబిమానం, మమకారం హృదయంలో నిలుపుకున్నారు కాబట్టే మీరు ఇంత తెగింపుకు సిద్ధపడ్డారు. చంపి -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రియులు- లలో ప్రధమస్థానం మీదే అని గతంలో త్రివిక్రమ్ గారు ఓ సందర్బంలో అన్నారు. ఈ రకంగా కూడా అది నిజమైంది.

చందమామ చరిత్రకు తన ధారావాహికల ద్వారా మెరుగులు దిద్దిన గొప్ప మనిషికి ‘రచన’ పత్రిక ప్రత్యేక సంచిక నీరాజనం పలుకుతోంది. బహుశా దాసరి గారికి ఇంతకు మించిన నివాళి మరొకటి ఉంటుందని నేననుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన మొత్తం ఘనత మీదే అని మనస్పూర్తిగా చెబుతున్నా.

ఈ హారీ పోటర్లూ, అవతార్‌ల గురించి ప్రపంచానికి తెలీని రోజుల్లో చందమామ ధారావాహికల ద్వారా కోట్లాది మంది భారతీయ పిల్లలను, పెద్దలను జానపద మంత్ర నగరి సరిహద్దుల్లో ఓలలాడించిన గొప్ప కథకులు దాసరిగారు. దశాబ్దాలుగా మరుగున పడిన ఈయన మేటి కృషిని, తెరవెనుక నేపధ్యాన్ని రచన ప్రత్యేక సంచిక -మే,2010- ద్వారా ప్రపంచం తెలుసుకోనుంది.
 
చందమామ రచయిత రాసిన అన్ని ధారావాహికల పరిచయాలను, ఇతర వివరాలను ఒకే చోట చదివే అవకాశాన్ని చందమామ అభిమానులకు, పాఠకులకు కల్పించడం రచన పత్రిక వల్లే సాధ్యపడింది. ‘మాకూ ఓ ప్రపంచ స్థాయి కథా రచయిత ఉన్నాడు’ అని జబ్బలు చరిచి మరీ తెలుగువాళ్లు చెప్పుకునేలా సాగించిన ఓ అద్బుత కృషికి గాను మీరు గత రెండు నెలలుగా అలుపెరుగకుండా శ్రమించారు.
 
మీ సంకల్పబలం విజయవంతం కావాలని, ప్రతి చందమామ అభిమాని, పాఠకులు, జానపద కథల ప్రేమికులు ఈ ప్రత్యేక సంచికను అపురూపంగా దాచుకుంటారని ఆశిస్తున్నాను.
ప్రత్యేక సంచిక పది కాపీలను నేను రిజర్వ్ చేసుకున్నాను. మీకు ఎంఓ కూడా పంపాను. మే 2న ప్రత్యేక సంచిక విడుదలకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము.

ప్రపంచంలోని చందమామ ప్రేమికులందరి అభిమానం మీపై కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. 
రాజశేఖర రాజు
చందమామ

గమనిక: దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన పత్రిక మే నెల ప్రత్యేక సంచిక కావలసినవారు కింది చిరునామాకు ఎంఓ పంపగలరు.

రచన, 1-9-286/2/పి, విద్యానగర్, హైదరాబాద్-500 044.

ఈ ప్రత్యేక సంచిక విడిప్రతి వెల రూ. 50 మాత్రమే.

సంప్రదించవలసిన ఈ మెయిల్ ఐడీ

rachanapatrika@gmail.com

పూర్తి చిరునామా

Y V S R S Talpa Sai
Editor – RACHANA Telugu Monthly
1-9-286/2/P Vidyanagar
Hyderabad – 500 044
e mail : rachanapatrika@gmail.com
Ph : 040 – 2707 1500
Mobile : + 99485 77517
visit : www.rachana.net

RTS Perm Link

బాలసాహిత్య సిరి చందమామ

April 26th, 2010

“తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యానికి పెద్ద పీట వేసిన వారిలో చందమామ కుటుంబం ఒకటి. బాలసాహిత్యాన్ని బాలలే కాకుండా ఆబాల గోపాలం చదువుకొని ఆనందించే స్థాయికి తీసుకువచ్చిన ఘనత కూడా చందమామ కుటుంబానిదే అని చెప్పడం చర్విత చరిణమే! చందమామలో పనిచేసిన సాహిత్య కారులు బాలసాహిత్యానికి తమ ఊపిరులు ఊదారు. వారిలో సంచాలకులు చక్రపాణి నాగిరెడ్డి గార్ల వ్యవస్థాపక నైపుణ్యానికి తమ కలం బలంతో సాహిత్యాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోయిన వారిలో కొడవటిగంటి కుటుంబరావు, దాసరి సుబ్రహ్మణ్యం ఆచంద్రతారార్కం తమ పేర్లు సాహిత్యాకాశంలో వెలిగింప చేశారు. చందమామకు అందిన కథలను చక్రపాణి గారి ఒరవడికి అనుకూలంగా తీర్చిదిద్దిన ఘనత వర్ణనాతీతం. పాఠకులకు కథ అందిన తీరు అమోఘంగా ఉంటే ఆ కథనందించిన వారికి తమ కథ అద్దుకున్న సొబగులు అంతకంటే అమోఘంగా కనిపించేవి.”

అంటూ చందమామ గురించి ఆప్తవ్యాక్యాలు పంపిన శ్రీ ఎమ్‌వీవీ సత్యనారాయణ గారు గత యాభైఏళ్లుగా మొదట అభిమాన పాఠకుడిగా, తర్వాత కథా రచయితగా చందమామతో సజీవ సంబంధాల్లో ఉంటూ వస్తున్నారు. తాను ఆరాధించే కుటుంబరావు గారు తన కథ ఆమోదించబడిన వార్త తెలిపితే సంతోషం. కుటుంబరావు గారి చేతుల్లో తమ కథలు పడ్డాయనే టెన్షన్, కొకు గారి సరసనే యువ మాసపత్రికలో తన కథ కూడా ప్రచురించబడితే అంబరమంత ఆనందం.

తదనంతర కాలంలో దాసరి సుబ్రహ్మణ్యం గారితో పరిచయం చివరి దాకా కొనసాగడం.. ఇవీ సత్యనారాయణ గారు తమ జీవితం పొడవునా పెంచుకుని వస్తున్న చందమామ జ్ఞాపకాలు. గత 30 ఏళ్లకు పైగా చందమామకు కథలు పంపుతూనే వస్తున్న ఈయన అలుపెరుగని చందమామ వీరాభిమాని. రెమ్యునరేషన్ మాట అటుంచితే చందమామ పత్రికలో తమ కథ పడితే చాలు.. అదే పరమానందంగా భావిస్తూ వచ్చిన అలనాటి కథకుల జాబితాలో సత్యనారాయణ గారిది కూడా తొలి వరుసే. గత 8 నెలల కాలంలో చందమామ జ్ఞాపకాలను కూడా పోస్ట్ ద్వారా పంపిన తొలి రచయిత ఈయనే మరి.

“చందమామ ఈనాడూ, ఆనాడూ, ఏనాడూ బాలలకు నిండు చందమామే! చందమమతో నా అనుబంధం యాభై ఏళ్ల నాటిదంటే అది నాకెందుకో పులకరింత కలిగించే అంశం. బాలసాహిత్యానికి చందమామ సృష్టించిన ఒరవడి ఆచంద్ర తారార్కం నిలిచే ఉంటుంది. తరాలు మారతాయి. చందమామ వెన్నెల మాత్రం అన్ని తరాలమీద ఒకే రకంగా ప్రసరిస్తుంది. తెలుగు వారి నట్టింట పత్రిక ఇప్పుడు రాష్ట్ర్రాల సరిహద్దులు చెరుపుకుంటూ ప్రయాణం సుస్థిరం చేసుకుంది. తెలుగు వారి కథలే ఇతర భాషల్లోకి తర్జుమా కావడం తెలుగు రచయితలకు గర్వకారణం. తెలుగు వెలుగుల జయకేతనం చందమామ. తరతరాల అందరి మామ చందమామ.”

ఇవి చందమామ పత్రికపై సత్యనారాయణ గారి ఆత్మీయ వాక్యాలు. రిటైరైన తర్వాత కూడా చందమామకు కథలు పంపించడానికి ఉత్సాహం చూపుతున్న సత్యనారాయణ గారికి చందమామ తరపున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చందమామకు రచనలు పంపగలరని, సూచనలు పంపించగలరని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

ఎంవీవీ సత్యనారాయణ గారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది లింకులో చూండండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2446

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

మీ చందమామ జ్ఞాపకాలను abhiprayam@chandamama.com కు పంపండి.  మీ లేదా మీ పిల్లల ఫోటోతో సహా పంపండి.
చందమామ.

RTS Perm Link

చందమామ బ్లాగు పునర్దర్సనం

April 21st, 2010

చందమామ బ్లాగుకు మళ్లీ జీవం పోసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 13 నుంచి ఉన్నట్లుండి మాయం కావటంతో గాభరా పడ్డది నిజం. మనతెలుగుచందమామలో నా వ్యాఖ్య చూసినప్పటినుంచి సాంకేతిక సహాయాన్ని స్వచ్చందంగా అందించి, సహానుభూతి చూపిన ప్రతిఒక్కరికీ చందమామ తరపున అభినందనలు. గత కొద్దిరోజులుగా నా -చందమామ- బ్లాగు కనిపించకుండా పోయిందన్న వార్తపై స్పందనలకు, పరామర్శలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

చందమామ బ్లాగు పోయిందనే వార్త వినగానే స్పందించిన వారు శివరాంగారు. మనతెలుగుచందమామ బ్లాగులో నా వ్యాఖ్య చదివి బ్లాగు.కాం వారిని సంప్రదించి, తెలుగు బ్లాగర్ల సముదాయంలో ఈ వార్త పెట్టి నా బ్లాగు సురక్షితంగా ఉందనే వార్తను బ్లాగు.కాం జాలయ్య గారి ద్వారా వినిపించిన వారు ఇనగంటి రవిచంద్రగారు. విషయం తెలియగానే ప్రయత్నించి Google cache నుంచి నా బ్లాగ్ సమాచారాన్ని -బొమ్మలు మినహా- పైళ్ల రూపంలో రాబట్టి పంపిన విజయ్ వర్థన్ గారు, అమెరికా నుంచి ఫోన్ చేసి మరీ బ్లాగు.కాం వారికి ఈ విషయం తెలియజేసి వారినుంచి సమాచారం అందించిన పెద్దలు సీబీరావు గారు.. సహానుభూతి తెలుపుతూ సత్వర స్పందనలు పంపిన సర్వశ్రీ రాజేంద్ర కుమార్, సుజాత, వంశీ, జెబీ గార్లకు, తెలుగుబ్లాగర్స్. కాం లో స్పందించిన మిత్రులందదరికీ కృతజ్ఞతలు. డేటాను భద్రపర్చుకోవడంలో నా తాత్సారానికి మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు గాను క్షమాపణలు.
రాజు.
 
ఏప్రిల్ 18 సాయంత్రం ఆఫీసునుంచి వస్తూ జీమెయిల్ తెరిస్తే బ్లాగు తిరిగి కనబడుతున్నట్లు మెయిళ్లు. బ్లాగు తెరిచి చూస్తే ‘నా వల్ల ఎవరి పనీ ఆగకూడదు’ అని 12వ తేదీన శంకర్ గారి జీవన సహచరి శ్రీమతి షణ్ముఖవల్లి గారి అనారోగ్యంపై పోస్ట్ చేసిన కథనం.  ఆ దంపతుల ఫోటోలు కనిపించాయి.
 
8నెలలు శ్రమకోర్చి సేకరించిన చందమామ అమూల్యమైన చరిత్ర ఇక చూడలేమేమో అని విచారపడుతున్న సందర్భంలో బ్లాగుకు ఏమీ  కాలేదని భద్రంగా ఉందని శ్రీ జాలయ్యగారి భరోసా. చెప్పినట్లే ఇవ్వాళ -18-04-2010- బ్లాగు.కామ్ పునర్దర్సనం.
 
ఎనిమిది నెలలుగా బ్లాగు.కామ్ లో రూపొందించుకున్న చందమామ బ్లాగు ఎలాంటి ఇబ్బందికీ గురికాలేదు. ఇకపై కూడా ఇబ్బందులు ఏర్పడవని, రాకూడదని నమ్ముతున్నాం. బ్లాగు.కాం తో మా అనుబంధం కొనసాగుతుంది
 
మాట, చేత సహాయం అందించిన అందరికీ, భరోసా ఇచ్చి మాట నిలుపుకున్న జాలయ్య గారికి నిండు కృతజ్ఞతలు.

రాజశేఖర రాజు
చందమామ.

గమనిక: చందమామ బ్లాగు తాత్కాలికంగా కనిపించకుండా పోవడంపై మిత్రులతో జరిపిన సంబాషణలో కొంత భాగం ఇక్కడ ఇస్తున్నాను.

శ్రీ విజయవర్ధన్ గారికి వేవేల కృతజ్ఞతలు. చందమామ బ్లాగు -blaagu.com/chandamamalu- ఉన్నట్లుండి పనిచేయక పోవడంతో  కలవరపడ్డాను. 8 నెలల శ్రమ పూర్తిగా పోయిందేమో అనుకుని బాధపడ్డాను. కానీ చందమామ అభిమాని ఇనగంటి రవిచంద్ర గారు నిన్న తెలుగు బ్లాగర్ల గ్రూప్ లో ఈ సమస్యను పోస్టే చేయడంతో బ్లాగు.కామ్ ప్రతినిథి జాలయ్యగారు నా బ్లాగు ఎక్కడికీ పోలేదని, డేటా ఓవర్ లోడ్ కావడంతో బ్లాగ్ హోస్ట్ వారు తాత్కాలికంగా నిలిపి ఉంచారని, త్వరలో అన్ని బ్లాగులూ తిరిగి అందుబాటులోకి వస్తాయని సందేశం పంపారు. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చిందంటే నమ్మండి. జాలయ్య గారి మాటలు నిజమై మళ్లీ చందమామ బ్లాగు పనిచేస్తుందనే ఆశిస్తున్నాను.

ఈరోజు మరింత మంచివార్త మీ నుంచి విన్నాను. “Google cache నుంచి రాబట్టిన blog posts (text మాత్రమే. photos cache చేయరు) జతచేసాను.” అని మీరు పంపిన చందమామ బ్లాగు కంటెంట్‌ను ఫైల్ రూపంలో తీసుకున్నాను. కోల్పోయిన పెన్నిధిని మీరు తిరిగి అందించారు. ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు.

(నిన్ననే ఇనగంటి రవిచంద్ర గారు తన మార్గంలో బ్లాగు.కామ్ వారిని సంప్రదించి నా -చందమామ బ్లాగు- భద్రంగానే ఉందన్న సమాచారం తెలియి జేసారు. దాన్ని నా వ్యక్తిగత మెయిల్ నుంచి మనతెలుగుచందమామ బ్లాగులో వెంటనే తెలియపర్చలేకపోయాను. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి దాకా సిస్టమ్ ‌కు అందుబాటులో లేకపోవడమే కారణం.)

ఈ మంచి వార్తను అందరికీ తెలియజేస్తున్నాను. బ్లాగు.కామ్ తిరిగి పనిచేయగానే చందమామ బ్లాగులోని పోస్టులు అన్నీ బ్యాకప్ చేయడానికి శివరాం ప్రసాద్ గారు సిద్దంగా ఉన్నారు. ఈ దెబ్బకు ఆయన కూడా తన సాహిత్య అభిమాని బ్లాగు sahitya-abhimani.blogspot.com- , మన తెలుగు చందమామ బ్లాగు -manateluguchandama.blogspot.com- లను కూడా పూర్తిగా బ్యాకప్ తీసుకున్నట్లు తెలిపారు.

బ్లాగు మొత్తాన్ని ఒకేసారి బ్యాకప్ చేసుకునే సులభమార్గం ఉంటే ఆయననుంచి తెలుసుకోవాలి. మీకూ తెలిసి ఉంటే అందరికీ తెలియజేయండి. ఈ సమస్యకు ఇదే శాశ్వత పరిష్కారం కదా. నా వెబ్ దునియా బ్లాగులోని అన్ని పోస్టులను గతంలో హెచ్‌టీఎమ్‌ఎల్ రూపంలో సేవ్ చేసుకున్నాను. కానీ చందమామ బ్లాగు విషయంలో కాస్త ఏమారాను. అందుకే ఇంత కలవరం. అయినా చెప్పా పెట్టకుండా, కనీసం నోటీసు కూడా లేకుండా ఇలా మొత్తం బ్లాగులన్నింటినీ హోస్ట్‌లు అడ్డగించి వేస్తే ఎంత ఇబ్బంది పడతారో వారికీ తెలీదా? ఇలా ఎవరయినా ఎప్పుడైనా చేయగలరు కాబట్టి అందరూ తమ తమ జాగ్రత్తలో ఉంటేనే చాలా మంచిదనిపిస్తుంది.

కథనాలకు జోడించిన చిత్రాలు పోయినా దాదాపుగా మొత్తం కంటెంట్ గాలించి ఫైల్లో పంపారు. ఇది నాకు చాలా మంచి వార్త. థ్యాంక్యూ.

సమస్య తెలియగానే తన వంతు సహాయం అందించిన శివరాం గారికి, రవిచంద్రగారికి, మీకూ, స్పందించిన రాజేంద్ర కుమార్, సుజాత గార్లకు, సీబీ రావు గారికి, వంశీగారికి, జెబీ గారికి నా బ్లాగు ఎక్కడికీ పోలేదని, భద్రంగా ఉందని నిన్ననే హామీ ఇచ్చిన జాలయ్య గారికీ, ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు.

గమనిక: నా blaagu.com/chandamamalu బ్లాగు కనబడకుండా పోయిన విషయాన్ని మనతెలుగుచందమామ.బ్లాగ్‌స్పాట్.కామ్‌ లో శివరాం గారికి పోస్ట్ రూపంలో పంపిన వ్యాఖ్యలో “ఎంత ఘోరమైన సంస్థ బ్లాగ్ సైట్‌లో నేను బ్లాగ్ రూపొందించుకున్నానా అని ఇప్పుడనిపిస్తోంది.” అంటూ నోరు జారి రాశాను.

http://manateluguchandamama.blogspot.com/2010/04/blog-post.html#comments

8 నెలల శ్రమ, అరుదైన సమాచారం పోయిందే అనే బాధ, ఉద్రిక్త క్షణాల్లో ఈ దూషణ వ్యాఖ్య చేశాను. ఈ సమస్యకు పరిష్కారం ఉండదేమో అనే బీతితో విచక్షణ మరిచిన క్షణంలో నేను చేసిన, చేయకూడని వ్యాఖ్య ఇది. నిన్న కూడా ఇనగంటి రవిచంద్ర గారికి కూడా మెయిల్ చేస్తూ నా టంగ్ స్లిప్ గురించి బాధపడ్డాను. పొరపాటు జరిగిపోయింది కాబట్టి దాన్ని క్షమాపణతోటే సవరించుకుంటున్నాను. నా వ్యాఖ్యను సీరియస్‌గా తీసుకోవద్దని జాలయ్యగారిని – <jaalayya@gmail.com> అభ్యర్థిస్తున్నాను. ఈ విషయమై మీకు విడిగా మెయిల్ కూడా పంపుతున్నాను.

ఈ ఘటన దాదాపుగా మనందరికీ మేలుకొలుపులాగే ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నాను. తాము విలువైనదిగా భావిస్తున్న సమాచారాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత వ్యక్తుల, సంస్థల స్వంత బాధ్యతే అనేదే ఆ మేలు కొలుపు. పని ఒత్తిళ్లలో కూరుకుపోయి సమాచార భద్రతను మర్చిపోవద్దనే ఈ ఘటన పాఠం నేర్పుతోంది కదా.

(బ్లాగ్ మాయమైందన్న విషయం తెలియగానే తన బ్లాగులు రెండింటిలో ఈ విషయం పోస్ట్ చేసి అందరికీ తెలిపి సత్వర సహాయానికి దారి కల్పించిన మిత్రులు శివరాం ప్రసాద్ గారికి, తెలుగు బ్లాగర్ల సముదాయానికి విషయం పోస్ట్ చేసి జాలయ్యగారినుంచి భరోసా తెప్పించి ఇచ్చిన రవిచంద్రగారికి, బ్లాగు మొత్తాన్ని గూగుల్ సెర్చ్ నుంచి లాగి నోట్ పాడ్ పైళ్లను పంపించిన విజయవర్దన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ బ్లాగులోని కంటెంట్ మొత్తాన్ని భద్రపర్చే ప్రయత్నంలో ఉన్న శివరాంగారికి కృతజ్ఞతలతో సరిపెట్టలేనని భావిస్తూ…)

రాజశేఖర రాజు
చందమామ
blaagu.com/chandamamalu

RTS Perm Link

నావల్ల ఏ పనీ ఆగకూడదు: చందమామ శంకర్

April 12th, 2010

షణ్ముఖవల్లి గారు

చందమామ శంకర్ గారిని మార్చి 21న శివరాం ప్రసాద్ గారూ, నేనూ ఆయన నివాసంలో కలిశాక ఓ అనూహ్య ఘటన జరిగి పోయింది. ఇన్నేళ్ల జీవితంలో ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్న ఆయన జీవన సహచరి శ్రీమతి షణ్ముగవల్లి గారు బయటకు వెళ్లి తిరిగి వస్తూ తూలి పడిపోయారు. కాలు ఎముకలో తిన్నటి చీలిక ఏర్పడిందని, భయపడవలసిన పనిలేదని, నెలరోజులు ఏ పనీ చేయకుండా విశ్రాంతి తీసుకుంటే చాలని డాక్టర్ చెప్పారట.

ఆయన ఈ విషయాన్ని చిన్నదిగానే తీసుకుని మాకెవరికీ చెప్పలేదు. రెండువారాల తర్వాత ఏదో పని మీద ఫోన్ చేసినప్పుడు గాని విషయం తెలీకుండా పోయింది. కనీసం ఫోన్ చేసి చెప్పి ఉంటే బాగుండేది కదా అని ఆయనను అడిగితే మీ అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని ఊరకుండిపోయినట్లు చెప్పారు. మరి మీకు వంట ఇతర పనులు ఎవరు చేసిపెడుతున్నారని అడిగితే రెండు పూటలా బియ్యం తానే కడిగి స్టౌ మీద పెడుతున్నానని, పక్కవీధిలో ఉంటున్న చివరి అబ్బాయి రెండు పూటలా కూరలు తీసుకువస్తున్నాడని, ఇబ్బందిలేదని చెప్పారు. వంట చేయలేని రోజున హోటల్లో ఏదో ఒక టిఫన్ తెప్పించేసుకుని సరిపెట్టుకుంటున్నామని చెప్పారు.

జీవన సహచరులు

ఇన్నేళ్ల జీవితంలో ఈ దంపతులకు ఇలాంటి ఇబ్బంది ఎన్నడూ ఎదురుకాలేదు. దీన్ని కూడా ఆయన జీవితంలో సహజ పరిణామంలానే చూస్తున్నారు. ఆరేడుగురు పిల్లలు ఉన్నా రెక్కలు కట్టుకుని ఉద్యోగాల రీత్యా వలస పోయాక ఒంటరి జీవితం గడపక తప్పని మన కుటుంబ వ్యవస్థ మారిన జీవన శైలి ప్రభావం ఈ దంపతులమీద కూడా పడింది. ఈ ఇబ్బందిని ఆయన పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఈనెల చందమామకు గీసి పంపవలసిన బొమ్మలు సకాలంలో పూర్తి చేస్తానా లేదా అనే రంథి పట్టుకుందాయనకు. ఆమె పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడంతో కాస్త కలవరంగా ఉందని, దీంతో పనిలో ఏకాగ్రత కుదరటం లేదని, ఓపిక తెచ్చుకుని జూన్ నెల బొమ్మలు పూర్తి చేస్తున్నానని చెప్పారు. ఇంకా బేతాళ కథకు బొమ్మలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఎలాగోలా పూర్తి చేసి పంపుతానని చెప్పారు.

ఈ మధ్యకాలంలో మళ్లీ రెండు సార్లు తనకు ఫోన్ చేసి అమ్మ ఆరోగ్యం ఇప్పుడు ఫర్వాలేదా అని అడిగి తెలుసుకుంటే సంతోష పడ్డారు. ఏప్రిల్ తొలివారంలో అన్ని బొమ్మలూ వేసి పంపేశారు. తొందరపడవద్దని, కొద్ది రోజులు  ఆలస్యగానే పంపమని చెబితే ఆయన తన జీవిత కాలమంతటా పాటించిన పనిసూత్రాన్ని ఓ మెరుపు వాక్యంతో చెప్పారు. “నావల్ల ఏ పనీ ఆగకూడదు” ఎంత నిక్కమైన సత్యమిది.

నెలరోజుల చందమామ పనిలో ఆయన బొమ్మలు వేయటం ఎంత త్వరగా పూర్తయితే తర్వాత వాటిని ఆయా కథల పేజీల లేఅవుట్‌లో పెట్టి 12 భాషలలో డీటీపీ పనికి పంపడం సులభమవుతుంది. సింగిల్ పేజీ, టూపేజీ, త్రీపేజీ, ఫోర్ పేజీ, బేతాళకథ, రామాయణం, శిధిలాలయం, ఇతర బొమ్మల కథలు, కాంటెంపరరీ కంటెంట్ ఇలా అన్ని పేజీలకు బొమ్మలను ముందుగా పేజీలలో ఇంపోజ్ చేసేస్తే తర్వాత టెక్స్ట్‌ని సాపుచేసి పేజీలలో సమానంగా వచ్చేలా లే అవుట్ రూపొందించడం సులభం. అందుకే తదుపరి నెలలో అవసరమైన బొమ్మలను ఈనెలలోనే చిత్రకారులకు సూచించి అందజేస్తే మరుసటి నెల చందమామ పనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఈ ధర్మసూత్రాన్ని ముందునుంచి అర్థం చేసుకున్న వారు కాబట్టే శంకర్ గారు తన పనికి ప్రాణమిస్తారు. ఎన్నడూ లేనిది ఈనెల సకాలంలో చిత్రాలు అందించలేకపోయానని, బేతాళ కథకు బొమ్మలేయడం ఇంకా మిగిలి ఉందని చెబుతున్నప్పుడు తన స్వరంలో అదే ఆదుర్దా. ఆ ఒక్క బొమ్మ సకాలంలో పూర్తి చేయకపోతే చందమామ పని ఎక్కడ, ఏ పాయింట్‌లో నిలిచిపోతుందో అనే ఆందోళన.

అందుకే ఆయన చందమామ ఆఫీసుకు వచ్చి పని చేసే రోజుల్లో కూడా, అంటే గత సంవత్సరం అక్టోబర్ వరకు, మధ్యాహ్న వేళల్లో తనను కలిసి చందమామ  చరిత్రకు సంబంధించిన విషయాలు పంచుకునేటప్పుడు ఇదే విషయం పదే పదే చెప్పేవారు. మనం ఇలా కలిసి విషయాలు పంచుకునే క్రమంలో మన ఇద్దరికీ కూడా మాట రాకూడదని జాగ్రత్తపడేవారు. రెండు వారాల క్రితం కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన ఇదే విషయం చెబితే దాన్ని వెంటనే నా మౌస్ ప్యాడ్ మీది  కాగితంపై రాసుకున్నాను. “నావల్ల ఏ పనీ ఆగకూడదు.” ఇప్పడు కంప్యూటర్ ఆన్ చేసి మౌస్ మీదికి చేతిని చాపిన ప్రతి క్షణం, ఈ మెరుపు వాక్యం నాకు శంకర్ గారి పని సంస్కృతిని తటిల్లుమని సూచిస్తూ ఉంటోంది

పైకి ఇది ఏదో మామూలు విషయంలాగే అనిపించవచ్చు కానీ 57 సంవత్సరాలుగా శంకర్ గారు చందమామలో తన వృత్తిజీవితాన్ని ఈ సూత్రం ఆధారంగానే నడుపుకొస్తున్నారు. నెలపత్రిక అయిన చందమామ పని పకడ్బందీగా కొనసాగాలంటే మొదటినుంచి ఇదే పనివిధానం కొనసాగి ఉండాలి. ఎవరు చేయవలసిన పని వారు సకాలంలో చేస్తేనే పత్రిక సకాలంలో బయటకు వస్తుంది. అందుకే ఆయనకు ఈ నెల పని ఆలస్యమయేటట్లుందని గ్రహింపుకు రాగనే కలవరపాటు మొదలయింది. మొత్తంమీద ఎలాగోలా పూర్తి చేసి పంపారు కాబట్టి కాస్త ప్రశాంతత దొరికినట్లే.

అమ్మకు ఇప్పుడెలా ఉందని, మీ పరిస్థితి ఏమిటని ఒకటి రెండు సార్లు అడిగి పరామర్సించినప్పడు ఆయన ఓ రోజు ఫోన్ సంభాషణలో గత స్మృతులను తల్చుకున్నారు. ఇలా మనిషిని పట్టించుకుని పరామర్శించడం చూస్తుంటే తనకు ముద్దా విశ్వనాధం గారు గుర్తుకొస్తున్నారని చెప్పారు. ఆయన కూడా ఎంత పనిలో ఉన్నా చందమామలో పనిచేసే వారిని స్థాయీ భేదం లేకుండా పలకరించేవారట. ఏదైనా ఇబ్బంది కలిగితే వ్యక్తిగతంగా పరామర్శించి ధైర్యం చెప్పేవారట. ముద్దావిశ్వనాధం గారి అరుదైన ఫోటోను కూడా ఆయన చూపించడమే గాక గతంలో నాకు ఇచ్చారు కూడా.

ముద్దా విశ్వనాధం గారి తర్వాత మళ్లీ నా పని పట్ల ఇంత శ్రద్ధ, ఆసక్తి చూపించిన వారు మీరేనని, ఫోన్లో చెబుతోంటే నాకు ఇటువైపున సిగ్గేసింది. ఈ జ్ఞాన వృద్ధుడితో పరిచయం కావడమే ఓ అపూర్వ స్మృతిగా భావిస్తున్న నాకు ఆయన ఇంత గౌరవం ఇస్తుంటే తట్టుకోలేకపోయాను. ‘మిమ్మల్ని పట్టించుకోకపోతే చందమామలో ఎవరిని పట్టించుకోవాలి మాస్టారూ’ అంటే ఆయన వదలలేదు.

గత సంవత్సరం ఆగస్టులో తొలి పరిచయం అయిన సందర్భంగా నేను ఆయన చేయి పట్టుకుని కళ్లకద్దుకున్నాను. ఆ ఒక్క కరస్పర్శే మీ వ్యక్తిత్వాన్ని తేల్చి చెప్పిందంటారాయన. అప్పటికి 8 నెలలుగా చందమామలో ఉంటున్నా తనతో పరిచయం అయింది అప్పుడే కాబట్టి ఉద్వేగంతో ఆయన చేతిని స్పర్సించాను. ఆ తర్వాతే  చందమామ చరిత్రను వెలికి తీయాలన్న నా ప్రయత్నం జోరుగా సాగింది.

ఇంతవరకు చందమామ  బ్లాగులో 140 పైగా చిన్నవి, పెద్దవి కథనాలు ప్రచురించబడితే ఒకటి రెండు మినహాయిస్తే అన్నీ చందమామ చరిత్రను తడిమేవే. కేవలం ఈ ఎనిమిది నెలల్లోనే చందమామ చరిత్రకు సంబంధించిన 140 కథనాలు బ్లాగు రూపంలో వెలికి తీయగలిగినట్లు చెబితే ఇది చిన్నవిషయం కాదంటారాయన.

గత ఆగస్టులో తొలిసారిగా ఆయనను నేను కలిసినప్పుడే, ‘చందమామలో పనిచేసిన మనుషుల చరిత్రను లిఖితం చేసేవాడు ఇన్నాళ్ల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత చందమామనే వెదుక్కుంటూ వచ్చాడని భావించాన’ని చెప్పారు. అరవై ఏళ్లు చందమామ యాజమాన్యానికే పట్టని చందమామ చరిత్ర వెలికితీతకు ఇంత కాలం తర్వాత ఒక మనిషి వెదుక్కుంటూ రావడం యాదృచ్చికం కాదని నొక్కి చెబుతారాయన.

దీన్ని కూడా ఆయన దైవకృపలో భాగంగానే చూస్తున్నారు. 60 ఏళ్లు చందమామ సిబ్బందికి జరిగిన అన్యాయాన్ని సవరించడానికి దేవుడే మీరూపంలో చందమామకు ఓ ఉద్యోగిని ఆలస్యంగా అయినా సరే పంపారంటారాయన. ఇలా అంటున్నప్పుడు ఆయన గొంతులో తడి. ఎందుకంటే ఆయన జీవితం పొడవునా దైవాజ్ఞతోనే పనిచేస్తూ వచ్చానని బలంగా భావిస్తూ వచ్చారు.

‘శంకరా పోయి చందమామలో చేరి నా బొమ్మలు గీయరా’ అని దేవుడు ఆజ్ఞాపిస్తే గత ఆరు దశాబ్దాలుగా ఆ పని చేస్తున్నానని ఆయన విశ్వాసం. చివరకు క్యాబ్ ప్రయాణం సహకరించక గత నవంబర్ నుంచి ఆయన ఇంటివద్దనుంచే పనిచేస్తూ వస్తున్న ఘటనను కూడా దైవ కృపగానే భావిస్తున్నారు.

‘ఒరే శంకరా ఇంకా ఈ ప్రయాణపు తిప్పలు ఎందుకురా నీకు, హాయిగా ఇంట్లోనే కూర్చుని బొమ్మలు గీయి. ఎక్కడా ప్రయాణాలు అవీ చేయకు’ అని ఆరోజు దేవుడు తనకు చెక్ పెట్టారంటారు. అలా చెక్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు మూడు గంటల ప్రయాణ తిప్పలు పోయి సులభంగా ఇంట్లోనే కూర్చుని బొమ్మలు గీస్తున్నానని. చాలా సంవత్సరాల తర్వాత ఉదయం పూట టిఫన్ చేయగలుగుతున్నానని ఆయన అంటారు.

మన కళ్లముందు ప్రపంచంలో ప్రేమానందులు, నిత్యానందులు, ఆమాంబాపతు భగవానులు ఆధ్యాత్మిక వ్యాయామాల -స్పిరిచువల్ ఎక్సర్‌సైజులట-  పేరిట పరమ జుగుప్సాకరమైన చర్యలకు మతం ముసుగులో నగ్నంగా పాల్పడిపోతున్న పాడుకాలంలో…. తనకంటూ ఏమీ కోరుకోని అరుదైన తత్వంతో, సంపూర్ణమైన సంతృప్తితో, 8 పదుల జీవితాన్ని నిరామయంగా గడిపిన ఓ పరమ భక్తిపరుడు… మతానికి, మత విశ్వాసాలకు, దైవ భావనకు కొత్త నిర్వచనం ఇస్తూ, నిజమైన భక్తి, ఆరాధన ఎలా ఉంటుందో తన యావజ్జీవిత ఆచరణ సాక్షిగా ఈ ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

గత ఎనిమిది నెలలుగా ఓ అపర భక్తుడికి, ఓ పరమ నాస్తికుడికి లంకె అందుకే ఇంత బలంగా కుదిరింది. ఆయనకు నేను మతాన్ని, దైవభావాన్ని విశ్వసించనని పరోక్షంగా అయినా తెలుసు. ఆయన జీవితంలో మతాన్ని, విశ్వాసాన్ని వదలిపెట్టరని నాకూ తెలుసు. కాని పనిని దైవంగా భావించే ఆయన అంకితభావానికి కాకుండా నేను ఇక దేనికి దాసోహమవ్వాలి?

నా జీవితంలో తొలి ఇరవై ఏళ్లకాలంలో పరమ భక్తుడిగానే కొనసాగిన నేను తర్వాత వ్యతిరేక దిశకు మళ్లాను. అలా మారిన పాతికేళ్ల తర్వాత మొదటిసారిగా నిజమైన భక్తుడిని, పనిని దివ్యభావనతో ఎంచే అపర ఆస్తికుడిని ఇప్పుడే చూస్తున్నాను, శంకర్ గారి రూపంలో భక్తిభావనకు నిర్వచనం ఏదో చూస్తున్నానిప్పుడు.

అందుకే పరస్పర విరుద్ధ భావాల మధ్య ఘర్షణ అంశం మా ఇద్దరి బంధంలో పక్కకు పోయింది. భావాలు, విశ్వాసాలు వాటి మధ్య ఘర్షణలు పక్కకుపోయి… మనిషికి మనిషికి మధ్య మానవీయ బంధంలో మేం తడిసి ముద్దవుతున్నాం. ఓ అపర భక్తుడు పరమ నాస్తికుడిని, ఓ పరమ నాస్తికుడు ఓ అపర భక్తుడిని ఎవరేమిటో తెలిసి కూడా పరస్పరం గౌరవించుకుంటూ, ఆరాధించుకుంటూ మానవ సంబంధాన్ని కొనసాగిస్తున్న అద్భుత క్షణాలను మేం ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం.

అందుకే మొన్న శంకర్ గారి ఇంట్లో భేటీ అయిన తర్వాత ఆయన శివరాం ప్రసాద్ గారికి, నాకూ కూడా విబూది ఇచ్చి ‘దీన్ని మూఢనమ్మకంగా భావించవద్దు, కాదనకుండా పెట్టుకోండి’ అని కోరితే కాదనలేకపోయాను. ఆ క్షణంలో నా విశ్వాసాలను పక్కన  పెట్టేశాను. నవ్వుతూనే, ఆయన విశ్వాసాన్ని మనస్పూర్తిగా గౌరవిస్తూనే ఆయనతో విబూది పెట్టించుకున్నాను. ఆయన నమ్ముతున్న విశ్వాసంలోని నైర్మల్యానికి అంజలి ఘటించాను.

దీంతో నా నాస్తికత్వానికి, నా ‘విశ్వాస’ రాహిత్యానికి వచ్చిన నష్టమేదీ లేదు. ఒక మహనీయ మూర్తిమత్వం వద్దకు మనం పోయినప్పుడు మన భావజాల పరమైన ‘విశ్వాస’ ప్రదర్శనను చాటుకోవలసిన పనిలేదు. మనసునిండా అచ్చమైన భక్తిభావనను ప్రోదిచేసుకున్న మనీషి విశ్వాసాన్ని మనం ఆ నిర్దిష్ట క్షణంలో గౌరవిస్తే, మన తల బేతాళకథలో లాగా తెగిపడదు కదా..

RTS Perm Link

అరచేతిలో అందాల ‘చందమామ’

April 9th, 2010

గీతాప్రియ

‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..

“నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ - అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”

చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.

ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు. 

నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం. 

చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఆదిలక్ష్మిగారి అరచేతిలో అందాల ‘చందమామ’ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్‌సైట్ లింకులో చూడండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2444

ఈ కథనానికి గాను మార్చిన ఫోటో ఆదిలక్ష్మిగారి అమ్మాయి గీతాప్రియది. ఈమె చిన్నవయసులోనే ‘ఆహా ఓహో’ అనే బ్లాగు నడుపుతున్నారు.  http://paalameegada.blogspot.com/
ఈ బ్లాగు కూడా సహజంగా కథలకే ప్రాధాన్యత ఇస్తూండటం గమనార్హం. చూడగలరు.

చందమామ పాఠకులు తమ చందమామ జ్ఞాపకాలను కింది లింకుకు పంపగలరు.

abhiprayam@chandamama.com

RTS Perm Link

ఆబాల గోపాల కథల పత్రిక “చందమామ”

April 7th, 2010

ఆరు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను ఆకట్టుకుంటూ వారిని అద్బుతమైన ఊహాలోకపు మంత్రజగత్తులో విహరింప జేస్తున్న కథల పత్రిక “చందమామ”.  పిల్లల్లారా, చిన్నారీ, అమ్మాయీ, అని సంబోధిస్తూ, పాలు తాగే పసిపిల్లలకు ఊకొట్టే కథలను చెబుతూ చనుబాల కథల పత్రికగా 1947 జూలై నెలలో తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ అతి త్వరలోనే ఆబాల గోపాల కథల పత్రికగా భారతీయ సాహిత్య ఆకాశంలో తటిల్లున మెరిసింది.

జాతి జీవనంలో సాంస్కృతిక రాయబారిగా నిలిచిపోయిన అరుదైన పత్రిక చందమామ. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చందమామ కథల పత్రికను చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు.

దైవ ప్రయత్నం కంటే మానవ ప్రయత్నానికి, తద్వారా మనుషులు సాధించే అంతిమ విజయాలకు ప్రాధాన్యమిచ్చే చందమామ కథలు తరాలు మారినా, సాంకేతిక జ్ఞాన ఫలాలతో జీవితం మూలమలుపులు తిరుగుతున్నా భారతీయ పాఠకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి.

హాస్యం, విజ్ఞానం, వినోదాల మేళవింపుగా రూపొందుతూ వచ్చిన చందమామ కథలు వాటికి తోడయిన అద్బుత చిత్రాలు -చిత్రా, శంకర్, ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య, రాజీ తదితరుల చిత్ర సృజన- భారతీయ పిల్లల మానసిక ప్రపంచాన్ని దశాబ్దాలుగా వెలిగిస్తూ వస్తున్నాయి.

ఆ పిల్లలు ఆ కథలతో పాటు పెరిగినా, జీవితంలో అన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. తెలుగునేల మీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు.

1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినిపిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు.

ఆరు దశాబ్దాల క్రితం పిల్లల పత్రికగా మొదలైన చందమామను ప్రస్తుతం 70, 80 ఏళ్ల పైబడిన వారు ఇప్పటికీ కొని చదువుతూ తమ మనవళ్లు, మనవరాళ్లకు వాటిని చదివి వినిపిస్తున్నారంటే ఒకనాటి చనుబాల కథల పత్రిక క్రమంగా ఆబాల గోపాల కథల పత్రికగా మారిన వైనం బోధపడుతుంది. 

చందమామపై పరిచయ కథనం పూర్తి పాఠం కోసం కింది లింకును తెరవండి.
http://prajakala.org/mag/2010/04/chandamama

RTS Perm Link

చక్రపాణి ప్రేరణతో రచయితనయ్యా..

April 1st, 2010

Tiru Kalanikethan balu garu

రచన పట్ల నా అనురక్తి 80 ఏళ్ల ముదివయస్సులో కూడా కొనసాగుతోంది. బడిలో చదువుకునే రోజుల్లోనే నాలో రాయాలనే కుతూహలం ఏర్పడింది. సుప్రసిద్ధ తమిళ రచయిత తమిళన్ రచనలతో ప్రభావితుడినయ్యాను. శక్తివంతమైన అతడి రచనా విధానం త్వరలోనే నన్ను ఆయన అభిమానిగా మార్చేసింది. ఏదో ఒకటి రాయాలి అనే నా తపనను ఇది మరింతగా పెంచింది.చెన్నయ్ లోని కన్నెమెరా లైబ్రరీని చాలాసార్లు సందర్శించేవాడిని. అక్కడ అరేబియన్ నైట్స్  వంటి పుస్తకాలను చదువుతూ ఆస్వాదించేవాడిని.

అయితే 1950లలో పిల్లలకోసం పెద్దగా పుస్తకాలు ఉండేవి కావు. ఆ సమయంలో పిల్లల పఠనావసరాలను తీర్చడానికి అంబులిమామ -తమిళ చందమామ- పత్రిక మాత్రమే వచ్చేది. ఈ పత్రిక గురించి మరింతగా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో అప్పట్లోనే నేను చందమామ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఓ పెద్దమనిషితో సమావేశమయ్యాను. ఆయనే చక్రపాణి అని తర్వాత చెప్పారు.

ఆయన నాతో ఎంతో ఆదరంగా మాట్లాడారు. ఎలా రాయాలి అనే విషయంపై నాకు అమూల్యమైన సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఆయన నన్ను 10-12 బీర్బల్ కథలను  రాయమని కోరారు. చందమామ చక్రపాణిగారితో ఈ అనుబంధం నా రచనా వృత్తిని ముందుకు తీసుకుపోయింది. ఆ ప్రభావంతోనే ఇవ్వాళ కూడా నేను మంజరి, దినమణి, దినమలర్, దినతంతి వంటి ప్రముఖ తమిళ పత్రికలకు కథలు, వ్యాసాలు రాసి పంపుతుంటాను 

నా అభిప్రాయం ప్రకారం చక్రపాణి శక్తియుక్తుల వల్లే చందమామ గత 60 ఏళ్లుగా తన ప్రజాదరణను నిలబెట్టుకుంటోంది.

చందమామ పాఠకులకు శుభాకాంక్షలు.

(కళానికేతన్ బాలు  పేరుతో ఎస్ బాలసుబ్రహ్మణ్యన్ గారు గత 50 ఏళ్లకు పైగా చందమామలో ఫోటో వ్యాఖ్యలకు క్రమం తప్పకుండా ఫోటోలు తీసి పంపుతున్నారు. ఒక ఆల్బమ్ నిండా ఒకే సారి పకృతి, జీవులు,జీవితం గురించిన  విశేషాలతో కూడిన వైవిధ్యభరితమైన ఫోటోలను ఆయన పంపుతుంటారు. చిన్నపాటి పాత కెమెరాతో ఫోటోలు తీయడమే తప్ప ఆధునిక టెక్నాలజీ జోలికి పోని ఈయనను చందమామ పనిమీద ఇటీవల ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు తన చందమామ జ్ఞాపకాలను పంచుకున్నారు.

తొలి పరిచయం తర్వాత చందమామ చక్రపాణి గారితో చక్కటి సాన్నిహిత్య సంబంధం ఏర్పడిందని ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని తిరిగేవారమని అలనాటి వెచ్చటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. చందమామకు తన కంట్రిబ్యూషన్, అంబులిమామ పత్రిక నెలవారీగా అందడం ఇవి తన జీవితంలో అత్యంత సంతోషకర క్షణాలుగా ఉంటున్నాయని. చెప్పారు.

రచన విషయంలో చక్రపాణి గారి సలహాలు విని, పాటించిన బాలుగారు 80 ఏళ్ల వయసులో కూడా ప్రముఖ తమిళ పత్రికలన్నింటికీ ఇప్పటికీ రచనలు పంపుతూనే ఉన్నారు. ఫోటోలు మాత్రమే కాకుండా చిన్న చిన్న కథలు చందమామకోసం పంపించవలసిందిగా కోరితే ఈ నెలలోనే నాలుగు కథలు రాసి పంపారు. వాటిలో ఒకటి ఎంపిక చేయడమైంది.

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన “సహస్ర చంద్రోదయ దర్శనా”లను పూర్తి చేసుకున్న కళానికేతన్ బాలు గారు చందమామ సీనియర్ కంట్రిబ్యూటర్‌గా మాకు ప్రేరణగా నిలుస్తున్నారు.

ఆయన ఆరోగ్యంగా ఉండాలని, చివరివరకు రచనా వ్యాసంగం కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఆయనకు పూర్ణ జీవిత శుభాకాంక్షలు.
చందమామ

RTS Perm Link

చందమామ శంకర్ : అరుదైన పత్రం

March 26th, 2010

గత ఆదివారం -21-03-2010- చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారిని చెన్నయ్ విరుగంబాక్కంలోని ఆయన నివాసంలో శివరాం ప్రసాద్ గారూ, నేనూ కలిశాము. ఆయనను జీవితంలో ఒకసారైనా కలవాలని, చందమామ జ్ఞాపకాలను, అలనాటి చిత్రాల వైభవాన్ని ఆయనతో పంచుకోవాలని శివరాం గారు పడ్డ తపన ఎట్టకేలకు నెరవేరింది. గత డిసెంబర్ లోనే ఆయనను కలవాలని తను అనుకున్నప్పటికీ వృత్తి సంబంధ ఒత్తిడులతో అది ఇన్నాళ్లుగా సాధ్యం కాలేదు.

ముందే శంకర్ గారికి సమాచారం ఇచ్చి మరీ ఆదివారం సాయంత్ర నాలుగున్నర గంటలకు ఆయన ఇంటికెళ్లాం. చిరునామా ముందే క్షుణ్ణంగా తెలుసుకుని ఉండటంతో సులభంగానే ఇల్లు చేరుకున్నాం. చందమామ అత్యవసర పనులకూ శంకర్ గారి సేవలకు మధ్య వారధిగా గత కొద్ది కాలంగా ఉంటున్న ఆయన చివరి  అబ్బాయి రామకృష్ణన్ సాదరంగా మమ్మల్ని ఆహ్వానించారు. ఆ వెనుకే శంకర్ గారూ, ఆయన సతీమణి షణ్ముఖవల్లి గారు ఆప్యాయంగా పలకరించారు. నమస్కరించి శంకర్ గారి చేతులు ఆరాధనతో పట్టుకున్నాం.

ఇప్పటికి 86 సంవత్సరాలు పూర్తయిన వయోవృద్ధుడు శంకర్ గారికి అసాధారణమైన జ్ఞాపకశక్తి. డిసెంబర్‌లో కలుస్తానని చెప్పిన శివరాం గారి గురించి ఫోన్‌లో ఎన్నిసార్లు వాకబు చేశారో. అలాగే డిసెంబర్‌లోనే ఆయనను కలుసుకున్న విజయవర్ధన్ -బెంగళూరు, అన్వర్ -సాక్షి- గార్ల పేర్లను ఆయన ఇప్పటికీ మరవలేదు.

 ఆ రోజు కూడా సాయంత్రం 4 గంటలకే వస్తామని చెప్పి మేం కాస్త ఆలస్యంగా బయలుదేరేసరికి శంకర్ గారే ఫోన్ చేసి వాకబు చేశారు. చెన్నయ్ వచ్చాక శివరాం గారికి ఏమయినా ఇబ్బంది కలిగిందా అనే ఆయన తపన. మధ్యాహ్నం భోంచేశాక గెస్ట్ హౌస్‌లో మాట్లాడుతూ తలవాల్చేసరికి నిద్ర ముంచుకొచ్చేసింది. ఆలస్యానికి ఇదీ కారణం. చెప్పిన సమయానికి పోలేకపోయినందుకు కాస్త సిగ్గుపడుతూనే వెళ్లాం.

సమయ పాలన విషయంలో కూడా చెప్పిన సమయానికి కట్టుబడే విషయంలో శంకర్ గారి జ్ఞాపక శక్తి, నిబద్ధత అమోఘమనే చెప్పాలి. చందమామ ఆఫీసులో కూడా ఆయనను కలవాలనుకుంటున్న ప్రతిసారీ ముందుగా ఆయనే వచ్చి ఫ్రంట్ ఆఫీసులో కూర్చునేవారు. క్షమాపణలు చెప్పినా అపరాధ భావనే మిగిలేది. భోజనానంతరం మాత్రమే కలుద్దాం, మన ఇద్దరి పనికీ మాట రాకూడదు అనే ముందుజాగ్రత్తతో ఆయన వ్యవహరించేవారు.

ఇది ఇలా ఉంచితే ఆ ఆదివారం శంకర్ గారిని కలిసినప్పుడు ఓ నాలుగు గంటలు అమూల్య క్షణాలుగా సాగిపోయాయి. మేం ఆయనను ఇంటర్వ్యూ చేయనే లేదు. కలిసి పక్క పక్కన కూర్చుని మాట్లాడుకున్నాం. ఆయన ధారాపాతంగా మాట్లాడుతూ పోతుంటే మేం తలూపుతూ వింటూ వచ్చాం. అప్పట్లో తోటి చిత్రకారులు చిత్రాగారు తను తీసిన ఫోటోలు చూపిస్తూ, 50. 60 ఏళ్లనాటి ఫోటోలను చెక్కుచెదరని స్థితిలో భద్రపర్చి వాటి విశేషాలను చెబుతుంటే కాలం ఎప్పుడు ముందుకు పోయిందో తెలీని స్థితి.

చిత్రా గారి అనారోగ్యం, నాగిరెడ్డి గారి ఔదార్యం.. చక్రపాణి పెద్దమనిషితనం, ఆర్ట్ స్కూలు జ్ఞాపకాలు, ఇన్నేళ్ల తర్వాత కూడా చందమామలో చేరిన తరవాత వేసిన తొలి బొమ్మకు ఎంత శ్రద్ధ తీసుకున్నారో అదే విధమైన భయభక్తులతో ఈరోజుకూ కూడా బొమ్మ గీయటానికి కూర్చున్నప్పుడు ధ్యానం చేసుకోవడం, కుటుంబరావు గారి ప్రోత్సాహం, సిఫార్సు కారణంగానే తాను పౌరాణిక కధలు, ధారావాహికలకు చిత్రాలు గీయడానికి పరిమితం కావడం, చందమామ సంబంధీకుల అనుమతితోనే తాను గత 30 ఏళ్లుగా చెన్నయ్ నుంచి వెలువడుతున్న రామకృష్ణ ప్రభ ఆధ్యాత్మిక పత్రికలో ఒకటి రెండు కథలకు బొమ్మలు గీస్తుండటం… ఇలా 60ఏళ్ల జ్ఞాపకాలను జలపాత వేగంతో చెప్పుకుంటూ పోయారాయన.

ఆయన చెప్పిన వివరాలను మరోసారి ముచ్చటించుకుందాం. ఆయన అందించిన ఓ గొప్ప చందమామ చరిత్ర పత్రాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 1952 డిసెంబర్ 1న ఆయనను చందమామలో చేర్చుకుంటున్నట్లుగా నాగిరెడ్డి గారు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా స్వయంగా సంతకం పెట్టి ఇచ్చిన ఉద్యోగ నియామకపత్రాన్ని ఆయన మాకు చూపించారు.

ఇది రెడ్డిగారు నాకు స్వయంగా సంతకం పెట్టి మరీ ఇచ్చిన అప్పాయింట్‌మెంట్ ఆర్డర్ అంటూ తను గౌరవంగా ఆ పత్రాన్ని పట్టుకోవడం చూసి మేం చలించిపోయాం. 60 ఏళ్ల క్రితం తాను చందమామలో చేరినప్పటి ఒరిజనల్ నియామక పత్రాన్ని ఆయన అలాగే భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు. అది తనకు ఎంతో ప్రీతిప్రాతమైన నాగిరెడ్డి గారు స్వీయ సంతకంతో అందించిన అపురూప పత్రం మరి.

ఆపత్రాన్ని మరికొన్ని ఫోటోలను ఈ పోస్ట్‌లో చూడండి. ఆనాటికి చందమామ హిందీ, కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే వచ్చేవి. చందమామ ఇంకా వైభవోజ్వల శకంలోకి అడుగుపెట్టకముందు ఆయన చందమామలో చేరారు. తర్వాత రామాయణం వంటి పౌరాణిక గాధలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. బేతాళ కథల శంకర్ గారిగా జగత్ప్రసిద్ధి పొందారు.

శంకర్ అనే ఓ సామాన్యుడి చిత్రలేఖన విజయగాధ అలా 1952 డిసెంబర్ 1న చందమామలో మొదలైంది. దీనికి సజీవ తార్కాణమే ఆయన ఇప్పటిదాకా కాపాడుకుంటూ వస్తున్న ఉద్యోగ నియామక పత్రం.

RTS Perm Link

చందమామ : చక్రపాణిగారి చాదస్తాలు

March 21st, 2010

చక్రపాణి

చక్రపాణిగారికి చందమామ పత్రికను గురించిన అనేక చాదస్తాల్లో ఒకటి ప్రత్యేకమైనది. ప్రింటింగ్ టెక్నాలజీలో ఏర్పడిన మార్పుల కారణంగా అనేక ఫారాలుగా (forms) రూపొంది, సైడ్ స్టిచింగ్‌తో బైండింగ్‌కు లోనవుతూ వచ్చిన చందమామకు సెంటర్ స్టిచింగ్ అవసరమైంది. అంటే సంచిక మొత్తానికి మధ్యలో రెండు స్టేపిల్స్ మాత్రమే ఉంటాయి.

ఈ ఏర్పాటులో మధ్యపేజీ గురించి చక్రపాణి ఒక కొత్త నిబంధన పెట్టారు. అదేమిటంటే మధ్యపేజీలో ఎడమవేపున ఏ కథా పూర్తవకూడదు. ఆ తరవాతి పేజీలో కొత్త కథ మొదలవకూడదు. మధ్యపేజీలు రెండిటిమీదా ఒకే కథ కొనసాగి కనిపించాలి.

ఈ నిబంధనవల్ల మా నాన్నతో సహా అందరూ సర్కస్ ఫీట్లు చెయ్యవలసివచ్చేది. అయితే ఒక సంచికలో ఈ పొరపాటు జరగనే జరిగింది. At the last stage సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. దీన్నెలా పరిష్కరించాలో తెలియక అందరూ మథనపడుతూ ఉండగా ఆ సమయంలోనే చక్రపాణిగారు పోయారు. ఆయన గురించిన శ్రద్ధాంజలిని 4 పేజీలు రాసి సంచికలో చేర్చడానికి ఒక్కటే మార్గం మిగిలింది. దాన్ని అప్పటికే తయారుగా ఉన్న మధ్యపేజీలుగా జతచెయ్యడం.

ఆవిధంగా చక్రపాణిగారి నిబంధనను పాటించడానికి ఆయన మరణమే కారణమయింది. ఈ సంగతి మా నాన్న చాలాసార్లు గుర్తుచేసుకునేవారు.

(ఇవి చందమామ  ప్రింటింగ్ టెక్నాలజీ, చక్రపాణి గారి చాదస్తం గురించి కుటుంబరావు గారి అబ్బాయి కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ఈ రోజు -22-03-2010- తెలిపిన వివరాలు. ఆయన అమెరికా నుంచి త్వరలో స్వదేశం తిరిగి వచ్చిన తర్వాత బొంబాయిలోని తన నివాస ప్రాంతంలో ఉన్న కొకుగారి అరుదైన ఉత్తరాలు, చందమామ చరిత్రకు సంబంధించిన వివరాలను క్రోడీకరించి అందిస్తానని ఈమెయిల్‌లో తెలిపారు.)

అరుదైన విషయాలను చందమామతో పంచుకుంటున్నందుకు ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

చక్రపాణి గారి అరుదైన వర్ణచిత్రాన్ని చందమామకు అందించిన శ్రీ రచన శాయిగారికి కృతజ్ఞతలు

RTS Perm Link

చందమామ తీపి జ్ఞాపకాలు

March 19th, 2010

“చందమామ నా ప్రాణనేస్తం. అమ్మ తన చిన్నప్పుడు చందమామ, తోకచుక్క, పాతాళదుర్గం, చదువుతూ పెరిగింది. నేను అక్క, అన్న, చందమామ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాళ్లం. నేను సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టిన తరువాత సంస్కృతంలో చందమామ చదివేదాన్ని.

పెళ్లయి అమెరికా వెళ్లిన తరవాత అక్కడికి కూడా ప్రతినెలా, నాకోసం చందమామ వచ్చేది. నా స్నేహితులు, బంధువులు కూడా అంత క్రమంగా నాకు ఉత్తరాలు రాసేవారు కాదేమో! కాని, ప్రతినెలా క్రమం తప్పకుండా అనేక కథలు, కబుర్లు పట్టుకుని నాకోసం వచ్చేది చందమామ.
 
నేను 2000 సంవత్సరం ఆంగ్ల చందమామ ఫోటో కేఫ్షన్‌లో బహుమతి గెలుచుకున్నాను. అంబరమంత సంబరం వేసింది నాకు. ఇందులో పాతికేళ్ల నాటి కథలు ఎంత బాగుంటాయో! తరతరాలను ప్రభావితం చేస్తోంది చందమామ. మా అమ్మవాళ్ల తరం, మా తరం, ఇప్పుడు నా కూతురు,అందరూ చందమామ అభిమానులే!

మంచి అలవాట్లు, నీతి, నిజాయితీ, స్నేహం, విశ్వాసం నేర్పుతూనే పిల్లలకు పుస్తకాలు చదవటం నేర్పుతోంది చందమామ. టీవీ, కేబుల్‌తో ఇప్పుడు జనం పుస్తకాలను చదవడం తగ్గించేశారు. చిన్నపిల్లలు  చందమామ చదివితే, సద్గుణాలన్నింటితోపాటు పుస్తకాలు క్రమంగా చదవడం నేర్చుకుంటారు. ఎలాగూ ఇందులో పౌరాణికాలు, రామాయణం, భారత, భాగవతాదులు వస్తాయి కాబట్టి చిన్నప్పుడే మన సంస్కృతిని పిల్లలు నేర్చుకుంటారు.”

–శ్రీలేఖ కొచ్చెర్లకోట

(శ్రీలేఖ గారు సుప్రసిద్ధ చారిత్రక నవలా రచయిత శ్రీ ముదిగొండ శివప్రసాద్  గారి కుమార్తె. పెళ్లయి అమెరికా వెళ్లిన తర్వాత కూడా దాదాపు పదిహేను సంవత్సరాల పాటు చందమామను తెప్పించుకుని చదివారు. ఇటీవలే స్వదేశం తిరిగొచ్చాక హైదరాబాద్‌లో జర్నలిస్టుగా పనిచే్స్తూ దాదాపు 50 పైగా పిల్లల కథలను రాశారు. ముఖ్యంగా రోజూ తమ బాబుకు పడుకునే ముందు కథ చెబుతూ నిద్రపుచ్చే అలవాటు. ఆ అలవాటునుంచే పిల్లలకు ఏ కథలు చెబితే ఆసక్తికరంగా ఉంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ఈమె అలాంటి కథలనే ఎంచుకుని రాస్తున్నట్లు చెప్పారు.

అలా ఈ వారం “Mayank and Magic seed” అనే కథ ఇంగ్లీషులో  రాసి పంపారు. చదువుపై శ్రద్ధలేకుండా, మాట వినకుండా అల్లరి చిల్లరగా మెలిగే కొడుకుకు ఓ సన్యాసి ద్వారా మహిమాన్విత మామిడి విత్తనాన్ని ఇప్పించిన అమ్మ తనలో ఎలా మార్పు తీసుకువచ్చిందో చెప్పే కథ. మామిడి వనాన్ని రూపొందించడంలో సహాయం చేసి కొడుకు జీవితాన్ని మార్చిన ఇతివృత్తంతో కూడిన కథ. పేరుకు చిన్న కథే అయినా మహిమగల మామిడి విత్తనం పేరుతో పిల్లవాడిలో పరివర్తన తీసుకువచ్చిన చక్కటి కథ.

చూడగానే దీన్ని తెలుగుతో సహా ప్రాంతీయ భాషల చందమామలకు వేసుకుంటామని చెప్పడం జరిగింది. ఆమె ఇంగ్లీష్ చందమామ కోసం పంపిన కథను ఇలా హైజాక్ చేసి ప్రాంతీయ భాషలకోసం ఎంచుకున్నాము. ఆమె కోరిక మేరకు దీన్ని ఇంగ్లీష్ చందమామ పరిశీలనకు కూడా పంపిస్తామని చెప్పడమైంది. మామిడివిత్తనంలో మహత్తు మాటేమిటో గాని, సన్యాసి మాటలపై గురితో చదువుపై దృష్టి పెట్టిన మాయాంక్ రోజూ మామిడి చెట్టుకు నీళ్లు పోయడం ద్వారా పెద్ద చేసి దాని విత్తనాలను కూడా నాటి బీడుభూమిలో మామిడి చెట్ల వనాన్నే సృష్టించిన అపురూపమైన కథ ఇది.

కథ పంపినందుకు ఆమెకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతూ చందమామ జ్ఞాపకాలు కూడా రాసి పంపమని చెబితే ఆ రోజే తన జ్ఞాపకాలను రాసి పంపారు. పాతకథలను తీసివేయడం ద్వారా ఇంగ్లీష్ చందమామ క్వాలిటీ పడిపోయిందన్న బాధను కూడా నిష్కర్షగానే చెప్పారు. 

శ్రీలేఖ గారూ, చందమామకు కథ, జ్ఞాపకాలు, ఫీడ్‌బ్యాక్ కూడా ఒకే రోజులోనే పంపినందుకు ధన్యవాదాలు. పిల్లలకు కథలు చెప్పడంలో చక్కటి అనుభవం సాధించిన మీరు ఇలాంటి కథలను మళ్లీ మళ్లీ చందమామకు పంపగలరని ఆశిస్తున్నాము.

మీకు మన:పూర్వక కృతజ్ఞతలు.
చందమామ

మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు. ఈ మెయిల్ సౌకర్యం లేనివారు పోస్ట్ ద్వారా కూడా ఇంగ్లీషు లేదా తెలుగులో మీ జ్ఞాపకాలను చందమామ చెన్నయ్ చిరునామాకు పంపగలరు.
abhiprayama@chandamama.com

తెలుగు చందమామ వెబ్‌సైట్‌లో చందమామ జ్ఞాపకాలు విభాగంలో కథనాలకోసం కింది లింకులో చూడండి
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

RTS Perm Link

చందమామ జ్ఞాపకమే కాదు.. ఒక అనుభవం!

March 17th, 2010

చందమామ అనగానే గుర్తుకి వచ్చేవి – వడ్డాది పాపయ్య గారు వేసిన ముఖ చిత్రాలు, సంపాదకీయం కింద కొలను, హంసలు, పైన వెన్నెల విరిసే చందమామ, ఆ చిత్రంలో వస్తూ ఉండే మార్పులూ, శంకర్ గారి పొందికైన బొమ్మలు, చిత్రా గారి చిత్ర విచిత్రాలు, చక్కని తెలుగు, నచ్చే కథలు. చందమామతో ఇంకో తోబుట్టువుతోనో, స్నేహితులతోనో పెనవేసుకుని ఉండేటటువంటి అనుబంధమూను. 

చందమామతో పాటు మరిన్ని పిలల్ల పత్రికలూ ఉన్నా, భాషలో, కథల ఎంపికలో, మరీ ముఖ్యంగా బొమ్మలలో  చందమామకి ఉన్న ప్రత్యేకత చందమామదే. చందమామ అభిమానులు చాలా మందికంటే విరుద్ధంగా తెలియనితనమో, పంచుకునే మనస్తత్వమో, పత్రికలను చదువుకోవడానికి అరువిచ్చి చాలా పోగొట్టుకున్నాము.

తర్వాత బంధువుల ఇంట్లో భోషాణంలాంటి పెద్ద చెక్క పెట్టె నిండా చందమామలుంటే వెళ్ళినప్పుడల్ల గబ గబా తీసుకుని చదివేదాన్ని. మమ్మల్ని కలవడానికి వస్తున్నావా, చందమామల కోసమా అని వారన్నా కూడా పట్టించుకునే దాన్ని కాదు. మరి వారు కూడా ఇంటికి పట్టుకెళ్ళనిచ్చే వారు కాదు కదా. 

మా ఇంటికి చందమామ వచ్చే రోజుల్లో, చందమామ రాగానే పోటీ పడి ఎవరు ముందు చదవగలుగుతామా అని ఆత్ర పడడమూ, అందరు చందమామ అభిమానులలాగానే మాకూ పరిపాటిగా ఉండేది. మా బేరాలు ఇలా ఉండేవి.

బొమ్మలు చూసి ఇస్తాను అనో, ఒక్క పేజీ కథ ఒకటి చదివి ఇచ్చేస్తాననో, లేక పోతే చదివే వారి పక్కనే కూర్చుని వారితో పాటే చదవడమో, రక రకాలుగా ప్రయత్నాలు సాగుతుండేవి మొదటి రుచి అందుకోవాలని. అలా హడావిడిగా మొత్తం పత్రిక తిరగేసినా, అందరి వంతులూ అయిపోయాక తీరిక సమయాలలో ఎవరికి వాళ్ళం తొందర లేకుండా మళ్ళీ మళ్ళీ చదువుకునే వాళ్ళం. ఇక ఆ తర్వాత బొమ్మలు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూసుకునే వాళ్ళం. అలా చూసుకుంటూనే ఉండే వాళ్ళం. ఆ కథల గురించీ, బొమ్మల గురించీ చర్చించుకునే వాళ్ళం.

చందమామ పూర్తి రంగులలో వచ్చినప్పుడు బేతాళ కథల ముందు విక్రమార్కుడి బొమ్మ తిరిగి రంగులలో శంకర్ మళ్ళీ వేశారని మా అన్నయ్య చెప్తే, అప్పుడు మేము find the differences ఆట లాగా తేడాలు వెతికి పట్టుకోవటానికి తెగ ప్రయత్నించాము. అసలు నమ్మలేకపోయాము. ఇక పౌరాణికాలకు వేసే  బొమ్మలన్నీ ఒక ఎత్తైతే, పేజీ నిండా  వేసే బొమ్మ అలా చూస్తున్న కొద్దీ చూడాలనిపించేది. ఆ దృశ్యంలోని వివరాలు వాటంతట అవే ఒక కథ చెప్పేవి, ఆ దృశ్యంలోనే ఒక పాత్రగా ఆదృశ్యంలో పాలు పంచుకుంటున్న అనుభూతిని ఊహించుకుంటూ ఎంతోసేపు గడిపేయగలిగే దాన్ని.

ఇక మాలో చిన్న వాళ్ళకి శంకర్ గారి బొమ్మలు ఎక్కువ ఇష్టంగా అనిపించేవి. తర్వాత తర్వాత చిత్రా గారి బొమ్మలనూ అర్థం చేసుకుని ఇంకా బాగా ఆనందించగలిగాము. వడ్డాది పాపయ్య గారు వేసిన బొమ్మలైతే అసలు ఎంత చూసినా తనివి తీరేది కాదు. ఆయన వేసిన ప్రతి బొమ్మలోనూ తన సంతకమే కాకుండా సంతకంలాంటి చిన్న బొమ్మను ప్రతిసారీ ఎక్కడో ఒక చోట ఉంచుతారని మా అన్నయ్య చెపితే అప్పట్నుంచీ ఆయన బొమ్మలలో ఆ గుర్తు కోసం వెతకటం ఇంకో సరదా అయ్యింది మాకు.

ఇంకా తీరిక దొరికినప్పుడు, మరీ  ముఖ్యంగా సెలవలప్పుడు,  చందమామ బొమ్మలు కాపీ చేసే ప్రయత్నాలు చేసే వాళ్ళము. మా రెండో అన్నయ్య బొమ్మలు బాగా వేస్తాడని మా ఇంట్లో మా అందరి నమ్మకం. తనూ అందుకు తగ్గట్టే అసలు మేము ప్రయత్నించడానికి కూడా సాహసం చెయ్యలేని వడ్డాది పాపయ్య గారి బొమ్మలను చూసి ప్రయత్నించే వాడు. అందులో వినాయకుడి కథలు ధారావాహికంగా వస్తున్నప్పుడు గణపతి బొమ్మలను చూసి తను వేయడం గుర్తుంది.  

చందమామ బొమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొందరు బాలమిత్ర వంటి పత్రికలలో కూడా బాగా వేసే వారు. ఐనా చందమామ బొమ్మలు మనసును పూర్తిగా నింపేసేవి. ఇక బొమ్మల నుంచి కాస్త కథల జ్ఞాపకాల మీదికి దృష్టి మళ్ళిస్తాను. ఒక పేజీ కథల ఆకర్షణ ఏంటంటే , పైన చెప్పినట్టు బేరాలకి పనికి వచ్చేది. చాలా సార్లు అవి యుక్తికి సంబంధించినవో, హాస్యమో అయ్యుండేవి. భేతాళ కథలు లోకం, వ్యవహారం, నీతీ, సమగ్రత గురించిన విలువలకి బీజాలు తెలియకుండానే మనసులో నాటేవి. ఆలోచింప చేసేవి. అవి కాక 25 ఏళ్ళ నాటి చందమామ కథలు, చైనా జానపద కథలు, సీరియళ్ళూ వేటికవే సాటి. ఆ వైవిధ్యాన్ని మించి మరిన్ని కొత్త కథలు.

నేను చందమామలు చదివే రోజుల్లో, చివరికి శంకర్ బొమ్మలతో ఒక ధారావాహికం వచ్చేది. అలాంటి వాటిల్లో ఒక దాంట్లో తేనె పూసిన రొట్టెలు బలే నోరూరించేవి. ఇంకో దాంట్లో మేలి ముసుగు గురించి చెప్పడమూ, బొమ్మల్లో అటువంటి వస్త్రాలలోని పారదర్శకత్వం చిత్రీకరణ గుర్తుండి పోయాయి. ఇంకో ధారావాహికం, ఆర్కైవులలో వెతికి పట్టుకున్నాను. గంధర్వ చక్రవర్తి కూతురు కథ. అందులో హీరో ఆ అమ్మాయి రెక్కలను దాచేస్తాడు. ఆమె అవి తిరిగి సంపాదించడానికి చాలా ప్రయత్నిస్తుంది. మళ్ళీ చదవాలి. ఆ కథ చాలా నచ్చేది నాకు. నాకిప్పటీకీ చందమామ కథలు చిత్రించిన దృశ్యాలలోకి (బొమ్మలే కాదు, కథలూ మాటలతో  చిత్రీకరించేవి), లోకాలలోకి వెళ్ళిన అనుభూతి గుర్తుకు వస్తుంది, కథలకన్నా కూడా ఎక్కువగా.
 
ఇంకా, పౌరాణిక ధారావాహికాల్లో వినాయకుడి కథ ఎక్కువ గుర్తుకు వస్తోంది. ఆ బొమ్మలు మళ్ళీ. ఇక ఏం చెప్పాలి. వినాయకుడి విగ్రహాల పోటీ, అందులో మట్టితో చేసిన చిన్న విగ్రహానికి బహుమతి రావడం, మేము ప్రతి సంవత్సరం మట్టి బొమ్మ తెచ్చుకుని రంగులు వేసి పూజ చేఉకోవడంలో ఉన్న ఆనందాన్ని మరింత పెంచాయి. కృష్ణుడు పాలు పితుకుతూ చంద్రుడి ప్రతిబింబాన్ని పాలలో చూడడం అందరికీ తెలిసిన కథే.

దానికి దారి తీస్తూ సాయంకాల సమయంలో  వాతావరణాన్ని వర్ణించిన తీరు నిజంగా కళ్ళకి కట్టినట్లు ఉండేది. ఇప్పటికీ అప్పుడప్పుడూ అలా ఆ చిత్రం అలా మనసు కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది.
అలా గుర్తుకు వచ్చే ఎన్నో జ్ఞాపకాలను అనుభవించగలను కాని, రాయడానికి పూనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది.
 
ఒక కథ, ‘విచిత్రపురి’ అని ఒక బాటసారికి దారి తప్పినప్పుదు ఒక విచిత్రమైన ఊళ్ళో వింత అనుభవాలు(కాలికి దెబ్బ తగిలితే కాలుని తీసి వైద్యం చేసి మళ్ళీ అతికించడం లాంటివి) కలుగుతాయి.
చివరికి తన ఊరికి వచ్చి ఆ విచిత్రమైన అనుభవాలను చెప్తే ఎవరూ నమ్మరనుకుంటాను. చెప్పాను కదా, కథ కంటే కథ మిగిల్చిన అనుభూతులు ఎక్కువగా మిగిలాయని.

ఇప్పుడు  ఆ కథ గురించి రాస్తుంటే అప్పుడు అది చదువుతున్నప్పుడు  కలిగిన అనుభూతే కలుగుతోంది. మాటలలో పెట్టడం చాత కావట్లేదంతే.
 
చందమామ ఒక జ్ఞాపకమే కాదు ఒక అనుభవం. 

లలిత (తెలుగు4కిడ్స్.కామ్)
http://telugu4kids.com

(చందమామ జ్ఞాపకాలను హృద్యంగా పాఠకులతో పంచుకున్నందుకు లలితగారికి ధన్యవాదాలు. )

ఈ కథనం పూర్తి పాఠాన్ని ఆన్‌లైన్ చందమామలో కూడా చూడగలరు

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2436

మీ చందమామ జ్ఞాపకాలను కూడా కింది లింకుకు పంపగలరు.

abhiprayam@chnadamama.com

RTS Perm Link