బుజ్జి

Just another బ్లాగు weblog

Untouchable – Mulk Raj Anand

Filed under: పుస్తకాలు — bujjikanna at 12:42 pm on Thursday, February 5, 2009

మాకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ నాన్-డిటెయిల్డ్ లో “Promoter Of Quarrels” అనే ఒక్క కథ తప్ప నాకు ముల్క్ రాజ్ ఆనంద్ గురించి పెద్దగా తెలీదు. కేవలం ఆ కథ రాసినాయన అనే నమ్మకంతో ఈ పుస్తకం కొన్నాను. కొనేటప్పుడు ఆలోచించలేదు Untouchables అంటే ఎవరి గురించి ఉంటుందీ అని.చదివి చూస్తే ఇది మరుగుదొడ్లు శుభ్రం చేసే “బాఖా” అనే యువకుని కథ.నవలే అయినా ప్రత్యేకించి కథేమీ లేదు ఇందులో. బాఖా జీవితంలో ఒక రోజు జరిగిన సంఘటనలే ఈ నవల.

స్వాతంత్ర్యం రాక పూర్వం నాటి కథ. “బాఖా” బ్రిటిష్ సైనిక రెజిమెంట్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే యువకుడు, అంటరానివాడు. వృత్తి ఎలాంటిదైనా కొంత సున్నిత మనస్తత్వం, ఉత్సాహం కలిగిన యువకుడు.బ్రిటిష్ దొరలలాగా ప్యాంటులు,షర్టులు,బూట్లు వేస్కోవాలి, ఫ్యాషనబుల్ గా ఉండాలి అని కలలుగనే వ్యక్తి.అలాగని పనిని నిర్లక్ష్యం చేసి తప్పించుకు తిరిగే రకం కూడా కాదు.

అలాంటి బాఖా ఒకరోజు రోడ్డు మీద ఒక పెద్దమనిషిని చూస్కోకుండా తాకి మైల పర్చడం, గుడి మెట్లెక్కి అపవిత్రం చెయ్యటం లాంటి కారణాల వల్ల అందరితో దారుణంగా తిట్లు తిని ఘోరంగా అవమానించబడతాడు. అదే రోజు అతడే ఆశ్చర్య పడే విధంగా ఇంకొందరు పెద్దమనుషుల జాలినీ, కరుణనూ చూరగొన్నా అవి అతనికి ఆ రోజు అయిన గాయాలని మాన్పలేకపోతాయి. ఆ రోజే గాంధీజీ ఆ ఊరికొస్తాడు.గాంధీజీ చేప్పింది పూర్తిగా అర్థం చేస్కోలేకపోయినా గాంధీజీలో తమకు నిజమైన సానుభూతి పరుణ్ణి చూస్తాడు. గాంధీ సభ అయిపోయిన తర్వాత,అంటరానితనం గురించి అక్కడ ఇంకో ఇద్దరు మాట్లాడుకునే మాటలు వింటాడు. Flush System వల్లా, సరైనDrainage Sytem వల్లా అంటరానితనం సమస్య కొంత వరకు పరిష్కరించవచ్చు అని విని ఆశ్చర్యపోతాడు. అలాంటి సిస్టం ఉంటుందా, ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తూ ఇంటికెళ్ళిపోతాడు. ఇది స్థూలంగా కథ.

*******************************************************************************************************

నిజజీవితంలో బాఖా వృత్తి ఎలాంటిదైనప్పటికీ, బాఖా తనకోసం సృష్టించుకున్న మానసిక ప్రపంచం,అతని ఆశలు,కలల గురించి చెప్పిన తీరు ఇవన్నీ చాలా సహజంగా, కన్విన్సింగా ఉంటాయి. అయినప్పటికీ ఈ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం చాలా కష్టం. దానికి మొట్టమొదటి కారణం బాఖా వృత్తే. ముందు చదవగానే “అబ్బా, మరీ వీళ్ళ గురించా!!” అనిపించేసింది.ఇందులో చాలా విషయాలు మనం చదవటానికి ఇష్టపడనివో భరించలేనివో అయి ఉంటాయి.
ఉదాహరణకి బాఖా ఆ రోజు చపాతీ తింటూ ఉంటే మధ్యలో ఒక చపాతీ తడిగా తగుల్తుంది. అప్పుడు గుర్తొస్తుంది, ఆ చపాతీ ఇచ్చిన సైనికుడు అదే చపాతీ మీద చేతులు కడుక్కున్నాడనీ, తర్వాత తను అడగగానే అదే చపాతీని తనకేసి విసిరేసాడని. అది గుర్తుకు రాగానే ఆకలి చచ్చిపోతుంది.ఇంకొకావిడేమో రెండో అంతస్తు నుండి విసిరేస్తుంది చపాతీని, అది వెళ్ళి చెత్తకుప్పలో పడుతుంది. ఇలాంటివి చదివినప్పుడైతే చాలా కోపం వచ్చేసింది-మనుషులకి కొంచమైనా ఇంగిత జ్ఞానం ఉండదా, ఎలాగూ ఇచ్చేదే అయినప్పుడు కొంచెం మంచిదే ఇవ్వొచ్చు కదా. అది కూడా తెలీదా-అనిపించింది. ఇంకో పెద్ద మనిషేమో బాఖా చెల్లెలితో misbehave చేస్తాడు – అబ్బా, వీళ్ళను కూడా వదలరా, ఏం మనుషులు వీళ్ళు- అనిపించేసింది.

“జీవితాంతం ఇలాగ అందరితోని అంటరానివాడిగా తిట్టించుకోవలసిందేనా, ఎప్పటికీ ఇదే పని చెయ్యాల్సిందేనా, మిగిలిన వారిలాగా గౌరవంగా బ్రతికే చాన్సే లేదా” అని బాఖా అలోచించినప్పుడల్లా చాలా బాధనిపించింది.అసలు ఇష్టం లేని, అందరూ అసహ్యించుకునే పనిని బ్రతకటానికి, చచ్చినట్టు చేసే తీరాలా – కేవలం పుట్టుక కారణంగా?

-తప్పదేమో. మొన్నే చదివాను ఏదో బ్లాగ్లో, మన దేశంలో dry latrines ఇంకా చాలా చోట్ల వాడుకలో ఉన్నాయి అని.స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా, కొందరు మనుషులు బ్రతకటానికి ఇలాంటి పనులు చెయ్యకతప్పటం లేదు. మరి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయబ్బా అనుకుంటుంటే ఈనాడులో కొన్ని నెలల క్రితం చదివిన ఒక వార్త గుర్తొచ్చింది.

*******************************************************************************************************

మనదేశంలో డ్రైనేజీ పైపులలో ఏదైనా జాం అయితే ఇప్పటికీ మనుషులతోనే శుభ్రం చేయిస్తారట. ఒకవేళ పెద్ద పెద్ద పైపులలో గనక అలా జాం అయితే, వాళ్ళు నిండా ఆ మురికిలోకి దిగి జాం క్లియర్ చెయ్యాలట. వాళ్ళకి రక్షణగా ఇచ్చే తొడుగుల కోసం ఇచ్చే డబ్బులని అధికారులునొక్కేసి, ఏ రక్షణ లేకుండా వాళ్ళని ఆ మురికిలోకి దింపుతున్నారట. చదువుతుంటే helpless గా అనిపించేసింది, ఇలాంటి విషయాలల్లో కూడా కక్కుర్తేనా అని.

« Previous PageNext Page »