ఒకానొక డిసెంబర్ 6
అప్పుడు మాకు semester exams ముందు preparation holidays.పొద్దున్నే లేచి చదువుకుని, కాసేపు బ్రేక్ తీస్కుందామని తొమ్మిదిన్నర ఆ టైం కి లైబ్రరీ కి వెళ్ళాను.లైబ్రరీ మూసేసి ఉంది. ఎందుకబ్బా అని ఆలోచించుకుంటూ ఇంటికొస్తున్నా..
సడెన్ గా ఎదురు పడ్డారు – ఒక పది పదిహేను మంది ముస్లిం లు, తలకి నల్లటి పట్టీలు అవీ కట్టుకుని. అసలే ఆ ఏరియా అంతా కొంచెం నిర్జనంగా ఉంటుంది. ఆ రోడ్డు మీద అప్పటి వరకు జనాలు కూడా ఎవరూ కనబడలేదు ఆ రోజు.ముందు చూస్తేనేమో వీళ్ళు.అప్పుడు గుర్తొచ్చింది ఆ రొజు ఏంటి అని.వాళ్ళందరూ అక్కడే ఉన్న స్కూల్ మూసేయించటానికి వచ్చారు..
ముందుకెళ్ళాలా వద్దా అని అలోచిస్తూ ఉండగానే, ముందున్న ఒకరిద్దరు పక్కకు జరిగి దారిచ్చారు. నేను కూడా సరిగ్గా ఆలొచించకుండానే ఒకటి రెండడుగులు వేసాను. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది.ఈ లోపు ఇంకొంచెం ముందున్న వాళ్ళు పక్కకి జరిగారు.ఇంకో రెండడుగులు వేసేటప్పటికి అర్థమైంది, నేననుకుంటున్నట్టు అక్కడ పది పదిహేను మంది కాదు ముప్పై నలభై మంది ఉన్నారు అక్కడ అని..(అక్కడ రోడ్డు కొంచెం మలుపు తిరిగి ఉంటుంది, కాబట్టి ముందు చూసినప్పుడు అందరూ కనబడలేదు)
అంత మందిని చుట్టూ చూసేసరికి అనిపించేసింది – ‘ఇంక నా పని అయిపోయినట్టే, ఈ సారి సజీవ దహనంలోనో కత్తిపోట్లలోనో నా పేరు ఉంటుంది,భయంకరమైన చావుంది నాకు..’ అని. వెనక్కి తిరిగి పారిపొవటానికి కూడా వీల్లేకుండా అయిపోయింది అప్పటికి.కాళ్ళు వణికి పోతున్నాయి. ఒక్కో అడుక్కీ ఒక్కో అనుమానం పుట్టుకొస్తుంది.
పదిహేను అడుగులేసేటప్పటికి పదిహేను యుగాలైనట్టనిపించింది.చివరాఖరుకి, రెండొ వైపు మనుషులు అందరు పక్కకు జరిగి రోడ్డు, ఇండ్లు కనిపించాయి.కానీ అక్కడ కూడా జనాలెవ్వరూ లేరు.వాళ్ళని దాటి అక్కడే ఉన్న మా ఫ్రెండ్ ఇంటి దగ్గర దాకా వెళ్ళేదాకా నమ్మకం కలగలేదు – ఏం కాదు – అని..
అన్నింటి కంటే ఆశ్చర్యం కలిగించిందేమిటంటే-కత్తులతో పొడవటం సంగతి పక్కన పెడితే, అంతమందిలో ఎవరూ కామెంట్ చెయ్యలేదు. సైలెంట్ గా దారిచ్చారు అందరూ.మామూలు రోడ్ల మీద కూడా expect చెయ్యని విషయం అది..
ఏ మతమైనా ”మామూలు మనుషులు” అంత చెడ్డవాళ్ళేం కారేమో..