బుజ్జి

Just another బ్లాగు weblog

కేలండర్ కథ

Filed under: పుస్తకాలు — bujjikanna at 2:11 pm on Thursday, November 20, 2008

రచయిత: డా.మహీధర నళినీమోహన్

మహీధర నళినీమోహన్ బాల జ్యోతిలో సైన్సులో సందేహాలకు సమధానాలిచ్చే రచయితగానే తెలుసు నాకు. సౌమ్యగారి బ్లాగులో ఆయన గురించి చదివిన తర్వాత ఆయన పుస్తకాలు ఏవన్నా దొరికితే చదవాలి అనుకున్నాను.ఈ పుస్తకం కొన్న తర్వాత చాలా రోజుల వరకు షెల్ఫ్ లో ఒక మూలకు పడిపోవటం వల్ల చదవలేదు. కానీ ఒక సారి చదవటం మొదలు పెట్టాక ఎక్కడా ఆపాలనిపించలేదు. ఒక్క రోజులో అయిపోయింది. అంత ఇంటరెస్టింగ్ గా ఉంది ఈ పుస్తకం.

-కేలెండర్ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి,అసలు మనుషులకి కేలెండర్ ఎందుకు కావాలి?
-సంవత్సరానికి పన్నెండు నెలలే ఎందుకు ఉన్నాయి? వారానికి ఏడు రోజులెందుకు ఉన్నాయి?
-అసలు రోజు ఎప్పుడు మొదలవుతుంది- లేదా అర్థరాత్రి నుండి తేదీ మారినట్టు మనం ఎందుకు నిర్ణయించుకున్నాం?
-ఈ లీపు సంవత్సరం గొడవేంటి? ఎందుకు లీపు సంవత్సరంలో మామూలు సంవత్సరం కంటే ఒక రోజు ఎక్కువ ఉండాలి?
-కొన్ని నెలల్లో 30, ఇంకొన్ని నెలల్లో 31 రోజులెందుకు ఉన్నాయి?
-ఫిబ్రవరి నెలకి 28 రోజులు మాత్రమే ఎందుకున్నాయి? లీపు సంవత్సరంలో కలిపే ఒక రోజును ఫిబ్రవరి నెలకు మాత్రమే ఎందుకు కలుపుతారు?
-మన (హిందువుల) పండగలన్నీ ఒక్కో సంవత్సరంలో ఒక్కో తేదీ వస్తుంది. కానీ సంక్రాంతి మాత్రం ప్రతీ సంవత్సరం దాదాపు ఒకే తేదీన వస్తూ ఉంటుంది(ఒక రోజు అటూ ఇటూగా), ఎందుకు?
-ఈ శూన్య మాసం/అధిక మాసం కథ ఏంటి? ఎందుకు అధిక మాసం కలపాలి అసలు?
-ధ్రువ నక్షత్రానికున్న ప్రత్యేకత ఏమిటి?దానికి భూమికీ ఉన్న ప్రత్యేక సంబంధం ఏమిటి?
-మన నెలలకి, వారాలకి అసలా పేర్లెందుకు వచ్చాయి?

ఇలాంటి విషయాలే గాక, రకరకాల కాలెండర్లు వాటి వెనక కథలు, కాలెండర్లలో జరిగిన మార్పులు చేర్పులు లాంటి చాలా విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి..

ఈ పుస్తకం నాకు ఎందుకు నచ్చిందంటే:

భాష చాల సుళువుగా ఉంటుంది.పుస్తకంలో ఇచ్చిన బొమ్మలు కాన్సెప్టును అర్థం చేస్కోవటంలో చాలా ఉపయోగపడతాయి. నిజానికి చిన్నప్పటినుండీ వింటున్నా, ఎప్పుడూ సరిగ్గా అర్థం చేస్కోని, సరిగ్గా అర్థం చేస్కోలేదు అని కూడా తెలియని చాలా విషయాలు ఈ పుస్తకం చదివి అర్థం చేస్కున్నాను. పంచాంగమే కాకుండా ఖగోళ శాస్త్రానికి సంబంధించి కొన్ని బేసిక్స్ అర్థం చేస్కోవటానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అనిపించింది. అవసరానికి తగ్గట్టు మధ్య మధ్యలో అప్పటి చరిత్ర,కాలమాన పరిస్థితులూ వివరిస్తూ ఉండటం వల్ల పుస్తకం ఇంకా ఇంటరెస్టింగా అనిపిస్తుంది.మధ్య మధ్యలో చక్కటి కార్టూన్లు-అవి కూడా కాలెండర్ల పరిణామానికి సంబంధించినవే-చాల బాగున్నాయి.అసలు పుస్తకం ముఖ చిత్రమే ఒక మంచి కార్టూను.సూర్యుడూ,చంద్రుడూ రెండు పక్కల నుండీ తిడుతూ ఉంటే ఎవరిని అనుసరించాలో అర్థం కాక తల తిరిగినట్టు కనిపిస్తాడు పంచాంగ కర్త ముఖ చిత్రం మీద.

నాకు ఆశ్చర్యం కలిగించిన విశేషాలు:

నాకు చిన్నప్పటి నుండీ అనుమానమే, ‘ఈ నక్షత్రం ఇదే’ అని ఎలా గుర్తుపడతారు అని. నాకేతే అన్ని నక్షత్రాలూ ఒకేలాగా కనిపిస్తాయి. శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద టెలిస్కోపులు పెట్టుకుని చూసి గుర్తుపడతారేమో అనుకునేదాన్ని.(మా ఆరో క్లాసులో అనుకుంటా, ఒక పాఠంలో ఉండేది ‘నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ మెరుస్తూ కనబడతాయి.గ్రహాలు మాత్రం ప్రకాశవంతంగా వెలుగుతాయి’అని. ఈ సిద్ధాంతం మీద ఆధారపడి నేను ఆ కాలంలో ఒక పదిహేనూ ఇరవై గ్రహాలను కంటి చూపుతో కనిపెట్టేసాను. :) )

అటువంటిది క్రీ.పూ. కొన్ని వేల సంవత్సరాల క్రితమే టెలిస్కోపుల్లాంటి ఆధునిక పరికరాలేమి లేకుండానే వివిధ నక్షత్ర సమూహాలను గుర్తించటం, నక్షత్ర సూర్య సహోదయం ఆధారంగా సంవత్సరం పొడవు కనుక్కోవటాంకి ప్రయత్నించటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి.(క్రీ.పూ.4000 సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్లు సిరియస్ నక్షత్ర సూర్య సహోదయం ఆధారంగా సంవత్సరం వ్యవధి 360 రోజులని కనుక్కున్నారు )

అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది మాత్రం, ఆ కాలంలోనే – వాళ్ళు గమనించిన డేటాని ముందు తరాలకి కూడా ఉపయోగపడుతుందని గ్రహించి, జాగ్రత్తగా నమోదు చేయటం.ఎందుకంటే ఏదొ ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలో గమనిస్తే సరిపోదు కదా. కొన్ని వందల సంవత్సరాల పాటు గమనించాలి – జాగ్రత్తగా అనలైజ్ చెయ్యాలి – వివరాలు నమోదు చెయ్యాలి-తరువాతి తరాలకి అందించాలి.(సూర్యుడు లేదా చంద్రుడిలో ఎవరో ఒకరు ఋతుచక్రానికి కారకులు అయ్యుండొచ్చు అని తెలిసిన తరువాత ఒక సంవత్సరం వ్యవధిని ఖచ్చితంగా నిర్ణయించాలి అంటేనే మనం కనీసం ఒక వంద రెండు వందల సంవత్సరాల డేటాని అనలైజ్ చెయ్యాల్సి ఉంటుంది. అంటే ఒకట్రెండు తరాలలో అయ్యే పని అసలు కాదు.)

సరే ఇంత చదివాం కదా నక్షత్రాలు చంద్రుడూ అని, మన కూడా అప్పుడప్పుడూ ఒక కన్నేసి ఉంచుదాం వాటి మీద అనుకుని తలెత్తి చూస్తే ఈ హైదరాబాదు నగరంలో కనీసం ఒక్క సారి కూడా ఒక్క నక్షత్రం కనబడి చావలేదు. :(

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>